7, జనవరి 2016, గురువారం

చిత్రమైనది జీవితం


బుధవారం సాయంత్రం ఎటూ పోవాలని అనుకోలేదు. కానీ సాయంత్రం అవుతుండగానే సూర్య నుంచి ఫోను ‘ జింఖానాలో కలుద్దామా’ అని. ఇంటికి పంపేసిన డ్రైవర్ ని మళ్ళీ పిలిపించుకుని వెళ్లాను.
అక్కడ కూర్చుని అవీ ఇవీ మాట్లాడుకుంటూ వుంటే ఒకాయన వచ్చి ‘నేను శేఖర్ రెడ్డినండీ’ అన్నాడు. ఎక్కడో చూసినట్టు వుంది కానీ చప్పున గుర్తుకు రాలేదు.  పైకి మర్యాదకు ‘బాగున్నారా రెడ్డి గారూ’ అని అన్నానే కాని, మనిషిని పోల్చుకోలేక పోయాను. నాకున్న బలహీనతల్లో ఇదొకటి. ఎప్పటివో యాభయ్ అరవై ఏళ్ళక్రితం సంగతులు, ఊళ్లూ, పేర్లూ నా వ్యాసాల్లో రాస్తుండడం చూసి, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని పొరబడుతుంటారు.  రాత్రి అన్నంలో ఏ కూర తిన్నానో మరునాటికి నాకు గుర్తుండదని వాళ్లకు తెలియదు. ఈ  మతిమరపు  పలు  సందర్భాలలో నాకు తలనొప్పులు తేవడమే కాకుండా ‘గర్విష్టి’ అనే బిరుదును కూడా కట్టబెట్టింది.
ఇదలా వుంచితే.....
నేను గుర్తు పట్టలేదన్న సంగతి తెలిసి కూడా  శేఖర రెడ్డి గారు నొచ్చుకోలేదు. అది ఆయన గొప్పతనం.
తిరిగి వెళ్లి మళ్ళీ నాదగ్గరకు వచ్చారు. ఈసారి వారి చేతిలో ముద్దులు మూటగట్టే ఒక బాబు వున్నాడు. ‘నా మనుమడు. మా అమ్మాయి, అల్లుడు కాలిఫోర్నియాలో వుంటారు. ఒక సెల్ఫీ తీసుకుంటాను’ అన్నారాయన.


అప్పటికి కానీ నాకు లైట్ వెలగలేదు. ఆయన వంద్యాల ఫణి శేఖర రెడ్డి గారు. ఫేస్ బుక్ లో, వాట్స్ ఆప్ లో సుపరిచితులు. ఇన్నాళ్ళుగా ఆయన అమెరికాలో వుంటారని అనుకుంటూ వచ్చాను. శ్రీనగర్ కాలనీలోనే  ఉంటారుట.

ఎవరో అన్నట్టు వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్.  

6, జనవరి 2016, బుధవారం

ధన్య పురుషుడు కేవైఎల్


పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా గురువులలో ఈ విభజన వుండదు. గురువులందరూ శిష్యులందరికీ దైవసమానులే.
శిష్యులకు వున్న ఒక  సౌలభ్యం గురువులకు వుండదు. క్లాసులో యాభయ్ అరవై మంది విద్యార్ధులు వున్నా పాఠం చెప్పే మాస్టారు ఒక్కరే. వారందరికీ గురువు గారి రూపం వారి వారి మనస్సులో ముద్రపడిపోతుంది. మేస్టారి పరిస్తితి అలా కాదు, ప్రతి ఏటా కొత్త విద్యార్ధులు వస్తుంటారు. పాత వారు తమతమ జీవితాల్లోకి నిష్క్రమిస్తుంటారు. అందర్నీ చప్పున గుర్తుకు తెచ్చుకోవడం అలవికి మించిన పని.
నిన్న సాయంత్రం హైదరాబాదు గాంధీనగర్ (బాలాజీ టాకీసు, ఇప్పుడు లేదు) దగ్గర ఒక కాలనీలో నివసిస్తున్న  ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎం ఆర్ ప్రభుత్వ కళాశాలలో సుదీర్ఘ కాలం ఇంగ్లీష్ పాఠాలు బోధించిన కే.ఎల్. నరసింహారావు గారిని కలుసుకోవడం జరిగింది. ఇటువంటి సమాగమాలు ఏర్పాటు చేయడంలో దిట్ట జ్వాలా నరసింహారావు. ఆయన అనుకోవడమే తడవు, ఆ కాలేజీలో చదివిన నలుగురం (అందరూ ఒక బ్యాచ్ కాదు) రావులపాటి సీతారామారావు గారు (ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్), భండారు రామచంద్ర రావు గారు ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్), సరే దండలో దారం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, భండారు శ్రీనివాసరావు అనబడే నేనూ ( ఈ ‘బడు’ ధాతువు ‘నార్ల’ స్కూలులో నిషిద్ధం, అయినా అనబడు అనక తప్పడం లేదు) ఇత్యాది ఖమ్మం కాలేజీ మాజీలం (విద్యార్ధులం) కెవైఎల్ గారింటికి వెళ్ళాము. ఆయన కిప్పుడు అక్షరాలా తొంభై రెండేళ్ళు. ఈ సంక్రాంతికి తొంభై తప్పుకుని తొంభయ్ మూడులో అడ్గు పెడతారు.



