13, మే 2016, శుక్రవారం

మొదటి పెళ్ళాం – రెండో కాపురం


ఈటీవీలో ‘గిరిజాకల్యాణం’  తెలుగు సినిమా. పొద్దున్నే పాత చింతకాయ  ఎందుకని అనుకుంటూనే చూడ్డం మొదలు పెట్టి అలా చూస్తూనే పోయాను. ట్రాఫిక్ రద్దీ లేని విశాలమైన ట్యాంక్  బండ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ లో ఆనాడు వుండి ఈనాడు కనబడని గుర్రపు డెక్క ఆకులు, ఈనాడు వుండి నాడు లేని బుద్ధ విగ్రహం, వీటన్నిటితో పాటు చక్కని కధ, చిక్కటి కూర్పు ......
సినిమా పూర్తయిన తరువాత ఎప్పుడో అయిదేళ్ళ క్రితం నా బ్లాగులో రాసిన ‘మొదటి పెళ్ళాం – రెండో కాపురం’ మరోసారి చదివి చూసుకున్నాను. సినిమా  ఇతివృత్తం, నా బ్లాగు కధలో మూల భావం చాలా దగ్గరగా వుందనిపించింది. నిజానికి ఇది నా సొంతం ఏమీ కాదు. ఎప్పుడో ఎక్కడో చదివిన ఓ ఇంగ్లీష్ కధనానికి నా స్వేచ్చానువాదం. అదే ఇది:

