26, మే 2021, బుధవారం
ఏఎన్నారా! ఎన్టీఆరా !
25, మే 2021, మంగళవారం
రామజోగి మందు
కొద్దిసేపటి క్రితం ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరుడు ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడినప్పుడల్లా నాకు రాసుకోవడానికి ముడి సరుకు లభిస్తుంది. ఆయన ఫేస్ బుక్ లో లేరు. అమెరికాలో వున్న వారి పెద్దమ్మాయి శారద అప్పుడప్పుడూ ఫోన్ చేసి నా పోస్టుల ప్రస్తావన కూడా తెస్తుంటుంది. ఆవిధంగా కృష్ణారావు గారెకి జ్వాలా దంపతులు కరోనాకు గురై రామనామంతో క్షేమంగా బయట పడడం తెలిసింది.
ఆయనే ఈ రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు
కీర్తనలలో ఇదొకటి.
రామజోగి మందు కొనరే ఓ జనులారా అంటూ రామదాసు పాడిన
ఓ కీర్తనలో రామనామం ఓ మంచి ఔషధం అని
పేర్కొన్నట్టు తెలిపారు.
ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు
తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన
ఇది:
“రామజోగి మందు కొనరే! ఓ జనులారా! రామజోగి మందు
కొనరే!
రామజోగి మందు మీరు ప్రేమతో పూజించరయ్య
కామక్రోధముల నెల్ల కడకు పారద్రోలు మందు
రామజోగి మందు కొనరే! ఓ జనులారా!
కాముక కర్మములనెల్ల ఎడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామిదాస యోగి మందు
రామజోగి మందు కొనరే!
భద్రాద్రి యందు తుదకు ముక్తిని పొందించే మందు
రామదాసు సద్భక్తితో కొలిచే మందు
రామజోగి మందు కొనరే! ఓ జనులారా!”
ఇదీ కొంచెం అటూఇటుగా రామదాసు గారు పాడిన కీర్తన
రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (కరోనా చికిత్స
సమయంలో సతతం రామ రామ అని భజించడం)
జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారు ఉవాచ.
(25-05-2021)
ఫ్రాడ్ ని మించిన ఫ్రాడ్
“సేల్ డీడ్ పత్రాలు పోగొట్టిన బ్యాంక్ – రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా కమిషన్ తీర్పు”
ఇది ఈరోజు పత్రికలో వచ్చిన వార్త
ఇప్పుడు ఈ వార్త వెనక కధ చెప్పుకుందాం.
రవి, కళావతి ఇద్దరు వృద్ధ దంపతులు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి
చేసి పంపారు. ఓ పాతికేళ్ళ క్రితం కాబోలు ఇప్పుడు మేముంటున్న అపార్ట్ మెంటులో ఒక
వాటా కొనుక్కున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటి మీద రుణం తీసుకున్నారు. అప్పు
ఇచ్చింది బ్యాంకు ఆఫ్ మైసూరు. తీర్చే టైముకు దాన్ని స్టేట్ బ్యాంకులో
విలీనం చేశారు.
అసలు ఫాయిదాలు కట్టాము కనుక మా ఇంటి పత్రాలు మాకు వాపసు
చేయమని కోరారు. అవి కనబడడం లేదన్నారు బ్యాంకు వాళ్ళు. వున్న ఒక్క ఇంటికీ పత్రాలు
లేకపోతె ఎల్లా అని బ్యాంకు చుట్టూ
తిరిగారు. ఫలితం శూన్యం.
ఎవరో సలహా ఇస్తే ఇంటికి దగ్గరలో వున్న ప్రమోద్ అనే ఒక
లాయర్ను పట్టుకుని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.
తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది.
అయితే అసలు కధ ఇక్కడే మొదలయింది.
రెండు రోజుల క్రితం బ్యాంకు వాళ్ళం అంటూ ఎవరో ఫోన్
చేశారు. మీ కాగితాలు దొరికాయి, మీరు బ్యాంకుకు రాయనక్కరలేదు, మేమే వచ్చి ఇస్తాము’ అన్నారు.