మేము వెళ్ళే సరికి ఆయన ముందు గదిలో కూర్చుని వున్నారు. మనిషి బాగా సన్నబడ్డారు. జుట్టు పలచ బడింది. కానీ భగవంతుడు ఆయన కిచ్చిన వరం, ‘సుస్వరం’ అంతే పదిలంగా వుంది. అందరం పాద నమస్కారాలు చేసాము, భక్తితో, గౌరవంతో, తన్మయంతో.
మమ్మల్ని చూసి కేవైఎల్ ఎంతో సంతోషపడ్డారు. అరవై ఏళ్ళనాటి పాత విషయాలు గుర్తు చేసుకున్నారు. కాలేజీ విద్యార్ధులతో  ఆయన వేయించిన రవీంద్రనాధ ఠాగూర్ ఇంగ్లీష్ నాటిక  ‘శాక్రిఫైజ్’ గురించీ, కాలేజీకి వచ్చి ఆ నాటిక చూసిన అలనాటి గవర్నర్ భీమసేన్ సచార్ గురించీ ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి పిల్లలు సహదేవ్, కోడలు శోభ, ఇంకో కుమారుడు  అశ్విన్  ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆయన్ని శాస్వితంగా ఒదిలి పరలోకాలకు వెళ్ళిన భార్య దమయంతి దేవిని ఫోటోలో చూసుకుంటూ, కంటి ఎదురుగా తిరుగాడుతున్న కన్న  పిల్లల్ని చూసుకుంటూ, మంచి పుస్తకాలు చదువుకుంటూ హాయిగా, తృప్తిగా కాలక్షేపం చేస్తున్నట్టు చెప్పారు. కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు గారికి మొత్తం తొమ్మిది మంది సంతానం. ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సంస్కార భారతి’కి  అధ్యక్షులుగా పనిచేసారు.  
కేవైఎల్ తానూ రాసిన  ఎన్నో పుస్తకాలను పేరు పేరునా సంతకం చేసి మరీ మాకు కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చారు.

కొత్త ఏడాది ఇలా గురుదర్శనంతో మొదలు కావడం మాకు సంతోషంగా వుంది.            

రాజకీయ మఠాలు

సూటిగా ......సుతిమెత్తగా......
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 07-01-2016, THURSDAY)

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏది మాట్లాడినా కొంతమందికి భలేగా అనిపిస్తుంది. కొంతమందికి పుండు మీద కారం రాసిన చందంగా అనిపిస్తుంది. అభిమాన దురభిమానాలను పక్కనబెట్టి చూసేవారికి ఒక్కోసారి ఆయన మాటల్లో ఇతరులు చెప్పడానికి సంకోచించే వాస్తవాలు బయటపడుతుంటాయి. అలాటి ఒక చేదు నిజాన్నే మరొకటి కేసీఆర్ ఈ మధ్య వెల్లడించారు. ‘తమది రాజకీయ పార్టీ అనీ, ఆహోబిలం మఠం కాద’నీ వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వచ్చింది. చండీయాగ పునీతుడయిన కేసీఆర్ వంటి వ్యక్తి,  మఠాలను, ఆధ్యాత్మిక వ్యవస్థలను కించ పరిచే  తరహాలో వ్యాఖ్యలు చేసివుండడానికి  ఆస్కారం  లేదు.  మడికట్టుకుని రాజకీయాలు చేసే రోజులకు కాలం చెల్లిందని చెప్పడానికి బహుశా , రాజకీయ పార్టీలతో  మఠాల సామ్యం తెచ్చి వుంటారని అనుకోవచ్చు.
కాల ప్రభావం ఏమో తెలియదు కాని, విలువల పతనానికి, అన్ని వ్యవస్థలకు చెందినవాళ్ళు ఇదేవిధమైన హేతువులు చూపుతున్నారు. ప్రతిదీ డబ్బుతో, అధికారంతో ముడిపడివున్న కాలంలో  జీవిస్తూ,  సన్యాసుల మాదిరిగా సర్వస్వం త్యాగం చేయడం కుదరదన్న రీతిలో వారి వాదనలు, సమర్ధనలు సాగిపోతుంటాయి. కాకపొతే ప్రతి అంశంలో ప్రత్యర్దులకంటే నాలుగాకులు ఎక్కువ తిన్నట్టు  డాంబికాలకు పోయే రాజకీయ నాయకులు, నైతిక విలువల విషయం వచ్చేసరికి బాణీ మారుస్తుంటారు. కొన్ని అనైతిక పనులు గతంలో తామూ చేయకపోలేదనీ, కాకపొతే తమ ప్రత్యర్ధులు ప్రస్తుతం చేస్తున్నంత నిస్సిగ్గుగా తాము ఎన్నడూ ప్రవర్తించలేదని తమకు తామే ఒక కితాబు ఇచ్చుకుంటూ వుంటారు. నైతికతలో కూడా హెచ్చుతగ్గులు నిర్ధారించే స్థాయికి దిగజారడం అన్నదే ‘అనైతికతకు’  పరాకాష్ట అని వారి ప్రత్యర్ధులు ఎత్తిపొడుస్తుంటారు.
ఏతావాతా ఉభయుల వాదన ఒక్కటే.  గమ్యం చేరుకోవడం కోసం కాసింత దారి తప్పినా పరవాలేదన్నదే  అసలు విషయం. లక్ష్య శుద్ధి ముఖ్యం కానీ దాన్ని అందుకునే విధానం  ప్రధానం కాదన్నది వారి మనోగతం.      
దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో విలువల పతనం మొదలయింది. కాకపొతే ఆ పతనవేగం, ఉరవడి ఇటీవలి కాలంలో మరింత ఊపు అందుకున్న మాట నిజం.
కేసీఆర్  చెప్పినట్టు రాజకీయ పార్టీలు ‘మఠాలుగా’ రూపాంతరం చెందడానికి పూర్వపు రోజుల్లో కొందరు అసలు సిసలయిన ‘సన్యాసి’ నాయకులు వుండేవాళ్ళు. వాళ్ళల్లో కొందరిని స్మరించుకోవడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.  
నేను రేడియో విలేకరిగా చేరిన కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, మద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలుపర్యాయాలు రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ, ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు  వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు.  1955 నుంచి 1967 వరకు ఆయన  ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని  అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు.  యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్  వెళ్లి  గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా వున్న మండలి బుద్ధప్రసాద్, వావిలాల గురించిన ఒక ఆసక్తికర కధనాన్ని కొన్నేళ్ళ క్రితం రాసారు.
ఒకసారి వావిలాల గుంటూరు నుండి రైల్లో సత్తెనపల్లి వెడుతుంటే ఒక ముసలవ్వ ఆయన్ని తేరిపార చూసి, ‘బాబూ! గోపాల కిష్టయ్యవా’ అందట. ‘అవునవ్వా! నేను నీకు తెలుసా!’అన్నారాయన. ‘తెలియకపోవడమేంబాబూ, నువ్వేగా మాకు బువ్వ పెట్టింది, నందికొండ నువ్వు తీసుకురాకపోతే మాకు బువ్వేడది?’ అందట ఆ అవ్వ.
