19, జనవరి 2016, మంగళవారం
శబ్దం! నిశ్శబ్దం!!
లేబుళ్లు:
శబ్దం! నిశ్శబ్దం!!
రచయితలు- సంపాదకులు (ఎవరి బాధలు వారివి)
రచయిత ఏం చేస్తాడు?
మరీ చచ్చు ప్రశ్న. ఏంచేస్తాడు ?
రాస్తాడు. రాసింది నలుగురు చదవాలని ఆశ పడుతూ రాస్తూ పోతుంటాడు. పత్రికలకి
పంపిస్తాడు. వాళ్ళు వేస్తె వేస్తారు. లేకపోతే లేదు. వెయ్యకపోతే మరో పత్రిక్కి
పంపిస్తాడు. వెనుకటి మాదిరిగా పోస్ట్ చేయడాలు, తిప్పి పంపడానికి తగినన్ని తపాలా బిళ్ళలు జతచేయడాలు వంటి
బాదరబందీలు ఈనాడు లేవు. రాసేసి ఎంచక్కా ఒక్క క్లిక్కు నొక్కితే చాలు. కానీ
ఇదొక్కటే చాలదు కదా! సంపాదకుడు చూడాలి, మెచ్చాలి. వెయ్యాలి. ఈలోపు సంపాదకులు మరో రిటర్న్ క్లిక్కు నొక్కి మీ రచన అందింది’ అని
కబురు ఏమన్నా చేస్తారా అంటే అదీ లేదు. మరి వారు సంపాదకులాయే. అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారికి కుదరక
పోవచ్చు. మరి రచయితకు తన రచన ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ సామెత మాదిరి. అంచేత మరో
పత్రిక్కి క్లిక్కు మనిపిస్తాడు. ఏదో జంధ్యాల సినిమాలో మూడును బట్టి మార్కులు వేసే
ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేష్టారిలా ఆ రచన ఆ రెండో పత్రిక సంపాదకుడి మూడును బట్టి
నచ్చి కూర్చుంటుంది. అయన వేసేస్తాడు. ఈలోగా మొదటి ఎడిటర్ గారి మూడు కూడా మారి ఆయనా
తన పత్రికలో వేసేస్తాడు. రచయిత పని నక్కతోక తొక్కిన చందంగా మారుతుంది. ఒక్క క్లిక్కుకు
రెండు పక్షులు.
సరే. ఈ పత్రిక ఎడిటర్ ఆ పత్రిక చదవడు.
చదివినా పైకి ఏమీ అనలేని పరిస్తితి. కాకపొతే ఇంకోసారి ఆ రచయిత రచనలు ఆ పత్రికలో
వెలుగుచూడక పోవచ్చు. సరఫరా, గిరాకీ సిద్దాంతం ప్రకారం ఇప్పటివరకు రచయితల మీద
సంపాదకులదే పైచేయి. ఫేస్ బుక్ , బ్లాగర్ వంటి సాంఘిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన
తరువాత వర్ధమాన రచయితలు చెలరేగిపోయి అద్భుతంగా రాస్తున్నారు. ఇప్పటిదాకా పత్రికలకే
పరిమితమై ఇంతో అంతో పేరు తెచ్చుకున్న రచయితలు కూడా ఈ వైపే మళ్ళారు. అయితే ఈ
మీడియంలో స్వపర బేధాలు లేవు. పోస్ట్ అయిన ప్రతి రచన మీద ఎవరికివారు సర్వస్వామ్యాలు
తీసేసుకుంటున్నారు. ఒకరి రచనను మరొకరు కాపీ కొట్టడం అనేది సర్వసాధారణం అయిపొయింది.
