4, మార్చి 2019, సోమవారం

దేవుడి హత్య – భండారు శ్రీనివాసరావు



(ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్ లో  Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో)   
డబ్బు, అధికారం, కులం, మద్యం, మతం ఇవే ఇంతటివరకు ఎన్నికల వైతరణిని దాటించి విజయపధంలో నిలిపే సాధనాలు. ఇప్పుడీ జాబితాకు మరోటి వచ్చి చేరింది. అదే టెక్నాలజీ.
రాజకీయ పార్టీలవాళ్ళు  ఈరోజుల్లో ఎవరికి వారే సొంతంగా టెక్ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదేమీ రహస్యమూ కాదు, చట్ట వ్యతిరేకమూ కాదు. కానీ అదే ఆధునిక టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించే పరిస్తితులు ఎదురయితే మాత్రం ఉపేక్షించడం మంచిది కాదు.
ప్రతి ఎన్నికల ముందూ తప్పనిసరిగా చర్చకు వచ్చే అంశం ఓట్ల తొలగింపు.
ఓటు అనేది ఎప్పుడు జాబితానుంచి తొలగిస్తారు? సాధారణంగా ఆ ఓటరు మరణించినప్పుడు ఇది జరుగుతుంది. తన పేరు ఓటర్ల జాబితాలో లేదని తెలుసుకున్న ఒక వ్యక్తి, ‘బతికుండీ నేను చనిపోయినట్టే లెక్క’ అంటూ గతంలో  ఆవేదనతో చేసిన వ్యాఖ్య వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.      
ఓటర్ల జాబితా నుంచి అర్హులయిన వారి పేర్లు తొలగిస్తున్నారనీ, అర్హత లేని వారిని తొలగిస్తున్నారనీ ఏపీలో పాలక ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అంతేకాదు, ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని ఉభయ పక్షాలు వాడుకుంటున్నాయని కూడా అంటున్నారు. ఇదే నిజమయితే ఈ పని సామూహిక హననం కిందికి వస్తుంది. మూకుమ్మడి హత్యాకాండ అని కూడా అనవచ్చు. ‘ఓటరు దేవుడు’ అని ఎన్నికల ప్రచారంలో రాజకీయనాయకులు అవసరార్ధం ఓటర్లని అభివర్ణిస్తుంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమన్న మాట. ఆధునిక టెక్నాలజీతో ఆ దేవుళ్ళనే  గుంపగుత్తగా మట్టుబెట్టడం అన్నమాట.
అధికార పార్టీ ప్రతి పక్షాన్ని, ప్రతిపక్షం పాలక పక్షం ఒకదానిపై మరొకటి నిందారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. వాటిపై తిరిగి టీవీల్లో చర్చలు. ఇంతటితోనే సరిపుచ్చితే, జర్నలిస్టులుగా మనం మన పౌర ధర్మాన్ని పాటించనట్టే.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలపై జరగాల్సింది చర్చలు మాత్రమే కాదు, చర్యలు కూడా.
అర్హత లేని ఓటర్లతోనే ఎన్నికలు జరగొచ్చు. అర్హత లేని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అవి ప్రజలు ఎన్నుకున్న నిజమైన ప్రజా ప్రభుత్వాలు కానేరవు.
అలాంటి ప్రజాస్వామ్యం మనం గొప్పలు చెప్పుకునే గొప్ప ప్రజాస్వామ్యం కానేరదు.
అది  వట్టి నేతిబీరకాయ కాయ మాత్రమే.
బాగా శ్రద్ధ పెట్టి చదివిన వాడు పరీక్షల్లో కాపీలు కొట్టడు. సరుకు లేనివాడే అడ్డదారులు వెతుక్కుంటాడు.
రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని నమ్ముకోవడం మానేసి వేరే దారులు వెతుక్కోవడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
ఈ కార్యక్రమాన్ని చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులే కాదు, ఏ పార్టీతో అంటకాగని తటస్థ ప్రేక్షకులు కూడా వుంటారు. వారికోసం ఈ మాటలు చెబుతున్నాను. రాజకీయ పార్టీలు ఏవీ చెవిన పెడతాయనే నమ్మకం లేదు.  (కార్యక్రమం ఆఖరున కలిగిన సాంకేతిక అంతరాయం కారణంగా చివరి వాక్యాలు గాలిలో కలిసినట్టు లేదు)  
https://youtu.be/b7151-biN-M    

3, మార్చి 2019, ఆదివారం

News Scan Debate LIVE With Vijay | 3rd March 2019 | TV5 News





ప్రతి ఆదివారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం TV 5 News Scan Debate LIVE With Vijay చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబ రావు (ఏపీ ప్రభుత్వ ప్రణాలికా మండలి ఉపాధ్యక్షులు), శ్రీ భానుప్రసాద్ ( టీఆర్ఎస్, ఫోన్ లైన్లో), శ్రీ పార్ధసారధి (వైసీపీ)

2, మార్చి 2019, శనివారం

Discussion | Chandrababu Comments On PM Modi Praja Chaithanya Sabha in V...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

Discussion | IAF Wing Pilot Abhinandhan Returns To Inida | Public Point ...



ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్ 

28, ఫిబ్రవరి 2019, గురువారం

గుర్తు రాకూడని జ్ఞాపకం

ఆనందం, విచారం ఒకేసారి పెనవేసుకుని వచ్చిన సమాచారం  వస్తే దాన్ని మించిన విషాదం ఏముంటుంది?
అరుణ్ మొహంతి. ముప్పయ్యేళ్ళ క్రితం రేడియో మాస్కోలో సహోద్యోగి. ఒరిస్సా (అప్పుడు అదే పేరు) నుంచి చదువుకోవడానికి మాస్కో వెళ్ళాడు. చదువుకుంటూనే మాస్కో రేడియోలో అప్పుడప్పుడూ ఒరియాలో వార్తలు చదివేవాడు. చివరికి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. నేను తెలుగులో వార్తలు చదవడానికి కుటుంబంతో సహా మాస్కో వెళ్ళినప్పుడు పరిచయం. మృదుస్వభావి. మార్క్సిజాన్ని ఆపోసన పట్టాడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతోనే కానవచ్చేవాడు. సాయంకాలక్షేపాల్లో సయితం మాటలు తూకం వేసుకుని మాట్లాడేవాడు. నేను సరదాగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని. మేము అక్కడికి వెళ్ళిన రెండేళ్లకు కాబోలు పెళ్లయింది. వధువు నమిత. ఒరియా అమ్మాయి. బాగా చదువుకున్నది. కొత్త సంసారం. అప్పటికి మా ఆవిడే ఆమెకు పెద్ద దిక్కు. ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరిగే వాళ్ళు.
పంజాబీ, హిందీ, బెంగాలి, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడంతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో వార్తలు ప్రసారం అయ్యేవి. అందరం కుటుంబాలతో కలిసి రేడియో మాస్కో వారు ఏర్పాటు చేసిన పలు అంతస్తుల భవనంలో కాపురం వుండేవాళ్ళం. కమ్యూనిస్ట్ శకం ముగిసి సోవియట్ యూనియన్  అంగ,వంగ కళింగ దేశాల మాదిరిగా విడివడ్డ తరువాత  మేము మాస్కో నుంచి హైదరాబాదు వచ్చేసాము. అరుణ్ దంపతులు మాస్కోలోనే వుండిపోయారు. తరవాత మా నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. చూస్తుండగానే ముప్పయి రెండేళ్ళు గడిచిపోయాయి.
పీ. ఎస్. మూర్తి. ఒకప్పుడు రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి దగ్గర అయిదేళ్ళపాటు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు. వ్యాపారపనుల నిమిత్తం మాస్కోలో మేమున్న రోజుల్లో అక్కడికి వచ్చి వెడుతుండేవారు. సూర్యనారాయణ గారు మా ఆవిడకు వరసకు  బాబాయి అవుతారు. అంచేత మూర్తిగారు కూడా మాస్కోలో మాఇంటికి వచ్చేవారు. అక్కడే మూర్తి గారికీ, అరుణ్ మొహంతితో పరిచయం అయింది. మేము ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా అనేక ఏళ్ళపాటు ఆ స్నేహం  కొనసాగింది. మాస్కో వెళ్ళినప్పుడల్లా మొహంతిని కలిసేవారు. వ్యాపార విషయాల్లో తనకు తోచిన సలహాలు మూర్తికి చెబుతుండేవాడు అరుణ్.
తరువాత మూర్తి కుటుంబంతో సహా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారానే మూడు రోజుల క్రితం ఓ విషాద వార్త తెలిసింది, అరుణ్ చనిపోయాడని. ఆయన ఇచ్చిన నెంబరుకు ఒక మెసేజ్ పెట్టాను, నేను పలానా అని పరిచయం చేసుకుంటూ.
నమిత నుంచి వెంటనే జవాబు వచ్చింది.
మాస్కో రేడియోలో భారతీయ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత కూడా పద్నాలుగేళ్ళు అరుణ్ దంపతులు అక్కడే వుండిపోయారట. తరువాత ఢిల్లీ వచ్చేశారు.  అరుణ్ మొహంతికి జేఎన్యూలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. భార్య నమిత కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా చేరారు. బాగా సెటిల్ అయ్యామని అనుకుంటున్న తరుణంలో అరుణ్ కిడ్నీవ్యాధిబారిన పడ్డాడు. నిరుడు ఫిబ్రవరిలో కన్నుమూశాడు. అతడి తలితండ్రులు ఇద్దరూ ఏడాదిలోపలే మరణించారు.
అరుణ్ కుటుంబంతో మూడు దశాబ్దాల తరువాత సంబంధాలు ఏర్పడ్డాయని సంతోషించాలో, అరుణ్ ఇక లేడని తెలిసి బాధపడాలో ఏమీ తెలియని స్థితి.


