23, నవంబర్ 2021, మంగళవారం

ఓ తుపాను ముచ్చట – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.

ఈ తుపాను అదికాదు. దివి సీమ తుపానుకు చాలా ఏళ్ళ ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు.

ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు తెలవదు.

భయం లేదు! యువతరం గొప్పగా ఆలోచిస్తోంది

 నా తరువాతి తరం వారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.

మొన్న మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారి శత జయంతి జరిగింది. కరోనా లేకపోతె చాలా బాగా చేయాలని కుటుంబం అనుకుంది. కానీ కుదరక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ రోజు ఉదయం మా బావగారి మనుమడు  శంతన్ మా ఇంటికి వచ్చాడు. ఈ వేడుక సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ముందుగానే అందచేశాడు. దానితో పాటు ఓ కాంగ్రెస్ కండువా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి చెప్పాడు, పుస్తకం ఆవిష్కరణ సమయంలో మెడలో వేసుకోమని.  

‘ఇదేమిటి ఇది ఎప్పటి నుంచి’ అని అడిగాను.

‘మా తాతగారి మీది గౌరవం. తరాలు మారితే అభిప్రాయాలు, ఆలోచనలు మారడం సహజం. కానీ ఇది మా  తాతయ్య ఫంక్షన్. జీవితాంతం ఆయన కాంగ్రెస్ వాదిగా జీవించాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాడు. మా తరం వచ్చేసరికి  మా అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. కానీ తాతయ్యను గౌరవించడానికి అవేమీ అడ్డురాలేదు. అడ్డు కాకూడదు కూడా. అందుకే రాత్రి మార్కెట్లు అన్నీ గాలించి ఈ కండువాలు  కొనుక్కుని వచ్చాము. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు. మా తాతయ్య మనుమరాండ్రు,  మనుమలం  అందరం కలిసి తీసుకున్న నిర్ణయం’

“తాతయ్యా! (వాళ్ళు నన్ను తాతయ్యా అనే పిలుస్తారు) నీకూ తెలియంది కాదు. ప్రతి ఏడాది మా తాతయ్య పుట్టిన రోజున మా ఇంటిల్లిపాదీ ఖాదీ బట్టలు కొనుక్కుంటాము. ఎన్నో ఏళ్ళుగా ఇలా చేస్తున్నాము, మా తాతయ్య గుర్తుగా

నాకెంతో సంతోషం అనిపించింది. మన అభిప్రాయాలు ఎలా వున్నా పెద్దల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలనే ఆలోచన ఆ తరం వారిలో వున్నందుకు.

సిద్దాంతాలకు విశాలదృక్పథం తోడయితే ఎన్ని సిద్ధాంత విబేధాలు వున్నా ఈ జాతికి వచ్చిన ముప్పేమీ వుండదు.



(23-11-2021)

పెంచిన ప్రేమ – భండారు శ్రీనివాసరావు

తలుపుకు తాళం వేస్తూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. నిన్న ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చారు. వృద్ధాప్యం కారణంగా మాగన్నుగా పడుకొని వుంది. బయట ఓ అరగంట పని. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళాల్సిన పని. ఇంట్లో అలా ఒంటరిగా  వదిలేసి వెడితే....ఎలా ..ఎలా...

అర్జంటు పని ఆలోచనలను కప్పేసింది.

‘ఓ అరగంటలో ఏమౌతుంది?  ‘ఏమీ కాదు’

ప్రశ్న సమాధానం  రెండూ మనసే చెప్పింది.

వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అరగంట లోపలే ఇంటికి తిరిగొచ్చారు. తలుపు తెరవగానే హాలంతా రక్తపు వాంతుల మరకలు. గబగబా వెళ్లి చూస్తే చలనం లేకుండా కింద పడి వుంది. ఈ కాసేపటిలో ఏమౌతుంది  అని వెడితే జరగకూడనిది ఆ కాసేపటిలోనే జరిగిపోయింది. వెంటనే రక్తపు వమనపు జాడలు శుభ్రం చేసి తెలివిలేకుండా పడి వున్న తమ  పెంపుడు కుక్కను భుజానికి ఎత్తుకుని పశువుల ఆసుపత్రికి బయలుదేరాడు.

నెలల పిల్లగా వున్నప్పుడు ఇంటికి తెచ్చుకున్న ఆ జీవిని దాదాపు పద్నాలుగు ఏళ్ళుగా ఎత్తుకెత్తుగా అపురూపంగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇన్నేళ్ళుగా తమను అంటిపెట్టుకుని ఇంటికి, తమకు కాపలాగా ఉంటూ వస్తోంది. వయసు ఉడిగింది కదా వదిలించుకుందామనే ఆలోచనే మనసులోనికి రానీయలేదు.

పెంచిన ప్రేమ అలాంటిది. 

(23-11-2021)


గుడిలాంటి ఆ బడిలో నేనూ చదువుకున్నా- భండారు శ్రీనివాసరావు

 బహుశా ఇది జరిగి డెబ్భయ్ ఏళ్ళు పై మాటే! బెజవాడలో ఇద్దరు లాయర్లు కార్తీకమాసంలో కృష్ణానదిలో స్నానం చేసి వస్తున్నారు. వారిలో ఒకరికి ఇసకలో కూరుకుపోయి వున్న ఒక చిన్న విగ్రహం కనిపించింది. తీసి చూస్తే కాలి మీద కాలు వేసుకున్న ఒక వ్యక్తి ప్రతిమ అది. ఆ రోజు గురువారం. ఆ ప్లీడరు గారు దాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతి గురువారం దానికి పూజ చేయడం ప్రారంభించారు. విగ్రహం దొరికిన తరవాత చాలా ఏళ్లకు హైదరాబాదు నుంచి వచ్చిన ఒక చుట్టం ఆ విగ్రహాన్ని చూసి, ‘ఇదేమిటి! షిరిడీ బాబా విగ్రహం మీ ఇంట్లో ఎలావుంది?’ అని అడిగే దాకా ఆ విగ్రహం సాయిబాబాదని ఆయనకూ తెలియదు. అప్పుడు మొదలయిన ఆ పూజా పునస్కారాలు నేటికీ కొనసాగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళుగా బాబాను క్రమం తప్పకుండా పూజిస్తూవచ్చిన ఆ లాయరు గారు ఎన్నడూ షిరిడీ వెళ్ళిన దాఖలాల్లేవు.

