4, నవంబర్ 2020, బుధవారం

వైట్ హౌస్ లోకి రీ ఎంట్రీ దొరకని అమెరికా అధ్యక్షులు

 


 

అమెరికా అధ్యక్షుల పదవీ కాలం నాలుగేళ్లు. చాలా సందర్భాలలో అమెరికన్ ఓటర్లు మరో నాలుగేళ్ల అవకాశం కల్పిస్తూ ఇంకోసారి వారినే  అధ్యక్షులుగా ఎన్నుకుంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో బరాక్ ఒబామా, జార్జ్  డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఈ అవకాశం లభిస్తుందా లేదా అనేది లక్ష డాలర్ల ప్రశ్న. ఈసారి ఏమవుతుందో చూడాలి. మొత్తం అమెరికా చరిత్రలో కేవలం పదిమంది  ప్రెసిడెంట్లకు మాత్రమే ఆ దేశపు ఓటర్లు వైట్ హౌస్ లోకి రెండో తడవ ప్రవేశాన్ని నిరాకరించారు. ఎన్నికల్లో వారిని ఓడించారు.

వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి జార్జ్ బుష్ సీనియర్.

1992లో అప్పుడు ప్రెసిడెంటుగా ఉన్న జార్జ్ బుష్ సీనియర్ ని రెండో సారి పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించి బిల్ క్లింటన్ ని గెలిపించారు. చిత్రం ఏమిటంటే ఓడిపోయిన ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వాడయితే, ఆయన మీద ప్రెసిడెంటుగా గెలిచింది డెమోక్రాటిక్ అభ్యర్ధి బిల్ క్లింటన్.

ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ విషయం మరింత విచిత్రం. అమెరికన్ ఓటర్లు  ఫోర్డ్  మహాశయులను నేరుగా ఎన్నికల్లో ప్రెసిడెంటుగా ఎన్నుకోలేదు. కనీసం వైస్ ప్రెసిడెంటుగా కూడా ఎన్నికల్లో గెలవలేదు. అయినా అదృష్టం కొద్దీ గెరాల్డ్ ఫోర్డ్ ఈ రెండు అత్యున్నత పదవులను అనుభవించారు.

1973లో అప్పుడు వైస్ ప్రెసిడెంటుగా ఉన్న స్పిరో ఆగ్న్యూ  రాజీనామా చేసిన ఫలితంగా రాజ్యాంగంలోని ఓ వెసులుబాటు ప్రకారం ఫోర్డ్ ఉపాధ్యక్షులు కాగలిగారు. ఆ తర్వాత వాటర్ గేట్  కుంభకోణం వంటి వివాదాల్లో చిక్కుకుపోయి ప్రెసిడెంట్ నిక్సన్ పదవి నుంచి తప్పుకోవాల్సిరావడంతో వైస్ ప్రెసిడెంటుగా విధులు నిర్వర్తిస్తున్న గెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంటు అయ్యారు. హాయిగా మూడేళ్ళపాటు  శ్వేత సౌధం నుంచి దేశాన్ని పాలించారు.

తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంటుగా పోటీ చేశారు కానీ ప్రజలు తిరస్కరించారు. 1976 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జిమ్మీ కార్టర్ ఆయన్ని ఓడించారు.

అయితే  అమెరికా  ప్రెసిడెంటుగా కార్టర్ పదవి కూడా ఒక టరంతోనే ముగిసింది. 1980లో జరిగిన ప్రెసిడెన్షియల్  ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ ని ఓడించి ప్రెసిడెంట్ అయ్యారు.  రీగన్ ని ప్రెసిడెంటుగా రెండోసారి కూడా ఎన్నుకున్నారు. అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం ఆ ఎన్నికల్లో విశేషం.

ఈ విధంగా ఒకసారితోనే ప్రజలు ఉద్వాసన పలికిన ప్రెసిడెంట్లు మరికొందరు వున్నారు.

