25, సెప్టెంబర్ 2021, శనివారం
నేనేనా !
24, సెప్టెంబర్ 2021, శుక్రవారం
దేవుడికి కులమేదీ? – భండారు శ్రీనివాసరావు
గాలికి కులమేదీ అని శివాజీ గణేషన్ కర్ణుడిగా నటించిన ‘కర్ణ’ సినిమాలో ఓ పాట వుంది. అలాగే దేవుడికి ఏమైనా కులం ఉందా! లేదు అనేదే నా జవాబు
సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.
ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళితవాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన
పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై
నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి
వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు
వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.
తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం
కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు అన్నీ ‘రామాలయంలో
హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా
నియమించారు.
23, సెప్టెంబర్ 2021, గురువారం
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా! – భండారు శ్రీనివాసరావు
ఒక కధ చెబుతాను. నిజానికి ఇది కధ కాదు, ప్రతి చోటా జరుగుతున్న కధే.
అనగనగా
ఒక ఊరు. ఉన్నట్టుండి ఆ ఊరికి ఓ వ్యాపారి వచ్చి ఓ దుకాణం తెరిచాడు. దాన్నిండా
రకరకాల స్టీలు సామాన్లు. ఒకటి కొంటే మరోటి ఉచితం అన్నాడు. ఇంకేం జనం ఎగబడ్డారు.
కొన్ని రోజులకు పోలీసులు లాఠీలు ఝలిపించాల్సినంతగా క్యూ లైన్లు పెరిగిపోయాయి.
అలా
కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వ్యాపారి కష్టమర్లతో నమ్మకంగా చెప్పాడు. ఉత్తర
హిందూ స్థానం నుంచి తెచ్చిన సరుకు అంతా అయిపొయింది. మళ్ళీ స్టాక్ వస్తోందని కబురు
వచ్చింది. అప్పటివరకు మీరు డబ్బులు చెల్లిస్తూ వుండండి. సరుకు రాగానే రసీదు
చూపించి వస్తువులు తీసుకువెళ్ళండి అని. అంతకు ముందు కొనుక్కుని లాభ పడ్డవాళ్ళు, కొనుక్కోవాలని చూసి నిరాశ
పడ్డవాళ్ళూ మళ్ళీ ఎగబడి డబ్బులు కట్టారు.
అలా
కొంత కాలం గడిచిన తర్వాత అతడు గుడారం ఎత్తేశాడు. జనం లబోదిబో అన్నారు.
ఒక విలేకరి వెళ్లి ఓ పోలీసు అధికారిని అడిగాడు, ఆ
వ్యాపారి షాపు ఓపెన్ చేసి ఇలా ఒకటికి మరోటి ఫ్రీ అని ఆశ పెట్టినప్పుడే చర్య
తీసుకుని వుంటే బాగుండేది కదా! అని.
ఆయన చిద్విలాసంగా
ఒక నవ్వు విసిరేసి ఇలా అన్నాడు.
“నిజమే!
మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా! చర్య తీసుకునేది”
అప్పటి
స్టీలు సామాను నుంచి, పువ్వు
మీ అదృష్టం చెప్పును,
పన్నెండు బ్యాండ్ల రేడియో ఉచితం అనే లూధియానా ప్రకటనల నుంచి, గల్లీల్లో చీట్లు వేసేవారి నుంచి,
అర్ధ శాతం అధిక వడ్డీ ఎక్కువ ఇస్తామని భ్రమ పెట్టే ప్రైవేటు గిడిగిడి
బ్యాంకుల నుంచి, అది
కట్టిస్తాం, ఇది
కట్టిస్తాం, ముందు
డబ్బు కట్టండి అని పత్రికల్లో ఆకర్షణీయమైన
ప్రకటనలు గుప్పించే వారి నుంచి, ఇదిగో
ఇప్పటి సైబర్ మోసాల వరకు పరిస్థితి ఇంతే! ఏమీ మారలేదు. జనమూ మారలేదు. అలాగే
మోసపోతూనే వున్నారు. పోలీసులూ మారలేదు, అప్పటిలాగే కంప్లయింట్ ఎక్కడా అని అడుగుతూనే వున్నారు.
