18, మార్చి 2021, గురువారం

సోషల్ మీడియా

 

"సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు
ఇంకొన్ని ఊహాగానాలు
మరికొన్ని అభూతకల్పనలు"
చివరిదానిపై తొందరపడి కామెంట్ చేయడం మంచిది కాదు.
ఇలా రాయడానికి ఓ నేపధ్యం వుంది. మొన్నీ మధ్య సుప్రీం కోర్టుకు సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు వేర్వేరుగా పోస్టులు పెట్టారు.
పోటీ చేసిన అభ్యర్ధులు అందరికంటే నోటాకు ఎక్కువ వస్తే మళ్ళీ ఎన్నిక జరపాలని ఎలక్షన్ కమిషన్ ని ఆదేశించాలని కోరుతూ ఒకాయన కోర్టులు వెడితే, సుప్రీం కోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు ఇచ్చింది. ఇదీ వార్త. కానీ ఆ ఇద్దరు సుప్రీం కోర్టు తీర్పుగానే పోస్టు పెట్టారు. ఒక జర్నలిస్టుకు, తెలిసిన వాడు కాబట్టి చెబితే సరిదిద్దుకున్నాడు. రెండో అతను తన పేరుకే జర్నలిస్టు అని ట్యాగ్ తగిలించుకున్నవాడు. చెప్పినా లాభం లేదని మానేశాను.
ఇన్ని రోజులైనా ఆయన తన పొరబాటు ఒప్పుకోలేదు సరికదా, సరిదిద్దుకోలేదు కూడా.
నాకు బాగా గుర్తు. గతంలో ‘కలం’ తిరిగిన పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్టికిల్ లేదా వార్త రాస్తూ ఏదైనా అనుమానం కలిగితే ఏమాత్రం భేషజం లేకుండా తమ దగ్గర పనిచేసే జూనియర్లను, లేదా ఫోను చేసి తోటి జర్నలిస్టులను అడిగి సందేహ నివృత్తి చేసుకునే వారు. తాము రాసిన దాంట్లో ఎలాటి పొరబాటు దొర్లకూడదు అనే నిబద్ధతే వారినలా చేయిస్తోంది అనుకునేవాడిని.
ఇప్పుడు సోషల్ మీడియా అలాంటి విషయాల్లో బాగా అక్కరకు వస్తోంది, సరిగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశం ఉన్న పాత్రికేయులకు.నా రాతల్లో చిన్న పొరబాటు దొర్లినా వెంటనే ఎత్తి చూపుతున్నారు. ఇందుకు నేను చిన్నబుచ్చుకోవడం లేదు. పైగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దొర్లిన పొరబాట్లను సవరించుకోగల వెసులుబాటు వున్న మీడియం ఇది.
నాకు అర్ధం అయిందేమిటంటే ప్రస్తుతం సమాజంలో చైతన్యం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. చూసినవీ, విన్నవీ, చదివినవీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారు. చక్రాంకితాలు వేసుకున్న కొందరు రాజకీయ పార్టీల అభిమానులని మినహాయిస్తే చాలామంది, చాలా వరకు చక్కని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే కాస్తంత ఓపిక కావాలి, రాళ్ళల్లో నుంచి బియ్యం ఏరడానికి.
(18-03-2021)

బ్రాహ్మణ సదస్సు – భండారు శ్రీనివాసరావు

 ఒక పాత ముచ్చట

ఇది నలభయ్ ఏళ్ళ నాటి మాట.

ఆ రోజుల్లో చిక్కడపల్లిలో ABCD OTGANISATION (All Brahmin Community Organisation) అనే ఒక సంస్థ వుండేది. ఆ సంస్థ కార్యదర్శి, సమాజంలో వివిధ వర్గాలతో సన్నిహిత పరిచయాలు కలిగిన ఒక జర్నలిష్టుని కలిసి తమ సంస్థ కార్యకలాపాలలో సహకారం అర్ధించాడు. అయన వెంటనే లేచి నిలబడి, కులాల పేరుతొ సంస్థలు, సంఘాలు నిర్వహించడం తనకు సుతరామూ ఇష్టం లేదని మొహం మీదే అనేసి వెళ్లి రండంటూ పంపేశాడు.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అదే జర్నలిష్టు ఇటీవల హైదరాబాదులో బ్రాహ్మణ సదస్సు జరిగితే హాజరయి బ్రాహ్మణ సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ చేసిన తీర్మానానికి తన మద్దతు ప్రకటించారు. కాలం తెచ్చిన మార్పు అనుకోవాలి.

ఇప్పుడు ఒక నిజం చెబుతాను, అతగాడెవ్వరో కాదు, నేనే!

 

చాలా  కాలం  తర్వాత  అంటే నాలుగేళ్ల కిందట, ఓ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్ళు పనిచేసిన వెంకట్ చంగవల్లి గౌరవార్ధం జరిగిన సమావేశానికి వెళ్ళినప్పుడు నాకీ విషయం మరోమారు స్పురణకు వచ్చింది.

ఆ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్, మాజీ చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు రావుగారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముక్తసరిగా మాట్లాడడం ఆయన తత్వం. కానీ ఆనాటి  కృష్ణారావుగారి ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. ఆయనలో దాగున్న అద్భుతమైన వక్త వెలికి వచ్చారు. ప్రభుత్వ సర్వీసులో వున్నప్పుడు ఆయన్ని ఎన్నోసార్లు కలిశాను. ప్రత్యేకించి ఒక కులానికి ప్రయోజనం కలిగించే ధోరణిని ఎన్నడూ కనబరచలేదు. కానీ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న తరువాత బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తున్నదీ తేటతెల్లం అయింది. నిజానికి ఈ కార్పొరేషన్ పదవి ఆయన గతంలో చేసిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా చాలా చిన్నది. చీఫ్ సెక్రెటరీగా వున్నప్పుడు డజన్ల సంఖ్యలో ఇలాంటి సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేసేవి. వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లు ఆయన ఆధ్వర్యంలో రూపు దిద్దుకునేవి. అంత పెద్ద హోదాలో పనిచేసిన పెద్ద మనిషి ఇంత చిన్న పోస్ట్ ఎందుకు ఒప్పుకున్నారో అప్పుడు నా బోంట్లకు అర్ధం కాలేదు కూడా. ఇప్పుడు తెలిసివచ్చింది, ఒక చిన్న సంస్థను కూడా పెద్ద ఎత్తున విస్తరించాలంటే ఇలాంటి వ్యక్తులే అవసరమని.

కార్పొరేషన్ అనుబంధ విభాగం బ్రాహ్మణ సహకార పరపతి సంస్థకు ఈ కొద్దికాలంలోనే ఆయన తన పలుకుబడితో అనేక హంగులు కల్పించారు. పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సాఫ్ట్ వేర్ అందిస్తున్న ఒక సంస్థ నుంచి అదే రకమైన సాఫ్ట్ వేర్ ను, కాణీ ఖర్చులేకుండా ఉచితంగా పొందగలిగారు. దాని విలువ రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా ఇరవై కోట్లు. అంటే కార్పొరేషన్ కు ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సమానం అన్నమాట.

ఇక ఆ సాయంత్రం ప్రధాన అతిధి వెంకట్ చంగవల్లి తన సతీమణి పద్మగారితో కలిసి వచ్చారు. మామూలుగానే ఆయన సీరియస్ సమావేశాలు, సదస్సుల్లో కూడా నవ్వులు పూయిస్తారు. ఆ అలవాటుతో ఆయన తన ప్రసంగాన్ని ఒక పిట్ట కధతో మొదలు పెట్టి అసలు అంశానికి జోడిస్తూ కొనసాగించారు.

ఒకావిడకు పుట్ట చెముడు. డాక్టరుకు చూపెట్టుకుంది. రకరకాల వినికిడి సాధనాలు చూపెట్టారు. ఒకటి చాలా ఖరీదు, ఒకటి చాలా చాలా  చౌక. ఖరీదుది పెట్టుకుంటే బాగా వినబడుతుంది. చౌకది తగిలించుకుంటే ఏమీ వినబడదు. కాకపోతే చెవిటి మిషన్ కనబడగానే ఆవిడ చెవిటిది అన్న విషయం బోధపడి ఎదుటి వాళ్ళే ఓపిక చేసుకుని బిగ్గరగా మాట్లాడతారు. అల్లాగే, వెంకట్ చంగవల్లి గతంలో ఈఎం ఆర్ ఐ (108 అంబులెన్స్) వంటి అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా ఆయన ఎవరన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా తనని నియమించగానే చెవిటి మిషన్ కధలోని అవ్వలాగా తానెవరన్నది అందరికీ తెలిసిపోయిందని చెప్పారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషద్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ భవాని శంకర్, ఇంకా అనేకమంది బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొని వెంకట్ చంగవల్లికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఒక కొసమెరుపు:

