10, సెప్టెంబర్ 2020, గురువారం

విశ్వనాధవారి పాండిత్య వైభవం - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు 10,  విశ్వనాధవారి 125వ  జయంతి)

తెలుగు సాహిత్యాన్ని తనదైన రీతిలో ఓ మలుపు తిప్పిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు జన్మించి నేటికి  నూట పాతిక సంవత్సరాలు. విశ్వనాధవారు రాసిన రామాయణ కల్పవృక్షం అనే గ్రంధం అనేక విశిష్టతల సమాహారం. రాసింది వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినా, విశ్వనాధవారు అనేక సందర్భాలలో తనదయిన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి చూపారు. ఇందుకు ఉదాహరణ రామాయణ కల్పవృక్షంలోని ‘అహల్యా శాప విమోచన ఘట్టం.

సాధారణంగా రామాయణాలు చదివేవారికి భర్త గౌతముడి శాపంతో అహల్య శిలగా మారిపోవడం, చాలా కాలం గడిచిన తరువాత రామపాద స్పర్శతో శాపము తీరి తిరిగి అహల్య రూపం ధరించడం తెలిసిన విషయమే. ఈ దృశ్యానికి  విశ్వనాధవారు తన కవి దృష్టితో ఒక చక్కని రూపం కల్పించారు.

భర్త శాపంతో ధూలిదూసరితమైన  అదృశ్య రూపంలో అహల్య రాముని రాకకోసం ఎదురు చూస్తుంటుంది.

“వాయు భక్షా! నిరాహారా! తప్యంతీ భస్మశాయినీ!” (బాల కాండ, 48 సర్గ, 30,31 శ్లోకాలు, శ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీ మద్రామాయణము, తత్వ దీపిక) అంటూ గౌతముడు, ‘ఈ  ఆశ్రమంలోనే  వుండిపోయి, నిన్ను ఎవ్వరు చూడకుండా, నీవు ఎవ్వరిని చూడకుండా, రామపాద స్పర్శ తగిలే వరకు కంటికి కనబడని ధూళి రూపంలో  తపస్సు చేసుకోమని’ అహల్యకు  ఆనతి ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యను శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అనేది కూడా అప్పలాచార్యుల వారి భాష్యం.

రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం తన వెంట తెచ్చుకున్న దశరధ తనయులు రామలక్ష్మణులతో, వచ్చిన కార్యం జయప్రదంగా పూర్తిచేసుకుని, ఆ అన్నదమ్ములను వెంటనిడుకుని విశ్వామిత్ర మహర్షి మిధిలానగరం దిశగా వెడుతూ, మార్గమధ్యంలో గౌతమముని ఆశ్రమం పరిసరాలకు చేరుకుంటాడు. గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోవడం, అహల్య భర్తశాపానికి గురవడం వంటి కారణాలతో ఆ ఆశ్రమం ఎండిపోయిన తరుల్లతలతో, మోడువారిన వృక్షాలతో కళాకాంతులు కోల్పోయివుంటుంది. ఈ నేపధ్యాన్ని విశ్వనాధవారు తన చాతుర్యానికి ఆలంబనగా చేసుకుని కావ్యరచన చేశారు. ప్రకృతిని స్త్రీతో పోల్చడం ఎరిగిన సంగతే. దాన్నే ఆయన ఇక్కడ చక్కగా వాడుకున్నట్టు అనిపిస్తుంది.