Prevention
is better than cure అంటూ నీతి పాఠాలు చెప్పేవాళ్ళు చెబుతూనేవున్నారు.
పుణ్యభూమి కళ్ళు మూసుకుని చూస్తూనే వుంది, ఆశ చచ్చినా, దురాశ
పుట్టినా ఆ మనిషి చచ్చినవాడితో సమానం అనే సూక్తిని మౌనంగా మననం చేసుకుంటూ.
(23-09-2021)
“….also spoke” – భండారు శ్రీనివాసరావు
సాంస్కృతిక సభలు, సమావేశాలు కవర్ చేసే ఇంగ్లీష్ పత్రికావిలేకరులకు అలవాటయిన పదం.
22, సెప్టెంబర్ 2021, బుధవారం
టీవీల ముచ్చట్లు - భండారు శ్రీనివాసరావు
రైట్ రైట్
గతంలో ప్రైవేటు బస్సులు ఉన్నకాలంలో
డ్రైవర్ కండక్టర్ తోపాటు ఒకక్లీనర్ కుర్రాడు కూడా ఉండేవాడు. ఎక్కాల్సినవాళ్ళు
ఎక్కిన తరువాత బస్సు డోరుపై గట్టిగా చరుస్తూ రైట్ రైట్ అని గట్టిగా అరుస్తూ
ముందున్న డ్రైవర్ కు వెళ్ళవచ్చు అనే సంకేతం ఇచ్చేవాడు. రైట్ రైట్ అంటే కదలమని
అర్ధం. ఇప్పుడు టీవీ చర్చల మధ్యమధ్యలో యాంకర్లు రైట్ రైట్ అంటూ వుంటారు. ఇక్కడ రైట్
అంటే, చెప్పింది చాలు, ఆపమని సంకేతం. డ్రైవర్లు క్లీనర్ కుర్రాడి మాట వినేవాళ్ళు కానీ చర్చల్లో
పాల్గొనే వాళ్ళు యాంకర్ గోడు వినిపించుకుంటారా.
ఇంత సింపుల్ అని ఇన్నాళ్ళు తెలియదు
"మొన్నీమధ్య ఏమీ తోచక పాలక
పక్షాన్నీ, దాని నాయకుడి విధానాలను చెరిగిపారేస్తూ పోస్టు పెట్టాను.
అప్పుడు ఏం జరిగిందో తెలుసా నేనే నమ్మలేకపోతున్నాను"
"ఏమి జరిగిందేమిటి? పోలీసులు కేసు పెట్టారా కొంపతీసి"
"కాదు, అలా అయితే ఆశ్చర్యం ఎందుకు? ఎప్పుడూ లేనిది ఓ ఛానల్ వాళ్ళు చర్చకు రమ్మని ఫోను చేసి ఇంటికి కారు పంపారు"
"తర్వాత...."
"ఇదా ఇందులో కిటుకని మర్నాడు ప్రతిపక్ష
నాయకుడిని కడిగి గాలిస్తూ మరో పోస్టు పెట్టాను. తెల్లారేసరికల్లా చర్చలకు రావాలని మరో ఛానల్ నుంచి ఫోను"
ఈ పరిస్తితి ఇక
మారదా?
"నగరంలో వర్షాలు, వరదలవల్ల ఘోరమయిన
పరిస్తితి ఏర్పడిన పరిస్తితి కనబడుతోంది. ఈ పరిస్తితి ఇక మారదా అని స్థానికులు
అనుకుంటున్న పరిస్తితే అనీచోట్లా కానవస్తున్న పరిస్థితి వుంది. అధికారులు ఎవ్వరూ రాని
పరిస్తితిలోనే మా ఛానల్ ముందుగా అక్కడికి చేరుకున్న పరిస్తితి అని బాధితులు, తమ పరిస్తితి గురించి మా విలేకరితో తమ గోడు
వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి మీరు చూస్తున్నారు........"