వీళ్ళ సంతోషానికి అవధులు లేవు.
అన్నట్టే వచ్చారు. పత్రాలు ఇచ్చారు. ముట్టినట్టు సంతకాలు
చేయించుకుని వెళ్ళిపోయారు.
ఇది జరిగింది నిన్న. అంటే మే ఇరవై మూడున.
ఈరోజు ఈనాడు దినపత్రిక పదమూడో పేజీలో పైన చెప్పిన వార్త
వచ్చింది. వీళ్ళు పడిన మానసిక సంక్షోభానికి
పరిహారంగా అయిదు లక్షలు బ్యాంకు చెల్లించాలని.
వీళ్ళు ప్రతిరోజూ ఈనాడు పత్రిక తెప్పించుకుంటారు. కోవిడ్
బారిన పడినప్పటి నుంచి ఇంటి ముందు దాన్ని కొన్ని గంటలు ఎండలో వుంచి ఆ తరువాత
చదువుతారు. ఆవిధంగా అయిదు లక్షల నష్టపరిహారం వార్త ఆలస్యంగా తెలిసింది.
ఇన్నాళ్ళు కనబడని కాగితాలు నిన్న మొన్నట్లో ఎలా
దొరికాయి. సాధారణంగా బ్యాంకుకు వచ్చి తీసుకువెళ్ళమనే వాళ్ళు ఇంటికే వచ్చి
ముట్టినట్టు ఎందుకు రాయించుకు
వెళ్ళారు.
ఈ ప్రశ్నలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
కొద్దిసేపటి క్రితమే నాకీ సంగతి తెలిసింది. విషయం కనుక్కుందామని
ఈనాడు బ్యూరోలో పెద్ద బాధ్యతలు చూస్తున్న ఉండ్రు నరసింహారావు గారెకి ఫోన్ చేశాను. నా
గురించి ప్రవర చెప్పకుండానే, ఆయన నన్ను
గుర్తుపట్టి విషయం విని మా వాళ్ళ చేత మీకు ఫోన్ చేయిస్తామని చెప్పారు.
కొద్దిసేపటికే ప్రశాంత్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా ప్రశాంతంగా నేను చెప్పింది
విన్నారు.
చూడాలి ఈ కధ ఏ మలుపులు తిరుగుతుందో!
(24-05-2021)
23, మే 2021, ఆదివారం
పరమాచార్య పావనగాధలు
కోర్టు గుమ్మం జైలు గడప
‘మరుపు’ మంచిదే!
‘గుర్తు
పట్టారా’ అంటూ
సరిగా తెల్లవారకుండానే ఫోన్లో
పలకరిస్తుంది ఓ గొంతు. మధ్యాన్నం ఏ కూరతో అన్నం తిన్నానో సాయంత్రానికి గుర్తుండని గొప్ప
జ్ఞాపక శక్తి నాది. జుట్టు పీక్కున్నా
గుర్తు రాదు.
కానీ కధ అంతటితో ఆగదు.
‘నేనెవరో చెప్పుకోండి చూద్దాం’ అంటుందా గొంతు
అవతల నుంచి.
పొద్దున్న పొద్దున్నే ఈ అగ్ని పరీక్ష ఏవిటని
వాపోవడం ఇవతల మన వంతు.
మనం గుర్తు పట్టడం, మనల్ని గుర్తు పట్టడం ఈ రెండూ ఏదో
ఒకరోజున అందర్నీ వేధించే సమస్యలే అనిపిస్తుంది ఈ పాడు లోకంలో.
నిన్న సాయంత్రం ఒక పెద్దాయన ఫోన్ చేశారు, ఓ
అరవై మంది అనాథాశ్రమం వాళ్లకు వాక్సిన్ వేయించాలి ఎలా అని.
