9, ఫిబ్రవరి 2021, మంగళవారం
మరవలేని మనిషి
“జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే.”
ఈ రోజు (9th Feb) మా ఆవిడ నిర్మల
పుట్టిన రోజు. ఈ రోజును మరచిపోకపోవడమే ఆమెకు నేనిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని
అనుకునేవాడిని.
‘చూసావా నువ్వు
గుర్తు చేయకుండానే నేనెలా గుర్తుంచుకున్నానో’ అని చెప్పాలని వుంది. కానీ వినడానికి
ఆవిడ లేదు.
నా ప్రతి పుట్టిన
రోజుకూ నన్ను బలవంత పెట్టి ఇంటికి దగ్గరలో వున్న ఓ చిన్న గుడికి తీసుకుని
వెళ్ళేది. (దూరంగా వుండే పెద్ద గుళ్ళకు
వెళ్ళడానికి బద్దకిస్తాననే సందేహంతో)
పెళ్ళయిన
కొత్తల్లో నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ
తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో
పెరిగితే, ఇల్లూ
వాకిలీ పట్టని నాలాంటి మొగుడు
దొరికాక, దేవుడి అవసరం ఆమెకు బాగా
పెరిగింది.
2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన
రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ
హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి
చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం
తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న
మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల
కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ
వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం
స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు.
ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ .నాకు అర్ధం కాని
విషయాలే కాదు, అవసరం లేని
విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప
మిగిలిన విషయాలు పట్టించుకోను.
గుడి మహా ద్వారం
దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో
మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక
అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.
ఇంటికి వచ్చేముందు
జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న మా రెండో
అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి
వెళ్ళిన గుర్తు. ఆ తర్వాత పదంటే పది
రోజులకే మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి మా ఆవిడ
మరణించడంతో ఆ జ్ఞాపకాలన్నీ అలికినట్టు
గజిబిజిగా అయిపోయాయి.
ఈరోజు నేను ఒక్కడినే వెళ్లి దేవుడి గుడిలో కాసేపు
కూర్చుని వచ్చాను. శరీరాన్ని ఏదో కట్టడి చేసి భగవత్ సన్నిధానంలో కూర్చోవడమయితే
కూర్చున్నా కానీ, మనసు నా
స్వాధీనంలో వుండదు కదా!
చెత్త ఆలోచనలు
చుట్టుముడుతూనే వుంటాయి.
“మా ఆవిడ చనిపోయి
అప్పుడే ఏడాదిన్నర అవుతోందా! అయినా ఇంకా
ప్రాణాలతోనే వున్నాను అంటే నా గుండె గట్టిది అయినా అయివుండాలి. లేదా ఆమె మీద నా
ప్రేమ వట్టిది అయినా అయివుండాలి”
ఎంతయినా మగవాడిని
కదా! ఇదే నిజమై వుంటుంది.
(09-02-2021)
కింది ఫోటో:
8, ఫిబ్రవరి 2021, సోమవారం
“Mister! Happy Birthday!”
పునర్జన్మ కోసం ఉన్న జన్మ నాశనం చేసుకుంటారా?
7, ఫిబ్రవరి 2021, ఆదివారం
6, ఫిబ్రవరి 2021, శనివారం
మౌనమే మీ భాష .... భండారు శ్రీనివాసరావు
ఒకప్పుడు (ఇప్పుడు కాదు) కమ్యూనిస్ట్ పార్టీలు గురించి చెప్పుకునేవారు, అంతర్గత సమావేశాల్లో విధాన నిర్ణయాలు గురించి పొట్టు పొట్టయినా, బయటకి మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారని. ఇప్పుడు అన్ని పార్టీలది ఇదే వరస. పై వాళ్ళు ఏది చెబితే అట్టడుగు కార్యకర్త వరకు అందరిదీ అదే మాట. ఒకే మాట. అంతేకాదు, టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీల అధికార ప్రతినిధులు, ఆఖరికి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరూ పొల్లుపోకుండా ఒకటే మాట మీద వుండడం ఈ ప్రజాస్వామ్య దేశంలో విచిత్రమే అనిపిస్తుంది. ఒకప్పుడు నెహ్రూ మంత్రివర్గంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని మాటకు ఎదురు చెప్పేవాడని, పటేల్ ధైర్య సాహసాలకి అది నిదర్శనం అని గొప్పగా చెప్పుకుంటూ వుంటాం.
