6, మే 2020, బుధవారం

తెలిసిన సంగతులు, తెలియని వాస్తవాలు


ఇప్పుడు యాభయ్యవ పడిలో ఉన్న టీడీపీ అభిమానులను ఆ పార్టీకి ఎవరు శ్రీరామరక్ష అని అడిగితే యన్టీ రామారావు, చంద్రబాబునాయుడు అని చెబుతారు. అదే ప్రశ్నను ముప్పయ్యేళ్ళ వయస్సులో ఉన్న ఆ పార్టీ అభిమానులను అడిగితే ప్రాధాన్యతలు మారి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ అని వరస మార్చి చెబుతారు. కాలగతిలో వచ్చే మార్పు ఇది.
నా  యాభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగగలిగే అరుదైన అవకాశాన్ని నా వృత్తి నాకు అందించింది. ఇది నా గొప్ప కాదు, నేను చేసిన ఉద్యోగం మరెవరు చేసినా వారికీ ఈ అవకాశం లభించి వుండేది.
ఈరోజు ఉదయం చంద్రబాబు గురించి ఒక వ్యాఖ్య పెడితే ఆయన అభిమానులకి నచ్చినట్టులేదు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటారు. వాటిపై పత్రికల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు చివరికి ప్రకటిస్తారు. నిజానికి ఇది ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియే. దానికి విరుద్ధం కాదు. కానీ ఆ నిర్ణయానికి ప్రజామోదం వున్నట్టు తెలిసేలా జాగ్రత్త పడతారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేయక తప్పని పరిస్తితులు ఏర్పడ్డప్పుడు కూడా ఆయన ఇదే విధానాన్ని పాటించారు. పత్రికల్లో ప్రచారం ద్వారా  ప్రజలను మానసికంగా అందుకు సంసిద్ధులను చేసిన తర్వాతనే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచారు. అందువల్లనే మద్యనిషేధం తొలగించినా  ప్రజల్లో వ్యతిరేకత కానరాలేదు.   
ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ మహానాడు జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ పార్టీ అభిమానులు పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు. వాటి గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ కటౌట్లు, బ్యానర్లు తొలగించాలని ఆగ్రహంతో ఆదేశించినట్టు కూడా మళ్ళీ పత్రికల్లో వచ్చింది. మధ్యాన్న భోజన సమయంలో కాబోలు నేను ఆయన్ని కలిసి  సూటిగానే అడిగాను, ఇంత తంతు అవసరమా అని. ఆయన తనదైన శైలిలో నవ్వి ఊరుకున్నారు. అదే విలేకరుల సమావేశంలో ఇలా ఇబ్బంది పెట్టె ప్రశ్న వేస్తె ‘ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు అని  గద్దించేవారు. విడిగా అడిగితే సౌమ్యంగా నవ్వి ఊరుకునేవారు. అది ఆయన స్వభావం.
ప్రతి దానికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కొత్తగా చేసుకున్న అలవాటు కాదు. 1978 లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఆయన చిత్తూరు జిల్లాలో పులిచర్ల సమితికి  యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ ఎన్నికల్లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బెడద లేదు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్ధులు వున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఏర్పడ్డ ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)కి అభ్యర్ధులే కరువయ్యారు. చంద్రబాబుకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అదే మొదటిసారి. అందువల్ల ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అసలే కొత్త పార్టీ. ప్రత్యర్ధులు బలమైన వాళ్ళు. అంచేత ఆయన ముందు జాగ్రత్తగా ఆలోచించి తన విజయావకాశాలు ఎలా వుంటాయి అనే విషయం మీద ఒక అవగాహన కోసం చంద్రగిరి అసెంబ్లీలో ఒక సర్వే జరిపించారు. ఒకరకంగా అదే మొదటి పోల్ సర్వే అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది.
(ఈ సర్వే సంగతి శ్రీ లక్ష్మినారాయణ వల్ల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసారు. సమర్దుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనతికాలంలోనే చక్కటి పేరు రావడానికి శ్రీ లక్ష్మీనారాయణ వంటి అధికారుల పాత్ర చాలా వుంది. ప్రముఖ సంపాదకులు  శ్రీ ఇనగంటి వెంకట్రావు చంద్రబాబును గురించి రాసిన “ఒక్కడు- The Leader” అనే పుస్తకంలో ఈసర్వే సంగతి ఉదహరించారు)            