‘కాపీ రైట్’ అంటే ‘కాపీ కొట్టే రైట్’ అనుకుంటున్నారు. ఇంత పురాణ కాలక్షేపం
ఎందుకంటే:
మొన్నీ నడుమ శ్యాం రావు గారు అనే
ప్రముఖ జర్నలిష్టు కన్ను మూశారు. ఆయనతో సన్నిహిత పరిచయం వున్న మరో జర్నలిష్టు
మిత్రుడు (ఆయన ఇంగ్లీష్ పేపర్లో పనిచేసే తెలుగు జర్నలిష్టు) శ్యాం రావుగారి
గురించి చక్కటి ఆంగ్ల కధనం ఒకటి ఫేస్ బుక్
లో పోస్ట్ చేసాడు. మరునాడో, ఆ మరునాడో తెలియదు కాని , అదే కధనానికి మక్కికి మక్కి తెలుగు అనువాదం రెండు ప్రధాన
దినపత్రికల్లో ఒకే రోజున వచ్చింది. ఆ వ్యాస రచయిత కూడా సామాన్యుడు కాదు.
విదేశాల్లో చాలా పేరొందిన సీనియర్ జర్నలిష్టు.
ఫేస్ బుక్ లో రాసిన జర్నలిష్టు తల్లి
గారికి తెలుగు పత్రికలు చదవడం అలవాటు. ఆవిడ
చదివి కొడుకుతో చెప్పింది. ఆయన పత్రికల వారిని సంప్రదిస్తే ఒక పత్రిక ఈరోజు ‘ఆ వ్యాస
రచయితను నేను!’ అనే శీర్షిక పెట్టి సవరణ కాని సవరణ రూపంలో ఒక వివరణ ఇచ్చింది. కింద
ఫోటో అదే.
రచయితలు – సంపాదకులు అని రాసి పక్కన బ్రాకెట్లో ‘ఎవరి
బాధలు వారివి’ అని ఎందుకు రాసానో అర్ధం అయిందనుకుంటాను.
18, జనవరి 2016, సోమవారం
అచ్చంగా 'కల్పితం'
పీత కష్టాలు పీతవి
'కల్పిత కధ' అంటేఏమిటో మచ్చుకు చూద్దామా!
ముని శాపగ్రస్తుడయిన కుబేరుడు భూలోకంలో మానవరూపంలో ముఖేష్ అంబానీగా అవతరించి తండ్రి ధీరూభాయ్ అంబానీ స్తాపించిన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి, అపర కుబేరుడిగా పేరు గాంచి, ఆ క్రమంలో పోగేసుకున్న అపార ధనరాశులతో ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి, ఏదో ఒకటి చేయకపోతే బాగుండదనిపించి, భార్యాబిడ్డలతో చర్చించి, కోట్లకు కోట్లు వెచ్చించి ముంబై లో ఏకంగా ఇరవై ఏడు అంతస్తుల రమ్యహర్మ్యాన్ని నిర్మించుకుని సుఖంగా జీవిస్తున్న తరుణంలో – ఆ వైనాన్ని ఓ గిట్టని పత్రిక వైనవైనాలుగా వర్ణించి రాసి జనం మీదకు వొదిలింది. ఆ కధాక్రమంబెట్టిదనిన - -
ముఖేష్ అంబానీ తన నివాస భవనంలో పదిహేనో అంతస్తులో వున్న పడకగదిలో నిద్రిస్తాడు. నిద్ర లేచిన తరువాత పదిహేడో అంతస్తుకువెళ్లి అక్కడ వున్న జిమ్ లో వ్యాయామం చేసి అక్కడే నిర్మించుకున్న అందమైన అధునాతన నీటి కొలనులో ఈత కొడతాడు. పందొమ్మిదో అంతస్తులో బ్రేక్ ఫాస్ట్ ముగించి పద్నాలుగో అంతస్తులో దుస్తులు ధరించి ఇరవై ఒకటో అంతస్తుకు వెడతాడు. అక్కడవున్న బ్రీఫ్ కేసు, అవసరమయిన ఫైళ్ళు తీసుకుని పదహారో అంతస్తులో వెయిట్ చేస్తున్న భార్యకు టాటా చెప్పి పదమూడో అంతస్తుకు వెళ్లి స్కూలుకు వెళ్ళడానికి తయారవుతున్న పిల్లలను పలకరిస్తాడు. ఆ తరువాత మూడో అంతస్తులో పార్కుచేసివున్న కోటిన్నర ఖరీదుచేసే మెర్సిడెస్ కారెక్కి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెడతాడు.
