11, ఆగస్టు 2021, బుధవారం

మీ ఆడ గుర్రం ఫోను చేసింది

 

ఏకాంబరం ఉదయం లేచి వరండాలో పేపరు చదువుకుంటున్నాడు. ఇంతలో భార్య సూరేకాంతం అప్పడాల కర్రతో ఏకాంబరం మాడుపై ఒక్కటిచ్చింది. ఏకాంబరం కుయ్యో మొర్రో అంటూ మొత్తుకున్నాడు. మొత్తుకోవడం అయిపోయిన తరువాత ఎందుకలా కొట్టావ్ అని అడిగాడు.

'ఎందుకా' సూరేకాంతం చెప్పింది.

'మీ ప్యాంటు జేబులో కళ్యాణి అని రాసిన చిట్టీ వుంది. ఎవత్తది! ముందా సంగతి చెప్పండి'

ఏకాంబరానికి నిలువు గుడ్లు పడ్డాయి. కానీ వెంటనే తమాయించుకున్నాడు.

'ఓస్ ఆ కళ్యాణా! అది రేసు గుర్రం. మొన్న నా ఫ్రెండు గుర్నాధం కళ్యాణి మీద పందెం కాయమని గుర్తుగా రాసిచ్చాడు'

అది విని సూరేకాంతం నొచ్చుకుంది. మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని లేచి వెళ్లి ఇంత వెన్నపూస తెచ్చి ఏకాంబరం మాడుకు రాసింది.

వారం తిరిగిందో లేదో ఏకాంబరం మాడు మళ్ళీ పగిలింది. ఈసారి సూరేకాంతం అప్పడాలకర్ర కాకుండా ఇనుప గరిటె తిరగేసి కొట్టింది. ఆ దెబ్బకు ఏకాంబరం మూర్చపోయాడు. తేరుకున్న తరువాత షరామామూలుగా అడిగాడు భార్యని, ఈసారి కొట్టడానికి కారణం ఏమిటని.

భార్య చెప్పిన జవాబు విని ఏకాంబరం మళ్ళీ మూర్చపోయాడు.

'మీ కల్యాణి - అదే మీ ఆడగుర్రం - ఇందాక మీ కోసం ఫోను చేసింది'




10, ఆగస్టు 2021, మంగళవారం

సమాంతర సంభాషణలు


పూర్వం జ్యోతి అనే మాసపత్రిక వచ్చేది. రాఘవయ్య గారు సారధి అయితే ముళ్ళపూడి, బాపు ఆ పత్రికకి అదనపు ఆకర్షణలు. ఓసారి ఆ పత్రికలో సంభాషణలు పలు తెరగులు అని వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇచ్చారు ఆ జోడీ. ప్రస్తుతం చెప్పుకుంటున్న సమాంతర సంభాషణలు వాటిల్లో ఒకటి. సమాంతర రేఖలు ఎక్కడా కలవవు, రైలు పట్టాల మాదిరిగా. ఇద్దరు మాట్లడుకుంటూ వుంటారు. వారి అభిప్రాయాల మాదిరిగానే వారి సంభాషణలు ఓ పట్టాన కలవ్వు. ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనంతంగా సాగిపోతుంటాయి, వినే వారితో నిమిత్తం లేకుండా. ప్రస్తుతం టీవీ చర్చల్లో ఈ రైలుపట్టాల ముచ్చట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వినేవారికి విన్నంత వినోదం.

9, ఆగస్టు 2021, సోమవారం

ధ్యానం

 2003లో మౌంట్  అబూ  బ్రహ్మకుమారీల  ఆశ్రమంలో  ఒక రోజు.

తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో – ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే – నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?”



(2003)

 

సావిత్రక్కయ్య @91 – భండారు శ్రీనివాసరావు

 


నిరుడు ఖమ్మంలో రఘు గృహ ప్రవేశానికి హైదరాబాదు నుంచి వెళ్ళాము. కొలిపాక రాంబాబు ఇంట్లో సావిత్రక్కయ్య కలిసింది. వయసు ఎనభయ్ తొమ్మిదేళ్ళు. కుటుంబంలో పెద్దావిడ. పాత తరానికి చెందిన విషయాలు తెలుసుకోవడానికి మిగిలివున్న ఏకైక వారధి. అందుకే ఆమెతో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాను. ముందు ఏముంటాయిరా అంత గుర్తుంచుకునే విషయాలు అంటూనే దాదాపు రెండు గంటలు మాట్లాడింది. ఆమె ధారణ శక్తి చూసి ఆశ్చర్యపోవడం మా వంతయింది.

