17, సెప్టెంబర్ 2020, గురువారం

కోర్టు ధిక్కరణ - భండారు శ్రీనివాసరావు

ఇది చాలా పాత ముచ్చట. ఎంత పాతది అంటే ఓ అరవై ఏళ్ళో అంతకు పూర్వమో. కాస్త లీలగా గుర్తు వుంది.
బెజవాడలో ఓ పేరు మోసిన ప్లీడరు గారు ఓ సివిల్ కేసు తీసుకున్నారు. ఎదుటి కక్షిదారు సామాన్యుడు కాదు. ఆయనా ఓ గట్టి లాయరును పెట్టుకున్నాడు. సివిల్ కేసుకదా! తీరిగ్గా చాలా రోజులు సాగింది.
చివరికి తీర్పు వెలువడింది. మన లాయరుగారు ఓడిపోయారు. ఎదుటి పక్షానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సంగతి బెజవాడనుంచి వెలువడే ఓ పత్రిక తన ఈవినింగ్ ఎడిషన్ లో ప్రచురించింది. ఆ పత్రిక యజమానికి కూడా ఈ సివిల్ దావాతో సంబంధం వుందని చెప్పుకునేవారు.
మామూలుగా అయితే ఈ కధ అంతటితో ముగిసేది. కానీ ఈ లాయరు గారిది ఉడుం పట్టు.
ఆ పత్రిక మీద కోర్టు ధిక్కరణ (Contempt of court) కేసు వేశారు.
కోర్టు తీర్పు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వెలువడింది. ఆ పత్రిక సాయంత్రం ఎడిషన్ ముద్రణ పూర్తయి మార్కెట్లోకి వచ్చేసరికి ఆరుగంటలు. ఆ రోజుల్లో పత్రికల ముద్రణ ఇప్పట్లోలా మాదిరిగా కంప్యూటర్లతో కాదు. Manual Composing.
లాయరు గారు ఈ పాయింటు పట్టుకున్నారు. నాలుగున్నరకు వెలువడిన కోర్టు తీర్పు గురించి ఆ పత్రిక వారికి ముందుగా ఎలా తెలిసింది. తీర్పు వచ్చే సమయానికి పత్రిక ముద్రణ కూడా పూర్తయిపోయింది. అలాంటప్పుడు కోర్టు తీర్పు కాపీ వారికి ఎలా వచ్చింది అని ఆ లాయరు గారు లా పాయింటు లేవదీశారు.
చివరికి ఏమి జరిగింది అనేది చాలామందికి ఉత్సుకత.
ఏం జరిగింది! అనేకానేక కధల మాదిరిగానే ఆ కధ కూడా ఎలా ముగిసిందో, ఎక్కడ వుందో ఎవరికీ తెలియదు.
కంచికి పోయి వెతుక్కోవాలేమో!

14, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - 2 - భండారు శ్రీనివాసరావు

 

సత్సంగత్వే నిస్సంగత్వం

ఆధ్యాత్మికం, ఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.

“సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి:” 

మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.

ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీ, మంచి రచనలు చదవడానికీ, మంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలు, సమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయా, దొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు  ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.

వయసులో పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.

ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలు, అల్పాహారాలు, మధ్యాన్న భోజనాలు.  ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు.  ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు,  సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.

మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణ, భారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదు, దేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజానం తాలూకు  ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టత, ఏహ్యత ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే మా ఆవిడ గర్భవతిగా వున్న సమయంలో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఆమెని సాంప్రదాయక విశ్వాసాల ప్రకారం  చీకటి గదిలో పడుకోబెట్టకుండా ఆమె చేత అఢవా చాకిరీ చేయించిన చరిత్ర నాకుంది. తొలిచూలు అయినా మూఢ నమ్మకాల మీద నా యుద్ధానికి మౌనంగా సహకరించింది.  గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా విశ్రాంతిగా పడుకోని పక్షంలో వారికి పుట్టే బిడ్డలు అవకరంగా జన్మిస్తారనే నమ్మకాలు ప్రబలంగా వున్న రోజుల్లోనే    నా నిర్వాకం ఇది.

ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది. (14-09-2020)

(తరువాయి మరోసారి)                   

    

 

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - భండారు శ్రీనివాసరావు

 

(ఉపక్రమణిక)

ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదు, నాకై నేను నాతో  పెట్టుకున్న గొడవ.

గతంలో మాదిరిగా పేరాలు పేరాలు  రాయడం కుదరకపోవడానికి కారణం చెయ్యి నొప్పి అనుకున్నాను. అంచేత పూర్వం నేను రాసుకున్న నా రాతలనే కొంతకాలంగా తిరగమోత పెడుతూ వస్తున్నాను. అక్కరాజు నిర్మల్ వంటి స్నేహితులకు ఇది బాగా తెలుసనే అనుకుంటున్నాను.

ఇప్పుడు రాయకపోవడానికి ఆ చెయ్యి నొప్పి కారణం కాదు. చేతి మీద అదనపు భారం పడకుండా టైప్ చేయడానికి మా అబ్బాయి సంతోష్ ఇంట్లో  టేబులూ, కుర్చీ ఇలా మంచి ఏర్పాట్లే చేశాడు, కార్పొరేట్ తరహాలో. అలాగే ఈ ఏడాది చేసుకోని నా పుట్టిన రోజును పురస్కరించుకుని మా కోడలు నిష బోలెడు డబ్బు పోసి ఏకంగా ఓ  లేటెస్ట్ మోడల్ లాప్ టాప్ కొనిచ్చింది. దాన్ని జరాసంధుడి మాదిరిగా మధ్యకు  విరగదీసి మరీ  రాసుకోవచ్చు(ట).

అసలు సంగతి ఇది కాదు, మనిషికి రాయాలనే ఇచ్చ కలగనిదే ఏది రాసినా అందులో సారం వుండదు. ఇన్నాళ్ళు అలాంటి చేవ లేని రచనలే చేస్తూ వస్తున్నాను అనే సంగతి ఈ మధ్యకాలంలో తరచూ మనసును పీకుతోంది.

ఇదిగో ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అనుభవం అన్నమాట.

గతవారం నేను మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో అబ్బాయి ఉంటున్న కౌంటీకి వెళ్లి దాదాపు వారం రోజులు వున్నాను. పెద్ద ఇల్లు, విశాలమైన పడక గదులు, అన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీప, లాల్ బహదూర్,  తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు వారి  స్పురిత, హసిత. నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ. అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. అందరూ ఎడం ఎడంగా  కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన హాలు. చుట్టూ పూలమొక్కలు, కూరగాయల పాదులు, అన్ని రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది. వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ కుదరలేదు.

ఓ శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.

అక్కడ ఉండగానే నాకేమీ తెలియదనే  నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి దూరం జరిగాను.

దీనికి కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.

మరో కారణం, నాలో మరో నేను వున్నాడు అనే సంగతి తెలియరావడం.

ఆ రెండో నేను నాలో  ఉన్నాడని తెలిసింది కాని, ఎవరో ఏమిటో  తెలియదు.

అది తెలియడానికే ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి,  మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం.  నాకెలా వీలుపడుతుంది?

ఆ వివరాలు మరోమారు.         

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

“ఇన్ సైడ్ వాయిస్! అవుట్ సైడ్ వాయిస్!” – భండారు శ్రీనివాసరావు

 

నిజం చెప్పొద్దూ! నేను ఇంతవరకు వినని మాట. మా అన్నయ్య మనుమరాళ్లు స్పురిత, హసిత నోటి వెంట మొదటిసారి విన్నాను.

“టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు దగ్గర దగ్గరగానే కూర్చొంటారు కదా! తాతయ్యా! మరి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడతారు”

ఒకప్పుడు ఈ చర్చల్లో పాల్గొనేవాడిని కాబట్టి వారి ప్రశ్న ఒకరకంగా సూటిగా నాకే తగిలిన భావన కలిగింది.

