26, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ – భండారు శ్రీనివాసరావు

 

రతన్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలుసు. అదే రేడియో చిన్నక్క అంటే ఒకతరం తెలుగువారిలో తెలియనివారంటూ వుండరేమో!
మొన్న ఫోన్ చేశారు. ఏదో పనిలో వుండి నేను రెస్పాండ్ కాలేదు. రాత్రి నేనే ఫోన్ చేశాను. ఇప్పుడు ఆవిడ హైదరాబాదులో లేరు. ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. ఎనభయ్ ఎనిమిది సంవత్సరాల ముది వయసులో కూడా ఆమె కంఠస్వరం , ఓ నలభయ్ అయిదేళ్ళ క్ర్తితం నేను రేడియోలో చేరినప్పుడు ఎలా వుందో అలానే వుంది. అమృతం తాగిన ఆ స్వరంలో అతులిత మాధుర్యం అలాగే వుంది ఇప్పటికీ. కట్టుకున్న భర్త, కన్న కొడుకు కళ్ళ ముందే దాటిపోయారు అనే దుఖం ఆవిడ గొంతులో ఇంకా సజీవంగా వుంది. ‘అయితే నా మనుమలు ఇద్దరూ ఈ వయసులో తనని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారన్న తృప్తితో కొంత ఊరటగా వున్నాను నాన్నా!’ అన్నారావిడ విచారం,ఆనందం సమ్మిళితమైన గొంతుకతో.
ఫ్యాను, ఏసీ వేసుకోవాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా, లైట్లు ఆఫ్ చేయాలన్నా దేనికీ కాలు కదపకుండా తన పడక పక్కనే అన్ని పరికరాలు తనకు అందుబాటులో ఉంచారని, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ రోజులు దొర్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అదృష్టం! ఆవిడ ధారణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. పాత విషయాలు అనేకం చెప్పుకొచ్చారు. (వీటిల్లో చాలా వరకు గతంలో వార్త దినపత్రిక కోసం కె.ఎం.జి. కృష్ణకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ ప్రసాద్ చెప్పారు. Courtesy: రేడియో అభిమాని శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్)
రేడియోలో సంగీతం ఆడిషన్ కోసం వెడితే తన స్వరానికి, ఉచ్ఛారణకు ముచ్చట పడి అనౌన్సర్ గా సెలక్ట్ చేశారట. రేడియో అనౌన్సర్ గా చేనుగట్టు కధాపఠంనంతో 1955లో మొదలైన తన రేడియో ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగి 1992లో సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్ గా ముగిసిందని చెప్పారు. కార్మికుల కార్యక్రమంలో చిన్నక్కగా తాను పోషించిన పాత్ర తనను శ్రోతలకు మరింత దగ్గర చేసిందని, అంతకుముందు (ఆవిడ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు) తెలంగాణా యాసలోనే చంద్రి అనే పాత్రలో గ్రామసీమలు కార్యక్రమం నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. చిన్నక్క పాత్రకు ముందు రతన్ ప్రసాద్ రమణక్క పేరుతొ ఆ కార్యక్రమాన్ని మరో అనౌన్సర్, వి. సత్యనారాయణతో (పాత్ర పేరు జగన్నాధం) కలిసి నిర్వహించారు. అనుకోకుండా ఒకరోజు ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పుడు జగన్నాధం పాత్రధారి, ‘రమణక్కా! నీకు నోరు ఎక్కువ’ అంటాడు. ఇది ఆంధ్రప్రాంతం శ్రోతలకు మనస్తాపం కలిగించింది. పెద్ద సంఖ్యలో నిరసన లేఖలు వెల్లువెత్తడంతో అధికారులు కొంత కాలం ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
