12, మే 2017, శుక్రవారం

ఈ స్థాయి నాది కాదు.........

సైకిల్ పైనా, సిటీ బస్సుల్లోను తిరిగే ఏకాంబరానికి చిన్న ఉద్యోగం వచ్చింది. యేవో చిన్నపనులు చేసిపెట్టి ఓ స్కూటరు కొనుక్కున్నాడు. అందులో సుఖం తెలిసివచ్చింది. ఆ హాయిని నిలుపుకోవడానికి కొంత అదనపు ఆదాయం కావాల్సి వచ్చింది. అందుకోసం అవకాశాలు వెతుక్కున్నాడు. ఆ అవకాశాల పేరే ఆమ్మామ్యా! అదే లంచం!
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. కారు కొనుక్కున్నాడు. ఆ సుఖమయ జీవితాన్ని మరింత పదిలం చేసుకునేందుకు  ‘అవకాశాలు’ పెంచుకున్నాడు.
జీతం పెరిగింది, జీవితమూ పెరిగింది. ‘అవకాశాలూ’ పెరిగాయి. దాంతో పట్టుబడే అవకాశాలు పెరిగాయి. పట్టుబడిపోతాననే భయమూ పెరిగింది. పట్టుబడకుండా ఏం చేయాలనే ఆలోచనలూ పెరిగాయి.
ఉద్యోగం ఒదిలేసాడు. కంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. లంచాలు తీసుకున్న చేతులతోనే లంచాలు మేపాడు. కోట్లకు పడగలెత్తాడు. అయినా పడగనీడన  బతికే బతుకులో సుఖం లేదనిపించింది. రక్షణ కవచం కావాలనుకున్నాడు. సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ప్రవేశించాడు. అధికార పదవులు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ‘అవకాశాలు’ మరింత పెరిగాయి. జీవితంలో స్థాయి కూడా ఎంతో పెరిగింది. పట్టుపడతాననే భయం తగ్గిపోయింది. ఎందుకంటే పట్టుకునేవారే ఇప్పుడు తన గుప్పిట్లో వున్నారు.
అయినా సరే! ఏదో ఆందోళన! ఏదో భయం. ఇలా ఎన్నాళ్ళు ? పైకి చెప్పుకోలేడు.

ఒకప్పటి స్థాయిని  గుర్తు తెచ్చుకోలేడు. ఇప్పుడున్న స్థాయిని వదులుకోలేడు.         

11, మే 2017, గురువారం

ఏది నిజం?


Long long ago, so long ago, nobody can say how long ago… ఆకాశవాణి ఒక్కటే రాజ్యమేలుతున్న రోజుల్లో...దాదాపు ప్రధాన పత్రికలు అన్నిట్లో రేడియో కార్యక్రమాలపై సమీక్షలు ప్రచురించేవారు. వీటిల్లో ఎక్కువ భాగం ఆ కార్యక్రమాల తీరుతెన్నులను ఎండగడుతూనే వుండేవి. తర్వాత ప్రైవేటు టీవీలు వచ్చిన తరువాత సీ.ఎం.ఎస్. భాస్కర రావు గారు తమ సంస్థ ద్వారా కొంత ప్రయత్నం చేసారు. ఈ యజ్ఞంలో జ్వాలా, ఆర్వీవీ కృష్ణారావు, నేనూ మా రాతల ద్వారా కొన్ని సమిధలు వేసాము. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది రియల్? ఏది వైరల్? అంటూ కొన్ని టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఖండఖండాలుగా ఖండించే పని పెట్టుకున్నట్టుగా కానవస్తోంది. అయితే ఈ కార్యక్రమాలు సమీక్షల రూపంలో కాకుండా ‘ఆ వార్తలు, నిజం కావు, నమ్మకండి’ అనే ధోరణిలో వుంటున్నట్టు వాటిని చూసిన కొందరు మిత్రులు చెబుతున్నారు. మంచి పనే!

కానీ మీడియాలో వచ్చే వాటిల్లో ఏది నిజం? ఏది అబద్దం? అనేది తెలియచెబితే కాని తెలుసుకోలేనంత సంక్లిష్టం కాదేమో!        