జాన్ ఆడమ్స్. ఈయన అమెరికాకి రెండో ప్రెసిడెంట్. అయినా కానీ ప్రజలు ఆయనాలి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. లో జరిగిన ఎన్నికల్లో థామస్ జెఫర్ సన్ ఆయన్ని ఓడించారు. మార్టిన్ వాన్ బరెన్, బెంజామిన్ హారిసన్, గ్రోవర్ క్లీవ్ లాండ్ పరిస్థితి కూడా ఇదే. రెండో సారి అవకాశం వీరికి దక్కలేదు. కాకపొతే క్లీవ్ లాండ్ నాలుగేళ్ల విరామం అనంతరం ప్రెసిడెంటుగా మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఇదంతా పద్ధెనిమిదో శతాబ్దం నాటి ముచ్చట. పందొమ్మిదో శతాబ్దం మొదట్లో కూడా మరో ఇద్దరు ప్రెసిడెంట్లకు అమెరికన్ ఓటర్లు రెండో అవకాశం ఇవ్వలేదు. వారి పేర్లు విలియం హోవర్డ్ టఫ్ట్, హెర్బర్ట్ హోవర్.

ఇక ప్రస్తుతానికి వస్తే, అమెరికాకి 45వ అధ్యక్షుడిగా 2016లో ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ 2020 నవంబరు ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  (04-11-2020)

 

 

 

3, నవంబర్ 2020, మంగళవారం

ఆధార్ విషయంలో అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు?

 కొన్నేళ్ళ క్రితం (అప్పటికి  రాష్ట్రం విడిపోలేదు) నేను అమెరికా వెళ్లాను. మా అబ్బాయికి తెలిసిన తెలుగువాళ్లు అక్కడే ఇళ్ళూ ఆస్తులూ కొనుక్కుంటున్నారు. హైదరాబాదులోనో లేదా తెలిసిన వేరే ఏదైనా ప్రాంతంలోనో కొనుక్కోవచ్చు కదా అని అడిగాను.

‘అదీ అయింది. మళ్ళీ జన్మలో మన దగ్గర ఇల్లు, ఆస్తి కొనకూడదని అనిపించే అనుభవం అయింది. లక్షలు పోసి కొన్నాము.  కొని రిజిస్టర్  చేయించుకుని అమెరికా తిరిగి వచ్చే రోజున ఆ స్థలం మాదంటూ ఎవరో లాయర్ నోటీసు పంపారు. అక్కడ వుండి పరిష్కారం  చేసే వ్యవధానం లేదు. చివరికి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి పనిచేయించుకున్నాము. కానీ ఇప్పటికీ ఏదో ఒక లిటిగేషన్. ఇక అది మాది కాదు అనుకుని వదిలేసాము. అదే ఇక్కడ చూడండి. నెట్లో చూసి వేరే ఎక్కడో రాష్ట్రంలో అపార్ట్ మెంటు కొన్నాము. అంతా ఆన్ లైన్లోనే పని అయిపొయింది. ఏదైనా ఇక్కడ నమ్మకంగా పనులు అవుతాయి. కిరికిరి వ్యవహారాలు, లిటిగేషన్లు వుండవు అని భగవద్గీత చెప్పాడాయన.

మరో మాట కూడా అన్నాడు. ‘ఇక్కడిలాగా మనదగ్గర కూడా నమ్మకంగా ఆస్తులు కొనగలమనే ధీమా మన ప్రభుత్వాలు ఇస్తే ఇక్కడ ఎవ్వరూ ఆస్తులు కొనరు, అక్కడే ఇన్వెస్ట్  చేస్తారు

మళ్ళీ ఇన్నాల్టికి తెలంగాణా ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించి అలాంటి భరోసా ఇద్దామనే ప్రయత్నం చేస్తోంది. ఈలోగా ఎవరో కోర్టు కెక్కారు.

ఆధార్ కోసం వత్తిడి  చేయవద్దని ఆర్డరు వేశారు అంటున్నారు. వ్యక్తిగత వివరాలు బహిరంగం కాకూడదట. మరి తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు బాజాప్తాగా ఆధార్ జిరాక్స్ అడిగి తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో ఇస్తున్నాము. అక్కడ  లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు?

ఇదంతా చూస్తుంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఎంతటి బలవత్తరమైనదో అర్ధం అవుతోంది.

