22, మే 2021, శనివారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో .....

 'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా లేదు'

అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బాబీ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.

ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు. కొన్నేళ్ళ క్రితం శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు.

శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.

ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు. అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ 'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో 'కట్టె'. అంతే.

శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో కనిపించని వేదాంతం వుంది.

"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన. ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'

శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.

నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.

'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు

ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.

ఇది జరిగి ఆరేళ్లు అయింది.

మరో నాలుగేళ్ళలో  నా పరిస్థితి అలానే అవుతుందని అనుకోలేదు.

రెండేళ్ల క్రితం, 2019 ఆగస్టులో మా ఆవిడకి రెండ్రోజులు జ్వరం. నిజంగా పెద్ద జ్వరమేమీ కాదు. టెంపరేచర్ వంద దాటలేదు.

ఆరోజు ఉదయం కూడా ఓ టీవీ చర్చకు వెళ్లి వచ్చాను. సాయంత్రం ఏదో టీవీ వాళ్ళు రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. రాత్రి భోజనం తర్వాత (ఇంగ్లీష్ వైద్యం వాళ్లకి పథ్యం లేదు, జ్వరం వున్నా కాస్త ఎంగిలి పడమనే చెబుతారు) నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాడిన పాత సినిమా  పాటలు వినడం, మావాడు, కోడలు ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన తర్వాత   ఒక అలవాటుగా మారింది. ఆ రోజు కార్డ్సు ఆడాలని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది.

తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు, ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!



(కాశీ యాత్రలో ఒక చోట పుణ్యవతి గారు, నా భార్య నిర్మలతో నేను)

  

 

21, మే 2021, శుక్రవారం

ఓ రామ నీ నామమెంతో రుచిరా!

 “కలియుగంలో మానవుల  శక్తి సామర్ధ్యాలు అతిస్వల్పం. వారికి జవసత్వ్వాలు కలిగించే విధానం ఏమైనా ఉందా” అని పార్వతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడిని అడిగింది. దానికి ఈశ్వరుడు, “లేకేమి! వుంది. అది రామనామం. దాన్ని భజిస్తే శరీరం సర్వ శక్తి సంపన్నం అవుతుంది” అని సెలవిచ్చారు.

ఆ మాట నూటికి నూరు శాతం నిజమంటున్నాడు పదిహేను రోజులు కరోనాతో పోరాడి ఈరోజే దాని కబంధ హస్తాల నుంచి విడుదల అయిన మిత్రుడు జ్వాలా నరసింహారావు. ముందు ఆయన భార్య నా మేనకోడలు అయిన విజయలక్ష్మి,  వారి అమ్మాయి టీవీ నైన్ ప్రేమ మాలిని, ఆ వరుసలోనే చివర్లో జ్వాలా అందరూ కరోనా చేతికి చిక్కారు. పదిహేను రోజులు ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉంటూ కరోనాను ఎదుర్కున్నారు. విజయవంతంగా బయట పడ్డారు. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురూ రెండు డోసులు వాక్సిన్ తీసుకుని రెండు నెలలు అవుతోంది. వాక్సిన్ తీసుకోవడం వల్లనే నెగిటివ్ ఎఫెక్ట్స్ తీవ్రత అదుపులో వుందని డాక్టర్ల ఉవాచ.

జ్వాలా చెబుతోంది ఒక్కటే. ముందు పరమేశ్వరుడు చెప్పిన రామనామం. ఈ పదిహేను రోజులు తమ నాలుకల మీద నిర్విరామంగా రామ రామ అనే పదాలు ఆడుతూనే వున్నాయని అంటూ,  భగవత్ కృప, దానితో పాటు   నారాయణుడి రూపంలో కొందరు డాక్టర్లు తాము కోలుకోవడానికి దోహద పడ్డారని చెప్పాడు.

డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ గంగాధర్ (నిమ్స్), డాక్టర్ రామకృష్ణ, డాక్టర్, కిషోర్, డాక్టర్ మనోహర్ ఈ పదిహేను రోజులు తమని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటూ ఫోనులో తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారని జ్వాలా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే కరోనా రోగులు మసిలే వార్డుల్లో నర్సులు ధరించే ప్రత్యేక రక్షణ దుస్తులు వేసుకుని సర్వెంట్ మెయిడ్ అనిత తమకు ఎనలేని సాయం అందించిందని చెప్పాడు.

