10, జనవరి 2021, ఆదివారం

(PLEASE CHECK TWICE BEFORE YOU BELIEVE- BHANDARU)

WhatsApp issues clarification after continuous social media criticism over the new update, says 'It is only for business chats'
Source: "True Scoop" via Dailyhunt…
See More

9, జనవరి 2021, శనివారం

రాజకీయ చదరంగంలో రాజ్యాంగ వ్యవస్థలు – భండారు శ్రీనివాసరావు

 

సూటిగా సుతిమెత్తగా .......

కురువంశ చక్రవర్తులైన ధృతరాష్ట్రుడు, ఆయన సోదరుడు పాండురాజు అన్నదమ్ములు.

‘ఈ సోదరుల సంతానం అయిన గాంధారి పుత్రులు కౌరవులు, కౌంతేయులైన పాండవులు తమ తండ్రుల బాటలోనే కలిసిమెలిసి ఉంటారని అనుకున్నానే కానీ ఇలా విడిపోయి కయ్యాలకు కాలు దువ్వుతారని ఊహించలేకపోయాన’ని కురుక్షేత్ర సంగ్రామానికి వారు  సంసిద్దులవుతున్న తరుణంలో భీష్మ పితామహుడు మధన పడతాడు.

భారత రాజ్యాంగం రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈనాడు జీవించి వుంటే, నేటి పరిస్థితులను గమనించి  భీష్మాచార్యుని మాదిరిగానే కలతచెంది వుండేవారు. రాజ్యాంగ వ్యవస్థలు మూడూ ఎవరి పరిధిలో అవి  స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అదే సమయంలో తమ పరిధి మించి ప్రవర్తించకుండా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావించి వుంటారు కానీ, తమది పై చేయి అంటే తమదే పైచేయి అనే ఆధిక్యతాధోరణిలో కీచులాడుకుంటాయని ఆనాడే ఊహించివుంటే రాజ్యాంగ రచనలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుండేవారేమో!

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో తాము కోరుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. అంటే ప్రజలే ప్రభువులు. ప్రజల తరపున ఆ ప్రభుత్వాలు ప్రజలని పాలిస్తున్నట్టు లెక్క. ఈ కోణంలో చూస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది మాట. అంటే ఒక రకంగా మనది  ప్రజాస్వామ్య నియంతృత్వం అంటే నొచ్చుకోవాల్సిన పనిలేదు. గతంలో, వర్తమానంలో కూడా ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రభుత్వాలను ప్రజలు చూశారు. వారికి నచ్చని ఆ ప్రభుత్వాలను ఆ ప్రజలే ఎన్నికల్లో పక్కన పెట్టారు.  

రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ చెలరేగితే సర్దుబాటు చేయడానికి మరో రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ వున్నది. చిత్రం ఏమిటంటే ఈ మూడు వ్యవస్థలు అంటే ప్రభుత్వం, పరిపాలన, న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తూనే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ మూడింటి మీదా రాజ్యాంగానిదే పై చేయి. ఇక ప్రజలు అంటే ఓటర్లది మరింత పై చేయి. ఎందుకంటే వారు ఎన్నుకున్న పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సైతం సవరించే అధికారం వుంది.

రాజ్యాంగ నిర్మాతలు తమకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా, సమన్వయంతో పనిచేస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పొరపొచ్చాలతో వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం పలుచబడుతుంది. రాజ్యాంగ వ్యవస్థలు ఈ వాస్తవాలను గమనంలో వుంచుకున్నంత కాలం ఘర్షణలకు అవకాశం వుండదు. వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. వ్యవస్థల గౌరవం నిలబడుతుంది.

ఇక ఈ మూడింటిలో ఒకటి ప్రభుత్వం. దీన్ని రాజకీయాల నుంచి వేరు చేసి చూడడం అసాధ్యం. మిగిలిన రెండూ రాజకీయాలకు దూరంగా , వాటి నీడ తమ కార్యకలాపాలపై పడకుండా చూసుకోగలిగితే లేనిపోని ఘర్షణలకు  అవకాశం వుండదు.