రాముడు గౌతముడి ఆశ్రమం సమీపిస్తుండగానే, ఆయన మేను తాకి ప్రసరించిన మలయమారుతం కారణంగా ధూళి రూపంలో వున్న అహల్యకు ముందు ఘ్రాణే౦ద్రియం (నాసిక) మేల్కొంటుంది. అదే సమయంలో గౌతమ ఆశ్రమంలో వడిలిపోయివున్న పుష్పలతలు వికసించి తమ స్వభావసిద్ధమైన  సువాసనలను విరజిమ్మడం మొదలుపెడతాయి. ఆ తరువాత తనను సమీపిస్తున్న శ్రీరాముడి అడుగుల చప్పుడుతో అహల్య శరీరంలోని శ్రవణే౦ద్రియాలు (చెవులు) మేల్కొంటాయి.  అందుకు మరో సూచనగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గౌతమాశ్రమం నుంచి  పక్షుల కిలకిలారావాలు వినవస్తాయి. రాముడు మరికొంచెం దాపులోకి రాగానే అహల్య శరీరంలో చక్షువులు (నేత్రాలు) మేల్కొని ఆమె కళ్ళకు శ్రీరాముడి ఆకృతి కనబడుతుంది. అ పిదప రాముడి  పవిత్రపాదం సోకి ఆమెలోని స్పర్శే౦ద్రియం మేల్కొనగానే, అహల్యకు శాపవిమోచనం కలిగి పూర్వ రూపం వస్తుంది.

అదే సమయానికి హిమాలయాల నుంచి గౌతముడు అక్కడికి చేరుకుంటాడు. ఈ ఘట్టం పూర్తి కాగానే అహల్యా గౌతముల పునస్సమాగమం జరుగుతుంది. తదుపరి మిధిలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి  ఇదో సూచనగా  భావించవచ్చు.

విశ్వనాధవారు ఇంద్రియాలు మేల్కొనే వరుసను వర్ణించిన రీతికి మరో అన్వయం కూడా చెబుతారు.

మనిషి సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థకు వచ్చే క్రమంలో కూడా  శరీరంలోని ఒక్కొక్క ఇంద్రియం క్రమక్రమంగా మేల్కొంటుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కాని  విశ్వనాధవారు మాత్రం అహల్యా శాప విమోచన ఘట్టానికి ఒక కొత్త రూపం ఇవ్వడంలో కృతకృత్యులు అయ్యారు.                     

5 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అహల్యా శాపవిమోచన ఘట్టానికి విశ్వనాథ వారి వెర్షన్ వైవిధ్యంగా ఉందే?

అవునూ. మీరు SRR కాలేజ్ లోనే చదివారుగా. అంటే మీరు కూడా విశ్వనాథ వారి శిష్యులేనా? మీరు చదివేనాటికి వారు ఇంకా ఆ కాలేజ్ లో పని చేస్తున్నారా?

బుచికి చెప్పారు...

విశ్వనాథ వారి ఊహా వైచిత్రి అద్భుతం. కాళిదాసు షేక్స్పియర్ సమాన స్థాయి రచయిత అని మహా కవులు పండితులు పామరులు సర్వులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారు: నేనూ అదే కాలేజీలో చదివాను. కానీ వారు అక్కడ పనిచేస్తున్నప్పుడు కాదు. కాకపొతే వారి ఇల్లు మా కాలేజి పక్క సందులోనే వుండేది. వారి అబ్బాయి పావని శాస్త్రి మా స్నేహితుడు. తరచుగా వారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. విశ్వనాధ గారు నాకు వేయిపడగలు, చెలియలి కట్ట పుస్తకాలు స్వయంగా బహుకరించారు. అదో దివ్యమైన అనుభూతి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి, విశ్వనాథ వారి ఇల్లు నాకు తెలుసండి. నేను విజయవాడలో లయోలాలో చదువుతున్నప్పుడు వారింటికి వెళ్ళాను. వారికీ, మా తండ్రిగారికీ బాగా పరిచయం. అది చెప్పుకుని వారిని కలిశాను. ఇంకొకటి కాలేజ్ వార్షికోత్సవాలకు ఓ సంవత్సరం వారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించమని మా ప్రిన్సిపాల్ గారు నన్ను పంపిస్తే వారింటికి వెళ్ళాను.

ఎస్, మీరన్నట్లు అటువంటివన్నీ మరపురాని అనుభూతులు.