11, జూన్ 2017, ఆదివారం

కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ


(చంద్రబాబు మూడేళ్ళ పాలనపై ఈరోజు (08-06-2017) ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్) లో నా వ్యాసం)
కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి మూడేళ్ళ క్రితం  ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.ఉమ్మడి రాష్ట్రంలో  చేజారిన అధికారాన్ని నూతన రాష్ట్రంలో  తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం  గత మూడేళ్ళుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక చిక్కుముడి ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకముడి విప్పేలోగా మరోటి సిద్ధం. నిజానికి,  ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత ప్రస్తుత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా ఆయన అదృష్ట వంతుడైన రాజకీయ నాయకుడు.  'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?'  అనే  సానుభూతి మాత్రం జనం నుంచి, ముఖ్యంగా నెటిజన్ల నుంచి  లభిస్తోంది. నిన్ననో మొన్ననో సాంఘిక మాధ్యమాల్లో చంద్రబాబు గురించి ఒక వ్యాఖ్య చదివాను. “ నేను ఎప్పటినుంచో అయన అభిమానిని. అయినా కానీ, మూడో తడవ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనకు నేను మంచి మార్కులు వేయలేను. కానీ ఈ వయస్సులో కూడా  చంద్రబాబుకు ఉన్న పట్టుదల, శ్రమ పడే తత్వం నాకు బాగా నచ్చాయ”న్నది ఆవ్యాఖ్య సారాంశం.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,  'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్రాన్ని తాను  కోరుకున్న విధంగా అభివృద్ధి చేయడానికి కానీ,  అవసరమైనవి ఏవీ  ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి తాను  కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. మూడేళ్ళుగా జరిగింది ఒక్కటే. ప్రజలనుంచి ముప్పయివేల ఎకరాలకు పైగా రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూమిని సమీకరించడం. తాత్కాలిక ప్రాతిపదిక మీద అసెంబ్లీ, సచివాలయాలకోసం శాశ్వత భవనాలను నిర్మించడం. ఇవి మినహా మిగిలిన ఆలోచనలన్నీ కాగితాల వరకే పరిమితం అయ్యాయి. నూతన రాజధాని విషయంలో  కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. అది నిజం  కాదు,  దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు కనబడడం లేదాఅని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ‘ఇంతవరకు ఇచ్చినదింత, ఖర్చు పెట్టినదెంత’ అని లెక్కలు అడిగేవరకూ పోతున్నాయి మిత్ర పక్షాలవాదోపవాదాలు. మొన్నీమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంద్ర ప్రాంతంలో జరిపిన పర్యటనలో ఈ ధోరణి హద్దులు దాటి మరీ ప్రస్పుటంగా వెల్లడయింది.

రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు  సీమాంధ్రలో నడుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. మూడేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని  చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని మనిషిలా అలా  తిరుగుతూనే వుండడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.  అయితే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబుది  ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ వాలిపోయేవారు.
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనుఅనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ఒకే ఒక్కడురామన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా అనేది సిబ్బంది వాదన.
పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబుకు తాను చేసిన పొరబాటు ఏమిటో  అర్ధం అయినట్టుంది. 2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు, తాను మారానని, మారిన మనిషిని అని.
కానీ అధికార పగ్గాలు మళ్ళీ చేతికి అందగానే తిరిగి పూర్వపు అలవాట్లే! ప్రభుత్వ సిబ్బందికి వెనుకటి అగచాట్లే. ఆయన నిద్ర పోవడం లేదు, సిబ్బందిని నిద్ర పోనివ్వడం లేదు.
రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నాఏ లెక్కన చూసినా ఇప్పటి రాజకీయ నేతల్లో  ఆయనే సీనియర్. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రాజకీయ అనుభవం సరేసరి. ఇంత  అనుభవం వుండి కూడాయావత్ ప్రజానీకానికి  సంబంధించిన  కొన్ని అంశాలపైముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం  వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపైకేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించిఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే   ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
మారిన రాజకీయ పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. చేజారినది అనుకున్న అధికారం గత ఎన్నికల్లో చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా  చూసుకోవాలి.
మూడేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన  జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకంలో కొంత అసహనం, ఆవేదన ఉన్నమాట వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం, 1956 లో ఆంద్ర, నిజాం సంస్థానాలను విలీనం చేస్తూ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దాదిగా మెజారిటీ తెలంగాణా ప్రజల్లో ఈ విధమైన  అసహన భావజాలమే బలపడుతూ వచ్చింది. ఆ ప్రాంతీయ భావమే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా పోయాయి.అలాగే  ప్రస్తుతం సీమాంధ్రలో కూడా దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం అనే భావనలో వున్నారు. ప్రజల నాడిని ఒడిపోసిపట్టుకోగల నైపుణ్యం చంద్రబాబు సొంతం. ‘ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా చూసుకుంటే చాలు’ అనే నిర్ధారణకు వచ్చినట్టుంది. అందుకే పదేపదే అవసరం వున్నా లేకపోయినా విభజన  ప్రస్తావన తీసుకువస్తున్నారు. మొన్నటికి మొన్న నవ నిర్మాణ దీక్ష ప్రసంగంలో కూడా  విభజన జరిగిన జూన్ రెండో తేదీని ‘చీకటి దినం’గా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం. అదే రోజు, మరో వైపు పండగ జరుపుకుంటున్న తెలంగాణా ప్రజలకు ఇలాంటి మాటలు సహజంగానే ఖేదాన్ని కలిగిస్తాయి. అదే జరిగింది కూడా. ఆ వైపునుంచి టీ ఆర్ ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో పాటు ఎదురు దాడికి కూడా  దిగారు.
ఏది ఏమైనా పాలకులు ఒక విషయాన్ని  గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ వైమనస్యాలు  రాజకీయంగా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. పైగా ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల ప్రజల నడుమ మరిన్ని అంతరాలను, అనుమానాలను  పెంచే ప్రమాదం కూడా వుంటుంది. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న రోజుల్లో హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల అనుభవించిన మానసిక వేదన తెలిసిన వారికి ఈ పెడ ధోరణుల పర్యవసానాలు కూడా తెలిసే వుండాలి.     