ఈ రెండు వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్టు కనపడాలి కూడా. ప్రధానంగా న్యాయమూర్తులు, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులకు ఈ బాధ్యత ఎక్కువ. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అప్పుడప్పుడు హెచ్చరికలు చేస్తూ వుండడాన్ని బట్టి చూస్తే అధికారుల వ్యవహార శైలి పట్ల రాజకీయ పార్టీలకి సందేహం వుందని అర్ధం అవుతుంది. ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థ కూడా ఇటువంటి ఆరోపణలకు గురవుతూ వుండడం మరింత ఆందోళన కలిగించే విషయం.  ఇటువంటి సందర్భాలలో మంచీచెడూ చెప్పాల్సిన మీడియా కూడా రాజకీయ రంగులు పులుముకోవడం యావత్ పరిణామాలను మరింత విషమం చేస్తోంది.

ఏమిటి దీనికి కారణం?

రాజ్యాంగ వ్యవస్థలలోని వ్యక్తులు సైతం రాజకీయాల పట్ల ఆకర్షితులు కావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మూడు దశాబ్దాలకు పైగా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించిన ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, న్యాయాధికారులు, ఆఖరికి మిలిటరీ అధికారులు సైతం ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఎక్కువ కావడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది మంచిది కాదని అనడం లేదు. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలతో పోలిస్తే, రాజకీయాలకు సంఘంలో వున్న ప్రాధాన్యత వివరించడానికే ఈ వివరణ.

ఇలా రాజకీయాలకు ఆకర్షితులయ్యే కొందరు అధికారులు తమ పదవీకాలంలో కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అండదండలు అందించే  వుంటారు అని సందేహించేవారిని తప్పు పట్టే అవసరం ఉంటుందనుకోను. ఇలా అన్ని వ్యవస్థలు ఎంతో కొంత రాజకీయ రంగు పులుముకుంటున్నప్పుడు అసలు సిసలు  రాజకీయం చేసే రాజకీయ నాయకులు చేతులు కట్టుకుని కూర్చుంటారా!

అదే జరుగుతోంది ఇప్పుడు.

తోకటపా:

సరే! ఒకప్పటి సంగతి చెప్పుకుందాం. రెండు వ్యవస్థల నడుమ సంఘర్షణలు భారత ప్రజాస్వామ్యంలో కొత్తవేమీ కావు. వీటిని వ్యవస్థల నడుమ ఘర్షణలు అనడం కంటే ఆ వ్యవస్థలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల నడుమ ఘర్షణలు అంటే సబబుగా వుంటుంది.

లోగడ నెహ్రూ ప్రధానమంత్రిగా వున్నప్పుడు అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ తో ప్రధానికి కొన్ని విషయాల్లో పొరపొచ్చాలు వచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరూ ఒకే పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఈ తలనొప్పులు తప్పలేదు.

అలాగే జ్ఞానీ  జైల్ సింగ్ రాష్ట్రపతిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని ఏదో ఒక కారణంతో పదవి నుంచి దింపేయాలని తలపోసినట్టు ఆ రోజుల్లో బాహాటంగానే చెప్పుకున్నారు. తన తల్లి హత్యకు కారణం అయిన ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థతో జైల్ సింగ్ కు సంబంధాలు వున్నాయని రాజీవ్ కు అనుమానం. తన ఫోన్ సంభాషణలపై గూఢచర్యం జరుగుతోందని జైల్ సింగ్ కు సందేహం. అంచేతే ఆయన తనను చూడవచ్చిన వారిని రాష్ట్రపతి భవన్ లోని  ఉద్యానవనంలో  కూర్చోబెట్టి  మాట్లాడేవారని ఒక మాట ప్రచారంలో వుండేది. ఇందిరాగాంధి హత్యానంతరం సిక్కులపై జరిగిన హత్యాకాండలో బాధితులైన వారికి ప్రధాని రాజీవ్  తగిన న్యాయం చేయలేకపోయారని కూడా జైల్ సింగ్  మనసులో వుంది.

