3, మార్చి 2017, శుక్రవారం

ఆంధ్రరాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు




దాదాపు 64 సంవత్సరాలక్రితం  వెనుకటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి కర్నూలు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడితే, 1956 లో అవతరించిన  మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి  తెలంగాణా విడిపోవడంతో 2014 జూన్ లో రాజధాని అంటూ లేని కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్  ఊపిరి పోసుకుంది. నాటి ఆంధ్ర రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికపై ఏర్పాటుచేసిన భవనాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన శాశ్విత భవనంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు నుంచి జరగబోతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే శాసన వ్యవస్థను అక్కడికి తరలించడం ఒక శుభ పరిణామం. శాసన నిర్మాతలకు ముందస్తు  శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా కొన్ని గత కాలపు ముచ్చట్లు.
1953 అక్టోబరు ఒకటవతేదీన అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు అసెంబ్లీకి ఆంద్ర ప్రాంతం నుంచి ఎన్నికయిన 140 సభ్యులతో ఆంధ్ర రాష్ట్రం శాసన సభను ఏర్పాటు చేసారు.118 నియోజక వర్గాలనుంచి ఎన్నికయిన సభ్యులు వాళ్ళు. ఇప్పటి కాలం వారికి తెలియని మరో విషయం ఏమిటంటే  ఆ రోజుల్లో ద్విసభ్య నియోజక వర్గాలు ఉండేవి. మొత్తం  118 నియోజక వర్గాల్లో  22 ద్విసభ్య నియోజకవర్గాలు. మళ్ళీ వీటిలో  19 షెడ్యూల్డ్ కులాలకు కేటాయించగా మిగిలిన మూడు ద్విసభ్య నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసారు. 1953  నవంబరు  23 వతేదీన ఆంధ్రా అసెంబ్లీ మొదటి సమావేశం జరిగింది. ఎం.వీ.ఎల్. నరసింహారావు ప్రోటెం స్పీకర్ గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో అదే రోజున నల్లపాటి  వెంకటరామయ్యను స్పీకర్ గా, పసల సూర్యచంద్ర రావును డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే ఈ శాసన సభ పూర్తికాలం గడవకముందే  1954 నవంబరు  15 తేదీన రద్దయింది.
తరువాత  హైదరాబాదు స్టేట్  విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  నిజాం నవాబులు నిర్మించిన అపూర్వ సౌధాలు విడిదిగా మారాయి. తదనంతర కాలంలో పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా నూతన అసెంబ్లీ భవనం నిర్మించాలనే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తలంపు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాములో ఒక రూపానికి వచ్చింది. అన్ని హంగులతో నిర్మించిన  ఆ కొత్త భవనానికి నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు స్పీకర్ గా వున్నది జీ. నారాయణ రావు. కాంగ్రెస్ వ్యతిరేక విధానంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ హయాములో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధానమంత్రిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం ఒక విశేషం. రాజీవ్ గాంధి ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తున్నంత సేపు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయన పక్కనే గౌరవపురస్సరంగా నిలబడి తెలుగువారి అతిధి మర్యాదలకు కొత్త నిర్వచనం  ఇచ్చారు.


ఇప్పుడు వెలగపూడిలో నిర్మించిన అధునాతన అసెంబ్లీ భవనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు  ప్రారంభోత్సవం చేసారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఇది తొలి సోపానంగా భావించవచ్చు.
ఒక చిన్న పోలిక ఏమిటంటే నాడు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నల్లపాటి వెంకటరామయ్య, ఈనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందినవారు కావడం.
వెలగపూడిలో అసెంబ్లీ భవనం హంగులను గురించి మీడియాలో చక్కని కధనాలు వెలువడుతున్నాయి.
నూతన భవనం  ఎంతో  అందంగా అన్ని హంగులతో  వుంది సరే! మరి  అందులో కార్యకలాపాలు సొగసుగా జరగాలి కదా!
ఈ విషయంలో కూడా శాసనకర్తలు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది!        

2, మార్చి 2017, గురువారం

ఈగ పాతదే, ఈ కధా పాతదే!