కలియుగం నాలుగోపాదంలో ఒకానొక ధూర్తుడు, రౌరవాది మహా రాక్షస గణాలకు దేవ రహస్యం తెలియచేసాడట.
వేరే ఆడదానితో అక్రమ సంబంధం వున్నట్టు భార్యకు తెలియనంత కాలం భర్తకు నిత్య  స్వర్గమే . ఆమెకు తెలిసిన మరుక్షణం నుంచీ ప్రత్యక్ష నరకమే! అన్నది దాని సారాంశం.
నేను జానకితో చనువుగా మసలుతున్న సంగతి తెలిసిన నా మిత్రుడు శంకరం- దేవరహస్యం పేరుతొ నాకీ హితబోధ చేసాడు. అయితే, జానకితో నేను సాగిస్తున్న వ్యవహారం గురించి మా ఆవిడకు తెలుసునని నాకు చాలాకాలం వరకూ తెలవదు. అయినా గుంభనగా వుండిపోయిందంటే శంకరం చెప్పిన సూత్రం అందరు భార్యలకు వర్తించదని అనుకోవాలి.
రోజులు గడుస్తున్నకొద్దీ జానకి నుంచి రోజురోజుకూ నామీద వొత్తిడి పెరిగిపోతోంది. ఇక పోరుపడలేక లాయరుతో మాట్లాడడం, ముగ్గురు పిల్లల తల్లి అని చూడకుండా మా ఆవిడకి విడాకుల నోటీసు ఇప్పించడం కూడా జరిగిపోయింది.
నోటీసు పంపిన రోజు నేను కావాలనే బారులో పీకలదాకా తాగి ఇంటికి బయలుదేరాను. జానకి పరిచయం అయిన తరవాత ఆలస్యంగా ఇంటికి చేరడం అన్నది అప్పటికే నాకు అలవాటుగా మారింది. ఆఫీసు నుంచి నేరుగా జానకి పనిచేసే చోటుకు వెళ్లడం, ఆమెను స్కూటర్ పై ఎక్కించుకుని వాళ్లింటికి వెళ్లి అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి చేరడం నాకు దినచర్యలో భాగమయిపోయింది. అదేమిటో, పెళ్ళాం పిల్లలున్న నేను ఇలా చేయడం తప్పని నాకు కానీ, జానకికి కానీ ఒక్కనాడూ అనిపించకపోవడం విచిత్రం.
నా భార్య సీతతో నేను మాట్లాడాల్సిన తీరు గురించి నా కాబోయే భార్య  జానకి నాకు ముందుగా బాగానే  తర్పీదు ఇచ్చింది. ఇలాటి సందర్భాలలో ఇల్లాలు పెట్టుకునే కళ్ళనీళ్ళకు కరిగిపోకూడదని హితబోధ చేసింది. సీతతో కఠినంగా ప్రవర్తించమని  దాదాపు ఆర్డర్ మాదిరిగానే చెప్పింది.
ఇంటికి వెళ్లేసరికి పరిస్తితి నేను అనుకున్నట్టుగా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాను. పిల్లలు నిద్రపోతున్నట్టున్నారు. ఎప్పటిమాదిరిగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. భోజనం తిననని తెలిసి కూడా వడ్డించమంటారా అని అడిగింది . వద్దని సైగ చేసి నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.
నేను పంపిన విడాకుల నోటీసు సీత అందుకున్న సంగతి ధ్రువపరచుకున్న తరువాతనే ఇంటికి వచ్చాను. అయినా ఇల్లు ప్రశాంతంగా వుంది. ఏడుస్తూ నానా యాగీ చేస్తుందనుకున్న ఇల్లాలు మామూలుగా వుండడం చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది.
మా ఆవిడ భోజనం పెట్టింది. తిని చేతులు కడుగుకున్నతరవాత ఆమె చేయిపట్టుకున్నాను. నా కళ్ళల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా చేయి విడిపించుకుంది. ఆమె వంక చూడడానికి గిల్టీ గా అనిపించి తల దించుకున్నాను. ఏదో చెప్పాలని వుంది. ఎంతో చెప్పాలని వుంది. కానీ నోరు పెగలడం లేదు.మాట రావడం లేదు. ఆమె మెల్లగా లేచింది. మౌనంగా ప్లేటులో వడ్డించుకుంది. మాటా పలుకూ లేకుండా భోజనం అయిందనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు వూరుతూ వుండడం నాకు కనిపిస్తూనే వుంది.
ఆమెనుంచి నాకు విడాకులు కావాలి. సీతను ఎలాగయినా వొప్పించి తీరాలి. కానీ మనసులోని మాటను చెప్పడం ఎలా? పక్కకు తిరిగి గొంతు సవరించుకున్నాను. మనసులోని భావాలను మాటల్లోకి మార్చి గోడతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెకు ఎరుక పరిచాను. చిత్రం ఏమిటంటే నా మాటలు వింటున్నప్పుడు, విన్నతరవాత కూడా ఆమె ఎలాటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా, విడాకులా?ఎందుకు? అని ముక్తసరిగా అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి? అందుకే విననట్టు నటించాను.
రాత్రి మా మధ్య మాటలు సాగలేదు. రాత్రల్లా ఆమె రోదిస్తున్నట్టు నాకు తెలుస్తూనే  మా వివాహ బంధం ఇలా ఎందుకు తెగిపోయిందో తెలుసుకోవాలన్నది ఆమె తపనగా నాకు అర్ధం అయింది. కానీ, ప్రశ్నకు సమాధానం నా దగ్గర వుంటేగా. తన మీద వున్న నా ప్రేమ ఇప్పడు జానకి వైపు మళ్లి౦దని ఎలాచెప్పను ?
విడాకుల ఒప్పంద పత్రంలో ఇల్లూ, కారూ, కంపెనీ ఇచ్చిన షేర్లలో మూడో వంతు ఆమె పేరిట, పిల్లల పేరిట రాసాను. ఇది కాక నెల నెలా కొంత మొత్తం చేతికందేలా ఏర్పాటు చేసాను. విషయంలో మిగిలిన మొగాళ్ళ కంటే నేనే నయమని నేననుకుంటున్నాను.
తెల తెల వారుతుండగా నేను ఆమె ముందు విడాకుల అంగీకార పత్రాన్ని వుంచాను. అది చూడగానే ఆమె కళ్ళు విస్పులింగాల్లా మారాయి.
పదేళ్లకు పైగా నాతో జీవితాన్ని పంచుకున్న సీత రోజు పరాయి వ్యక్తిలా మారిపోయింది.
ఇంతకాలం నా సమయాన్ని, ధనాన్ని, శక్తి యుక్తుల్ని ఈమె కోసమా వెచ్చించింది అని బాధపడ్డానే కాని ఆమె పడుతున్న క్షోభను పట్టించుకునే పరిస్తితిలో నేను లేను. ఎంత త్వరగా సీతను విడాకులకు ఒప్పించి చల్లని కబురు జానకికి చేరవేద్దామా అని అనుకుంటున్నానే కాని సీత మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని నేను ఏమాత్రం పట్టించుకునే పరిస్తితిలో లేను.
పైగా ఆమె రోదన నాకు స్వాంతన కలిగిస్తోంది. విడాకులకు ఒప్పుకుంటుందన్న ఆశను రగిలిస్తోంది. దానితో, సీతతో తెగతెంపులు చేసుకోవాలనే నా కోరిక మరింత బలపడసాగింది. ఎంత త్వరగా ఈమెని వొదుల్చుకుని జానకి చెంతకు చేరగలనా అన్నఆత్రుత నాలో పెరిగిపోసాగింది.
మర్నాడు కూడా ఇంటికి పొద్దు పోయే వచ్చాను. నిజానికి అది నా ఇల్లన్న అభిప్రాయం నానుంచి ఎప్పుడో తొలగిపోయింది.
సీత భోజనాల బల్ల వద్ద కూర్చుని ఏదో రాస్తోంది. నా రాక గమనించి ప్లేట్లు సదరబోయింది. కానీ, అన్నం తినడానికి మనస్కరించక నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటికే పగలంతా జానకి సమక్షంలో గడిపివచ్చాను. అలసటతో వొల్లెరుగని నిద్ర పట్టింది.
తెల్లవారు ఝామున మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే రాస్తూ కనిపించింది. ఆమెను పట్టించుకోనట్టుగా పక్కకు తిరిగి నిద్రపోయాను.
ఉదయం నేను లేచేసరికల్లా సీత తయారయివుంది.
విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు.
ఆమె నోట్లో నుంచి వచ్చిన మాటలతో నోట్లో పంచదార పోసినట్టు ఫీలయ్యాను. నెత్తిమీది బరువు సగం దిగిపోయింది.
మీ ఇల్లూ, కారూ, డబ్బూ కూడా నాకక్కరలేదు. సీత కంఠం నిశ్శబ్దంగా వున్న గదిలో మారు మోగింది.
అయితే ఒక కండిషన్. దానికి ఒప్పుకుంటే విడాకుల అంగీకారపత్రం పై సంతకం చేయడానికి నేను సిద్ధం.
షరతు ఏమిటో వినడానికి నా చెవులు వెంటనే నిక్కబొడుచుకున్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.
నాకొక నెల వ్యవధానం కావాలి. నెల రోజులు ఇష్టం వున్నా లేకపోయినా మీరు నాతో, పిల్లలతో మామూలుగా మునపటి మాదిరిగా గడపాలి.
ఇందుకు ఆమె చూపించిన కారణాలు కూడా ఆక్షేపించదగినవిగా లేవు. పెద్ద పిల్లాడి పరీక్షలు నెలరోజుల్లో అయిపోతాయి. విడాకుల వ్యవహారం అతడి చదువును చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు.
నెల అంటే ఎంత ముప్పయి రోజులు.
ఇట్టే గడిచిపోతాయి. దీన్ని కాదనుకుని విడాకులకోసం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే నెల రోజుల బలవంతపు కాపురమే నయమన్న నిర్ధారణకు వెంటనే వచ్చాను. షరతుకు జానకి కూడా సులభంగా వొప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది.
మరో సంగతి సీత స్వరంలో చిన్న మార్పు.
ఇది షరతు కాదు. ఇన్నేళ్ళు మీతో కాపురం చేసిన భార్యగా కోరిక కోరుతున్నాను. మన్నిస్తే అదృష్టవంతురాలినని అనుకుంటాను.
స్వరంలోని మృదుత్వం నన్ను కరిగించింది. వరాలిచ్చే దేవుడి ఫోజులో సరే! అన్నాను.
ఆమె కోరిన కోరిక విన్న తరువాత విడాకుల షాక్ లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నదేమో అన్న అనుమానం కలిగింది. కానీ, జానకితో నా రెండో పెళ్లి త్వరగా జరగాలంటే ఇలాటి ఒకటి రెండు కోర్కెలు ఒప్పుకోక తప్పదు.
నేను మర్నాడు వెళ్లి సీత పెట్టిన షరతులు గురించీ, ఆమె  అడిగిన కోరిక గురించి జానకితో చెప్పాను. ఆమె ఒక్క పెట్టున నవ్వి సీతను పిచ్చిదానికింద జమకట్టి సరిపుచ్చుకుంది. అన్నీ సవ్యంగా జరుగుతూ వుండడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను.
సీతకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వొచ్చినప్పటినుంచి ఆమెతో ఎడమొగం పెడమొగమే. పడక గదులే వేరయిపోయాయి. ముద్దుముచ్చట్ల సంగతి దేవుడెరుగు ఆమెతో మాట్లాడడానికే నాకు మనస్కరించేది కాదు. ఇప్పుడు మళ్ళీ సీతకు ఇచ్చిన మాట ప్రకారం తొలి రాత్రి సన్నివేశాన్ని రిపీట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకూ కొంత ఇబ్బందికరం గానే వున్నట్టు అనిపించింది. కాకపొతే, ఇంట్లో సన్నిహితంగా మసలుతున్న మమ్మల్ని చూస్తూ మా పిల్లలు మాత్రం ఎంతో సంతోషపడ్డారు. చాలా రోజుల తరువాత మళ్ళీ మేము మా పడక గదిలోకి వెళ్లడం చూసి మా పెద్ద పిల్లవాడు వెనుకనుంచి చప్పట్లు కొట్టాడు. మనసు మూలల్లో ఏదో కదిలిన ఫీలింగ్. మంచం మీదకు చేరగానే సీత కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది. దయచేసి మన విడాకులు గురించి పిల్లలతో అనకండి.
పైకి తల వూపాను కాని మళ్ళీ ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. పదేళ్లనాటి చీరెను భద్రంగా  దాచి రాత్రి కట్టుకోవడం చూసి తల దించుకున్నాను.
మర్నాడు నా స్కూటర్ మీదనే సీతను తన ఆఫీసులో దింపాను. దారిపొడుగునా భుజం మీద తల వాల్చి మాట్లాడుతూనే వుంది. నా నడుం చుట్టూ బిగించి పట్టుకున్న చేతిని దిగేదాకా వొదలలేదు. నేను నా ఆఫీసుకు వెళ్ళిపోయాను.
సీతకిచ్చిన మాట ప్రకారం వెనుకటి రోజుల్లోలాగా సాయంత్రం తన ఆఫీసుకుకు వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాను. మా ఇద్దర్నీ మునుపటిలా చూడడం కోసమే అన్నట్టు పిల్లలందరూ గుమ్మం ముందరే కనబడ్డారు.
రెండో రోజు మా ఇద్దరి నడుమా మరికొంత సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. స్కూటర్ మీద వెడుతున్నప్పుడు తను నాకు మరింత హత్తుకుని కూర్చుంది. ఆమె నుంచి వెలువడుతున్న పల్చటి పరిమళం నా మెడను దాటుకుని నెమ్మదిగా వ్యాపిస్తోంది. సీతను అంత దగ్గరగా చూసిన జ్ఞాపకం మధ్య లేదు. పెళ్ళయిన కొత్త రోజులు మనసులో మెదిలాయి. స్కూటర్ దిగి ఆఫీసులోకి వెడుతున్నప్పుడు కాకతాళీయంగా ఆమె వైపు చూసాను. గంభీరతతో కూడిన మందహాసం మేళవించి నాకు చెయ్యి వూపి వీడుకోలు పలికింది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ అనుభవంలోకి వచ్చిన  సన్నివేశం.
నాలుగో రోజున నేనే చేయి అందించి ఆమెను స్కూటర్ పై కూర్చోపెట్టుకున్నాను. నాకు భార్యగా వుంటూ, నా పిల్లలకు తల్లిగా వుంటూ మరోపక్క ఉద్యోగం చేస్తూ ఇంటి పనీ, బయట పనీ సంభాలించుకుంటూ ఇన్నేళ్ళు చాకిరీ చేసిన మనిషి ఈమేకదా అనిపించింది. ఎప్పుడన్నా, ఏనాడన్నా తన గురించి పట్టించుకున్నానా అని ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.
రోజులు మారుతున్న కొద్దీ సీతను గురించి నా అభిప్రాయాలు కొద్ది కొద్దిగా మారుతుండడం గమనించాను. అదేమిటో కానీ ఇవేవీ జానకికి చెప్పాలనిపించలేదు.
క్రమంగా ఇంట్లో నేను గడిపే సమయం పెరుగుతూ వస్తున్న సంగతి నేను గమనించనే లేదు. పిల్లలతో ముచ్చట్లు, పెద్ద పిల్లవాడి పరీక్షలు గురించి ఆరా తీయడం వీటన్నిటితో మళ్ళీ ఇంటి పెద్ద పాత్రలో వొదిగిపోయాను. రోజు ఏకాంతం దొరికినప్పుడు పెళ్ళికిముందు నేను రాసిన ప్రేమలేఖలు చూపించింది. నా ఉత్తరాలను పదేళ్లుగా తాను పదిలంగా దాచుకున్న తీరు నన్ను నివ్వెరపరచింది. తను రాసినవి నేను ఏం చేసానని అడగలేదు. అడిగివుంటే ఏం జవాబు చెప్పాలా అని కొద్ది సేపు మధన పడ్డ మాట వాస్తవం.

వారం రోజులు గడిచాయో లేదో పిల్లవాడి పరీక్షల పేరుతొ నేను పదిరోజులు సెలవుపెట్టాను. సంగతి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కాని తను కూడా లాంగ్ లీవ్ పెట్టింది. అందరం కలసి ఇంట్లో చాలాసేపు గడపడం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మొదలయింది.
ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
శ్మశాన నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఇంటిని మాటలు, ముచ్చట్లు, నవ్వులు మళ్ళీ మనుషులు తిరిగే నివాసం గా మార్చాయి. తెలియకుండానే చోటుచేసుకుంటున్న మార్పులన్నీ నన్ను కొత్త మనిషిగా మార్చడం తెలియకుండానే జరిగిపోతోంది.
పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి. కొత్త విషయాలు మరపున పడుతున్నాయి.
జీవితం పాత బాటలో కొత్త పరుగు తీస్తోంది. సీతతో కాపురం సరికొత్త మధురిమను అందిస్తోంది.
ఒక్క నెల రోజుల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనిపిస్తోంది.
సీత పెట్టిన గడువు పూర్తవుతున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. చిత్రం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా ఒక్క రోజు కూడా జానకి నాకు గుర్తుకు రాలేదు.
రోజు సీత తను సంతకం చేసిన విడాకుల అంగీకార పత్రాన్ని నాకు అందించింది. అప్పుడు కానీ నెల రోజుల గడువు పూర్తయిన విషయం నాకు తట్టలేదు.
కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆమె అందించిన కాగితాలను తీసుకున్నాను. అవే చేతులతో ఆమెను పొదివి పట్టుకున్నాను. నా గుండెలపై తల ఆన్చి మౌనంగా రోదిస్తున్న సీతకు తన వీపును చుట్టుకున్న నాచేతులు ఏం చేస్తున్నాయో తెలిసే వీలు లేదు.
ఇక జీవితంలో సీతను విడిచి పెట్టేది లేదు అన్న నా దృఢ నిశ్చయానికి అనుగుణంగా నా చేతులు అంతే బలంగా మా విడాకుల పత్రాన్ని నలిపి నాశనం చేస్తున్నాయి.
(కలిసివున్నప్పుడు విడి విడిగా మసిలే భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. సన్నిహితంగా మెలగడం ద్వారా విడిపోవాలనే కోరిక దూరం చేసుకోవచ్చన్నదే కధలో నీతి. విడిపోవాలనుకున్న దంపతులు కధలో లాగా తిరిగి ఒకటవడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు.)

(19-07-2011)


11, మే 2016, బుధవారం

శారదక్కయ్య మరి లేదు


అమ్మలగన్నయమ్మ ‘మా అమ్మ’ అనుకుంటే, మా అమ్మకు రెండో బిడ్డ,  మా రెండో అక్కయ్య కొలిపాక శారదక్కయ్య ‘మంచి అమ్మకు’ మారుపేరు.
మా అమ్మగారు భండారు వెంకట్రావమ్మ గారు, 1993 లో తన 84 ఏట మరణించినప్పుడు మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఒక సంస్మరణ సంచిక ప్రచురించాడు. మా అమ్మకన్న సంతానం మాత్రమే కాకుండా పిల్లల పిల్లలు కూడా అమ్ముమ్మ గురించిన అనుభవాలను, అనుభూతులను అందులో పంచుకున్నారు. మా శారదక్కయ్య అమ్మను గురించి రాసిందిలా:
“పట్టుమని పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్ర రావు గారు) దేశ దాస్య విమోచనం కోసం జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మా వారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ  మా పెద్దక్క రాధనూ మా అప్ప (నాన్న) మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగ కట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.
మా అప్ప ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు “ మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”
మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని వూళ్ళో జనం చెప్పుకునే వారట.
ఆ రోజుల్లో ఏ కబుర్లూ వెంటవెంటనే  తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.
చివరికి  శంభాయి ఆ శుభవార్త మోసుకు వచ్చాడు.
మేమిద్దరం ముందు అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”
పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత చక్కగా రాసిన మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే లెక్క.
అలాంటి మా శారదక్కయ్య ఈనాడు లేదు.
బుధవారం ఉదయం ఖమ్మంలో కన్ను మూసింది.


మొన్నీ మధ్య పెళ్ళికి ఖమ్మం వెళ్ళినప్పుడు వెళ్లి చూసాం. చక్కగా గుర్తు పట్టింది.
మళ్ళీ  చూడడానికి రేపు తెల్లవారుఝామునే  బయలుదేరి వెడుతున్నాం.
కానీ ఈసారి ఆమెను మరోలా చూడాలి. చూసినా గుర్తు పట్టదు. (11-05-2016)

             

10, మే 2016, మంగళవారం

ఇంత రాజకీయం అవసరమా?


సూటిగా....సుతిమెత్తగా.....

ఇంత రాజకీయం అవసరమా?
దేశంలో పరిణామాలను గమనించేవారికి అసలు ఈ స్థాయిలో రాజకీయాలు, ప్రతి విషయంలో ఇంతంత రాద్దాంతాలు అవసరమా అనే సందేహాలు కలుగుతున్నాయి. అది ఉత్తరాఖండ్ వ్యవహారం కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల సంగతి కావచ్చు, అగష్టా హెలికాప్టర్ల కొనుగోలు కావచ్చు ప్రతి విషయమూ మరో వివాదానికి దారి తీసేలా వాదప్రతివాదాలు సాగుతున్నాయే తప్ప ఏ ఒక్క అంశంలోనూ వాస్తవిక దృష్టికోణానికి అవకాశం లేకుండా పోతోంది. సమస్యను పెద్దది చేసే ప్రయత్నం తప్ప అవసరమైన పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు పడడం లేదు. ‘దారులు వేరయినా బారులొక్కటే’ అన్న చందంగా  ఈ విషయంలో అన్ని పార్టీలదీ ఒకే బాట. అందరిదీ ఒకే మాట. వివాదాన్ని మరింత పెంచి పరిష్కారానికి దూరంగా జరగడం. 
నరేంద్ర మోడీ  ఏ పేరు మీద డిగ్రీ తీసుకున్నారు, ఆ డిగ్రీ తీసుకుకున్నది నరేంద్ర మోడీనా వేరొకరా అనే వివాదం గురించి వింటున్నప్పుడు ఇలాటి నిర్వేదమే కలుగుతోంది. (మోడీ అనాలా, మోదీ అనాలా అనేదే ఇంకా తెగలేదు).
డిగ్రీ లేని మోడీ, డిగ్రీ వున్నట్టు చూపెట్టి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వుంటే అది వేరే విషయం. ఈ పవిత్ర దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి వంటి పదవులకే కాదు అసలు ఎటువంటి రాజకీయ పదవులకు కూడా విద్యార్హతలతో నిమిత్తం లేదు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఈ గొప్ప దేశంలో ప్రధాని డిగ్రీ వ్యవహారం వివాదం కావడం చూస్తుంటే కాదేదీ రాజకీయానికి అనర్హం అనిపించక మానదు.
ఢిల్లీలో పాలన సాగిస్తున్న కేజ్రీ వాల్ అమ్ ఆద్మీ  పార్టీకి, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు   ఏమాత్రం  సరిపడదన్న విషయం సత్య దూరం కాదు. అయితే,  ఎన్ని వైరుధ్యాలు వున్నా, రాజకీయంగా ఎంతటి విబేధాలు వున్నా విమర్శల స్థాయి శృతిమించుతూ వుండడమే విషాదం.
ఈ వివాదానికి ఓ మూలం వుంది. అదేమిటంటే నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యార్హతలు పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బియ్యే పట్టా, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎమ్మే పట్టా తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. బియ్యే మార్కుల జాబితాపై వున్న  సంవత్సరం, డిగ్రీ సర్టిఫికేట్ పై వున్న సంవత్సరంతో సరిపోలడం లేదన్నది ఆప్ సంధిస్తున్న  ప్రశ్న. ప్రశ్నిస్తే సరిపోయేది అందులో కొంత ఎటకారం పాలు కూడా జోడించారు.
‘బియ్యే మార్కుల జాబితాపై 1978 సంవత్సరం వుంది. బియ్యే డిగ్రీ సర్టిఫికేట్ పై 1979  వుంది. బియ్యే మార్కుల జాబితాలో ‘నరేంద్ర కుమార్ దామోదర దాస్ మోడీ’ అని వుంటే ఎమ్మే పట్టాపై నరేంద్ర దామోదర దాస్ మోడీ’ అని వుందని ఆప్ నాయకులు వెల్లడించారు. ‘నకిలీ సర్టిఫికేట్లు సృష్టించడానికి కూడా బుర్ర కావాలి’ అనే ఆప్ నాయకుల హేళన సహజంగానే బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
ఆప్ నాయకుల ఆరోపణలని బీజేపీ జాతీయ అధక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లీ  విలేకరుల సమావేశంలో  స్వయంగా ఖండించారు. దాన్నిబట్టే, ఆ పార్టీ వీటిని యెంత తీవ్రంగా పరిగణిస్తున్నది అన్న విషయం అవగతమవుతోంది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్, ఎమ్మే సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలని విలేకరులకు అందచేశారు కూడా.
 అబద్ధాన్ని నిజంగా నమ్మించేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేజ్రీ వాల్ ప్రయత్నిస్తున్నారని వారు ఎదురు దాడి చేశారు.
ప్రధాన మంత్రి  మోడీ విద్యార్హతల వ్యవహారాన్ని రచ్చ చేయడానికి కూడా ఆప్ నాయకులకు ఒక కారణం వుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమెల్యేలు నకిలీ డిగ్రీలు కలిగి వున్నారన్న ఆరోపణలతో ప్రాసిక్యూషన్ ఎదుర్కుంటున్నారు. కిందటి ఏడాదే, అప్పుడు ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వున్న తోమర్ ను నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంలో ఇరికించి, అరెస్టు చేయించి తమ పార్టీ పరువు తీసిన కోపం బీజేపీపై పెంచుకున్న ఆప్ నాయకులకు, మోడీ డిగ్రీల వ్యవహారం అందివచ్చిన అవకాశంగా దొరికింది.  రాజకీయ ప్రక్షాళన, పరిశుద్ధ రాజకీయాలు  అనే  ఎజెండాతో అరంగేట్రం చేసిన పార్టీ కయినా రాజకీయం చేయక తప్పని పరిస్తితి.
అందుకే అన్నది ఇంత రాజకీయం అవసరమా అని.        