మద్యనిషేధం పై అసెంబ్లీలో వావిలాల ప్రసంగం



తెలుగు మద్యం పోస్టుపై పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణారావు వ్యాఖ్యానిస్తూ నాటి శాసన సభలో జరిగిన చర్చలు గురించి తెలిస్తే రాయమని సూచించారు.
అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే  1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది.
ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించి పోస్టు చేస్తున్నాను.
“మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?
“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.మోరల్ ప్రిన్సిపుల్స్ వున్నాయని సంతోశిడ్డాము అంటే పర్మిషన్ ఇస్తుంటారు. గవర్నమెంటు డిస్టిలరీస్ నడపడానికి ప్రయత్నం చేస్తోంది. అవి మంత్రి గారు నడుపుతారా సెక్రెటరీలు నడుపుతారా కాంట్రాక్టర్లకు ఇస్తారు.
“విషం కలిపితే తాగి చనిపోతునట్టు వింటున్నాం. పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటోంది. నిజలింగప్ప గారు వ్హేప్పినట్టు దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అవుతోంది. మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము.  అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.
“బకాసురుడు బాధ పెట్టినట్టుగా రోజూ ఎస్ ఐ వెళ్లి ఈ ప్రొఫార్మా వుంది. మీరు ఈ గ్రామంలో నాలుగు దుకాణాలు పెట్టుకోండి, కానీ మాకు నెలకు రెండు కేసులు ఇవ్వండి అంటారు. స్టాటస్టిక్స్ చూడండి. పేదవాళ్ళు కాకుండా ధనవంతులు ఎవరైనా జైలుకు పోయారా. అటువంటప్పుడు ఈ యాక్టు ఎందుకు. 160 మంది కాంగ్రెస్ లేజిస్లేటర్లు రద్దు చేయడానికి సంతకం చేసారట. ప్రొహిబిషన్ కావాలి అంటున్నారు. గాంధీజీ సిద్దాంతం అంటున్నారు. త్రాగడానికి ఒప్పుకున్నారు.
“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”        



5, మే 2020, మంగళవారం

తెలుగు మద్యం కధ


అనగనగా, ఒకప్పుడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రాంతంగాను, ఇప్పటి తెలంగాణా హైదరాబాదు స్టేట్ గాను వున్నప్పుడు ఆంధ్రలో టోటల్ ప్రొహిబిషన్. అంటే సంపూర్ణ మద్యనిషేధం. హైదరాబాదు స్టేట్ లో ఎప్పుడూ ఈ మాట వినబడలేదు. 1956 లో ఈ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ చాలా కాలం వరకు ఈ ఒక్క నిబంధన మాత్రం చెక్కు చెదరకుండా ఆయా ప్రాంతాల్లో అమల్లో వుండేది. అంటే ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఎక్సైజ్ విధానాలు. ఆంధ్రాలో మద్యం షాపులు ఉండేవి కావు. కాపు సారా కాసే వారిని పట్టుకోవడానికి ఎక్సైజ్ సిబ్బంది వుండేవారు. మా ఊరు రెండు ప్రాంతాల సరిహద్దు రేఖపై వుండేది. ఆంధ్రాలో ఆ రోజుల్లో ఓ జోకు చెప్పుకునేవారు. మందుబాబులు ఊరి పొలిమేర దగ్గర నిలబడి మందు కొడుతూ, ఎక్సైజ్ కనిస్టీబు కనిపించగానే ఒక గెంతు గెంతి గెట్టు దాటి తెలంగాణా ప్రాంతంలోకి దూకి ఇప్పుడు పట్టుకో చూద్దాం అని అతడ్ని ఆటలు పట్టించేవారట.
మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో ఖమ్మం మొత్తానికి ఒకే ఒక వైన్ షాపు వుండేది. (వైన్ అంటే ఏమిటో అక్కడే ఎందుకు అమ్ముతారో మాకు తెలవదు) మందు కొనేవాళ్ళు భుజాన కండువా నెత్తి మీద కప్పుకుని, మొహం గుర్తుపట్టకుండా ఆ దుకాణానికి వెళ్ళేవాళ్ళు. మందుబాబులు అంటే సమాజంలో చాలా చిన్న చూపు వుండేది.
తర్వాత రోజుల్లో ఆంధ్రప్రాంతంలో కూడా ప్రొహిబిషన్ ఎత్తేశారు. ఆ విధంగా సమసమాజ నిర్మాణం జరిగింది.
ఇప్పుడు చిత్రంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ఆంధ్రాలో కొన్ని చోట్ల వైన్ షాపులు తెరిచారు. తెలంగాణాలో మాత్రం మందు విక్రయాలు జరగడం లేదు.