ఈగఖరీదు
(రాజమౌళి ‘ఈగ’ సినిమాకు స్వర్ణ నంది పురస్కారం లభించిన సందర్భంలో మా మూవీస్ లో ఆ సినిమా వేస్తున్నారు. అది చూస్తున్నప్పుడు ఎప్పుడో 2012 లో జులై 15 వతేదీన ఆ సినిమా గురించిన ఓ జ్ఞాపకం ఇది)
No automatic alt text available.
ఈగఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది  వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.
హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన,  సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ కొత్త సినిమా ప్రేక్షక వర్గంలోచేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా  పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ఈగసినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ఈగవీక్షణానంతరం సాయివాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్  మెసేజి. ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంతఅంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను,  ఆ కార్డుకు  యాడాన్’  కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ యేమయిందంటూతన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ఇప్పుడేంచేయాలన్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు,   ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేదన్న ఈగసినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నదిఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగసినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న  తరుణంలో రాచ పీనుగ తోడు లేకుండా  కదలదుఅన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం.   తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ,  సెల్ ఫోన్లతో మరికొందరూ,  లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండిఅనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా  పాటించే పనిలో పడ్డాం.  ఆ కంగారులో యాడాన్కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం.  దరిమిలా,  ‘మూడు వర్కింగు  డేస్ నుంచి  పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామని మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
అమ్మయ్యఅని అనుకుంటున్న  సంతోషం కాస్తా కాసేపటిలోనే  ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ  లేదు, జేబులో  కార్డూ లేదుఅనే పాత  రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగసంగతేమిటంటారా!  ప్రధమ కబళే మక్షికాపాతఃఅన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ఈగను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’  సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే  రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని  ఓసారి ఈగ’  చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక  కాల్చిన బాణసంచాలో పని పూర్తయిందిఅనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)


25, ఫిబ్రవరి 2017, శనివారం

నిజాయితీకి ఇచ్చే నజరానా ఇదా? – పార్ధ సేన్ శర్మ ఐ.ఏ.ఎస్.


