4, డిసెంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 33 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 05-12-2019, Thursday)

‘ఆకాశవాణి, విజయవాడ కేంద్రం’
ఒకానొక కాలంలో ప్రాభాత వేళలో ఈ పదాలే  జనపదాలకు మేలుకొలుపు పిలుపులు.
అలాంటి విజయవాడ రేడియోకి ఇప్పుడు డెబ్బయ్ రెండేళ్ళు.
బందరు రోడ్డు, పున్నమ్మతోటలో ఉన్న విజయవాడ రేడియో కేంద్రం గురించి తెలియనివాళ్ళు, వినని వాళ్ళు ఆంధ్రప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీత సాహిత్యాలలో ఘనాపాటీలు, దిగ్గనాధీరులైన అనేకమంది  ప్రముఖులు ఈ కేంద్రం ద్వారా తమ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన వాళ్ళే.
ఈ కేంద్రం పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. 
“1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి)రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
శ్రీ సుధాకర్ మొదునూడికి ( sudhakar modunudi) విజయవాడ ఆకాశవాణితో నలభై నాలుగేళ్లకు పైగా అనుబంధం. పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేనురూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి ఈనాడు ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేయటం దాకా బెజవాడ రేడియోలో ఆయన ప్రస్థానం సాగింది. ఆ అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే.
“నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు ఎన్నటికీ మార్పున పడవు. ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుతం అక్కడ దూరదర్శన్ కేంద్రం వుంది) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది. పెద్దపెద్ద చెట్లమధ్య, పైకి పెంకుటిల్లులా కనిపించేది. ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూలకుండీలు వరుసగా పేర్చి ఉండేవి. వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి. నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా, పంచెకట్టి, ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు. నాటకాల రిహార్సల్సూ, దేశభక్తి గీతాల సాధనలూ, ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందే,  గుంపులుగుంపులుగా కూర్చొని కొనసాగించేవారు. మేడపైకి చెక్కమెట్లు. పైన ఆఫీసుగదులు.
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు, మధ్యలో అద్దాలపెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత)రేడియో స్టేషన్ భవంతి నమూనా, దానిపై అందంగా అమర్చిన పూలగుత్తుల పింగాణీ జాడీ, ఎదురుగా మూడు స్టూడియోలు, ఒకటి సంగీతానికి,రెండవది నాటకాలకు,మూడవది ప్రసంగాలకు. లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు. చేతిలో కాగితాలు పట్టుకొని, హడావుడిగా అటూఇటూ నడిచే అనౌన్సర్లు.  ఒకమూల స్పీకరునుండి మంద్రగంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం.  పైకప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు. తెల్లటి గోడలకు శబ్దనియంత్రణరంధ్రాలు. గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు. వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనమిచ్చే లబ్ధప్రతిష్టులు.
“ఆనాడు నేననుకునేవాణ్ని.'ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'.అని. దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో.ఇప్పటికి 28 ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది.”
ప్రముఖ వైణికుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ విజయవాడ రేడియోను తన మాతృసంస్థగా భావించి గౌరవిస్తానని ఆ కేంద్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరు ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.  శ్యామసుందర్ నాన్నగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు మొదట మద్రాసు రేడియో కేంద్రంలోనూ, తరువాత విజయవాడ కేంద్ర ఆవిర్భావం నుంచి 1973  వరకు వీణా వాద్యం వాయించేవారు. తరువాత రేడియోలో పనిచేసే అదృష్టం తనను కూడా వరించిందని, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 1965లో మొదలు పెట్టి 2005 దాకా వాయిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి టాప్ గ్రేడ్ విద్వాన్ గా వీణా వాద్యం వినిపిస్తున్నానని శ్యామసుందర్  చెప్పారు. రేడియోతో ఈ కుటుంబం సంబంధం అక్కడితో ఆగలేదు. ఆయన చెల్లెలు పరిటి  రాజేశ్వరి సైతం రేడియోలో ఏ గ్రేడ్ వైణికురాలు. ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో స్థిరపడి అక్కడ కూడా సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. శ్యామసుందర్  భార్య శ్రీమతి జయలక్ష్మి, ఆయన సోదరుడు సత్యప్రసాద్ కూడా రేడియో సంగీత కళాకారులే. పొతే వారి బావమరది శ్రీ పప్పు చంద్ర శేఖర్ కూడా విజయవాడ రేడియో నుంచే తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. వారి మామగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు కూడా 1948 నుండి విజయవాడ కేంద్రంలో వైణిక విద్వాంసుడిగా సేవలు అందించారు. అంటే ఒక కుటుంబం యావన్మందికీ విజయవాడ రేడియో కేంద్రం తమలోని సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి  ఆశ్రయం కల్పించిందన్న మాట.
విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసిన మహామహులందరూ ఒక ఫోటోలో కానవచ్చిన ఒక అపూర్వ సంగమానికి కూడా విజయవాడ రేడియో ఒక వేదిక అయింది. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుసంప‌న్న‌మైన ఆలోచ‌న‌ల‌ను ధారాద‌త్తం చేసిన ప్ర‌ముఖులు ఈ ఫొటోలో ఉన్నారు. ఆకాశ‌వాణిలో దిగ్దంతులైన క‌ళాకారులు వీరు. ఆకాశవాణి విజయవాడ కళాకారులు శ్రీ కందుకూరి రామభద్రరావు,, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల పదవీ విరమణను పురస్కరించుకుని జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా తీయబడ్డ ఫోటో ఇది. అంద‌రివీ కాక‌పోయినా 99శాతం మంది పేర్లు ఉన్నాయి.
వివ‌రాలు:
ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని
కూచున్నవారు:శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన ఓలేటి ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు.
కూర్చున్నవారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపు గోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి,ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి, సి.రామమోహన రావు,జి.ఎం.రాధాకృష్ణ, సితార్ కనకారావు,చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం,ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,.చివరివారు వై.సత్యనారాయణ

NotePhoto Courtesy : Shri KVS Subrahmanyam

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: