10, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఓటరు హక్కులు కాపాడేది ఎవరు? – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA telugu daily on SUNDAY, 10-02-2019)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్తితి నెలకొని వుంది.

తనకు మాత్రమే సంబంధం ఉన్న ఒక విషయంలో, తన నిమిత్తం లేకుండా పాలక
ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు చూసి సగటు ఓటరు విస్తుపోతున్నాడు.

ఓటర్ల జాబితా విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయనీ, పాలక పక్షం టీడీపీ అనేక
అవకతవకలకు పాల్పడుతోందని, అర్హులను తొలగించి అర్హత లేని తమ అనుకూలురకు
జాబితాలో స్థానం కల్పిస్తున్నారని  ఆరోపిస్తూ వై ఎస్ ఆర్ సీ పీ అధినేత
జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఒక
మహజరు అందచేసి వచ్చారు. సర్వేల పేరుతొ పౌరులనుంచి సమాధానాలు రాబట్టి
వాళ్ళు తమకు ఓటు వేసే అవకాశం శూన్యం అని నిర్ధారణకు వచ్చినప్పుడు వారిని
ఓటర్ల జాబితానుంచి తొలగించే ఒక పెద్ద కుట్రకు పాలకపక్షం తెలుగుదేశం
పార్టీ తెర తీసిందనే నిందారోపణను కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచింది.

నిజానికి ఓటర్ల జాబితాలో అవకతవకల విషయంలో ఏవైనా అనుమానాలు వుండాల్సింది
ఓటర్లకు. పవిత్రమైన ఓటు అంటూ పార్టీలు ఊదరగొట్టే ఆ ఓటు తమ పేరు మీద
లేకపోతే వారికి ఎంత చిన్నతనంగా వుంటుంది. పైగా రాజకీయ జిమ్మిక్కుల్లో
భాగంగా ఎవరో ఒకరు తమ పేరు మీద ఆ హక్కును ఉపయోగించుకుంటున్నారని తెలిస్తే
ఎంత నగుబాటుతనం. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో తమ ప్రాధమిక హక్కు అయిన
ఓటును కోల్పోవడం ఎంత బాధాకరం. అందుకే, అర్హత వుండీ ఓటర్ల జాబితాలో తమ
పేరు లేకపోతే ఆ విషయంలో పిర్యాదు చేయాల్సింది, అభ్యంతర పెట్టాల్సింది ఆ
పౌరులు మాత్రమే. అలాగే, ఈవీఎంలలో వేసిన ఓటు తాము  అనుకున్న అభ్యర్ధికి
పడిందాలేదా అనే అనుమానం వారికి కలిగినా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పని
లేదు.

అయితే ఇక్కడ విచిత్రంగా ఈ బాధ్యతని రాజకీయ పార్టీలు తమ తలకెత్తుకున్నాయి.
దానితో ఈ ఆరోపణలకు సహజంగానే రాజకీయ రంగు పులుముకుంది.

ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా, ఓటర్ల జాబితా రూపొందించినా ఆ బాధ్యత
ఎన్నికల సంఘానిదే. రాష్ట్ర ప్రభుత్వానికి వాటితో ఏ ప్రమేయం వుండదు.
అయితే, ఎన్నికల సంఘానికి అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగబద్ధంగా వున్నాయి
కానీ, తనకంటూ విడిగా  ఒక కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. ఆయా రాష్ట్ర
ప్రభుత్వాల యంత్రాంగం మీద ఆధారపడి తన పనులను చక్కబెట్టుకోవాల్సిన
పరిస్తితే ప్రస్తుతం వుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎన్నికల
సిబ్బందిగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆ కొద్ది రోజులు ఎన్నికల సంఘం
కనుసన్నల్లోనే పనిచేయాలి. కోడ్ వ్యవధానం ముగియగానే తిరిగి ప్రభుత్వ
ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఈ కారణంగా వాళ్ళు నిర్భయంగా, నిస్సంకోచంగా,
రాజకీయాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగిపోకుండా, ఒత్తిళ్లకు గురికాకుండా
విధులు నిర్వర్తించడం అనేది కత్తిమీద సామే. వారందరూ అలాగే నిబద్ధతతో
పనిచేస్తారని అనుకోవడం కూడా అనుమానమే.