అంతే కాదు, రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని మిలిటరీ చర్య ద్వారా పడగొట్టడానికి ఓ కుట్ర జరిగిందని, ఈ విషయం రాష్ట్రపతికి కూడా తెలుసని మాజీ మిలిటరీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ పీ.ఎన్. హూన్ రాసిన ‘ది అన్ టోల్డ్ ట్రూత్ అనే  పుస్తకంలో వుంది. అయితే ఈ మిలిటరీ చర్య వల్ల పరిణామాలు విపరీతంగా ఉండవచ్చని, చివరికి దేశం సైన్యం హస్తగతమయ్యే ప్రమాదం కూడా వుందని జైల్ సింగ్ సందేహపడ్డారని ఆర్మీ కమాండర్ హూన్ పేర్కొన్నారు.       

ఇవన్నీ  చిలికి చిలికి గాలివాన కాకుండా వారిరువురు నిగ్రహం పాటించడం వల్ల ఆ రోజుల్లో పెద్ద సంక్షోభం తప్పిపోయింది.

అంటే ఏమిటన్న మాట!

ఈనాడు నిర్ణయాలు తీసుకునేవారికి అధికారం మాత్రమే కాదు, నిగ్రహం కూడా అవసరం. 

(09-01-2021)    

       

ఆ మాట చెప్పాల్సింది నేను

 అత్తగారు చేటలో బియ్యం పోసుకుని చెరుగుతూ వరండాలో కూర్చుని వుంటే ఓ బిచ్చగాడు వచ్చి అమ్మగారు బిక్షం అని కేక పెట్టాడు. లోపల పనిచేసుకుంటున్న కోడలు పిల్ల, ‘చేయి ఖాళీ లేదు, రేపు రా’ అని మరో కేక పెట్టింది. బిచ్చగాడు వెళ్లిపోతుంటే అత్తగారు ‘ఇటురా అబ్బీ’ అని ఇంకో కేక పెట్టింది. వాడు ఆశగా వచ్చి నిలబడితే ‘చేయి ఖాళీ లేదు రేపు రా’ అంది. ‘అదేమిటమ్మ గారూ మీ కోడలు గారు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి నన్నెందుకు వెనక్కి పిలిచారు’ అని అడిగాడు.

‘ఎందుకా చేయి ఖాళీ లేదు అని చెప్పడానికి అదెవత్తె! ఏ మాటైనా చెప్పే అధికారం ఈ ఇంట్లో నాదే’ అన్నది అత్త గారు చేతిలో చేట విదిలిస్తూ.
ఇది చిన్నప్పుడు చదువుకున్న కధ. ఇప్పుడు కూడా ఇలాంటి కధలు పునరావృతం అవుతున్నాయి వేరే రూపాల్లో.
కాకపొతే ఈ కొత్త కధల్లో కోడలు పాత్ర లేదు. ఇద్దరూ అత్తలే.

(ఇందులో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఛాయలు కనబడితే ఆ తప్పు నాది కాదు)


8, జనవరి 2021, శుక్రవారం

మరో ట్రంప్ రాడని నమ్మకం ఏమిటి ? – భండారు శ్రీనివాసరావు

 

మెడ పట్టుకుని వెళ్ళగొట్టినా చూరు పట్టుకుని వేళ్లాడేవారు వుంటారు అనడానికి ట్రంప్ ఓ ఉదాహరణ.

ఓట్ల లెక్కింపులో జరిగిన కుట్రల ఫలితంగా బైడెన్ గెలిచాడని, కానీ తాను ఓడిపోలేదని ఆయన వాదన. ఈ విషయంలో ట్రంప్ ను అందరూ తప్పు పడుతున్నారు సరే. కానీ అమెరికా ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత గురించి ఎవరూ మాట్లాడడం లేదు. యావత్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకునే ఆ దేశం ఈనాడు ఆలోచించుకోవాల్సింది,తక్షణం చర్యలు తీసుకోవాల్సింది ఈ విషయంలోనే.

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. అయినా ప్రతిష్టంభనకు అవకాశం ఏర్పడింది అంటే లోపం ఎక్కడ వున్నట్టు?

ఇంత రగడ అవసరమా! మున్ముందు ఇంతకంటే పెద్ద గొడవలు సృష్టించే నాయకులు పుట్టుకువస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?

(08-01-2021)

కంభంపాడు ఇల్లు

 దాచుకోలేనివి పారేయలేనివి కొన్ని వస్తువులు అందరి ఇళ్ళలో ఏవో కొన్ని వుంటాయి.

మా స్వగ్రామం  కంభంపాడులో ఎప్పుడో వందేళ్ళ క్రితం పూర్వేకులు కట్టిన పెద్ద పెంకుటిల్లు పడగొట్టి, నేటి అవసరాలకు తగినట్టుగా రెండేళ్ల క్రితం ఓ  కొత్త చిన్న సైజు ఇల్లు నిర్మించారు. చిన్నప్పుడు మేమందరం పెరిగిన ఆ పాత కాలపు ఇంట్లో అనేక పాత పరికరాలు ఉండేవి. వడ్లు, జొన్నలు దంచడానికి, పప్పులు రుబ్బడానికి వీలైన వేర్వేరు రకాల రోళ్ళు, రోకళ్ళు, పొత్రాలు, పిండ్లు విసరడానికి విసుర్రాళ్ళు, ఆడపిల్లలు ఆడుకోవడానికి పచ్చీసులు, వామనగుంటలు, బావిలో పడిపోయిన వస్తువులను తీసే పాతాళ గిరిక వంటివి మా ఇంట్లో ఉండేవి. వీటిల్లో కొన్నింటిని కొత్త ఇంటి ఆవరణలో భద్రపరిచారు.


(నీళ్ళ గాబు)


(రోలు, రోకలి)



(పాతాళ గిరిక)


(విసుర్రాయి)


(రోలు, పొత్రం)


(వామనగుంటలు)



చాలా సామాగ్రి  కాలగర్భంలో కలిసిపోయింది. ఆడవాళ్ళు ప్రయాణాలు చేయడానికి మేనా, మగవారి ప్రయాణాలకోసం గుడిసె బండ్లు, ఎడ్ల మెడలకు కట్టే గంటలు, మువ్వల పట్టెడలు,  మూపురాలకు, నడుముకు  కట్టే రకరకాల అలంకరణ సామాగ్రి, ఎడ్లను అదిలించడానికి తోలుతో తయారు చేసిన చర్నాకోలలు, ములుకర్రలు ఇలా చాలా వస్తువులు మా చిన్నతనంలో మా ఇంట్లో ఉండేవి. చాలావరకు అదృశ్యం అయిపోయాయి. పేర్లు కూడా గుర్తు రానంతగా కొన్ని కనబడకుండా పోయాయి.         














ఆత్మస్తుతి పరనింద

మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మ ద్రోణులు నేల కూలిన తర్వాత సైన్యాధిపత్యం స్వీకరించిన కర్ణుడు కదనరంగంలో అర్జునుడు లేని సమయం చూసి చెలరేగిపోతాడు. ధర్మరాజుపై శరపరంపరగా అస్త్రాలు ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తాడు.

సూర్యాస్తమయం కాగానే నాటి యుద్ధం ముగుస్తుంది. గాయపడ్డ శరీరంతో, బాధ పడుతున్న మనసుతో ధర్మజుడు గుడారం చేరతాడు. అక్కడ తమ్ముడు అర్జునుడిని చూడగానే మనసులోని మాట పైకి వస్తుంది.