లక్ష్మణ్ అనే ఒక పెద్దమనిషి ఒక చిన్న జ్ఞాపకాన్ని  సదస్యుల మీదికి వదిలారు. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో పనిచేసే లక్ష్మణ్ అనే ఓ పెద్దమనిషిని ఒక సదస్సుకి పిలిచారు. అధ్యక్షులవారు Now Mr. Lakshman will give his valuable  address in brief’ అంటూ వేదిక మీదకు ఆహ్వానించారుట. లక్ష్మణ్ గారు నేరుగా మైకు తీసుకుని, ‘లక్ష్మణ్, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, ఎస్సారార్ కాలేజ్, మాచవరం, విజయవాడ’ అనేసి స్టేజ్ దిగి వచ్చేసారుట.

నేను చదివింది, అదే ఎస్సారార్ కాలేజీలో. అందుకే ఇది గుర్తు పెట్టుకున్నాను. (18-03-2017)

 

 

 

 

17, మార్చి 2021, బుధవారం

కాశీపట్నం చూడర బాబూ! – భండారు శ్రీనివాసరావు

(తమిళనాడు ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే)


మా చిన్నప్పుడు వూళ్ళల్లోకి చుక్కాణీ పెట్టెవాడు వచ్చేవాడు. అతడు కనబడగానే చిన్నపిల్లలం అందరం అతడి చుట్టూ మూగేవాళ్ళం. ఓ అర్ధణా ఇస్తే ఆ పెట్టెకు ఉన్న కంతలో నుంచి కదిలే బొమ్మలు కనబడేవి. ఇదిగో కాశీ, అదిగో ప్రయాగ అని చూపిస్తుండేవాడు. నిజంగా కాశీ చూసినట్టే మేము మురిసిపోయేవాళ్ళం.
ఇప్పుడు ఈ చుక్కాణీ పెట్టె రూపం మార్చుకుని ఎన్నికల ముందు మేనిఫెస్టోల రూపంలో జనాలను ఆకట్టుకుంటోంది. ఆ విష్ణుమాయలో పడిన వాళ్లకి ఏది నిజమో ఏది కాదో తెలియని అయోమయం ఆవరిస్తోంది.
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. వణికించే చలికాలంలో వెచ్చటి దుప్పట్ల వాగ్దానాలతో మరిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్ ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు, ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

మరి వీటికి ముకుతాడు వేయడం ఎలా! ఇలా:
ఆకాశమే హద్దుగా ఎన్ని వాగ్దానాలు అయినా చేయండి. అభ్యంతరం లేదు. కాకపొతే అధికారానికి వచ్చిన తర్వాత ఒకటి రెండేళ్ళు మీ పార్టీల సొంత నిధులతో వాటిని అమలుచేయండి. అంతేకానీ ప్రజలు పన్నులు కట్టి నింపిన ప్రభుత్వ ఖజానా నుంచి కాదు. అప్పుడు కానీ మీ చిత్తశుద్ధి ఏమిటన్నది రుజువవుతుంది.

తోకటపా: ‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్

16, మార్చి 2021, మంగళవారం

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైటా!

 

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైట్ అనుకునే ‘కె.ఎన్. బాబు’ (‘బెజవాడ వాసి’)   'బెజవాడ నాని' వంటి  వాళ్ళకోసం ఈ పోస్టు:

ఈ పోస్టుని షేర్ చేసిన మితృలు దీన్ని మళ్ళీ ఆ బాబుగారి/ నానిగారి  దృష్టికి వచ్చేలా చేయండి అనే వినతితో:

ఈ కాపీ రాయుళ్ళ భరతం పట్టాలనే ఉద్దేశ్యంతో ఒకచోట కావాలనే దండమూడి రాజగోపాల రావు గారికి బదులు దండమూడి రామ్మోహన రావు అని రాశాను. మన కాపీ మిత్రుడు కాపీ కొట్టే తొందరలో అలాగే రామమోహనరావు పేరు మార్చకుండా వాట్సాప్  గ్రూపుల్లో తిప్పుతున్నాడు. కావాలంటే మరోసారి పరిశీలించండి.

https://m.facebook.com/story.php?story_fbid=2694431930869130&id=100009070493506

15, మార్చి 2021, సోమవారం

పెళ్ళికి పూర్వం తర్వాత – నేనూ మా ఆవిడ

 పెళ్లి కాక ముందు నేను వీర దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి. పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో పని చేసేవాడిని కాను.

పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు. తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.

అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని ఆయనపై నేను శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత ఆ దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.

ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.



