7, డిసెంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 35 – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 07-12-2019, Saturday) 

ఒకానొక కాలంలో జరిగిన సంఘటనలను గురించి చదువుతున్నప్పుడు అలా జరగడం సంభవమేనా, సంభవమైనా సబబేనా అనే సందేహాలు కలగడం సహజం.  ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఒక విషయం 1987 నాటిది. అంటే మూడు దశాబ్దాల పై చిలుకు కాలం, కాలగర్భంలో కలిసిపోయింది.  ఆనాడు చిన్నపిల్లలుగా వున్నవాళ్ళు ఎదుగుతూ వచ్చి  ఈరోజున ప్రౌఢవయసులో వుండివుంటారు. అప్పటి సంగతుల మీద స్పష్టమైన అవగాహన ఉండడానికి అవకాశంలేని  అలాటివారి కోసమే, అలనాటి కాలమాన పరిస్తితులను గురించి ఈ చిన్న వివరణ.
వేగంగా వెడుతూ రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ ధారణ చాలావరకు ఉపకరిస్తుంది. సందేహం లేదు. ప్రధానంగా ద్విచక్రవాహనాలకు సంబంధించినంతవరకు ఇది కాదనలేని వాస్తవం.  అయితే ఆ  నిబంధనను నాటి పోలీసు  అధికారులు అమలు చేయడానికి ఎంచుకున్న విధానాలపట్లనే  ప్రజల్లో నిరసన పెద్ద ఎత్తున వ్యక్తమైంది. కాకపొతే, ఇప్పట్లా ఇన్ని రకాల ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో జర్నలిస్టుల ఆందోళన కారణంగానే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. నాటి పరిస్తితుల నేపధ్యాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయంలో తలెత్తే అనుమానాలు ఓ మేరకు నివృత్తి అయ్యే అవకాశం వుంది.
ద్విచక్ర వాహనదారులు  తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే  నిబంధన విధించింది సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. హెల్మెట్ నిబంధన అమలు బాధ్యతను  ఒప్పగించింది అత్యుత్తమ పోలీసుఅధికారిగా పేరు తెచ్చుకున్న కే.ఎస్. వ్యాస్ గారికి.
విజయవాడలో పనిచేసినప్పుడు వ్యాస్ గారు తనదైన వ్యవహార శైలితో ఆ నగరాన్ని (అప్పుడు పట్టణం) శాంతి భద్రతలకు నిలయంగా మార్చారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నమై నిలిచారు. నాకు తెలిసిన కుటుంబపెద్ద ఒకరు ఆ రోజుల్లో నాతో చెప్పారు,  అల్లరి చిల్లరగా తిరిగే తన కొడుకు పెందలాడే బుద్ధిగా  ఇంటికి వస్తున్నాడని, వ్యాస్ ఫోటో పెట్టుకుని రోజూ దణ్ణం పెట్టుకుంటున్నామని. ఆయన సమర్ధతకు ఇదొక కితాబు. ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని కూడా శంకించాల్సిన పరిస్తితి కాదు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను కట్టడి చేయాలంటే హెల్మెట్ ధారణ అవసరమనే నిపుణుల అభిప్రాయం మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని వుంటారు. అయితే వచ్చిన చిక్కల్లా ఆ నిబంధన అమలు తీరులోనే  వచ్చింది.
ఇప్పుడు చెప్పినా నమ్మేవాళ్ళు ఉంటారా అనే పద్దతిలో వ్యాస్ గారు తన కార్యాచరణ మొదలు పెట్టారు. హెల్మెట్ ధరించని వారిని వెంటాడి పట్టుకోవడం కోసం ప్రతి ప్రధాన కూడలి వద్దా ఒక పోలీసు బృందం మోటారు సైకిళ్ళపై సిద్ధంగా వుండేది. నిజానికి హెల్మెట్ ధరించనివాళ్ళు దొంగలూ కాదు దోపిడీదారులూ కాదు. వారిని పట్టుకుని చలనాలు వసూలు చేయడానికి ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు అవసరమా అనేది అప్పుడు సామాన్య వాహనదారుల్లో తలెత్తిన ప్రశ్న. పైగా పోలీసులు వారికి వేరే పనేమీ లేదన్నట్టు ఈ ఒక్క విషయం పైనే దృష్టి పెట్టారు. నేను ఒక  పోలీసు ఉన్నతాధికారిని అడిగాను. ‘సికిందరాబాదు స్టేషన్ నుంచి మీ పేరు చెప్పకుండా మీ భార్యపిల్లలను ఇంటికి  ఆటోలో రమ్మనమని చెప్పండని. ఎగస్ట్రా డబ్బులు అడగకుండా ఏ ఆటోవాడయినా వస్తే మేము ఈ హెల్మెట్  ఆందోళన విరమించుకుంటామని. అయన నవ్వేశాడు జవాబు చెప్పకుండా.
‘నాకు హెల్మెట్ వుంది. ఈ సందులోనే మా ఇల్లు. మా అమ్మకు మందు కొనడానికి మందులషాపు పక్కనే కదా అని తొందరలో హెల్మెట్ మరచిపోయి వచ్చాను. చూడండి లుంగీ మీదనే వున్నాను’ అన్నా వినకుండా  ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాసిన వార్తలు అనుదినం పత్రికల్లో వచ్చేవి. పోలీసుల అతి ఉత్సాహాన్ని వేళాకోళం చేస్తూ పత్రికల్లో అనేక కార్టూన్లు వచ్చేవి. ఇవన్నీ సహజంగా ప్రభుత్వాన్ని చీకాకు పెట్టేవే.

