1, జూన్ 2016, బుధవారం

చంద్రబాబు రెండేళ్ళ పాలన చూసి గర్వపడాలా! జాలిపడాలా!


సూటిగా.....సుతిమెత్తగా..... భండారు శ్రీనివాసరావు
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 02-06-2016, THURSDAY)

“కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది”
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పదమూడు జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రాన్ని పాలించడం నిజానికి ఒక లెక్కలోనిది కాదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్తితుల్లో గణనీయమయిన మార్పులు చోటుచేసుకున్నాయి. 
ఒకప్పుడు ఆయన నోటి మాట ఢిల్లీ పెద్దలకు శిరోధార్యం. కంటి చూపుతో శాసించడం అంటే ఏమిటో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలిని దగ్గరనుంచి చూసిన నా బోటి విలేకరులకు చాలామందికి తెలుసు. ఒక సందర్భంలో నేనే ప్రత్యక్ష సాక్షిని.
ఆ రోజుల్లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో పనిచేస్తున్న న్యూస్ ఎడిటర్ బదిలీ అయ్యారు. దాన్ని రద్దు చేయించడం అంత  ఆషామాషీ  వ్యవహారం కాదు.  ఆ  స్థాయి పోస్ట్ అప్పుడు హైదరాబాదులో లేదు. అంచేత ఆ అధికారిని పోస్ట్ తో సహా ఢిల్లీ బదిలీ చేశారు.
విషయం ముఖ్యమంత్రి చెవిలో వేశాము. ఆ రోజు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఇబ్రహీం హైదరాబాదులోనే వున్నారు. పౌర విమాన శాఖను కూడా ఆయనే  చూస్తున్నారు. అదే రోజు హైదరాబాదులోని బేగం పేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని తోడ్కొని పోవడానికి కేంద్ర మంత్రి సచివాలయానికి వచ్చారు. ఆ హడావిడిలో, రామాయణంలో పిడకల వేటలా  ఈ బదిలీ వ్యవహారం. ముఖ్యమంత్రీ, కేంద్ర మంత్రీ  ఇద్దరూ కలసి ఒకే కారులో ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ జరిగిన సభలో   కేంద్రమంత్రి  ప్రసంగిస్తూ మధ్యలో ఒక అప్రస్తుత ప్రస్తావన చేసారు. అదే ఇందులో కొసమెరుపు.
“ఇక్కడికి వస్తున్నప్పుడు దోవలో  మీ ముఖ్యమంత్రి నాయుడు గారు చెప్పారు,  హైదరాబాదు ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్ బదిలీ ఆపుచేయమని. ఇక్కడే  చెబుతున్నాను. నాయుడు గారు అడగడం, మేం కాదనడం అనేది వుండదు. ఆ బదిలీని  నిలిపివేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళగానే ముందు ఆ ఆర్డర్లు పంపిస్తాను”
ఆయన అన్నట్టే బదిలీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ముందు ఫోనులో, తరువాత ఫాక్స్  లో వచ్చాయి.
ఆ రోజుల్లో చంద్రబాబు పవర్ కు ఇది ఓ చిన్ని ఉదాహరణ మాత్రమే.
ఢిల్లీ వెళ్ళకుండానే ఫోనులోనే రాష్ట్రానికి సంబంధించిన అనేక వ్యవహారాలు చంద్రబాబునాయుడు చక్కబెట్టేవారు. అత్యంత  సమర్ధుడు అన్న కితాబు లభించింది ఇదిగో ఇలాంటి సందర్బాలలోనే.
అలా  ఆ రోజుల్లో చంద్రబాబును చూస్తూ గర్వపడిన తెలుగు జనులు అదే చంద్రబాబును చూస్తూ ఇప్పుడు జాలిపడాల్సి వస్తోంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,  'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్రాన్ని తాను  కోరుకున్న విధంగా అభివృద్ధి చేయడానికి కానీ,  అవసరమైనవి ఏవీ  ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరుఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో తాను  కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. ‘అది నిజం  కాదు,  దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు కనబడడం లేదా’ అని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ఇంతవరకు ఇచ్చినదెంత, ఖర్చు పెట్టినదెంత అని లెక్కలు అడిగేవరకూ పోతోంది మిత్ర పక్షాల నడుమ స్నేహం.
రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు  సీమాంధ్రలో నడుస్తోంది.
రాజధాని, ప్రత్యేక హోదా ఈ రెండూ ఒకరకంగా టీడీపీకి ప్రజల్లో సానుభూతి కలిగించే అంశాలే. కానీ కొన్ని స్వయంకృతాపరాధాలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. గతంలో ఆ పార్టీ నాయకులు చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే ఇందుకు కారణం అవుతున్నాయి.  
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని  చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని మనిషిలా అలా  తిరుగుతూనే వుండడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని, ఒక సచివాలయం అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.  గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ తయారు.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది.  వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి  లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.  