ఇంతవరకూ కధ బాగానే వుంది. కానీ విధి విచిత్రమైనది కదా. ప్రతిరోజూ ఒకేరకంగా వుండదు. కదా!. అందుకే ఓ రోజు అది అడ్డంగా అడ్డం తిరిగింది. ఆ సంగతే ఆ పత్రిక రాసింది. ఆ కధనం ప్రకారం ఓ రోజు యధావిధిగా అన్ని అంతస్తుల్లో తన దినసరి దిన చర్యలను ముగించుకుని కారెక్కడానికి మూడో అంతస్తుకు చేరుకున్న ముఖేష్ కు కారు తాళాలు మరిచివచ్చిన సంగతి లేటుగా గుర్తుకు వచ్చింది.
వాటిని ఎక్కడ మరచిపోయినట్టు?
పదిహేనో అంతస్తులోనా ? లేక పదిహేడులోనా! పదా! పద్నాలుగా! ఇరవై ఒకటో అంతస్తులోనా లేక పదహారులోనా! లేదా పదమూడో అంతస్తులో పిల్లలను పలకరించి వస్తున్నప్పుడా? ఎక్కడ మరచిపోయినట్టు. ఆలోచిస్తూ తల గోక్కుంటే తండ్రి వారసత్వంగా వచ్చిన బట్ట తల తగిలింది కాని తాళాలు గురించిన లైటు మాత్రం వెలగలేదు.
కానీ అంబానీనా! మజాకా!
అపర కుబేరుడి కారు తాళాల కోసం ముమ్మరంగా గాలింపు మొదలయింది. అన్ని అంతస్తుల్లోవున్న సిబ్బంది చేతుల్లో వున్న ఫోన్లు మోగాయి. నౌకర్లు, చాకర్లు, బట్లర్లు, సెక్రెటరీలు, జిమ్ ట్రైనర్లు, వంటవాళ్ళు, వార్పువాళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ అటెండెంట్లు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగావున్న పనివాళ్ళ ఫోన్లన్నీ ఒకేసారి మోగాయి. కానీ ఏం లాభం? తాళం చేతుల జాడ లేదు.
కాలమే ధనంగా భావించి అనుక్షణం సంపాదనలో మునిగితేలే అంబానీ క్షణం ఆలశ్యం చేయకుండా, ఆ రోజుకు సరిపెట్టుకుని ఓ కోటి మాత్రమే కిమ్మతు చేసే మరో చిన్న కారులో డ్రైవర్ను వెంటపెట్టుకుని తన పనిపై తాను వెళ్ళిపోయాడు.
అంతటితో ముగిస్తే కధ ఏముంది?
అంబానీ సిబ్బంది అందరూ కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని కారు తాళాల అన్వేషణ ఆ తరువాత కూడా కొనసాగించారు. ఆ క్రమంలో మరో ఆసక్తికరమయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి కొత్తగా పనిలో కుదిరిన ఓ పనిమనిషి కారు తాళాలున్న అంబానీ గారి ప్యాంటును తాళాలతో సహా ఉతికి ఝాడించి పదహారో అంతస్తులో ఆరేసింది. అలా ఆరేసిన ఆ ప్యాంటు, అక్కడ వీస్తున్న చల్లని హోరు గాలికి ఎగిరిచక్కా పోయింది. ఆ విధంగా, ప్యాంటు సమేతంగా కోటిన్నర రూపాయల కారు తాళాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
కధ అంతటితో ఆగిందా. ఆగితే కధ ఎందుకవుతుంది.