ఆయన గారి పేరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు. కాశీలో ప్లీడరీ చదివిన హనుమంతరావు గారు స్వార్ధాన్ని గయలోనే వొదిలేసి, బెజవాడలో ప్రాక్టీసు మొదలు పెట్టారు. ఆయన గారి ప్లీడరు ప్రాక్టీసుకు తోటి లాయర్లు అందరూ కలసి షష్టి పూర్తి చేసి కూడా దశాబ్దం దాటిపోయింది. కష్టపడి పై చదువులు చదువుకున్న ఆయనకు చదువన్నా, చదువుకునే వాళ్ళన్నా ఎంతో అభిమానం. తన రాబడిలో ఎక్కువ భాగం, చదువుకునేవారు పై చదువులు చదివించడానికే వెచ్చించారు. విద్యా సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో చుట్టపక్కాల పిల్ల లందరికీ ఆయన గారి ఇల్లే ఓ ఉచిత హాస్టల్. ఎంత మందికో ఆయన విద్యాబుద్దులు నేర్పించి తమ కాళ్ళపై తాము నిలబడేట్టు చేసారు. చదువూ సంధ్యలకు దూరంగా పల్లెటూళ్ళలో రాళ్ళ మాదిరిగా రోజులు వెళ్ళమారుస్తున్న అనేకమంది ఆయన ఇంట్లో వుండి చదువుకుని రతనాలుగా మారారు. తమ తలరాతలు మార్చుకున్నారు. అంతగా కాకపోయినా, జీవితంలో ఓ మోస్తరు స్తాయికి చేరుకున్న నేను కూడా ‘అలాటి వాళ్ళల్లో నేనూ ఒకడిని’ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను.
వార్ధక్యం మీద పడ్డా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు బంధు మిత్రులందరికీ శిరోధార్యం. వీధిబడితోనే చదువు చాలించిన ఆయన సతీమణి సరస్వతమ్మ గారు, ఆ ఇంటికి ‘అన్నపూర్ణ’ గా మారి, ఆనాటినుంచి ఇంటిల్లిపాదికీ అమృతం పంచిపెట్టడమే ఒక బాధ్యతగా నెత్తికెత్తుకున్నారు. ఆ ఇంటి కోడళ్ళు, ఆడపడుచులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
అక్షర బిక్ష పెట్టిన ఆ పెద్దమనిషికి బావమరదిని కావడం, అన్నం పెట్టి పెంచిన ఆ అమ్మకు ముద్దుల తమ్ముడిని కావడం నా పూర్వజన్మ సుకృతం.
2011 నవంబరులో ఆ పుణ్యమూర్తి తన తొంభయ్ మూడో ఏట పుణ్యలోకాలకు తరలివెళ్ళారు.
ఆ అమృత మూర్తుల సంస్మరణ సభ మా బావగారి శతజయంతిని పురస్కరించుకుని 2018లో విజయవాడ ఫార్ట్యూన్ మురళి పార్క్ హోటల్లో ఘనంగా జరిగింది. కుమారులు లాయర్లు అయిన తుర్లపాటి సాంబశివరావు, భైర్రాజు, బైరాజు కుమారుడు మరో కుర్ర లాయరు అయిన విహారి ఈ కార్యక్రమాన్ని అంత్యంత శ్రద్ధతో, కమనీయంగా, కన్నుల విందుగా నిర్వహించారు. మా బావగారితో పరిచయం కలిగిన సీనియర్ లాయర్లు, ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్న ప్లీడర్లు అనేకమంది హాజరయ్యారు. ఇక ఆయన బంధువుల సంగతి చెప్పక్కర లేదు. దేశవిదేశాల నుంచి కూడా తరలి వచ్చారు. ఆ మహానుభావుడి పట్ల పెంచుకున్న అసాధారణమైన భక్తితాత్పర్యాలు అలా అందరినీ అక్కడికి లాక్కెల్లాయి.
ఆ సభలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఏదో మొక్కుబడిగా కాకుండా మనసు పొరల్లోనుంచి మాట్లాడిన విధానం గమనించినప్పుడు ఆయన వొదిలి వెళ్ళిన ముద్ర ఎంతటి బలమయినదో అర్ధం అయింది. ఇంట్లో ఉన్న పాత సైకిల్ అమ్మకుని వచ్చియన్ పదిహేను రూపాయలతో రైలెక్కి కాశీ వెళ్లి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బారిస్టర్ పట్టా స్వర్ణ పతకంతో సాధించి, వృద్దుడయిన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి బొంబాయిలో వచ్చియన్ రిజర్వ్ బ్యాంక్ ఉన్నతోద్యోగాన్ని వదులుకుని బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టి , రెండుగదుల అద్దె ఇంట్లోనే ఏళ్ళతరబడి ఉంటూ చదువుమీద వున్న ఆపేక్షతో చదువుకోలేని పేదపిల్లలకు చదువు చెప్పిస్తూ, చుట్ట పక్కాల పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని చదివిస్తూ, చదువుకోవడానికి తనమాదిరిగా ఎవరూ కష్టపడకూడదు అనే సదాశయంతో రాబడినంతా ఖర్చుచేస్తూ, ఒక పక్క విద్యాదానం, మరో పక్క అన్నదానం చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్న డబ్బు యావత్తూ స్వార్ధం చూసుకోకుండా ఖర్చు చేసిన మా బావగారి గుణగణాలను సోదాహరణంగా నిండు హృదయంతో గుర్తు చేసిన ఆ ప్రసంగాలు నిజంగా ఆ మహానుభావుడికి నిజమైన శ్రద్ధాంజలి.
ఆయన ధన్య జీవి. సందేహం లేదు. ధన్యజీవితం గడిపి తన తొంభయ్ మూడో ఏట దాటిపోయాడు. అయితే ఆయన ఆశీస్సులు పొందిన మేమందరం కూడా ధన్యులమే.



22, నవంబర్ 2021, సోమవారం

మారింది దృశ్యమే, విషయం కాదు

 మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఓ సీను గుర్తుకు వస్తోంది.

వైకుంఠంలో శేషతల్పంపై  విశ్రాంతి తీసుకుంటున్నవిష్ణు మూర్తి రూపంలోని రాజేంద్రప్రసాద్ కు   లక్ష్మీదేవి పాత్రలోని నటి  ఆమని  కాళ్ళు పడుతున్నప్పుడు నారదుడు వస్తాడు. మా ఆడవారి పని ఎప్పుడూ ఇలా మొగుళ్లకు సేవ చేయడమేనా అనే ఆమని అంతరంగాన్ని అర్ధం చేసుకుని, రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రల్ని తారుమారు చేస్తాడు.  తాను విశ్రమిస్తుంటే  ఎంచక్కా మొగుడు కాళ్ళు పడుతున్న దృశ్యం ఊహించుకుని మురిసిపోతున్న లక్ష్మీదేవి, అసలు మారిన సీను చూసి నిర్ఘాంత పోతుంది. మళ్ళీ మునుపటి సీనే రిపీట్. విష్ణుమూర్తి అలానే పడుకునే ఉంటాడు. లక్ష్మీదేవి కాళ్ళు పడుతూనే వుంటుంది.

బాపూ రమణలు హాస్యస్పోరకంగా  సృష్టించిన విష్ణు మాయ ఇది.