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు చెప్పింది సావధానంగా  వినేవారు. కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన  గదిలో ప్రవేశించగానే కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని  కూర్చోమని తాను  నిలబడే  మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన పని క్లుప్తంగా చెప్పుకుని  బయటపడేవాళ్ళు.  దొరికిందే తడవుగా కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
చంద్రబాబు పర్యటనలలో కూడా ఈ ఉద్దేశ్యం వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం. 
అలాంటి మనిషి ఈ నాడు చేస్తున్న పాలన చూస్తుంటే బాధతో కూడిన జాలి వేస్తోంది. చేతల మనిషి అనిపించుకున్న వ్యక్తి మాటల మనిషిగా మిగిలిపోతున్నారేమో అనికూడా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు.
రెండేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ఆయన ఎప్పుడూ చెబుతుంటారు, సమస్యలను అవకాశాలుగా మార్చుకుని విజయపధంలో సాగిపోతుంటానని. 
అప్పటి చంద్రబాబును ఇప్పటి చంద్రబాబుతో పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో కొట్టవచ్చినట్టు ఓ మార్పు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు అయన ఫక్తు రాజకీయ నాయకుడు. తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేతిలో తీసుకున్నతొలినాళ్లలో ఆయనలో ఒక అభద్రతా భావం వుండేది. మేరునగధీరుడయిన రామారావుని  ఎదుర్కోవడం ఎలా అని. దానికి అయన కనుగొన్న మార్గం పాలన విధానంలో కొత్తదనంతో కూడిన  మార్పులు. ఆకస్మిక  తనిఖీలు, విస్తృత పర్యటనలు, రేడియో, టీవీల్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమాలు  అవన్నీ అందులో భాగం అనుకోవచ్చు.  ఎన్టీఆర్  ఆకస్మిక మరణంతో రాజకీయంగా ఎదురులేకుండా పోయింది. దానితో పాలనపై దృష్టి పెట్టి  వినూత్న పధకాలతో ముందుకు సాగారు. పార్టీకి, ప్రభుత్వానికీ ఆయనే కర్తా, కర్మా,  క్రియా కావడం కూడా అనుకున్నవి అనుకున్నట్టు చేయగల సావకాశం కలగచేసాయి. దానికి తోడు అప్పుడే రంగప్రవేశం చేసిన ఆర్ధిక సంస్కరణలను, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆదర్శ  ముఖ్యమంత్రి అనే కితాబును జేబులో వేసుకున్నారు. అప్పుడప్పుడే  కళ్ళు తెరుస్తున్న  ప్రైవేటు మీడియా  ప్రభావం కూడా ఆయన ప్రాభవానికి మెరుగులు అద్దింది.
ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో  ఆయనే సీనియర్. ఇంత  అనుభవం వుండి కూడా, ప్రజానీకానికి  సంబంధించిన  కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా  ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు, తాను మారానని, మారిన మనిషిని అని.
నిజంగానే మారారు. మారిన రాజకీయ పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. గత ఎన్నికల్లో చేజారినది అనుకున్న అధికారం చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా  చూసుకోవాలి.
ఆయన అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో చంద్రబాబులో ఒక  పరిణతి  చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు.        
‘చేస్తున్నాం, చేస్తాం అనే దగ్గరే ఆగిపోతున్నారు, రెండేళ్లుగా చేసి చూపించింది ఏమీ లేదు, రాజకీయం తప్ప’ అని నిజాయితీగా చెప్పేవాళ్ళలో కూడా  ప్రతిపక్షాల నీడలు కనబడితే ఇక చేసేదేమీ లేదు, చెప్పేదేమీ వుండదు.
రెండేళ్ళే గడిచాయి. ఇంకా మూడేళ్ళు వుంది. దిద్దుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ సరిపడిన వ్యవధానం మిగిలే వుంది.
ఉపశృతి:
ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు వుంటారు. వారికి తమ నాయకుడు ఏం చెప్పినా వేదం. ఏం చేసినా మోదం. అలాగే జనంలో ఆ పార్టీకి వుండే అభిమానులు. వాళ్ళూ డిటో. అంచేత ఏం చేసినా, ఏం మాట్లాడినా ఈ రెండు వర్గాలవారితో ఎలాంటి పేచీ లేదు.
అలాగే ఇతర పార్టీలకి కార్యకర్తలు, అభిమానులు, అనుయాయులు వుంటారు. వారికీ, వీరికీ చుక్కెదురు. ఒకరిది మరొకరికి నచ్చదు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు.
వీళ్ళే కాదు, ప్రజలనేవాళ్ళు కూడా వుంటారు.  వీరికి ఏ పార్టీతోను సంబంధంవుండదు. అంశాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీల పట్ల వీరి అభిప్రాయాలు, అభిమానాలు అప్పటికప్పుడు  చిత్రంగా మారిపోతుంటాయి. ఒకరకంగా ఎన్నికల సమయంలో వీరిది రుక్మిణి చేతిలోని తులసీదళం పాత్ర.  అది ఎటు మొగ్గితే, కాటా అటు మొగ్గే అవకాశాలు హెచ్చు. 
అయితే వీరితో ఓ సులువు లేకపోలేదు. ఎన్నికల ఘడియ వచ్చేవరకు  ఏ పార్టీకి వీళ్ళతో నిమిత్తం వుండదు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

30, మే 2016, సోమవారం

ఇదో తుత్తి


567890
అక్షరాల్లో అయిదు లక్షల అరవై ఏడువేల ఎనిమిది వందల తొంభయ్.
5 6 7 8 9 0 వరసగా వచ్చాయి కాబట్టి, అదీ నేటికి దాటిన నా ఈ బ్లాగు విజిటర్ల సంఖ్య కాబట్టి.

అదో తుత్తి!

ప్రత్యామ్నాయం లేని ప్రజానాయకుడు కేసీఆర్

సూటిగా....సుతిమెత్తగా..........
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)  

తెలంగాణా వచ్చేసింది. వచ్చి కూడా  రెండేళ్ళయింది. కొన్ని దశాబ్దాలుగా  ఈ ప్రాంతం ప్రజలు అవిశ్రాంతంగా కంటున్న స్వప్నం నెరవేరింది. ఈ నిజం  నీటి మీది రాత కాదు, రాతి మీది గీత. చెరపడం అసాధ్యం. చెరపాలనే ఆలోచన అవివేకం.
రెండు సంవత్సరాల క్రితం, 2014 జూన్ రెండో తేదీన, భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణాకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజల నమ్మకాలు విచిత్రంగా వుంటాయి. ప్రత్యేక తెలంగాణా సాధన ఖ్యాతిని ఏపార్టీకి ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని చూసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వల్లనే కొత్త రాష్ట్రం సాధ్యపడిందని బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకమే ఆయన బలం. ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించే ఆయన పని తీరుకు ప్రజల్లో వున్న ఈ నమ్మకమే ఊపిరి పోసింది.
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.  
అరకొర మెజారిటీతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు౦టుంది అని కొందరు మొదట్లోనే మెటికలు విరిచారు. తెలంగాణా వాదం కొడిగడుతూ వుండడం వల్లనే, రెండేళ్ళ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయని లెక్కలు కూడా వేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో   చోటుచేసుకున్న  ‘నాదెండ్ల టైపు’ తిరుగుబాటు టీఆర్ఎస్ లో కూడా తప్పదని ఊహాగానాలు చేశారు. తెలంగాణా ఏర్పడిన జూన్ రెండో తేదీకి పూర్వమే, విడిపోయిన రెండు జర్మనీలు తిరిగి ఏకం అయిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, కొత్త రాష్ట్రానికి పురిట్లోనే సంధి కొడుతుందన్నతీరులో, సంధి ప్రేలాపనలు చేసి, ఆ ప్రాంతపు ప్రజల్లో లేనిపోని అనుమానాలు రగిలించే ప్రయత్నాలు కూడా  చేశారు.
ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు, కాబట్టి వాటిల్లో వాస్తవం కంటే రాజకీయం పాలు కాస్త ఎక్కువ వుండే అవకాశం హెచ్చు.
మరోపక్క ఆర్ధిక నిపుణులు తెలంగాణా రాష్ట్రం ఎదుర్కోబోయే బాలారిష్టాలు గురించి అనుమానాలు వ్యక్తం చేసారు. నవజాత  రాష్ట్రంలో, ‘కారు’ చీకట్లు కమ్ముకుంటాయన్నారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం ఇక్కట్లపాలవుతుందన్నారు. హైదరాబాదులో వున్న ప్రముఖ కంప్యూటర్ సంస్థలు బిచాణా ఎత్తేసి బెంగుళూరో, మరో వూరో తరలి వెడతాయని జోస్యం చెప్పారు.
అసలు అన్నింటికీ మించి మరో భయం పెట్టారు. హైదరాబాదులో ఏళ్ళతరబడి నివాసం వుంటున్న సీమాంధ్ర ప్రజానీకం దిక్కుతోచని స్తితిలో, బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో రోజులు లెక్కించే పరిస్తితి ఏర్పడగలదని లెక్కలు వేసారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త రోజుల్లో తీసుకున్న సర్వజనుల సర్వే వంటి సరికొత్త నిర్ణయాలను తమ వాదాలకు మద్దతుగా ఉదహరించారు.
ఇలా లేనిపోని అనేక అనుమానాలతో  నూర్రోజులు గడిచాయి. రాను రాను, పోను పోను ఆ సందేహాల్లో సాంద్రత తగ్గింది.
ఏడాది తిరిగిపోయింది. అన్ని  అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సందేహాలు తొలగిపోయి, కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది.
ఏడాది గడిచినప్పుడు కేసీఆర్ పాలనకు లభించిన  ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు ఏమిటి? ఇప్పుడు  చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
చూస్తుండగానే మరో రెండేళ్ళ కాలం గడిచింది.
బాలారిష్టాల దశ దాటి, బాల తెలంగాణా బలం పుంజుకుంటోంది. బుడిబుడి అడుగులు వేస్తోంది.
రెండేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకానేక మాటలు చెప్పారు. మాటలు చెప్పడం ఆయనకు కొత్త కాదు. ఉద్యమ కాలంలో  పోరాటానికి ఊపిరిలూదింది కూడా ఆయన ఆ మాటలతోనే. జనాలను సమ్మోహితుల్ని చేసి ఆ మాటల మత్తులో కూరుకుపోయేలా చేయగల వాక్చాతుర్యం కలిగిన ఏకైక నాయకుడాయన.
గత రెండేళ్ళ కాలంలో కేసీఆర్ నోటివెంట అనేక మాటలు వర్ష రుతువులో వానచినుకుల్లా అనేక సందర్భాల్లో రాలిపడ్డాయి.
ఆకాశ హర్మ్యాలుఆరు లేన్ల రహదారులుహరితహారాలు, ప్రతి గృహానికి  నల్లా నీళ్ళుప్రతి పొలానికీ సాగు నీళ్ళుకనురెప్పపాటు కూడా పోని  కరెంటుగొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి రెండు పడకల చిన్నారి  లోగిళ్ళుచదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువుచదువయిన వారికి వెంటనే కొలువుచదువంటని వారికి తగిన ఉపాధిఆడపడుచులకు కళ్యాణలక్ష్మి , తెలంగాణలో ప్రతి బీడు పొలాన్ని కృష్ణా, గోదావరి జలాలు  తడిపేలా సాగు నీటి ప్రాజెక్టుల రీ డిజైనింగు,  .......ఒకటా రెండాఇవన్నీ చదువుతున్నప్పుడువీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవారావాఅనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా? 
తెలంగాణా ప్రజల్లో అత్యధికులు ఆయన మాటల్ని  ఇప్పటికీ విశ్వసిస్తారు. ఇక ముందు కూడా నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్  తెలంగాణాను నమ్ముకున్నారు. తెలంగాణా  ఆయన్ని నమ్ముకుంది. ఆయన్ని కాక వేరెవర్నయినా నమ్మితే  ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న సంశయాన్ని వారిలో రగిలించడంలో కేసీఆర్ పూర్తిగా కృతకృత్యులయ్యారు. ఆయనపై పెంచుకున్న ఆ నమ్మకంతోనే వాళ్ళు ఆయన్ని నేటికీ నమ్ముతున్నారు. ఆ కారణంగానే ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాలకు ఎదురులేకుండా పోతోంది. ఆకర్ష్ అనండి, మరోటి అనండి, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకుంటున్న విధానాన్ని ప్రజాస్వామ్య ప్రియులు హర్షించక పోయినా, మరోపక్క  సామాన్య తెలంగాణా జనాలు మాత్రం ఆయనకు, ఆయన పార్టీకి  ప్రతిఎన్నికల్లో నీరాజనాలు పడుతుండడానికి ఈ ‘నమ్మకమే’ కారణం. నిజానికి  రాజకీయాల్లో పనితీరుకు  నిఖార్సయిన నిదర్శనం ఎన్నికల్లో సాధించే విజయాలే.
బంగారు తెలంగాణా సాధన కోసం అందర్నీ కలుపుకు పోవడం అంటే ఇతర పార్టీల వారిని తమ పార్టీలో కలుపుకోవడం కాదనే విమర్శలు లేకపోలేదు. ప్రజాతీర్పు అనుకూలంగా వున్నంతకాలం  ఏ విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదన్నది నేటి రాజకీయాల్లో కొత్త థియరీ. దీనిప్రకారం,  ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని అంచనావేయడానికి విజయాన్ని మించిన గీటు రాయి లేదు.  ఈ విషయంలో ఇంతవరకు టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత అదృష్టవంతులనే చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత  తెలంగాణాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ తన విజయాలను మరింత మెరుగుపరుచుకుంటూ వస్తోంది.  

 
పన్నెండేళ్ళ పైచిలుకు సాగిన ఉద్యమ కాలంలో కేసీఆర్ పలవరించినా, కలవరించినా తెలంగాణా గురించే. అధికారంలో లేనప్పుడు అదే ధ్యాస, వున్నప్పుడు అదే ధ్యాస. తెలంగాణాలో అణువణువూ ఆయనకు కొట్టిన పిండి. గూగుల్  పరిజ్ఞానంతో దానికి మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా సేద్యపు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్  ఇచ్చిన  పవర్  పాయింట్  ప్రజెంటేషన్  దీనికి  తార్కాణం. అలాగే, ఎక్కడ ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తెలంగాణాకు ముడిపెట్టి  మాట్లాడ్డం  ఆయనకు అలవాటు. కొందరికి  అది  మొండితనం అనిపించి వుంటుంది, కానీ ఆయన లెక్కచేసేరకం కాదు. ఈ లెక్కలేనితనమే ఒకరకంగా ఆయనకు తెలంగాణా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. తెలంగాణా యాసలో అలవోకగా ప్రసంగించే చాతుర్యం అందరినీ కట్టిపడేసింది. రాజకీయ శత్రువులు సయితం మెచ్చుకునే ఆయనలోని  లక్షణం ఇదే.
మరి ఇలా మాటలతోనే సరా, జనాలు సరిపెట్టుకుంటారా  అంటే యెంత మాత్రంకాదని ఘంటాపదంగా చెప్పొచ్చు.  అయితే, చేసింది ఎలా చేశాము, చేయలేనిది ఎందుకు చేయలేకపోయాము, లేదా ఎందుకు చేయలేము అనే విషయాలు నిర్భయంగా, నిబద్ధతతో చెప్పగలిగే నాయకులను ప్రతిపక్షాలు తప్పుపడతాయేమో, కానీ సామాన్య జనం చక్కగా అర్ధం  చేసుకుంటారు.    
నిజమే! ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే రెండేళ్ళ  పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం మూడేళ్ళే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! 
కలలు కనమని కలాం చెప్పారు. ఆ  కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేయాలని కూడా చెప్పారు. అదే జరగాలి ఇప్పుడు. కేసీఆర్ తన ప్రతి మాటా ఆచరణలోకి వచ్చే విధంగా చర్యలు మొదలు పెట్టాలి. ఇంకా మూడేళ్ళ వ్యవధానం లెక్కకు మాత్రమే మిగిలివుంది. వాస్తవంగా వుంది రెండేళ్ళ లోపే.      
కోటి ఆశల నేపధ్యంలో, శతకోటి అనుమానాల నీలి నీడల్లో కొత్త రాష్ట్రం తెలంగాణా ఏర్పడింది. ఈ రెండేళ్లలో అనుమానాలు   తీరిపోయాయి. మరి ప్రజల  ఆశల సంగతి?
రెండేళ్ళ పసికందు తెలంగాణా రాష్ట్రాన్ని చేతుల్లో పట్టుకుని, కనుపాప మాదిరిగా  పెంచుతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎదుట నిలిచిన ప్రశ్న ఇది. ఆయన మాత్రమే జవాబు చెప్పగలిగిన ప్రశ్న కూడా.
తెలంగాణా భవిష్యత్తు గురించిన పూర్తి బాధ్యత ఆయనదే. దానిపైనే ఆయన పార్టీ భవితవ్యం కూడా ఆధారపడివుంటుంది. 
ఉపశ్రుతి:
కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ
ఇది జరిగి దాదాపు  మూడేళ్ళు.
2013 జులై 30 వ తేదీన ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఆ ఘడియ కోసం ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధి లేకుండాపోయింది.
ఆగస్టు నాలుగో తేదీన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు హైదరాబాదులో ఏర్పాటయిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే  భరించడం కాస్త  కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు బెజవాడ నుంచి  ఎస్.ఎం.ఎస్. పంపారు. ఆయన ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని తాత్పర్యం.
‘భద్రాచలం సంగతేమిటి’ అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని కేసీఆర్  వివరించారు.
కొన్నాళ్ళు బ్రిటిష్ అంధ్రాలో  వున్న భద్రాచలం, అంతకు  పూర్వం తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


