23, జూన్ 2021, బుధవారం

రేవంత్ రెడ్డికే టీపీసీసీ - Political Analyst Bandaru Srinivas on Revanth...

ముఖ్యమంత్రి కితాబు

 (జిల్లా కలెక్టర్ ను ఒక గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపధ్యంలో గుర్తుకొచ్చిన పాతికేళ్ళ నాటి జ్ఞాపకం) 

విరిగిన కాలుతో ఇంట్లో ‘కాలుక్షేపం’ చేస్తున్న రోజుల్లో నా కాలక్షేపం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

(23-06-2021)

 

22, జూన్ 2021, మంగళవారం

విని తీరాల్సిన కేసీఆర్ ప్రసంగం – భండారు శ్రీనివాసరావు

 ఉద్యమ కాలంలో సరే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాసనసభలోను, బహిరంగ సభలలోను అనేకానేక అద్భుత ప్రసంగాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు వాసాలమర్రి గ్రామ సభలో చేసిన ప్రసంగం ఒక ఎత్తు.

ఆయన ఈ సభలో కేవలం ప్రసంగం మాత్రమే చేశారని నాకు అనిపించలేదు.

దత్తత తీసుకున్న తీసుకున్న తండ్రి పిల్లవాడికి సుద్దులు చెప్పినట్టు ప్రజలకు  అనేక హిత బోధలు చేశారు.  ఒకరకంగా చెప్పాలంటే అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో సూక్తులు వున్నాయి. సలహాలు వున్నాయి. హితోక్తులు వున్నాయి. హెచ్చరికలు వున్నాయి. హామీలు వున్నాయి. వరాల జల్లులు  వున్నాయి. సుతిమెత్తని చీవాట్లు వున్నాయి. కానీ ఎక్కడా దాష్టీకం లేదు. పైపెచ్చు అధికారులని, అనధికారులని పేర్లతో సంబోధిస్తూ, వారి సేవలని ప్రశంసిస్తూ అందరినీ కలుపుకుపోయే ఒక సమర్ధ నాయకుడిగా ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఆసాంతం చూడని వారికి ఈ వాక్యాల్లో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు. చూడకపోతే నేనూ అలాగే అనుకునేవాడిని.

బహుశా ఆయన ప్రసంగం రేపు పత్రికల్లో వివరంగా రావచ్చు. ఆయన చెప్పినవన్నీ ఇక్కడ రాయడం సాధ్యం కాని పని.

అయినా ఒక విషయంతో ముగిస్తాను.

ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు.

ఇలాంటివి ఒక్క కేసీఆర్ కే సాధ్యం. సందేహం లేదు.

తోకటపా: సుదీర్ఘ ప్రసంగ సమయంలో, ఉక్కపోతకు చేతిలో వున్న కాగితాలతో విసురుకున్నారే కానీ, అక్కడ ఎవరిమీదా విసుక్కోలేదు.

(22-06-2021)

కార్పొరేట్ వైభోగం

 

లాప్ టాప్  మీద టిక్కూ టిక్కూ అని కొట్టుకుంటూ, అప్పుడప్పుడు నడుం నొప్పి పుట్టి,  వెనక్కీ ముందుకూ ఆపసోపాలు పడడం మా పిల్లల కన్తపదినట్టుంది. అంతే!

లాక్ డౌన్ ఎత్తేసిన రోజునే బయటకు వెళ్లి ఓ నలభయ్ వేలు పోసి (అదే కార్డు గీకి) ఓ కుర్చీ, టేబుల్ కొన్నారు.

వాటిని ఈరోజు డెలివరీ ఇచ్చారు.



ఆ కుర్చీలో కూచుని, బల్ల మీద లాప్ టాప్ పెట్టుకుని టైప్ చేస్తుంటే ఈ వయసులో కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది.

థాంక్స్ నిషా! థాంక్స్ సంతోష్!

(22-06-2021)

Senior Journalist Bhandaru Srinivasa Rao Give's Clarity On Lokesh Twitte...

అంతయు మన మేలునకే - భండారు శ్రీనివాసరావు

 'అమ్మగారు ఈ రోజు ఇల్లూడ్చి వెళ్లిపోతా, నేనూ మా ఆయనా మార్నింగ్ షోకెడదామనుకున్నాం'

'ఓస్! అదెంత భాగ్యం, భాగ్యం! ఈ మాత్రానికే ఇంత ఇదయిపోయి అడగాలా ఏమిటి. ఇంట్లో పనిదేముంది ? ఒక్క రోజు నడుం వంచి అంట్లు తోమితే నేనేమయినా అరిగి పోతానా, కరిగిపోతానా చెప్పు. అలాగే వెళ్ళు. భాగ్యం. అన్నట్టు ఓ యాభయ్ ఇస్తా. దగ్గరుంచు, సినిమా హాల్లో పనికొస్తాయి'

కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్నాడు, ఏకాంబరం. దేవుడు చెవులకు బిరడాలు పెట్టలేదు కదా! అందుకే, పనిమనిషి భాగ్యం, అతడి భార్య నీలాంబరి నడుమ జరిగిన సంభాషణ పొల్లు పోకుండా అతగాడి చెవిన పడింది. 'ఇదేమిటి మా ఆవిడేనా అలా మాట్లాడింది' అంటూ ఓరకంట తేరిపారచూశాడు. యాభయ్ నోటు పనిమనిషి చేతిలో పెడుతూ కన్పించింది నీలాంబరి. సందేహం లేదు కనిపించింది ఆవిడే. విన్నది ఆవిడ మాటలే.

అలా రోజంతా నీలాంబరిలో ఆ మార్పు ఏమాత్రం మార్పులేకుండా గంట గంటకూ వరదగోదారిలా పెరుగుతూ పోతోందే కాని ఏమాత్రం తగ్గేసూచనలు కానరావడం లేదు. పిల్లలు ఛానల్ మార్చి క్రికెట్ చూడాలని అంటే మామూలుగా అయితే సీరియల్ వస్తోంది మార్చడానికి వీల్లేదంటే వీల్లేదని పట్టుబట్టే శ్రీమతి నీలాంబరి ఆరోజు మాత్రం 'వెధవ సీరియల్ రోజూ వుండేదే, ఒకరోజు చూడకపోతే కొంపలేమీ మునిగిపోవన్న'ట్టు నీతులు చెబుతుంటే విని, పోతున్న ఏకాంబరం మతి మరికాస్త చక్కా పోయింది.

పనిమనిషితో, వాచ్ మన్ తో, పూలవాడితో, పాలవాడితో నీలాంబరి వ్యవహరించే తీరు, మాట్లాడే పధ్ధతి పూర్తిగా మారిపోవడంతో వూరువాడకు అదో టాపిక్ పాయింటు అయివుంటుంది. టీవీల్లో స్క్రోలింగు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో సందేహం లేదు. ఇంతగా ఇంత మారిపోయిన మనిషిని కారణం అడుగుతే ఇంతెత్తున లేస్తుందేమో అన్న భయం పూర్తిగా తొలగిపోయాక, ఈ మార్పు శాశ్విత తాత్కాలికమనో, తాత్కాలిక శాశ్వితమనో నిర్ధారించుకున్నాక ఇక వుండబట్ట లేక అడిగేశాడు ఏకాంబరం, 'అసలీ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిట'ని.

ముందు మందహాసం. తరువాత ప్రశాంత వదనం. ఆ తదుపరి ఇల్లాలి అనుగ్రహభాషణం ఇలా సాగిపోయాయి.

'ఎప్పుడూ ఆ ఫేసుబుక్కో మరో బుక్కో అంటూ ఆ కంప్యూటర్ ముందు మఠం వేసుకుని కూర్చోకండి మొర్రో అంటే నా మాట ఎప్పుడు విన్నారు కనుక. నేను చూడండి, సీరియల్ కోసం నిన్న టీవీ పెడితే ఒకటే యోగా గోల. ఎన్ని ఛానళ్లు మార్చి చూసినా యోగా మాత్రం మారలేదు. దాంతో దాని సంగతేమిటో చూద్దామని ఇష్టం లేకపోయినా చూస్తూ పోయాను. బోలెడు మంది యోగా గొప్పతనం గురించి బోలెడు బోలెడు చెబుతూ పోయారు. యోగా చేస్తే కరెంటు పోయి మళ్ళీ వచ్చినట్టు మన శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రవహిస్తాయట. మంచి భావాలు, మంచి ఉద్దేశ్యాలు వాటంతట అవే కలుగుతాయట.'

'అది సరే! అవి యోగా చేసే వాళ్లకేమో. మరి నీ సంగతేమిటి? నువ్వెప్పుడు నేర్చుకున్నావు'

'నేర్చుకోవడమా నా బొందా! రోజంతా టీవీల్లో అదేపనిగా అవే చూపెడుతుంటే అవి చూసిన నా వొంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ, వానొచ్చినప్పుడు వూళ్ళో సైడు కాలవలో నీళ్ళ మాదిరిగా పొంగుతూ ప్రవహిస్తోంది సుమా!'

'ఇదా! కధ! పోనీలే! అంతయు మనమంచికే అన్నారు' అనుకున్నాడు ఏకాంబరం దీర్ఘశ్వాస తీసుకుంటూ.



కార్టూనిస్ట్ అర్జున్ (గోతెలుగు డాట్ కామ్) కు కృతజ్ఞతలతో

Senior Journalist Bhandaru Srinivasa Rao About MP Raghu Rama Krishna Raj...