ఆ రోజుల్లో హైదరాబాదులో  విలేకరుల సంఖ్యే నామమాత్రం.  మళ్ళీ వారిలో ద్విచక్ర వాహనాలు వాడే వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. హిందూ రాజేంద్ర ప్రసాద్ వంటి ఒకరిద్దరికి మాత్రం పాత మోడల్ కార్లు ఉండేవి. పత్రికా  విలేకరుల జీత భత్యాలు అంతంతమాత్రం. ఎన్నోసార్లు బంకుల్లో డబ్బులు లేక అరలీటరు పెట్రోలు కొట్టించుకుని సరిపుచ్చుకున్న  సందర్భాలు అనేకం. వీరు వృత్తిరీత్యా నగరంలో అనేక ప్రాంతాలు తిరగాల్సి వుంటుంది. బేగం పేట ఎయిర్ పోర్ట్, అసెంబ్లీ, సచివాలయం ఇలా రోజంతా తిరుగుళ్ళే, వెంట తెచ్చుకున్న హెల్మెట్  ని ఎక్కడన్నా మరచిపోవడానికి కానీ, లేదా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
రాష్ట్ర రాజధానిలో సయితం రోడ్లు సరిగా ఉండేవి కావు. ఇప్పుడు వున్నాయని కాదు. కాకపొతే అప్పటికంటే చాలా మెరుగు. అడుగడుగునా గోతులు, మిట్టపల్లాలతో వుండే రోడ్లపై వేగంగా పోవడం అసాధ్యమని అధికారులకు, మంత్రులకు ఎన్ని సార్లు విన్నపాలు చేసుకున్నా ఫలితం లేకపోయింది.
ఓ రోజు రేడియోలో పని ముగించుకుని ఇంటికి వస్తుంటే  అప్పుడే వర్షం పడి వెలిసినట్టు వుంది.  త్యాగరాయ గాన సభ దగ్గర పోలీసుల హడావిడి కనిపించింది.  హైదరాబాదు పోలీసు కమీషనర్  టీ.ఎస్. రావు గారు అప్పుడే కారు దిగి నిలబడ్డారు. నేను ఆయన వద్దకు వెళ్లి ‘ఒకసారి ఇటు రండి’ అని  రోడ్డుపై పారుతున్న నీళ్ళల్లో నా కాలిని  బలంగా ఆనించాను. దాదాపు మోకాలు దాకా దిగిపోయింది. ‘సార్ ! ఇలాటి గుంతల  రోడ్లపై వేగంగా వెళ్ళడం ఎలా కుదురుతుందో చెప్పండ’ని అడిగాను. ఆయన తన సహజ ధోరణిలో చీకాకు పడకుండా చిరునవ్వుతోనే జవాబు చెప్పారు. భావం ఏమిటంటే రోడ్ల నిర్వహణ తమ శాఖకు సంబంధించింది కాదని. నిజమే! రోడ్ల నిర్వహణ పోలీసులది కాదు. ప్రజలకు సేవ చేయడంలో ఎదురయ్యే లోపాలకు ప్రభుత్వ విభాగాలు ఒకరిపై మరొకరు నెపాలు మోపుకునే వెసులుబాటు వుంది. కానీ పౌరులు మాత్రం ఏదో మిష  చూపి తప్పించుకోవడానికి వీలుండదు.
వాహనదారుల రక్షణకు హెల్మెట్ అవసరమే. కానీ ఇదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న పద్ధతిలో నాడు ఈ విధానం అమలు జరగడమే  విమర్శలకు తావిచ్చింది. సరే హెల్మెట్లు ధరించడం పౌరుల బాధ్యతే అనుకుందాం. మరి రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. దగ్గరికి వచ్చిన దాకా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఒకటి వున్నట్టు తెలవదు. నిజానికి నిబంధల ప్రకారం వాటి మీద పసుపు నలుపు రంగు చారలు స్పష్టంగా కనిపించేటట్టు పెయింట్ వేయాలి. వాటికి కొద్ది దూరంలో దగ్గరలో ‘స్పీడ్ బ్రేకర్ వున్నది జాగ్రత్త’ అనే సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి. ‘ఏవీ!ఇవేవీ ఎందుకు కనబడవు’ అంటే ‘నిధుల కొరత’  అంటారు, సామాన్యుల దగ్గర మాత్రం  డబ్బు సంచులు మూలుగుతున్నట్టు అక్కడికక్కడే ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తారు. ఇదేమి న్యాయమో చెప్పండి. ఇదీ ఆరోజుల్లో మా (జర్నలిస్టుల) వాదన.
ఈ నేపధ్యంలో, ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు  గురించి చెప్పాను. విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంటుందని, అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి, హెల్మెట్ పోయినా, లేదా ఎక్కడయినా మరచిపోయినా అంతంత డబ్బులు పోసి  కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను చేసి,  ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై14  వ తేదీ.  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారి తండ్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్ నాధ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు ఇంకా చాలా వ్యవధానం వుండడంతో ఆంధ్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి  బయలుదేరాను. మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీసు నాకు  హెల్మెట్ లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి,  నన్ను పోలీసులు పట్టుకుపోయిన విషయం ఇతర జర్నలిస్టులకు ఫోను చేసి చెప్పాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా నిలిచారని. వారిలో హిందూ రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర నాథ్,సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్ టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుడు ఎడిటర్ తెలంగాణా టుడే), జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, జేబీరాజు  ఒకరా ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.