4, మే 2020, సోమవారం

ఎలా వున్నారు?



ఇప్పుడే కొద్దిసేపటిక్రితం ఫోను రింగయింది.
“భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”
వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.
“శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”
“నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”
“నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”
“..........”
“హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”
“అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”
“ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”
“....................”
“ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”
“చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”
“నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”
తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను.


3, మే 2020, ఆదివారం

వై2కె – భండారు శ్రీనివాసరావు


ఇప్పుడు కరోనా అనే మూడక్షరాల వ్యాధి  యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నట్టు కొత్త శతాబ్ది (2000)ప్రారంభం కావడానికి  కొన్నిసంవత్సరాల ముందు Y2K అనే ఓ మూడక్షరాల పదం కంప్యూటర్ ప్రపంచాన్ని (వారి భాషలో దీన్ని బగ్ అంటారు) గజగజ వణికించింది.
1997/1996 ప్రాంతాల్లో చిన్నగా అంకురించిన ఓ సందేహం 1998 కల్లా ఇంతింతై, వటుడింతై అన్నట్టు పెరిగిపోయి కంప్యూటర్ల పాలిట పెను ముప్పుగా పరిణమించింది.
దీన్ని గురించి సామాన్యుల భాషలో చెప్పాలంటే, పైన చెప్పిన సంవత్సరాలనే తీసుకుందాం. 1998 ని 98గా రాయడం పరిపాటి. అంటే కంప్యూటర్లలో నాలుగు డిజిట్లకు (1998) బదులు రెండు డిజిట్లే (98) వాడతారు. బ్యాంకు ఖాతాలు, ఆదాయపు పన్ను లెక్కలు ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా ఈ రెండు డిజిట్లే.
1998 సంవత్సరం డిసెంబరు ముప్పయి ఒకటి పోయి 1999 జనవరి ఒకటి రాగానే, అంటే ముప్పయి ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే ఆటోమేటిక్ గా గడియారాలు, కంప్యూటర్లలో 98 పోయి 99 వస్తుంది. అలాగే  1999 డిసెంబరు ముప్పయి ఒకటి తర్వాత చివరి రెండు డిజిట్ల స్థానంలో 00 వస్తుంది. అంటే 2000 కి బదులు  1900 వస్తుంది. దాంతో కాలం వందేళ్ళు వెనక్కి పోతుంది. లెక్కలు డొక్కలు అన్నీ తారుమారవుతాయి. ఇదే Y2K BUG.
ఈ ముప్పును తప్పించుకోవడం ఎలా అన్నది పెద్దపెద్ద కంప్యూటర్ కంపెనీలకు పెద్ద తల నొప్పిగా మారింది. IBM మెయిన్ ఫ్రేమ్స్ సాయంతో ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలంటే లక్షల సంఖ్యలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సిబ్బంది అవసరమవుతారు. ఈ అంశమే భారత దేశానికి ముఖ్యంగా (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా మారింది. రాత్రికి రాత్రే అనేక చిన్న చిన్న కంపెనీలు, హైదరాబాదులోని  అమీర్ పేట చుట్టుపక్కల పుట్టుకొచ్చాయి. వేల సంఖ్యలో అభ్యర్ధులు శిక్షణా సంస్థల్లో క్రాష్ కోర్సులు పూర్తిచేసి అమెరికాకు వెళ్ళిపోయారు. చిన్నా చితకా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న యువకులు కూడా ఆ కోర్సులు చేసి ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్ కొలువుల్లో కుదురుకున్నారు. అమెరికాలో ఈనాడు మంచి జీతాలతో మంచి జీవితాలు గడుపుతున్న అనేక మందిలో ఈ Y2K వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ రెండేళ్ళు కష్టపడి  కంప్యూటర్లలో 1999 తర్వాత 2000 వేల సంవత్సరం వచ్చేట్టు చేయగలిగారు.
దాంతో అంతర్జాతీయ కంప్యూటర్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. 
Y2K గురించి రాసిన ఈ పోస్టు చూసి కప్పగంతు శివరామ కృష్ణ గారు ఆనాటి తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. వారికి కృతజ్ఞతలు : 
"నేను అప్పుడు కెనరా బ్యాంకు ఆబిద్ రోడ్ శాఖలో పనిచేస్తున్నాను. ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్నెన్ని ప్రింట్లు తీసామో! రెండు రోజులపాటు బాంకులోనే రాత్రిళ్ళు ఉండి, అన్నీ ప్రింటర్లు (అప్పట్లో అన్నీ డాట్ మాట్రిక్స్ ప్రింటర్లే) పని చేయించి ఒక పద్ధతి ప్రకారం మొత్తం ప్రింట్లు తీసి పెట్టాము. అంటే కంప్యూటర్లు పనిచేయకపోతే, మామూలు మాన్యువల్ పద్ధతిన మర్నాడు పనిచేయటానికి సిద్ధపడ్డాము. అన్నీ బాంకు శాఖల్లోనూ ఇదే విధంగా చేశారు.ప్రింట్లు తీసిన తరువాత, వాటి అవసరంపడితే, సంబంధిత ఖాతా వివరాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి. అందుకోసం నాకున్నా డాస్ సిస్టం పరిజ్ఞానం ప్లస్ ప్రింట్లు, ఆ ప్రింట్లు అన్నీ ఒక పద్ధతిలో సద్ది, ఆ మొత్తానికి ఇండెక్స్ చేసి పెట్టాను. అవసరం అయితే ఏ ఖాతా కావాలన్నా ఆ ప్రింట్ ఏ బాక్స్ లో ఉన్నదో చూపించే చిన్ని ప్రోగ్రాం చేసి పెట్టుకున్నాను. రకరకాలుగా test చేసి ఉంచుకున్నాము.
1 జనవరి 2000 రాంగానే మొదటి లాగ్ యిన్ చేసి చూస్తే, కంప్యూటర్లో సమస్య ఏమీ రాలేదు అని చూసుకుని, బాంకుల్లో పనిచేసే వారందరూ అప్పుడు ఇళ్ళకు వెళ్లారు." 
            