స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగిన నాటి నుంచి అవసరాలకు,
అనుభవాలకు, మార్పులకు తగినట్టుగా అనేక సంస్కరణలు అమలుచేస్తూ వస్తున్నారు.
మొదట్లో, ఒకే దేశం ఒకే  ఎన్నిక అన్నట్టు అటు లోకసభకు, ఇటు రాష్ట్రాల
అసెంబ్లీలకు ఒకేమారు విడతల వారీగా ఎన్నికలు జరిగేవి. ఏక పార్టీ పాలనకు
కాలం చెల్లి, అనేక పార్టీలు కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారానికి రావడం,
సంకీర్ణ ధర్మాలు పాటించక అనేక సార్లు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్రాలలో
రాష్ట్రపతి పాలనలు ఒక ఆనవాయితీగా తయారయిన తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట
ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం మొదలయింది. ఈ నేపధ్యంలో,
ఎన్నికలసంఘానికి కేంద్ర, రాష్ట్ర స్తాయిల్లోనే కాకుండా జిల్లాలు, మండలాల
వారీగా శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాల్సిన అగత్యం తలెత్తుతోంది.

అర్హత కలిగిన ప్రతిపౌరుడి పేరు ఓటర్ల జాబితాలో వుండి తీరేలా వ్యవస్థను
సరిదిద్దాలి. ఇది  రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు. ప్రజాస్వామ్య విధానంలో
ఇలా చేయడం  ప్రభుత్వాల కనీస ధర్మం. అనర్హులయిన వారి పేర్లు నిష్కర్షగా
తొలగించాలి.  కానీ వాస్తవంలో ఇవేవీ జరగడం లేదు. ఎన్నికలు జరిగిన ప్రతి
పర్యాయం ఈ విషయం చర్చకు వస్తూనే వుంది. అనర్హులను జాబితాలో
చేరుస్తున్నారనీ, అర్హులకు ఓటు హక్కు తొలగిస్తున్నారనీ ప్రతిపక్షాలు
ప్రతిసారీ ఆరోపణలు చేస్తూనే వుంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి
మాత్రమే పరిమితం కాదు. నిరుటి చివర్లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల
సందర్భంలో కూడా ఈ ఆరోపణలు వెలుగు చూశాయి.

వాటిల్లో నిజం వుండే అవకాశం కూడా ఉండొచ్చు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం
సాయంతో వాటిని సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకుఒకానొక రోజుల్లో అనేక
కుటుంబాలలో ఒకే పేరు మీద  పలు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. అలాటి
వాటిని సాంకేతిక సాయంతో ఒక్క పెట్టున తొలగించగలిగారు. అదే పద్దతిలో
వేర్వేరు నియోజకవర్గాలలో ఒకరి పేరు మీదనే ఉన్న ఓటరు కార్డులను గుర్తించి
తొలగించవచ్చు. పేరు తొలగించే ముందు ఎస్సెమ్మెస్ ద్వారా ఆ విషయాన్ని
వ్యక్తిగతంగా తెలియచేయవచ్చు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిరంతరంగా
నిర్వహించే శాశ్వత వ్యవస్థను అన్ని చోట్లా ఏర్పాటు చేయవచ్చు. అన్ని
వర్గాలవారితో సమాలోచనలు జరిపి సలహాలు,సూచనలు స్వీకరించి విధానంలో ఏవైనా
లొసుగులు వుంటే వాటిని సరిదిద్దవచ్చు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు గురించి వైసీపీ నాయకుడు జగన్మోహన రెడ్డి
అభ్యంతరాలను లేవనెత్తిన సమయంలోనే  మరోపక్క టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ
ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఈవీఎంల పని తీరు పట్ల అనుమానాలను మరోమారు
లేవనెత్తారు. మునుపటి రోజుల్లో మాదిరిగా పేపరు బేలట్ విధానానికి
మరలిపోవాలన్నది ఆయన తరచుగా చెబుతున్న మాట. ఆయన కూడా హస్తినకు వెళ్లి అనేక
మిత్రపక్షాల ప్రతినిధి వర్గంతో పాటు ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం
సమర్పించారు.  ఎలక్ట్రానిక్  ఓటింగు యంత్రాల స్థానంలో పేపర్ బేలట్
విధానాన్ని పునరుద్ధరించాలన్నది వారి డిమాండ్. ఒక పార్టీకి వేసే ఓటు మరో
పార్టీకి పడేలా ఈ యంత్రాలను ట్యాంపర్ చేస్తున్నారని వారి ఆరోపణ. బేలట్
పేపర్ విధానానికి మళ్లడం సాధ్యం కాని పక్షంలో వీవీ ఫ్యాట్లను కూడా
లెక్కించాలని వారి సూచన.