9, మే 2017, మంగళవారం

ఆయన రేడియో ప్రయోక్తా! రచయితా!


రెండూను అంటున్నారు ఎమెస్కో వారు. అనడమే కాదు, డి. వెంకట్రామయ్య రాసిన రెండు పుస్తకాలను ఒకేసారి ప్రచురించారు. ఇది ఎప్పుడో జరగాల్సిన పని అనేది రొటీన్ కామెంటు. ఇప్పటికయినా చేసారు, ఆయన అభిమానులకి అదే సంతోషం.



'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.



వెంకట్రామయ్యకి ఇలాటి నమ్మకాలు లేవుకాని, శాపవశాన గంధర్వుడు మానవ జన్మ ఎత్తినట్టు, ఆయన రేడియోలో చేరి ఉద్యోగం చెయ్యడం  ఆకాశవాణికి ఉపయోగం అయ్యింది కానీ,  ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆయన నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకట్రామయ్య అనే సృజనాత్మక వ్యక్తి  రేడియో న్యూస్ రీడర్ గా సుదీర్ఘకాలం పనిచేయడంవల్ల ఆంధ్రదేశం చక్కని రచయితను కోల్పోయింది. ఇది నా నమ్మకం.
ఒక రచన చేసినా, ఒక వార్త  తర్జూమా చేసినా, లేక  రేడియోలో  చదివినా, ఏం చేసినా సరే మనసుపెట్టి చేసేవారు. అందుకే ఆ రచనలో,  ఆ వార్తలో, దానిని చదవడంలో  జీవం తొణికిసలాడేది. ఆయనతో పాటు దశాబ్దాలపాటు పనిచేసిన రేడియో ఉద్యోగిగా ఈ విషయం బల్ల గుద్ది చెప్పగలను.
రాయని రచయిత, లేదా రాసి మానేసిన రచయిత అని పేరుపడ్డ  వెంకట్రామయ్య చేత మళ్ళీ రాయించాలన్నది నా చిరకాల వాంఛ.  దాన్ని మన్నించి కొన్ని రాశారు కానీ ఇంకా ఇంకా రాయాలనే కోరిక మాత్రం తీరలేదు. అలాఅని, నా ఆశా చావలేదు. చూద్దాం!  ఆయన రాయకపోతారా! నేను చదవక పోతానా?
కానీ, కార్మికుల కార్యక్రమం 'రాంబాబు'  అంత తేలిగ్గా వినే రకం కాదు. అదేకదా! బాధ.
మొత్తానికి ఈ గోడు ఎమెస్కో వారి చెవిన పడినట్టుంది. అందుకే ఆయనవి రెండు పుస్తకాలు ఏకకాలలో అందంగా అచ్చొత్తించి అభిమానుల కోరిక తీర్చారు. నిన్ననే నాకూ, జ్వాలాకు ఆయన  ఈ పుస్తకాలు అందచేశారు. ఈ ఏడాదిలో నాకందిన గొప్ప కానుక.
(ప్రచురణ: ఎమెస్కో PRICE: Rs.175 each)
తోకటపా: రేడియో అనుభవాల గురించి రాసిన మూడువందల పేజీల్లో, పది పేజీలతో కూడిన ఒక అధ్యాయాన్నే నాకోసం, నా పేరుమీద కేటాయించిన వెంకట్రామయ్య గారికి స్నేహపూర్వక కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు


అభిమాన ధనం అంటే ఇదీ బాబుగారూ!