రాజకీయ పార్టీలను కాదని ఇండిపెండెంటుగా పోటీ చేసిన ఆయన్ని, నందికొండ (నాగార్జునసాగర్) ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషిని  గుర్తించి, అక్కడి ప్రజలు వరసగా అనేక పర్యాయాలు తమ ఎమ్మెల్యేగా  ఎన్నుకున్నారు. తిరిగి అదే వావిలాల వారిని  72, 78 లో జరిగిన ఎన్నికల్లో ఓడించారు. అంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం మొదలయిందన్న మాట. ఆ తరువాత  వావిలాల ఎన్నికల  రాజకీయాలనుంచి శాస్వితంగా తప్పుకున్నారు.
కృష్ణాజిల్లాలోని (ఒకప్పటి) నందిగామ తాలూకా లో బొద్దిల్లపాడు అనే వూరు వుంది. ఆ గ్రామానికి వరసగా అనేక సంవత్సరాలపాటు సాయి అనే ఆయన సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. చాలా సాదాసీదా మనిషి. సైకిల్ వేసుకుని ఊళ్ళు తిరుగుతూ ప్రజల సమస్యలని దగ్గరనుంచి గమనిస్తూ, వాటి పరిష్కారంకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఆయన నిరాడంబరతను గమనించి స్థానికులు ఆయన్ని ‘నందిగామ గాంధీ’ అని పిలుచుకునే వాళ్ళు.
ప్రజలు ఏదైనా సమస్యతో వస్తే వాటిని పరిష్కరించే రాజకీయ నాయకులు చాలామంది వుంటారు. ఈ ‘గాంధీ’ అలా కాదు, ఎవరు ఎక్కడ ఏ సమస్యలతో వున్నారో వెతుక్కుంటూ సైకిల్ పై గ్రామాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. అందుకే  చుట్టుపక్కల వూళ్ళ  జనాలు ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు. అలాటి గాంధీని ఒక రాజకీయ పార్టీ వాళ్ళు పట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్ధిగా నిలబెట్టారు. అయన సైకిల్ మీదనే ప్రచారం చేసుకున్నారు. అయినా ఏం లాభం? సమస్యల పరిష్కారానికి పనికివచ్చిన మనిషి, ఎవరికి ఏ సమస్య వున్నా నేనున్నానంటూ పరిగెత్తుకు వచ్చే మనిషి  ఎన్నికల్లో మాత్రం పనికి రాకుండా పోయాడు. ప్రజల చేతుల్లో  పరాజయమే ఆ ‘నందిగామ గాంధీకి’ చివరికి మిగిలింది.
గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న చరిత్రను గమనిస్తే ఈ తరగతికి చెందిన ‘రాజకీయ సన్యాసులు’ ఇక చరిత్ర పుటలకే పరిమితం అన్న నిర్వేదం కలగడం సహజం. ఎన్నికల్లో చేతులు మారుతున్న డబ్బు సంచులు,  ఏరులై పారుతున్న మద్యం, కులాల  కుంపట్లు, వెరసి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తున్నాయి. ఎంతటి ప్రజాభిమానం కలిగిన నాయకులయినా, లేదా వారు నేతృత్వం వహించే పార్టీలయినా ‘నైతికతకు’ కట్టుబడి వ్యవహరించడం కనాకష్టంగా మారిన పరిస్తితులు ఏర్పడ్డాయి.
ఈ దుస్తితికి ఏ ఒక్కరో, ఏ ఒక్క పార్టీనోపార్టీనో కారణం కాదు. అందరికీ ఇందులో ఎంతో కొంత వాటా వున్న  మాట నిజం. అందరికీ ఆ విషయం తెలుసు. తెలిసీ ఆ ‘అడుసు’ నుంచి బయటపడలేని అనివార్యత వాటిది.
ఎన్నికల్లో ఖర్చు అలవికాని విధంగా పెరిగిపోతోందని రాజకీయ  నాయకులు తరచుగా అంటుంటారు. అయిదారు ఎన్నికల్లో వరసగా గెలుస్తూ వచ్చిన  ఒకాయన, పోటీ చేయడం భవిష్యత్తులో తనవల్ల కాదని చెప్పారు.
ఓటర్లకు  ఆశలు బాగా పెరిగిపోతున్నాయని వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కుదిరేపని కాదని రాజకీయ నాయకులు అంటుంటారు. ‘పదీపరకా తమకిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచిన నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాగించిన బేరసారాలతో పోలిస్తే ఇదెంత పాట’న్నది ఆయనకు ఓటు వేసిన వారి అభిప్రాయం. ఓట్ల కొనుగోలు అన్నది  ‘అభిలషించని అనివార్యత’ గా మారిపోయినప్పుడు ఇటువంటి తలనొప్పులు తప్పవు.
 ఎన్నికలకు ముందు ‘ఎన్నికల ప్రణాళిక’ పేరుతొ ఓటర్లకు వేసే వాగ్దానగాలాలు ఒక ఎత్తు. గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత, పన్నుల పేరుతొ ఖజానాలో చేరిన ప్రజాధనాన్ని ‘రద్దుల’ పేరిట ఇష్టారాజ్యంగా  పేలాలుగా పందారం చేయడం మరో  ఎత్తు. ఈ ఎత్తుజిత్తులన్నీ అధికార పీఠాన్ని పది కాలాలపాటు పదిలం చేసుకోవడం కోసమే అని ఎవరయినా అంటే అసహనం ప్రదర్శించడం ఇంకో ఎత్తుగడ.