ఒకప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ప్రత్యేక
ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా ఏదో సేవ చేయాలనే తపన.
ఆయన చెప్పిన మాటలు వింటుంటే బాధ వేసింది.
గతంలో అలవాటు చొప్పున పెద్ద అధికారులకి ఫోన్ చేసి
చెబుదామని ప్రయత్నిస్తే ‘సారు బిజీగా వున్నారు, మీరు ఫోన్ చేశారని తర్వాత చెబుతాను’
అన్నాడట ఆ అధికారి పియ్యే.
ఆయన కంటే ముందు రిటైర్ అయినవాడిని నేను. కనీసం
ఆయనకీ ఫోన్ నెంబర్లు అన్నా తెలుసు, నాకదీ తెలియదు.
రోలు, మద్దెల సామెత జ్ఞాపకం వచ్చింది.
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా చేసిన వీవీ
శాస్త్రి గారు ఒక మాట చెప్పేవారు. ‘మనం సర్వాధికారాలు చెలాయించిన ఆఫీసుకి రిటైర్
అయిన తర్వాత తరచుగా, అదీ పని లేకుండా పోకూడదు’ అని.
ఎందుకంటే కొత్త అధికారులు వస్తారు. పాత
అధికారులని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం పాత సిబ్బందికి వుండదు. అది సహజం అని
సరిపెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతె
మిగిలేది మనస్తాపమే.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా రెవెన్యూ వంటి కీలక శాఖలను
నిర్వహించిన శ్రీ పీ. నరసారెడ్డి చాలా
కాలం క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత
పరిచయం వుండేది. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా
మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది.
అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా
వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన
మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ
వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు.
నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా
పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు
తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. కానీ ఇందిరాగాంధి వంటి గొప్పనాయకులని
తలచుకుంటే, వారితో పోల్చుకుంటే నా పరిస్తితి చాలా మెరుగు’
ఇలాంటిదే మరో వ్యధాభరిత కధ
ఆయన చాలా కాలం ఒక పెద్ద కార్యాలయానికి ప్రధానాధికారిగా పనిచేశారు.
ఆయన కనుసన్నల్లో వందలాదిమంది సిబ్బంది పనిచేసేవారు. రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళకు ఏదో పని వుండి ఆ
ఊరు వెళ్ళారు. తన పొజిషన్ లో పనిచేస్తున్న మరో అధికారి బాగా తెలిసిన వాడు కావడంతో
వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని పాత విషయాలు తిరగేసుకున్నారు.
ఈలోగా ఆఫీసు టైం కావడంతో కొత్త అధికారి పాత అధికారిని మీరు కూడా రండి
మన ఆఫీసును చూద్దురు కాని అని కోరడంతో ఆయన కూడా కారెక్కి వెంట వెళ్ళాడు.
ఆ ఆఫీసులో ఒక పద్దతి ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్నారు.
ప్రధానాధికారి ఇంటి నుంచి బయలుదేరగానే ఆయన పర్సనల్ స్టాఫ్ అలర్ట్
అవుతారు. ఆఫీసుకు చేరగానే సెక్యూరిటీ చీఫ్ ఫుల్ సెల్యూట్ తో ఆయన్ని కారు వద్దనే రిసీవ్ చేసుకుని, బ్రీఫ్ కేసు
తీసుకుని వెంట వుండి లిఫ్ట్ దగ్గరకు తీసుకువేడతాడు. ఆ
అధికారి వచ్చేదాకా లిఫ్ట్ ను గ్రౌండ్
ఫ్లోర్ లోనే నిలిపి సానిటైజ్ చేసి ఉంచుతారు.
లిఫ్ట్ బాయ్ నమస్కారం పెట్టి పైకి తీసుకువెడతాడు.