తరువాత అదే కార్యక్రమాన్ని పాత్రల పేర్లు మార్చి చిన్నక్క(రతన్ ప్రసాద్), ఏకాంబరం (వి.సత్యనారాయణ) పేర్లతో, మూడో పాత్రను మొదట్లో పెదబాబు (ఉషశ్రీ), తరువాత యాదగిరి ( టీ.వీ.ఆర్కే సుబ్బారావు, ఆ పిమ్మట చాలా కాలం రాంబాబు (డి.వెంకట్రామయ్య) లతో జోడించి ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
చాలా ఏళ్ళ కిందట ఓసారి గండిపేటకు గండి పడింది అనే వదంతులతో హైదరాబాదు అట్టుడికి పోయింది. ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని భయాందోళనలకు గురైన సమయంలో ‘వదంతులు నమ్మకండి, మీ ఇళ్లకు వెళ్ళిపొండి’ అంటూ తాను పదేపదే రేడియో ద్వారా విజ్ఞప్తులు చేశానని, మరునాడు పోలీసు కమిషనర్ స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తనని అభినందించడం ఇప్పటికీ మరిచిపోలేదని రతన్ ప్రసాద్ చెప్పారు.
ఆవిడ అసలు పేరు రత్నావళి. భర్త ప్రసాద్ పేరులో ప్రసాద్ అనే పదాన్ని, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్ గా రేడియో పేరు పెట్టుకున్నారట. (రత్న రతన్ గా మారడానికి కారణం ఉత్తర హిందూస్థానంలోని పై అధికారులు అనేది ఆవిడ నమ్మకం)
సుబ్బులక్ష్మిగారి సంగతితో కదా మొదలు పెట్టింది. కింది ఫోటో చూశారా! ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి కచ్చేరీ. పక్కన నిలబడి రేడియోకి అనౌన్స్ మెంట్స్ చేస్తున్నది అప్పటికి పాతికేళ్ళు కూడా నిండని రేడియో చిన్నక్క అనబడే రతన్ ప్రసాద్.
ఈ కధ ఆవిడ మాటల్లోనే.
“అప్పుడు రేడియో సంగీత సమ్మేళనాలు జరుగుతున్నాయి. జూబిలీ హాల్ వేదిక. అక్కడ ఆహూతుల నడుమ జరిగే ఎం ఎస్ సుబ్బులక్ష్మి సంగీత కచ్చేరీని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కార్యక్రమానికి ముందు నేను ఎమ్మెస్ గారెని కలిసి ఆమెగారు పాడబోయే కీర్తనల వివరాలు తీసుకుంటున్నాను. ఏ వరసలో పాడుతారో తెలిస్తే ఒక కీర్తన పూర్తికాగానే మరో కీర్తన పలానాది వినబోతున్నారు అని నేను అనౌన్స్ చేయాలి.
‘ఒక కీర్తన పూర్తికాగానే పక్కకి తిరిగి నావైపు చూస్తే చాలు ఆ సంకేతాన్ని అందుకుని నేను అనౌన్స్ మెంట్ చేస్తాను’ అని ఆవిడగారితో చెప్పాను. అప్పుడు ఎమ్మెస్ తన అరచేతిని చాపి ఇలా అన్నారు, ‘నేను ఉంగరపు వేలు చూపెడితే మరొక కీర్తన వుందని అర్ధం. చిటికిన వేలు ముడిచి చూపిస్తే అదే ఆఖరి కీర్తన అనుకోండి’.
కచ్చేరీ పూర్తయిన తరువాత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నాతొ చెప్పారు మెచ్చుకోలుగా.
‘బాగా అనౌన్స్ చేశావు, మంచి సంగీత పరిజ్ఞానం వున్నదానివే’
ఆవిడ ఇచ్చిన ఈ చిన్ని కితాబు నాకు పెద్ద ఆస్కారుతో సమానం’
ఇలా రతన్ ప్రసాద్ ఫోనులో చెబుతూనే వున్నారు. నాకూ వినాలనే వుంది కానీ అవన్నీముక్కున పెట్టుకుని రాయాలి కదా!
అంచేత మళ్ళీ మరో రోజు నేనే ఫోన్ చేస్తాను అని సంభాషణ ముగించ బోయాను. ఇదంతా నేను బుద్ధిగా విన్నది రాయడానికి అని ఎలా గ్రహించారో ఏమో!
చటుక్కున ఇలా అన్నారు.
‘నాన్నా! నాదో కోరిక. నువ్వు రాసేవన్నీ మా మనుమలు చదువుతుంటారు. నా గురించి కూడా ఏమైనా రాయవూ?
కళ్ళు చెమర్చాయి. నోరు పూడుకుపోయింది.
ఫోన్ పెట్టేసాను, కంప్యూటర్ ముందు కూర్చోడానికి.


