(Published in SURYA telugu daily on 09-02-2019, Saturday)
నాలుగున్నరేళ్ళకు పూర్వం కొత్తగా
ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రానికి కే. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు
స్వీకరించి కొద్ది మాసాలు గడవకముందే చేసిన పని
తెలంగాణా పవర్ ట్రాన్స్ మిషన్
కార్పోరేషన్ కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా దేవులపల్లి ప్రభాకర రావును
చైర్మన్ గా నియమించడం. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నార్ల తాతారావును
మినహాయిస్తే ఐ.ఏ.ఎస్. కేడర్ అధికారి కాకుండా వేరేవారిని ఈ పోస్టులో నియమించడం ఇదే
మొదటి సారి. ఇందుకు కారణాలు రెండు. ప్రత్యేక తెలంగాణా ఇస్తే ఆ రాష్ట్రం కరెంటు
కొరతతో చీకటి గుయ్యారం అయిపోతుందని ఆనాటి పాలకులు పదేపదే చెప్పిన మాటను వమ్ము
చేయాలనే కేసీఆర్ వజ్ర సంకల్పం. ఒక్క ప్రభాకర రావే తను అనుకున్నవిధంగా ఫలితాలు
సాధించగలరని ఆయన పెంచుకున్న దృఢనమ్మకం. సంకల్ప బలానికి నమ్మకం తోడయి, ప్రభాకరరావు
అవిరల కృషి ఫలించి ఆనతికాలంలోనే
సత్ఫలితాలను ఇచ్చింది. అనునిత్యం విద్యుత్ కోతలతో విసిగిపోయిన జంట నగర వాసులకు
మొదటి ఏడాదిలోనే ఆయన ప్రయత్నాలు విజయవంతమై
తెలంగాణలో విద్యుత్ కొరతలు, కోతలు అనేవి గత కాలపు ముచ్చటగా మిగిలిపోయాయి.
ఇళ్ళల్లోని ఇన్ వర్టర్లు, దుకాణాల్లోని జెనరేటర్లు అటకెక్కాయి. ప్రజల కరెంటు
కష్టాలు ఈడేరాయి.
ఈ లక్ష్యం సాధించడానికి ప్రభాకరరావు
అవిశ్రాంతంగా పనిచేశారు. సిబ్బందికి అవసరమైన సదుపాయాలు సమకూర్చారు. వారినుంచి తనకు
కావాల్సిన ఫలితాలను రాబట్టారు. తమ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
వచ్చినప్పుడల్లా ఆ గుర్తింపులో వారిని భాగస్వాములను చేస్తూ వారందరికీ తగిన
గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించడం ప్రభాకరరావుకు సహజసిద్ధంగా అలవడిన ఓ సుగుణం. ఇదే
ఆయనను, తనవద్ద పనిచేసే సిబ్బందికి దగ్గర చేసింది. తను పనిచేస్తూ, పనిచేయించే ఈ వైఖరే సంస్థ
ఎదుగుదలకు దోహదం చేసింది. ఆయన పనితీరు నచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఏడాది తిరక్క
ముందే విద్యుత్ ఉత్పాదన సంస్థ సీఎండీ బాధ్యతలు కూడా అప్పగించారు.
విద్యుత్ సంస్థలో యాభయ్ ఏళ్ళకు పూర్వం
ఒక సాధారణ అధికారిగా చేరిన ప్రభాకర రావు మెట్టు మెట్టుగా ఎదుగుతూ, శిఖరాగ్ర
స్థానానికి చేరుకొని తాను అంకిత భావంతో పనిచేసిన అదే సంస్థ ఎదుగుదలకు దోహదపడగలగడం అనేది నిజంగా
అపూర్వం. ఆయన సమర్ధతకు నిదర్శనం.
దేవులపల్లి వారికి మనఃపూర్వక అభినందనలు