సూటిగా.....సుతిమెత్తగా..... భండారు
శ్రీనివాసరావు
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 02-06-2016, THURSDAY)
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 02-06-2016, THURSDAY)
“కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ
ఆడమన్నట్టుగా వుంది”
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సాంఘిక
మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పదమూడు జిల్లాలతో కూడిన చిన్న
రాష్ట్రాన్ని పాలించడం నిజానికి ఒక లెక్కలోనిది కాదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్తితుల్లో గణనీయమయిన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఒకప్పుడు ఆయన నోటి మాట ఢిల్లీ పెద్దలకు
శిరోధార్యం. కంటి చూపుతో శాసించడం అంటే ఏమిటో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర
ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలిని దగ్గరనుంచి చూసిన నా బోటి విలేకరులకు చాలామందికి
తెలుసు. ఒక సందర్భంలో నేనే ప్రత్యక్ష సాక్షిని.
ఆ రోజుల్లో ఆకాశవాణి హైదరాబాదు
కేంద్రంలో పనిచేస్తున్న న్యూస్ ఎడిటర్ బదిలీ అయ్యారు. దాన్ని రద్దు చేయించడం
అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ
స్థాయి పోస్ట్ అప్పుడు హైదరాబాదులో లేదు. అంచేత ఆ అధికారిని పోస్ట్ తో సహా
ఢిల్లీ బదిలీ చేశారు.
విషయం ముఖ్యమంత్రి చెవిలో వేశాము. ఆ
రోజు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఇబ్రహీం హైదరాబాదులోనే వున్నారు. పౌర విమాన
శాఖను కూడా ఆయనే చూస్తున్నారు. అదే రోజు
హైదరాబాదులోని బేగం పేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. ఆ
కార్యక్రమానికి ముఖ్యమంత్రిని తోడ్కొని పోవడానికి కేంద్ర మంత్రి సచివాలయానికి
వచ్చారు. ఆ హడావిడిలో, రామాయణంలో పిడకల వేటలా ఈ
బదిలీ వ్యవహారం. ముఖ్యమంత్రీ,
కేంద్ర మంత్రీ
ఇద్దరూ కలసి ఒకే కారులో ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ జరిగిన సభలో కేంద్రమంత్రి
ప్రసంగిస్తూ మధ్యలో ఒక అప్రస్తుత ప్రస్తావన చేసారు. అదే ఇందులో కొసమెరుపు.
“ఇక్కడికి వస్తున్నప్పుడు దోవలో మీ ముఖ్యమంత్రి నాయుడు గారు చెప్పారు, హైదరాబాదు ఆలిండియా రేడియో
న్యూస్ ఎడిటర్ బదిలీ ఆపుచేయమని. ఇక్కడే
చెబుతున్నాను. నాయుడు గారు అడగడం, మేం కాదనడం అనేది వుండదు. ఆ
బదిలీని నిలిపివేస్తున్నాను. ఢిల్లీ
వెళ్ళగానే ముందు ఆ ఆర్డర్లు పంపిస్తాను”
ఆయన అన్నట్టే బదిలీని రద్దు చేస్తూ
ఉత్తర్వులు ముందు ఫోనులో,
తరువాత ఫాక్స్
లో వచ్చాయి.
ఆ రోజుల్లో చంద్రబాబు పవర్ కు ఇది ఓ
చిన్ని ఉదాహరణ మాత్రమే.
ఢిల్లీ వెళ్ళకుండానే ఫోనులోనే
రాష్ట్రానికి సంబంధించిన అనేక వ్యవహారాలు చంద్రబాబునాయుడు చక్కబెట్టేవారు.
అత్యంత సమర్ధుడు అన్న కితాబు లభించింది
ఇదిగో ఇలాంటి సందర్బాలలోనే.
అలా
ఆ రోజుల్లో చంద్రబాబును చూస్తూ గర్వపడిన తెలుగు జనులు అదే చంద్రబాబును
చూస్తూ ఇప్పుడు జాలిపడాల్సి వస్తోంది.
గారెలు వండాలంటే నూనె,
మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు'
తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,
'చంద్రబాబు సమర్ధత'
తప్ప రాజధాని నిర్మాణానికి
కానీ, రాష్ట్రాన్ని
తాను కోరుకున్న విధంగా అభివృద్ధి
చేయడానికి కానీ, అవసరమైనవి ఏవీ
ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో
దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు)
కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు' ఒకే ఒక్కటి. అదే
అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది
చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ
నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన
రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో తాను కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల
వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే
చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ
అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని
పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. ‘అది నిజం కాదు, దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు
కనబడడం లేదా’ అని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ఇంతవరకు
ఇచ్చినదెంత, ఖర్చు పెట్టినదెంత అని లెక్కలు అడిగేవరకూ పోతోంది మిత్ర పక్షాల నడుమ
స్నేహం.
రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం.
ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు
అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో
టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు సీమాంధ్రలో నడుస్తోంది.
రాజధాని, ప్రత్యేక హోదా ఈ రెండూ ఒకరకంగా
టీడీపీకి ప్రజల్లో సానుభూతి కలిగించే అంశాలే. కానీ కొన్ని స్వయంకృతాపరాధాలు ఆ
పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. గతంలో ఆ పార్టీ నాయకులు చేసిన పరస్పర విరుద్ధ
ప్రకటనలే ఇందుకు కారణం అవుతున్నాయి.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో
కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ
వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి
పదవిని చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి
బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ
వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని
మనిషిలా అలా తిరుగుతూనే వుండడం చూసేవారికి
ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని, ఒక
సచివాలయం అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా
లేకపోలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా
ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ
తయారు.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక
పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో
బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు.
అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని
మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా
అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి
లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి
వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ‘ఒకే ఒక్కడురా’
మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్
అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే
యెట్లా అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి
వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని
కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు
చెప్పింది సావధానంగా వినేవారు. కలవడానికి
వెళ్ళిన వాళ్ళు ఆయన గదిలో ప్రవేశించగానే
కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని కూర్చోమని తాను నిలబడే
మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన
పని క్లుప్తంగా చెప్పుకుని
బయటపడేవాళ్ళు. దొరికిందే తడవుగా
కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
చంద్రబాబు పర్యటనలలో కూడా ఈ ఉద్దేశ్యం
వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం.
పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం.
అలాంటి మనిషి ఈ నాడు చేస్తున్న పాలన
చూస్తుంటే బాధతో కూడిన జాలి వేస్తోంది. చేతల మనిషి అనిపించుకున్న వ్యక్తి మాటల
మనిషిగా మిగిలిపోతున్నారేమో అనికూడా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు.
రెండేళ్ళ తరువాత వెనక్కి తిరిగి
చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే
అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ
సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ఆయన ఎప్పుడూ చెబుతుంటారు, సమస్యలను
అవకాశాలుగా మార్చుకుని విజయపధంలో సాగిపోతుంటానని.
అప్పటి చంద్రబాబును ఇప్పటి చంద్రబాబుతో
పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో కొట్టవచ్చినట్టు ఓ మార్పు కనిపిస్తోంది. ఎన్టీఆర్
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు అయన
ఫక్తు రాజకీయ నాయకుడు. తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేతిలో తీసుకున్నతొలినాళ్లలో
ఆయనలో ఒక అభద్రతా భావం వుండేది. మేరునగధీరుడయిన రామారావుని ఎదుర్కోవడం ఎలా అని. దానికి అయన కనుగొన్న మార్గం
పాలన విధానంలో కొత్తదనంతో కూడిన మార్పులు.
ఆకస్మిక తనిఖీలు, విస్తృత పర్యటనలు,
రేడియో, టీవీల్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమాలు అవన్నీ అందులో భాగం అనుకోవచ్చు. ఎన్టీఆర్
ఆకస్మిక మరణంతో రాజకీయంగా ఎదురులేకుండా పోయింది. దానితో పాలనపై దృష్టి
పెట్టి వినూత్న పధకాలతో ముందుకు సాగారు.