ఈనాడు అలా అధిష్టానం మాటకు ఎదురు చెప్పగల పటేల్ వంటి నాయకులు ఎవరూ కానరావడం లేదు. అంతా
ఒకే మాట మీద నిలబడి వున్నందుకు సంతోషపడాలో, లేక మరోమాట చెప్పే స్వతంత్రం లేని రాజకీయ వ్యవస్థలో
వున్నందుకు ఖేదపడాలో అర్ధం కాని పరిస్థితి.
గృహస్తు ఇంటి పెద్ద కావచ్చు. కానీ ఆయన తీసుకునే
నిర్ణయాలన్నీ సబబే అని చెప్పలేం. అలానే ప్రభుత్వాలు, పార్టీలని ఆజమాయిషీ చేసే నాయకులు కూడా అన్నీ
మంచి నిర్ణయాలే తీసుకుంటారని అనుకోలేం.
ప్రజాస్వామ్య
వ్యవస్థలో అది పార్టీ కావచ్చు,
ప్రభుత్వం కావచ్చు చర్చ జరిగేంతవరకు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి నిర్ణయం అయ్యాక
ఇక చర్చలు అనవసరం. (06-02-2021)
ఇంగువ కట్టిన గుడ్డ – భండారు శ్రీనివాసరావు
ఇంగువ కట్టిన గుడ్డకు ఎన్ని రోజులైనా ఆ వాసన దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందంటారు. అది అనుభవంలోకి వచ్చింది.
హైదరాబాదులో
రోడ్డు దాటటడం అంటే వైతరణి దాటినట్టే. ఉదయం బ్లడ్ టెస్ట్ కి వెళ్లి తిరిగివస్తూ,
రోడ్డు దాటడం ఎల్లా అనే సమస్యతో అటూ ఇటూ చూస్తుంటే ఒకాయన నా చేయిపట్టి దాటించాడు.
థాంక్స్ చెప్పబోతుంటే ఆయనే కల్పించుకుని ‘ఈ మధ్య మీరు టీవీ చర్చల్లో రావడం లేదేమిట’ని
అడిగాడు. దాదాపు ఏడాది పైమాటే, 2019 ఆగస్టులో మా ఆవిడ మరణం తదాదిగా నేను టీవీ చర్చలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించాను. ఆ
సంగతి ఈయన గారు ఎలా గమనించారబ్బా అనుకుంటుంటే ఆయనే చెప్పారు.
ఆయన పేరు
విశ్వనాధ రెడ్డి. ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. అమ్మాయి అల్లుడు హైదరాబాదులో
కాపురం. వారిని చూడడానికి వచ్చారట.
‘రోజూ
అన్ని టీవీ చర్చలు చూస్తూ వుంటాను. అందరూ అరుస్తూ మాట్లాడుతుంటుంటే మీరు మాత్రం
అలా మౌనంగా వుండిపోతారు. అడిగితె కాని జవాబు చెప్పరు. మొదట్లో ఎలాగో అనిపించేది.
ఈయనేమి విశ్లేషకుడని. కానీ తర్వాత తర్వాత అర్ధం అయింది. అలా కల్పించుకోకపోవడమే మీ
ప్రత్యేకత అని”
చర్చల్లోనే
కాదు ఇక్కడ కూడా నాకు మౌనమే శరణ్యం. ఏం చెప్పను?
“ఆ
విధంగా మీకు అభిమానిని అయ్యాను” అన్నారాయన.
పొద్దున్నే దొరికిన పెద్ద కాంప్లిమెంట్ అనుకోవాలి.
వాదనకు, వాదులాటకు తేడా తెలిసిన వాడే నిజమైన విశ్లేషకుడు అని
ఎప్పుడో రాసుకున్న వాక్యం గుర్తుకు వచ్చింది.