(ఒక ఐ.ఏ.ఎస్.అధికారి అంతరంగ ఆవిష్కరణ)
అతనొక నిఖార్సయిన అధికారి. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి. అయితే మాత్రమేం  ఒక ట్రయల్ కోర్టులో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. తప్పు లేదు, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతడి విషయం వేరు. కోర్టులో నిలబడి న్యాయమూర్తిని ఏమి కోరాడో తెలుసా?
“కోర్టు ఖర్చులు భరించగల స్థోమత లేదు, నన్ను జైలుకు పంపించండి’ అని.
అయితే ఏ దశలోనూ ఆ అధికారి మీద నేరం రుజువు కాలేదు. అంటే ఏమిటి అర్ధం? యావత్ దేశం తలవంచుకోవాల్సిన సందర్భం. అలా జరిగిందా. లేదు. ఎందుకంటే మనది మహాత్ములు పుట్టిన పుణ్యభూమి.
సీనియర్ అధికారులు, మీదు మించి సమర్ధులు, నిజాయితీపరులు ఇలా కోర్టు గుమ్మాలు ఎక్కాల్సిన స్తితి దాపురించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది ఒక చట్టం. దానిపేరు అవినీతి నిరోధక చట్టం, 1988. ఎంతో సమున్నత లక్ష్యం కలిగిన ఈ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తే అందులో దాగున్న ‘విషపు కోరలు’ కానవస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేసిస్తోంది.
ప్రభుత్వం అంటేనే పనులు చేసిపెట్టడం. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలగని పనులంటూ వుండవు. ఉదాహరణకు ఒక ఋణం మంజూరు చేసినా, భూమిని కేటాయించినా, ఒక కాంట్రాక్టు ఇచ్చినా, కొనుగోలు ఒప్పందం చేసుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా లబ్ది పొందడం ఖాయం. అలా జరగకుండా పనులు చేయాలంటే అసలు పనులనేవే జరగవు.  పాలన స్థభించి పోతుంది. ఇటువంటి సందర్భాలలో ఒక పదం వాడుతుంటారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. మరి ఇలా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ ప్రజా ప్రయోజనాలకోసమేనా అంటే అదొక సమాధానం రాని  ప్రశ్న అనడం కంటే జవాబు లేని ప్రశ్న అంటే సముచితంగా ఉంటుందేమో!
యావత్ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణం. రాజకీయ వైరుధ్యాలు, నా మాటే చెల్లుబడి కావాలనే తత్వాలు, మీడియా పరిశోధనలు, నైతికపరమైన సంశోధనలు, న్యాయపరమైన అంశాలు ఈ దారిలో ఎదురై ఒక రకమైన అపనమ్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానితో అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షకు గురవుతోంది. అంతే నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను ఆపాదించడం జరుగుతోంది. క్రికెట్ మైదానంలో నిలబడ్డ బాట్స్ మన్ ప్రతి బంతినీ సిక్స్ గా ఎందుకు మలచడం లేదు అని గేలరీలనుంచి చూస్తూ ప్రశ్నించడం తేలికే. అదే ఇరవై రెండు గజాల దూరంలో బ్రెట్ లీ బంతిని విసురుతున్నప్పుడు అది ఎంతకష్టమైన కార్యమో అర్ధం అవుతుంది.
ఇప్పుడు దేశంలోని సివిల్ సర్వీసు అధికారులు కోరుతున్నది ఒక్కటే. వారు తీసుకునే నిర్ణయం వల్ల అయాచిత ప్రయోజనం ఎవరికయినా కలిగిందని సందేహం కలిగినప్పుడు, అతడిమీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు, ఆ నిర్ణయం కారణంగా ఆ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం లభించిందని రుజువు చేయాలి. యిందుకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలి. సమర్దుడయిన, నిజాయితీ పరుడయిన అధికారి ఎవరయినా సరే తన విధులను, కర్తవ్యాలను నిర్భయంగా నిర్వహించాలంటే చట్ట సవరణ ఒక్కటే మార్గం.నిబద్దతతో వ్యవహరించే అధికారులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా చూడాలంటే ఇది తప్పనిసరి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి సభకు సమర్పించింది కూడా. సెక్షన్ పదమూడును మార్చాలని ఈ కమిటీ సూచించింది. 2013లోనే ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు దానికి మోక్షం సిద్దించలేదు.

సివిల్ సర్వీసుకు ఎన్నికయిన యువ అధికారులకు సీనియర్ అధికారులు ఒక సలహా ఇస్తుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోమనీ,  ప్రజల ప్రయోజనాలకోసం తీసుకునే ఏ నిర్ణయమైనా మంచి నిజాయితీ కలిగిన అధికారులకు ఎలాంటి హాని చేయదనీ, వారి నిబద్దతే వారిని కాపాడుతుందని. వాస్తవంగా అలా జరుగుతోందా అంటే అనుమానమే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇలా నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డ అధికారులలో ఎక్కువమంది మంచి నిజాయితీపరులు వుండడం.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

20, ఫిబ్రవరి 2017, సోమవారం

భయం లేదు! స్త్రీ జాతి సంసిద్ధమయింది!!


ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది.
‘పొద్దున్నే  హైదరాబాదు వచ్చాను. ఆర్మూరులో అంతా బాగే. అపోలోలో చిన్నక్కను చేర్పించారని బావ ఫోను చేశాడు. ఇప్పుడక్కడికే వెడుతున్నా. చూశాక ఎట్లుందీ మళ్ళీ ఫోను చేసి చెబుతా’
ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా!
ఈమధ్య ఊబెర్ లో తిరిగేటప్పుడు ఒక్కన్నీ కాకుండా వీలయినప్పుడల్లా పూల్ (షేరింగ్) పద్దతి ఎంచుకుంటున్నాను. డబ్బులు సేవ్ చేయడంకోసం కాదు. రకరకాల వ్యక్తుల్ని కలవడానికి వీలుంటుందని. కారులో వుండగా ఎవరితో మాటలు కలపను.  డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని మనుషుల్ని చదివే ప్రయత్నం చేస్తుంటాను. పుటకలతో పుట్టిన బుద్ది కదా!
అలాగే, ఈరోజు ఊబెర్ ఎక్కాను. వెనక సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. ఎవరో ఫోను చేస్తే ఆ అమ్మాయి అంటున్న మాటలు ఇవి. నిజానికి నేను విన్నవి కావు, వినపడ్డవి.
ఊరు నుంచి పట్నం వచ్చింది. నిర్భయంగా ఊబెర్ టాక్సీ పిలుచుకుంది. డేరింగుగా షేరింగు పద్దతి ఎంచుకుంది. ఆసుపత్రిలో వున్న అక్కను పరామర్శించడానికి వెడుతోంది.
ఈ దేశానికి ఇంతకంటే ఏం కావాలి?
చాలా సంతోషం అనిపించింది. 

