10, జూన్ 2020, బుధవారం
భయం – భండారు శ్రీనివాసరావు
9, జూన్ 2020, మంగళవారం
సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు
సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.
“ఆయన
నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే
కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో
కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి.
చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా
వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు
స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా
వుండలేరు. అది మాత్రం వాస్తవం”
శర్మగారికి
బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన
సంగతులు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారు.
శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.
అలా
ఈరోజు ఓ విషయం చెప్పారు.
విశాఖ
పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో
పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు
యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై వైజాగులో
తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన ‘గణపతి రామాయణ సుధ’ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు
వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా
తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
“వారొకసారి
విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు
కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు. ఎలా అని
గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి
వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”
శర్మగారు
చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను.
అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”
అంత
పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా
వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)
8, జూన్ 2020, సోమవారం
నారాయణ నారాయణ
“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్’ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.
తర్వాత
తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన
ఫోటోలు చూశారుగా.
చేపలు
తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి
మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు
వుందనుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచి చేస్తే
ఎంత? చేయకపోతే
ఎంత?
చిన్నప్పుడు
ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ
సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు
కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని
ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి
వాటిని చూస్తూనే ‘పీచు, కాసు’ అంటూ కళ్ళు తేలేశాడు.
గతంలో
మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు తీరారు.
ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో
మరి.
సరే!
గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు
ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి
హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.
లోగడ
వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు
చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ
ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ
తెచ్చిపెట్టారు.
ఉత్తర
భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే
మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి
మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం
వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి
ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు.
రైల్వే రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన
కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది
మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత
మాత్రమే.
4, జూన్ 2020, గురువారం
దివ్యదృష్టి – భండారు శ్రీనివాసరావు
రాజకీయ నాయకుల వేషధారణ – భండారు శ్రీనివాసరావు
2, జూన్ 2020, మంగళవారం
సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు 02-06-2020 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)
నాకు లీలగా గుర్తు. ఉద్యమం మాంచి ఊపులో వున్నప్పుడు కేసీఆర్ ఇలా అన్నారు.
“తెలంగాణా వచ్చిన తరువాత, దాన్ని మనం కోరుకుంటున్నట్టు అభివృద్ధి చేసుకోవడానికి రోజుకు ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవు”.
నిజమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఎన్నో కావాలి. మొక్కవోని దీక్ష, సడలని పట్టుదల, అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్నసమయంలో అమలుచేసే యంత్రాంగం, సమయ పాలన. ఇన్ని కావాలి ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఇవన్నీ కలగలుపుని కేసీఆర్ సాధించిన ఘన విజయమే కాళేశ్వరం ప్రాజెక్టు.
జూన్ రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తయి ఏడోఏట అడుగుపెడుతోంది. ఈ ఏడాది తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయిదు రోజులముందే మొదలయ్యాయి. మే ఇరవై తొమ్మిదో తేదీనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు తుది అంకం ఆవిష్కృతం కావడంతో ఈ సంబురాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. అలనాటి భగీరధుడు గంగమ్మను ఆకాశం నుంచి భూమికి రప్పిస్తే, ఈనాటి అపరభగీరధుడు కేసీఆర్ కాళేశ్వరం గోదావరి జలాలను సముద్రమట్టానికి ఆరువందల మీటర్ల పైకి తీసుకువచ్చి ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని నీరుకార్చి కొండ పోచమ్మ ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. దీనితో, భారతదేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప ఇంజినీరింగ్ విన్యాసం సాధించిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రపుటలకు ఎక్కింది. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు కేసీఆర్ పట్టుదలకు, మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే గోదావరి నీళ్ళను కొండ పోచమ్మ ప్రాజెక్టులోకి తోడి పోస్తున్నప్పుడు స్వప్నం సాకారమైందన్న సంతోషం, సంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించాయి.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలే ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా. ఉమ్మడి రాష్ట్రము విడివడితే తెలంగాణా అంధకారబంధురం అయిపోతుందని నాడు వినవచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని అనుకున్నారేమో తెలవదు కానీ ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది.
గత ఆరేళ్లుగా జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్తితి. దేవులపల్లి ప్రభాకరరావు గారి సారధ్యంలో జెన్కో, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది కలసికట్టుగా సాగించిన నిర్విరామ కృషి ఇందుకు ప్రధాన కారణం.
తెలంగాణా ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడి కూడా ఆరేళ్ళు గడిచాయి. అనుకున్నవి అనుకున్నట్టు సాగుతున్నాయని కొందరు అనుకుంటూ వుంటే, ఏదీ, ఎక్కడ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా లేకపోలేదు.
అన్నం వుడికే దాకా వుడికినట్టు తెలవదు, కుతకుత శబ్దం తప్పిస్తే.
ఎవరి పరిపాలనలో అయితే పాలకులతో అవసరం లేకుండా పాలితులకు జీవితం హాయిగా గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.
ప్రస్తుతం కేసీఆర్ పాలన ఆ రీతిలో సాగుతోందని పొగడ్తలు తగవు కానీ, ‘నేనున్నాను’ అనే భరోసా మాత్రం ప్రభుత్వం నుంచి పాలితులకు లభిస్తోందని నేను నిశ్చయంగా చెప్పగలను. (EOM)