(అప్పటి  హుమాయూన్  నగర్  పోలీస్  స్టేషన్ లో జర్నలిస్టుల  ధర్నా) 

మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో  నన్ను విడిచిపెట్టారు. కానీ మరునాడు విలేకరులు  అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం గమనించి స్పీకర్ జీ. నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు  మద్రాసులో ఉన్న ముఖ్యమంత్రి  రామారావు గారు వెంటనే స్పందించారు. సంఘటనతో సంబంధం వున్న పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు.  కొత్తగా హోమ్  మంత్రి  బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి. హెల్మెట్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత ఉదార వైఖరి చోటు చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను కుటుంబంతో సహా సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.
దరిమిలా  ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన  విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను  రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు ఫోనులో తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు ఇంత  గొడవ పడడం సబబా అన్న విమర్శలు కూడా వినపడ్డాయి.
కొన్ని సంఘటనలు అలా మన నిమిత్తం లేకుండా జరిగిపోతుంటాయి. తప్పా ఒప్పా అనేది కొన్ని సందర్భాలలో కాలమే నిర్ణయిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అత్యల్ప విషయాలుగా కూడా అనిపిస్తాయి. కాలం తెచ్చే మార్పు ఇది.
(ఇంకా వుంది)







6, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు – 34- భండారు శ్రీనివాసరావు



(Published in SURYA daily on 06-12-2019, Friday) 


రేడియో విలేకరిగా ఆ స్థానాన్ని నా అంతగా దుర్వినియోగం చేసిన వాళ్ళు మరొకరు వుండరు అనేది నా నమ్మకం. ఎవరు ఏది అడిగినా అదేదో నా చేతిలో పని అయినట్టు, ఆ పనిచేయాల్సిన వాళ్లకు చెప్పి చేయించేవాడిని. అయితే నా ఈ తత్వం నాకు రేడియోలో మంచి పేరు తీసుకురావడమే ఆశ్చర్యం.
ఒకసారి ప్రసార భారతి సీఈవో (రేడియో, దూరదర్శన్ లకు కలిపి ఇదే అత్యున్నతమైన  పోస్టు)   శ్రీ  కేజ్రీవాల్  అధికారిక సమావేశాల్లో    పాల్గొనడం కోసం హైదరాబాదు వచ్చారు. ఆయన రెండు రోజులు వుండే నిమిత్తం వస్తే జరూరుగా ఢిల్లీ రావాలని పైనుంచి కబురు వచ్చింది. ఆయన రిజర్వ్ చేసుకున్న విమానం టిక్కెట్టు మర్నాటికి. కానీ సాయంత్రమే వెళ్ళాలి.  ఆ రోజుల్లో ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి విమానం ఒక్కటే దిక్కు. ప్రైవేటు విమానాలు లేవు.
మా స్టేషన్ డైరెక్టర్ నన్ను పిలిపించారు. విషయం చెప్పారు.  ‘నో ప్రాబ్లం’ అని ఆ ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషిని  బేగంపేట ఎయిర్ పోర్టుకి తీసుకువెళ్ళాను. ఆ రోజుల్లో నా గుర్తింపుకార్డు  ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా పనికి వచ్చేది. అప్పటికే బోర్డింగు పాసులు ఇచ్చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారికి విషయం చెప్పి ‘ఏమైనా సాయం చేయగలరా’ అని అడిగాను. ‘మీరు వెళ్లి ఎవరిదైనా బోర్డింగు పాసు తీసుకువస్తే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. వెంటనే వెళ్లి వీ.ఐ.పీ. లాంజ్ లో  వెయిట్ చేస్తున్న వారెవ్వరని పరికించి చూసాను. బాగా పరిచయం, చనువు వున్న ఓ ఎంపీ దగ్గరికి వెళ్లి, ‘ఈరోజే ఢిల్లీ వెళ్ళాలా, రేపు వెళ్ళినా పరవాలేదా’ అని అడిగాను. ఆయన నవ్వి ‘ఈ రాత్రి అక్కడికి పోయి చేసేదేమీ లేద’న్నాడు. వెంటనే  ఆయన బోర్డింగు పాసు తీసుకుని మా సీయీవోకు ఇచ్చాను. ‘పదండి పోదాం’ అంటూ టార్మాక్ మీద ఆగివున్న విమానం ఎక్కించాను. నేను కూడా విమానం మెట్లెక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ‘మీరు కూడా ఢిల్లీ వస్తున్నారా!’ అని. నేను నవ్వేసి బై బై చెప్పేసి బయటకు వచ్చాను. సీఈవో విమానం ఎక్కారన్న విషయం తెలుసుకుని బయట వెయిట్ చేస్తున్న మా అధికారులు చాల సంతోష పడ్డారు.
తర్వాత నా పేర స్టేషన్ డైరెక్టర్ కు ఒక ఉత్తరం వచ్చింది.
‘హైదారాబాదు ఎయిర్ పోర్టులో మీరు చేసిన మిరకిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను.  ఇలా కూడా జరుగుతుందా అనే ఆలోచన నుంచి ఇప్పటికీ  బయటపడ లేకుండా వున్నాను’   
దుర్వినియోగం అంటారో, వినియోగం అంటారో తెలియదు కానీ ప్రతి  పాత్రికేయుడూ ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా  చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. ఢిల్లీ, విజయవాడలకు వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర  నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్ లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది. రేడియో వాళ్ళు నాతొ మాట్లాడాలని అనుకుంటే  ఆయనకు ఫోన్  చేసేవాళ్ళు. పాపం ఆయన కూడా అపరాత్రి అర్ధరాత్రి అనుకోకుండా స్కూటర్  వేసుకుని  మా ఇంటికి వచ్చి సమాచారం చెప్పేవాడు.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత  ఫోను అవసరం గురించి  టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ తో  (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే సర్వాధికారి) దృష్టికి తీసుకువెడితే ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడారు. ముందు నేను కోరుకున్న నెంబర్ 65758  ఇచ్చారు. మొదటి బిల్లు కూడా కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్ అక్షరాల్లో నా పేరు వేసేవారు. మేము మాస్కో వెళ్ళేంతవరకు అదే నెంబరు. అయిదేళ్ళ తర్వాత తిరిగొచ్చాను. మా అన్నయ్య ఇంట్లో ఉంటూ అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు పెట్టాము. ఎందుకో ఓ రోజు బేగం పేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ  కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య నాయుడు  కలిసారు. ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి అని అడిగారు. ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను. మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు. ‘మీకు ఫోన్ శాంక్షన్ చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు. పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్ కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు జాగ్రత్త అని. అయినా నేను వినలేదు. మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
మరో సారి ఢిల్లీ నుంచి ఉత్తర భారతానికి చెందిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి వచ్చారు. నేను అడగగానే ఆయన ఏకంగా మా ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే పదిమందికి  అవుట్ ఆఫ్  టర్న్ పద్దతిలో టెలిఫోన్లు మంజూరు చేసి చక్కా పోయారు. ఇప్పుడంటే టెలిఫోన్లు అడిగీ అడక్క ముందే దొరుకుతున్నాయి. ఒకానొక రోజుల్లో  టెలిఫోన్ పెట్టించుకోవాలంటే ధరకాస్తు పెట్టుకుని ఏళ్ళతరబడి ఎదురు చూడాల్సిన పరిస్తితి వుండేది.
(ఇంకా వుంది)

4, డిసెంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 33 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 05-12-2019, Thursday)

‘ఆకాశవాణి, విజయవాడ కేంద్రం’
ఒకానొక కాలంలో ప్రాభాత వేళలో ఈ పదాలే  జనపదాలకు మేలుకొలుపు పిలుపులు.
అలాంటి విజయవాడ రేడియోకి ఇప్పుడు డెబ్బయ్ రెండేళ్ళు.
బందరు రోడ్డు, పున్నమ్మతోటలో ఉన్న విజయవాడ రేడియో కేంద్రం గురించి తెలియనివాళ్ళు, వినని వాళ్ళు ఆంధ్రప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీత సాహిత్యాలలో ఘనాపాటీలు, దిగ్గనాధీరులైన అనేకమంది  ప్రముఖులు ఈ కేంద్రం ద్వారా తమ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన వాళ్ళే.
ఈ కేంద్రం పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. 
“1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి)రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
శ్రీ సుధాకర్ మొదునూడికి ( sudhakar modunudi) విజయవాడ ఆకాశవాణితో నలభై నాలుగేళ్లకు పైగా అనుబంధం. పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేనురూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి ఈనాడు ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేయటం దాకా బెజవాడ రేడియోలో ఆయన ప్రస్థానం సాగింది. ఆ అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే.
“నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు ఎన్నటికీ మార్పున పడవు. ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుతం అక్కడ దూరదర్శన్ కేంద్రం వుంది) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది. పెద్దపెద్ద చెట్లమధ్య, పైకి పెంకుటిల్లులా కనిపించేది. ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూలకుండీలు వరుసగా పేర్చి ఉండేవి. వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి. నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా, పంచెకట్టి, ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు. నాటకాల రిహార్సల్సూ, దేశభక్తి గీతాల సాధనలూ, ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందే,  గుంపులుగుంపులుగా కూర్చొని కొనసాగించేవారు. మేడపైకి చెక్కమెట్లు. పైన ఆఫీసుగదులు.
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు, మధ్యలో అద్దాలపెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత)రేడియో స్టేషన్ భవంతి నమూనా, దానిపై అందంగా అమర్చిన పూలగుత్తుల పింగాణీ జాడీ, ఎదురుగా మూడు స్టూడియోలు, ఒకటి సంగీతానికి,రెండవది నాటకాలకు,మూడవది ప్రసంగాలకు. లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు. చేతిలో కాగితాలు పట్టుకొని, హడావుడిగా అటూఇటూ నడిచే అనౌన్సర్లు.  ఒకమూల స్పీకరునుండి మంద్రగంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం.  పైకప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు. తెల్లటి గోడలకు శబ్దనియంత్రణరంధ్రాలు. గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు. వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనమిచ్చే లబ్ధప్రతిష్టులు.
“ఆనాడు నేననుకునేవాణ్ని.'ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'.అని. దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో.ఇప్పటికి 28 ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది.”
ప్రముఖ వైణికుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ విజయవాడ రేడియోను తన మాతృసంస్థగా భావించి గౌరవిస్తానని ఆ కేంద్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరు ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.  శ్యామసుందర్ నాన్నగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు మొదట మద్రాసు రేడియో కేంద్రంలోనూ, తరువాత విజయవాడ కేంద్ర ఆవిర్భావం నుంచి 1973  వరకు వీణా వాద్యం వాయించేవారు. తరువాత రేడియోలో పనిచేసే అదృష్టం తనను కూడా వరించిందని, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 1965లో మొదలు పెట్టి 2005 దాకా వాయిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి టాప్ గ్రేడ్ విద్వాన్ గా వీణా వాద్యం వినిపిస్తున్నానని శ్యామసుందర్  చెప్పారు. రేడియోతో ఈ కుటుంబం సంబంధం అక్కడితో ఆగలేదు. ఆయన చెల్లెలు పరిటి  రాజేశ్వరి సైతం రేడియోలో ఏ గ్రేడ్ వైణికురాలు. ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో స్థిరపడి అక్కడ కూడా సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. శ్యామసుందర్  భార్య శ్రీమతి జయలక్ష్మి, ఆయన సోదరుడు సత్యప్రసాద్ కూడా రేడియో సంగీత కళాకారులే. పొతే వారి బావమరది శ్రీ పప్పు చంద్ర శేఖర్ కూడా విజయవాడ రేడియో నుంచే తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. వారి మామగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు కూడా 1948 నుండి విజయవాడ కేంద్రంలో వైణిక విద్వాంసుడిగా సేవలు అందించారు. అంటే ఒక కుటుంబం యావన్మందికీ విజయవాడ రేడియో కేంద్రం తమలోని సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి  ఆశ్రయం కల్పించిందన్న మాట.
విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసిన మహామహులందరూ ఒక ఫోటోలో కానవచ్చిన ఒక అపూర్వ సంగమానికి కూడా విజయవాడ రేడియో ఒక వేదిక అయింది. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుసంప‌న్న‌మైన ఆలోచ‌న‌ల‌ను ధారాద‌త్తం చేసిన ప్ర‌ముఖులు ఈ ఫొటోలో ఉన్నారు. ఆకాశ‌వాణిలో దిగ్దంతులైన క‌ళాకారులు వీరు. ఆకాశవాణి విజయవాడ కళాకారులు శ్రీ కందుకూరి రామభద్రరావు,, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల పదవీ విరమణను పురస్కరించుకుని జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా తీయబడ్డ ఫోటో ఇది. అంద‌రివీ కాక‌పోయినా 99శాతం మంది పేర్లు ఉన్నాయి.