ఉపశ్రుతి:
ముళ్ళపూడి వారి అప్పారావు పాత్ర అంటుందో సందర్భంలో. సూర్యుడు సముద్రం నుంచి మేఘాల రూపంలో నీటిని అప్పుతీసుకుని తిరిగి వానల రూపంలో చెల్లిస్తాడని. అలాగే వుంది నేటి రాజకీయ వ్యవస్థ.
ఎన్నికల్లో ఓట్లు కొనుక్కుని అధికారంలోకి రావడం, దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో సంపాదించిన డబ్బుని తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెట్టడం. ఇదొక విష చక్ర భ్రమణం.  (06-01-2016)     
 రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  
NOTE: Courtesy Image Owner               


2, జనవరి 2016, శనివారం

అవకాశాల దేశం అమెరికా


సూటిగా.... సుతిమెత్తగా...... భండారు శ్రీనివాసరావు
(Published in 'SURYA' telugu daily on 03-01-2016, SUNDAY)
  
చెన్నై నగరం జెమిని సర్కిల్ లో వైట్స్ రోడ్ అనేది ఆ నగర వాసులకంటే కూడా ఇప్పుడు
అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా డాలర్లు గడిస్తున్న తెలుగు, తమిళ పిల్లలకు మరింత సుపరిచితం.
ఇప్పటి పరిస్తితి ఏమో కానీ ఓ పాతికేళ్ళ క్రితం ఆ వీధినానుకుని వున్న అమెరికన్ ఎంబసీలో వీసాలకోసం తెల్లవారుఝామున మూడుగంటల నుంచే గంటల తరబడి క్యూ ల్లో నిలబడి వేచి చూసిన దినాలను గుర్తు చేసుకోవడానికి వారిలో ఎవరూ ఇష్టపడరు.  (కోటి  ఆశలు కళ్ళల్లో  పెట్టుకుని  కాళ్ళు  లాగేలా  నిలబడి  వీసాలు పొందిన  ఆ యువతీ యువకుల్లో చాలామంది ఇప్పుడు  ఆ దేశపు  పౌరసత్వం పుచ్చుకుని,  మళ్ళీ  అదే  ఎంబసీ లోకి కాలర్  ఎగరేసుకుంటూ అనేక సార్లు వెళ్లి వుంటారు కూడా. అది వేరే సంగతి.)
తమ కలల దేశం అమెరికా వెళ్లాలనే తమ కోరిక తీరడం అన్నది ఎంబసీ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడివుంటుందని వారికి బాగా తెలుసు. అమెరికన్ అధికారులను ఒప్పించడానికి, మెప్పించడానికి  వీలైన అన్ని మార్గాలను అన్వేషించిన తరువాతనే ఆ గుమ్మంలో కాలుమోపుతారు. వీసా తిరస్కృతికి గురికాకుండా చూసుకోవాలనే వారి ఆతృతను డబ్బు చేసుకునే దళారీ సంస్థలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అవసరమైన పత్రాలు, , ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు, చెప్పాల్సిన జవాబులు ఇవన్నీ భారీ ఫీజులు వసూలు చేసి సిద్ధంగా అందివ్వగల నైపుణ్యాలు వాటి సొంతం. ఇవన్నీ వాటి బాగుకోసమే కానీ తమ బాగు కోసం కాదని తెలియని అమాయకులు డబ్బు పోగొట్టుకుంటూ, అమెరికా వెళ్ళాలనే కోరిక తీరకుండా సొంతగడ్డ మీదనే కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరు వీసాలు దొరికి అమెరికా వెళ్ళిన తరువాత అక్కడి అధికారుల చేతికి చిక్కి తిరుగుముఖం  పడుతుంటారు.  ఈ మధ్య అమెరికా వెళ్ళిన కొందరు తెలుగు విద్యార్ధులకు ఈ మాదిరి చేదు అనుభవమే ఎదురయింది.
అమెరికన్ ఎంబసీ  జారీ చేసిన వీసాలతో విమానం ఎక్కిన ఆ విద్యార్ధులు,  తమ కలలు నిజం కాబోతున్నాయన్న ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరి కాబోతోందని,  ఊహాతీతమైన అనుభవం తమకి అమెరికా గడ్డపై ఎదురు కాబోతున్నదని ఏమాత్రం ఊహించలేకపోయారు. తమ అమెరికా ప్రయాణం కాలిఫోర్నియా విమానాశ్రయం దగ్గరే ముగియబోతున్నదనీ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ కలలపై నీళ్ళు చల్లబోతున్నారనీ వారు అనుకోలేదు. ఉన్నత చదువులకోసం దేశం విడిచి వెళ్ళిన తమ పిల్లలు తిరుగు టపా మాదిరిగా తిరిగొస్తారని వారి తలితండ్రులూ అనుకోలేదు.  ఆ విద్యార్ధుల్లో  కొందరు అమెరికా దాకా వెళ్లి తిరిగొస్తే మరికొందరు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదు. మార్గమధ్యంలో దుబాయ్ నుంచే వారిని తిప్పి పంపేసారు. 
ధర్మం కోణం నుంచి చూస్తే  అయితే, అమెరికన్లకు వారి చట్టమే ముఖ్యం. వారి రూలు పుస్తకమే వారికి బైబిల్.
చెన్నై లోని అమెరికన్ ఎంబసీలో ఏళ్ళ తరబడి పనిచేసిన మాగంటి కోటేశ్వరరావు  అభిప్రాయం కూడా అదే. నిబంధనలు వారు ఖచ్చితంగా పాటిస్తారనీ, మన దేశపు పౌరుల్లో నిబంధల పాటింపు పట్ల అంత పట్టింపు లేకపోవడం వల్లనే ఈ తంటాలనీ ఆయన అభిప్రాయం. ఎంబసీ అధికారి అయిన తన విషయంలోనే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈషన్మాత్రపు కనికరం కూడా చూపించలేదని మాగంటి,  అమెరికన్ వీసాల గురించి రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. 

అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయినందునే వారిని తిప్పి పంపడం జరిగిందని ఒక వివరణ ప్రచారంలో వుంది.
విద్యార్ధులను వెనక్కి పంపిన విషయమై అమరికన్ అధికారులు పెదవి విప్పడం లేదు. వారు చేరాల్సిన అమెరికన్ యూనివర్సిటీల చరిత్ర పట్ల అనుమానాలు కూడా విద్యార్ధులను తిప్పి పంపడానికి కారణంగా పేర్కొంటున్నారు. అదే నిజమనుకున్నా, వారి యూనివర్సిటీలు గురించి వారికే బాగా తెలిసి వుండాలి. మరి అటువంటి యూనివర్సిటీల్లో చేరడం కోసం వీసాకు ధరఖాస్తు పెట్టుకుంటే, తెలిసి తెలిసి అధికారులు వీసాలు ఎలా మంజూరు చేసారు, తొలి దశలోనే తిరస్కరించి వుంటే ఇన్ని ఇబ్బందులు, మనో వేదన ఉండేవి కావన్నది బాధితుల రోదన.  
నిబంధనలు ఏర్పరచుకుని, వాటిని ఖచ్చితంగా పాటించడానికి అలవాటు పడిన ఆ దేశస్తులకు ఈ రోదనలు వినబడే అవకాశం లేదు.
“అమెరికా ఒక కోటలాంటిది కాదు, కోటలా వుండాలని కూడా మేము కోరుకోవడం లేదు. అరమరికలు లేని స్వేచ్చా సమాజం మాది. అయితే ఇక్కడ చట్టానికి గల హక్కులను మేము పరిరక్షించాల్సివుంది. ఇక్కడ పనిచేయడానికి, చదువుకోవడానికి, మా దేశం చూడడానికి ప్రపంచం నలుమూలల  నుంచి వచ్చే చట్టబద్ధ పౌరుల హక్కులను కూడా మేము కాపాడాలి. అది మా కర్తవ్యం” – 2002 మే ఒకటో తేదీన సరిహద్దు భద్రతా, వీసా ఎంట్రీ కొత్త చట్టంపై సంతకం చేస్తూ ఆనాటి  అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ చెప్పిన మాటలివి.
సెప్టెంబర్ పదకొండు దుర్దినంగా ఆ దేశం పేర్కొనే దురదృష్టకర విధ్వంస సంఘటనల అనంతరం, అమెరికా ఈ చట్టాన్ని మరింత కఠిన తరం చేసింది.
అయినా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువతరంలో అమెరికాపై ఆశలు అడుగంట లేదు. పైపెచ్చు ఆ దేశం వెళ్లి తీరాలన్న పట్టుదల నానాటికీ పెరుగుతోంది. దీనికి ప్రధాన  కారణం, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వారి వారి ప్రతిభనుబట్టి అవకాశాలు లభిస్తూ వుండడం. నిరుడు ఒక్క ఏడాదిలోనే మన దేశం నుంచి వేలాదిమంది విద్యార్ధులు, ఉద్యోగార్ధులు చట్ట బద్ధమైన వీసాలతో అమెరికాలో అడుగు పెట్టారు. తమ కలలను నిజం చేసుకునే పనిలో పడ్డారు.
ఐటీ విప్లవం అందించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇటీవలి సంవత్సరాలలో  లక్షలాదిమంది యువతీయువకులు అమెరికా బాట పట్టారు. తమ జీవితాలను, తమ కుటుంబాల ఆర్ధిక పరిస్తితులను మెరుగుపరచుకుంటున్నారు. విద్యాగంధానికి నోచుకోని వారి తలితండ్రులు సయితం అమెరికా వైభోగాలను అనుభవిస్తున్నారు. చిన్నకారు  రైతులు, పల్లెటూరి బడుల్లో పాఠాలు  చెప్పే మాస్టార్లు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, ఇలా ఒక తరగతి అని కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు వీరిలో కానవస్తారు.
ఒకరిని చూసి మరొకరు పెంచుకున్న అమెరికా ఆకర్షణ ఒక బలమైన అయస్కాంతంలా అందర్నీ ఆకర్షిస్తోంది. అమెరికా కల సాకారం చేసుకోవడం అన్ని తరగతులకు చెందిన కుటుంబాలు కఠోర శ్రమకు పూనుకుంటున్నాయి. వీరి ఆకాంక్షకు తగ్గట్టుగా ఏజెన్సీలు వెలిసాయి. వీసాలు ఎలా పొందాలి, అమెరికా విద్యాసంస్థల్లో ఎలా ప్రవేశం సంపాదించాలి, ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ దేశంలో ఉద్యోగం ఎలా దొరకబుచ్చుకోవాలి? ఇలాటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం మొదలయిన ఈ సంస్థలు, ఇందులో వున్న డబ్బు రుచి మరిగి, అడ్డమైన డబ్బు సంపాదించడంకోసం అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టాయి. ఇక్కడి చట్టాలకు, అక్కడి అధికారులకు దొరక్కుండా పని జరిపించడం వీటి పని. అధికారులకి పట్టుబడని వాళ్ళు ఆ దేశం చేరుకొని తాము తొక్కిన  పెడ మార్గాలు గురించి ఇతరులకి బోధిస్తున్నారు. ఎలాగైనా సరే అమెరికా వెళ్లి తీరాలి అని అనుకునే వాళ్ళు అటువంటి సంస్తలనే ఆశ్రయిస్తున్నారు. వున్నవిషయం ఒప్పుకోకతప్పదు. ఇటువంటి విషయాల్లో అగ్రస్థానంలో వున్నది మన తెలుగువాళ్ళే అన్నది బహిరంగంగా చెప్పుకునే మాట.
ఇప్పటికే అమెరికా చేరి విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నవారిని కొన్ని అమెరికన్ విద్యాసంస్థలు ప్రలోభపెట్టి వారిని తమ ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆరోపణ కూడా వినబడుతోంది. కొత్త  విద్యార్ధులను చేర్పించడానికి పాత విద్యార్ధులకు ఎర వేస్తున్నారనీ, అంచేతే నాణ్యత లేని విద్యాలయాలకు కూడా విద్యార్ధులు వెళ్లి చేరుతున్నారని అంటున్నారు. ఆ దేశంలోని కొన్ని యూనివర్సిటీలు కేవలం విదేశీ  విద్యార్దులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని కూడా చెప్పుకుంటారు. చట్టబద్ధ పాలనకు కట్టుబడి వున్నామని చెప్పుకునే అమెరికాలో ఈ విడ్డూరం ఏమిటో అర్ధం కాదు. వారి అవసరాలు, మనవారి ఆత్యాశలు వెరసి ఈ దుస్తితి దాపురించి వుంటుంది. సరిదిద్దుకునే ప్రయత్నం ఇరువైపులా మొదలు కావాలి.
అంతవరకూ  కలల్నే కాదు, పీడ కలల్ని కూడా  భరించక తప్పదు. (02-01-2016)
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


