13, జనవరి 2021, బుధవారం

దైవేచ్చ

 


మా ఇంటి నుంచి నాలుగు అడుగులు నడిచి మెయిన్ రోడ్డు దాటితే ఫుట్ పాత్ మీద వుంటుంది ఆ పూల దుకాణం. వెనుకటి రోజుల్లో నేను మా ఆవిడతో కలిసి అప్పుడప్పుడూ  వెడుతూ ఉండేవాడిని. మూరలు మూరలు పూల దండలు కొంటుంటే ఆ పూలమ్మి ఎందుకో ముసిముసి నవ్వులు నవ్వేది. ఆ పూలన్నీ మా ఇంట్లో కొలువు తీరిన ముక్కోటి దేవతల ప్రీత్యర్ధం అని తెలియక కాబోలు.

ఏడాదిన్నరగా అటు వైపు వెళ్ళే పనే పడలేదు. మా  పిల్లలే  వాళ్ళతో మాట్లాడి ఇంటికే పూలు తెచ్చి ఇచ్చే నెలసరి వాడకం ఏర్పాటు చేశారు.

చనిపోయిన మనిషి ఫొటోకు దండ వేసి, దీపం వెలిగించవచ్చా అనే శషభిష నేను పెట్టుకోలేదు. అది పిల్లల ఇష్టం. అలా చేయాలని వాళ్లకి  అనిపించింది, చేస్తున్నారు. నేను కలగచేసుకునే వ్యవహారం కాదు. కానీ ఒక్కోసారి పూలమ్మికి వీలుపడక పూలు తెచ్చి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని నేను వాళ్ళ ఫోన్ నెంబరు తీసిపెట్టుకున్నాను. ఈరోజు భోగి. రేపు పండగ. వాచ్ మన్ ఊరుకి పొతే పూలు తెచ్చేవాళ్ళు వుండరు. ఇంట్లో ఖాళీగా వున్నాను కనుక నాలుగు అడుగులు వేస్తె పోలా అని బయలుదేరాను. పూల పొట్లం తీసుకుని తిరిగివస్తుంటే ‘నమస్కారం శ్రీనివాసరావు గారూ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే పూలు కొనడానికి వచ్చిన ఒక వ్యక్తి హడావిడిగా నా వైపు వచ్చారు. ‘ఎలా వున్నారు. రోజు మీవి చదువుతుంటాను. ఈ మధ్య మీరు టీవీల్లో రావడం లేదు షరా మామూలు ప్రశ్నలే. టీవీలకి పోకపోవడానికి కారణం ఏడాది క్రితం మా ఆవిడ మరణం అని చెప్పగానే ఆయన నివ్వెర పోయారు. చాలాసేపు మాట్లాడారు. పిల్లలతో బయటకు  వచ్చినట్టున్నారు. వాళ్లకి నేను పలానా అంకుల్ అని పరిచయం చేశారు. Ramnath  Kampamalla  కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తున్నారట.  శివ రాచర్ల బాగా పరిచయం అని చెప్పారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి నాతొ ఫోటో దిగారు. వాట్స్ అప్ లో పంపారు కూడా. సంతోషం అనిపించింది.

కరోనా కాలంలో,  కాలం స్తబ్దుగా గడవడం అందరికీ అనుభవమే. నేడు నిన్నటిలాగా, రేపు నేటి మాదిరిగా ఎలాంటి మార్పు లేకుండా సమయం గడిచిపోతున్నప్పుడు ఏదో ఒక సందర్భం, ఒక సన్నివేశం, ఒక సంఘటన, ఒక కలయిక  మనకి ఒకింత ఊరట కలిగిస్తాయి. పర్వాలేదు, మనం ఒంటరి కాదు అనే స్వాంతన కలిగిస్తాయి.



ధాంక్స్ Ramnath  Kampamalla గారూ.