కరోనాతో  పోరాటానికి కావాల్సిన ఆత్మబలాన్ని తమకు రామనామం ప్రసాదించిందని ఆయన నమ్మకం. కరోనా ఐసోలేషన్ కాలంలోనే జ్వాలా,  ప్రతి శని వారం, ఆదివారం హైదరాబాదు ఆకాశవాణికి గత ఏడాది కాలంగా ప్రసార నిమిత్తం అందిస్తూ వచ్చిన రామాయణ రసరమ్య గాధలు ధారావాహికకు ఆటంకం కలగకుండా  ఫోను ద్వారా రికార్డు చేయడం ఇందుకు ఉదాహరణ.

మరో ఉదాహరణ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన  జ్వాలా రాసిన  వ్యాసం ‘ సర్వ జగత్తూ భగవత్ సృష్టే.



(21-05-2021)

తరుముకొచ్చిన మృత్యువు

 (రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో నా వ్యాసం)

మృత్యుపాశం చాలా బలమైనది. పలానా చోట చావు రాసిపెట్టి వుంటే, వేల మైళ్ళ దూరంలోని వ్యక్తిని కూడా ఆ పాశం పట్టేసి అక్కడికి లాగేస్తుంది. రాజీవ్ విషయంలో అదే జరిగింది.
1991 లో లోకసభకు మధ్యంతర ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచి మరోమారు ప్రధాని కాగలనే నమ్మకంతో నాటి కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధి దేశ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై వున్నారు. అందులో భాగంగా హైదరాబాదు, విశాఖ పట్నాల్లో ఎన్నికల ర్యాలీలు పెట్టుకున్నారు. మే నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరుగంటలకు విశాఖ నుంచి మద్రాసు వెళ్ళాల్సి వుంది. గెస్ట్ హౌస్ నుంచి విమానాశ్రయానికి వెడుతుండగా పైలట్ నుంచి మెసేజ్ వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ప్రయాణం వీలుపడదని. రాజీవ్ నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఆ రాత్రి విశాఖ గెస్ట్ హౌస్ లో వుండి మర్నాడు మద్రాసు వెళ్ళాలి. ప్రయాణం ఇలా వాయిదా పడడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఏమైనా సరే వెళ్లి తమిళనాడులో ఎన్నికల ప్రచారం కొనసాగించాలని ఆయనకు మనసులో బాగా కోరిక. కానీ ఏం చేయాలి.
ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓ మెసేజ్. లోపం సరిచేసారు, ఎయిర్ పోర్టుకు వస్తే మద్రాసు వెళ్ళ వచ్చని. రాజీవ్ మనసులో కోరుకున్నట్టే జరిగింది కాబట్టి క్షణం ఆలస్యం చేయకుండా కారును వెనక్కి తిప్పమని ఆదేశించారు. ఈ తొందరలో మరో వాహనంలో వస్తున్న తన ప్రధాన భద్రతాదికారి ఓపీ సాగర్ కి ప్రయాణంలో మార్పు గురించి తెలియచెప్పలేదు.
చివరికి సొంత సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే రాజీవ్ మద్రాసు వెళ్ళిపోయారు. (చాలా మందికి సందేహం కలిగే విషయం. మాజీ ప్రధాన మంత్రి సెక్యూరిటీ విషయంలో పైకి కనపడని లోపం ఏదో జరిగినదని అనిపిస్తుంది, ప్రయాణం చేస్తున్నది ప్రత్యేక విమానం అయినప్పుడు వ్యక్తిగత భద్రతాసిబ్బందికి కబురు చేసి వెంట తీసుకు వెళ్ళవచ్చు కదా అని. అధికారిక ఏర్పాట్ల పరంగా చూస్తే ఇదో లోపం. కర్మను నమ్మేవారికి విధి ఆడిన నాటకం)
రాజీవ్ మద్రాసు చేరుకొని అక్కడినుంచి ఎన్నికల సభ జరిగే శ్రీ పెరంబదూర్ చేరుకునే సరికి రాత్రి పది గంటలు దాటింది. సభికులవైపు చేయి ఊపుతూ రాజీవ్ వేదిక వైపు వెడుతున్నారు. మహిలళ గేలరీలో స్త్రీలు రాజీవ్ ను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ సందడిలో ఓ ముప్పయ్యేళ్ల మహిళ రాజీవ్ వైపు దూసుకురాబోయింది. ఈ లోగా అనసూయ అనే లేడీ పోలీసు ఆమెను అడ్డగించింది. ఇది గమనించిన రాజీవ్ ‘ఏం పర్వాలేదు, రానివ్వు’ (Don’t worry, relax!) అంటూ ఆ పోలీసును వారించారు.
రాజీవ్ గాంధి జీవితంలో ఆఖరుసారి మాట్లాడిన మాటలు ఈ రెండే.