సీను మారినట్టు అనిపిస్తుంది కానీ విషయం మారదు.  

22=11=2021

మృత్యువుతో సహజీవనం

 

మృత్యువుతో సహజీవనం చేస్తున్న విషయం మనిషికి మరణించే వరకు తెలియదు”

జీవితంలో కధలు ఇలాంటి నిజాలే చెబుతాయి.

మాకు తెలిసిన ఒకావిడ అమెరికాలో ఉన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళారు. ఆ దేశానికి పలు పర్యాయాలు ఒంటరిగా వెళ్లి వచ్చిన అనుభవం కూడా వుంది. ఈసారి తిరిగి వస్తూ దుబాయ్ లో దిగి షాపింగ్ చేశారు. అక్కడినుంచే హైదరాబాదులో వున్న తన కుమార్తెకు ఫోను చేసి ఏమి కావాలో కనుక్కుని మరీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. దుబాయ్ లో విమానం ఎక్కిన తర్వాత కూడా మరోసారి ఫోన్ చేసి హైదరాబాదు ఎప్పుడు చేరేది వివరాలు చెప్పారు.

హైదరాబాదులో ఉంటున్న ఆవిడ కుమార్తె తన భర్తతో కలిసి శంషాబాదు వెళ్ళారు, తల్లిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకు రావడానికి.

అనుకున్న సమయానికే విమానం లాండ్ అయింది. ప్రయాణీకులందరూ ఒక్కొక్కరుగా ట్రాలీలు తోసుకుంటూ బయటకు వస్తున్నారు. ఆఖరి ప్రయాణీకుడు కూడా వచ్చారు కానీ తల్లి జాడ లేదు. వేచివున్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన  పెరుగుతోంది. ఇంతలో అనౌన్స్ మెంటు.

పలానా ప్రయాణీకురాలి తరపువాళ్ళు ఎవరైనా వచ్చివుంటే దయచేసి వచ్చి ఆవిడ బాడీ కలక్టు చేసుకోండి’

వినగానే వాళ్ళ గుండె జారిపోయింది. ఏదో లగేజీ లాగా బాడీ తీసుకుపోవడం ఏమిటి. ఆ మనిషి  ఫోన్లో మాట్లాడి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇలా ఎలా జరిగింది?

అసలు జరిగిందేమిటంటే....

దుబాయ్ లో విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత ఆవిడ వాష్ రూమ్ కు వెళ్ళింది. యెంత సేపైనా బయటకి రాకపోవడంతో తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి చెప్పారు. వారు గట్టి ప్రయత్నం చేసి తలుపు తెరిచి చూస్తే అక్కడ నిర్జీవంగా పడి వుంది. మాసివ్ హార్ట్ అటాక్ మరణానికి కారణం అని నిర్ధారించారు.

అందుకే అంటారు మృత్యువుకు బహు రూపాలు. ఎవరిని ఏ రూపంలో, ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు.

ఈ సంఘటన జరిగి నేటికి మూడేళ్లు. ఎన్నేళ్ళు గడిచినా గుర్తుండిపోయే విషాదం.

22-11-2021

'పుస్తకవర’ ప్రసాదరెడ్డి గారు - భండారు శ్రీనివాసరావు

 ‘మీరు పుస్తకాలు గురించీ రచయితలు గురించీ పోస్టులు పెడుతుంటారు. వాటిని పబ్లిష్ చేసే ప్రచురణ కర్తలు గురించి వివరాలు ఎందుకు ఇవ్వరు” అంటారు నా మితృలు.

ప్రతి పబ్లిషింగ్ హౌస్ కి ఓ ఎడిటోరియల్ బోర్డు వుంటుంది. వాళ్ళు తమ వద్దకు వచ్చిన పుస్తకాల మంచి చెడులు చూసి ఎంపిక చేసుకుంటారు. తప్పులేదు. కానీ అప్పుడప్పుడు ఈ సాంఘిక మాధ్యమాల్లో రచయిత్రులు, రచయితలు చక్కటి తమ రచనలతో అలరిస్తుంటారు. వాటికి నేను అభిమానిని కూడా. కానీ ఆస్వాదించడం తప్ప నా చేతిలో ఏమీ లేదు. ఆ సంపాదక వర్గ సభ్యులు కాస్త ఇటు కన్నేస్తే ఆ పబ్లిషర్స్ గర్వించదగిన రచయితలు, రచయిత్రులు ఇక్కడ కూడా వారికి కానవస్తారు. కానీ అంత తీరిక ఉండకపోవచ్చు. తీరిక చేసుకుని ఈ రచనలను కూడా పరిశీలిస్తే చక్కటి రచయిత్రులను, రచయితలను పరిచయం చేసిన ఖ్యాతి వారికి దక్కుతుంది.
ఈ నేపధ్యం అంతా ఎందుకంటే.
ఈ మధ్య నా చేతికి ఓ పుస్తకం వచ్చింది. పుస్తక ప్రియులు రేడియోలో నా సీనియర్ సహచరులు అయిన ఆర్వీవీ కృష్ణారావు గారు ఈ పుస్తకాన్ని స్వయంగా మా ఇంటికి తీసుకువచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళారు.
దాని పేరు ‘అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!’
శాంతా – వసంతా ట్రస్ట్ వారు దీనిని ప్రచురించారు. మరి మొదటి సారి ప్రచురణ కర్తల ప్రస్తావన ఎందుకు అనే సందేహం రావచ్చు. అందుకే ఈ పోస్టు.

