19, ఏప్రిల్ 2021, సోమవారం
శభాష్ ప్రకాష్!
18, ఏప్రిల్ 2021, ఆదివారం
ఎందుకు రాశాను?
ఒక పుస్తకావిష్కరణ
కార్యక్రమంలో ఆ పుస్తకం రాసిన పెద్దమనిషి చెప్పిన సంగతులు ఇవి.
గ్రంధరచయిత
ప్రసంగం ఇలా సాగింది. (ఇలానే అని కాదు, విన్న సంగతులు
కాబట్టి కాస్త అటూ ఇటూగా)
“ఈ పుస్తకం
రాయడానికి నాకు చాలా కారణాలు వున్నాయి.
“విసుగూ విరామం
లేని ఉద్యోగం చేసి రిటైర్ అయి ఖాళీగా వున్నాను. మరీ అలా ఏ వ్యాపకం లేకుండా
ఉండిపోతే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మొహం మొత్తుతుంది. మరి ఏం చేయాలి కాలక్షేపానికి
అనుకుంటూ వుంటే ఓ పెద్దమనిషి తారసపడి, ఇంతవరకు ఏమాత్రం
తీరికలేని ఉద్యోగాలు ఎన్నో చేసారు కదా!
బోలెడు అనుభవాలు కూడా వుండే వుంటాయి.
ఎంచక్కా ఓ ఆత్మకధ రాస్తే పనికి పనీ వుంటుంది, కాలక్షేపం గానూ వుంటుంది’ అని సలహా చెప్పాడు.
“సలహా బాగానే
వుందని పించింది. కాకపొతే చాలా అనుమానాలు వచ్చాయి.
“తెలుగులో రాయాలా? ఇంగ్లీష్ లో
రాయాలా?
“తెలుగువాడినే కానీ
తెలుగులో రాసేంత తెలుగు వచ్చా అన్నది అనుమానం. ఇంగ్లీష్ బాగానే
వచ్చు కానీ తెలుగులో విషయాలు తెలుగు రాని వాళ్ళు చదివితే వారికి అర్ధం అవుతుందా
అనే ఇంకో సందేహం.
“పోనీ ఇటు తెలుగులో, అటు ఇంగ్లీష్ లో
రెండింటిలో రాస్తే పోలా! భేషుగ్గా వుంది ఐడియా.
‘ఉత్తర హిందూ
స్థానంలో ఎక్కువ కాలం ఉద్యోగం చేయడంఅనే కారణం చేత నా తెలుగు నాలుగు
పొడి ముక్కలు మాట్లాడడానికి, ఇక్కడ అంతా క్షేమం లాంటి చిన్న చిన్న ఉత్తరాలు రాసుకోవడానికి సరిపడేలా కుదించుకు పోయింది.
“అదో పెద్ద
ఇబ్బందేమీ కాదు, నువ్వు చెబుతుంటే చక్కగా రాసిపెట్టే వాళ్ళు బోలెడు మంది వున్నారని ఆ
పెద్దమనిషే మళ్ళీ ఇచ్చాడు భరోసా.
“సరే! ఒక పెద్ద
సమస్య తేలిపోయింది. మరి ఆత్మకధ అంటే కొన్ని చెప్పుకునేవి, కొన్ని
చెప్పుకోలేనివి వుంటాయి. గాంధీ గారిలా అన్నీ రాసుకోవాలా లేదా
కొన్ని రాసుకుని కొన్ని దాచుకోవాలా’
‘ఏ మసాలా లేకుండా
రాముడు మంచి బాలుడు తరహాలో రాస్తే చదివేవాళ్ళు ఉంటారా!
“అది పుస్తకం రాసిన
తరువాత మాట. ముందు రాయడం మొదలు పెట్టమని ఆ పెద్దమనిషి గోల.
“అదీ సరే. మొదలు
పెట్టేస్తాను. భాష సమస్య తీరింది, మరి మా ప్రాంతపు
రాయలసీమ యాసలో రాయాలా లేదా అన్ని ప్రాంతాలవారికి అర్ధం అయ్యేలా తెలుగు సినిమా
భాషలో రాయాలా?’
“ఓరి బాబోయ్ ఇన్ని
అనుమానాలా. ఇన్ని కడుపులో పెట్టుకుని ఇన్నాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఎలా చేసావంటూ ఆ పెద్దమనిషి ఆక్రందన’
ఈ విషయాలన్నీ
చెప్పిన ఆ పెద్దమనిషి నిజానికి చాలా చాలా పెద్ద మనిషి.