సరే! ఇదంతా ఆ రోజు అక్కడ పద్దతి ప్రకారం జరిగింది. విచిత్రం ఏమిటంటే
అప్పటికి కొన్నేళ్ళ క్రితం ఆ పాత అధికారిని కూడా సకల లాంఛనాలతో ఇలాగే రిసీవ్ చేసుకునేవారు. ఆయనా
ఈ వైభోగం అనుభవించిన వాడే.
ఇవ్వాళ కూడా అదే మనిషి. అదే
అధికారులు. అదే సిబ్బంది. కనీసం వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని గుర్తు
పట్టినట్టు కనీసం నటించను కూడా లేదు.
భగవద్గీతలో చెప్పిన మాదిరిగా మానవుడు జీర్ణమై పోయిన పాత ఉడుపులు వదిలేసి కొత్త
వస్త్రాలు ధరించినట్టు, ఉద్యోగాలు కూడా.
కావున, ఓ పార్దా! పాత ఉద్యోగాల వైభోగం కోసం వర్తమానంలో శోకించుట తగదు. మరచిపోవుట మేలు.
(23-05-2021)
22, మే 2021, శనివారం
ఏ నిమిషానికి ఏమి జరుగునో .....
'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా లేదు'
అపోలో ఆసుపత్రిలో
పనిచేస్తున్న డాక్టర్ బాబీ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా
అయిపొయింది.
ఆవిడ నిజానికి
శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు. కొన్నేళ్ళ క్రితం శాస్త్రి గారు, ఆయన భార్య
పుణ్యవతిగారితో కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే
మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి
కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ
కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి కొన్ని వారాలు
కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు.
శాస్త్రిగారు
హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి
అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఆసుపత్రిలో వాళ్ళ
అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని
గంటలు పట్టేట్టు ఉందన్నారు. అదేమిటో కాసేపటి
కిందటి దాకా ఆవిడ 'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే మనిషి. ఆ కాస్తా
తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో 'కట్టె'. అంతే.
శాస్త్రి గారిని
తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను.
కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో కనిపించని వేదాంతం వుంది.
"యాభయ్ ఆరేళ్ళు
నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు
చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా
చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ
ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది.
బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు బిల్లు తీసుకుని
ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా చేతిలో పెట్టారు.
వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత
కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన. ఇంట్లో గిరగిరా
తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని
తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు
దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో
శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు
ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని
పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి
బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో
తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.
'బహుశా నేను అలా
అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం
లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు
ఈసారి నీళ్ళు నా
కళ్ళల్లో.
ఇది జరిగి ఆరేళ్లు అయింది.
మరో నాలుగేళ్ళలో నా పరిస్థితి
అలానే అవుతుందని అనుకోలేదు.
రెండేళ్ల క్రితం, 2019 ఆగస్టులో మా ఆవిడకి రెండ్రోజులు జ్వరం. నిజంగా పెద్ద జ్వరమేమీ కాదు.
టెంపరేచర్ వంద దాటలేదు.
ఆరోజు ఉదయం కూడా ఓ టీవీ చర్చకు వెళ్లి వచ్చాను. సాయంత్రం ఏదో టీవీ వాళ్ళు
రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. రాత్రి భోజనం తర్వాత (ఇంగ్లీష్ వైద్యం వాళ్లకి పథ్యం
లేదు, జ్వరం వున్నా కాస్త ఎంగిలి పడమనే చెబుతారు) నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాడిన
పాత సినిమా పాటలు వినడం, మావాడు, కోడలు ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక
అలవాటుగా మారింది. ఆ రోజు కార్డ్సు ఆడాలని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. విచిత్రంగా
ఘంటసాల భగవద్గీత మొదలయింది.
తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం.
తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్
తెమ్మంది. అత్తయ్య గారి పొటో
పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు.
మంచినీళ్ళు, కాదు కాదు, ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా
తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు
పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో
అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అపోలో ఆసుపత్రికి
తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే.
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు.
నిజంగా ఇలా కూడా మనుషులు
చనిపోతారా!