30, ఏప్రిల్ 2020, గురువారం

మార్పు చూడని కళ్ళు - ఆరవ ఆఖరి భాగం

చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్
సోవియట్ యూనియన్ అధినేతలలో చాలామంది పదవిలో ఉండగానే మరణించారు. నికితా కృశ్చెవ్ విషయంలో వేరేగా జరిగింది. ఆయన జీవించి ఉండగానే పదవి నుంచి తొలగించారు. మిహాయిల్ గోర్భచేవ్ మాత్రం ఆరేళ్ళు అధికారంలో కొనసాగిన తర్వాత 1991 లో తన పదవికి రాజీనామా చేసారు.  రాజీనామా ప్రకటించిన తర్వాత బల్లపై కాగితాలు సర్దుకుంటూ కళ్ళజోడు తీసి వాటిపై పెట్టి, పక్కనే వున్న కప్పూ సాసరు వంక సాలోచనగా  చూస్తారు. అది ఖాళీగా కనిపిస్తుంది. క్రెమ్లిన్ లో ఆయనకు టీ సర్వ్ చేయకపోవడం అది మొదటిసారి. అధికారానికి అంతిమ ఘడియలకు అది సూచన.
గోర్భచేవ్ స్వతహాగా హాస్య ప్రియుడు. తర్వాత ఎప్పుడో ఆ సంఘటన గురించి చెబుతూ, ‘రాజీనామా పత్రంపై సంతకం చేస్తున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నన్ను నేనే తుపాకీతో కాల్చుకున్న అనుభూతి కలిగింది” అన్నారాయన మందహాసంతో.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అనంతరం దేశంలో సంభవిస్తూ వచ్చిన పరిణామాలను ఆయన దగ్గర నుంచి గమనిస్తూ వచ్చారు. మిహాయిల్ ఖోదోర్కొవిస్కి తన కళ్ళ ముందే దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎదగడం ఆయన చూసారు. ఒకప్పుడు ఆయన్ని పట్టుకుని సైబీరియా జైలుకి  పంపారు. ఆ సమయంలో గోర్భచేవ్ కల్పించుకుని సాయపడకపోతే ఆయన జీవితం అక్కడితో ముగిసివుండేది.
రాజకీయంగా తన ప్రధమ ప్రత్యర్ధి అయిన బోరిస్ ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించినప్పుడు గోర్భచేవ్ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ సమయంలో వీఐపీ గేటు ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక సాధారణ పౌరుడి మాదిరిగా జనంలో నిలబడి తన ఒకప్పటి సహచరుడికి అంతిమ వీడ్కోలు చెప్పారు. ప్రస్తుత అధినేత పుతిన్ తో సంబంధాలు మొదట్లో అద్భుతంగా ఉండడాన్ని, ఆ తర్వాత  పోను పోను నిరాసక్త ధోరణికి మారడాన్ని  కూడా ఆయన గమనించారు. అయినా తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే స్తితప్రజ్ఞత అలవరచుకున్నారు. ఎనిమిది పదులు దాటిన వయస్సులో, భార్య చనిపోయి ఊరి బయట వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నగరం నడిబొడ్డున వుండే తన ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లి పనిచేసుకోవడం దినచర్యగా మార్చుకున్నారు.