తన మరణం గురించి ఏడేళ్ల నాడు రాజీవ్ చెప్పిన మాటలు మరుక్షణంలోనే నిజమయ్యాయి. రాజీవ్ గాంధీ పాదాలకు నమస్కారం చేయడానికి ఆ మహిళ ముందుకు వంగింది. రాజీవ్ వద్దని వారిస్తూ పైకి లేపుతున్నప్పుడు తన శరీరానికి అమర్చుకున్న బాంబులు పేలేలా మీటను నొక్కింది. అంతే! భయంకర విస్పోటనం. ఏం జరిగిందో తెలిసేలోగా జరగరానిది జరిగిపోయింది. రాజీవ్ శరీరం దూరంగా ఎగిరిపడింది. తల గుర్తు పట్టడానికి వీల్లేకుండా పేలిపోయింది. ఆ ప్రాంతం అంతా ఏడ్పులు, రోదనలతో రణరంగాన్ని తలపించింది.
అదే రాత్రి ఢిల్లీలో నిద్ర పోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో సోనియా గాంధీకి ఒక ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘అంతా కులాసే కదా!’ అని అడిగి ఫోన్ పెట్టేయడంతో ఆవిడ కంగారు పడింది. కొద్దిసేపటి క్రితమే ఆమె వ్యక్తిగత కార్యదర్శి జార్జ్ ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తే అది ఎంగేజ్. ఆ సమయంలో మద్రాసు నుంచి జార్జికి కబురు తెలిసింది. వెంటనే జార్జ్ 10 జనపద్ నివాసానికి వెళ్ళాడు. విషయం తెలిసి సోనియా దుఖం కట్టలు తెంచుకుంది. ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ దుఃఖంలో ఉండగానే ఆమెకు అస్తమా అటాక్ వచ్చింది. ముందుగా తేరుకున్నది ప్రియాంక గాంధీ. వెంటనే మద్రాసు పోవడానికి ఏర్పాట్లు చూడమని జార్జ్ తో చెప్పింది. ఈలోగా రాజీవ్ హత్య సంగతి తెలుసుకున్న రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సోనియాను ఫోనులో పరామర్శించారు. మద్రాసులో పరిస్థితులు బాగాలేవని, ప్రయాణం మానుకొమ్మని సలహా చెప్పారు. కానీ భర్త మరణ వార్త తెలిసిన తర్వాత ఉండబట్టలేక సోనియా ప్రియాంకను వెంటబెట్టుకుని మూడుగంటల్లో మద్రాసు చేరుకున్నారు. కానీ ఏం లాభం. రాజీవ్ శరీర భాగాలను శవపేటికలో భద్రపరచి ఉంచారు. గుర్తు పట్టడానికి తల కూడా లేదు.
తన మరణం గురించి రాజీవ్ జోస్యం
ఇందిరాగాంధి వద్ద చిరకాలం పనిచేసిన పీసీ అలగ్జాండర్ My Days With Indira అనే పుస్తకం రాసారు. ఇందిరాగాంధి తన సొంత సెక్యూరిటీ చేతుల్లో దారుణ హత్యకు గురైన తర్వాత ఆమెను హుటాహుటిన ఆలిండియా మెడికల్ సైన్సెస్ సంస్థకు తరలించారు. ఇందిర మరణించిన విషయం అప్పటికి వెల్లడి కాలేదు. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ లో సోనియా, రాజీవ్ గాంధీ నడుమ జరిగిన సంభాషణను యధాలాపంగా విన్నట్టు ఆయన ఆ పుస్తకంలో ఉటంకించారు.
ఇందిరాగాంధి మరణానంతరం తాను ప్రధాని కాగోరుతున్నట్టు రాజీవ్ తన మనసులోని మాట బయట పెట్టారు. దాన్ని సోనియా ససేమిరా కాదన్నారు. ‘వద్దు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు.వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు”
రాజీవ్ ఇలా బదులిచ్చారు. “అవును చంపేస్తారు. అది తథ్యం. మరి మార్గాంతరం ఏమిటి? ప్రధానిని కాకపోయినా చంపేస్తారు”
సరే! ఈ సంభాషణలో నిజమెంత అనేది తెలియదు. ఎందుకంటే సోనియా మీద అలగ్జాండర్ మహాశయులకు కొంత కినుక వుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను పార్టీ తరపున నామినేట్ చేయడాన్ని సోనియా వ్యతిరేకించిన విషయం ఆయన మనసులో పెట్టుకున్నారని, అంచేతనే ఇలాంటి కధలు సృష్టించారని అనేవాళ్ళు కూడా వున్నారు.
ఈ మొత్తం కధనంలో పేర్కొన్న వ్యక్తులు సోనియా, ప్రియాంక, మినహా ఎవ్వరూ ప్రస్తుతం జీవించి లేరు కాబట్టి ఇందులో రంధ్రాన్వేషణకు తప్ప సత్యాన్వేషణకు అవకాశం లేదు.
కావున, కాబట్టి చర్చించి వగచిన ఏమి ఫలము?