(నాకు లీగల్ విషయాల్లో  పరిజ్ఞానం అంతగా లేదు. నాకు సొంతంగా  ఇళ్ళూ వాకిలి అంటూ లేవు.  నేను రాసింది కేవలం పౌరుల కోణం నుంచే)    


30, అక్టోబర్ 2020, శుక్రవారం

తాగడానికెందుకురా తొందరా ! - భండారు శ్రీనివాసరావు

 1995 లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించినప్పుడు, ఎవరైనా మందు ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే పలానా పత్రిక పలానా పేజీలో అని జవాబు వచ్చేది. మద్యనిషేధం ఎందుకు అవసరమో ప్రజలకు నచ్చచెబుతూ పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు ఆ పత్రిక ప్రచురించేది. ఆ తర్వాత కొద్ది కాలానికే సంభవించిన రాజకీయ పరిణామాల దరిమిలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యనిషేధం కారణంగా మద్యం మాఫియాల వల్ల ఒనగూడబోయే అనర్థాలు గురించి కూడా అదే పత్రిక వైనవైనాలుగా రాసింది. కొంతకాలం తర్వాత అందరూ అనుకున్నట్టే చంద్రబాబునాయుడు ముందు మద్యనిషేధాన్నిసడలించి, ఆ పిదప పూర్తిగా తొలగించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాలలో మద్యం రవాణా పెరిగిపోవడం, అన్నింటికంటే మించి మద్యం మాఫియా కోరలు సాచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ ఆయన మద్య నిషధం ఎత్తివేయడానికి కారణాలుగా చెప్పుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో మాఫియా చెలరేగి ఆయా ప్రాంతాల రాజకీయ నాయకుల అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించడంతో అన్ని పార్టీల వాళ్ళు బయటకు ఎన్ని ప్రకటనలు చేసినా లోపల మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని హర్షించారనే చెప్పాలి.

అప్పుడు కర్నాటక సరిహద్దుల్లో వుండే ఒక అధికార పక్షం శాసన సభ్యుడు చెప్పిన విషయం ఏమిటంటే ఒక లారీ లోడు మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చేయగలిగితే లక్షల రూపాయలు ముట్టచెప్పేవారట. ఈ రకమైన సులభ ఆదాయానికి అవకాశం దొరకడంతో మద్యం మాఫియా ప్రభుత్వ వ్యవస్థలనే ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పారు. రాజకీయులను కలవరపరచిన అంశాలలో ఇది ప్రధానమైనది.

అమలు సాధ్యం కాని మద్య నిషేధం వుంటేనేమి, లేకపోతేనేమి అనే నిస్పృహ ప్రజలలో కలిగించి, వారిలో తదనుగుణమైన మార్పు రావడానికి అప్పటి పత్రికలు కొన్ని సహకరించాయి. మొదటే చెప్పినట్టు ముందు పేర్కొన్న పత్రికదే ఇందులో సింహభాగం క్రెడిట్.

1980 - 2010 నడుమ పుట్టిన వారిలో చాలామందికి 1994, 1995 ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, పరిణామాల పట్ల పూర్తి అవగాహన వుండే అవకాశాలు తక్కువగా వుంటాయి. ఎందుకంటే అప్పటికి వారి వయసు పదిహేనేళ్లకు లోపు కనుక. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్న అలాంటి వారికి అలనాటి విషయాలు గురించి గూగుల్ పరిజ్ఞానం ఉండవచ్చు కానీ ప్రత్యక్ష సాక్షులుగా వుండి అవగాహన చేసుకునే వీలు వుండే అవకాశం లేదు.

1994లో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలయిన ఓ పేద మహిళ రోసమ్మ సాగించిన సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ఎన్టీ రామారావుకు ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ఆయన వివిధ ఎన్నికల సభల్లో చేసిన వాగ్దానం పేద దిగువ తరగతి మహిళలలో విపరీతమైన ఆశలు పెంచింది. ఫలితంగా అంతకుముందు అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. రామారావు గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టారు.

పేద జనాల తాలూకు ఆడంగులందరూ హాహా ఓహో అన్నారు. అయితే ప్రశంసలతో ప్రభుత్వాలు నడవవు కదా! పైగా బోలెడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆయన మొండి మనిషి. ససేమిరా మద్యనిషేధాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అమలు చేసి తీరాల్సిందే అన్నారు. కానీ జరిగింది వేరే విధంగా వుంది.

బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఆర్ధికంగా కూసింత నిలదొక్కుకునే దశలో మద్యం మాఫియా జడలు విప్పింది. నిషేధ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఒక పద్దతి ప్రకారం మొదలయింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బయట నుంచి ఒక్క లారీ లోడ్ మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చూడగలిగిన పెద్దలకు లక్షల్లో నజరానాలు అందాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజాప్రతినిధులకు నెలలవారీ మామూళ్ళు ముట్టాయి. వారికి సహకరించేవారు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయ్యారు.