వివ‌రాలు:
ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని
కూచున్నవారు:శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన ఓలేటి ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు.
కూర్చున్నవారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపు గోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి,ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి, సి.రామమోహన రావు,జి.ఎం.రాధాకృష్ణ, సితార్ కనకారావు,చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం,ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,.చివరివారు వై.సత్యనారాయణ

NotePhoto Courtesy : Shri KVS Subrahmanyam

(ఇంకా వుంది)

సినీ ప్రముఖులు - సాంఘిక బాధ్యత


‘కాదేదీ కవితకనర్హం’ మాదిరిగా ఈనాడు ప్రతి విషయమూ టీవీల్లో రోజుల తరబడి చర్చల కొనసాగింపుకు ముడి సరుకుగా మారుతోంది. అది ఇసుక  కావచ్చు, తెలుగు మాధ్యమం కావచ్చు,కులం కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు  మరేదైనా కావచ్చు. సినీ పరిశ్రమలోని  కొందరు  ప్రముఖులకు తెలుగే  రాదంటూ ఆ రంగానికే చెందిన మరో ప్రముఖుడి చేసిన  తాజా వ్యాఖ్య ఆ కోవలోనిదే. హైదరాబాదులో ఒక యువతి అత్యాచారానికి, హత్యకు గురైన నేపధ్యంలో తెలుగు సినీరంగ ప్రముఖులు చాలామంది తమ సామాజిక బాధ్యతగా భావించి ఆడపిల్లలకు అండగా నిలబడదాం అంటూ ధైర్యం  చెప్పే ప్రకటనలు టీవీల్లో వస్తున్న సమయంలోనే ఈ రకమైన చర్చకు తెర లేవడం కాకతాళీయం కావచ్చు. 
ఈ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ రాసిన అనంతం గ్రంధంలో పేర్కొన్న ఒక విషయం జ్ఞాపకం వస్తోంది.
ఆ రోజుల్లో ‘సినిమా రచయితలు - సాంఘిక బాధ్యత’ అనే అంశంపై ఒక సదస్సు ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించారు.    
మహాకవి శ్రీశ్రీతో పాటు  మరో  ప్రసిద్ధ సినీ రచయిత  త్రిపురనేని మహారధికి ఈ సదస్సులో మాట్లాడే పనిపడింది. సమయాభావం కారణంగా కొంతమందికి ప్రసగించే అవకాశం లభించలేదు. మహారధి, శ్రీ శ్రీ పక్కపక్క కుర్చీలలో కూర్చుని వున్నప్పుడు  మహారధి శ్రీశ్రీతో ఇలా అన్నారు.
‘నాకు కనుక మాట్లాడే అవకాశమే వస్తే, నా ప్రసంగాన్ని ‘సినిమా రచయితలు అందరూ సాంఘిక బాధ్యతను  మరచిపోయిన తర్వాతనే సినిమారంగంలో ప్రవేశించారు’ అనే  వాక్యంతో మొదలు పెడతాను’.
మహారధి వ్యక్తపరచిన ఈ అభిప్రాయంతో శ్రీశ్రీ పూర్తిగా ఏకీవభించారు.
అయితే, ముందే అనుకున్నట్టు మహారధి గారికి    సదస్సులో ప్రసంగించే అవకాశం చిక్కనేలేదు.
ఈ విషయాన్ని శ్రీశ్రీ తన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల, ‘అనంతం’ లో రాసుకున్నారు.
అనంతం నవల (?) కి ఈ  ‘ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల’  అనే ట్యాగ్ లైన్  ఎందుకు పెట్టారన్నది తెలియదు. పైగా ఆత్మకధ అని పెట్టరాదని శ్రీశ్రీ ఆంక్ష పెట్టారని శ్రీ చలసాని ప్రసాద్ ఆ పుస్తకం మలి ప్రచురణ ముందు మాటలోనే రాసారు.
       

రేడియో రోజులు- 32- భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 04-12-2019, Wdenesday)

ఏవిటో ఈయన పాటా అర్ధం కాదు, మాటా అర్ధం కాదుఅంటూ శంకరాభరణం సినిమాలో వీధి అరుగుమీద సంగీతం పాఠాలు చెబుతూ శంకర శాస్త్రి గారిని ఎద్దేవా చేస్తూ తనదయిన బాణీలో తెలుగు ప్రేక్షకులను ఆహ్లాదపరచిన పొట్టి (సంగీతం) మేష్టరు గుర్తున్నాడా. గుర్తుంచుకోని ప్రేక్షకుడంటూ వుండరు. ఎందుకంటే ఒకే ఒక చిన్న సన్నివేశంలో నటించి ప్రేక్షకులను  అంత గొప్పగా ఆకట్టుకున్న నటుడు కాబట్టి.
ఆ సినిమాకి, ఈ రేడియోకి ఏమిటి సంబంధం అంటే ఈ రేడియో శ్రీ గోపాలే ఆ సంబంధం. పొతే, పేరులో వున్న ఈ శ్రీ అనేది ఆయన పేరుకు ముందు గౌరవవాచకం కాదు, అసలు పేరులో భాగమే.
శ్రీ గోపాల్ తో నాకు పరిచయం వుంది. ఆయన ఎక్కడ వుంటే అక్కడ ఉత్సాహం వెల్లివిరిసేది. మాటల పోగు. పరిచయం అయిన వారందరూ ఆయనకు  స్నేహితులే. చొరవతో నలుగురిలో దూసుకుపోయే తత్వం. మాటల్లో హాస్యం చిప్పిల్లేది.
నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగుఅని  ముళ్ళపూడి వారన్నట్టు శ్రీగోపాల్ అసలు పేరు కొంపెల్ల శ్రీ గోపాలకృష్ణమూర్తి. చేసే ఉద్యోగం ఒకటే అయినా ఆయన బహురూపి. రచయిత, కార్టూనిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు. రంగస్థల, చలన చిత్ర నటుడు. ఇన్ని కోణాలు ఉన్న మనిషి కాబట్టే ఆ శరీరం త్వరగా అలసినట్టుంది. విశ్రాంతి కోరుకుంది. అందుకే, యాభయ్ ఏళ్ళు కూడా నిండకుండానే నలభయ్ ఎనిమిదో ఏటనే ఆయనకు నిండు నూరేళ్ళు నిండాయి.           
రేడియో పట్ల రేడియో కళాకారుల పట్లా స్వతహాగా అభిరుచి పెంచుకున్న శ్రీ గుర్రం మధుసూదన్ సేకరించి పెట్టుకున్న సమాచార భాండాగారంలో శ్రీ గోపాల్ వివరాలు కూడా వున్నాయి.
1938 జనవరి 20 వ తేదీన శ్రీ గోపాల్ కాకినాడలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పట్టా పొందారు. పట్టాతో పాటు స్వర్ణ పతకం సాధించారు. 1965 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్) గా ఉద్యోగపర్వానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందే విద్యార్ధి దశనుంచే రాజకీయ కార్టూన్లు వేయడం మొదలు పెట్టారు. ఆలిండియా రేడియో మద్రాసు, పోర్ట్ బ్లెయిర్(అండమాన్,నికోబార్) గోవా, విజయవాడ, కడప కేంద్రాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ రోజుల్లో కొత్తగా ప్రారంభించిన యువవాణి విభాగం అధిపతిగా రేడియో మాధ్యమం పట్ల అభిరుచి వున్న అనేకమంది యువతీ యువకులకు ప్రోత్సాహం కల్పించారు.  ఆకాశవాణి ఏటా నిర్వహించే పోటీల్లో నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు. ఎవరెస్ట్ విజేత టెన్సింగ్ నార్కే గురించి విక్రాంత గిరి శిఖరంపేరుతొ శ్రీ గోపాల్ సమర్పించిన రూపకానికి 1974 లో ప్రధమ బహుమతి లభించింది. గోదావరి నదిపై శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి నిర్వహణలో కొండ నుండి కడలి దాకాఅనే పేరుతొ శ్రీగోపాల్ సమర్పించిన రూపకం ఆయనకు చక్కటి పేరు తెచ్చింది. అలాగే భగవాన్ రమణ మహర్షి పై ఆయన రూపొందించిన రూపకం రేడియో కార్యక్రమాలలో తలమానికంగా చెప్పుకుంటారు.
చలం నవల మార్తా ఆధారంగా పూర్ణ మానవుడు అనే పేరుతొ శ్రీ గోపాల్ సమర్పించిన రేడియో నాటకానికి వార్షిక పోటీల్లో బహుమతి లభించింది.
1979 లో ఢిల్లీలో జరిగిన ఇండో అమెరికన్  డ్రామా ప్రొడ్యూసర్ల సదస్సుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీ గోపాల్ ప్రతినిధిగా ఎంపికయ్యారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఆయన ఆ సినిమాలో ఆండాళ్ అనే పాపకు సంగీతం నేర్పుతూ, సంగీతం లో వేగం పెరిగిందని, బ్రోచే వారెవరు రా అంటూ ఆ  పాటను విరిచి, విరిచి పాడుతుండగా, శంకర శాస్త్రిగారు వచ్చి, ‘సంగీతాన్ని ఖూనీ చెయ్యొద్దు దాసూఅని హెచ్చరిస్తారు.
మంచుపల్లకి, స్వాతిముత్యం, ఆలాపన, తాయారమ్మ బంగారయ్య చిత్రాలలో కూడా ఆయన నటించారు.
1979 నుండి 82 వరకు హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు.
కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తుది శ్వాస విడిచారు.
(ఇంకా వుంది)