(13-01-2021)

ఉండవల్లి చెప్పిన సుడిగుండాల కధ - భండారు శ్రీనివాసరావు

 

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మాజీ పార్లమెంటు సభ్యుడు,తెలుగునాట సుబ్రమణ్యస్వామి అయిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి విలేకరులతో ప్రసంగించారు.
మాట్లాడుతున్నట్టు,ముచ్చట్లు చెబుతున్నట్టు గంటకు పైగా సాగినట్టు అనిపించిన ఈ ప్రసంగాన్ని చేటలో వేసి చెరిగి,రాజకీయాలను వడబోసిచూస్తే మాత్రం అందులో కొన్ని ఆధ్యాత్మిక ఛాయలు గోచరిస్తాయి. కానీ ఉండవల్లి ఏమి మాట్లాడినా రాజకీయ రంగు కనబడకుండా వుండడం అతి కష్టం. ఒక జాతీయ పార్టీని మనసులో పెట్టుకుని నర్మగర్భంగా విమర్శలు చేస్తూ పోయినా,చివరికి ఆ పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని పేరు పెట్టే మాట్లాడారు.
ఎప్పుడైతే రాజకీయం రంగప్రవేశం చేస్తుందో ఇక ఆ చెప్పిన దానికి రంగులు మారిపోతాయి.
అయితే,రాజకీయ పార్టీలకి,వాటికి వత్తాసు పలికే మీడియాకు ఉండవల్లితో ఒక వెసులుబాటు వుంది. ఆయన అన్ని పార్టీలని తెగిడేస్తారు. ఆ నోటితోనే అన్ని పార్టీలని పొగిడేస్తారు. కాబట్టి ఆయన ప్రసంగాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎవరికి కావాల్సిన ముక్కను వాళ్ళు ప్రసారం చేసుకోవచ్చు. నిన్న కొన్ని టీవీల్లో అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ చూసిన వారికి ఈ విషయం బాగా అర్ధం అయ్యేవుంటుంది.
అతి తీవ్రమైన రాజకీయ వ్యాఖ్యలు మినహాయిస్తే ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి.
వివేకానందుడి బోధనలు కూర్చిన “Selected works of Swami Vivekananda” అనే గ్రంధంతో పాటు మరికొన్ని పుస్తకాలను దగ్గర పెట్టుకుని తాను చెప్పే విషయం ఏ పేజీలో వుందో ఆ పేజీ నెంబరుతో సహా పేర్కొంటూ ఆయన తన ప్రసంగం కొనసాగించడం ఒక విశేషం.
నేను విన్నంత వరకు ఆయన చెప్పిన విషయాలను సంక్షిప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. వింటూ నోట్ చేసుకున్న సంగతులు కనుక పొరబాట్లు దొర్లితే దానికి నాదే బాధ్యత. ఉండవల్లి వారిది కాదు. కొన్ని ఆయన మాటల్లోనే:
“కాశ్మీర్ లో ఖీర్ (క్షీర్ ) భవానీ దేవాలయానికి స్వామి వివేకానంద వెళ్ళారు. (ఎప్పుడో వందేళ్ళ క్రితం నాటి మాట). అక్కడి దేవతా విగ్రహాన్ని తురుష్కులు పాడు చేశారు. జగన్మాత విగ్రహం అలాంటి దుస్థితిలో వుండడం చూసి వివేకానందుడికి తట్టుకోలేని బాధ,పట్టరాని కోపం కలిగాయట. “ఇలాంటి పనిచేసిన వారిని...” అని భావోద్వేగంతో తల్లడిల్లుతుంటే భవానీ మాత పలుకులు ఆయన చెవికి సోకాయి. “నువ్వు నన్ను కాపాడతావా లేక నేను నిన్ను కాపాడుతానా? ఏమి మాట్లాడుతున్నావు?” (పేజీ 130)
“దేశానికి ‘హిందుత్వ’నినాదాన్ని ప్రసాదించిన వీర సావర్కార్ కి దేవుడు అంటే నమ్మకం లేదు. ఆయన నాస్తికుడు. ఇంకో విచిత్రం ఏమిటంటే జిన్నా మూల పురుషులు హిందువులు. వాళ్ళ తాతగారు రాజపుట్. చేపల వ్యాపారం చేస్తాడని కులం నుంచి వెలి వేస్తె ముస్లిములు దగ్గరకు తీశారు. పేదవాడిని కులంపేరుతో దూరం చేసుకుంటే బ్రహ్మం అనే పేరు కలిగిన హిందువు అబ్రహాం అవుతాడు,ఇబ్రహీం అవుతాడు. మతాల మార్పిళ్లు ఆగాలంటే ముందు హిందూ మతంలో వున్న ఈ అవలక్షణాన్ని సరిచేసుకోవాలి.”
వివేకానందుడు ఇదే చెప్పాడు.
“పరమత సహనం అనేది మంచి మాట కాదు. మనం ఎవరం వారిపట్ల సహనం చూపించడానికి. నిజానికి అది దైవ దూషణ కిందికి వస్తుంది. మరో దేవుడిని కించపరచడమే. పరమతాన్ని ఒప్పుకోవాలి. నేను అన్ని మతాలను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవులతో కలిసి వారి చర్చికి వెళ్లి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే నేనూ అలా చేస్తాను. ముస్లిములతో కలిసి మసీదుకు వెళ్లి వారు ఎలా నమాజు చేస్తే నేనూ అలాగే చేస్తాను. అలాగే బౌద్ద ఆరామాలలో” (పేజీ 374)
