24, సెప్టెంబర్ 2020, గురువారం

నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావు

(హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.
ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు.

సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.

(అనుకూలమైనా,ప్రతికూలమైనా కామెంట్లను తొలగించే అలవాటు నాకు లేదు. సభ్యత పాటిస్తే సంతోషం)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆ రోజులు పోయాయి సర్ . మనం ఇప్పుడు మత రాజ్యం లో అడుగుపెడుతున్నాం . ఎన్ని ఆకలి చావులు చూసాం లాక్ డౌన్ లో ??, కోట్ల మంది పొట్ట చేతబట్టుకుని నడిచి వెళ్లడం చూసాం , చిన్న పిల్లలు తో సహా . కానీ ఎంతమంది స్పందించారు . అవన్నీ వదిలేసి బుర్ర లేని నాయకులూ రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు జనాలు , అంటే ఈ జనాలు ఆలోచన విధానం ఎంత కుచించుపోయిందో చూడండి . మన పతనం మొదలైంది . ఇలానే సహనంగా ఉండే పాకిస్తాన్ , ఆఫ్ఘన్ ఇరాన్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ? ఇంకో 100 సంవత్సరాలకి మన గతి కూడా అంతే . హిందూ మతం ఇంకా గుడ్డు రోజులు వస్తాయి , అది కేవలం బిజెపి వల్లే .. . ఒకప్పుడు బిజెపి అభిమానిని , అధికారం లోకి రాకముందు . కానీ అధికారం లోకి వచ్చి , ఆ అధికారం కోసం ఏమైనా చేస్తారు అని ఊహించలేదు .

ఒకప్పుడు రోడ్ మీద ఓ ఇద్దరు కలిస్తే , దేశం గురించి ఓ రెండు ముక్కలు ఉండేవి వాళ్ళ మాటల్లో , కానీ బిజెపి అధికారం లోకి వచ్చిన తరువాత , అభివృద్ధి , జీడీపీ , ఎగుమతులు , దిగుమతులు అంటూ ఏ చర్చలు జరగడం లేదు . ఎంతసేపు మతం మతం మతం .

భయమేస్తుంది చూస్తుంటే ..

Jagadeesh Reddy చెప్పారు...

మీరు చెప్పింది నిజమే శ్రీనివాస రావు గారు.. హిందూ జీవన విధనం ఎంత బలమైన పునాదుల మీద ఉన్నప్పటికీ, మతాన్ని మాత్రమే ప్రచారం చేసే మూర్ఖులు ఉన్నంత కాలం వాటిని ఎదుర్కోవడానికి హిందువులందరూ సంఘటితం కాక తప్పదు. ప్రజలలో ఆ తెలివిడి ఉండబట్టే అందరూ కలిజి బి.జే.పి ని గెలిపించుకున్నారు. ఇప్పటికీ కళ్ళు మూసుకు కూర్చుంటే, ప్రపంచమంతా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హిందూ మతానికి పట్టిన గతే ఇప్పుడు భారతదేశంలో కూడా పట్టబోతోంది. మతిలేని కొందరు హిందూ మేధావులమని చెప్పుకొనే వాళ్ళు, హిందువులు చైతన్యవంతులయితే, సెక్యులరిజానికి ఎదో పెద్ద ఉపద్రవం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు. పక్కన ఉన్న చైనాని చూసి కూడా ఏమీ నేర్చుకోవడం లేదు. అక్కడ మసీదులకి, చర్చిలకి పట్టిన గతి ఇండియాలో ఏ ప్రార్ధనా స్థలాలకి పట్టడం లేదు.. సంతోషించండి.