ఆ రోజు రాత్రి పదహారో అంతస్తులో పడుకుని, అత్తగారిని విషం పెట్టి చంపాలని చూసే కోడలు పిల్ల ప్రయత్నాలను టీవీ సీరియల్ నాలుగువందల నలభయ్యో ఎపిసోడ్ చూసి, పీడ కలలతో నిద్రపట్టక కలత నిద్రలో దొర్లుతున్న అంబానీ అర్ధాంగికి పైన ఏదో శబ్దం వినిపించి లేచి చూసింది. క్లోజుడ్ సర్క్యూట్ టీవీ తెరపై భవనం పై భాగంలో హెలిపాడ్ పై దిగుతున్న హెలికాప్టర్ కన్పించింది. ఇంత రాత్రప్పుడు మొగుడు హెలికాప్టర్ లో ఎక్కడ చక్కర్లు కొట్టి వస్తున్నట్టన్న అనుమానం ఆవిడ మనసులో మొక్కై మొలిచి మరుక్షణంలోనే మానుగా విస్తరించింది. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో అప్పుడే పైకొస్తున్న ఓ సినీ హీరోయిన్ తన మొగుడి వంక వంకర చూపులు చూస్తున్నప్పుడే జాగ్రత్త పడివుండాల్సింది. అయినా ఇన్నేళ్ళొచ్చి, ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని ఇలా చెడు తిరుగుళ్ళు తిరగడానికి ఈ మగవాళ్ళకు మనసెలా వస్తుందో అని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ పైఅంతస్తులో వున్న అత్తగారి దగ్గరకు వెళ్లి మరోసారి భోరుమంది. అర్ధరాత్రి ఈ కాకి గోలేమిటని అత్త కోకిలా బెన్ విసుక్కుంటూ నసుక్కుంటూ అప్పటికప్పుడే కొడుకుని పిలిచి అక్కడికక్కడే పంచాయితీ పెట్టింది. చవితినాడు నోముకోకుండా విదేశాల్లో విహారయాత్రలు చేసి వచ్చిన పాపానికి తనమీద పడ్డ నీలాపనింద ఇదానుకుని ఎంతో ఇదయిపోయిన ముఖేష్ అంబానీ మరోసారి బట్ట తలను తడుముకుంటే అసలు విషయం గుర్తుకువచ్చింది. ఆ రోజు కారు తాళాలు పోయిన సంగతి మెర్సిడెస్ కంపెనీ వారికి తెలియచేస్తే వారు తమ హోదాకు తగ్గట్టుగా ఆ రాత్రికి రాత్రే హెలికాప్టర్ ద్వారా కారు తాళాలను ఇంటికి బట్వాడా చేశారు. ఆ అర్ధరాత్రి ఆ అమ్మడు చూసి అపార్ధం చేసుకున్న హెలికాప్టర్ అదేనట.
అందుకే అంటారు – పీత కష్టాలు పీతవని. (02-03-2012)
లేబుళ్లు:
అచ్చంగా 'కల్పితం' Mukhesh Amabani
ఇదెక్కడి న్యాయం
కోర్టుల అధికారం కూడా ఇళ్ళల్లో నాన్నల
పెత్తనం లాంటిదే అనిపిస్తుంది. అర్ధరాత్రి దాకా బజార్లు పట్టుకు తిరిగొచ్చిన పిల్లాడు ఇంటి పట్టున పడి వుండేదాకా అన్నం
పెట్టొద్దని పెళ్ళానికి హుకుం జారీ చేస్తాడు. పిల్లాడు ఇంట్లో వున్నాడా, వీధుల్లో
తిరుగుతున్నాడా అన్నది మళ్ళీ భార్య చెబితేకాని తెలియదు.
కోర్టు ఆదేశం అంటూ అనేక వార్తలు
వస్తుంటాయి. ఆ ఆదేశాలు ఎంతవరకు అమలవుతున్నాయో పర్యవేక్షించే వ్యవస్థ కోర్టులకు వున్నట్టు లేదు. మళ్ళీ ఎవరయినా
పిర్యాదు చేసేదాకా కోర్టు ధిక్కరణ కింద చర్య తీసుకోవడానికి లేదు.
లేబుళ్లు:
ఇదెక్కడి న్యాయంCourt rulings
17, జనవరి 2016, ఆదివారం
ఆ తరం అంతమయింది
మెరిసే రంగురాళ్ళను, రత్నాలను కలిపి జల్లిస్తే,
జల్లెడలో మిగిలే ఏకైక మేలిమి రతన౦ ఈరోజు కన్నుమూసిన వీ.రామారావు గారు. నేటి
రాజకీయుల్లో మళ్ళీ అలాంటి వాళ్ళను చూడబోము. ఆ ఉత్తమ శ్రేణికి చెందిన రాజకీయుల్లో బహుశా
ఆయనే చిట్టచివరి వారు.
1978, 1984 లో శ్రీ రామారావు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కౌన్సిల్ సభ్యులుగా
పనిచేసినప్పుడు రేడియో విలేకరిగా ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అవి చివరి
వరకు కొనసాగుతూ వచ్చాయి.
రామారావు గారు సిక్కిం గవర్నర్ గా
వున్నప్పుడు హైదరాబాదు వచ్చినప్పుడల్లా డార్జిలింగ్ టీ టిన్నులు తెచ్చి ఇచ్చేవారు.
కుటుంబంతో కలిసి సిక్కిం రావాల్సిందని చెప్పేవారు కానీ నాకే వీలు కుదరలేదు. కానీ
మా స్నేహితులు, చుట్టపక్కాల్లో ఎవరు వెళ్ళినా సరే, ఫోను చేసి చెబితే చాలు, వారికి అన్ని కనుక్కుని ఏర్పాట్లు చేసేవారు.
హైదరాబాదు నుంచి ఫోను చేస్తే స్వయంగా లిఫ్ట్ చేసి మాట్లాడేవారు.
ఒకసారి మా కుటుంబంతో కలిసి రైల్లో
రెండో తరగతి స్లీపరు బోగీలో పుట్టపర్తి వెడుతున్నాము.
మధ్యలో ఏదో స్టేషనులో ఎవరో ఎక్కారు. తీరా చూస్తే రామారావు గారు. ఆయన గవర్నర్
హోదానుంచి తప్పుకుని అప్పటికి కొద్దికాలమే అయింది. రైల్వే అధికారి బెర్త్ ఇవ్వడం సాధ్యం కాదని
అంటుంటే నేను వెళ్లి కల్పించుకుని ‘ఆయన ఎవరో మీకు తెలియదల్లే వుంది, మొన్నమొన్నటి
దాకా గవర్నర్. కానీ ఆయన పదవిని వాడుకునే రకం కాకపోబట్టి మీకు తెలిసి వుండరు’ అని
కాస్త డబాయింపుగా అన్నాను, రామారావుగారు ‘వద్దువద్ద’ని ఓ పక్క వారిస్తున్నా
వినకుండా.
కాసేపటి తరువాత ఆయనకు వేరే బోగీలో బెర్త్
ఇచ్చారు. కానీ ఆయన మా వద్దే చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళారు.
బీజేపీ కి చెందిన నారపరాజు రామచంద్ర
రావు గారు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ఆశీస్సులు తీసుకోవడానికి
రామారావు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి నేను కూడా వారి ఇంటికి వెళ్లాను.
వేడి వేడి చాయ్ ఇచ్చి చాలాసేపు
మాట్లాడారు. అదే రామారావు గారిని నేను ఆఖరి సారి కలవడం.
ఈరోజు వారు లేరనే వార్త.
ఆ తరం నేటితో అంతమయింది.
లేబుళ్లు:
ఆ తరం అంతమయింది Shri V.Ramarao BJP
మరణమా! జీవన్మరణమా!
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 21-01-2016, THURSDAY)
‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’
అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి
మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.
‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని
గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం
దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.
ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని
తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణ భీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.
జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం.
బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు మనిషిని వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే
కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.
కొందరి మరణాలు కళ్ళారా చూసినప్పుడు
ఇటువంటి చావు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. కొందరు అత్యంత సునాయాసంగా
జీవితాన్ని చాలించినప్పుడు ఇలాంటి మరణం సిద్ధిస్తే యెంత బాగుండు అని వయసు మల్లినవాళ్ళు అనుకోవడం
కద్దు.
‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో
చెప్పారు. అంటే ఏమిటన్నమాట. అపమృత్యువు
లేని దీర్ఘాయువు కావాలి. శతమానం భవతి అంటూ
నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం
బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన
ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా
బలవన్మరణాలు తగవనీ పూర్వీకులు చెబుతూ
వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో
చేర్చేసారు కూడా.
పొద్దునపొద్దున్నే ఈ వేదాంతపు కబుర్లు
చెప్పుకోవడానికి ‘యూధనేసియా’ అనే గ్రీకు
పదం కారణం. దీనికి తెలుగు మీడియా చేస్తున్నసమానార్ధక అనువాదం ‘కారుణ్య మరణం’. ఇందుకు సంబంధించిన వార్త
ఒకటి పత్రికల్లో వచ్చింది.
2005 లో కాబోలు ‘కామన్ కాజ్’ అనే స్వచ్చంద సంస్థ ఒక ప్రజాహిత వ్యాజ్యం
వేసింది.
ఒక వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధ
పడుతూ తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు ‘కారుణ్య మరణం ఎంచుకునే అవకాశం అతగాడికి వుండాలన్నది ఆ సంస్థ వాదన. వెంటిలేటర్ల వంటి
కృత్రిమ వ్యవస్థల ద్వారా అతడి ఆయుర్దాయాన్ని కొంత కాలం పెంచడానికి ఆధునిక వైద్యం
ఉపకరించవచ్చు కానీ, తద్వారా ఆ రోగి శారీరక
బాధను కూడా పొడిగించినట్టే అవుతుంది. కాబట్టి, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలని ఆ
సంస్థ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జీవించే హక్కులో, గౌరవంగా మరణించే
హక్కు కూడా మిళితమై వుంటుంది కనుక, నయం
కాని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి కారుణ్య మరణాలను ప్రసాదించే విధంగా
ప్రభుత్వాలను ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానానికి ఆ సంస్థ విన్నవించుకుంది.
అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత శుక్రవారంనాడు ఈ వ్యాజ్యాన్ని విచారించి, ‘ఈ అంశంపై వీలయినంత
త్వరగా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కోర్టుకు తెలియచేయాల’ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కారుణ్య మరణాలపై దేశ వ్యాప్తంగా చాలా
ఏళ్ళుగా చర్చ సాగుతూనే వుంది. వీటిపై అనేక వార్తా కధనాలతో పాటు, ఈ కధాంశంతో కొన్ని నవలలు, సినిమాలు కూడా వచ్చాయి.
నిరుడు మరణించిన అరుణా షాన్ బాగ్ అనే మహిళ
దీన గాధ ఈ చర్చను మరోమారు తెర మీదకు తీసుకువచ్చింది. చిన్నవయస్సులోనే దారుణమైన లైంగిక అత్యాచారానికి గురై నలభై రెండేళ్ళ పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా
జీవచ్చంలా బతికి కన్నుమూసిన ఈ మహిళ తరపున జరిగిన న్యాయపోరాటం యావత్తు ఈ కారుణ్య మరణాలకు
సంబంధించినదే.
సీవీ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్
కూడా ప్రభుత్వానికి ఇదే మాదిరి సిఫారసు చేసింది. అరుణా షాన్ బాగ్ అనే ఆ నర్సు మాదిరిగా జీవచ్చవంలా బతుకు
ఈడ్చే స్థితికి చేరుకున్నవారికి, కోమాలోకి వెళ్ళిపోయి, తిరిగి ఎంతమాత్రం స్పృహలోకి
వచ్చే అవకాశం లేదని నిర్ధారణ అయిన రోగులకి, కారుణ్య మరణం ఎంచుకునే వీలు
కల్పించాలని లా కమిషన్ సూచించింది.
ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు
మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు
ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా
మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’
అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే
అనుమానం.
సరే ఈ విషయం పక్కనబెట్టి అసలు కారుణ్య
మరణాలకు అనుమతి ఇవ్వడం వల్ల లాభనష్టాలు గురించి ఆలోచిద్దాము. మంచాన పడి, అయిన వారి
దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ
పీడితులకు ఇది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో మంచానికి బందీగా మారి కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు
లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన
పడే వారి సంతానానికి సయితం ఈ కారుణ్య మరణం అనేది ఒక విముక్త మార్గంగా కనిపించవచ్చు.
అయితే కారుణ్య మరణాలకు చట్టబద్ధత
కల్పించడం వల్ల సమాజంలో కొంతమందికి మాత్రమే ఊరట. అదెలా అంటే:
పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా
చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ
మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంత తత్వం మరింత పెరుగుతూ వుంటుంది.
చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే
బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా మానవ మనస్తత్వం ఈ
విధంగానే ఆలోచిస్తూ వుంటుంది అనడానికి
చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్ ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని
విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో
అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన
శరీరం రంగు మారకుండా వుండే విషం కోసం
అన్వేషించి ఒక రకం సర్పాన్ని అందుకోసం ఎంపికచేసుకుంటుంది. చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై, ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా
మరణిస్తుంది.
పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి
స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త
శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం
వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం అందరికీ దక్కదు.
శరీరం రోగగ్రస్తమై, నివారణ కరువై అహరహం
చావుకోసం చకోరపక్షుల వలె కన్నుల్లో వత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూసేవారికి
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, కోర్టులు పరిశీలిస్తున్న ‘యుధనేసియా’ అంటే సునాయాస
మరణ ప్రాప్తి అనేది నిజంగా వరమే.
ఇదొక కోణం. మరొక వాదం కూడా
మెల్లమెల్లగా పురుడు పోసుకుంటోంది. అదేమిటంటే,
ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా
గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా
బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు
హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం. ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు
తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది గొంతెమ్మ కోరికే. అయినా ఆలోచించాల్సిన విషయం.
ఉపశ్రుతి: మొన్నీ నడుమ ఒక ఉదంతం
విన్నాను. మా దూరపు చుట్టం ఒకరు జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చుకున్నారు.
పిల్లల చదువులు, పెండ్లి పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఒక పద్దతిగా పూర్తి
చేసుకున్నారు. పిల్లలు, మనుమళ్ళు కళకళలాడుతూ నట్టింట తిరుగుతూ వున్నవేళ, ఒక రోజు భార్యాబిడ్డలతో
తీరి కూర్చుని కబుర్లు చెబుతూ, చెబుతూ హఠాత్తుగా ఒక పక్కకి ఒరిగిపోయారు. అంతే. ఒక
క్క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. అంతవరకూ నవ్వుతూ కబుర్లు
చెప్పారు. పిల్లలు చెప్పినవి నవ్వుతూ విన్నారు. అలా ఆయన జీవన యానం హాయిగా,
ప్రశాంతంగా ముగిసింది. కోటికొక్కరికి కూడా
లభించని అరుదయిన అవకాశం.
సాధ్యం కాదని తెలిసినా వయసుమళ్ళిన
వాళ్ళలో చాలామంది కోరుకునేది ఇదే.
(17-01-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491
30595
NOTE:
Courtesy Image Owner
లేబుళ్లు:
మరణమా! జీవన్మరణమా! Euthanasia
జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి - ఆయన్ని గురించిన ఓజ్ఞాపకం
ఇరవై ఎనిమిదేళ్ళక్రితంసంగతి
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. పీ ఆర్ వొ, (మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు) తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.
"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.
అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.
దటీజ్ ఎన్టీఆర్.
Below Photo: My sister's son Dr.A.P.Ranga Rao, then Managing Director, Physically Handicapped Corporation was explaining their activities to the Chief Minister Shri N.T.Rama Rao
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