పుస్తకాన్ని తిరగేశాను. మొదటి పుటలోనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి జేజేలు’ అని వుంది. దాన్ని రాసింది శాంతా – వసంతా ట్రస్ట్ వరప్రసాద రెడ్డి గారు. అందులో ఓ పేరా వుంది. అదే దీనికి ప్రేరణ.

“’అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!’ సంకలనం రాజాచంద్ర ఫౌండేషన్ ద్వారా రూపుదిద్దుకుని చాలామందిని విశేషంగా అలరించింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకానొక ప్రవచనంలో ప్రత్యేకంగా ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ అందరు చదవతగ్గ పుస్తకమని చెప్పడంతో, ఆ ప్రవచనం విన్న ఎంతోమందికి ఈ పుస్తకం చదవాలనే ఆకాంక్ష కలిగింది. మహానుభావుల వాక్ శుద్ధికి అంత ప్రభావం వుంటుంది. వారి ప్రవచనం విన్న ఎంతోమంది ఈ పుస్తకం కోసం అభ్యర్ధించారు. ఆ మేరకు ఈ సంకలనానికి మరి కొందరి ప్రముఖుల ‘జేజేలు’ జోడించి మీకు సమర్పిస్తున్నాము.”

స్వచ్చందంగా ఇంతటి సత్కార్యానికి పూనుకున్న శాంతా – వసంతా ట్రస్ట్ వారిని పేర్కొనకుండా ఎలా ఉంటాము. అలాగే ‘పుస్తక’ వరప్రసాద రెడ్డి గారి మంచి మనసుకు సలాం చెప్పకుండా ఎలా ఉంటాము?

నాలుగు వందల పుటలకు పైగా వున్న ఈ పుస్తకంలో ముళ్ళపూడి వెంకట రమణ నుంచి విశ్వనాధ సత్యనారాయణ వరకు, నారా చంద్రబాబు నాయుడు నుంచి రజనీ సుబ్రహ్మణ్యం (త్రిపురనేని గోపీచంద్ గారి అమ్మాయి)వరకు, పుట్టపర్తి నాగ పద్మిని (పుట్టపర్తి నారాయణాచార్యులు వారి పుత్రిక) నుంచి ఆర్, శాంత సుందరి ( కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి) వరకు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ నుంచి గద్దర్ వరకు, ఇలా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, హెచ్.జే. దొర, భానుమతి రామకృష్ణ, చిరంజీవి, బాపు, బి. నరసింగ రావు, రావు బాల సరస్వతి, ఎస్వీ రామారావు, వరప్రసాద రెడ్డి, నండూరి రామమోహన రావు, కాళీపట్నం రామారావు, తిరుమల రామచంద్ర, నోరి నరసింహ శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, ఆరుద్ర, ఎన్. సదాసివ, జి. కృష్ణ, శ్రీ రమణ, దేవరకొండ బాలగంగాధర తిలక్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, పురాణం గారి గురించి వారి అబ్బాయి శ్రీనివాస శాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాడభూషి శ్రీధర్, ఎందరో మహానుభావులు (అక్షరాలా డెబ్బయి రెండు మంది) తమ అమ్మల గురించి, తమ తండ్రుల గురించి, తమ గురువుల గురించి సభక్తి పూర్వకంగా రాసిన అనుభవాల జ్ఞాపకాలు వున్నాయి.
వీటికి వెల కట్టగలమా!
కట్టలేమని తెలుసు కనుకే వరప్రసాదరెడ్డి గారు ఈ సంకలనం అమూల్యం అని చెప్పేశారు.
ట్రస్టులు చేయాల్సిన మంచి పని చేసిన శాంతా- వసంతా ట్రస్ట్ వారికి అభినందనలు.
-భండారు శ్రీనివాసరావు