9, జులై 2021, శుక్రవారం

పన్నెండు కావాలి ఫోను చేయాలి

 'నా మాట విను. ఇంత అర్ధరాత్రి వేళ ఫోను చేయాలా! పొద్దున్నే చేస్తే సరిపోదా!'

'లేదు. ఇప్పుడు చేసి మాట్లాడితేనే నాకు తృప్తి'

ఈ ఒక్క విషయంలో నా మాట వినేది కాదు.

'పన్నెండు తర్వాత వాళ్ళ ఫోన్లు బిజీగా వుంటాయి. పన్నెండు గంటలకు కాస్త ముందు చెప్పరాదా'

'లేదు. నా ఫోను వస్తుందని వాళ్ళకి తెలుసు'

ఇంకేం చెప్పను?

ఇలా మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అందరి పుట్టినరోజులప్పుడు గుర్తు పెట్టుకుని, ఆ రాత్రి మేలుకుని వుండి శుభాకాంక్షలు, శుభాశీశ్శులు చెప్పడం నేను దశాబ్దాలుగా చూస్తూ వచ్చాను.



ఈరోజు పన్నెండు అవుతోంది. జులై తొమ్మిది నా రెండో కుమారుడు సంతోష్, రెండో అన్నయ్య పెద్ద మనుమరాలు మాధుర్య పుట్టినరోజు.

మేలుకునే వున్నాను ఒంటరిగా. కానీ మా ఆవిడలా పనికట్టుకుని మేలుకుని లేను. ఈ గిల్టీ ఫీలింగ్ తో ఫోను ఎలా చేయను?

(08-07-2021)

8, జులై 2021, గురువారం

ఏం చెయ్యను? హెల్ప్ లెస్!

 చిన్నపుడు మా ఊళ్ళో గుంజకు కట్టేసిన చిన్న ఆవుదూడ మెడ పలుపు విప్పగానే  ఆ తువ్వాయి తోకపైకి లేపి ఎంతో ఆనందంతో గెంతులు పెడుతూ అటూ ఇటూ పరిగెట్టేది.

రాత్రి నా పరిస్థితి అలాగే వుంది. హైదరాబాదు వచ్చిన తోపుడు బండి సాదిక్ ఆలీ,  సాయంత్రం ప్రెస్ క్లబ్ లో కలుద్దాం, తప్పకుండా రండి  అన్నాడు. ముందు సంక్షేపించిన మాట వాస్తవం. ఇన్నాళ్లుగా బయటకు పోకుండా వుండి,  ఇప్పుడు వెడితే మంచిదేనా అనే మనసులోని  సందేహాన్ని, పోనీ పోయొస్తే పోలా అనే మెదడులోని భావన పటాపంచలు చేసింది. తీరా వెడితే అక్కడ పది మంది వెయిట్ చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు కొందరు.  పరిచయం వుండి, ముఖపరిచయం లేనివాళ్లు మరి కొందరు. వీరిలో చాలామంది కరోనాని ఓ పక్క లెక్కలోకి తీసుకుంటూనే  మరోపక్క దాన్ని లెక్కపెట్టకుండా తమ పనులు తాము చేసుకుంటూ అన్ని చోట్లకూ తిరుగుతున్నారు. వారిలో నేనొక్కడినే రెండేళ్లుగా అసూర్యంపశ్య బాపతు. అంచేత ముందు చెప్పిన తువ్వాయి మాదిరిగానే  నాలో తెలియని ఉత్సాహం పెల్లుబుకింది.

క్లబ్ మేనేజర్ రామచంద్రం, కొత్తగా చేసిన ఏర్పాట్లు, మార్పులు  దగ్గరుండి చూపించాడు. కిచెన్ చాలా అధునాతనంగా వుంది. బార్ కౌంటర్ స్టార్ హోటల్ ని గుర్తు చేస్తోంది.  క్లబ్ లో పనిచేసే పాత సిబ్బంది అందరూ గుర్తుపట్టి పలకరించారు. నలభయ్ అయిదేళ్ళ అనుబంధం నాకు ఆ క్లబ్ తో.

పెద్దరికం వల్ల కావచ్చు, లేదా విధి లేక కావచ్చు వచ్చిన వాళ్ళు నాకే మైకు వదిలేశారు. నేను చెప్పిన కబుర్లే విన్నారు. తర్వాత అయ్యో పాపం అనిపించింది.  కానీ ముందే చెప్పాను కదా!  పలుపు తాడు  విప్పిన చిన్నారి ఆవుదూడలా ఆ కాసేపు నా గెంతులనే వాళ్ళు భరించాల్సి వచ్చింది.

ఏం చెయ్యను. హెల్ప్ లెస్!



సాదిక్ ఆలీ,  నందిరాజు రాధాకృష్ణ,  మండవ దుర్గాకుమార్,  కొల్లి అరవింద్,  కె ఎన్ మూర్తి,  తాడి ప్రకాష్, కంభం శివప్రసాద్, రామకృష్ణ వై., కస్తూరి శ్రీనివాస్, దండలో దారం జాగర్లమూడి రామకృష్ణ! అందరికీ మరోమారు థాంక్స్! 

(07-07-2021)

ఆదివారం సెలవు వద్దు – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు తెల్లవారుతుండగానే ఏబీకే గారి నుంచి ఫోన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారం ప్రకటించి నందుకు ముందుగా ఆయనకు

అభినందనలు
తెలిపాను.
ఏబీకే గారెతో పరిచయం ఈనాటిది కాదు. 1970లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు ఆయన సీనియర్ సబ్ ఎడిటర్. నేను సబ్ ఎడిటర్. రాత్రి డ్యూటీలు మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. వేరే ఎవరూ వుండేవారు కాదు. అలా వారానికి మూడు రోజులు మాకు ఇద్దరికీ కలిపి నైట్ డ్యూటీ వేసేవాళ్ళు. ఎడిషన్ కు ఎడిషన్ కు నడుమ ఖాళీ సమయంలో ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పేవారు.
“చూడు శ్రీనివాస్! మనం సాధ్యమైనంత ఎక్కువగా చదవాలి. అప్పుడే రాయగల శక్తి వస్తుంది. చదవడం మరచిపోతే మనం మన ఫీల్డ్ లో ఎన్నటికీ ఒక స్థాయికి చేరుకోలేము. అంచేత నువ్వు ఏమి చేస్తావంటే నీ వీక్లీ ఆఫ్ ఆదివారం నుంచి మరో రోజుకు మార్చుకో. ఎందుకంటే మన బంధు మిత్రులు అందరికీ ఆదివారమే సెలవు వుంటుంది. మనం కనుక ఆరోజు పనిచేసి మరో రోజు ఆఫ్ తీసుకుంటే ఇక సెలవు రోజున మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ వుండరు. ఎంచక్కా ఆరోజు మనం కోరుకున్న పుస్తకంతో కాలక్షేపం చేయవచ్చు.” అని ఓ రోజు హితబోధ చేయడంతో నేను నా వీక్లీ ఆఫ్ శుక్రవారానికి మార్చుకున్నాను.
అలా ఓ శుక్రవారం నాడు (ఆయన ఆఫ్ కూడా ఆ రోజే) నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి తాను ఏర్పాటు చేసుకున్న లైబ్రరీ చూపించారు. ఆ ఇల్లే ఒక లైబ్రరీ అంటే సముచితంగా వుంటుంది. అన్నిగ్రంధాలు వున్నాయి.
పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం అనుకుంటున్న ఏబీకే ప్రసాద్ గారెకి మరోమారు
అభినందనలు

వై.ఎస్. కలను జగన్ సాకారం చేస్తారా! – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్ర సందర్భంలో ప్రజలకు ఇచ్చిన

హామీలను నవరత్నాలుగా మలిచి రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను

ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువచ్చే కార్యక్రమంలో ఆయన తలమునకలుగా

వున్నారు. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి,

వారి నాన్నగారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా

వున్నప్పుడు కన్న ఓ కలను గుర్తుచేయడానికే ఈ ప్రయత్నం. ఆయన మదిలో

రూపుదిద్దుకున్న ఓ బృహత్తర పధకం తుది రూపం దాల్చకముందే, ఆ పధకం ఫలితాలను

కళ్ళారా చూడకుండానే వై ఎస్, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. ఆయన మృతి

కారణంగా ఒక చక్కటి పధకం తుదికంటా అమలుకు నోచుకోలేదు.

దీనికి పూర్వరంగం గురించి చెప్పడం సముచితంగా వుంటుంది.

అప్పటికే, 108 అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర

వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.

నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ

పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు చేసే

సైరన్ ధ్వనిని అనుకరిస్తూ ఆ సర్వీసు ప్రాముఖ్యాన్ని ప్రజలకు

తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో

ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదే 'ఫిక్సెడ్ డేట్ హెల్త్

సర్వీస్' (ఎఫ్.డీ.హెచ్.ఎస్). అంటే నిర్దేశిత దిన వైద్య సేవలు.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.

ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను

తీరుస్తున్నప్పటికీ, డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే

మిగిలిపోతున్నది. మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను

వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా

పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా

లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య

కేంద్రాలకు దూరంగా వున్న కుగ్రామాల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం

కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే

నాటుమందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు

లేకుండా కొండ ప్రాంతాలలో, అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి

తండాల్లో వుండే పేదవారికి రోగంరొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు

సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు.

అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటే ఎలాటి

వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ

పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా వారికి తెలియదు.

ఈ నేపధ్యంలో,

అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి,

పనిచేస్తున్న 104 ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు హెచ్.ఎం.ఆర్.ఐ.

(హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి

సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని

వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య

కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం

తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు

అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున

ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే, ఈ 104 సంచార వైద్య

వాహనం పేద పల్లెప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా

చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే,

ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే,

వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక

గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు

ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక

డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి

ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ

స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం

పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని

భావిస్తే, 108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.

రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు, ఇతర

పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్

పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ

నిర్వాహకులు ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. సమావేశం మొదలయింది.

ఉన్నట్టుండి వై.ఎస్. వారిని ఒక ప్రశ్న అడిగారు. గ్రామాలకు వెళ్ళే ఈ

బండిలో డాక్టర్ ఉంటాడా? అని. పల్లెలకు వెళ్ళే వైద్యులు లేకపోబట్టే ఈ

పధకాన్ని రూపొందించామని నిర్వాహకులు బదులు చెప్పారు. స్వయంగా డాక్టర్

అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆ విషయం తెలియదని అనుకోము. సందేహ నివృత్తి

కోసం అడిగివుంటారు. మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి

గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్

ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరుకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది

నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్! రాజశేఖర రెడ్డి.

అయితే ఆయన కన్న స్వప్నం ఇంతటితో ఆగిపోలేదు. ప్రజారోగ్యానికి సంబంధించిన

అన్ని వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నది ఆయన ధ్యేయం.

ఆ పధకానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు. ఈ దిక్కుగా ఆలోచించారు.

గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి

వైద్యం చేయించుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప

వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది.

చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ

అందుబాటులో వుండే 104 ఉచిత కాల్ సెంటరు. రాష్ట్రంలో ఏమారు మూల ప్రాంతం

నుంచయినా సరే ఏ చిన్న ఆరోగ్య సమస్యకయినా ఈ కేంద్రంలో రాత్రింబగళ్ళు

అందుబాటులో వుండే నిపుణులయిన వైద్యులు సలహాలు అందిస్తారు. వ్యాధి నిదానం 

కంటే నివారణ మేలు. అందుకోసం నిర్దేశితదిన వైద్య పరీక్షలు నిర్వహించే 104

సంచార వాహనం. అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి

పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం

ఆరోగ్యశ్రీ.

పైగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.

నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో కూడా ఆగలేదు.

104 సంచార వాహనం వారు బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను

కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వైద్యశాలకు

వెళ్ళినా ఆ రోగుల వివరాలన్నీ నిమిషాల్లో వైద్యులకు తెలిసిపోతాయి.

అప్పటివరకు ఏ మందులు ఎన్నాల్టి నుంచి తీసుకుంటున్నది డాక్టర్లకు

బోధపడుతుంది. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు.

గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు

సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు

వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి

తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం

తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.

ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు.

“కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి

తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక

నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత

ప్రభుత్వానిదే”

ఇంతే కాదు.

104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు

క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు ఇలా వైద్య రంగానికి

సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు.

అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూలనుంచి ఫోను చేసినా వారు

వుండే ప్రదేశానికి ఈ సదుపాయాలు యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో

పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక వైద్య

ఆరోగ్య శాఖ సహకారంతో ఏ ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో

ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు

అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ

కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఏ

వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు

పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి

అడిగినట్టుగా సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన

వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఈ పధకం

లక్ష్యం.

ఆయన హఠాత్ మరణం తరవాత రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు వేగంగా మారిపోయాయి.

కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా

నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. కొందరి

స్వార్ధాలకు బలయిపోయింది. కొందరి ఆహాలను చల్లార్చడానికి మాడిమసయిపోయింది.

రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి కొందరి ఎత్తులు పైఎత్తులకు

చిత్తయిపోయింది.

ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.

కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటే

చెప్పుకోవడానికి వారికెవరూ లేరు. వారితరపున చెప్పేవారూ లేరు.

వారి గురించి రాసేవారు లేరు. కారణం వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.

చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు.

వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటే అలాటి ఆధునిక

సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.

కర్ణుడి చావుకు అన్నట్టుగా ఈ పధకం భ్రష్టుపట్టిపోవడానికి కూడా అనేక

కారణాలు వున్నాయి. అందులో ప్రధానమయింది వై ఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం.

ఆయన జీవించి వుంటే ఈ పధకం ఇలా నీరుకారిపోయి వుండేది కాదని గట్టిగా

చెప్పొచ్చు.


(ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

LINK:

Clipping of Andhra Prabha Telugu Daily - Andhra Pradesh Main (prabhanews.com)

7, జులై 2021, బుధవారం

లీడర్ – భండారు శ్రీనివాసరావు

 నా చిన్నతనంలో ఎక్కువ కాలం గడిపిన బెజవాడకు గుంటూరు చాలా దగ్గర అయినప్పటికీ ఆ ఊరు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. మా చిన్న బావగారు తుర్లపాటి రంగారావు గారు గుంటూరులో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న రోజుల్లో నేను బెజవాడనుంచి గుంటూరు వెళ్లి అక్కడ  పట్టాభి పురంలో ఉన్న బావగారింట్లో ఉండేవాడిని. ఆయన కారులో (జీపులో) ఆఫీసుకు వెడుతూ నన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్లి  నాజ్ సెంటర్ లో వదిలేసి మళ్ళీ భోజనానికి ఇంటికి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకునేవారు. ఈలోగా అక్కడ ఏదో ఒక సినిమా హాలు పట్టుకుని అందులో ఏ సినిమా ఆడుతుందో అనేది  పట్టించుకోకుండా వెళ్లి థియేటర్ లో కూర్చొనే వాడిని. బెజవాడ ఎండలను తలపించే గుంటూరు వేడిని తట్టుకోవడానికి ఏసీ థియేటర్ ను ఎంచుకునేవాడిని. బహుశా ఆ రోజుల్లో ఎయిర్ కూల్డ్ థియేటర్లు అనేవారు అనుకుంటా.

అలా ఒకరోజు నాజ్ థియేటర్ లో చూసిన సినిమా లీడర్. పేరు చూసి ఇంగ్లీష్ సినిమా అనుకున్నాను. తీరా చూస్తే అది హిందీ పిక్చర్. దిలీప్ కుమార్ హీరో. భాష అర్ధం కాకపోయినా సినిమా నాకు బాగా నచ్చింది. అచ్చం మన తెలుగు సినిమా హాస్య నటుడు చలం మాదిరిగా వున్నాడు, దిలీప్ కుమార్.

దేశ విభజనకు ముందు దిలీప్ కుమార్ జన్మించింది ఈనాటి పాకిస్తాన్ లో అయినా, పేరు మార్చుకుని (అసలు పేరు యూసుఫ్ ఖాన్ అనుకుంటా) మన దేశంలోనే ఒక అత్యుత్తమ సినీ కథానాయకుడిగా పేరు తెచ్చుకుని దేశానికి కూడా ప్రతిష్ఠ తెచ్చారు.

తొంభయ్ ఎనిమిదేళ్లు, అంటే కొంచెం అటూ ఇటూగా శతాయుష్కుడిగా జీవించి ఈరోజు ఉదయం ముంబైలో కన్ను మూశారు.  



(07-07-2021)

సీఎం అప్పాయింటుమెంటు అంటే అంత చులకనా! – వై ఎస్ తో ఓ జ్ఞాపకం

 


ఏవిటండీ మీరు మరీను. సీఎం గారి అప్పాయింటుకోసం అందరూ క్యూలో వుంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ”

భాస్కర శర్మ గారికి కోపం వచ్చిన సందర్భాలు బహు తక్కువ. వాటిల్లో ఎక్కువ భాగం నావల్లనే తటస్థపడ్డాయి.

భాస్కర శర్మ ఉద్యోగమే బిజీ బిజీ ఉద్యోగం. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అప్పాయింటుమెంట్లు ఖరారు చేసే బాధ్యత ఆయనది. మామూలుగా అయితే ఫోను రిసీవ్ చేసుకునే వ్యవధానం కూడా వుండదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐ.ఏ.ఎస్.లు, ఐ.పీ.ఎస్. లు ఇలా ఎంతో మంది నుంచి ఒత్తిళ్ళు వుండే ఉద్యోగమాయే. అలాంటి ఉద్యోగం అయినా అది చేస్తున్నది భాస్కర శర్మ కాబట్టి ఆయన తీరే వేరు. ఎవరు ఫోను చేసినా మర్యాద, నమ్రత. సీఎం పేషీలో పనిచేసేవాళ్ళు యెంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది.

నేను అనేకసార్లు శర్మ గారిని ఇబ్బంది పెట్టి ఎవరెవరికోసమో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అప్పాయింటు ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్ళీ ఫోనులోనే క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. యెంత సహన శీలుడికయినా కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. అప్పుడాయన అన్న మాట అదన్నమాట.

గతంలో రేడియో ఉద్యోగంలో వున్నప్పుడు ఈ అప్పాయింటుమెంట్ల గొడవే వుండేది కాదు. నేరుగా వెళ్లి కలవడమే. అంచేత వాటి విలువ ఏమిటో శర్మ చెప్పిన దాకా నాకూ తెలవదు.

రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే అప్పాయింటుమెంటు లేకుండానే ఆయన్ని అయన కారులోనే సరాసరి రేడియో రికార్ధింగుకు తీసుకువెళ్ళాను. ( ఇందుకు సంబంధించిన ఫోటో మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ వద్ద వుంది) ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్ళే అనేది నా వాదన.

వై ఎస్ కూడా అంతే. అప్పాయింటుమెంటు తీసుకున్న సంగతీ, క్యాన్సిల్ చేసిన సంగతీ తెలిసి కూడా తరువాత కలిసి నప్పుడు ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ఒక చేతిని తెరిచి వుంచి మరో చేతి వేళ్ళను ముడిచి పెట్టి తెరిచిన అరచేతిపై కొట్టుకుంటూ ‘ఏవిటి విశేషాలు’ అంటూ పలకరించేవారు.

ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడానికి ముందు అసెంబ్లీలో కలిశాను. మరుసటి రోజు ఆయన లేరు. లేరన్న సంగతి కూడా ఆ మరునాటికి కానీ తెలియని పరిస్తితి. మనిషిని ఆనవాలు పట్టలేని విధంగా మృత్యువు ఆయన్ని వెంటబెట్టుకు వెళ్ళింది. అంచేతే, అంతకు ముందు రోజు చూసిన ఆయన నగుమోమే మనస్సులో ముద్రపడిపోయింది.

రేపు వైఎస్ జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాలుగు ముక్కలు.


(సుమారు నలభయ్ ఏళ్ళ క్రితం ఓ విందు సమావేశంలో వై.ఎస్. ఆర్.తో నేను)


 


6, జులై 2021, మంగళవారం

నీళ్ళు మళ్ళీ రాజుకుంటున్నాయి – భండారు శ్రీనివాసరావు

 మీరు చదివింది కరక్టే. రాజుకుంటున్నవి నీళ్ళే! నిప్పులు కాదు. పైగా నీలి వర్ణపు కృష్ణానది పవిత్ర జలాలు.

పారే నీటికి ప్రాంతాలు లేవు అని చిన్నప్పుడు చదువుకున్నాం. నదీతీరాల్లో నాగరికత విలసిల్లుతుందని కూడా పుస్తకాలు రాశారు. బహుశా అప్పటికి జనాభా ఇంతగా పెరిగి వుండదు. నీటి అవసరాలు ఈ స్థాయిలో వుండి వుండవు.

సమస్యలు పుట్టుకొచ్చేది కొరతలు పుట్టినప్పుడే. మామూలుగా ఇళ్ళల్లో నీళ్ళకు కొరత లేదనుకోండి. పక్కింటి పిన్నిగారు ఉమ్మడి నల్లా నుంచి  ఓ బిందెడు ఎక్కువ పట్టుకున్నా సరిపెట్టుకుంటారు. బిందెడు నీళ్ళే కదా! అదేమంత భాగ్యం, మణులా మాణిక్యాలా మరో బిందెడు తీసుకు వెళ్ళండి నిక్షేపంగా  అంటారు.

అదే నీళ్ళ కరువు వచ్చి పడితే గిద్దెడు నీళ్ళు అదనంగా తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోరు. అవసరమైతే  కొట్టుకోవడానికి  నల్లా దగ్గర పెట్టిన బిందెలు, గాలిలోకి  పైకి లేచినా ఆశ్చర్యపోనక్కర లేదు. వీటినే కుళాయి దగ్గర తగాదాలు అంటారు. 

నదీ జలాల తగాదాలు కూడా ఇంచుమించు  ఇలాంటివే. వర్షాలు బాగా కురిసి, రిజర్వాయర్లు అన్నీ నిండుకుండల్లా వున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని నీళ్ళు వాడుకున్నా వద్దు అనేవారు వుండరు. అదే వర్షాభావం కారణంగా డాముల్లో నీళ్ళు సరిపడా లేవనుకోండి, ఇక అప్పుడు మొదలవుతాయి ఇరుగుపొరుగు రాష్ట్రాల నడుమ గిల్లికజ్జాలు.

ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య రాజుకుంటున్నవి, రాజేస్తున్నవి కూడా ఇవే. నిజానికి ఇదేమీ కొత్త కాదు. రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కొత్తల్లోనే ఈ తగాదాలు తలెత్తాయి. నాగార్జున సాగర్ డ్యాం మీద అటుపక్కా, ఇటుపక్కా ఇరు  రాష్ట్రాల పోలీసులను మోహరించిన సంగతి ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే వుంది.

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ ఒకే ఒక కారణం ‘నీళ్ళు’. నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.”

చాలా ఏళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి చేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం నిజమవలేదు కాని సాగు నీరు, తాగు నీరు అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి తగాదాలు మాత్రం అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.

ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు, బొచ్చెడు తగాదాలు. భారతదేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల వివాదాలు. జీవ నదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలకు మాత్రం ముగింపు అంటూ వున్నట్టులేదు.

పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అము దారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి.

ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాచ్యంలో  పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.

ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.

నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగడానికయినా నీళ్ళు అవసరం. ఇతర జంతుజాలం, పశు పక్షాదుల మనుగడకు కూడా జలమే ప్రాణాధారం.

నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి మానవాళి నీటి అవసరాలు తీర్చడానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి ఏర్పడగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.

ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం.

మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల వివాదం.

పోతే, పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ అనుభవైకవేద్యం.

పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఒక ప్రాంతం అంటూ లేదు.  చిక్కల్లా చిక్కిపోతున్న  నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే.

(07-07-2021)