ఈవీఎం ల మీద ఈ  చర్చ కొత్తదేమీ కాదు. గతంలో జరిగిన చర్చలే ఇప్పుడు
కొత్తగా సాగుతున్నాయి.

అధికారంలో వున్నవాళ్ళు ఆ యంత్రాలను మాయ చేస్తున్నారని ఓడిపోయిన వాళ్ళు
ఆరోపిస్తారు. గెలిచినవాళ్ళు ఆ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ప్రతి
విమర్శలుచేస్తారు. గమ్మత్తేమిటంటే, ఓడిపోయి అధికారం కోల్పోయిన వాళ్ళు,
ఒకప్పుడు ఓడిపోయి ఇప్పుడు గెలిచి అధికార అందలం మీద కూర్చున్న వాళ్ళు
ఇద్దరూ  చెప్పేది ఒక్కటే కావడం. కానీ వీరిలో ఎవ్వరూ ఓటరు గురించి
ఆలోచిస్తున్న దాఖలా కనబడడం లేదు. నిజానికి ఇది ఓటరుకు సంబంధించిన అంశం.
తను అనుకున్న అభ్యర్ధికి తాను  వేసిన ఓటు పడిందా లేదా అనేది అతడికి
రావాల్సిన అనుమానం. కానీ, విచిత్రంగా ప్రజలనుంచి ఈ చర్చ మొదలు కాలేదు,
రాజకీయ పార్టీలే రచ్చ చేస్తున్నాయి. మీదుమిక్కిలి, హై టెక్ ముఖ్యమంత్రిగా
పేరుగాంచిన చంద్రబాబునాయుడు నోటివెంట ఇటువంటి మాటలు వినరావడం ఆశ్చర్యం
అనిపిస్తుంది.

ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు ఎన్నికల ద్వారా తమకు నచ్చిన పార్టీని
ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల
ప్రక్రియలను స్వతంత్రం వచ్చిన దాదిగా ఎన్నికల సంఘం అనుసరిస్తూ వచ్చింది.

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, స్వతంత్ర భారతంలో ఏవగించుకోదగిన కొన్ని
అవకరాలతో పాటుగా   ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను కూడా మనదేశం తన
కొంగున ముడేసుకుంది. 1947 లో భారతదేశంతోపాటే స్వేచ్చా వాయువులు
పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాల్లో కొన్నయినాఈ ఏడు
దశాబ్దాల పైచిలుకు కాలంలో కొన్నేళ్ళయినాకొంతకాలంపాటయినా
ప్రజాస్వామ్యపధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన
దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా,
ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద
ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది. దీనికి
ప్రధాన కారణం, రాజకీయ పార్టీలు కాదు, వాటి తల రాతలను నిర్దేశిస్తున్న అతి
సామాన్యులయిన స్వతంత్ర భారత ఓటర్లు.

వీరిలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'ఓటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను
మార్చగల సత్తా వారి సొంతం.

అక్షరజ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా
పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.

గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి
తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.

అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,
'
మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి
చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలో
మాదిరిగా  ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.

చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి
మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లే, దేశానికి స్వాతంత్రం రాగానే
నిర్వహించిన తొలి ఎన్నికల్లో, పార్టీల గుర్తులున్న పెట్టెలలో ఓటు వేసే
దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక
పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే
గుర్తుపట్టి ఓటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని
అలవరచుకోగలిగారు.

అలాంటి సత్తా కలిగిన భారతీయ ఓటర్లు, తమకు ప్రత్యక్షంగా సంబంధం కలిగిన ఒక
అంశంపై తమతో నిమిత్తం లేకుండా జాతి వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తీరును
గమనించి విస్తుపోతూ వుండివుంటారు. కానీ వాళ్ళది మౌన ప్రేక్షక పాత్ర. వారి
గొంతు వినబడే అవకాశమూ లేదు, వినిపించుకునే నాధుడూ ఉండడు.

ఇప్పుడు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) గురించి జరుగుతున్న
చర్చలో కూడా వారి పాత్ర లేదు. అదేదో తమకు మాత్రమే సంబంధించిన విషయంగా ఆయా
రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

ముందే చెప్పినట్టు, ఈవీఎం లను తమకు అనుకూలంగా టాంపర్ చేయగలిగే అవకాశం
కేంద్రంలో పాలకపక్షానికి వుందని ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికలను
నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని
ఆరోపించడానికి కూడా అవి వెనుకాడడం లేదు. గమ్మత్తేమిటంటే ఇలా
అనుమానిస్తున్న పార్టీలు గతంలో కేంద్రంలో అధికారం చెలాయించిన పార్టీలే.
అదే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, అవే ఈవీఎంలను
వినియోగించిన విధానంలోనే పరాజయం పాలయినవే మరి. తమ పాలన సమయంలో ఈవీఎంల
వాడకాన్ని సమర్ధించి, తాము అధికారం కోల్పోగానే వాటి పని తీరు పట్ల
సందేహాలు లేవనెత్తుతూ వుండడం చూస్తే అసలు ఆ అనుమానాల పట్లనే అనుమానం
కలుగుతోంది. ఇవి పనికి రానివే అయితే, జయాపజయాలను నిర్దేశించగల స్థాయిలో
వాటిని నియంత్రించగల పద్దతి ఏదైనా వుందని అనుకుంటే, ఆనాడే వాటిని మరింత
బాగా మెరుగుపరిచి వుండాల్సింది. లేదా పాత కాలపు బ్యాలెట్ విధానానికి
మళ్ళి వుండాల్సింది. అధికారంలో వున్నప్పుడు చేయలేని పనిని  ఆ అధికారం
కోల్పోయిన తర్వాత డిమాండ్ చేస్తూ  ఉండడంలోనే రాజకీయం దాగుందని ఎవరయినా
అనుమానిస్తే తప్పేముంది?


9, ఫిబ్రవరి 2019, శనివారం

ఒకసారి.... ర్రెండో స్సారి......


“అప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు. ఆశపడ్డాము. నమ్మాము. నమ్మించి మోసం చేశారు. ఇవ్వమని తేల్చి చెప్పారు.
అందుకే ఇప్పుడు ఇస్తామని చెబుతున్నామని చెబుతున్న వాళ్ళని నమ్మి వాళ్ళ వెంట నడుస్తున్నాము. ఇందులో తప్పేమిటి?”
“తప్పు లేదు, పొరబాటూ కాదు. కానీ వీళ్ళూ మోసంచేస్తే?”
“ఏం చేస్తాం. మరోమాటు మోసపోయామని మరోసారి తెలుసుకుంటాము”  

Discussion On RSS Supports Nitin Gadkari as their next BJP PM candidate ...







ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్

Discussion On RSS Supports Nitin Gadkari as their next BJP PM candidate ...





ప్రతి  శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  పబ్లిక్  పాయింట్  ముఖాముఖి  చర్చాకార్యక్రమంలో నాతోపాటు  యాంకర్  పవన్

తెలంగాణలో రేయింబవళ్ళు ‘సూర్య’ కాంతులు


(Published in SURYA telugu daily on 09-02-2019, Saturday)

నాలుగున్నరేళ్ళకు పూర్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రానికి కే. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కొద్ది మాసాలు గడవకముందే చేసిన పని  తెలంగాణా పవర్  ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా దేవులపల్లి ప్రభాకర రావును చైర్మన్ గా నియమించడం. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నార్ల తాతారావును మినహాయిస్తే ఐ.ఏ.ఎస్. కేడర్ అధికారి కాకుండా వేరేవారిని ఈ పోస్టులో నియమించడం ఇదే మొదటి సారి. ఇందుకు కారణాలు రెండు. ప్రత్యేక తెలంగాణా ఇస్తే ఆ రాష్ట్రం కరెంటు కొరతతో చీకటి గుయ్యారం అయిపోతుందని ఆనాటి పాలకులు పదేపదే చెప్పిన మాటను వమ్ము చేయాలనే కేసీఆర్ వజ్ర సంకల్పం. ఒక్క ప్రభాకర రావే తను అనుకున్నవిధంగా ఫలితాలు సాధించగలరని ఆయన పెంచుకున్న దృఢనమ్మకం. సంకల్ప బలానికి నమ్మకం తోడయి, ప్రభాకరరావు అవిరల కృషి ఫలించి  ఆనతికాలంలోనే సత్ఫలితాలను ఇచ్చింది. అనునిత్యం విద్యుత్ కోతలతో విసిగిపోయిన జంట నగర వాసులకు మొదటి ఏడాదిలోనే ఆయన ప్రయత్నాలు విజయవంతమై  తెలంగాణలో విద్యుత్ కొరతలు, కోతలు అనేవి గత కాలపు ముచ్చటగా మిగిలిపోయాయి. ఇళ్ళల్లోని ఇన్ వర్టర్లు, దుకాణాల్లోని జెనరేటర్లు అటకెక్కాయి. ప్రజల కరెంటు కష్టాలు ఈడేరాయి.
ఈ లక్ష్యం సాధించడానికి ప్రభాకరరావు అవిశ్రాంతంగా పనిచేశారు. సిబ్బందికి అవసరమైన సదుపాయాలు సమకూర్చారు. వారినుంచి తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టారు. తమ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చినప్పుడల్లా ఆ గుర్తింపులో వారిని భాగస్వాములను చేస్తూ వారందరికీ తగిన గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించడం ప్రభాకరరావుకు సహజసిద్ధంగా అలవడిన ఓ సుగుణం. ఇదే ఆయనను, తనవద్ద పనిచేసే సిబ్బందికి దగ్గర చేసింది.  తను పనిచేస్తూ, పనిచేయించే ఈ వైఖరే సంస్థ ఎదుగుదలకు దోహదం చేసింది. ఆయన పనితీరు నచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఏడాది తిరక్క ముందే విద్యుత్ ఉత్పాదన సంస్థ సీఎండీ బాధ్యతలు కూడా  అప్పగించారు.
విద్యుత్ సంస్థలో యాభయ్ ఏళ్ళకు పూర్వం ఒక సాధారణ అధికారిగా చేరిన ప్రభాకర రావు మెట్టు మెట్టుగా ఎదుగుతూ, శిఖరాగ్ర స్థానానికి చేరుకొని తాను అంకిత భావంతో పనిచేసిన అదే  సంస్థ ఎదుగుదలకు దోహదపడగలగడం అనేది నిజంగా అపూర్వం. ఆయన సమర్ధతకు నిదర్శనం.