18, ఫిబ్రవరి 2017, శనివారం

కళ్ళల్లో నీళ్లె౦దుకు వున్నాయి? ఇందుకే కాబోలు


చాలా కాలంనాటి ముచ్చట 
ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఓ స్టార్ హోటల్ కి వెళ్లాను. తిరిగొస్తుంటే జంధ్యాల, శంకరాభరణం శంకర శాస్త్రిగా ప్రసి ద్దులయిన సోమయాజులు గారు, ఒక జిల్లా పోలీసు సూపరింటెండె౦ట్, (ఇప్పుడాయన అడిషినల్ డీజీ రాంక్ కాబోలు) ఒక చోట కూర్చుని కాలక్షేపం చేస్తూ కనబడ్డారు.  నన్ను చూసి రమ్మంటే వెళ్లాను. ఆ కబుర్లలో కాలం తెలియలేదు. బాగా పొద్దుపోయింది. ఇక సర్వ్ చేసే టైం అయిపోయిందన్నాడు సర్వేశ్వరుడు. ‘మరి ఎలా’ అన్నాడు జంధ్యాల. ‘ఇలా’ అన్నాను నేను. పొలోమంటూ అందరం అర్ధరాత్రి దాటిన తర్వాత మా ఇంటికి చేరాము. చేరి మేము మా పని పూర్తి చేస్తుంటే మా ఆవిడ తన పని పూర్తిచేసి అందరికీ వేడి వేడిగా వడ్డించింది. పెద్దాయన సోమయాజులుగారు భోజనం అయిన తరువాత చేతులు కడుక్కుని  ‘అన్నదాతా సుఖీభవ’ అని మా ఆవిడను మనసారా  దీవించారు.
సుఖపడ్డది ఏమో కానీ ఇన్నేళ్ళ జీవితంలో ఇలాంటి దీవెనలు పుష్కలంగానే దొరికాయి మా ఆవిడకు.
మొన్నొక రోజు ఒక సాయంకాలక్షేప సమావేశంలో ఒకాయన కలిసారు. అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో వున్నారు. ‘నేను మీకు  తెలవదు కానీ, ఆంటీ తెలుసు, అర్ధరాత్రివేళ మీ మేనల్లుడు వెంకన్నతో  కలిసి మీ ఇంటికి వచ్చేవాడిని. ఎక్కడ దొరక్కపోయినా మా అత్తయ్య ఇంట్లో భోజనం ఖచ్చితంగా వుంటుంది. లేకపోతే నిమిషాల్లో వండి పెడుతుందని వాడు ధీమాగా చెప్పి మీ ఇంటికి తీసుకువచ్చే వాడు. ఆ ఆప్యాయత  ఎలా మరిచిపోగలం చెప్పండి. ఆంటీ ఎలా వున్నారని అడిగారు.

ఏం చెప్పాలో తోచలేదు. కానీ కళ్ళల్లో తడి తెలుస్తూనే వుంది.