https://epaper.prabhanews.com/c/60583698

18, మే 2021, మంగళవారం

ధైర్య్యప్పిల్ల


మాకు తెలిసిన కుటుంబం కనుక పేర్లు చెప్పడం బాగుండదు. కానీ ఈ కరోనా కాలంలో నలుగురు తెలుసుకోవాల్సిన విషయం కనుక మిగిలిన వివరాలు రాస్తున్నాను.
అత్తా మామా, కొడుకూ కోడలు, వాళ్లకు ముగ్గురు పిల్లలు. అత్తామామలు పెద్ద వయసువాళ్ళు. మొగుడికి ఇంటి నుంచే పని. పిల్లలు కూడా అప్పటికి ఆన్ లైన్ క్లాసులు. కోడలు చదువుకున్నది చిన్నా చితకా చదువు కాదు. మంచి డాక్టరు. పైగా, కరోనా కాలంలో సెలవు దొరకని, తప్పనిసరిగా వెళ్ళాల్సిన ఉద్యోగం కూడా.
ఒకరోజు వృద్దురాలయిన అత్తగారికి గొంతులో నొప్పితో పాటు జ్వరం వచ్చింది. ఇంటిల్లిపాదీ కంగారు పడ్డారు. ఆసుపత్రి నుంచి వచ్చిన కోడలు ఏమాత్రం కంగారు పడకుండా, ‘మీకు వచ్చింది కరోనా కాదు’ అని గట్టిగా చెప్పింది. చెప్పింది డాక్టరు. నమ్మక పొతే ఎలా.
ఏదో వైద్యం చేస్తున్నట్టు బ్లడ్ సాంపిల్ తీసుకుంది. ‘కరోనా టెస్ట్ చేయిద్దాం’ అంటే అసలు ఆ అవసరమే లేదు. కొన్ని రోజులు విడిగా వుంటే చాలు అని వాళ్ళ పడక గదిలో అత్తగారిని వుంచి, మామగారి పడకను బయటకు మార్చింది. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే కానీ అత్తయ్యకు వచ్చింది కరోనా కాదు అని మళ్ళీ స్థిరంగా చెప్పింది.
రెండోరోజు పాజిటివ్ అన్న రిజల్ట్ వచ్చింది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మీకు వచ్చింది వేరే. నేను మందులిస్తాను, వేసుకోండి, కాకపొతే కొన్ని రోజులు విడిగా, ఒంటరిగా ఉండక తప్పదు అని తేల్చి చెప్పింది.
ఉదయం ఆసుపత్రికే వెళ్ళే ముందే ఆవిడకి అవసరమైన ఆహారం మందులు ఇచ్చి వెళ్ళేది.
తనకు వచ్చింది కరోనా అనే అనుమానం మనసు మూలల్లో ఉన్నప్పటికీ, కోడలు అంత గట్టిగా చెబుతుండేసరికి ఆ అనుమానం ఆవిరై పోయింది. ఎలాంటి భయం లేకుండా ఐసోలేషన్ లో రెండు వారాలు వుండి బయటకు వచ్చింది.
ఇప్పటికీ ఆమెకు తెలియదు, తనకు కరోనా వచ్చి తగ్గిపోయిందని. కోడలుకు తెలుసు, కరోన వచ్చిందని తెలిస్తే అత్తగారు అంత నిబ్బరంగా ఐసోలేషన్ లో గడపలేదని.
మొత్తానికి కోడలు పిల్ల ధైర్యం చేయబట్టి కధ సుఖాంతం అయింది.
(18-05-2021)

17, మే 2021, సోమవారం

టెర్రర్ పోలీస్ గబ్బర్ సింగ్ ఇక లేరు

 మూడున్నర దశాబ్దాల క్రితం హైదరాబాదు పాత బస్తీలో గబ్బర్ సింగ్ అంటే చాలు సంఘ విద్రోహశక్తులకు టెర్రర్.


(KSN MURTHY IPS)


గూండాల గుండెల్లో నిద్రపోతూ గబ్బర్ సింగ్ అనే పేరు తెచ్చుకున్న ఆ పోలీసు అధికారి అసలు పేరు కె.ఎస్.ఎన్. మూర్తి. నా మేనకోడలు భర్త ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామారావు గారెకి బ్యాచ్ మేట్. రాష్ట్రంలో అక్కడా ఇక్కడా కొన్నాళ్ళు పనిచేసి ఇద్దరూ దాదాపు ఒకేసారి హైదరాబాదు వచ్చారు. పాత బస్తీలో పక్కపక్క జోన్లలో ఎసీపీలుగా జాయిన్ అయ్యారు. ఇద్దరి అధికార నివాసాలు కూడా పక్కపక్కనే, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో.

ఆ విధంగా కె.ఎస్.ఎన్. మూర్తి గారు మా కుటుంబ సభ్యులు అందరికీ పరిచయం. మనిషి బొద్దుగా, ఎత్తుగా,  పోలీసు యూనిఫారంలో అయితే మరీ   భీకరంగా కానవచ్చేవారు. చిల్లర రౌడీలను, గ్యాంగ్ లీడర్లను సినిమాల్లో చూపించినట్టు ఉరికించి కొట్టేవాడని, ఆ రోజుల్లో వచ్చిన షోలే సినిమాలో పాత్ర గబ్బర్ సింగ్ అనే నిక్  నేమ్ ఆయనకు స్థిరపడి పోయిందని జనం చెప్పుకునే వారు. పోలీసు డిపార్ట్ మెంటులో పై అధికారులు కూడా ఆయన్ని అసలు పేరుతొ కాకుండా గబ్బర్ సింగ్ అని పిలిచేవారని ప్రతీతి.

ఒకసారి ఆయన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు ప్రకృతి ఆశ్రమంలో చేరి బరువు బాగా తగ్గారు. ఆ రూపంలో గుర్తుపట్టని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ‘ఏడీ మన గబ్బర్ సింగ్ రాలేదా ఈ  మీటింగుకు’ అని వాకబు చేశారట.

‘అదేమిటి ఇలా తగ్గిపోయారు, అలా భారీ మనిషిగా ఉంటేనే కదా రౌడీలు మిమ్మల్ని చూసి భయపడతారని అలాంటి చోట్ల పోస్టింగు ఇచ్చింది’ అని ఆశ్చర్యపోయారని సీతారామారావుగారు తన సహచరుడిని తలచుకుంటూ ఓ పాత జ్ఞాపకం పంచుకున్నారు

(16-05-2021).  

   

అద్దంకివారి గేదె

 ఇది ఇప్పటి సంగతి కాదు, అరవై ఏళ్ళ పైమాటే!