మత మార్పిడులకు ప్రధాన కారణం అస్పృశ్యత అని అంటూ ఉండవల్లి ఓ ఉదాహరణ చెప్పారు.
“పూర్వ కాలంలో తెల్లవాళ్లు మనని పాలించేటప్పుడు వారికి సంఘంలో చాలా గౌరవం వుండేది. పల్లెటూళ్ళలో అంటరానివారిని దూరంగా పెడతారు. వారికి గ్రామ కారణం,మునసబు వీరే పెద్దలు. అలాంటివాళ్ళు కూడా తెల్ల దొర రాగానే లేచి నిలబడి మర్యాద చేయడం వీరు గమనించిన తర్వాత ఆ తెల్లదొర మన మునసబు, కరణాలకంటే గొప్పవాడనే అభిప్రాయం వారికి కలుగుతుంది. అంత గొప్ప తెల్లదొర నేరుగా తమ గూడేనికి వచ్చి తమను గుండెలకు హత్తుకుని మనందరం ఒకటే అని చర్చికి తీసుకుపోతే మతం మారకుండా ఎలా ఉంటాడు. వాడు మారుతున్నాడని గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏమిటి? హిందువులు తమలోని అన్ని కులాల వారినీ సమానంగా అక్కున చేర్చుకుని వుంటే ఈ దుస్థితి దాపురించేది కాదు”
వై.ఎస్. గురించి కూడా ఉండవల్లి ఓ జ్ఞాపకాన్ని మననం చేసుకున్నారు.
“వై.ఎస్.ఆర్. కి మత పట్టింపులు లేవు. ఒకసారి అన్నవరం దేవస్థానంలో చక్కగా కూర్చుని చాలాసేపు వ్రతం చేశారు. నేను దూరంగా నిలబడి వుంటే, ‘నువ్వేం బ్రాహ్మడివయ్యా వచ్చి కూర్చో’ అని పిలిచారు.
“ఇక ఆయన బాబాయి సుబ్బారెడ్డి గారెని మించిన హిందువు లేడు. గ్రహణ కాలం పూర్తయిన తర్వాత కానీ వాళ్లింట్లో వంటలు వండరు. అంత నిష్టగా వుంటారు. సుబ్బారెడ్డి గారి భార్య పొద్దున్నే నల్లావుకి (కపిల గోవు) దణ్ణం పెట్టుకొని కానీ ఏ పనీ చేయరు”
“ప్రపంచంలోని మిలిటరీ అంతా తెచ్చినా మన దేశంలో గుళ్ళకి కాపలా పెట్టడం సాధ్యం కాదు. ఇక్కడి నుంచి మా ఇంటికి అయిదు నిమిషాల నడక. ఈ కొద్ది దూరంలోనే నాలుగు దేవాలయాలు వున్నాయి. అయితే మన పోలీసులు కడు సమర్ధులు. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే ఇరవై నాలుగు గంటల్లో దోషులని పట్టుకుంటారు. దొరికినవాళ్ళు వైసీపీ అని టీడీపీ, టీడీపీ వాళ్ళు అని వైసీపీ పేచీలు పెట్టకూడదు. అలా అయితేనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగవు. అసలు రామతీర్ధం వంటి సంఘటనలతో ఏ పార్టీకి సంబంధం లేదనేది నా నమ్మకం. అధికారంలో వున్న వైసీపీ అసలు చేయదు. కాకపొతే ఇలాంటివి జరిగినప్పుడు అన్ని పార్టీలు తమ స్వలాభం కోసం ప్రకటనలు చేస్తుంటాయి. వీటికి అసలు కారణం ఆకతాయి మనుషులు. వారికి ఏదో చేసి దానితో ఏదో చేయగలిగాం అని సంతోషపడుతుంటారు. సుడిగుండాలు సినిమా జ్ఞాపకం వుంది కదా! ఒక చిన్న పిల్లవాడిని ఒక యువ జంట అకారణంగా హత్య చేస్తుంది. కోర్టులో అదే చెబుతారు. అసలా పిల్లవాడు ఎవడో తమకు తెలియదు అని,సరదాకోసం ఈ పని చేసాం అని.”
“సత్య కామ జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి ఎవరి ఇంట్లోనో దాసిగా వున్నప్పుడు అనేకమందికి పరిచర్యలు చేసేది. ఆ సమయంలో కడుపున పడ్డ వాడు యితడు. గౌతముడి వద్ద శిష్యుడిగా చేరడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇతడి కుల గోత్రాలను ఆరా తీస్తాడు. నాకు నా తల్లి చెప్పిన ప్రకారం నా తండ్రి ఎవరో నాకు తెలియదు. నా పుట్టుక ఇది అని ఆ కుర్రవాడు చెబుతాడు. గౌతముడు అతడి నిజాయితీని మెచ్చుకుని ‘కఠోరమైన నిజాలను చెప్పే శక్తి ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుందని అతడిని శిష్యుడిగా స్వీకరిస్తాడు.”
ఉండవల్లి చెప్పిన మాటల్లో ఒక జాతీయ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైన అంశాలు వున్నాయి. కావాలనే వాటి ప్రస్తావన తీసుకు రావడం లేదు. (13-01-2021)

విప్లవ తపస్వి పీవీ : సమీక్ష (రెండో భాగం)

 విప్లవ తపస్వి పీవీ – రచయిత శ్రీ ఏ. కృష్ణారావు

సమీక్ష: భండారు శ్రీనివాసరావు

ఏమిటీ విరోధాభాసం? విప్లవానికి, తపస్సుకు ఎక్కడ పొంతన? రచయిత కృష్ణారావు గారు ఈ పుస్తకానికి ఎందుకిలా పేరు పెట్టినట్టు?
చేతికి అందగానే సహజంగా కలిగే సందేహాలు ఇవి.
203వ పేజీలో వీటికి సమాధానం దొరుకుతుంది.

1972 ఆగస్టు 15, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పాతికేళ్ళు. దేశమంతటా రజతోత్సవ సంబరాలు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని అర్ధరాత్రి సమావేశ పరిచారు. ముఖ్యమంత్రి శ్రీ పీవీ నరసింహారావు ప్రసంగించారు.

“ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు
ఒళ్ళు విరిచి, కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు
కటిక చీకటుల చిమ్మెడు కారడివిని పయనించు
నిజ జఠరాగ్ని జ్వాలలు నింగినంత లేపినాడు”
ముఖ్యమంత్రి నోట ఈ కవితాగానం సుదీర్ఘంగా సాగిపోయింది.

‘అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు లేచిన భారతీయుడి హృదయగానం.
ఆ మేల్కొన్న మనిషి ఎవ్వరు?
ఆయనే వివరించారు.

“యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమ్రింగగ
సంధ్యారుణ రౌద్ర క్షితిజ ముఖుడై చెలంగినాడు.
వాడొక విప్లవ తపస్వి”

అంటే ఒక రకంగా ఈ పుస్తకానికి పెట్టే పేరును పీవీ గారే స్వయంగా ముందుగానే సూచించారనుకోవాలి.