16, ఫిబ్రవరి 2017, గురువారం

విశిష్ట గుణాల సమాహారం కేసీఆర్ - భండారు శ్రీనివాసరావు

(ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని)
(PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TODAY, 16-0202017, THURSDAY)
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత  తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా  లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి.
బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు  ఉపయోగపడుతున్నాయి.
ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేకున్నప్పుడు ఊహించని వ్యక్తి నుంచి  ఆయనకు దక్కిన  ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  
డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు ఒక్కరే కాదు, హైదరాబాదు వాసులందరూ ఇదే అభిప్రాయంతో వున్నారు. కారణం ఏమిటంటేఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్నట్టు వుండే కరెంటు సరఫరా గురించి వారు పెంచుకున్న ఆందోళన అనతికాలంలోనే  దూది పింజలా ఎగిరిపోయింది.  అయితే ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది  సమష్టి కృషి వల్లనే ఈ అద్భుతం’  సాధ్యం అయిందని పలుమార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. పరిపాలనలో   ‘నేనుఅని కాకుండా మేముఅనే పదాన్ని మించిన  మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ  విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండా పోయాయి. 
 అలాగే, బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతం అయివున్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్  అప్పచెప్పేసారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. ఆన్నింటా తానయి, అన్నిట్లో వేలు దూర్చడం కాకుండా దశ, దిశలను నిర్దేశించడం వరకే తన పాత్రను పరిమితం చేసుకుని ఫలితాలు సాధించే పనిని ఎంచుకున్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇందుకు ఉదాహరణలు. ఇతర పరిపాలకులకు కూడా కేసీఆర్ చూపిన ఈ  బాట అనుసరణీయం.  తను బీపీ తెచ్చుకోకుండా, పనిచేయించేవారికి బీపీ తెప్పించకుండా పనులు జరిగేలా చూడడం వల్లనే రాష్ట్రంలో పరిపాలన నల్లేరు మీది బండిలా హాయిగా సాగిపోతోందనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడడానికి కారణం ఇదే.
అనర్ఘలంగా ప్రసంగించేవారు రాజకీయుల్లో  చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా వున్నశ్రోతలను బట్టి ఆయన ప్రసంగ శైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ఉపన్యాస ధోరణి మారిపోతుంది. వారి వారి  అభిరుచులు,ఇష్టాఇష్టాలను గమనిస్తూ సంభాషణ కానీ ప్రసంగం కానీ కొనసాగించడం ఆయన ప్రత్యేకత. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే వుండదు. అదే కాగితాలు చూస్తూ చదివితే పేలవంగా వున్నట్టనిపిస్తుంది. ఈ విషయం ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా చెప్పారు. కాగితం చూస్తూ చదవడం తనకు ఇష్టం ఉండదని, అయినా కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పడం లేదని ఆయనే చెప్పారు. భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు ఓ అలవాటని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. స్వతహాగా  భోజన ప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ వుండడం ఆయనకు  అలవాటని కూడా చెబుతుంటారు. నాతొ సహా హైదరాబాదులోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే. అంతే కాదు, దేశంలో ఏ ప్రాంతంలో ఏ వంటకాలు ప్రాచుర్యం పొందాయన్నది ఆయనకు కరతలామలకం. రాష్ట్ర విభజన తరువాత ఒకసారి బెజవాడ వెళ్ళిన కేసీఆర్  కు, అయన పరివారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు భోజనం ఏర్పాటు చేసారు. పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల ప్రత్యేకతలు అయిన పిండి వంటలు, ఇతర వంటకాలను కేసీఆర్ ఆ విందు సందర్భంగా సవివరంగా ప్రస్తావించారు. మా ప్రాంతపు వంటకాల గురించి మాకే ఇంతగా తెలియదు, ఆయన ఎప్పుడు ఇంత అధ్యయనం చేశారని ఆశ్చర్య పోవడం ఆంధ్రప్రాంతం మంత్రుల వంతయిందని మరునాడు పత్రికలు రాసాయి. అలాగే వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాల పట్ల కూడా ఆయనకున్న  అవగాహన అపరిమితం.