పుట్టి పెరిగిన కంభంపాడు గురించీ, ఎప్పుడో ఎనభై ఏళ్ళనాడు కాలిపోయిన మా ముత్తాతలు నిర్మించిన మండువా లోగిలి గురించీ, ఆ తర్వాత మా నాన్న హయాములో కట్టిన పెంకుటిల్లు గురించీ, చిన్న నాటి చదువుసంధ్యలు గురించీ, అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు గురించీ అనేక విషయాలు చెబుతూ పోయింది. మేమంతా వింటూపోయాము. ఈ ధ్యాసలో పడి అంశాల వారిగా గుర్తుపెట్టుకునే అసలు పని మరిచేపోయాను. ఆమె తనంతటతానుగా అభివ్యక్తీకరించిన ఆత్మావలోకనం.

ఊళ్ళో అప్పయ్యగారి వీధిబడి దగ్గర చదువు ఆగిపోయింది కానీ మా చెల్లమ్మమ్ముమ్మ పక్కన కూర్చుని నేర్చుకున్న భారత, రామాయణాలు కంఠతా వచ్చేసాయి. పొద్దున్నే బామ్మ తోటకు వెడుతూ తననూ, అన్నపూర్ణక్కయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేది. ఇంటికి వస్తూ ఆ రోజుకు కావాల్సిన కూరగాయలు కోసుకుని తెచ్చుకునేవారు.

సావిత్రక్కయ్య పెళ్లి చూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు. రాధక్కయ్య ఇంట్లో పెళ్లి కుదిరింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ ఖమ్మంలో రాధక్కయ్య ఇంటి పక్కనే వీళ్ళూ ఇల్లు కట్టుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణ బజారులో వుండేవాళ్ళు. అద్దె పది రూపాయలు.

కొత్తల్లో చాలా ఇబ్బందులు. కొత్త ఇంట్లో చేరిన తర్వాత కూడా అవి వెంటే వచ్చాయి. అయితే దేవుడి దయవల్ల మా వారి ప్రాక్టీసు, ఆయన రెక్కల కష్టం వృధా పోలేదు. పిల్లలు ఎదిగి వచ్చారు. ఆడపిల్లలకు, మగపిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయి. ఇవ్వాళ ఈ స్తితిలో వున్నామంటే ఆయన చలువే.” అంది తృప్తిగా.

మా వారి ప్రాక్టీసు అంతంత మాత్రంగా వున్నప్పుడు నేను ఎక్కువ రోజులు పుట్టింట్లోనే వుండేదాన్ని. పెద్దమ్మాయి విమల, పెద్దపిల్లాడు దుర్గాప్రసాదు నేను పుట్టిన ఊరు కంభంపాడులోనే పుట్టారు. తర్వాత ఖమ్మం వెళ్ళిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో మా అక్కచెల్లెళ్ళ పిల్లాజెల్లా అందరూ పొలోమని అమ్ముమ్మగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అలాగే మా అప్ప తద్దినం నాడు కూడా నేను వెళ్ళలేకపోయేదాన్ని. మా వారికి పిల్లలు అంటే ప్రాణం. కోర్టు నుంచి ఇంటికి రాగానే పిల్లలు అందర్నీ కంటి నిండా చూసుకుంటే కాని ఆయనకు తృప్తిగా వుండేదికాదు. అన్నపూర్ణ మా వారిని ‘ ‘ఏం బావా సావిత్రిని రెండు రోజులు కంభంపాడు పంపిస్తే పిల్లులు ఎత్తుకుపోతాయా ఏమిటని’ ఆటలు పట్టిస్తుండేది. కానీ అయన మనసు నాకు తెలుసు. చెప్పాకదా పిల్లలు అంటే ప్రాణమని. ఆ పల్లెటూళ్ళో ఆడుకుంటూ కాలికి చేతికీ దెబ్బలు తగిలించుకుంటారేమో అని భయం. పెళ్ళికి ముందే పుట్టింట్లో ఎక్కువ రోజులు వున్నా కనక పెళ్ళయిన తర్వాత అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అంతగా వుండేది కాదు. నాకు ఇల్లే వైకుంఠం.

“కన్నపిల్లలు కంటి ఎదుట కనబడేలా ఇప్పుడు ఏర్పాటు చేసారు. అల్లుళ్ళు, కోడళ్ళు మంచివాళ్ళు దొరికారు. చిన్నవాడు అచ్యుత లలిత అనే అమ్మాయిని హమేషా నా దగ్గర ఉండేలా నాకు తోడుగా పెట్టాడు. హైదరాబాదులో వున్న శారద తప్పిస్తే మిగిలిన ఆడపిల్లలు, అల్లుళ్లు, పెద్దబాబు, చిన్నబాబు, కోడళ్ళు  అందరూ ఇక్కడే వున్నారు.  రోజులు మంచిగా గడిచిపోతున్నాయి. ఎవరైనా అడిగితే కానీ, నేను తొంభయ్యవ పడిలో పడుతున్నాను అనే సంగతి గుర్తురావడం లేదు.”

 

ఈరోజు సావిత్రక్కయ్య  పుట్టిన రోజు. 90 నిండి 91లో అడుగు పెట్టింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఫోను చేస్తే తనే రిసీవ్ చేసుకుంది. చక్కగా, ఆనందంగా, తృప్తిగా మాట్లాడింది.  పిల్లలు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు మనుమరాళ్లు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పింది.


ఇంతకంటే మనిషి జీవితంలో కోరుకునేది ఏముంటుంది?

సావిత్రక్కయ్యకు నమస్కారాలు.

(09-08-2021)

టైం మేనేజ్ మెంట్ లో మహిళలే నెంబర్ వన్

టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి గ్రహీతలను నిర్ణయించే బాధ్యత నాకిస్తే నేను ఖచ్చితంగా ఆ బహుమతిని గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.

ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి, పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.
అలాటిది, వానయినా వంగిడి అయినా, కార్లూ డ్రయివర్లూ లేకున్నా, ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా అది మన ప్రాప్తం.

ఉపశృతి:

శనగల మంగళ వారం
'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం
వేయించిన శనగలతో
తప్పనిసరి పలహారం'

8, ఆగస్టు 2021, ఆదివారం

అమరావతి ఓ జ్ఞాపకం

ఓ పాత జ్ఞాపకం. ఈ కొద్ది సెకన్ల వీడియో ఓ మిత్రుడి కానుక. చిత్రంలో వున్నది నేనే. మూడేళ్ళ క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన కొత్తల్లో చేసిన ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు నాయుడు గారి అమరావతి స్వప్నం గురించి నా అభిప్రాయం. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ దొరకని సువర్ణావకాశం ఒక్క చంద్రబాబు నాయుడి గారికే దక్కింది. కానీ ఏం మిగిలింది?
నిర్ణయానికి రాకముందు ఆలోచనలు చేయాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచనలు కూడదు.
ఒకడు ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. బుద్ధి తక్కువై ఎవర్నో సలహా అడిగాడు.
‘మంచి సున్నం గానుగ ఆడించి దాంతో కట్టుకో, ఇల్లు చల్లగా వుంటుందన్నా’డు ఆ సలహాలరాయుడు. అది విని మనవాడు సున్నం గానుగా ఏర్పాటుచేసుకుని పని మొదలు పెట్టబోయే సమయానికి దారిన పోయే దానయ్య అటుగా వచ్చి, ‘సున్నం పని ఎప్పుడో సున్నా అయిపొయింది, ఎంచక్కా ఇటుకలతో ఇల్లు కట్టుకో’ అని ఓ ఉచిత సలహా పారేసి తన దారిన చక్కా పోయాడు.
మనవాడు, సున్నం గానుగ పక్కన బెట్టి ఇటుకలు పోగేసాడు. మరో దానయ్య వచ్చి ‘ఇటుకల ఇళ్లు బీసీ కాలం నాటివి, చక్కగా కాంక్రీటు దిమ్మెలు వేసి కట్టుకో నాలుగు కాలాల పాటు మన్నుతుంది’ అని చెప్పాడు.
మన వాడు ఇటుకలు ఆటక ఎక్కించి కాంక్రీటు వేటలో పడ్డాడు. చివరికి ఇల్లు కట్టాలన్న కోరిక అమరావతి కలగానే మిగిలి పోయింది.
ఇంటర్వూ చేసింది స్నేహ టీవీ లో నిర్మల్ (Nirmal Akkaraju)

మాట తప్పింది

 

రెండేళ్ళ క్రితం ఆగస్టు ఏడో తేదీ నా పుట్టిన రోజున, 'డెబ్భై మూడేళ్ళు వచ్చాయి, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి ఎక్కడికీ పోను' అన్నది.