11, జూన్ 2017, ఆదివారం

కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ


(చంద్రబాబు మూడేళ్ళ పాలనపై ఈరోజు (08-06-2017) ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్) లో నా వ్యాసం)
కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి మూడేళ్ళ క్రితం  ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.ఉమ్మడి రాష్ట్రంలో  చేజారిన అధికారాన్ని నూతన రాష్ట్రంలో  తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం  గత మూడేళ్ళుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక చిక్కుముడి ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకముడి విప్పేలోగా మరోటి సిద్ధం. నిజానికి,  ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత ప్రస్తుత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా ఆయన అదృష్ట వంతుడైన రాజకీయ నాయకుడు.  'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?'  అనే  సానుభూతి మాత్రం జనం నుంచి, ముఖ్యంగా నెటిజన్ల నుంచి  లభిస్తోంది. నిన్ననో మొన్ననో సాంఘిక మాధ్యమాల్లో చంద్రబాబు గురించి ఒక వ్యాఖ్య చదివాను. “ నేను ఎప్పటినుంచో అయన అభిమానిని. అయినా కానీ, మూడో తడవ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనకు నేను మంచి మార్కులు వేయలేను. కానీ ఈ వయస్సులో కూడా  చంద్రబాబుకు ఉన్న పట్టుదల, శ్రమ పడే తత్వం నాకు బాగా నచ్చాయ”న్నది ఆవ్యాఖ్య సారాంశం.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,  'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్రాన్ని తాను  కోరుకున్న విధంగా అభివృద్ధి చేయడానికి కానీ,  అవసరమైనవి ఏవీ  ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి తాను  కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. మూడేళ్ళుగా జరిగింది ఒక్కటే. ప్రజలనుంచి ముప్పయివేల ఎకరాలకు పైగా రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూమిని సమీకరించడం. తాత్కాలిక ప్రాతిపదిక మీద అసెంబ్లీ, సచివాలయాలకోసం శాశ్వత భవనాలను నిర్మించడం. ఇవి మినహా మిగిలిన ఆలోచనలన్నీ కాగితాల వరకే పరిమితం అయ్యాయి. నూతన రాజధాని విషయంలో  కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. అది నిజం  కాదు,  దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు కనబడడం లేదాఅని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ‘ఇంతవరకు ఇచ్చినదింత, ఖర్చు పెట్టినదెంత’ అని లెక్కలు అడిగేవరకూ పోతున్నాయి మిత్ర పక్షాలవాదోపవాదాలు. మొన్నీమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంద్ర ప్రాంతంలో జరిపిన పర్యటనలో ఈ ధోరణి హద్దులు దాటి మరీ ప్రస్పుటంగా వెల్లడయింది.

రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు  సీమాంధ్రలో నడుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. మూడేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని  చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని మనిషిలా అలా  తిరుగుతూనే వుండడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.  అయితే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబుది  ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ వాలిపోయేవారు.
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనుఅనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ఒకే ఒక్కడురామన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా అనేది సిబ్బంది వాదన.
పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబుకు తాను చేసిన పొరబాటు ఏమిటో  అర్ధం అయినట్టుంది. 2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు, తాను మారానని, మారిన మనిషిని అని.
కానీ అధికార పగ్గాలు మళ్ళీ చేతికి అందగానే తిరిగి పూర్వపు అలవాట్లే! ప్రభుత్వ సిబ్బందికి వెనుకటి అగచాట్లే. ఆయన నిద్ర పోవడం లేదు, సిబ్బందిని నిద్ర పోనివ్వడం లేదు.
రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నాఏ లెక్కన చూసినా ఇప్పటి రాజకీయ నేతల్లో  ఆయనే సీనియర్. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రాజకీయ అనుభవం సరేసరి. ఇంత  అనుభవం వుండి కూడాయావత్ ప్రజానీకానికి  సంబంధించిన  కొన్ని అంశాలపైముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం  వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపైకేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించిఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే   ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
మారిన రాజకీయ పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. చేజారినది అనుకున్న అధికారం గత ఎన్నికల్లో చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా  చూసుకోవాలి.
మూడేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన  జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకంలో కొంత అసహనం, ఆవేదన ఉన్నమాట వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం, 1956 లో ఆంద్ర, నిజాం సంస్థానాలను విలీనం చేస్తూ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దాదిగా మెజారిటీ తెలంగాణా ప్రజల్లో ఈ విధమైన  అసహన భావజాలమే బలపడుతూ వచ్చింది. ఆ ప్రాంతీయ భావమే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా పోయాయి.అలాగే  ప్రస్తుతం సీమాంధ్రలో కూడా దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం అనే భావనలో వున్నారు. ప్రజల నాడిని ఒడిపోసిపట్టుకోగల నైపుణ్యం చంద్రబాబు సొంతం. ‘ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా చూసుకుంటే చాలు’ అనే నిర్ధారణకు వచ్చినట్టుంది. అందుకే పదేపదే అవసరం వున్నా లేకపోయినా విభజన  ప్రస్తావన తీసుకువస్తున్నారు. మొన్నటికి మొన్న నవ నిర్మాణ దీక్ష ప్రసంగంలో కూడా  విభజన జరిగిన జూన్ రెండో తేదీని ‘చీకటి దినం’గా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం. అదే రోజు, మరో వైపు పండగ జరుపుకుంటున్న తెలంగాణా ప్రజలకు ఇలాంటి మాటలు సహజంగానే ఖేదాన్ని కలిగిస్తాయి. అదే జరిగింది కూడా. ఆ వైపునుంచి టీ ఆర్ ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో పాటు ఎదురు దాడికి కూడా  దిగారు.
ఏది ఏమైనా పాలకులు ఒక విషయాన్ని  గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ వైమనస్యాలు  రాజకీయంగా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. పైగా ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల ప్రజల నడుమ మరిన్ని అంతరాలను, అనుమానాలను  పెంచే ప్రమాదం కూడా వుంటుంది. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న రోజుల్లో హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల అనుభవించిన మానసిక వేదన తెలిసిన వారికి ఈ పెడ ధోరణుల పర్యవసానాలు కూడా తెలిసే వుండాలి.     

చంద్రబాబు అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో ఆయనలో ఒక  పరిణతి  చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు.        
ఎంతో చేస్తున్నాం, ఇంకెంతో  చేస్తాం’ అనే దగ్గరే ఆగిపోతున్నారేమో అనిపిస్తోంది.  
మూడేళ్ళు గడిచిపోయాయి. ఇంకా రెండేళ్ళే సమయం వుంది.
దిద్దుకోవడానికయినా, సరిదిద్దుకోవడానికయినా  మిగిలింది కొద్ది  వ్యవధానం మాత్రమే!
ఆయనలోని ‘సమర్ధ రామదాసు’కు అసలు సిసలు పరీక్ష మొదలయింది.
Image may contain: 1 person, smiling

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595

కామెంట్‌లు లేవు: