4, జులై 2021, ఆదివారం

మందు ఎక్కడ దొరుకుతుంది ?

 

డాట్టరు గారూ! మీ ఫీజు సరే కానీ మీరు రాసిన ఈ మందులు ఎక్కడ దొరుకుతాయండీ?”

అదే మరి కాలేది. అవతల అంత మంది పేషెంట్లు వుంటే ఏవిటీ చచ్చు, చొప్పదంటు ప్రశ్న?”

అలా కోపం చేసుకోకండి. మీరు పెద్దమనసుతో వింటానంటే చెబుతా!”

అదేదో తొందరగా చెప్పి ఏడవ్వయ్యా మగడా!”

మొన్నీమధ్య మా చిన బామ్మర్దిగాడి మూడో బామ్మర్ధికి ఒంట్లో నలతగా వుంటే మీ దగ్గరికే పంపించాకదండీ. మీరేమో మంచిగా చూసి మాత్తర్లు అవీ రాసిచ్చారు కదండీ. ఆడేమో ఆ చీటీ అట్టుకుని వూళ్ళో సగం మందుల షాపులు చుట్టేశాడండీ! కానేమోనండీ ఒక్క చోట దొరికితే ఒట్టండీ. ఒకడేమో అదే మందు గోలీలు వేరే కంపెనీవి వున్నాయంటాడు. మీరు కోప్పడతారనుకుని వేరే షాపుకు వెళ్ళాడండీ. ఆడేమో వందా నూటయాభయ్యా అని అడిగాడుటండీ. వందలూ, ఏలూ మాత్తర్లు నాకెందుకయ్యా, నీలాగా దుకాణం వుందనుకున్నావా అన్నాట్ట మా వోడు. దుకాణపోడు పెద్దగా నవ్వి, అదికాదయ్యా బాబూ పవరు, మాత్తర్ల పవరు యెంత నూరా నూట యాభయ్ ఎంజీలా’ అని అడిగాట్ట. ‘ఆ పవర్లు మీ డాట్టారు రాయలేదు ముందు పోయి కనుక్కో. తర్వాత వచ్చి మందు కొనుక్కో’ అన్నాట్టండీ. ఫీజు వంద అంటే ఇచ్చాము కానీ ఈ మాత్తర్లకు కూడా ఇంత ఇసయం వుందా అని మా ఓడు తెగ మనాది పడిపోయి, ఆ మాత్తర్ల కోసం తిరిగి తిరిగి చివరికి కొననేలేదు. వాడనేలేదు. కానండీ, డాట్టరు బాబూ, మీ చేయి వాసి మహా గొప్పది కదండీ, అంచేతండీ, ఆడికండీ జరం చేత్తో తీసేసినట్టు తగ్గిపోయిందండీ! ఏ గోలీ వేయకుండానే

3, జులై 2021, శనివారం

లాకేత్వం ద క్కొమ్ము - భండారు శ్రీనివాసరావు

 ‘ఆయన దగ్గరకు సాయానికి వెళ్ళకు, లాకేత్వం, దక్కొమ్ము బాపతు’ అనే వాళ్ళు మా చిన్నప్పుడు.

కాస్త పెద్దయిన తరవాత కానీ అందులోని అర్ధం బోధపడలేదు.
అంటే ఏమీ లేదు. లేదనే.
‘లా’ కు ఏత్వంఅంటే ‘లే’, ‘ద’ కు కొమ్మంటే ‘దు’. ‘లేదు’.
లేదు, కాదు అనేవాడి దగ్గరికి పోయి ఏం లాభం అని ప్రతిపదార్ధ తాత్పర్యం.
మరి అడగందే అమ్మయినా పెట్టదంటారు. అటువంటప్పుడు అడక్కపోతే ఎలా అని లా పాయింటు తీసేవాళ్ళు వున్నారు.
నిజమే. పని వున్నప్పుడు ఆ పని చేసిపెట్టేవాడిని అడగాలి.
అయితే కొన్ని చేసే పనులు వుంటాయి. కొన్ని కాని పనులు వుంటాయి. మరికొన్ని ‘కాని’ పనులూ వుంటాయి. అంటే, చేయకూడనివి, చేయరానివి అని అర్ధం.
కొందరు చేయగలిగిన చేవ కలిగిన వాళ్ళుంటారు. కొందరు చేయలేకపోయినా ఆ చేవకు కొదవుండదు.
కొందరు చేయగలరు. కానీ చేసే చొరవ, చేవా రెండూ వుండవు.
మరికొందరు చేయలేరు, కానీ పనులు చేయించే చొరవ, చేవ రెండూ పుష్కలం.
ఇక చేయగలిగీ చేయను అనే మొండి రకం, చేయలేను, నా వల్ల కాదు అని మర్యాదగా తప్పుకునే రకం కూడా తారసపడుతుంటారు.
చేస్తాను, చెప్పండి అదెంత పనంటూ చిటికెలు వేసి పని కాకపోవడానికి కారణం ఆయన మాత్రం కాదని మనచేతనే నమ్మించే మనుషులూ మన మధ్యనే వుంటారు.
ఒకర్ని అపర శ్రీరామచంద్రులు, నిప్పులాంటి వాళ్ళు, నిజాయితీకి నిలుటద్దాలు అంటాము.
ఇంకొకర్ని సమర్ధ రామదాసులు అని పిలుస్తాము.
మొదటి వారిని బయట వాళ్ళు మెచ్చుకుంటే ఇంట్లోవాళ్ళు పనికిరాని రకంగా లెక్క గడతారు.
రెండో రకం వారిని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే, పనులు చేయించుకున్న తరువాత బయట వాళ్ళు, ‘ఒట్టి లంచావతారం’ అనే పేరు పెట్టేస్తారు.
ఈ మధ్య ఇంకో థియరీ వినబడుతోంది.
‘లేదు, నా వల్ల కాదు’ అని ఆదిలోనే అంత్య నిష్టూరపు బాణీ ఎత్తుకోవాలని మేనేజిమెంటు పాఠాల్లో మొదటే చెబుతారని విన్నాను.
‘నో’ చెప్పగలిగిన వాడు సిబ్బంది చేత పనులు బాగా చేయిస్తాడని అదో నమ్మకం.
‘చచ్చినా సెలవు ఇవ్వను’, ‘అరిచి గీ పెట్టినా జీతం పెంచను’, బహుశా ఇలాంటి ‘నో’లు కాబోలు.
సరే! ఇది ఇలా ఒదిలేద్దాం.
ఒక్కటి మాత్రం నిజం.
‘నో’ చెప్పిన వాడ్ని మిత్రుల జాబితా నుంచి తొలగించడం అంటే మన స్నేహంలోనే ఏదో స్వార్ధం వుందనుకోవాలి.

2, జులై 2021, శుక్రవారం

ఆత్మ విశ్వాసం

 ఏకాంబరరానికి దిక్కు తోచడం లేదు. వున్నదంతా వ్యాపారంలో పెట్టాడు. కాలం కలిసిరాలేదు. లాభాలమాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబళ్ళు కూడా  వెనక్కి రాలేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫోను మోగితే అప్పులవాళ్లేమో అని భయం. తలుపు తడితే తీయడానికి సంకోచం, అప్పిచ్చిన వాళ్లు ఏకంగా ఇంటి మీదికే వచ్చేరేమో అని. ఒక్కోసారి ఆర్ధిక  ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా మదిలో మెదిలేది.

దిక్కు తోచని ఏకాంబరం ఓ రోజు మధ్యాన్నం నిర్మానుష్యంగా పార్కుకు వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. మొహం చూస్తే ఎక్కడో చూసిన మొహమే అనిపించేలా వుంది.  సూటూ బూటూ డబ్బున్న వాడి మాదిరిగానే కనిపించాడు. ఆ వచ్చిన వాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏకాంబరానికి అతడెవరో తెలియగానే మతి పోయింది. ఆ వృద్ధుడు ఆ వూర్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే అత్యంత ధనికుడు. దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు వున్నాయి. అతడిలా అన్నాడు.

'చూడండి. మీరేదో ఇబ్బందుల్లో వున్నట్టున్నారు. ఆర్ధిక సమస్య అయితే నాకు ఒదిలేయండి' అంటూ మాట్లాడుతూనే జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి చెక్కుపై సంతకం చేసి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. 'సరిగ్గా ఏడాది తరువాత ఇదే పార్కులో కలుద్దాం. వడ్డీ అవసరం లేదు కాని అసలు మాత్రం ఇవ్వండి చాలు'

చెక్కు చేతిలో పెట్టి అతడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

తీసి చూస్తే పాతిక లక్షలకు రాసిన చెక్కు అది. అప్పులు తీర్చగా  ఇంకా కొంత మిగులుతుంది కూడా. ఏదయితేనేం భగవంతుడు,  వృద్ధుడి రూపంలో వచ్చి  తనకో దారి చూపించాడు.

ఇంటికి వెడుతూ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో అతడికి మరో ఆలోచన వచ్చింది. పాతిక లక్షల చెక్కు. అదీ దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడు ఇచ్చిన చెక్కు. అది తన జేబులో వుంది. ఇక దేనికీ భయపడాల్సిన పనిలేదు. ముందు వ్యాపారవ్యవహారాలు చక్కదిద్దాలి. ఎటొచ్చి ఎటు పోయినా రామబాణం వంటి చెక్కు తన దగ్గరే  వుంది.

ఆ వూహ అతడిలో ఆత్మ విశ్వాసం నింపింది. ఇక ఆ రోజు నుంచి అతడి తరహా తీరు పూర్తిగా  మారిపోయాయి. చెక్కు ఇచ్చిన ఆత్మ బలంతో అతడు ముందుకు అడుగులు వేసాడు. వెనుకటి ఆత్మన్యూనతా భావం మచ్చుకు కూడా కానరాకుండా పోయింది. ఆత్మవిశ్వాసంతో సాగించిన  అతడి వ్యాపారానికి కూడా తిరుగు లేకుండా పోయింది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చాడు.

చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగింది. వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెక్కు తీసుకుని అదే పార్కుకు వెళ్ళి అదే బెంచీ మీద కూర్చుని ఎదురుచూడ్డం మొదలు పెట్టాడు. అనుకున్నట్టే వృద్ధుడు వచ్చాడు. 'మిత్రమా యెలా వున్నావు? కులాసాయేనా'  అని కుశల ప్రశ్నలు వేసాడు. 'మీ దయవల్ల బాగున్నాను. పోతే, మీ చెక్కు ఉపయోగించుకునే అవసరం పడలేదు' అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టి దణ్ణం పెట్టాడు ఏకాంబరం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు మగ నర్సులు వచ్చారు. 'ఇక్కడ వున్నావా మహా ప్రభూ! నీకోసం ఆసుపత్రి అంతా వెతుకుతున్నాం' అంటూ  ఏకాంబరం వైపు చూసి చెప్పారు. 'నేను పలానా పలానా. గొప్ప ధనికుడ్ని. డబ్బేమన్నా కావాలా అని అడిగాడా! అడిగేవుంటాడు. అతడికి ఇది మామూలే. ఎందుకంటే  ఇది మామూలు పిచ్చి కాదు' అంటూ ఆ వృద్ధుడిని బలవంతాన తీసుకుపోయారు.

ఏకాంబరం నివ్వెరపోయాడు. ఎంతో ధనికుడు అనుకున్న ఇతడు పిచ్చివాడా. అతడిచ్చింది చెల్లని చెక్కా!'

కానీ ఆ తరువాత ఆలోచిస్తే ఆ పిచ్చివాడి రూపంలో అతడికో జీవిత సత్యం బోధపడింది.

ఆ చెక్కు వుందన్న భరోసాతో అతడు వ్యాపారంలో ముందుకు సాగాడు. 'అవసరం అయినప్పుడు అదే ఆదుకుంటుంది' అన్న 'నమ్మకం' అతడ్ని ముందుకు నడిపించింది. ఆ ఆత్మ విశ్వాసం ఎంతో కలిసివచ్చింది. పట్టింది బంగారం అయ్యింది. అప్పుడే ఆ చెక్కు బ్యాంకులో వేసి వుంటే అసలు విషయం తెలిసిపోయేది. కధ అక్కడే పూర్తిగా ఆగిపోయేది.