ఎవరి గోల వారిదిగా సాగిన మా సంసారం ఇప్పుడు ఏ గోలా లేకుండా సద్దుమణిగింది.

 

ఏపీ ప్రజాతీర్పు – భండారు శ్రీనివాసరావు

 “ఏకగ్రీవాలని మించిన ప్రజాతీర్పు అన్నారు మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ, రాత్రి తన విశ్లేషణ కార్యక్రమంలో. బహుశా పురపోరులో వైసీపీ  సాధించిన అద్భుత విజయం గురించి ఇంత  సూటిగా, అర్థవంతంగా వినబడిన వ్యాఖ్య ఇదే అనుకుంటాను.

“విజేత  తనకు దక్కిన విజయాన్ని మొట్ట మొదటిది అనుకోవాలి, అప్పుడే తదుపరి విజయ సాధనకు నిరంతరం శ్రమిస్తాడు. పరాజితుడు తన పరాజయాన్ని చిట్ట చివరిదిగా భావించాలి. అప్పుడే మరోసారి విజయం సాధించడం కోసం పరిశ్రమిస్తాడు”

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  అనంతరం ఒక టీవీ చర్చలో నేను చెప్పిన మాట ఇది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా చేసే  ప్రకటనలు, వ్యాఖ్యలు తాత్కాలిక స్పందనలే. వాటిల్లో నిజం పాలు తక్కువ.

సవివరమైన విశ్లేషణకు మరిన్ని వివరాలు అందాల్సివుంది.

పొతే ఒక హిత వచనం:

విజయం వినయాన్ని పెంచాలి. అపజయం అసహనాన్ని తుంచాలి.

(15-03-2021)

14, మార్చి 2021, ఆదివారం

ఎందుకో గుర్తుకొస్తున్నాయి – భండారు శ్రీనివాసరావు

 

తెలుగు దేశం పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా చేరినవాళ్ళలో చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ వయస్సు నలభయ్ ఎనిమిది. వాళ్ళ వయసు డెబ్బై దాటి వుంటుంది.

ఆ పార్టీ ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. మొదట రామకృష్ణా సినీ స్టూడియోలో విలేకరులను పిలిచి తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించినా వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహా జనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.

అయితే చెప్పే ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు “తెలుగుదేశం పార్టీ” అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక ప్రాంతీయ పార్టీకి దేశం అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.

ఇక అక్కడనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్ యెంత మాత్రం కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని రకాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేసారు.

పార్టీ ప్రచారం కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి రావాలని అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పైనే నెపం వేసారు. పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల రంగు వ్యాన్ ని బయటకు తీసి కొత్త నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి ఉపన్యసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఉదయం పూట రోడ్డుపక్కనే స్నానాలు. అంతవరకూ ఇలాటి ప్రచారం ఎరుగని వారికి వింతగా అనిపించింది. ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు గారు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామా రావు’ అని అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి గారు ‘అది తెలుగు దేశం కాదు, కమ్మ దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు. అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరులం కలిసి ‘ మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా’ అని బదులిచ్చారు. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు పత్రికల్లో ‘మామగారిపై పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.

ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో కనబడింది. ఆసభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి ‘ బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి ధ్రువ పడింది.

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడుతున్నాయి. షాద్ నగర్ నుంచి మొదటి ఫలితం అధికారికంగా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు గెలుపొందారు. అక్కడ రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అందువల్ల మిగిలిన అన్ని చోట్లకంటే అక్కడ ఫలితం చాలా ముందుగా వెలువడింది. షాద్ నగర్ నుంచి నేను పంపిన వార్త మధ్యాన్నం, సాయంత్రం వార్తల్లోనూ, ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఆరుగంటల ఇంగ్లీష్ వార్తల్లోనూ ప్రముఖంగా వచ్చింది. తరువాత చాలా సేపటి వరకు ఎటువంటి సమాచారం ఎక్కడి నుంచి లేదు. టీడీపీ అభ్యర్ధులు చాలా చోట్ల ఆధిక్యతలో వున్నట్టు అనధికారికంగా తెలుస్తున్నా, అప్పటి నిబంధనలు అనుసరించి ప్రసారం చేయడం సాధ్యపడలేదు. కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. కొందరు రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు కూడా. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.

అదే రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి ఏర్పాటు చేసే మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.

దటీజ్ ఎన్టీఆర్.

రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.

మరునాడు అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది”

అప్పుడు భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది.

(14-03-2021)