1999 సెప్టెంబరులో  రైసా గోర్భచేవ్ కన్నుమూసినప్పటి నుంచి 89 ఏళ్ళ గోర్భచేవ్ ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 
మరో సందర్భంలో బీబీసీ ప్రతినిధికి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  ఇలా చెప్పారు.
“నేను మొదటిసారి 1985లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సోవియట్ యూనియన్ లోని అన్ని రిపబ్లిక్ లలో విస్తృతంగా పర్యటించాను. గ్రామీణ ప్రజలతో దగ్గరగా మాట్లాడాను. నేను కలిసినప్పుడల్లా వాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు.
“మనకు చాలా ఇబ్బందులు వున్నాయి. తిండి గింజలకు కటకటఉన్న మాట నిజమే. అయితే  ఏమవుతుంది. మరి కాస్త కష్టపడితే వాటిని పండించుకుంటాము. ఇబ్బందులను అధిగమిస్తాము. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే. యుద్ధం రాకుండా చూడండి”
“యుద్ధం వల్ల మా దేశం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత నష్టపోయిందో వాళ్లకు గుర్తున్నట్టుంది. అందుకే వాళ్ళు ఆ కోరిక కోరారు.  బెర్లిన్ గోడ కూల్చి వేస్తున్నప్పుడు జోక్యం చేసుకోవాలని ఎంత వత్తిడి వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఈనాటి ప్రపంచానికి యుద్ధాలు పనికిరావు”
“ప్రజల్లో అధిక సంఖ్యాకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్యం” అని చెప్పారాయన.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన ఇరవై ఏడేళ్లకు మెదుజా పత్రిక విలేకరి ఇల్యా జెగులేవ్ మిహాయిల్ గోర్భచేవ్ తన వృద్ధాప్యాన్ని ఎలా గడుపుతున్నారు అనే దానిపై ఒక వ్యాసం రాసారు.
అదిలా మొదలవుతుంది.
“మిస్టర్ గోర్భచేవ్! నేనెవరినో గుర్తున్నానా!”
గోర్భచేవ్ ఎదుట చాలా ఖరీదైన సూటు ధరించిన వ్యక్తి నిలబడిఉంటాడు. అతడి పేరు మిహాయిల్ ఖోదోర్కొవిస్కి. రష్యాలో అత్యంత సంపన్నుడు. మొత్తం దేశంలో అతిపెద్ద ముడిచమురు కంపెనీ ‘యూకోస్’ అధినేత.
“అవును. మీరు గుర్తున్నారు. ఇంతకీ నేనెవరన్నది తమరికి గుర్తు ఉందా?” అని గోర్భచేవ్ ఎదురు ప్రశ్నిస్తాడు.
ఇంటర్వ్యూ చేయడానికి ఆ విలేకరి ఇల్యా ఆయన ఇంటికి  వెళ్ళినప్పుడు గోర్భచేవ్ చెప్పిన మాట వింటే చాలా బాధ వేస్తుంది. 

