15, ఏప్రిల్ 2017, శనివారం

అన్నం పెట్టే రైతుకు యెంత చేసినా తక్కువే


(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను)
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, ఆ మాటకు వస్తే జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి యేవో కనుక్కుని ప్రభుత్వాలు సకాలంలో వాళ్లకు అందిస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సాయం కూడా సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)

9, ఏప్రిల్ 2017, ఆదివారం

దుర్బలస్య బలం రాజ....

సాధారణంగా టీవీ చర్చల్లో వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవడం నాకు అలవాటు. ఈరోజు టీవీ- 5, చర్చలో చాణక్యుడు, కృష్ణ దేవరాయల ప్రసక్తి వస్తే, అచ్చం ఇలాగే కాదు కాని మొత్తం మీద నేను చెప్పిన మాటలు ఇవి. పొద్దుటి కార్యక్రమం గురించి ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయనగరం జిల్లానుంచి ఫోను చేసి బాగుందని అన్నప్పుడు ఆ విషయాలు నలుగురితో పంచుకోవాలని ఈ పోస్టు. అంతే!
‘దుర్బలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని కొన్ని పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే, ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!
‘ఎవరి పాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా అంటే సందేహమే.
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా ఆయన సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రోటోకాల్ పేచీలు


ప్రజాప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన మర్యాదలు (ప్రోటోకాల్) గురించి చర్చ జరుగుతోంది. పేరుకు ముందు గౌరవనీయులు అనే పదం విధిగా తగిలించాల్సిన వారిలో కొందరి దురుసు ప్రవర్తన కూడా పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఈ నేపధ్యంలో ఓ ముప్పయ్యేళ్ళ నాటి జ్ఞాపకం మనసులో కదలాడింది.
అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతి ఫ్లోర్ లో ఉద్యోగులకోసం క్యాంటీన్లు ఉండేవి. ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడి తమకు కావల్సినవి తెచ్చుకోవాలి. తెలుగు విభాగంలో గీర్మన్, విక్టర్ అని ఇద్దరు సహాయకులు వుండేవాళ్ళు. ఒకరోజు క్యాంటీన్  కు వెళ్లి క్యూలో వున్నప్పుడు నావెనుక ఒకాయన నిలబడ్డారు. ఆయన సోవియట్ ప్రభుత్వంలో రేడియో టెలివిజన్ వ్యవహారాలు చూసే శాఖకు మంత్రి. నేను తప్పుకుని ఆయనను ముందుకు రమ్మని మర్యాదకోసం కోరితే ఆయన మృదువుగా తిరస్కరించారు. మా లాగే మా మంత్రి కూడా క్యూలో నిలబడి డబ్బులు చెల్లించి కాఫీ తాగి  వెళ్ళిన వైనం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అలాగే,  మంత్రులు, సీనియర్ అధికారులు  ప్రభుత్వం సమకూర్చిన వాహనాల్లో వచ్చేవాళ్ళు. అయితే, ఆఫీసు గేటు ముందు తనిఖీ సిబ్బందికి తమ గుర్తింపు పత్రాలు చూపించిన తరువాతనే  లోపలకు రావడం నేను ఎన్నో సార్లు గమనించాను.
అంటే ఏమిటి? వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. మిగిలిన విషయాల్లో వాళ్ళు కూడా నలుగురితో సమానమే.

ప్రత్యేక  సదుపాయాలు, ప్రత్యేక హక్కులు వీటి నడుమ సన్నటి గీత వుంటుంది. మన దురదృష్టం. మన దేశంలో ఈ విభజన రేఖ కనబడకుండా చేశారు.  

6, ఏప్రిల్ 2017, గురువారం

వినడం ఓ సుగుణం

ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను విలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు.
కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా వినదగునెవ్వరుచెప్పినపాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.


29, మార్చి 2017, బుధవారం

కేసీఆర్ సుభాషితం


“ఇవ్వాళ  ఆంధ్రజ్యోతి చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు పండగ రోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“యెంత లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక  రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పడు సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.

ఇక ఎవరయినా చెప్పేది ఏముంటుంది?       