భగవంతుడు కూడా అలాటి భరోసానే. ప్రతిదానికీ దేవుడ్ని వాడుకోవాలని చూడకుండా ఆయన మన వెంటే వున్నాడనే నమ్మకంతో ముందుకు వెడితే అంతా బాగుంటుంది. మనిషి కృషికి దేవుడు అనబడే ఓ కానరాని అదృశ్య శక్తి అండ ఎప్పుడూ  వుంటుంది.

NOTE: పైన కధకి, కింద ఫోటోకి సంబంధం ఏమిటి అనే సందేహానికి నా సమాధానం. Adsense ద్వారా వచ్చే ఆదాయం అంత త్వరగా పెరగదు. సింగిల్ డిజిట్ నుంచి వంద దాటేవరకూ ఎలాంటి పేమెంట్లు ఉండవని ఒక అనుభవశాలి చెప్పారు. చూద్దాం. ఇప్పుడు కాకపొతే, రేపు, రేపు కాకపొతే మరో రోజు. కధలో చెప్పిన ఆత్మ విశ్వాసం వుంటే సాధించడం తేలిక కాకపోయినా మరీ అంత కష్టం కూడా కాదేమో!



 

Senior Journalist Bhandaru Srinivasa Rao Analysis on Telugu States Water dispute ...

1, జులై 2021, గురువారం

అన్నం పెట్టే చేతికి చేయూత –భండారు శ్రీనివాసరావు

(ఈరోజు రైతు దినోత్సవం)


రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి. కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి. ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు. ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు, వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’ రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!
ప్రభుత్వాలూ! ఆలోచించండి!

అంతరంగంలో ఆపేక్షలు – భండారు శ్రీనివాసరావు

 రామచంద్ర మూర్తికి కాలు నిలవడం లేదు. అమెరికానుంచి గోపీ పిల్లలూ వస్తున్నారన్న కబురు తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా వుంది. అప్పటికప్పుడు పెన్షన్ డబ్బులు బ్యాంకు నుంచి తీసి రెండో గదిలో ఏసీ పెట్టించాడు. పిల్లలకు సౌకర్యంగా వుండాలని బాత్ రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టించాడు. ప్రతి గదిలో దోమలు రాకుండా కిటికీలకి మెష్ పెట్టించాడు. భార్య మహాలక్ష్మి అంటూనే వుంది, ‘వాడేమన్న పరాయి వాడా, ఇక్కడపుట్టి ఇక్కడ పెరిగి వెళ్ళిన వాడేనాయే. అంతా మీ చాదస్తం’ అని. కానీ రామచంద్రమూర్తి చెవిన పెట్టలేదు. ‘అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, పరాయి దేశంలో కొత్త సౌకర్యాలకు అలవాటు పడి వస్తే ఇబ్బంది లేకుండా చూడ్డం మన ధర్మం’ అని నచ్చచెప్పాడు. ఈ లోగా అమెరికా నుంచి వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడింది. ఆయన హడావిడి మరింత పెరిగింది.

అక్కడ అమెరికాలో విమానం ఎక్కబోయేముందు గోపీ, భార్యాపిల్లలతో మరోసారి చెబుతున్నాడు.

చూడండి మనం చాలా ఏళ్ళ తరువాత బామ్మా తాతయ్యల దగ్గరికి వెడుతున్నాం. అక్కడ అన్నీ ఇక్కడి మాదిరిగా వుండవు. ఎలా వున్నా మనందరం సర్దుకు పోవాలి. వున్న మూడు నాలుగు వారాలు మనకేం ఇబ్బంది లేనట్టు గడిపి రావాలి. అది వసతిగా లేదు, ఇది లేదు అని సణగొద్దు. ఇండియాలో టాయిలెట్లు మన మాదిరిగా వుండవు. అయినా సరే నాలుగు రోజులు సర్దుకు పోదాం. అంతేకాని బామ్మను తాతయ్యను ఇబ్బంది పెట్టవద్దు. మనం వచ్చామన్న సంతోషం వాళ్లకు కలిగించాలి. వున్నన్నాళ్ళు పూర్తిగా వాళ్ళతోనే గడపాలి. సినిమాలు, షికార్లు ఏవయినా మళ్ళీ తిరిగి వచ్చిన తరువాతే సుమా!’