ఖమ్మంజిల్లా దెందుకూరు నివాసి అద్దంకి రాఘవయ్య గారికి గేదెలు అంటే ప్రాణం. ఎక్కడెక్కడో తిరిగి బర్రెలు కొనుక్కు రావడం ఆయనకో వ్యాపకం. ఒకసారి అదేపని మీద బెజవాడ వెళ్ళారు. అద్దంకి శ్రీరామ మూర్తి గారు ప్రముఖ రంగస్థల నటులు. వారి అబ్బాయి కృష్ణ ప్రసాద్. ఇప్పడు ఏం చేస్తున్నారో తెలవదు కానీ, కొన్నాళ్ళు రేడియోలో వార్తలు చదివారు.
బెజవాడలో అద్దంకి శ్రీరామమూర్తి గారి బర్రెను బేరమాడి కొనుక్కున్నారు దెందుకూరు రాఘవయ్య గారు. అలా వేరే చోట కొన్న పశువుల్ని సొంత ఊరు తీసుకువెళ్ళాలి అంటే ‘రహదారి’ రాయించాలి. అంటే ‘ఆ పశువును దొంగతనంగా తీసుకువెళ్ళడం లేదు, డబ్బు పెట్టి కొనుక్కు వెదుతున్నట్టు తెలిపే పత్రం’ అన్నమాట. ఆ రాదారి రాయిస్తుంటే క్రయవిక్రయదారుల ఇంటి పేర్లు ‘ఒక్కటే’ అన్న విషయం బయట పడింది. అప్పుడెవరో అన్నారుట. ‘ పరవాలేదు, అద్దంకివారి గేదె తిరిగి అద్దంకి వారి ఇంటికే వెడుతోంది’ అని.
నేను రాసిన రేడియో న్యూస్ రీడర్లు అనే కధనం చదివి, ఖమ్మం నుంచి అద్దంకి కృష్ణ ప్రసాద్ అనే పెద్దమనిషి ఫోను చేసారు. ఆయన రాఘవయ్య గారి కుమారుడు. హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. అద్దంకి శ్రీరామమూర్తి గారి తనయుడు కృష్ణ ప్రసాద్ కూడా రేడియోలో వార్తలు చదివారని ఆయనే నాకు చెప్పారు. ఈ విషయం నిజంగా నాకు తెలియదు. మొత్తంమీద ‘రహదారి’ గురించి ఒక కొత్త విషయం అయితే తెలిసింది. అంతే చాలు.

16, మే 2021, ఆదివారం

జీవితంలో కధలు

 జీవితంలో కొన్ని సంఘటనలు కధలకు ఏమాత్రం తీసిపోవు.

చాలా ఏళ్ళ క్రితం, 2005లో కాబోలు, తానా వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను.

‘ఎంతకాలం అమెరికాలో వుంటారు అనే ఇమ్మిగ్రేషన్ అధికారి ప్రశ్నకు ‘అయిదు రోజులు’ అని జవాబిచ్చాను. ‘ఫైవ్ డేస్ ఓన్లీ అన్నాడతగాడు ఒకింత ఆశ్చర్యంతో.  నిజానికి నా రిటర్న్ ఫ్లైట్ కూడా ఐదో రోజునే వుంది. తీసి చూపించాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు స్టాంప్ వేస్తూ.

బయటకి వచ్చి చూసుకుంటే ఆరు నెలలు అని వుంది. పదేళ్ల మల్టిపుల్ విజిటర్స్ వీసా నాది. అమెరికాలో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ అనుమతించే ఆరు మాసాల వ్యవధిని  నాకిచ్చినట్టు.

తానా సభలు జరిగే డెట్రాయిట్ నగరంలో విదేశాల నుంచి వచ్చిన అతిధులకు కొన్ని హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. పెద్ద ఆడంబరంగా లేకపోయినా గదిలో అన్ని వసతులు వున్నాయి. ఒక్కో గదిని  ఇద్దరిద్దరికి  చొప్పున కేటాయించారు. నాతొ పాటు గదిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ తో వున్నట్టు కనిపించాడు. మర్నాడు డెట్రాయిట్ మాజీ మేయర్ , కీర్తిశేషులు ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలవుతాయి.

అతడితో పెద్దగా మాట్లాడానికి నా దగ్గర కూడా విషయాలు లేవు. అంత పరిచయమూ లేదు. అయినా అతడి మొహంలో కనబడుతున్న  టెన్షన్ తగ్గించడానికి వివరాలు అడుగుతూ మాటల్లో పెట్టాను.

‘ఎవరికీ చెప్పకండి. నేను ఈ ఒక్క రాత్రే వుంటాను. తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను అన్నాడు. నాకు ఆశ్చర్యం. సభలకోసం వచ్చి తెల్లారి వుండననడం ఏమిటి?  ఎక్కడికి అని అడిగేలోగా అతడే అన్నాడు.

‘ఎక్కడికి పోవాలో సరిగ్గా నాకే తెలియదు. పలానా  చోటుకి వెళ్ళమని హైదరాబాదులో చెప్పారు. అదేమిటో ఎక్కడో ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్లి తీరాలి’ అన్నాడు.