కర్ణుడు బాణ ప్రయోగంతో తనను నిలువెల్లా గాయపరుస్తుంటే వెంట వుండి కాపాడాల్సిన పాండవ మధ్యముడు కనిపించకుండా పోయాడని’ నిందారోపణ చేస్తాడు.

కౌరవులతో సాగిస్తున్న ఈ మహా సమరంలో తాను ఒక్కడే పదుగురి పెట్టున ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని, అలాంటి తనపైనే ఈ నిష్టూరాలు ఏమిటని కిరీటి బాధపడతాడు. ఇంతటి నింద మోస్తూ జీవించడం కంటే మరణమే మేలని ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. అది గమనించిన యుధిష్టురుడు, ‘తొందరపడి మాట తూలినందున తాను ప్రాణాలు త్యజించడమే సబబని’ తమ్ముడిని వారించబోతాడు.

వీరి సంభాషణను ఆలకించిన శ్రీ కృష్ణుడు వారితో ఇలా అంటాడు.

మీరిద్దరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే తమ్ముడిని నిష్కారణంగా నిందించినప్పుడే ధర్మజుడు మరణించాడు. అలాగే ఆత్మస్తుతికి పాల్పడినప్పుడే పార్ధుడు జీవచ్చవంగా మారిపోయాడు”.

మహాభారతంలో ప్రక్షిప్త కధనంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వృత్తాంతం తెలిపేదేమిటంటే ఆత్మస్తుతి (స్వోత్కర్ష) పరనింద (ఆరోపణ) వీటికి పాల్పడే వాడు జీవించి వున్నా మరణించినట్టు లెక్కే అని.

 


5, జనవరి 2021, మంగళవారం

ఇంతకంటే ఏం కావాలి? – భండారు శ్రీనివాసరావు

 

ఎప్పటి రేడియో మాస్కో? ఎప్పటి తెలుగు వార్తలు?

ముప్పయ్యేళ్లు దాటింది నేను మాస్కో రేడియోలో తెలుగు వార్తలు అయిదేళ్లపాటు చదివి హైదరాబాదుకు తిరిగొచ్చి.

రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారనే పరిచయం లేని పెద్దమనిషి ఫోను చేశారు. పత్రికల్లో నేను రాసే వ్యాసాలు చదివి గూగుల్ సెర్చి ద్వారా నా ఆనుపానులు పట్టుకున్నారుట. ఆరోజుల్లో మాస్కో రేడియో తెలుగు వార్తలు క్రమం తప్పకుండా వినే అలవాటు తనకు ఉండేదని, ఒకసారి నా సంతకంతో మాస్కోనుంచి పంపిన చిరుకానుక తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందనీ చెప్పారు. శ్రోతలకు అలా కానుకలు పంపే సంప్రదాయం రేడియో మాస్కోలో వుండేది.

మాస్కో రేడియోతోటే ఒదిలిపెట్టలేదు. అంతకుముందు 1971లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేసేటప్పుడు నేను రాసిన ‘వాక్టూనులు’, ‘బుక్ రివ్యూలు’ గురించి సవిస్తరంగా ప్రస్తావించడం చూసి ఆయన ధారణ శక్తికి ఆశ్చర్యపోవడం నావంతయింది. అల్లాగే హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా కార్యక్రమం ‘జీవన స్రవంతి’ గురించి కూడా చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. 1975 లో ఆ కార్యక్రమం నేను మొదలు పెట్టినప్పటి నుంచి జీవనస్రవంతి ప్రసారం చేసే వేళలు ఎలా మారుతూ వచ్చాయో అన్న వివరాలు కూడా ఆయన చెప్పేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు.

చంద్రశేఖర్ గారూ. రేడియో మీద మీ అచంచల అభిమానానికి నా సెల్యూట్.

(కింది ఫోటో: ముప్పయ్ మూడేళ్ల క్రితం హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి వారం వారం జీవన స్రవంతి కార్యక్రమం చదువుతున్న దృశ్యం)