“సింగరాయకొండ కొండ నుంచి నరసింహారావుని మాట్లాడుతున్నాను”
“చెప్పండి”
“ఫిబ్రవరిలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికల్లో మీరు రాసిన వ్యాసాలు చదివాను. వాళ్ళు మీ ఫోను నెంబర్లు ఇవ్వడం వల్ల అప్పుడే ఒకసారి మీతో మాట్లాడాను”
“............”
“నాకు ఆ వ్యాసాలు బాగా నచ్చాయి. నేను టీడీపీ అభిమానిని. అందువల్లనే అవి నచ్చాయని అనుకోవద్దు. మీరు చంద్రబాబులో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులు గురించి సుతిమెత్తగా చెప్పారు. అది నాకు నచ్చింది. అందుకే నేను మీకు ఒక చిన్న కానుక పంపాలని అనుకుంటున్నాను”
ఆశ్చర్యం వేసింది. వ్యాసాలు ప్రచురించిన పత్రికల వాళ్ళే పారితోషికం ఊసెత్తలేదు. అందుకోసం నేనవి రాయలేదు. కానీ ఈ పెద్దమనిషి కానుక పంపుతాను అంటున్నాడు. అందుకే ఆశ్చర్యం.
“ఇన్ని రోజులు గడిచాక ఎందుకిలా అనుకుంటారేమో. మా తోటలో మామిడి కాయలు కాపుకు వచ్చాయి. అవి రాగానే మీకు పంపాలని అప్పుడే అనుకున్నాను. ఏమీ అనుకోకపోతే మీ అడ్రసు చెబుతారా? పార్సెల్లో వేస్తాను”
“మీ అభిమానానికి ధన్యవాదాలు. మా ఇంట్లో మామిడి పండ్లు తినేవాళ్ళు లేరు. మా ఆవిడకు సుగరు. ఇక నేను తినగా పంచి పెట్టేటన్ని పళ్ళు మీలాంటి మిత్రులు పంపారు. కాబట్టి ఓ పనిచేయండి. శ్రమ తీసుకుని అంత దూరం నుంచి పార్సె ళ్ళు పంపకండి. వాటిని అవసరం అయిన వాళ్లకి ఇచ్చి నన్ను ధన్యుడ్ని చేయండి”
“..........”

“మరో మాట! నిజానికి ఆయనకి (చంద్రబాబు) ఇంతకంటే (మీ వంటివారి అభిమానం) మించిన పుట్టిన రోజు కానుక వుండదు”       

8, మే 2017, సోమవారం

స్లో పాయిజనింగ్

“ఆటో కంటే చౌక తెలుసా? ఒక్కోసారి ఫ్రీ రైడ్. దిగిన తరవాత ఏమీ ఇవ్వక్కర లేదన్నాడు డ్రైవర్. ఇంటి దగ్గరకే వచ్చి ఎక్కించుకుంటారు, దింపమన్న చోట దింపేస్తారు, యెంత హాయిగా వుందో ఇప్పుడు. ఈ ఊబెర్లు, ఓలాలు అన్ని ఊళ్ళల్లో పెడితే యెంత బాగుంటుందో!” ఇలా సాగుతున్నాయి నగర మధ్యతరగతి పౌరుల ఆలోచనలు. నేనూ వీరిలో ఒకడినే.
కానీ, వ్యాపారి అనేవాడు ఏ లాభం లేకుండా వరదన పడిపోడని సామెత. మాల్స్ సంస్కృతి ప్రబలిన తర్వాత చిన్న చిన్న దుకాణాలకు ఊపిరి అందడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో చిల్లర వ్యాపారాలు ఎప్పుడో హరీ అన్నాయి. అలాగే ఇవీ. ముందు చౌక ధరలతో ఆకర్షించి అలవాటు పడేలా  చేస్తారు. మరో దారి లేకుండా చేసిన తరువాత వారేం చెబితే అదే మాట చెల్లుబడి అవుతుంది. అప్పుడు రేట్లు పెంచినా అడిగేవాడు వుండడు. ప్రత్యామ్నాయం లేకుండా పొతే అడగడానికి నోరు పెగలదు.
ఈరోజు బయటకు వెళ్ళడానికి ఊబెర్ బుక్ చేద్దామని అనుకున్నాను. “ఈరోజు రేట్లు పెరిగాయి, సహకరించండి” అని ఓ చిన్ని హెచ్చరిక.
ఊబెర్, ఓలాలు వచ్చిన కొత్తల్లో రేట్లతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఒక్కసారిగా పెద్దగా పెంచరు. కార్పొరేట్ కల్చర్ కదా! వారి పద్దతులు వారివి.