ఇక అగస్తా హెలికాప్టర్ల వ్యవహారం. దీన్ని వ్యవహారం అనడం లేదు, కుంభకోణంగా పిలుస్తున్నారు. ఈ పదాన్ని తుచ్చమైన భావం వచ్చేలా వాడుతున్నందుకు ఆ ‘కుంభకోణం’ ఊరివాళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసితీరాలి. కానీ, ‘స్కాం’ అనే ఇంగ్లీష్ పదానికి కుంభకోణానికి  మించిన సమానార్ధక తెలుగు పదం తెలుగు మీడియాకు తట్టడం లేదు. అదో విషాదం.
చాలాకాలం క్రితం వాజ్ పాయ్ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు సాగుతున్న రోజుల్లో మొదలయిన లేదా పురుడు పోసుకున్న ఈ హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనలు అలా అలా సాగుతూ పోయి, మన్మోహన్ నాయకత్వంలోని యూపీఏ రెండో టరం నాటికి ఒక రూపానికి వచ్చాయి. ఇందులో మసి వుంది అనుకుంటే అది కొద్దో గొప్పో అందరికీ అంటాలి. కానీ విచిత్రంగా రాజకీయం తన అసలు రూపాలను అంత్యంత జుగుప్సాకరంగా  ప్రదర్శిస్తోంది. కుంభకోణం జరిగి వుంటే, దోషుల్ని పట్టుకోవాలి. ముడుపులు ఎవరయినా తిని వుంటే వారెవరో నిర్ధారించే ప్రయత్నం చేయాలి. వారిని గుర్తించి  కఠినంగా శిక్షించాలి. కానీ ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే అటు పార్లమెంటు, ఇటు మీడియా దద్దరిల్లుతున్నాయి. అంతేకాని పరిష్కారం దిశగా ఒక్క అడుగు పడడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశం ఒక ప్రచారాస్త్రం అవుతుందేమో కాని, ముడుపులు ఆరగించిన భోక్తలు మాత్రం ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ బొజ్జలు నిమురుకుంటూ వుంటారు. గతంలో దేశాన్ని కుదిపి వేసిన అనేకానేక స్కాముల జాబితాలో ఇది కూడా చేరిపోయి, భవిష్యత్తులో విశ్లేషకులు ప్రస్తావించడానికి పనికివచ్చే ఒక ముడిసరుకుగా మారిపోతుంది. మరి ఇది కూడా ఒక విషాదం అనుకోవాలేమో!           
ఇక ఉత్తరాఖండ్. భారత ప్రజాస్వామ్య వేదికపై సాగుతున్న మరొక ప్రహసనం. పార్టీ మార్పిళ్లకు పరాకాష్ట. పార్టీలు, సిద్ధాంతాలు పక్కనబెట్టి,  వాదానికి పనికివచ్చే అనేక ఉదాహరణలు పేర్కొంటూ అధికారమే పరమావధి అనే సిద్ధాంతానికి పెద్ద పీట వేసే  రాజకీయ అవకాశవాదానికి నిలువెత్తు ఉదాహరణ. కాంగ్రెస్, బీజేపీ ల నడుమ అధికార పోరుకు అందమైన ముసుగులు వేసి చర్చా వేదికలపై తలపడుతూ,  తమ వాదాన్ని నెగ్గించుకునేందుకు, ఎదుటి వాదాన్ని పూర్వపక్షం చేసేందుకు  ఆయా పార్టీలు ఆడుతున్న జగన్నాటకానికి చరమాంకం. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మొత్తం వ్యవహారం సుప్రీం అధీనంలోకి వెళ్ళిపోయింది. ప్రజలతో ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను న్యాయ స్థానాలు నిర్దేశించే స్తితికి చేరుకోవడం మరో విషాదం.
తొమ్మిది మంది  తిరుగుబాటు ఎమ్మెల్యేలపై హైకోర్టు, సుప్రీం కోర్టు కూడబలుక్కున్నట్టు అనర్హత వేటు వేసాయి కాబట్టి, హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం ఖాయం అని ముందే తెలిసిపోయింది.
కోర్టు ఆదేశం ప్రకారం ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ పరీక్ష గత  మంగళవారం నాడు  సుప్రీం  పర్యవేక్షణలోనే   కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ  జరిగిపోయింది.  ముఖ్యమంత్రి హరీష్ రావత్  కు  అనుకూలంగా ఫలితం వున్నట్టు సంకేతాలు తెలుపుతున్నాయి. అయితే, అధికారికంగా నిర్దారించాల్సింది సుప్రీం కోర్టు కనుక, సీల్డ్ కవర్ లో ఆ ఫలితాన్ని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించడం జరిగింది. దేశంలో  ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న తీరుకు ఇది అద్దం పడుతోందని సంతోషపడాలా, లేక ఒక చట్ట బద్ధమైన వ్యవస్థ నడుచుకోవాల్సిన తీరును  మరో చట్ట వ్యవస్థ నిర్దేశిస్తోందని మధనపడాలా?       
సుప్రీం అధికార ప్రకటన తరువాత, ఉత్తరాఖండ్  కు ఉత్తరాధికారి ఎవరన్నది  నిర్ణయం అవుతుంది. బహుశా ఇప్పటికి అందుతున్న సమాచారాన్ని బట్టి హరీష్  రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కానీ, నేటి రాజకీయాల తీరుతెన్నులు గమనించినప్పుడు  ఆ ముచ్చట ఎన్నాళ్ళు అనిపించక మానదు.
అధికార దాహంతో, ప్రత్యర్ధులను సమూలంగా నిర్మూలించాలనే ఏకైక ధ్యేయంతో రగిలిపోతున్న రాజకీయ  పారావారాలు మిన్నకుంటాయనే నమ్మకం లేదు. చట్టం చట్రంలో వున్న లొసుగులు ఏమిటో, వాటిని ఎలా అధిగమించాలో వారికి బాగా  తెలుసు. ఎందుకంటే వారే చట్ట నిర్మాతలు కాబట్టి. రాజకీయం అంటే అదే కదా!
సిద్ధాంతాలు త్రోసిరాజని, అధికారం ఒక్కటే పరమావధి అనే ఒకే ఒక   సూత్రంతో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నంత కాలం – ఇంత రాజకీయం అవసరమా?  అనే సామాన్యుల సందేహం ఎన్నటికీ నివృత్తి కాదు.
రోజు కోసం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
ఆ రోజు వచ్చిన నాడు ఈ రాజకీయ పార్టీలు చేయగలిగింది కూడా ఏమీ వుండదు.

ఉపశృతి:

కుల, మతాలలోనే కాదు రాజకీయ పార్టీల్లో కూడా ఈ స్వపర బేధాలు ఎక్కువవుతున్నాయి. 'మా పార్టీ, మీ పార్టీ' అనే ప్రాతిపదికపై రాజకీయాలు సాగుతున్నాయి. మావాళ్ళు, మీ వాళ్ళు అనే ఈ బేధ దృష్టికి తొలి బీజం పడింది భగవద్గీత మొదటి శ్లోకంలోనే. కురుపాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు అంధరాజయిన ద్రుతరాష్ట్రుడు, ‘యుద్ధభూమిలో ఏమి జరుగుతున్నదో చెప్పమ’ని సంజయుడ్ని అడుగుతాడు.

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ
 కిమకుర్వత సంజయ  1 

ఇక్కడ 'మామకాః పాండవాశ్చైవ' అంటే ' మా కుమారులు, పాండురాజు కుమారులు' అని అర్ధం.
నాటినుంచే వున్న ఈ 'మా, మీ  తేడాలు' ఈనాటికి కారడవిలా విస్తరించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. (11-05-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595   


పత్రికారచనలో కీర్తి పురస్కారం


‘సూర్య’ దినపత్రికలో గత అయిదారేళ్ళుగా, ’సూటిగా..సుతిమెత్తగా...’ శీర్షికతో  వారానికి రెండు పర్యాయాలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలపై  వ్యాసాలు రాస్తూ వస్తున్న భండారు శ్రీనివాసరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ‘తాపీ ధర్మారావు’ పేరిట ఇచ్చే  ‘పత్రికారచన’ కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు.


ఈ నెల 12 వ తేదీ గురువారం, సాయంత్రం నాలుగు గంటలకు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్  కళామందిరంలో, ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  అధక్షతన   జరిగే కార్యక్రమంలో తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. లక్ష్మారెడ్డి చేతుల మీదుగా భండారు  శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఈ పురస్కారం కింద రు.5,116 నగదు, శాలువా, ప్రశంసాపత్రం అందచేస్తారు.
తెలంగాణా ప్రభుత్వ  సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు శ్రీ కే.వీ.రమణాచారి, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొంటారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య  కే. తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసుకు చెందిన భండారు శ్రీనివాసరావు గతంలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తా  విభాగంలోనూ, హైదరాబాదు దూరదర్సన్  వార్తా విభాగంలోనూ వివిధ హోదాల్లో  సుమారు మూడు దశాబ్దాలపాటు పనిచేసారు. భారత ప్రభుత్వం పనుపున మాస్కోలోని రేడియో మాస్కో తెలుగు విభాగంలో  కూడా అయిదేళ్లపాటు న్యూస్ రీడర్ గా పనిచేసారు. పదవీవిరమణ అనంతరం వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. టీవీ ఛానళ్ళ చర్చల్లో రాజకీయ విశ్లేషకుడిగా పాల్గొంటున్నారు.    

భండారు శ్రీనివాసరావుతో పాటు,  వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన మరో 35 మంది కూడా కీర్తి పురస్కారాలు అందుకుంటారు.