(రేడియో మాస్కోలో పనిచేసిన భారతీయుల శ్రీమతులు. ఎడమ నుంచి మొదటి వ్యక్తి నా శ్రీమతి నిర్మల, ఆమె పక్కన నమిత మొహంతి, కుడివైపు చివర శ్రీమతి సరోజ రామకృష్ణ)


27, ఫిబ్రవరి 2019, బుధవారం

వింగ్ కమాండర్ అభినందన్ - భండారు శ్రీనివాసరావు


భారత సైన్యం జరిపిన మెరుపుదాడిలో  పాకీస్తాన్ కి బందీగా పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్ ని అక్కడే పాక్ దయాదాక్షిణ్యానికి వదిలి వేయకూడదు. ఇందుకోసం మరో సర్జికల్ స్ట్రైక్ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారత సైన్యానికి చెందిన ‘నేత్ర’ నిఘా వ్యవస్థ సాయంతో నిశిరాత్రివేళ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన రీతిలోనే కూలిపోయిన మిగ్ విమాన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ ను తీసుకురాగలిగితే  ఆర్మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. పాక్ బందీగా అభినందన్ అనుభవిస్తున్న చిత్ర హింసల  దృశ్యాలను టీవీ తెరలపై చూస్తున్న ప్రతి ఒక్క భారతీయుడి రక్తం సలసల మరుగుతోంది. అది చల్లబడాలంటే నూటపాతిక కోట్ల భారతీయుల అభినందనలు స్వీకరించడానికి వింగ్ కమాండర్ అభినందన్ ని మెరుపుదాడి చేసి బందీ నుంచి విడిపించుకు రావాలి.
ఈ విషయంలో గతంలో ఇజ్రాయెల్ చూపించిన చొరవ అనుసరణీయం.
అదేమిటంటే...
1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు దారి మళ్ళించి దాన్ని ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో బలవంతంగా దింపేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీ ప్రయాణీకులందరినీ చంపేస్తామని బెదరించారు. నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ ఆ హైజాకర్లకు వత్తాసు పలకడంతో బందీలను కాపాడడం అన్నది ఒక  పెద్ద ప్రశ్నార్ధకమైంది. అప్పుడు ఇజ్రాయెలీ సైన్యాధికారులు పకడ్బందీ వ్యూహం రచించి, రెండు రవాణా విమానాల్లో కమాండోలను తరలించారు. ఆ విమానాలు దాదాపు రెండువేల మైళ్ళు ప్రయాణించి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి, మెరుపు దాడి చేసి, ఉగాండా సైనికులను, విమానం దారిమళ్లించిన హైజాకర్లను వధించి, బందీలను విడిపించి తమ దేశానికి తీసుకువెళ్ళారు. థండర్ బోల్ట్ అనే గుప్త నామం కలిగిన ఈ యావత్తు ఆపరేషన్ ప్రక్రియను ఇజ్రాయెలీ కమాండోలు తొంభయ్ నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేసారు. పాలస్తీనా హైజాకర్లకు, ఉగాండా సైనికులకు  తప్ప వాళ్ళు ఎవ్వరికీ హాని చేయలేదు.