పేరు యాగా వేణుగోపాల రెడ్డి. వై.వీ.రెడ్డి అనేది అందరికీ తెలిసిన పేరు. సీనియర్
ఐ.ఏ.ఎస్. అధికారిగా పదవీ విరమణ చేశారు. 2003 – 2005 మధ్య రిజర్వ్
బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. ‘నా జ్ఞాపకాలు’ అనే పేరుతొ తమ అనుభవాలతో కూడిన ఒక
గ్రంధం రచించారు.
మూడు పెగ్గులు ఆరు హగ్గులు - భండారు శ్రీనివాసరావు
కాలంతో పాటు కొరానా కూడా ఎంతటి క్రూరమైనదో కదా! సాంఘిక దూరం పేరుతొ మనుషుల్ని, మనసుల్ని విడదీస్తోంది.
అయిదేళ్ళ కిందటి ఇంగ్లిష్ వాళ్ళ
పరిశోధనలు చదివి సంతోషించిన రోజులెక్కడ! ఏవి తల్లీ నాడు కురిసిన హిమ సమూహములు?
'ప్రతిరోజూ నియమం తప్పకుండా రెండో మూడో పెగ్గులు లాగించడమే నా ఆరోగ్య రహస్యం' అన్నాడొక శతాయుష్కుడు.
తాగుబోతుల లెక్కలు వేరు. జగ్గుల
లెక్కలో సీసాలకు సీసాలు పట్టించేవాళ్లు కూడా 'నేను
తాగేది చాలా తక్కువ. మహా అయితే ఒకటో రెండో..' అంటుంటారు
నాలుగో పెగ్గు పట్టిస్తూ.
ఈ పెగ్గులు సరే! తాగిమాట్లాడే మాటలు.
మరి హగ్గులు అంటున్నారు, అవేమిటి?
ఈ హగ్గులు ఇంగ్లీషు హగ్గులు. అంటే
కౌగలింతలు అన్నమాట.
ఆడామగా హాయిగా మరో ధ్యాస లేకుండా గట్టిగా
కావిలించుకుంటే, అదీ రోజుకు మూడు నాలుగు సార్లు, ఇక ఆ జంటకు ఆయుస్సు అమాంతం పెరిగిపోతుందని హగ్గారావుల ఉవాచ. దీనికి
మద్దతుగా వాళ్లు అనేక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అవి వింటుంటే
కౌగలింతల్లో తేలిపోతున్నట్టుగా వుంటుంది.
సాధారణంగా ఓ జంట ఎంతసేపు
కౌగలించుకుంటుంది అన్న పరిశోధనలతో మొదలు పెట్టి ఈ శాస్త్ర కారులు తేల్చినదేమిటంటే
-
ఉత్తుత్తి కౌగలింతలు మూడు సెకన్లలో
ముగిసిపోతాయి.
అదే ఇరవై సెకన్లు గాట్టిగా
కావిలించుకుంటే దానివల్ల కలిగే మేళ్ళు అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈరకం కౌగలింతలు
శరీరం మీదా, మనస్సు మీదా కూడా ఏకకాలంలో సానుకూల
ప్రభావం చూపుతాయన్నది వారి అభిప్రాయం.
ఎలాటి భేషజాలు లేకుండా, నిజాయితీతో అవతల వ్యక్తిని దగ్గరకు తీసుకుని కౌగలించుకోవడం వల్ల శరీరంలో
"oxytocin" అనే నోరు తిరగని ఓ హార్మోను
తయారవుతుందట. దీనికి వాళ్లు 'లవ్ హార్మోను' అని పేరు కూడా పెట్టేసారు. ఈ హార్మోను పుణ్యమా అని శారీరకంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందట. శరీరం గాల్లో తేలిపోతున్న విధంగా తేలిక
పడుతుందట. మానసిక ఆందోళనలు వగయిరా మంత్రం వేసినట్టు మాయం అయిపోతాయిట. లేనిపోని
భయాలు ఏమైన వుంటే కౌగలింతలు కలిగించే హాయిలో కనుమరుగయిపోతాయిట.