చంద్రబాబు అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో ఆయనలో ఒక  పరిణతి  చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు.        
ఎంతో చేస్తున్నాం, ఇంకెంతో  చేస్తాం’ అనే దగ్గరే ఆగిపోతున్నారేమో అనిపిస్తోంది.  
మూడేళ్ళు గడిచిపోయాయి. ఇంకా రెండేళ్ళే సమయం వుంది.
దిద్దుకోవడానికయినా, సరిదిద్దుకోవడానికయినా  మిగిలింది కొద్ది  వ్యవధానం మాత్రమే!
ఆయనలోని ‘సమర్ధ రామదాసు’కు అసలు సిసలు పరీక్ష మొదలయింది.
Image may contain: 1 person, smiling

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595

8, జూన్ 2017, గురువారం

ఆకాశవాణిలో డి. వెంకట్రామయ్య అనుభవాలు

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఈ  కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! 
వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం. 
రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.
నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోటపనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో, పరిచయస్తులనో, మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు. వార్తల విషయంలో ఎటువంటి మడులూ, దడులూ కట్టుకోకుండా, ఎటువంటీ దడుపూ లేకుండా నిర్భయంగా,  స్వేచ్చగా రేడియో వార్తలు ఇచ్చే నేను ఒక్క వెంకట్రామయ్య గారి విషయంలో కాస్త వెనుకా ముందూ చూడడానికి కారణం ఆయనలోని ఈ నిబద్దతే.  

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు,
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు,
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి,
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని, పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.
కాకపోతే, రచన సాయి గారి పుణ్యమా అని ఆయన రాసిన రేడియో అనుభవాలను ఎమెస్కో వారు ఒక పుస్తకంగా వేశారు. సంతోషం.
చక్కటి విషయాలు, ఎవరికీ తెలియనివి అనేకం రాసారు. మరింత సంతోషం.
ఈ పుస్తకాన్ని ఏకబిగువున చదివినప్పుడు చాలా మంచి పుస్తకం అనిపించక తప్పదు. అయితే  అదే సమయంలో స్వోత్కర్ష కొంత మోతాదు మించింది అనే అభిప్రాయం కూడా కలగక తప్పదు. తనని తాను  ఎలివేట్ చేసుకునే క్రమంలో కొందరు రేడియో సహోద్యోగులను చిన్న చూపు చూసారా అని కూడా కొండొకచో అనిపించక మానదు.
నిర్మొహమాటంగా వుండడం తన సహజ లక్షణమని నమ్మే వెంకట్రామయ్య గారు నా ఈ విమర్శను సరయిన రీతిలో స్వీకరిస్తారనే నమ్మకం నాకు  వుంది.
   


2, జూన్ 2017, శుక్రవారం

ప్రధమ కబళే మక్షికాపాతః

అంటే మొదటి ముద్దలోనే ఈగ పడిందని అర్ధం. నా పొరబాటు, గ్రహపాటు కారణంగా అదే జరిగిందివాళ. అందుకు ఆంద్ర జ్యోతి సంపాదకుడికి నా శతసహస్ర క్షమాపణలు. తెలంగాణా ఏర్పడి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా నేను రాసిన వ్యాసాన్ని ఆ పత్రిక వారు ఈరోజు ఎడిట్ పేజీలో ప్రచురించారు. అందుకు కృతజ్ఞతలు.
కాకపొతే, ఆ వ్యాసం తొలి వాక్యమే ఇలా మొదలవుతుంది.

“తెలంగాణా పంచాయతీరాజ్, ఐ.టీ. శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు....” (ఆయన మంత్రిత్వ శాఖ పంచాయతి రాజ్  కాదు).
చదువుకునే చిన్న పిల్లలకు కూడా చటుక్కున బోధపడే ‘తప్పు’ ఇది. తప్పు చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు, తప్పు తప్పే.
అందుకే అంటారు, తొందరపడి తప్పులు తొక్కితే తీరిగ్గా విచారించాల్సివస్తుందని.
అనుభవం వుందని విర్రవీగడం కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
కాకపొతే ఆ అనుభవమే వెంటనే నాచేత ఈ నాలుగు మాటలు రాయిస్తోంది.
ఎవరో తప్పు పట్టిందాకా ఊరుకోకుండా నా తప్పు నేనే ఒప్పుకుంటే సరిపోతుంది. అంచేతే.....
అందరికీ, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికీ, మంత్రి కేటీఆర్ కి మనఃపూర్వక క్షమాపణలు.

పొతే, మరో మనవి.
స్థలాభావం కావచ్చు. నేను రాసిన దాంట్లో ప్రచురణకు నోచుకోని ఒక పేరా వుంది. అదే ఇది.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగారు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?

1, జూన్ 2017, గురువారం

జాతకం అంటేనే మారడం


తండ్రి పోతూ పోతూ ఇద్దరు మగపిల్లలకి ఆస్తిలో చెరిసగం రాసి పోయాడు. ఊరిమద్యలో ఇల్లూ, స్థలం పంచుకుంటే పెద్దవాడికి నాలుగు రోడ్ల కూడలిలో మూల స్థలం, చిన్నవాడికి దాని వెనుక స్థలం దక్కాయి. వూరు పెరుగుతూ ఉండడంతో పెద్దవాడి అదృష్టం పండింది. రెండు రోడ్లని కలిపే జాగా కావడంతో రోడ్డుకు ఆనుకుని మడిగీలు కట్టాడు. అదీ అద్దెకు తీసుకున్న వారి డబ్బులతోనే.  మంచి కిరాయిలు నెల నెలా చేతికి అందేవి. తమ్ముడికి కూడా అంత స్థలం ఉందన్న మాటే కానీ కాణీ ఆమ్దానీ లేదు. అతడిది నష్ట  జాతకం అన్నారు ఇంట్లోవాళ్ళు, బయట వాళ్ళు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వూరు కూడా బస్తీ అయింది. రోడ్ల వెడల్పు కార్యక్రమంలో పెద్దవాడి మడిగీలు యెగిరి పోయాయి. వుండే ఇల్లు కూడా అరకొరగా తయారయింది. చిన్నవాడి పిల్లలు తమ చిన్న ఇంటి పెరట్లో కూరగాయలు పండించడం మొదలెట్టారు. వాటి అమ్మకాలతో ఆదాయం పెరిగింది. ఇద్దరు అన్నదమ్ముల పరిస్తితి అటుదిటుగా మారింది. ఈలోగా బస్తీ నగరంగా తయారయింది.
కొన్నాళ్ళకు ఆ దారిలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం అన్నారు, వస్తుందో లేదో తెలియదు కానీ పెద్దవాడి ఇల్లు పూర్తిగా ఎగిరిపోయింది. నష్ట పరిహారం భారీగానే ముట్టచెప్పారు, కాకపొతే కిస్తీల్లో చెల్లింపులు. చెట్టు కొట్టేస్తే పక్షులు ఎగిరిపోయినట్టు పెద్దవాడి కుటుంబం వలస పోవాల్సివచ్చింది.  వెనకవున్న తమ్ముడి  ఇల్లు ఆ వంతెన కాంట్రాక్టర్ ఆఫీసుకు అవసరమైంది. కళ్ళు చెదిరే కిరాయికి తీసుకున్నారు. ఆ స్థలంలోనే వాళ్ళ డబ్బులతోనే పెద్ద భవనం కట్టారు. పని పూర్తికాగానే అది మీదే అన్నారు. నివాసం  వుండగా కిరాయి డబ్బులు అదనం.  చిన్నవాడి జాతకం అంత గొప్పది అన్నారు అదే ఇంట్లో వాళ్ళు, అదే బయట వాళ్ళు.
తరాలు మారేసరికి ఇనుము  వెండయింది, వెండి ఇనుమయింది.

‘అదే జాతకం అంటే!’ అన్నాయి అదే నోళ్ళు.     

31, మే 2017, బుధవారం

ఏడు లక్షలు దాటిపోయాయి



మధ్యాన్నం కరెంటు లేని కారణంగా, తత్కారణంగా నెట్ సదుపాయం లేని కారణంగా ఇప్పుడు చూసుకుంటే తెలియవచ్చిన విషయం ఏమిటంటే నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/) హిట్లు ఏడులక్షలు దాటిపోయాయని. 

నిమిషం ఓపికలేని జీవితాలు



మండుటెండలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఓ బస్  స్టాప్ పక్కన ఆగింది. మూడు నాలుగు నిమిషాలన్నా వేచి ఉండక తప్పదు. కారు ఏసీ  అయినా ఎండ పీడ తగ్గించుకోవడానికి సీట్లోనే పక్కకి జరిగి కూర్చుంటుంటే ఆ దృశ్యం కళ్ళబడింది. ద్విచక్ర వాహనం మీద మొగుడూ పెళ్ళాం, ఇద్దరు చిన్న పిల్లలు, ఎడ పిల్ల మరీ చంటిది. తల్లి బండి దిగి పిల్లల్ని కాసేపయినా నీడను నిలుపుదామని బస్ స్టాప్ షెల్టర్ కిందకు వెళ్ళింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక చంటిది గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పిల్ల నెత్తికి ఓ గుడ్డచుట్టి తెచ్చుకున్న సీసాలో నీళ్ళు ఆ పసిదాని మాడు మీద చల్లుతోంది. పెద్ద పిల్ల దప్పిక ఆపుకోలేక అమ్మ చేతిలో సీసా లాక్కుని ఆబగా తాగుతోంది.
ఈ లోగా పచ్చ లైటు వెలిగింది. తండ్రి సైగ చేయడంతో తల్లి గాభరాగా పిల్లలతో వచ్చి ఆ బండి ఎక్కలేక అవస్థ పడుతోంది. వెనక నుంచి అదేపనిగా హారన్లు. దాంతో అవిడ గాభరా మరింత పెరిగింది.

మరి యెంత అవసరం వుండి ఇంత ఎండ పూటన ప్రయాణం పెట్టుకున్నారో తెలవదు. ఆ బాధ కంటే, వెనుకవాళ్ళ అసహనం మరింత బాధ పెట్టింది. నిమిషం తాళలేని ఓపికలేని జీవితాలాయె!     

26, మే 2017, శుక్రవారం

మోడీ మూడేళ్ళ పాలన

(PUBLISHED IN ANDHRAPRABHA TELUGU DAILY ON 27-05-17, SATURDAY)

మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ  పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి.  పేరు సుహేల్ సేథ్. 
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ  జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు,   కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  
అయితే, నరేంద్రమోడీ ప్రధాన మంత్రి కాగానే సుహేల్ సేథ్ మహాశయులు తన బాణీ తానే మార్చుకుని ‘ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందంటూ  గొప్ప కితాబు ఇచ్చారు.
ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన  ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. ఇది మరో వాస్తవంఅంటారు సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం వుందనుకోను. ఆయనే  స్వయంగా చెప్పుకున్నట్టు  ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్  మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు. కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో దాగున్న  సమర్ధ రామదాసు మనకు కనబడతాడు. 
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది. 
మోడీ గుజరాత్ సీతయ్య.  కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదుఅంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే రెండక్షరాలు  ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. మూడేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది రెండేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మిగిలింది ఒక్క ఏడాదే. రెండో ఏడు కేవలం లెక్కకే.  ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
అందరికీ  గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు. 
సేవా పరమో ధర్మఃఅనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు  తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు.  మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చానుఅన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం అంత్యోదయ, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత  మరో ఏడాది కాలగర్భంలో కలిసింది.చూస్తుండగానే మూడేళ్ళు గతంలో కలిసి పోయాయి.  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున  జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
మూడేళ్ళుగా ఎలాంటి మచ్చా లేకుండా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ, తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే,  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.

రాజకీయుల దగ్గర లేని ఆయుధం ప్రజల దగ్గర వుంది. తమను ఏమార్చే పాలకులను  అయిదేళ్ళకోమారు సుతారంగా మార్చగల ఓటుఅనే బ్రహ్మాస్త్రం తమ వద్ద వుందన్న ఎరుక ఇప్పుడు జనంలో వుంది. వారికి ఈ విషయం తెలుసన్న సంగతి పాలకులే తెలుసుకోవాలి.

(ఆంధ్రప్రభ దినపత్రిక)