“నిన్న బయటకు వెళ్ళడానికి బయలుదేరుతూ పైకి చూసాను. పై కప్పు నుంచి నీళ్ళు కారుతున్నాయి” (EOM)

మార్పు చూడని కళ్ళు (5)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)

ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్  యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త డిక్రీపై మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ (మార్షల్ లా)  ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్  రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి గోర్భచేవ్ ఇలా అన్నారు. పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
గోర్భచేవ్ దంపతులు నల్ల సముద్ర తీరంలో గృహ నిర్బంధంలో వున్నప్పుడు అనేక సందేహాలు చుట్టుముట్టాయి. వాళ్ళని బందీగా ఉంచారు అన్నమాటే కానీ వాళ్ళ కదలికల మీద గట్టి కాపలా లేదు. ఇంట్లో ఫోను డిస్కనెక్టు చేశారు కానీ బయట కారులో ఫోను తొలగించలేదు. గృహ నిర్బంధంలో వున్నప్పుడు గోర్భచేవ్ అనేకమందితో మాట్లాడినట్టు రుజువులు వున్నాయి.
1991 కుట్రపై సాధికార సమాచారం కలిగిన అమెరికన్ చరిత్రకారుడు జాన్ డన్లప్ అబిప్రాయం ప్రకారం గోర్భచేవ్ రెండు రకాల ఆలోచనల్లో వున్నారు. కుట్ర విజయవంతం అయితే మళ్ళీ తనకు నాయకత్వం  వహించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అది విఫలం అయితే తన పాత్ర అంతటితో ముగుస్తుంది.  అంచేత కుట్రకు బహిరంగంగా మద్దతు తెలపక పోయినా, అది విజయవంతం కావాలని ఆయన మనసులో కోరిక వుండేది. అయితే ఈ అభిప్రాయాన్ని గోర్భచేవ్ తరువాతి రోజుల్లో ఖండించారు.
2006లో రష్యన్ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరిస్  ఎల్త్సిన్  చేసిన ఆరోపణ డన్లప్ అభిప్రాయానికి దగ్గరగా వుంది.
కుట్ర జరిగే సమయంలో అన్ని విషయాలు ఆయన (గోర్భచేవ్) కు చెప్పారు.
అయితే ఈ క్రీడలో నేనా? వాళ్ళా? (కుట్రదారులు) ఎవరు విజేతలు అవుతారు అన్నది  తెలిసేదాకా ఆయన  బయటపడదలుచుకోలేదుఅనేది  డన్లప్ కధనం.
అయితే గోర్భచేవ్ ఫౌండేషన్  ఈ ఆరోపణని తీవ్రంగా ఖండించింది. గోర్భచేవ్ పేరు చెడగొట్టడానికి ఈ నిందారోపణలు చేస్తున్నారని, సోవియట్ యూనియన్ విచ్చిన్నంలో తన పాత్రను మరుగుపరచుకోవడానికి ఎల్త్సిన్ ఈ పనికి పూనుకున్నారని ఫౌండేషన్ పేర్కొన్నది. నిజానిజాలు తేలకముందే ఆ తర్వాత కొద్ది రోజులకే ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించారు. (ఇంకావుంది)