‘ఎక్కడ విప్లవం? ఎక్కడ తపస్సు? విప్లవ తపస్వి అనేదే ఒక విరోధాభాస. అది పీవీకే సాధ్యం’ అంటారు రచయిత.

ఆ సామాన్యుడిది ‘మోడువడిన కాయం. బువ్వకు నోచని జనగణముల వెతల బరువు మోసినాడు’ అని పీవీ ఆ కవితలో పేర్కొన్నారు.
దేశ విభజననూ పీవీ విమర్శించారు.

“పావు శతాబ్ధము పొడుగున పాలకులు,అర్భకులు మధ్య
విభజన వికృతమై పోవగ,బావురుమనే జీవితాలు
అటు సమృద్ధి, ఇటు దైన్యము
అటు పెంపు, ఇటు హైన్యము
ఒకరు మింటికెగర, అసంఖ్యాకులింకిరి భూతలమున
ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు”

ఈ కవిత పీవీ రాసారు అనే నిజం తెలియని వారు దీన్నిచదివితే ఇది తప్పకుండా ఎవరో విప్లవకవి రాసిన గీతం అని పొరబడే అవకాశం వుంది.

ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇటువంటి విమర్శలను, అదీ శాసన సభలో చేయడానికి ఎంత ధైర్యం కావాలి?

‘పీవీ నరసింహారావుకు పాండిత్యం, భాషాపరిజ్ఞానంతో పాటు చైతన్యవంతమైన, కవికి అవసరమైన భావోద్వేగాలున్నాయని ఈ ఒక్క కవిత చదివితే అర్ధం అవుతుందని, బహుశా ఈ భావోద్వేగాలతోనే భూసంస్కరణలు ప్రవేశపెట్టినందుకే ముఖ్యమంత్రి పదవి కోల్పోయినట్టు అనిపిస్తుంద’ని రచయిత రాసారు.

చాలా కాలం తర్వాత, ప్రధాన మంత్రి అయిన తర్వాత పీవీకి ఈ కవిత సంగతి గుర్తుకు వచ్చినట్టుంది.

అప్పుడు అసెంబ్లీలో పనిచేస్తున్న శ్రీ కేశవరావు (కలం పేరు నగ్నముని. దిగంబర కవులలో ఒకరు)కు ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.

“1972 ఆగస్టు 15 వ తేదీ అర్ధరాత్రి పీవీ గారు చదివిన కవిత కాపీ దొరుకుతుందా ?” అని పీఎం ఓ.ఎస్.డి. శ్రీ ఏ.వీ.ఆర్. కృష్ణ మూర్తి అడిగారు. నగ్నముని అసెంబ్లీ రికార్డులు అన్నీ వెతికారు. కానీ దొరకలేదు. చివరకు ఆ రోజుల్లో వచ్చే ఆంధ్ర జనత పత్రికలో ఈ కాపీ సంపాదించి పీవీకి పంపారు. ఈ విషయం నగ్నముని తనతో చెప్పినట్టు రచయిత శ్రీ కృష్ణారావు రాసారు.

(ఇంకా వుంది)

12, జనవరి 2021, మంగళవారం

విప్లవ తపస్వి పీవీ : రచన: శ్రీ ఏ. కృష్ణారావు

 