1, జనవరి 2016, శుక్రవారం

అలవాటులేని ఔపోసనం

మాది అంటే నాది మా ఆవిడది (కలిపి)  గుళ్ళో పెళ్లి.
1971 డిసెంబరు  16 వ తేదీన తిరుపతిలో ‘Simple than the word simple’ గా జరిగింది. మరి  ఆ పెళ్లి సంగతి నలుగురికీ తెలియడం ఎల్లా?  ఈ  ఆలోచనే నన్ను మొదటి సారి  ‘గ్రీటింగ్ కార్డు’  ఐడియా దిక్కుగా అడుగు వేయించింది. గ్రీటింగ్ కార్డుల పేరుతొ డబ్బులు తగలేయడం వృధా అని అప్పటివరకు అనుకుంటూ ఉండేవాడిని.
తిరుపతి నుంచి రాగానే  ముందు బెజవాడ  గవర్నర్ పేట లోని వాణీ ప్రెస్ కి వెళ్లి, నా పేరూ, మా ఆవిడా పేరూ కలిపి  ఓ వంద గ్రీటింగు కార్డులు ప్రింటు చేయించాను. చుట్టపక్కాలకి వాటిని పోస్ట్ చేస్తున్నప్పుడు మరో బ్రిలియంట్ ఐడియా మనసులో మెదిలింది. ముందూ వెనుకా చూడకుండా  దాన్ని వెంటనే ఆచరణలో పెట్టేసాను. పనిలో పనిగా ఆఫీసులో నా తోటి సిబ్బందికి కూడా ఆ చేత్తోనే  గ్రీటింగు కార్డులు పోస్ట్ చేసాను.


జనవరి ఒకటో తేదీ రానే వచ్చింది. నేను పనిచేసే లబ్బీపేట  ఆంధ్రజ్యోతి ఆఫీసుకి వెళ్లాను. మొదటి అంతస్తులో గుర్రపు నాడా ఆకారంలోని బల్ల చుట్టూ సబ్ ఎడిటర్లం అందరం  కూర్చునే వాళ్ళం. మధ్యలో న్యూస్ ఎడిటర్ వీరభద్రరావు గారు,  ఆ దాపునే అసిస్టెంట్ ఎడిటర్ తుర్లపాటి కుటుంబ రావు గారు, ఆ పక్కనే ఇంచార్జ్  ఎడిటర్ నండూరి రామ్మోహన రావు గారు ఇలా అందరం  కూర్చుని వున్న  సమయంలో అటెండర్ నాగేశ్వర రావు నా దగ్గరకు  వచ్చి పలకరించాడు.
‘ఇన్నేళ్ళుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఒక్కరంటే ఒక్కరు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పిన పాపాన పోలేదు. మీరు నిజంగా గ్రేట్.  ఏకంగా  గ్రీటింగు కార్డే నా పేరు మీద  పోస్ట్ చేసారు. చాలా చాలా థాంక్స్ అండీ’ అన్నాడు, అందరూ వింటుండగా. అందరూ నా వైపు గుర్రుగా చూసినట్టు అనిపించింది.  ఇంతమంది వుంటే అందర్నీ కాదని ఆఫీసులో పని చేసే అటెండర్ కి  గ్రీటింగ్ కార్డా అన్నట్టు చూసారు. మర్నాడు పరిస్తితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. పోస్టల్ వాళ్ళ పుణ్యమా అని, ఒకే రోజున నేను పోస్ట్ చేసిన కార్డులన్నీ  లెక్క పెట్టినట్టు రోజుకొక్కటి  చొప్పున ఒక్కొక్కరికి, అదీ అడ్డదిడ్డంగా  రావడం, రానివాళ్ళు నా వైపు మరోసారి అదోలా చూడడం ఇదంతా ఇబ్బందిగా మారింది. కార్డు  వచ్చిన వాళ్ళు కూడా,  విషయం తెలిసిపోయి  మళ్ళీ పోస్ట్ చేసి వుంటాడు కానీ మన మీద అతగాడికి అంత కారిపోయే ప్రేమ లేదని  పరోక్షంలో గొణుక్కున్నారేమో తెలవదు.  కానీ ఆ  ఫీలింగు మాత్రం నన్ను పట్టుకుంది.  వారం పది రోజులు ఇలా ఇదో సీరియల్ లాగా సాగింది. ‘చక్కటి కవిత్వం రాసాడు’ అని మెచ్చుకుంటారని అనుకుంటే సీను కాస్తా రివర్స్  అయింది.
గ్రీటింగు కార్డు ‘గ్రివింగ్ కార్డు అవడం  అంటే ఏమిటో తెలిసివచ్చింది.
అంతే! నేను మరుసటి ఏడు నుంచి మళ్ళీ నా పాత పద్ధతికి మళ్ళిపోయాను.