24, మార్చి 2017, శుక్రవారం

సంగమం

ముగ్గురు మిత్రులు – సరస్వతి రమ  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంధ్రజ్యోతి కధనం. ఇందులో ఒకరు మన ఫేస్ బుక్ మిత్రుడు వేమవరపు భీమేశ్వర రావు కాగా రెండో వ్యక్తి తుర్లపాటి వెంకట సాంబశివరావు. అతడూ ఫేస్ బుక్ లో వున్నాడు. మూడో మనిషిని నేనే కనుక నా  గురించి చెప్పక్కరలేదు. మా ఇంట్లోనే జరిగింది ఈ అపూర్వ కలయిక. కాకపొతే, 2009 డిసెంబరులో. రాసిన విలేకరి సరస్వతి రమ. దీనికి ఆవిడ పెట్టిన శీర్హిక ‘సంగమం’.
సంగమం 
ఉదయాన్నే ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న శ్రీనివాసరావు ఇంత పొద్దున్నే ఎవరబ్బాఅనుకుంటూనే ఫోను తీశాడు. శ్రీనివాసరావా!అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న గొంతు పలకరించింది. అవును. మీరు....అన్నాడు శ్రీనివాసరావు. గుర్తు పట్టు చూద్దాంఅంది అవతలి గొంతు కవ్వింపుగా. భీమేశ్వర రావు కదూ..అంటూ నలభయ్ ఏళ్ళ తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు శ్రీనివాసరావు. అప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా పిలిచి శ్రీనివాసరావు ఇంట్లో కలవాలని నిర్ణయం చేసుకున్నారు. ఓ రోజు ఉదయం కలిసారు కూడా. నలభయ్ ఏళ్ళనాటి కబుర్లు చెప్పుకుంటూ చిన్నపిల్లలై పోయిన ఆ ముగ్గుర్నీ ఓసారి పలకరిద్దాం పదండి సరస్వతి రమ
భండారు శ్రీనివాసరావు, భీమేశ్వర రావు, తుర్లపాటి సాంబశివరావు చిన్ననాటి స్నేహితులు. స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు,పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక  ఈ మధ్యనే హైదరాబాదులో కలుసుకున్నారు. నలభయ్ ఏళ్ళ తరువాత కలుసుకున్నా ఆ ముగ్గురిలో అదే స్నేహం, అదే ఆత్మీయత. చదువులు పూర్తయ్యాక, ఉద్యోగ, ఉపాధుల నిమిత్తం ఎక్కడెక్కడో సెటిల్ అయిన తరువాత కూడా ఒకరికోసం మరొకరు  ఆరా తీసుకుంటూనే వున్నారు. వీరిలో శ్రీనివాసరావు,సాంబశివ రావు బంధుత్వం రీత్యా మధ్య మధ్య కలుసుకుంటూనే వున్నా, భీమేశ్వర రావు ఆ ఇద్దర్నీ కలవడం నలభయ్ ఏళ్ళలో మొదటి సారి. అసలు వీళ్ళ కలయిక కూడా చాలా విచిత్రంగా జరిగింది.  
క్షణంలో చేరువైన నలభై ఏళ్ళ దూరం 
భీమేశ్వరరావు కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి రెండేళ్ళ క్రితం హైదరాబాదు వచ్చారు.  వచ్చినప్పటి నుంచి కూడా తన చిన్న నాటి మిత్రుల జాడకోసం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నారు. ఆయన హోమియో వైద్యం కూడా ప్రాక్టీసు చేస్తారు. తనకు పరిచయం వున్న ఒక మీడియా మిత్రుని ద్వారా భండారు శ్రీనివాసరావు ఫోను నెంబరు పట్టుకుని ఫోనుచేసారు. ఆ విధంగా ఈ ముగ్గురు బాల్య స్నేహితులు భండారు శ్రీనివాసరావు ఇంట్లో కలుసుకున్నారు.
వేయిపడగల గ్రంధం
“మా జ్ఞాపకాలను, చిన్ననాటి అనుభూతులను  నెమరు వేసుకోవడానికి ఇప్పుడు మాకు దొరికిన ఈ రిటైర్మెంట్ లైఫ్ కూడా సరిపోదేమో. మా స్నేహాన్ని, మా బాల్యాన్ని వర్ణించాలంటే వేయి పడగలంత  పెద్ద  కావ్యం అవుతుంది” అంటూ తమ చిన్ననాటి ముచ్చట్ల మూట విప్పడం మొదలెట్టారు తుర్లపాటి సాంబశివరావు.
“ముందు నుంచీ కూడా మా భీమేశ్వర రావు చాలా క్రమశిక్షణతో వుండేవాడు. వాళ్ళ నాన్నగారి నుంచి వాడికది అబ్బింది. మితభాషి కూడా. వాడిప్పుడు ఇంతలా మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు కదా! బహుశా అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు సాంబశివరావు. ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.
“కానీ మేమిద్దరం అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్ లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి  రెండుగంటలు ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో ..చాలా వేషాలు వేశాం” అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు..వాడికి రాని కళలు లేవంటే నమ్మండి. మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు వచ్చేవాడు. ప్రతిరోజూ సాయంకాలం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని గంట, గంటన్నర కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అన్నీ కూడా విజ్ఞానాన్ని పంచుకునే అంశాలే వుండేవి, మాకబుర్లలో. అల్లరికి అల్లరి, చదువుకు చదువు అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు, భీమేశ్వర రావు.
“అంతేనా ఏ మాస్టారు తగిలినా ఆ మాస్టారు  మీద కవిత్వం రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్.  అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు, లక్ష్యాలు లేవండీ బాబూ. హాయిగా తిరిగాం, తిరుగుతూ పెరిగాం.  బాల్యాన్ని చక్కగా ఆస్వాదించాం” అంటూ గత జ్ఞాపకాల మాధుర్యాన్ని చవి చూసుకుంటూ చెప్పారు భండారు శ్రీనివారావు.
ఆ రోజులింక రావు ....
“మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం ఉద్విగ్నంగానే కాదు  ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది. నాకు చదువు పూర్తయిన తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం. మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వర రావు చెబుతుంటే, “ అవునురా! ఇప్పుడున్న రామోజీ సిటీ ప్రాంతంలో రోజుకు రెండు వైపులా ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ పోలిమేరల్లోకి బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ రాడు చల్లగా ఐసు కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు వచ్చినట్టు లెక్కన్న మాట. అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు” నిట్టూర్చారు శ్రీనివాసరావు.
ఇలా ఆ మువ్వురు బాల్య స్నేహితుల తమ జ్ఞాపకాల మూటనుంచి, హైదరాబాదు మొదలుకుని ఎన్నెన్నో చిన్ననాటి ముచ్చట్లు అలా బయటకు తీస్తూనే  వున్నారు. చమత్కారాలు, జోకులు, సరదాసరదా ముచ్చట్లతో వారి సంభాషణ అనంతంగా సాగిపోతూనే వుంది.
ఆ ముగ్గురు మిత్రుల శేష జీవితం ఈ స్నేహ మాధుర్యంతో ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం.




(సరస్వతి రమ, ఫోటోలు: బిక్షం రూధర్)

  

19, మార్చి 2017, ఆదివారం

సంతకం ఖరీదు అయిదు రూపాయలు

  
ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..
అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరికలేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.        
తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.
కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.
నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.
నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.
కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.


(శ్రీ వీవీ శాస్త్రి)


తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’