12, డిసెంబర్ 2020, శనివారం
Journalist Diary || SATISH BABU || With BHANDARU SRINIVAS RAO
37 ఏళ్ళక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ, అలనాటి పాలక పక్షం కాంగ్రెసును మట్టికరిపించిన రోజుల్ని నాచేత, నానోట గుర్తు చేయించిన జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబుకు, విశ్వనాధ్ గారికి కృతజ్ఞతలు.
11, డిసెంబర్ 2020, శుక్రవారం
10, డిసెంబర్ 2020, గురువారం
విని వూరుకున్నంత సుఖం లేదు - భండారు శ్రీనివాసరావు
Long long ago, So long ago, Nobody can say how long ago అనగా ....
ఒకానొక కాలంలో నేను టీవీ చర్చలకు క్రమం
తప్పకుండా అనుదినం వెడుతుండే బంగారు కాలంలో ఒకానొక రోజు...
టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ
తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో చర్చలకు వచ్చిన రాజకీయ
నాయకుకులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు
కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా
వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.
'అది
తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో
డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు
అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు
తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా:
ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ
ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి.
చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని
వూరుకున్నంత సుఖం మరోటి లేదు. ఇలాంటి వాటినే మీడియా పరిభాషలో ఆఫ్ ది
రికార్డ్ అంటారు)
ఇరానీ హోటల్ సమోసా – భండారు శ్రీనివాసరావు
నేను హైదరాబాదు వచ్చిన కొత్తల్లో అంటే సుమారుగా కొంచెం అటూ ఇటూగా యాభయ్ ఏళ్ళ నాడు, మిత్రుడు ఒకరు నాకో విషయం చెప్పారు.
హైదరాబాదులో
వున్న వందలాది ఇరానీ రెస్టారెంట్లలో సమోసాలు అన్నీ ఒకే సైజులో, ఒకే రుచి ఉండేలా ఎలా తయారు చేస్తారు
అనే నా సందేహానికి జవాబుగా అతడు చెప్పిన మాట ఏమిటంటే ఇవన్నీ ఒకే చోట తయారు చేసి వాటిని
నగరంలోని అన్ని ఇరానీ హోటళ్ళకు సప్లయి చేస్తారని. దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి
ఇన్నేళ్ళలో నేనెప్పుడూ ప్రయత్నించలేదు.
ఇప్పుడు
సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీల అభిమానులు షేర్ చేస్తున్న అభిప్రాయాలు, కేప్షన్లు, కార్టూన్లు చూస్తుంటే వాటి రంగూ, రుచీ, పోలిక ఒకే విధంగా ఉంటున్నాయి.
నా
స్నేహితుడు చెప్పినట్టు ఇరానీ రెస్టారెంట్లలో సమోసాల మాదిరిగా ఈ పోస్టులన్నీ ఒకే చోట తయారయి షేర్
సింగుల ద్వారా అందరికీ చేరడం లేదు కదా అనే అనుమానం కలుగుతోంది. (10-12-2020)
9, డిసెంబర్ 2020, బుధవారం
సున్నకు సున్న హళ్ళికి హళ్ళి
నేను టీవీ చర్చలకు వెళ్ళే రోజుల్లో నా మిత్రులు అంటుండేవారు 'నువ్వు తెరమీద కనిపించేది ఎక్కువ, మాట్లాడేది తక్కువ' అని.
యాంకర్ అడిగేవరకూ కల్పించుకుని
మాట్లాడకూడదు అని నాకై నేను పెట్టుకున్న నియమం దానికి కారణం.
పోతే, నాకిది
ఒకరకంగా కలిసి వచ్చింది కూడా. రాజకీయ పార్టీల ప్రతినిధులు చాలా మందిలో విషయ
పరిజ్ఞానం వుంది. కొన్ని అంశాలను గురించి వాళ్ళు చక్కటి హోం వర్క్ చేసుకుని
వచ్చేవారు. అనవసరమైన రాద్ధాంతాలు, వాదోపవాదాల వల్ల అది మరుగునపడేది.
ఎప్పుడైనా వాళ్ళు మంచి విషయాలు చెప్పేటప్పుడు నేను శ్రద్ధగా వినేవాడిని.
అలాగే వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా, లేదా
ప్రతికూలంగా మాట్లాడుతున్న వారి నుంచి ఏదైనా మంచి అదనపు సమాచారం తెలుస్తుందేమో అని
చూస్తుంటే నిరాశే మిగులుతోంది. రాజకీయ కోణం మినహాయిస్తే ఇరు పక్షాల వాదనల్లో కూడా
విషయం వుండడం లేదు.
ఫేస్ బుక్ లో కూడా ఇదే పరిస్థితి. ఎవరో
పంపింది హడావిడిగా పోస్ట్ చేసి షేర్ చేయడమే తప్ప స్వంతంగా బిల్లులు చదివి ఆకళింపు
చేసుకున్న దాఖలా కనపడడం లేదు.
ఇదొక
విషాదం!
బిల్లులను
సమర్థిస్తూ , వ్యతిరేకిస్తూ రెండు పెద్ద
మెసేజెస్ నాకు వాట్సప్ లో వచ్చాయి. ఒక్కొక్కటి రెండు పేజీలు అదీ ఇంగ్లీషులో. పైగా
పంపింది ఒక్కరే. అదీ నా స్నేహితుడే.. నాలాగే ఇంగ్లీషులో కాస్త పూర్. మరి ఇంత పెద్ద
మెసేజ్ ఎలా రాసాడని ఆశ్చర్యపోతుంటే రెండోది వచ్చింది.
ఇలా
తన దృష్టికి వచ్చిన ప్రతిదీ కనిపించిన ప్రతివాడికీ ఫార్వార్డ్ చేయడం అతడికి
అలవాటు.
ఈ
షేర్ సింగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది అని మాత్రం నాకు అర్ధం అయింది.
(మళ్ళీ ఇదే మెసేజ్ అతగాడు
నాకు ఫార్వార్డ్ చేసినా నేను ఆశ్చర్యపోను)
పొతే, ఓ డౌటేహం!
షేరింగ్, కట్
అండ్ పేస్ట్ ఆప్షన్లు తొలగిస్తే రాజకీయ పార్టీల సోషల్ మీడియా యూనిట్ల పరిస్తితి
ఏమిటి?
Top of Form
Bottom of Form