‘సరిపడా డబ్బులు ఉన్నాయా అని అడిగాను. అడిగితే ఇవ్వడానికి నా దగ్గరా ఎక్కువేమీ లేవు. ఏదో అయిదు రోజులు, అదీ వాళ్ళ ఆతిథ్యంలో ఖర్చులు ఏముంటాయి అనే అభిప్రాయంతో ఎక్కువ డాలర్లు కూడా తెచ్చుకోలేదు.

‘అక్కరలేదు. నేను ఆ ఏర్పాటుతోనే వచ్చాను. ఓ మూడు నెలలకు సరిపడా డబ్బులు వున్నాయి. తర్వాత నా అదృష్టం’ అన్నాడతను.

మాటల్లో వివరాలు చెప్పాడు. అతడో ఎలిమెంటరీ స్కూలు టీచరు. పెద్ద సంసారం, చిన్న జీతం. ఎన్నాళ్ళిలా అనుకుంటూ వుంటే ఎవరో చెప్పారు, ‘అమెరికా వెళ్ళు, అది అవకాశాల దేశం, ఏదో ఒక పని దొరక్కపోదు అని.

‘ఎలా వెళ్ళడం?’ అంటే ...

‘అది కూడా అతడే చెప్పాడు. ఏదో ఒక విధంగా విజిటర్ వీసా సంపాదించి వెళ్ళు. ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే రోజుకిన్ని డాలర్లు, గంటకిన్ని డాలర్లు చొప్పున  ఇచ్చే వాళ్ళు వుంటారు. నీ ఖర్చులకు పోను ఇంటికి డబ్బులు కూడా పంపుకోవచ్చు అని ఉత్సాహ పరిచాడు

‘ఏమి చేయాలని ఆలోచిస్తున్న నాకు అతడిచ్చిన ఈ  సలహా మరేదీ ఆలోచించకుండా చేసింది. అంతే! ఉన్న కొంత పొలం అమ్మ వద్దంటున్నా అమ్మేసాను. అప్పటినుంచి చేయని ప్రయత్నం లేదు, వీసా సంపాదించడానికి. ఇన్నేళ్ళకు కుదిరింది. ఇంట్లో బయలుదేరిన దగ్గరి నుంచి ఒకటే బెంగ. మళ్ళీ మా ఊరికి తిరిగి వెడతానా! మా వాళ్ళను మళ్ళీ నా కళ్ళతో చూడగలుగుతానా!’

నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాను.

అతడే మొదలు పెట్టాడు మళ్ళీ.

‘ఎవరిదో తెలుగు వాళ్లది ఫాం హౌస్ వుండట, దానికి కేర్ టేకర్ కావాలిట. ఎక్కడో అడవీ ప్రాంతంలో వుందట. పలానా చోటు వరకు రాగలిగితే వాళ్ళే తీసుకు వెడతారట. ఆరు నెలలు స్టాంప్ వేశారు. ఈలోగా ఏదో ఒక మంచి ఉద్యోగం పట్టుకోవాలి

మనిషిని చూస్తే పిరికివాడిలా వున్నాడు. ఇంత ధైర్యం ఎలా చేశాడు? దేశం కాని దేశంలో, ఊరు కాని వూళ్ళో భాష కూడా సరిగా లేకుండా ఎలా నెగ్గుకు రాగలడు?

డబ్బు అవసరాలవల్ల, మరీ పచ్చిగా చెప్పాలంటే డబ్బు యావలో పడి జీవితంలో ఇంత రిస్క్ తీసుకోవాలా!

ఆ రాత్రి ఎక్కడో డిన్నర్ ఏర్పాటు చేశారు. అతడు రాలేదు. ఏదో కొనుక్కుని తింటాను రానన్నాడు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.

తెల్లారి చూస్తే పక్క మీద లేడు, అసలు గదిలోనే లేడు.

ఇంత పెద్ద సువిశాల దేశంలోకి అతడు ఒంటరిగా నడుచుకుంటూ వెడుతున్న దృశ్యమే నా ఊహకు మిగిలింది.

అతడు ఉద్యోగం సంపాదించుకున్నాడా! ఆ దేశంలో స్థిర పడ్డాడా! ఎప్పటికయినా మన దేశానికి వచ్చి భార్యాబిడ్డలను చూడగలిగాడా! అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా!

ఆ తర్వాత ఎప్పుడు అమెరికా వెళ్ళినా నా మదిలో ఈ ప్రశ్నలు తలెత్తేవి. కాకపోతే జవాబు దొరకని ప్రశ్నలు.  (16-05-2021)