ఆ తరానికి మరో తరానికి నడుమ...... భండారు శ్రీనివాసరావు


యాభయ్ ఏళ్ళ క్రితం...
నాకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతోందని గ్రహించిన మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు, నాకా విషయం గ్రహింపుకి రావడానికి తనదయిన పద్దతి ఎన్నుకున్నాడు. అతి సామాన్యమైన చదువు మాత్రమే చదువుకున్న మా వదినెగారి చేత వైద్య విద్వాన్ ఆయుర్వేద పరీక్షకు కట్టించి ఫస్టున పాసయ్యేలా చేసి ‘శ్రద్ధ వుంటే చాలు లక్ష్యం సాధించడానికి ఆట్టే కష్టపడనక్కరలేద’ని నాకు పరోక్షంగా చెప్పాడు. ఆయన పద్దతి ఆయనకుంటే ఆయన తమ్ముడిని  నా పద్దతి నాకూ వుంటుంది. అంచేత అవేవీ చెవికి ఎక్కించుకోకుండా నా చదువును అధ్వాన్నపు బాటలోనే సాగించాను, ‘ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను’ అనే పాట పాడుకుంటూ.
ఫలితం డెబ్బయ్యేళ్లకు ఇదిగో ఇలా మిగిలాను. నో రిగ్రెట్స్! ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?
మా రెండోవాడు నా బాటే పట్టాడు. అంటే నా తోవన నడిచాడు అని కాదు. తనకు తోచిన విధంగా తానూ నడిచాడు అని చెప్పడం. పుష్కరం క్రితమే నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం వదిలిపెట్టి యేవో ‘యాప్’ లు తయారు చేసే సొంత ఉపాధి ఎంచుకుని కుస్తీ పడుతున్నాడు. ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా వస్తుందనే ఆశ వాడిది. నీతులు చెప్పగలిగే గతం నాకు లేదు కాబట్టి సహజంగానే సరిపెట్టుకున్నాను.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....
మా అన్నయ్య కష్టజీవి. తాను కష్టపడ్డాడు. ఇంట్లోవాళ్ళని మరీ సుఖాల పల్లకీలో ఊరేగించక పోయినా కష్టాల పాలు చేయలేదు.
ఇక నా తరం. నేను కష్టపడలేదు, అలా అని మరీ సుఖపడ్డదీలేదు. మా ఇంట్లోవాళ్ళని మరీ కష్టపెట్టలేదు. అలా అని బాగా సుఖపెట్టిందీ లేదు. సో సో.... అందుకే మరోసారి, నో రిగ్రెట్స్.
ఇక మా వాడిది, మరీ కష్టపడకుండా బాగా సుఖపడాలని, తమ వారిని మరింత  సుఖపెట్టాలని  కోరుకునే తరం.
ముందే చెప్పాకదా!    
మా వాడిది కూడా నా టైపే అని. బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నాలు చేయడం గురించి  నాతోసహా ఇంట్లో బయటా జనాలు  గొణుక్కోవడం గమనించినట్టున్నాడు.  నిన్న తనకు వచ్చిన ఓ మెయిల్ ని నాకు ఫార్వార్డ్ చేసాడు. బెంగళూరులోని DEL (EMC) వాళ్ళు పంపిన ఆఫర్ లెటర్ అది. కాంపెంసేషన్ బ్రహ్మాండంగా వుంది.
ఎప్పుడు చేరాలి అంటే ఎందుకు చేరాలి అనే విధంగా జవాబు. ఈ పోటీ యుగంలో  ఇంటర్వ్యూలకు వెడితే ఉద్యోగం  వస్తుందా రాదా అనే సందేహాలు ఉన్నవాళ్ళ అనుమానాలు తీర్చడానికి ఒక టెస్ట్ కింద ఈ ప్రయత్నం చేశానని వివరణ.
మా ఆవిడకు మాత్రం వాడు ఉద్యోగంలో చేరతాడనే నమ్మకం. చూడాలి ఏం జరుగుతుందో.
ఏం జరిగినా, అసలు ఏం జరగకున్నా నో రిగ్రెట్స్! ఎందుకంటే కష్టపడకుండా, పెద్ద ఆశలు లేకుండా  బతుకు బండి నడిపే జీవితం నాది.