మనం కోరుకున్న అబ్బాయో, అమ్మాయో మన బాహుబంధాల్లో వున్నట్టయితే ఇక అన్ని రకాల భవబంధాలు హుష్ కాకి.
ప్రేమ బంధం ఒక్కటే శాశ్వితం.
కేవలం కౌగలింతల దగ్గరే ఈ పరిశోధకులు
ఆగిపోలేదు. పసి పాపను ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు, పెంపుడు
కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు, జీవిత భాగస్వామితో కాలు చేయీ కలిపి
నృత్యం చేస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయులతో కరచాలనం
చేస్తున్నప్పుడు సయితం 'లవ్ హార్మోను' లావాలా తన్నుకువస్తుందట. పైగా ఇదంతా టోటల్ గా ఫ్రీ. ముఫ్థ్, ఉచితం. ఇంకా యెందుకు ఆలశ్యం.
కౌగలించుకుందాం పదండి!
గట్టిగా అనకండి.
ఏ తెలుగు నిర్మాతో విన్నాడంటే ఏకంగా ఈ
పేరు పెట్టి, రాత్రికి రాత్రే ఓ సినిమా
చుట్టేసి, ఏ ఓటీటీలోనో మనమీద ఒదిలేసే
ప్రమాదం వుంది.
17, ఏప్రిల్ 2021, శనివారం
కాళ్ళు పట్టుకున్నాకే ఉద్యోగం
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం, మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు విజయవాడ పౌర సంబంధ శాఖలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో అనేక మంది నిరుద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం ఆయన దగ్గరకు వస్తుండేవారు.
అలా
వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మా స్వగ్రామం పక్కనే మరో ఊరివాడు కావడంతో కాస్త చనువు
తీసుకుని తను చదువుకున్న డిగ్రీ చదువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు.
వాళ్లది ఒకప్పుడు కలిగిన మోతుబరి కుటుంబమే. ఊళ్ళో
తగువుల్లో ఇరుక్కుని కోర్టు ఖర్చులు, లాయర్ల ఫీజులకోసం ఆస్తి హారతి కర్పూరంలా
కళ్లెదుటే కరిగిపోయింది. దాంతో కుటుంబ
పోషణకు ఏదో ఒక ఉద్యోగం అవసరమయ్యింది.
మా
అన్నయ్య ఆ కుర్రాడితో అంటుంటే విన్నాను.
‘సరే!
ఎవరికైనా చెప్పి చూస్తాను. కానీ నాది ఓ సలహా. సర్కారు ఉద్యోగంలో పై మెట్టు ఎక్కడం
నీ చేతుల్లో లేదు. కానీ ప్రైవేటు రంగంలో శ్రద్ధ పెట్టి పని చేస్తే మంచి అవకాశాలు వుంటాయి. ఇంత ఎందుకు? నువ్వు ఏ సంస్థలో చేరినా దానికి అధిపతి అయ్యేంత కసి
పెట్టుకుని పనిచేయాలి. అప్పుడు ఆకాశమే హద్దు”
ఈ
మాటలు ఏమి అర్ధం అయ్యాయో తెలియదు కానీ ఆ కుర్రాడు తల ఊపాడు.
మా
అన్నయ్య అతడ్ని ఓ చెప్పుల దుకాణానికి తీసుకు వెళ్ళాడు, అక్కడ ఏదైనా పని
ఇప్పిద్దామని. ఆ షాపు ఓనరు అతడ్ని ప్రశ్నలు ఏమీ అడగలేదు కానీ, ఆ కుర్రాడిని
ఎగాదిగా చూస్తూ, తన కాళ్ళు
పట్టుకొమన్నాడు. అతడు ఏమాత్రం సంకోచించకుండా ఓనరు కాళ్ళు పట్టుకున్నాడు.
‘సహభాష్! నాకు ఇలాంటి కుర్రాడే కావాలి. చెప్పుల షాపులో
ఉద్యోగం చేసేవాడు వచ్చిన ప్రతివాడి కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోను అని భేషజాలకు
పొతే ఇక్కడ కుదరదు” అని అతడ్ని వెంటనే పనిలో పెట్టుకున్నాడు.
కొన్నేళ్ళు
గడిచాయి. ఆ కుర్రాడు సొంతంగా షాపు పెట్టుకుని తర్వాత రోజుల్లో ఓ షూకంపెనీ తెరిచి మా అన్నయ్యను పిలిచాడు.
బహుశా,
ప్రైవేటు రంగంలో అవకాశాలను ఎలా అంది పుచ్చుకోవాలో అనే విషయంలో గతంలో మా అన్నయ్య చెప్పిన మాటలను ఆ కుర్రాడు చాలా సీరియస్ గా
తీసుకున్నట్టున్నాడనిపించింది.
నర్సుని కావాలని వుంది, అదీ ఒక అనాథాశ్రమంలో
“పెద్దయిన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నావ్? అనే ప్రశ్నకు నేను చెప్పిన ఈ జవాబు విని క్లాసులో, టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.”
“దేవుడికి నా కోరిక సగమే అర్ధం అయినట్టు వుంది.
అందుకే ఇలా నాచేత ఈ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టించి ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, వారి
ఆలనా పాలనా చూడమని”
ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, 1980లో అనుకుంటాను, వాసిరెడ్డి
కాశీ రత్నం గారు మా ఇంటికి వచ్చారు ఓ మహిళల పత్రిక కోసం మా ఆవిడను ఇంటర్వ్యూ చేయడం కోసం. మా ఆవిడ నిర్మల
నడిపే అమ్మవొడి గురించి కాశీరత్నం గారు
అడిగినప్పుడు మా ఆవిడ చెప్పిన మాటలు ఇవి.
అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ
దగ్గర్లో పర్చా కిషన్ రావు గారింట్లో
అద్దెకు ఉంటున్నాము. నాకు రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ
నెలవారీగా రిక్షా మాట్లాడాము.
ఆరోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే జీతానికి, జీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు
బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది.
పాపం ఆ పెద్దాయన బర్కత్ పురా నుంచి చేతికర్ర
పొడుచుకుంటూ, జాగ్రత్తగా నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు
కోసం. మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు,
సమయానికి అద్దె కట్టలేని మా పరిస్థితి
చూసి కొంత జాలిపడి,
మరికొంత చీకాకు పడి.
ఈ నేపధ్యంలో మరో దారి కనపడక, మా
ఆవిడ ఈ అమ్మఒడి దారి ఎంచుకుంది.
ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం
కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని
చిన్నారుల బడి’ అనే ట్యాగ్ లైన్ తో ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.
రెండు వారాలు గడుస్తున్నా మా ఆవిడ అమ్మ ఒడిలో తమ
పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ,
ఉయ్యాలలు కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు.
అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారు? కానీ
అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.
అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది
కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి మా ఆవిడ చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడిని, ఓ
పాలసీసాను పెట్టి,
‘ఇప్పుడు టైము లేదు,
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.
వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో
తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి, సాయంత్రం అయింది.
మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. నేను కూడా ఆఫీసు నుంచి వచ్చాను. ఏడుస్తున్న
పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని సముదాయిస్తూ తను
ఒక్కత్తీ కూర్చుని వుంది. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ
తెలియదు. నాలో ఆరాటం పెరిగింది. ‘పోలీసులకు చెప్పనా!’ అన్నాను. తల అడ్డంగా ఊపింది.
‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో
తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు
అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అంది స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.
మా ఆవిడ అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి
పదిన్నరకు వచ్చారు,
బోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్
ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న
హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.
ఆ బాబు పేరు జేమ్స్. మా ఆవిడ పెట్టిన అమ్మఒడిలో
చేరిన మొదటి పిల్లవాడు.
తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు
నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. మా
ఆవిడకు పని భారము పెరిగింది. పని మనిషి
రాని రోజున చూడాలి మా ఆవిడ అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం
చేసేది. కావాలని కోరి ఎంచుకున్న మార్గం
కాబట్టి కష్ట నష్టాలు, లాభ
నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగేది కాదు. ఇచ్చినది పుచ్చుకునేది. కొందరు
పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేది కాదు.
‘మనం అంతేగా! నెలనెలా అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ
అలాగే. ఖర్చులకు సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది’ అని
వారినే సమర్ధించేది.
అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు పెంచుకుంటూ
పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో
మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు
నా మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.
అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు
విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల
పెళ్లిళ్లకు పిలుస్తుంటే తను చాలా సంబర పడేది.
అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్ కావాలనుకున్న తన చిన్ననాటి కోరికను మా ఆవిడ
నిర్మల తన అమ్మఒడి ద్వారా తీర్చుకుంది.
ఆమె సేవాభావం నాకు అంటలేదు కానీ, కన్న
పిల్లలు ఇద్దరికీ కొంచెం పంచిపెట్టే వెళ్ళింది, నేను పంచడానికి ఏమీ లేదని తెలుసు కనుక.
నిష్టుర నిజాలు - భండారు శ్రీనివాసరావు
"అంటే ఏమిటన్న
మాట"
మా ఆవిడ ఇచ్చిన
కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు ఏకాంబరం.
"ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నవాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్ధం కావని. ఈ మధ్య అలాటివి రెండు నా దృష్టికి వచ్చాయి" వక్కపొడి నములుతూ సంభాషణ పొడిగించాడు.
నిజానికి ఏకాంబరంతో సంభాషించడం కుదరని పని. మన మాటలు కూడా అతడే మాట్లాడుతూ మాటలు కొనసాగిస్తాడు. ఒకరకంగా ఏకాంబరంతో వున్న సులువు కూడా అదే. వింటున్నట్టు ఓ చెవి పారేసి మన మానాన మనం రాసుకుంటూ, చదువుకుంటూ ఎంచక్కా అతడితో ముచ్చట్ల కార్యక్రమం కొనసాగించవచ్చు.
"హైకోర్టు
ఆగ్రహం"
మళ్ళీ ఏకాంబరమే మొదలెట్టాడు.
"ఇదొక అర్ధం కాని మీడియా భాష. కోర్టుకు ఆగ్రహానుగ్రహలతో నిమిత్తం వుండకూడదు. ఏదయినా కేసు విచారించేటప్పుడు ఇటువంటి భావోద్రేకాలకి న్యాయమూర్తులు లోనుకాకూడదు. నిజంగా జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలవదు. టీవీ స్క్రోలింగుల్లో మాత్రం ఈ పదం తరచూ దర్శనం ఇస్తుంటుంది. నాకు అర్ధం కాని విషయాల్లో ఇదొకటి" అన్నాడు ఏకాంబరం.
"మరి రెండో సంగతి" అని ఎవరూ అడక్కుండానే ఆయనే అందుకున్నాడు.
"అలసటా, ఆయాసం లేకుండా
హాయిగా బంధు మిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొచ్చిన ప్రముఖులు, మహాద్వారం దగ్గర్లో మీడియాతో మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు. 'దేశం సుభిక్షంగా
ఉండాలనీ, ప్రజలందరికీ మంచి జరగాలనీ అ
బ్రహ్మాండనాయకుడ్ని ప్రార్ధించి
వచ్చినట్టు ఎలాటి భేషజం లేకుండా బ్రహ్మాండమైన అబద్ధాలు ఆశువుగా
చెప్పేస్తారు. ఈ మాటలు నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా?"
"అందరు భక్తుల్లాగే వాళ్ళూ తిరుపతి వస్తారు. ఎలాటి లాయలాస లేకుండా దేవుడి దర్శనం తేలిగ్గా చేసుకుంటారు. కావాల్సిన కోరికలు ఎవరూ లేకుండా చూసి కోరుకుంటారు. బయటకు రాగానే మాత్రం అదేదో 'సబ్బు వాడండి' అని సినిమాతారలు ప్రకటనలకు ఫోజు ఇచ్చినట్టుగా, గుడి బయట మహాద్వారం దగ్గరే వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు చెప్పండి. ఏడుకొండలవాడికి వీళ్ళ మెచ్చుకోళ్ళు అవసరమా? టీవీలవాళ్లు ఈ పద్ధతికి స్వస్తి చెబితే బాగుంటుంది"
"చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపించినట్టు ఏకాంబరం గారు చెప్పేవి పోచికోలు కబుర్లే అయినా, అప్పుడప్పుడూ ఇలాటి మంచి మాటలు కొన్ని చెబుతుంటారు. అందుకే పొద్దున్నే వచ్చి విసిగించినా, విసుక్కోకుండా కాఫీ ఇచ్చేది" అన్నది మా ఆవిడ ఏకాంబరం వెళ్ళిపోయిన తరువాత తాపీగా.
16, ఏప్రిల్ 2021, శుక్రవారం
డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారిక లేరు
డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో చిన్న పర్సనల్ టచ్