ఒక రోజు ఢిల్లీలోని మయూర్ విహార్ లో ఎల్ ఐ సీ పాలసీ కట్టేందుకు ఈ పుస్తక రచయిత శ్రీ ఏ. కృష్ణారావు క్యూలో నిలబడి వుండగా పీవీ గారి నుంచి ఫోన్ వచ్చింది.
‘కృష్ణారావ్ నీతో పనిపడింది వస్తావా’ అంటున్నారు మాజీ ప్రధాని పీవీ.
ఆయన పనులు పూర్తిచేసుకుని, ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆ తర్వాత మోతీలాల్ మార్గ్ లోని పీవీగారి నివాసానికి వెళ్లారు కృష్ణారావు.
ఆయన్ని చూస్తూనే పీవీ ఇలా అడిగారు, “నా వద్ద పాత పత్రికల పీ డీ ఎఫ్ కాపీలు వున్నాయి. వాటిని ఓసీఆర్ (Optical Character Recognition) చేసి టెక్స్ట్ గా మార్చి ఎడిటింగ్ చేసుకోవచ్చా.”
“నాకు తెలిసింది చెప్పాను. దానికే పీవీ ఎంతో సంతోషపడ్డారు. వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు” అని గుర్తుచేసుకున్నారు కృష్ణారావు.
ఒకప్పుడు ఒంటిచేత్తో దేశాన్ని పాలించిన మనిషి. కంటిచూపుతో రాజకీయాలను శాసించిన మనిషి. అలాంటి వారు పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా కాకితో కబురు చేస్తే చాలు, అటువంటి పనుల్లో నిష్ణాతులైన వాళ్ళు ఎగురుకుంటూ వచ్చి అడిగిన పనులు వెంటనే చేసి పెడతారు. అయినా ఆయన ఆ అవకాశాలను వాడుకోకుండా తనకు పరిచయస్తుడైన ఓ పత్రికా విలేకరి సాయం కోరారు. ఇది ఆయన వ్యక్తిత్వశోభకు గీటురాయి అని చెప్పడానికి, ఒకప్పుడు దేశానికి అయిదేళ్లపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తితో గ్రంధ రచయితకు ఉన్న సాన్నిహిత్యాన్ని తెలపడం ద్వారా ఇందులో రాసిన విషయాలకు ఎంతటి సాధికారత ఉన్నదో ఈ సమీక్ష చదివే పాఠకులకు అవగాహన కలిగించడానికి మాత్రమే ఈ ఉదంతాన్ని మొదట్లోనే స్థాలీపులాక న్యాయంగా పేర్కొంటున్నాను. (ఇంకావుంది)



NOTE: సుమారు 225 పేజీలకు విస్తరించిన ఈ గ్రంధంలోని ఆసక్తికర విషయాలను సంక్షిప్తంగానే అయినా చదువరులకు తెలియచెప్పడం కోసం ఈ సమీక్షను చిన్న చిన్న భాగాలుగా విభజించి రాస్తున్నాను. దయచేసి గమనంలో పెట్టుకోగలరు. – (భండారు శ్రీనివాసరావు)
విప్లవ తపస్వి పీవీ రచన: శ్రీ ఏ. కృష్ణారావు,ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, ఫోన్: 9494875959 (HYD), 9032428516 (Vijayavada)
Kinige, & amazon For Online purchase : www.srpublications.in
PRICE: Rs. 150/-

11, జనవరి 2021, సోమవారం

ఇంటింటి డెమోక్రసీ – భండారు శ్రీనివాసరావు

 

“దేశంలో ఏమో కానీ మా ఇంట్లో మాత్రం ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది” అన్నాడు ఏకాంబరం పేపరు ముడిచి పక్కన పెడుతూ ఇంటికి వచ్చిన పీతాంబరంతో.

“ఎలా అని కదా నీ అనుమానం. తీరుస్తాను చూడు” అంటూనే “మా ఫ్రెండ్ వచ్చాడు, ఫిల్టర్ వేసి స్ట్రాంగ్ గా రెండు కాఫీ పట్రా” అని కేకేసి చెప్పాడు వంటింట్లో వున్న భార్యతో.

క్షణం ఆలస్యం లేకుండా లోపల నుంచి ఆవిడ గొంతు కాస్త దాష్టీకంగానే వినపడింది.
“చేయి ఖాళీ లేదు, హోటల్ కు వెళ్లి తాగి రండి”

“చూసావా పీతాంబరం! ఇదీ నిజమైన డెమోక్రసీ. నేను ఈ ఇంటి యజమానిని. ఇక్కడ కూర్చుని ఏ ఆర్డర్ వేసే అధికారం అయినా నాకుంది. కానీ దాన్ని అమలుచేసే యంత్రాంగం వంటింట్లో వుంది. కుదరదు అని అంటే నేను చేసేది ఏమీ లేదు”

(11-01-2021)