దేవులపల్లి వారికి మనఃపూర్వక అభినందనలు

          

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఈ దేశం ఏమైపోతోంది? – భండారు శ్రీనివాసరావు


(ఈనాటి 08-02-2019 ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)
ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.
వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.
ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించక పోయినా ఏకాంబరం మాత్రం బతుకు జీవుడా అని బయట పడ్డాడు.
అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.
ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగా  అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.
ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.  
ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను ప్రధానమంత్రి మోడీ సీబీఐని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. దర్యాప్తులో సహకరించేలా ఆ అధికారిని ఆదేశించాలని కోరుతూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు. ఈలోగా అత్యున్నత న్యాయస్థానం కోల్ కతా పోలీసు కమీషనర్ ని విచారించడానికి సీబీఐని అనుమతించింది.
ఇవే పరిస్తితులు సామాన్యులకు ఎదురయితే ఇన్ని వ్యవస్థలు అంత వడిగా స్పందించడం జరిగే విషయమేనా!
ఒక్కసారి ఓ ఎనిమిదేళ్ళు వెనక్కి వెడదాం.
నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. అంతకు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గుజరాత్ అల్లర్లను పురస్కరించుకుని మోడీని విచారించడానికి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మోడీని తన ఎదుట హాజరు కావాలని కోరింది. గుజరాత్ రాజధాని గాంధినగర్ లోని సిట్ కార్యాలయానికి వెళ్ళారు. ఆ రోజు సిట్ అధికారులు రెండు తడవలుగా మొత్తం పదిగంటల పాటు విచారించారు.  మధ్యాన్నం పన్నడు గంటలనుంచి సాయంత్రం అయిదు వరకు, మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి  ఒంటి గంట దాటేవరకూ సిట్ అధికారులు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబడుతూ పోయారు.
‘నామీద దుష్ప్రచారం చేస్తూ, నా గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లకు  ఈనాటితో అయినా కళ్ళు తెరిపిళ్ళు పడతాయని నేను ఆశిస్తున్నాను’ అన్నారాయన తనను కలుసుకున్న విలేకరులతో.
‘మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు ?’ విలేకరుల ఆరా!
‘ఆ సంగతులు మీతో పంచుకోలేను. ఎందుకంటే సిట్ తన నివేదికను నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పిస్తుంది’
ఆ నరేంద్రమోడీ ఇప్పుడు ప్రధాన మంత్రి. సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటాయి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. నిజానికి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మోడీ మహాశయులకు కూడా సీబీఐ పట్ల అచ్చు అలాంటి అభిప్రాయమే వుండేది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదు లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్ళు వెనక్కి వెడదాం!
2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా  గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో, అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి  సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంచి  ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  సంగతి తెలిసిందే.
రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘సమాజ్ వాది, బిఎస్ పిలను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. అదే సీబీఐ’ అని అన్నారు.  
ఓ అయిదేళ్ళు వెనక్కి వెడదాం
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోంది. రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్. ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనను ఇకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
ఇష్రత్ జెహాన్   కేసులో అమిత్ షాను ఇరికించడానికి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవనీ, అయినా అమిత్ షా పేరు చార్జ్ షీటులో చేరిస్తే యూపీఏ ప్రభుత్వం సంతోషించి ఉండేదనీ సిన్హా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెడుతుందని భావించిన రంజిత్ సిన్హా తాను  అలా చెప్పలేదని అంటూ సమర్ధించుకోలేని విధంగా మరో వివరణ ఇచ్చారు.
జోగీందర్ సింగ్
1996 లో కేవలం పదకొండు మాసాల పాటు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు.
పదవీ విరమణ అనంతరం ఒక సమావేశంలో మాట్లాడుతూ తన అనుభవాలు తెలియచేశారు.
“సీబీఐ అంటే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అనే అభిప్రాయం వుంది. కానీ  అది నిజం కాదు. ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మ మాత్రమే’
“ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్ళు ఉండేవి. చార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయాలనీ, అలాగే కొన్ని కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనీ పైనుంచి ఆదేశాలు వస్తుండేవి. పశువుల దాణా కుంభకోణం కేసులో ఇలాగే ఒత్తిళ్ళు వచ్చాయి. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వండని ఖరాఖండీగా చెప్పాను. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా  అనుకున్న విధంగానే చార్జ్ షీట్ దాఖలు చేశాను” అని చెప్పారు జోగీందర్.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ యోగి గత ఆదివారం బంగాల్ రాష్ట్రంలో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి వుంది.  పర్యటనకు కార్యక్రమం సిద్ధం చేసుకున్నారు. ఆయన హెలికాప్టర్ తమ భూభాగంలో దిగడానికి వీల్లేదని దీదీ ఆంక్షలు విధించింది. చేసేదేమీ లేక యూపీ ముఖ్యమంత్రి వాయిస్ మెయిల్ (ఫోన్) ద్వారా తన ప్రసంగపాఠాన్ని సభికులకు చదివి వినిపించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ నివసించేది ఈ పవిత్ర భారత దేశంలోనే. ఇంకా చెప్పాలంటే పైన పేర్కొన్న వింతలూ, విడ్డూరాలు జరిగేది కూడా ఈ భారత దేశంలోనే.
సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దేశం మొత్తంలో ప్రముఖ దర్యాప్తు సంస్థ.
పాలక పక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ  ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే,  సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాకపొతే, కాలక్రమంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే  నిప్పు లాంటి ఈ సంస్థకు కూడా ఏనాడో చెదలు పట్టాయి. అయినా ప్రజలకు ఈ వ్యవస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే వున్నాయి. రాజకీయంకోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలక పక్షాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి.   అధికారం తమ చేతిలోకి రాగానే తిరిగి అదే పని అవి చేస్తుంటాయి. ప్రతిపక్షంగా మారిన ఒకనాటి పాలక పక్షం నోటి వెంట ఇవే చిలుక పలుకులు మళ్ళీ వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది. కానీ సీబీఐ పట్ల ప్రజలకున్న అమితమైన  విశ్వాసం పూర్తిగా ఆవిరి కాలేదు.
చట్టబద్ధ వ్యవస్థల నడుమ, ప్రజాస్వామికంగా ఎన్నికయిన వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే  ప్రభుత్వాల నడుమ ఘర్షణలు సహజం కావచ్చు కానీ అవి యుద్ధాల స్థాయికి పెరగడం వాంఛనీయం కాదు.
మనం నివసిస్తున్న ఈ భూగోళం కంటే అనేక వేల రెట్లు పెద్దవి అయిన వేలాది గ్రహాలు అనంత విశ్వంలో సెకనుకు కొన్ని వేల  మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాయి.  ఈ అనంత విశ్వ  పరిభ్రమణంలో లెక్కకు మిక్కిలిగా వున్నఆ గ్రహాలు, మిల్లిమీటరులో వెయ్యో వంతు తేడా వచ్చినా పరస్పరం డీకొనడం తధ్యం. అయినా కానీ, అనేక వందల వేల సంవత్సరాల నుంచీ ఆ గ్రహరాశులు అన్నీ కూడా  తమ పరిధులు అతిక్రమించకుండా తమ తమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.
అలాంటిది ఒక్క కేంద్ర ప్రభుత్వం, ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధులకు, పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేని పరిస్తితులు తలెత్తితే ఆ తప్పెవరిది?
ఆ తప్పు ఖచ్చితంగా ప్రజలది మాత్రం కాదు.
ప్రజాస్వామ్యం పేరుతొ, ప్రజల పేరుతొ తమ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలదంటారా! ఏమో కావచ్చు.