ఆయన దురదృష్టం ఏమిటంటే, కేసీఆర్ గురించి కొన్ని వర్గాల్లో ఒక అపోహ ఇప్పటికీ  వుంది, ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన, తన ప్రాంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని. అంతవరకయితే పరవాలేదు. కానీ ఆయన్ని ఒక కరడు కట్టిన ప్రాంతీయ వాదిగా ముద్రవేసే ప్రయత్నం కూడా జరుగుతోందనేది కూడా వాస్తవం. కేసీఆర్  ప్రాంతీయవాది కావచ్చేమో కాని ప్రాంతీయ తత్వం మాత్రం ఆయన రక్తంలో లేదనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.
సినీ నటుడు బాలకృష్ణ ఒకసారి ఓ పనిమీద తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని కలుసుకుని ఒక వినతి పత్రం అందచేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన శాసనసభ్యుడు. పైగా టీ.ఆర్.ఎస్. ప్రధాన రాజకీయ  ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నది హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో, ఆ హాస్పిటల్ కు సంబంధించిన ఒక వ్యవహారంలో. అయినా కేసీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులకు తదనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ గారు అడిగింది  ఆయన స్టూడియోకో, లేదా వ్యాపార వాణిజ్య అంశానికి సంబంధించిన విషయమో కాదు, ప్రజలకు ఉపయోగపడుతున్న దవాఖానా గురించి. అలాంటప్పుడు ఆలోచించాల్సింది ఏమిటన్నదికేసీఆర్ ప్రశ్న. అందుకే ఆయన ఏమాత్రం సంకోచించకుండా స్పందించారు. అటువంటి విషయాల్లో ప్రాంతీయ తత్వం పనికి రాదన్నది కేసీఆర్ సిద్ధాంతం.
రాజనేవాడికి స్పందించే గుణం వుండాలని కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దిన పత్రికలు చదవడం ఎన్నో ఏళ్ళుగా ఆయనకు వున్న అలవాటు.  పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి వున్నట్టే కేసీఆర్ కి కూడా వుంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. చదివిన తరువాత ఆయా విషయాల మీద ఆయన తక్షణం స్పందించే తీరు కొన్ని సందర్భాలలో కొందరు అశక్తుల విషయంలో వరంగా మారుతోంది. అలా అయాచితంగా లబ్దిపొందిన కుటుంబాల్లో మాదీ ఒకటి.
మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద వరుసగా  పీ ఆర్ ఓ గా (చెన్నా టు అన్నా, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు) పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్చంద పదవీవిరమణ చేసారు. ఉన్నతోద్యోగాలు చేసి కూడా  ఒక సొంత గూడంటూ ఏర్పాటు చేసుకోలేని స్తితిలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కొన్ని వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన పెన్షన్ మొత్తాన్ని అమ్ముకున్న ఫలితంగా మా ఒదినె సరోజిని గారికి కుటుంబ పెన్షన్ పదేళ్లుగా రాని పరిస్తితి. విన్నపాలు, వినతి పత్రాలు మినహా కోర్టు గుమ్మం తట్టకూడదనే  సంస్కారం కలిగిన కుటుంబం. ఈలోగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సాయం చేయాలని వారికి  మనసులో యెంతగా  వున్నా, నిబంధనల కారణంగా  ఏమీ చేయలేని స్తితి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ కు వున్న పత్రికలు చదివే అలవాటు దాదాపు మూసివేసిన  ఈ ఫైలుకు మళ్ళీ ప్రాణం పోసింది. మా అన్నగారి వర్ధంతిని పురస్కరించుకుని మిత్రుడు  జ్వాలా నరసింహారావు ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసంలో ఈ పెన్షన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో దాగున్న  మానవతా కోణం ఒక్కటేముఖ్యమంత్రి కేసీఆర్  కంటికి కనిపించింది. అంతే! ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్న ఆ డెబ్బయి ఎనిమిదేళ్ళ  వృద్దురాలికి నిబంధనలు సడలించి  పెద్దమనసుతో ఆయన పెన్షన్ మంజూరు చేశారు. శతమానం భవతి అని కేసీఆర్ ని మనసారా  ఆశీర్వదించడం  ఒక్కటే కృతజ్ఞతలు తెలపడానికి  ఆమెకు మిగిలిన దారి. ఇక ఈ క్రమంలో సహకరించిన ఆంధ్రజ్యోతితో సహా అందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. (15-02-2017)


(Courtesy, Editor, Andhra Jyothy)

రచయిత మొబైల్: 9849130595 ఈ మెయిల్:  bhandarusr@gmail.com  


15, ఫిబ్రవరి 2017, బుధవారం

జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు



1987, మార్చి నెల  
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు  రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.  
అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా వున్నసమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.
రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.
అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.
అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.
నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు  వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.