నా నుంచి జవాబు రాకపోవడంతో వాళ్ళే మళ్ళీ అన్నారు, “ఈ డిబేట్స్ లో ఇన్ సైడ్ వాయిస్ చాలు, అనవసరంగా అవుట్ సైడ్ వాయిస్ తో మాట్లాడుతున్నారు” అని.

ఈ ఇద్దరూ అమెరికాలోనే పుట్టారు. కానీ మన చదువులకోసం, సాంప్రదాయకంగా వారిని  పెంచడం కోసం పిల్లల్ని తీసుకుని మా అన్నయ్య కొడుకు లాల్, కోడలు దీప ఆ దేశం నుంచి వచ్చేసి హైదరాబాదులో సెటిల్ అయ్యారు.

ఆ దేశంలో ప్రతివారికీ చిన్నప్పటి నుంచీ నలుగురిలో మాట్లాడడం ఎలాగో నేర్పుతారట. అందులో భాగమే ఈ ఇన్ సైడ్ వాయిస్, అవుట్ సైడ్ వాయిస్.

ఫుట్ బాల్ మైదానం పెద్దగా వుంటుంది. అక్కడ క్రీడాకారులు ఒకరితో మరొకరు స్వరం పెంచి మాట్లాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అది అవుట్ సైడ్ వాయిస్. కొంచెం గొంతు పెంచినా ఎవరూ ఏమీ అనుకోరు.

అదే ఇళ్ళల్లో, స్కూళ్ళల్లో, మాల్స్ లో మాట్లాడుకొనేటప్పుడు స్వరం తగ్గించి మెల్లగా మాట్లాడడం అలవాటు చేస్తారు. అది ఇన్ సైడ్ వాయిస్ అన్నమాట.

గురువు అనేవాడికి వయసు ప్రధానం కాదు, జ్ఞానం ముఖ్యం. అది కలిగి వున్నవారు చిన్నవారయినా, మంచి విషయాలను  వారి నుంచి నేర్చుకోవచ్చు.

ఆ విధంగా నేను, స్పురిత, హసితల నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను.

(10-09-2020)

10, సెప్టెంబర్ 2020, గురువారం

విశ్వనాధవారి పాండిత్య వైభవం - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు 10,  విశ్వనాధవారి 125వ  జయంతి)

తెలుగు సాహిత్యాన్ని తనదైన రీతిలో ఓ మలుపు తిప్పిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు జన్మించి నేటికి  నూట పాతిక సంవత్సరాలు. విశ్వనాధవారు రాసిన రామాయణ కల్పవృక్షం అనే గ్రంధం అనేక విశిష్టతల సమాహారం. రాసింది వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినా, విశ్వనాధవారు అనేక సందర్భాలలో తనదయిన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి చూపారు. ఇందుకు ఉదాహరణ రామాయణ కల్పవృక్షంలోని ‘అహల్యా శాప విమోచన ఘట్టం.

సాధారణంగా రామాయణాలు చదివేవారికి భర్త గౌతముడి శాపంతో అహల్య శిలగా మారిపోవడం, చాలా కాలం గడిచిన తరువాత రామపాద స్పర్శతో శాపము తీరి తిరిగి అహల్య రూపం ధరించడం తెలిసిన విషయమే. ఈ దృశ్యానికి  విశ్వనాధవారు తన కవి దృష్టితో ఒక చక్కని రూపం కల్పించారు.

భర్త శాపంతో ధూలిదూసరితమైన  అదృశ్య రూపంలో అహల్య రాముని రాకకోసం ఎదురు చూస్తుంటుంది.

“వాయు భక్షా! నిరాహారా! తప్యంతీ భస్మశాయినీ!” (బాల కాండ, 48 సర్గ, 30,31 శ్లోకాలు, శ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీ మద్రామాయణము, తత్వ దీపిక) అంటూ గౌతముడు, ‘ఈ  ఆశ్రమంలోనే  వుండిపోయి, నిన్ను ఎవ్వరు చూడకుండా, నీవు ఎవ్వరిని చూడకుండా, రామపాద స్పర్శ తగిలే వరకు కంటికి కనబడని ధూళి రూపంలో  తపస్సు చేసుకోమని’ అహల్యకు  ఆనతి ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యను శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అనేది కూడా అప్పలాచార్యుల వారి భాష్యం.

రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం తన వెంట తెచ్చుకున్న దశరధ తనయులు రామలక్ష్మణులతో, వచ్చిన కార్యం జయప్రదంగా పూర్తిచేసుకుని, ఆ అన్నదమ్ములను వెంటనిడుకుని విశ్వామిత్ర మహర్షి మిధిలానగరం దిశగా వెడుతూ, మార్గమధ్యంలో గౌతమముని ఆశ్రమం పరిసరాలకు చేరుకుంటాడు. గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోవడం, అహల్య భర్తశాపానికి గురవడం వంటి కారణాలతో ఆ ఆశ్రమం ఎండిపోయిన తరుల్లతలతో, మోడువారిన వృక్షాలతో కళాకాంతులు కోల్పోయివుంటుంది. ఈ నేపధ్యాన్ని విశ్వనాధవారు తన చాతుర్యానికి ఆలంబనగా చేసుకుని కావ్యరచన చేశారు. ప్రకృతిని స్త్రీతో పోల్చడం ఎరిగిన సంగతే. దాన్నే ఆయన ఇక్కడ చక్కగా వాడుకున్నట్టు అనిపిస్తుంది.

రాముడు గౌతముడి ఆశ్రమం సమీపిస్తుండగానే, ఆయన మేను తాకి ప్రసరించిన మలయమారుతం కారణంగా ధూళి రూపంలో వున్న అహల్యకు ముందు ఘ్రాణే౦ద్రియం (నాసిక) మేల్కొంటుంది. అదే సమయంలో గౌతమ ఆశ్రమంలో వడిలిపోయివున్న పుష్పలతలు వికసించి తమ స్వభావసిద్ధమైన  సువాసనలను విరజిమ్మడం మొదలుపెడతాయి. ఆ తరువాత తనను సమీపిస్తున్న శ్రీరాముడి అడుగుల చప్పుడుతో అహల్య శరీరంలోని శ్రవణే౦ద్రియాలు (చెవులు) మేల్కొంటాయి.  అందుకు మరో సూచనగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గౌతమాశ్రమం నుంచి  పక్షుల కిలకిలారావాలు వినవస్తాయి. రాముడు మరికొంచెం దాపులోకి రాగానే అహల్య శరీరంలో చక్షువులు (నేత్రాలు) మేల్కొని ఆమె కళ్ళకు శ్రీరాముడి ఆకృతి కనబడుతుంది. అ పిదప రాముడి  పవిత్రపాదం సోకి ఆమెలోని స్పర్శే౦ద్రియం మేల్కొనగానే, అహల్యకు శాపవిమోచనం కలిగి పూర్వ రూపం వస్తుంది.

అదే సమయానికి హిమాలయాల నుంచి గౌతముడు అక్కడికి చేరుకుంటాడు. ఈ ఘట్టం పూర్తి కాగానే అహల్యా గౌతముల పునస్సమాగమం జరుగుతుంది. తదుపరి మిధిలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి  ఇదో సూచనగా  భావించవచ్చు.

విశ్వనాధవారు ఇంద్రియాలు మేల్కొనే వరుసను వర్ణించిన రీతికి మరో అన్వయం కూడా చెబుతారు.

మనిషి సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థకు వచ్చే క్రమంలో కూడా  శరీరంలోని ఒక్కొక్క ఇంద్రియం క్రమక్రమంగా మేల్కొంటుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కాని  విశ్వనాధవారు మాత్రం అహల్యా శాప విమోచన ఘట్టానికి ఒక కొత్త రూపం ఇవ్వడంలో కృతకృత్యులు అయ్యారు.