ఎవరో చెప్పగా విన్నాను. ‘స్లో పాయిజనింగ్’ అంటే ఇష్టమని.       

ప్రెస్ మాన్ వేణుగోపాల్

వేణుగోపాల్. తెలుగు తెలియని వేణుగోపాల్. హైదారాబాదు ఎప్పుడు వచ్చినా కలిసేవాడు. ఎం.ఎస్. శంకర్ కి ఆత్మీయ మిత్రుడు. ప్రెస్ మాన్ ప్రకటన సంస్థలో, తరువాత బిర్లా సంస్థలో చాలాకాలం పనిచేసాడు. నేనూ, జ్వాలా, శంకర్ మూడేళ్ళ క్రితం చెన్నై వెళ్లి నప్పుడు కూడా మాతో గడిపాడు. నిగర్వి. స్నేహశీలి.
ఈ నెల ఇరవై నాలుగో తేదీన శంకర్ తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు. స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చెన్నై మీదుగా వేణుగోపాల్  ని చూసి రావాలని శంకర్ ఆలోచన. ఈ సంగతి చెబుదామని ఈ ఉదయం వేణుగోపాల్  కి ఫోను చేశాడు. అయన భార్య ఫోను ఎత్తింది. పరిచయం వుంది కాబట్టి శంకర్ గబగబా తాను పలానా రోజు  చెన్నై వస్తున్నానని, వేరే పనులు ఏవీ పెట్టుకోవద్దని. అంతా చెప్పేసిన తరువాత అవతల నుంచి వినబడింది సన్నగా ఆవిడ ఏడుపు. ఏడుస్తూనే  చెప్పింది, వేణుగోపాల్ ఇక లేరని, ఈ తెల్లవారుజామునే  చనిపోయాడని.
శంకర్ ఒక్క మాటుగా షాక్ తిన్నాడు, తేరుకున్న తరువాత నాతొ పంచుకున్నాడు.

నిన్న వుండి ఈరోజు వుండడం జీవితం అయితే, క్షణం క్రితం వుండి మరుక్షణం లేకపోవడమే మరణం.           

మహానుభావుడితో మూడు నిమిషాలు


సన్మాన కార్యక్రమం మొదలు కావడానికి కొద్ది వ్యవధానం ఉండడంతో విశ్వనాథ్ గారితో కాసేపు ముచ్చటించే సావధానం దొరికింది.
నా రష్యా అనుభవం చెప్పాను. మాస్కోలో శంకరాభరణం సినిమా చూసిన వివరాలు చెప్పాను. చూసిన వెంటనే సంతోషం పట్టలేక మద్రాసు ఫోను చేసి జంధ్యాలను అభినందించిన సంగతి వివరించాను.
ఆయన తన సుదీర్ఘ జీవితంలో ఇటువంటి కబుర్లు ఎన్నో వినివుంటారు. నేను చెప్పింది కూడా నిర్వికారంగా విన్నారు.  మలయాళంలో ఆ సినిమా డబ్ చేసిన సంగతి గుర్తుచేసుకున్నారు.  


ఈ ఫోటో తీసిన కుర్రాడు వయసులో చాల చిన్నవాడు. వచ్చి విశ్వనాధ్ గారి కాళ్ళకు నమస్కరించి దీవించమని కోరాడు. తాను ఎడిటింగ్ ఫీల్డ్ లో వున్నానని, డైరెక్టర్  గా  పైకి రావాలని అనుకుంటున్నానని చెబుతూ, ఆయన  ఆశీర్వాదం కోరుతూ మళ్ళీ  పాదాభివందనం చేయబోయాడు. తల మీద చేయి వేస్తేనే దీవించినట్టుకాదని, మనస్సులోనే  దీవించానని కళాతపస్వి బదులిచ్చారు. ఇది చూస్తుంటే నాకు స్వాతి ముత్యం సినిమాలో ఏదో చిన్న ఉద్యోగం కోరుతూ  కమల్ హసన్ చేసిన  పాత్ర,, ఆ సన్నివేశం గుర్తుకువచ్చాయి.