ప్రభుత్వానికి రాజమార్గంలో రావాల్సిన ఆదాయం దారిమళ్లి వేరే వారి జేబుల్లోకి చేరింది. ఉభయ భ్రష్టత్వం ఉపరిసన్యాసం.

ఎవరెన్ని కబుర్లు చెప్పినా మద్యం అనేది ఏ ప్రభుత్వానికి అయినా కాసుల వర్షం కురిపించే కామధేనువు. అయితే అదే సమయంలో అదే మద్యనిషేధం వాగ్దానరూపం ధరిస్తే ఎన్నికల వైతరణిని దాటించే సులభమైన మార్గం కూడా. అంచేత తెలివయిన రాజకీయ నాయకులు రెండు వైపులా పదునున్న ఈ అయుధాన్ని అంతే తెలివిగా ఉపయోగించుకుంటారు.
అందుకే, పైకి చెప్పరు కానీ వారిది ఒకే నినాదం.
“అధికారంలోకి రావడానికి ప్రజలకు నచ్చే కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నాలుగు కాలాలు నిలబెట్టుకునేందుకు జనాలకు ఇష్టంలేని కొన్ని పనులు చేయాలి”
చేయక తప్పదు కూడా.

అదే జరిగింది లోగడ. ఇప్పుడూ జరుగుతుందేమో తెలియదు.
కానీ ఆనాటి పత్రికల సహకారం ప్రస్తుతం పూర్తిగా పూజ్యం.
(30-10-2020)

29, అక్టోబర్ 2020, గురువారం

అమెరికా ఎన్నికల్లో సింహభాగం ఖర్చు మీడియా మీదే.

 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు గురించి కొద్ది సేపటి క్రితం ఒక టీవీ ఛానల్ డిబేట్ నిర్వహించింది.

అమెరికానుంచి ఇందులో పాల్గొన్న తానా మాజీ అధ్యక్షుడు శ్రీ కోమటి జయరాం ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

‘మన దేశంలో మాదిరిగానే ఆ దేశంలో కూడా పార్టీల వాళ్ళు ఓటర్లకు డబ్బులు ఇస్తారా అనే సందేహం మన దగ్గర చాలామందిలో వుంది. ఓటర్లకు నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది అమెరికాలో లేదు. మరి వసూలు చేసిన కోట్లాది డాలర్ల పార్టీ ఎలెక్షన్ ఫండ్ ఎలా ఖర్చు చేస్తారు అనే అనుమానం రావచ్చు. ఉదాహరణకు నన్ను ఈ చర్చకు ఆహ్వానించారు. వరసగా వాణిజ్య ప్రకటనలు వేస్తూ పది నిమిషాలు వెయిట్ చేయించారు. అక్కడా పార్టీలకు ఇదే ప్రధానమైన ఖర్చు. పత్రికలు, ప్రకటనలకు అయ్యే ఖర్చే ఎక్కువ. ఓటర్లకు ఇచ్చేది ఏమీ వుండదు. ఇక్కడి ఓటర్లు ఓ బాధ్యతగా భావించి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం వుండదు”

అచ్చు ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు ఆయన మాట్లాడారు.

(29-10-2020)

26, అక్టోబర్ 2020, సోమవారం

రెండు రెళ్ళు యాభయ్ - భండారు శ్రీనివాసరావు

 ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి రచనా వ్యాసంగానికి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్నా, ఈరోజూ ప్రసారం అయిన సాక్షి టీవీ వారి కార్యక్రమాన్ని చాలా మంది చూసారు. నిజానికి మల్లాది  గారి గురించి అందులో వెల్లడించిన చాలా విషయాలు ఒకనాటి తరంలో చాలామందికి తెలిసినవే. కాకపొతే ఆయన ఎలా ఉంటారో చూద్దామనే ఆసక్తితో అనేకమంది ఆ కార్యక్రమం చూసారు. ఫేస్  బుక్ పాఠకులలో ఒకరి వ్యాఖ్య సందర్భోచితంగా వుంది. ‘పాండవులు లేని మాయాబజార్ సినిమాలా వుంద’ని ఆయన అన్నారు. నిజమే అనిపించింది.

ఈ యాభయ్ ఏళ్ళలో మల్లాది వారు అనేక సభల్లో పాల్గొని వుంటారు. కానీ ఆయన ఫోటో మాత్రం  ఏ పత్రికలోనూ రాలేదు. (అలా సకృత్తుగా నా కంట పడిన ఫోటో ఒకదాన్ని నేను నా బ్లాగులో ఒకసారి  పోస్టు చేస్తే అప్పుడు అమెరికాలో వున్న మల్లాది గారు  నాకు మెసేజ్ పెట్టారు, దాన్ని వెంటనే తొలగించమని)

అలాగే  ఒకమారు, ఏదో ఇంటర్వ్యూలో యండమూరి వారినీ ఆయననూ కలిపి చూపించాల్సి వస్తే యండమూరి ఫోటో పక్కన మల్లాది వెంకట కృష్ణ మూర్తి అని ఆయన పేరు  రాసి వున్న పుస్తకం కవర్ పేజీని  పెట్టి చూపించారు.

ఇక సాక్షి కార్యక్రమంలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే మల్లాది గారి గురించి  సముచిత గౌరవంతో వ్యక్తం చేసిన యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిప్రాయంతో  కూడిన  వీడియో బిట్ చూపించారు. ఆయన చెప్పిన పలుకులు కూడా సాటి రచయిత పట్ల ఆయనకున్న ఆప్యాయతను, సద్భావాన్ని ప్రతిఫలించాయి. అంతే కాదు, తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా హృదయం విప్పి చెప్పిన అనుభూతిని  మిగిలించాయి.

మల్లాది గారెని చూపిస్తారేమో అనే ఆశతో ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి నిరాశే మిగిలింది.

నిజానికి ఈ పోస్టు నిన్ననే రాశాను. కానీ ఈరోజు రిపీట్ టెలికాస్ట్ వున్న కారణంగా కొద్దిగా ఆలస్యంగా పోస్టు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కనబడరు అని ముందే తెలిస్తే  చూసేవారు తగ్గిపోతారు కాబట్టి. 



 (26-10-2020)

అందరూ అత్తలే – భండారు శ్రీనివాసరావు


అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -

సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.

ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.

'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.

ఓసారి రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.

అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది. అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?

వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.

ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.

23, అక్టోబర్ 2020, శుక్రవారం

దమ్ముంటే

 ‘దూకుతా దూకుతా అనే సవితే కాని దూకిన నా సవితి లేదు’ అనేది ఓ ముతక సామెత.

‘మీరు రాజీనామా చేయండి. నాతొ పోటీ చేసి గెలవండి. అప్పుడు తెలిసిపోతుంది ప్రజలు ఎవరి పక్షాన వున్నారన్నది’
ఈ మధ్య ఇటువంటి సవాళ్లు మరీ శృతిమించి రాగాన పడుతున్నాయి.

నాకెందుకో ఈ సవాళ్ళలో చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో చెప్పినట్టు రాజకీయ నాయకులు వదలలేనిది పదవి ఒక్కటే. టీవీ చర్చల్లో చేసే సవాళ్ళను స్వీకరించి రాజీనామాలు చేస్తారంటే మీరూ నేనే కాదు, పైకి చెప్పరు కానీ వాళ్ళు కూడా నమ్మరు.

(అయితే ఈ సూత్రానికి కూడా కొన్ని మినహాయింపులు వున్నాయి. తెలంగాణా ఉద్యమం రోజుల్లో అప్పటి పీసీసీ ప్రెసిడెంటు ఎం. సత్యనారాయణరావు గారు, ఓసారి నోరుజారి నాటి ఉద్యమ నేత కేసీఆర్ కు ఇలాగే ఓ సవాలు విసిరారు. ఆయన ఆ సవాలును స్వీకరించి మెరుపు వేగంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో నిలబడి పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ ఉపఎన్నిక ఫలితం తెలంగాణా ఉద్యమాన్ని మంచి మేలుమలుపు తిప్పిందని అంటారు.

కాబట్టి దమ్ముందా అనే ఛాలెంజ్ విసిరేముందు సొంత దమ్ము గురించి ఓపరి ఆలోచించుకోవడం మంచిది)
23-10-2020