పార్టీకి, ప్రభుత్వానికీ ఆయనే కర్తా, కర్మా,
క్రియా కావడం కూడా అనుకున్నవి అనుకున్నట్టు చేయగల సావకాశం కలగచేసాయి.
దానికి తోడు అప్పుడే రంగప్రవేశం చేసిన ఆర్ధిక సంస్కరణలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పూర్తిగా సద్వినియోగం చేసుకుని
ఆదర్శ ముఖ్యమంత్రి అనే కితాబును జేబులో
వేసుకున్నారు. అప్పుడప్పుడే కళ్ళు
తెరుస్తున్న ప్రైవేటు మీడియా ప్రభావం కూడా ఆయన ప్రాభవానికి మెరుగులు అద్దింది.
ఆయనకు
వున్న పాలనానుభవం అపారం. రెండు తెలుగు రాష్ట్రాలలో లెక్కలు తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో ఆయనే సీనియర్. ఇంత అనుభవం
వుండి కూడా, ప్రజానీకానికి
సంబంధించిన కొన్ని
అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై, కేవలం
రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా
ఆయన నిర్ణయాలు
తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ
పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు
వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి
రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు,
తాను మారానని, మారిన మనిషిని అని.
నిజంగానే మారారు. మారిన రాజకీయ
పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. గత ఎన్నికల్లో చేజారినది అనుకున్న అధికారం
చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ
ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని
మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా చూసుకోవాలి.
ఆయన అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే
అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో చంద్రబాబులో ఒక పరిణతి చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా
అనిపించడం లేదు.
‘చేస్తున్నాం, చేస్తాం అనే దగ్గరే ఆగిపోతున్నారు, రెండేళ్లుగా చేసి చూపించింది ఏమీ లేదు,
రాజకీయం తప్ప’ అని నిజాయితీగా చెప్పేవాళ్ళలో కూడా
ప్రతిపక్షాల నీడలు కనబడితే ఇక చేసేదేమీ లేదు, చెప్పేదేమీ వుండదు.
రెండేళ్ళే గడిచాయి. ఇంకా మూడేళ్ళు
వుంది. దిద్దుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ సరిపడిన వ్యవధానం మిగిలే వుంది.
ఉపశృతి:
ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు
వుంటారు. వారికి తమ నాయకుడు ఏం చెప్పినా వేదం. ఏం చేసినా మోదం. అలాగే జనంలో ఆ
పార్టీకి వుండే అభిమానులు. వాళ్ళూ డిటో. అంచేత ఏం చేసినా, ఏం మాట్లాడినా ఈ రెండు వర్గాలవారితో ఎలాంటి పేచీ లేదు.
అలాగే ఇతర పార్టీలకి కార్యకర్తలు, అభిమానులు,
అనుయాయులు వుంటారు. వారికీ, వీరికీ చుక్కెదురు. ఒకరిది మరొకరికి నచ్చదు. ఒకరి పొడ మరొకరికి
గిట్టదు.
వీళ్ళే కాదు, ప్రజలనేవాళ్ళు కూడా వుంటారు.
వీరికి ఏ పార్టీతోను సంబంధంవుండదు. అంశాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీల పట్ల
వీరి అభిప్రాయాలు, అభిమానాలు అప్పటికప్పుడు చిత్రంగా మారిపోతుంటాయి. ఒకరకంగా ఎన్నికల సమయంలో
వీరిది రుక్మిణి చేతిలోని తులసీదళం పాత్ర. అది ఎటు మొగ్గితే, కాటా అటు మొగ్గే అవకాశాలు
హెచ్చు.
అయితే వీరితో ఓ సులువు లేకపోలేదు.
ఎన్నికల ఘడియ వచ్చేవరకు ఏ పార్టీకి
వీళ్ళతో నిమిత్తం వుండదు.