రేడియో రోజులు -31 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily  on 03-12-2019, Tuesday)

నిజానికి ఇక్కడ రేడియో రోజులు అంటే నేను రేడియోలో పనిచేసిన రోజులని కాదు. ఆ రోజుల్లో రేడియో అని. నాకన్నా ముందు పనిచేసిన వారి జ్ఞాపకాలు మరింత ఆసక్తిగా వుంటాయని వారిలో కొందరితో  ముచ్చటించినప్పుడు తెలిసింది. వాళ్లు వయస్సులో చాలా పెద్దవాళ్ళు కావడం మూలాన పేర్లూ తారీఖులూ సరిగా గుర్తురావడం లేదని వారే చెప్పారు. అంటే ఏదన్నా విషయం గురించి చెప్పినప్పుడు దాని స్తూల భావాన్ని మాత్రం తీసుకుని, మూలాల్లోకి, చర్చల్లోకి పోకుండా స్వీకరించలిగితే నాటి స్మృతులను ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుంది. లేదా చదువరుల్లో ఎవరయినా నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు వుండి, తప్పొప్పులను సవరించగలిగితే  ఈ రచనకు సంపూర్ణత్వం, సాధికారికత సిద్ధిస్తుందని నా మనవి.
తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం, కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన రాకడకు  సూచనలుగా పేర్కొనేవారు.
ఈ సందర్భంలో చెప్పుకోవలసిన విషయం మరొకటి వుంది. రేడియోలో మామూలు కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
మరణవార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేకసార్లు ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు.
ఇంతకీ విషయానికివస్తే,
ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటింబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావుకబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది. యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ మాత్రం  ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే ఆ  సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. వార్తాసంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని ఇప్పట్లా త్వరితగతిన  సమాచారం  చేరవేతకు అవకాశం లేకపోవడంవల్ల దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి. కానీ వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం  అందేదాకా విషాద సంగీతం ప్రసారం విషయం పక్కనబెట్టారు. ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి  స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు ఓరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది నిజాం మరణంపై వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపోయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా  జనంలో ఈ విషయం చర్చకు రాలేదుకానీ, పత్రికావార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.
నిజానికి అంతగా బయటకు రాని విషయాలపై కూడా అధికారులు అంతటి జాగ్రత్త చూపేవారనడానికి ఇదొక దృష్టాంతం.

(ఇంకా వుంది)

30, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 30 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 01-12-2019, SUNDAY)
వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ
కందుకూరి రామభద్రరావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కవి, పండితుడు, రచయిత. గోదావరీ తీర ప్రాంతంలో ప్రసిద్ధ కవులైన  దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు మొదలైన భావకవులకు ఆయన సమకాలికులు. వీరందరూ కలిసి నవ్య సాహిత్య పరిషత్ పేరుతొ ఒక సంస్థని నడిపేవారు. కందుకూరి రామభద్రరావు గారు  కవిమాత్రమే కాదు, చక్కని వక్త కూడా. తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి దిగ్గజాలు సయితం రామభద్రరావుగారి ప్రసంగ పాటవానికి పరవశులయ్యారని చెప్పుకునేవారు. రేడియో ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట – ఎంతపరిమళమోయి ఈ తోట పూలు’ అనే కవిత వీరి కలం నుంచి జాలువారినదే.  టీచరుగా పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా విజయవాడ ఆకాశవాణిలో విద్యావిషయిక కార్యక్రమాల ప్రొడ్యూసరుగా కూడా అయన పనిచేశారు.   
ఈ రామభద్రరావుగారి పుత్రుడే ఈ వ్యాసానికి ప్రేరణ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ.
వీరిది రాజమండ్రి దగ్గర రాజవరం.


(శ్రీ  కందుకూరి  సూర్యనారాయణ)