(26-10-2019)

25, అక్టోబర్ 2021, సోమవారం

ఆగండి వినండి గమనించండి వెళ్ళండి

 ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. రెండు దశాబ్దాల నాటి సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే  కేసీఆర్ తత్వం, ఏ దశలోనూ తెలంగాణా ఉద్యమ స్పూర్తిని  దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు, సీమాంధ్రుల మనోభావాలను కొంత మేరకు దెబ్బతీసేవిలా ఉన్నప్పటికీ, తెలంగాణావాదుల ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా ఎప్పటికప్పుడు  చేయగలిగాయి. వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో  గాలి ఒత్తిడి తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు. ఈ పరిణామ క్రమంలో కేసీఆర్ ఎదుర్కున్న ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ  సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా పుష్కర  కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా  నిభాయించుకోవడం మరో ఎత్తు. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే ఇతర పార్టీల్లోనే కాదు స్వపక్షంలోని  రాజకీయ శక్తులను కూడా  ఆదిలోనే కట్టడి చేసి, తనదారి లోకి తెచ్చుకున్న విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి  తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

అందలం ఎక్కినంత మాత్రాన పండగ కాదు. తెలంగాణాలో రాజకీయం చాలా విభిన్నమైనది. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తూ వుంటుంది.  లక్ష్యసాధనలో ఏకోన్ముఖంగా సాగిన తెలంగాణా సమాజం అదేమాదిరి కొత్త ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ తలూపకపోవచ్చు. తెలంగాణా స్వప్నం నెరవేరింది కనుక, ఇప్పుడు ప్రజల దృష్టిలో  ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి పాలక పక్షం అయిన  టీఆర్ఎస్ కూడా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటి మాత్రమే.

ఒక విషయం పార్టీ అధినేత గుర్తుంచుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన విధంగానే అన్ని వైపులనుంచి ప్రత్యర్ధులు బాణాలు గురిపెడతారు. పద్మవ్యూహాల రచన బృహత్తరంగా సాగుతుంది. వాళ్ళు ఎక్కుబెట్టే అస్త్రాల పదును పెరగడానికి  పాలకపక్షం స్వయంకృతాపరాధాలు కూడా తోడ్పడడానికి అవకాశం వుంది.

అన్నిటికన్నా ముఖ్యం, అలనాడు ప్రజల్లో అపరిమితంగా భావోద్వేగాన్ని రగిల్చిన  తెలంగాణా అనే బ్రహ్మాస్త్రం  ఇప్పుడు టీఆర్ఎస్ అంబుల పొదిలో లేదు. అదిప్పుడు స్వతంత్ర భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం రూపంలో ఆవిర్భవించి ఏడేళ్లు దాటిపోయాయి.

టీఆర్ ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఏళ్ళు. వ్యక్తుల జీవితాల్లో అయినా, వ్యవస్థల జీవితాల్లో అయినా ఈ వయసు చాలా ప్రమాదకరమైనది. దారి తప్పడానికి, గాడి తప్పడానికి ఈ ప్రాయమే కారణం. ఒకింత జాగ్రత్త పడగలిగితే అవసరమైన పరిణతి  లభిస్తుంది. ఆగి, నిలిచి, వెనక్కి తిరిగి చూసి తిరిగి  ముందడుగు వేయాల్సిన సమయం.

అధికారంలో ఉన్నవాళ్ళకి ఎన్నో చేశామనే అభిప్రాయం వుంటుంది. అన్నీ చేయలేదేమో అని కొందరికి అనిపిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాధాన్యతల ఎంపికలో వచ్చే తేడా ఇది.

టీఆర్ఎస్ ప్లీనరీలో ఇటువంటి ‘కీలక’ అంశాలపై దృష్టి పెట్టాలనేది హిత వాక్యం.



(25-10-2021)

ఈనాటి మీడియా - భండారు శ్రీనివాసరావు


రాముడు వనవాసం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కొంతసేపు గడిచిన తర్వాత తన ధనుర్బాణాల కింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపిస్తుంది.
రాముడి మనసు చివుక్కుమంటుంది.
‘రక్తం స్రవిస్తూ కూడా ఇంతటి బాధను ఎలా ఓర్చుకున్నావు మండూకమా! వెంటనే నాకు చెప్పక పోయావా’ అంటాడు ఓదార్పుగా.
కప్ప ఇలా జవాబిస్తుంది.
“ఓ శ్రీరామచంద్రా! సమస్త ప్రాణులను కాపాడే దేవదేవుడివి నువ్వు. నువ్వే నా బాధకు కారణం అయినప్పుడు నేనెవ్వరికి చెప్పుకుంటాను చెప్పు?’
అలాగే వుంది ఈనాటి మీడియా వ్యవహారశైలి

24, అక్టోబర్ 2021, ఆదివారం

ప్రజలు గమనిస్తున్నారు - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha Daily today, SUNDAY)
“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదం ఒక్కటి పొరబాటున దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం ఇలా అస్తమానం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబుగా అన్నట్టు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔనని తలూపుతున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.
మంచీచెడులను అభివ్యక్తీకరించే సమయంలో మహా కవులు కొన్ని ఔచిత్యాలను పాటించేవారు. అంటే ఎక్కడ ఆకట్టునేలా ఎక్కడ ఎలా చెప్పాలో, ఎక్కడ కర్రుకాల్చి వాత పెట్టాలో వారికి వెన్నతో పెట్టిన విద్య.
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకి ఇవ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.
కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే పనికట్టుకుని అదేపనిగా పునః ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
టీవీ ఛానల్ చర్చలకు వచ్చే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిర్మొహమాటంగా ఒకసారి నాతోనే చెప్పారు, ‘జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది ఎంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అర్ధం కానట్టు వుండిపోతున్నారని అనుకోవాలి. ఇదో విషాదం.
‘నైతిక హక్కు, చిత్తశుద్ధి, ప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతుగా నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, అసలు ఏ పార్టీకి చెందనివాళ్ళు, రాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.
తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు తమకు తామే అడ్డుకట్ట వేసుకోవాలి. సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి.
మంచీ చెడు అనికదా మొదలు పెట్టాం, అవేమిటో చెప్పుకుని ముగిద్దాం.
ఈ ప్రపంచం పుట్టినప్పుడే మంచీ చెడు అనేవి కూడా పుట్టాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం భారతంలో వుంది.
కృష్ణుడు, భీష్ముడు కలిసి ఇది తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు.
ముందు దుర్యోధనుడిని పిలిచి సూర్యాస్తమయం వరకు నగరంలో తిరిగి రమ్మన్నారు. ఎక్కడయినా ఒక మంచి మనిషి తటస్థ పడితే వెంటనే రాజసభకు వచ్చి ఆ విషయం తెలియచేయమన్నారు.
తరువాత ధర్మరాజును విడిగా పిలిచి నగర పర్యటన చేసి ఎక్కడయినా ఒక చెడ్డ మనిషి కనిపిస్తే తక్షణం ఆ సంగతి తమతో చెప్పాలని ఆదేశించారు.
పొద్దుగుంకుతున్న సమయంలో దుర్యోధనుడు తిరిగి వచ్చాడు. యెంత దూరం తిరిగినా మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా తన కంటికి కానరాలేదని చెప్పాడు. కాసేపటికి యుధిష్టురుడు వచ్చాడు. అతడిదీ అదే సమాధానం. యెంత వెతికినా ఒక్క దుర్మార్గుడు కూడా ధర్మజుడుడికి తటస్థ పడలేదు.
అంటే ఏమిటి?
నాలో ఉన్న ‘నేను’ ఎలాటివాడినో, బయటి ప్రపంచంలో నాకు అలాటి వాళ్ళే కనబడతారు. నిజానికి బయట కనబడేది అంతా, మన లోపల ఉన్నదానికి ప్రతిరూపమే.



22, అక్టోబర్ 2021, శుక్రవారం

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?
ఫీల్డ్ మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష నేర్చుకున్నాను. అలాగే మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’
అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’

తోకటపా:

ఫీల్డ్ మార్షల్ మానెక్ షా అంటే ఆషామాషీ కాదు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ కు నో అని మొహం మీదనే చెప్పగలిగిన ధీశాలి. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వెంట ఆయన కుమార్తె ఇందిరా గాంధి సైనిక స్థావరాల్లోకి ప్రవేశించడానికి అనుమతించని గొప్ప సైనికాధికారి.





21, అక్టోబర్ 2021, గురువారం

దారి ఇచ్చిన కుక్క – భండారు శ్రీనివాసరావు


ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు ఈ పోస్టు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న శాస్త్రి గారు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఈయన గారెకి కాలు ఎత్తివేసే అలవాటు. దానికి ఆయనే అవిటి కాలు అని పేరు పెట్టుకున్నారు. వయసు ఎనభై దాటడం వల్ల అది సహజంగా వచ్చి వుంటుంది. ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్వ్యాలికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారెకి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారెకి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో స్థలంలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.

వృత్తి - ప్రవృత్తి - భండారు శ్రీనివాసరావు

యాచక ప్రవృత్తి కంటే యాచక వృత్తి మేలంటారు డాక్టర్ బాలాజీ

నిజమే అనిపిస్తుంది కాస్త ఆలోచిస్తే.
యాచకుడు తన వృత్తి ధర్మంలో భాగంగా రోజల్లా అడుక్కుని ఎంతో కొంత సంపాదించి తను తినగా మిగిలినదాన్ని అవసరంలో ఉన్న తన తోటివారికి ఇస్తాడు.
యాచక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అలా కాదు.
కట్టుకుపోలేము, పోయేటప్పుడు వెంట పట్టుకుపోలేము అని తెలిసి కూడా సంపాదన యావలో పడి కొట్టుమిట్టాడే వాళ్ళకి అడుక్కునే బుద్ది అంత తేలిగ్గా వదలదు. చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడడం అందరూ ఎరిగినదే