‘మాతరం అన్ని విషయాలను పట్టించుకుంటుంది’ రాత్రి బీబీసీ తెలుగు న్యూస్ లో ఓ ఆఫ్రో అమెరికన్ అమ్మాయి కాబోలు చెబుతోంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
6, మే 2021, గురువారం
రేపటి మనుషులు
నాకు తెలుసు నాకే తెలుసు
“నాకు అంతా తెలుసు అనుకోవడంలోనే తెలుస్తోంది అంతగా ఏమీ తెలియదని. I am sure.” అని నా పాత్రికేయ మిత్రుడు శ్రీ బుద్ధవరపు రామకృష్ణ నిన్న ఒక చిన్న పోస్టు పెట్టాడు. నేను దానికి “'నాకూ తెలుసు', 'నాకే తెలుసు' ఈ రెంటికి తేడా తెలిస్తే అంతా తెలిసినట్టే!” అని కామెంటు పెట్టాను. నిజానికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ పోస్టుకు, రాజకీయ రంగులు ఏమాత్రం లేని కామెంటు.
5, మే 2021, బుధవారం
ఒక రకంగా యుద్ధమే!
పీఎం కేర్స్ (PMCARES) నిధులతో ఢిల్లీలోని AIMS, రాం మనోహర్ లోహియా ఆసుపత్రులలో రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన మొదలయిందని, రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. సంతోషం.
కాడి బరువు
సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో ప్రజలనుంచే వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి. ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.
ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?
అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా
హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి
పోయే మాట నిజమే కాని, నిషేధం
విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు
ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.
ఏదైనా రాజకీయ
పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే
పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో
ఎన్నికలు దగ్గర పడితే తప్ప.
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ
రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)
ఆంధ్రప్రదేశ్
(ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల
గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది.
విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.
వావిలాల వారు
ఏమన్నారంటే:
“మన జీవితమంతా
రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి
ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న
నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి
భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది
రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి
గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ
వుంది?
“....కాంగ్రెస్
ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు.
తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్
అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో
అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా
చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను
మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు
లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో
రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.
మోరల్స్ లేవు.
బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా
మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి
సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.
“... ఈ బిల్లును
పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”
ఆ కాలంలో మద్య
నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.
ఇక ప్రస్తుతానికి
వస్తే,
నిరుడు కేంద్రం
కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి
పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.
1. ఆంధ్రప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. పశ్చిమ బెంగాల్
4. మహారాష్ట్ర
5. ఛత్తీస్ గర్
6. కర్ణాటక
7. అసోం
8. హిమాచల్ ప్రదేశ్.
ఈ రాష్ట్రాలు ఏ
పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.
ఈ రాష్ట్రాల్లో
అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.
కాబట్టి అందరూ
అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.
ఒక్కముక్కలో
చెప్పాలంటే:
"మద్య
నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం
మద్యం
అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"
తోకటపా:
రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల
సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ
అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో
విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు
పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.
మళ్ళీ ఒక రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం
షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది
వాదిస్తూ.
(2021)
3, మే 2021, సోమవారం
సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ
మరణవార్తలు రాయడానికి మనసు శరీరము సహకరించడం లేదు. సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ చనిపోయినట్టు ఇప్పుడే తెలిసింది. సచివాలయం బీట్ చూసేవారందరికీ చిరపరిచితుడు.
సబ్బం హరి ఇక లేరు
నేను ఆలిండియా రేడియోలో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో మా రేడియో ప్రతినిధి, నా సీనియర్ కొలీగ్ బి.ఎన్ రావు (నారాయణరావు) ద్వారా శ్రీ సబ్బం హరితో పరిచయం. వైజాగ్ లో వుండే విలేకరులకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్రాలోని జర్నలిస్టులు అందరికీ ఆయన ఇష్టుడు. పార్లమెంట్ సభ్యుడు కావడం వల్ల హైదరాబాదులో వుండే మా బోంట్లకు వ్యక్తిగత పరిచయం కాస్త తక్కువే. కాకపొతే, ఫోన్ చేస్తే ఎక్కడ వున్నా వెంటనే స్పందించి ఓపికగా అడిగిన వాటికి జవాబు చెప్పేవారు. నేను రిటైర్ అయిన తర్వాత అనేక టీవీ డిబేట్లలో వారితో కలిసి పాల్గొనే అవకాశం నాకు లభించింది. విషయాన్ని విపులీకరించే తీరు అందర్నీ ఆకట్టుకునేది. విషయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ నాయకుడు కావడం వల్ల టీవీ చర్చల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన హఠాన్మరణ వార్త కలచి వేసింది. పెద్ద వయసు
కాదు. రాజకీయాల నుంచి కొంత పక్కకు తప్పుకుని రాజకీయ విశ్లేషణలకు మాత్రమే పరిమితం
అవుతూ వస్తున్నారు.
సబ్బం హరి గారికి ఆత్మ శాంతి కలగాలని
కోరుకుంటున్నాను.
ధన్యజీవి జ్వాలా
కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసేతు హిమాచలం అంతటా పరమ పూజ్యనీయులు. అలాంటి మహనీయుడి నోటి నుంచి ఒక రచయిత పేరు, ఇంటి పేరుతో సహా పలుమార్లు ప్రస్తావనకు రావడం అంటే, అంతకు మించిన అదృష్టం వుండదు. అలాంటి సుకృతం నా మిత్రుడు, నా మేనకోడలు విజయలక్ష్మి భర్త అయిన వనం జ్వాలా నరసింహారావుకు లభించడం మా కుటుంబం మొత్తానికి గర్వకారణం.
జ్వాలా ఐహిక పరమైన గృహస్తుబాధ్యతలు ఓ పక్క
నిర్వర్తిస్తూనే,
మరోపక్క ఆముష్మిక మార్గంలో గత రెండు దశాబ్దాలుగా అనేక ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘ఆంధ్ర వాల్మీకి
రామాయణ రసరమ్య గాధలు’ అనే
పుస్తకాన్ని రాయడం,
దర్శనం శర్మగా ప్రసిద్ధి చెందిన శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ ప్రచురించడం ఈ కరోనా
కట్టడి సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం నిజంగా ఒక అద్భుతమే.
పరమేశ్వరుడి కృప ఉంటేనే సాధ్యం.
అంతకు మించిన భాగ్యం ఈ ఇరువురికీ దక్కింది ఎలా
అంటే కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర
సరస్వతీ స్వామివారు స్వయంగా తమ అమృత హస్తాలతో నిన్న
ఆదివారం సాయంత్రం ఈ పుస్తకాన్ని
ఆవిష్కరించి అనుగ్రహ భాషణ చేయడం. కంచి పీఠం నుంచి స్వామి కరకమలాలతో చేసిన ఆవిష్కరణ
కార్యక్రమాన్ని హైదారాబాదులోను, ఇతర ప్రదేశాలలోనూ ఉన్న భక్త జనం, దర్శనం ఆధ్యాత్మిక
మాస పత్రిక వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వీక్షించగలిగారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ చరణులు ఇలా
అన్నారు.
“రామాయణం
గొప్ప ఇతిహాసం. శ్రీరామచంద్రుడు భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి,
సాంప్రదాయ పరంపరకు ప్రతీక. మనిషి అనేవాడు ఎలా వుండాలి అనేది రామాయణం చెబుతుంది. రామనామం మధురాతి మధురం. అందుకే ఉత్తర భారతాన
ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ రామ రామ అనే పేరుకలవాళ్ళు అనేకమంది వుంటారు.
“వనం – దర్శనం (రాసింది వనం జ్వాలా నరసింహారావు,
ప్రచురించింది దర్శనం శర్మ). శ్రీరాముల వారు కూడా వనం దర్శనం చేశాడు. దండకారణ్యంలో
ప్రవేశించాడు.
“వనం జ్వాలా నరసింహారావు లోగడ అనేలా ఆధ్యాత్మిక
రచనలు చేశారు. ఇప్పుడు ఈ రామాయణం గురించి రాసారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం
అవుతోంది. ఈనెలలోనే శ్రీరామ నవమి జరుపుకున్నాము. అదే సమయంలో రామాయణ రసరమ్య గాధలు
పుస్తకం కూడా.
“విశాల దృక్పథం, అందర్నీ కలుపుకుని పోయే తత్వం (Coexistence),
ధైర్యం ధన ప్రధానమైన జీవితం కాకుండా గుణ ప్రధానమైన జీవనం ఇవన్నీ భారతీయ సంస్కృతిలో భాగాలు.
స్థిరప్రజ్ఞత, స్థితప్రజ్ఞతలతో భారతీయ ఇతిహాస పరంపర పరిపక్వత చెందింది.
“రానున్న తరాలలో ఈ పరంపర
కొనసాగించడానికి వనం జ్వాలా నరసింహారావు రాసిన సంశోధనాత్మక సాహిత్యం అవసరం.
“విభూతి అంటే ఏమిటి? గోమయం విశిష్టత ఏమిటి? తిలక ధారణ ఏమిటి అనే విషయాలను విపులీకరిస్తూ తమిళంలో ఒక
పుస్తకం వేశారు. అలాంటివి తెలుగులో కూడా రావాలి. E-learning ద్వారా దేశ విదేశాల్లోని బాలబాలికలకు భారతీయ ఆధ్యాత్మిక
విలువలను బోధించాలి”
గ్రంధ రచయిత శ్రీ వనం
జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక
గ్రంధ రచనకు తనను ప్రోద్బలం చేసిన కారణాలను వివరించి, పుస్తకావిష్కరణ చేసిన కంచి
స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో కంచి
కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు
ఆసాంతం పాల్గొనడం ఓ విశేషం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం, కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్, ఎస్.బి.ఐ.
మాజీ సీ.జీ.ఎం. శ్రీ భండారు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వి.జే.ఎం. దివాకర్, బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ, శ్రీ దర్శనం శర్మ ప్రభ్రుతులు పాల్గొన్నారు.
(03-05-2021)