సూర్యనారాయణ మద్రాసులో ఎమ్మే చేసారు. ఏడాది ఎదురు చూసినా సరైన ఉద్యోగం రాలేదు. అలా రోజులు దొర్లిస్తున్నప్పుడు, 1960 లో  ఆంధ్రజ్యోతి ఎడిటర్  నార్ల వెంకటేశ్వర రావు గారు, రామభద్రరావు గారిపట్ల ఉన్న మిత్రవాత్సల్యంతో, ఆయన కుమారుడు అయిన సూర్యనారాయణకు తమ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చారు. విద్వాన్ విశ్వం అసిస్టెంట్ ఎడిటర్. నండూరి రామమోహన రావు సీనియర్ సబ్ ఎడిటర్, తుర్లపాటి కుటుంబరావు, ఎల్లోరా, వీరభద్రరావు  ఇతర సహోద్యోగులు.
అలా ఓ ఏడాది  గడిచిన తర్వాత, న్యూస్ రీడర్ ఉద్యోగాలకు  రేడియో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన చూసి దరఖాస్తు చేసారు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. హైదరాబాదులో ఇంటర్వ్యూ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. సూర్యనారాయణగారిని ఢిల్లీలో న్యూస్ రీడర్ గా సెలక్ట్ చేసారు. అదే సమయంలో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ గార్లను కూడా న్యూస్  రీడర్లుగా ఎంపిక చేశారు.
1962 లో ఢిల్లీ వెళ్లి ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్ గా చేరిపోయారు. అప్పటికే అక్కడి తెలుగు వార్తావిభాగంలో శ్రీయుతులు పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి, తిరుమలశెట్టి శ్రీరాములు పనిచేస్తున్నారు. శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు తరువాత చేరారు.    
1967 లో మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం వచ్చింది.  సూర్యనారాయణ గారికి మాస్కో పోవాలని మనసులో పడింది.  కానీ ఆయనది రేడియోలో కాంట్రాక్టు ఉద్యోగం. స్టాఫ్ ఆర్టిస్ట్ కేటగిరీ. ప్రభుత్వ కొలువు కాదు. మాస్కో పంపడానికి రేడియోవారికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాలి. మంచి ఉద్యోగం. ఎందుకు పోగొట్టుకోవాలి అని హితైషులు సలహా చెప్పారు. ఉన్న ఉద్యోగం వదులుకోవాలి అనే షరతు నచ్చని కందుకూరివారు ఆ ఆఫర్  తిరస్కరించారు. దాంతో ఆఫీసు వారే దిగివచ్చి, మూడేళ్ళ లోపు తిరిగొస్తే ఉద్యోగం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆయన మాస్కో ప్రయాణానికి అవరోధం తొలిగి పోయింది.
1967 లో మాస్కో వెళ్ళారు. ప్రాస్పెక్ట్ మీరా ప్రాంతంలో అపార్ట్ మెంటు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత  కుటుంబాన్ని పిలిపించుకున్నారు. అలా మాస్కో రేడియోలో తెలుగు ప్రసారాలను ఆయన మొట్ట మొదటిసారి ప్రారంభించారు. (ఇక్కడ ఓ స్వవిషయం ప్రస్తావించడం సముచితంగా వుంటుంది. సూర్యనారాయణ గారు మొదటి సారి మాస్కో నుంచి, రేడియో మాస్కో ద్వారా  తెలుగులో వార్తలు చదవడం ప్రారంభిస్తే, 1991 లో నేను అదే మాస్కో నుంచి అదే రేడియో మాస్కో ద్వారా చిట్టచివరిసారి తెలుగు వార్తలు చదివి అక్కడి తెలుగు ప్రసారాలకు మంగళం పాడాను. మా ఇద్దరి నడుమ తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు గార్లు రేడియో  మాస్కోలో పనిచేశారు.)
రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన తరువాత సూర్యనారాయణ గారి పనితీరు నచ్చి మరో ఏడాది పొడిగించారు. అలా మొత్తం మీద దాదాపు మూడున్నరేళ్ళు మాస్కోలో గడిపి, 1970 లో ఢిల్లీ తిరిగివచ్చారు.
ఆశ్చర్యం. ఢిల్లీ రేడియోలో ఉద్యోగం సిద్ధంగా వుంది. వెంటనే చేరిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటంటే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ ఆయన సీనియారిటీ కోల్పోయారు. 1995 లో రిటైర్ అయ్యారు. ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. భార్య శ్రీమతి కందుకూరి మహాలక్ష్మి. మంచి రచయిత్రి. నాలుగు కధా సంపుటాలు వెలువారించారు.
‘మీ రేడియో జీవితంలో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగిందా?’
ఫోనులో గంటకుపైగా హైదరాబాదు నుంచి కందుకూరి సూర్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న.  
‘మీరూ రేడియోలో పనిచేసారు కదా! మీకు తెలియంది కాదు. జనరల్ న్యూస్ రూమ్ లో అనేక భారతీయ భాషా విభాగాలు వుంటాయి. అన్నింటికీ కలిపి ఉమ్మడిగా బులెటిన్ తయారు చేసి వివిధ విభాగాలకు పంపిస్తారు. మనం కొత్తగా కలపడం కానీ, లేదా ఉన్నది తీసివేయడం కానీ జరగడానికి వీల్లేదు. ఒకసారి  ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు నలుగురితో పాటు నన్నూ పిలిచి సత్కరించారు. నాతొ పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కూడా పురస్కారాలు స్వీకరించారు. రేడియో తెలుగు వార్తల్లో చెప్పడానికి అధికారులు అభ్యంతర పెట్టారు. చివరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ పేరు లేకుండా తెలుగు వార్తల్లో చివరన చేర్చడానికి వారిని ఒప్పించేందుకు  చాలా కష్టపడాల్సి వచ్చింది.
‘సరే! మీరు అడిగారు కాబట్టి ఒక సంగతి చెబుతాను. అరవైలలో కాబోలు గోవధను నిషేధించాలని కోరుతూ సాధువులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు భవనానికి దగ్గరగా వుండడం వల్ల రేడియో స్టేషన్ నుంచి ఇంటికి పోయే వీలు లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. దాంతో రెండ్రోజులు ఆఫీసులోనే వుండిపోవాల్సి వచ్చింది. అక్కడే పడక, అక్కడే భోజనాలు’ 
80 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన స్వరం స్పుటంగా వుంది. అంతసేపు మాట్లాడినా అలసట కనబడలేదు. స్వరాన్ని వరంగా పొందిన ధన్యుల్లో ఆయన ఒకరు.
అందుకే రేడియో వార్తలు చదివే రోజుల్లో కందుకూరివారికి అంతమంది అభిమానులు.
(ఇంకా వుంది)