అహో! టీవీ భాషకు
పట్టిన దురవస్థ. ఒకే పేరాలో ఇన్ని పరిస్తితులా!
ఇక, ఈ మధ్య వచ్చిన కొన్ని ‘పదాలకు’ సోషల్ మీడియాలో లభించిన ప్రాచుర్యం ఏ
స్థాయిదో అందరికీ తెలిసిందే!
జాతకం అంటేనే మారడం
తండ్రి పోతూ పోతూ
ఇద్దరు మగపిల్లలకి ఆస్తిలో చెరిసగం రాసి పోయాడు. ఊరిమద్యలో ఇల్లూ, స్థలం
పంచుకుంటే పెద్దవాడికి నాలుగు రోడ్ల కూడలిలో మూల స్థలం, చిన్నవాడికి
దాని వెనుక స్థలం దక్కాయి. వూరు పెరుగుతూ ఉండడంతో పెద్దవాడి అదృష్టం పండింది.
రెండు రోడ్లని కలిపే జాగా కావడంతో రోడ్డుకు ఆనుకుని మడిగీలు కట్టాడు. అదీ అద్దెకు
తీసుకున్న వారి డబ్బులతోనే. మంచి కిరాయిలు నెల నెలా చేతికి అందేవి.
తమ్ముడికి కూడా అంత స్థలం ఉందన్న మాటే కానీ కాణీ ఆమ్దానీ లేదు. అతడిది నష్ట
జాతకం అన్నారు ఇంట్లోవాళ్ళు, బయట వాళ్ళు. వాళ్ళ
పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వూరు కూడా బస్తీ అయింది. రోడ్ల వెడల్పు కార్యక్రమంలో
పెద్దవాడి మడిగీలు యెగిరి పోయాయి. వుండే ఇల్లు కూడా అరకొరగా తయారయింది. చిన్నవాడి
పిల్లలు తమ చిన్న ఇంటి పెరట్లో కూరగాయలు పండించడం మొదలెట్టారు. వాటి అమ్మకాలతో
ఆదాయం పెరిగింది. ఇద్దరు అన్నదమ్ముల పరిస్తితి అటుదిటుగా మారింది. ఈలోగా బస్తీ
నగరంగా తయారయింది.
కొన్నాళ్ళకు ఆ
దారిలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం అన్నారు, వస్తుందో లేదో తెలియదు
కానీ పెద్దవాడి ఇల్లు పూర్తిగా ఎగిరిపోయింది. నష్ట పరిహారం భారీగానే ముట్టచెప్పారు,
కాకపొతే కిస్తీల్లో చెల్లింపులు. చెట్టు కొట్టేస్తే పక్షులు
ఎగిరిపోయినట్టు పెద్దవాడి కుటుంబం వలస పోవాల్సివచ్చింది. వెనకవున్న తమ్ముడి
ఇల్లు ఆ వంతెన కాంట్రాక్టర్ ఆఫీసుకు అవసరమైంది. కళ్ళు చెదిరే కిరాయికి
తీసుకున్నారు. ఆ స్థలంలోనే వాళ్ళ డబ్బులతోనే పెద్ద భవనం కట్టారు. పని పూర్తికాగానే
అది మీదే అన్నారు. నివాసం వుండగా కిరాయి డబ్బులు అదనం. చిన్నవాడి
జాతకం అంత గొప్పది అన్నారు అదే ఇంట్లో వాళ్ళు, అదే బయట
వాళ్ళు.
తరాలు మారేసరికి
ఇనుము వెండయింది, వెండి ఇనుమయింది.
‘అదే జాతకం అంటే!’
అన్నాయి అదే నోళ్ళు.
(2017)