  

28, మే 2016, శనివారం

ఎక్కివచ్చిన మెట్లు


నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లి లోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద  సిటీ బస్  స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా  రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ వెళ్ళాలంటే  రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు అర్ధం కాలేదు.  రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో  ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్  నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది.  హెల్మెట్  ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
ఇప్పుడు పిల్లల పుణ్యమా అని కారు యోగం. ఈ దశలో, అదేమిటో కారు ఆసాముల కష్టాలమీదనే నా ధ్యాస.


జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడి గానో ఎక్కుతుంటాం.
మరి అదేమి  చిత్రమో, చూపు ఎక్కేపై మెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.    

  
NOTE: COURTESY IMAGE OWNER  

నారద శాంతి


కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు, వాషింగ్టన్ స్టేట్ లో సియాటిల్ కు దగ్గరలో వున్న మౌంట్  రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్లాం. మధ్య దారిలో, కొండ సానువుల్లో ‘నారద జలపాతాన్ని’ మా కుమారుడు చూపించాడు. ‘నారద ఫాల్స్’ అని రాసి వున్న ఆ ప్రాంతంలో ఒక కొండ పై నుంచి ఈ జలపాతం ధారలుగా దుముకుతోంది. నారదమహర్షి త్రిలోక సంచారి. కాబట్టి ఆ దేశంలో కూడా అడుగుపెట్టాడేమో తెలియదు.


(అమెరికాలో నారద జలపాతం)

తగవులమారి అనే పేరుపడ్డప్పటికీ నిజానికి నారదుడు శాంతి కాముకుడు.
కాబట్టే, నారద జయంతిని పత్రికా దినోత్సవంగా పాటించి  ఆ  సందర్భంగా కొందరు జర్నలిష్టులను సత్కరించాలన్న సత్సంకల్పం ‘సమాచార భారతి’ అనే సంస్థకు కలిగింది. నారదుడి మాదిరిగానే విలేకరులు కూడా నిత్య సంచారులే. కాబట్టి జర్నలిష్టులను  సన్మానించాలనే ఆలోచన చేసి ఉండవచ్చు.
ఆ సన్మానితుల్లో ఒకనాటి నా రేడియో సహోద్యోగిని సుప్రశాంతి కూడా వుండడం వల్ల నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు కూడా వచ్చారు. పూర్వాశ్రమంలో నా మిత్ర బృందంలోని  విలేకరులు అనేకమంది అక్కడ కలిసారు. హాయిగా ఒక పూట గడిచిపోయింది.
పొతే, సుప్రశాంతి  గురించి ఒక మాట.
సర్కారు ఉద్యోగం, అందులో సెంట్రల్ గవర్నమెంట్, అందులోను ఆలిండియా రేడియో రిపోర్టర్, వీటిని మించి సొంత ప్రాంతంలో పోస్టింగు, ఇన్ని కలిసి వస్తే నాలాగా కాలర్ తో పాటు తల కూడా ఎగరేస్తూ వుండాలి. అదేం చిత్రమో తలవంచుకుని పనిచేయడం తప్ప పాపం ఆ అమ్మాయికి వేరే పని తెలియదు.
బహుశా, వృత్తి పట్ల సుప్రశాంతికి వున్న ఈ అంకితభావమే ఆమెను ఉత్తమ జర్నలిష్టు అవార్డుకు ఎంపిక చేయడంలో దోహదపడి వుంటుంది.


(ఈ గ్రూపులో కుడి నుండి మూడో ఆవిడే ఉత్తమ మహిళా జర్నలిష్టు సుప్రశాంతి)


ఆమెకు నా అభినందనలు.