గ్రీటింగులు అందుకోవడమే కానీ పంపే పద్ధతికి స్వస్తి చెప్పాను.           

31, డిసెంబర్ 2015, గురువారం

HAPPY NEW YEAR – 2016



"వొత్తిలా వెలగండి

కత్తిలా మెరవండి

కొత్త ఏడాదిలో

ఎత్తుగా ఎదగండి!

"అత్తరువు గంధమై

చిత్తరువు చందమై

కొత్త ఏడాది

మిము హత్తుకోవాలి!"

నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR - 2016

-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్


NOTE:Courtesy Image Owner

30, డిసెంబర్ 2015, బుధవారం

2015


సూటిగా............సుతిమెత్తగా........... భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN"SURYA" TELUGU DAILY ON 31-12-2015, THURSDAY)

2015లో ఇది ఆఖరి రోజుకావొచ్చేమో కానీ ఇదే చివరాఖరి రోజు కాదు.
అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  ఈ ఏడాది సెలవు తీసుకుంటోంది. కొత్త ఏడాది సరికొత్త ఆశలతో గుమ్మంలో నిలబడి వుంది.


గతంలోకి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్న ఏడాదిని విహంగ వీక్షణం చేస్తే –
కోటి ఆశలతో జనాలు గద్దె ఎక్కించిన మోడీ సర్కారు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘం రూపురేఖలు మార్చి ‘నీతి అయోగ్’ పేరుతొ ఏర్పరచిన కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో ఈ కొత్త ఏడాది మొదలయింది. అంతకుముందు 2014 వ సంవత్సరం  మోడీకి అందించిన అపూర్వ విజయాలు  2015 లో ఆవిరి అయిపోయాయి. ఏడాది మొదట్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల రూపంలో ఎదురయిన ఎదురు గాలులు, ఏడాది మధ్యలో జరిగిన బీహారు ఎన్నికల నాటికి ప్రచండ రూపం ధరించాయి. ఘన విజయాలను మూటగట్టుకున్న ఒడిలోకే ఏడాది తిరక్కముందే ఘోర పరాజయాలు వచ్చి చేరాయి. దీన్ని రాజకీయాల్లో ప్రజలు ప్రదర్శించే చమత్కారం అనుకోవాలేమో!
ప్రధాన మంత్రి మోడీ ఏడాది కాలంలో జరిపిన అనేక విదేశీ పర్యటనలు బయట దేశాల్లో ప్రశంసలను  వెల్లువెత్తిస్తే, స్వదేశంలో అనేక వర్గాలనుంచి ఆయనపై  విమర్శల జడివానలు కురిపించాయి. ఏడాది చివర్లో జరిపిన చివరాఖరు పర్యటనలో మోడీ విసిరిన  వ్యూహాస్త్రం విమర్శకుల నోళ్లకు తాళం వేయించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగొస్తూ, మార్గమధ్యంలో అనుకోని విధంగా  లాహోరులో దిగి పాక్ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వయంగా తెలిపిన తీరు అంతర్జాతీయంగా మోడీకి  మంచి  పేరు తెచ్చిపెట్టింది. కాకపొతే కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కారు వంట గ్యాసు సబ్సిడీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని  ప్రజలు ఎంతవరకు జీర్ణించుకుంటారనేది నూతన సంవత్సరంలో తేలుతుంది.
‘కలలు కంటూ వుండండి, వాటిని నిజం చేసుకోండి’ అని భారత యువతకు ఉద్బోధించిన  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2015 జులైలో కన్నుమూయడం   ప్రజలకు తీరని వ్యధ. అబ్దుల్ కలాం  స్పూర్తితో మొదలయిన భారత అంతరిక్ష పరిశోధనలు ఒక మైలు రాయిని అదే ఏడాది చేరుకోవడం అనేది ఆయన స్మృతికి ఒక ఘన నివాళి.             
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, కొత్తగా ఏర్పడ్డ  రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది పరిస్తితులు కొంత కుదుట పడుతున్నట్టే అనిపిస్తోంది.
ఉమ్మడి రాజధానిలో వుండడానికి పదేళ్ళ వ్యవధానం వున్నాకూడా, సొంత రాష్ట్రానికి వెంటనే తరలివెళ్ళాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆలస్యంగా అయినా సరయిన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నవజాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఒకచోటా, పాలకులు మరో చోటా వుండే  పరిస్తితి మంచి పాలనకు మంచిది కాదు. రాజధాని అమరావతి నిర్మాణానికి పునాది రాయి కూడా పడింది. కళ్ళు చెదిరే ఆధునిక రాజధాని ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఇక శుభస్య శీఘ్రం అనుకుంటూ అడుగు ముందుకు వేయడమే మంచి  పద్దతి.
గతిస్తున్న ఏడాది  ఆంద్ర ప్రదేశ్  ప్రజలకు  చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెడుతోంది. అట్టహాసంగా మొదలయిన గోదావరి పుష్కరాల్లో తొలినాడే చోటుచేసుకున్న అపశ్రుతి ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో యాత్రీకులు ప్రాణాలు పోగొట్టుకోవడం విషాద పరిణామం. హైదరాబాదులో బయటపడిన ‘నోటుకు ఓటు’,  బెజవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారాలు చంద్రబాబు ప్రభుత్వానికి సమర్ధించుకోలేని సంగతులుగా మిగిలాయి. ప్రతిదానికీ ప్రతిపక్షాన్ని బాధ్యులుగా చేసి తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ చేదు నిజాన్ని తెలుగుదేశం నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గత ఇరవై మాసాల కాలంలో  ఎంతో చేశామని చెప్పుకుంటున్నా ఇంకా చేయాల్సింది  చాలావుంది, అవన్నీ  పూర్తి చేయడానికి తమకున్న వ్యవధానం చాలా తక్కువ అన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు సర్కారు యెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో కొత్త ఏడాదిలో అయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది. ఈ దిశగా కొత్త ఏడాదిలో తన వ్యూహాలకు చంద్రబాబు  కొత్త రూపం ఇవ్వాల్సి వుంటుంది.
ఇక జగన్ మోహన రెడ్డి. ఎదురు గాలుల్లోనే ఆయన పార్టీ తొలినుంచీ రాజకీయ పయనం సాగిస్తోంది. ఈ ఏడాదీ అలాగే సాగింది. సాధారణంగా అధికారం ఎటు వుంటే అటు మొగ్గుచూపే, అటే వాలిపోయే ఈనాటి రాజకీయ  వాతావరణంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. శాసన సభ్యులు కట్టు దాటకపోవడం ఒక్కటే ఆయనకు మిగిలిన ఊరట. ప్రధాన  ప్రతిపక్షంగా సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారనే అపప్రధ ఆయన మీద వుంది.  ఇది పోగొట్టుకోవడానికి వీలైన దిద్దుబాటు చర్యలు కొత్త ఏడాదిలో తీసుకోవడం అవసరం. 
పొతే, తెలంగాణా వ్యవహారం.
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. వరంగల్ ఉపఎన్నికలో సాధించిన అపూర్వ ఘన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసింది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్సలు పట్టించు కోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు. అందుకే పన్నెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం అన్నింటినీ కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నం ఇందుకు అద్దం పడుతోంది.   టీఆర్ ఎస్  ఖాతాలో  ఆరు ఏకగ్రీవంగా పడగా, ఆరింటికి ఎన్నికలు జరిగాయి. వాటిల్లో రెండింటిని కాంగ్రెస్ ఎగరేసుకుపోవడం కొసమెరుపు. అయినా కానీ, పన్నెండు స్థానాల్లో పదింటిలో టీఆర్  ఎస్ సాధించిన గెలుపు , మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి లభించినవి రెండే అయినా ఆ పార్టీకి ఈ గెలుపు అయాచిత వరం. తెలంగాణా ఇచ్చింది కేంద్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు న్యాయం జరగలేదని బాధపడుతున్న టీ. కాంగ్రెస్ నాయకులకు ఈ విజయం ఎడారిలో ఒయాసిస్సు లాంటిది.
కాలం ఎలాటి మార్పులు తెస్తుంది అనడానికీ,  ఆ మార్పులు రావడానికి ఎంతో కాలం పట్టదు అన్న వాస్తవానికీ,  ఢిల్లీ, బీహారు, వరంగల్, మండలి ఎన్నికల ఫలితాలు మచ్చు తునకలు. 
2014 లో కనీవినీ ఎరుగని ఘన విజయం సాధించిన మోడీ  ఏడాది తిరక్కముందే జరిగిన ఢిల్లీ, బీహారు ఎన్నికల్లో అతి దారుణ పరాజయం చవిచూశారు. అలాగే  వరంగల్ ఉప ఎన్నికలో, అన్ని ప్రతిపక్షాలను మట్టికరిపించి  టీఆర్ ఎస్ ను  మురిపించిన ఘనాతిఘన విజయం, కొద్ది నెలలు గడవక ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని రుచి చూసేలా చేసింది.
2015 అనుభవాల నుంచి రాజకీయ పార్టీలు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. లభించిన విజయం ఆఖరిది అనుకుని పనిచేయాలి. అప్పుడే మరో గెలుపు  తలవాకిట నిలుస్తుంది. పలకరించిన పరాజయం చిట్ట చివరిది అనుకుని తిరిగి కష్టపడాలి. అప్పుడే కొత్త విజయం తలుపు తడుతుంది.
365 ఖాళీ పేజీల 2016  కొత్త పుస్తకం  తయారుగా వుంది. మంచి వాక్యంతో మొదలు పెట్టమని కోరుతోంది.
ఉపశ్రుతి:
అయుత చండీయాగం అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియని వ్యవహారం. అలాంటి అపూర్వ యాగాన్ని, తెలంగాణా ముఖ్యమంత్రి  కేసీఆర్ అద్భుతంగా చేసి చూపించారు. నిజానికి ఒక  రకంగా   2015 సంవత్సరానికి ఇదే కొసమెరుపు. ‘ఈ యాగం విశ్వ శాంతికోసం’ అని కర్తలు చెప్పుకొచ్చారు. కాకతాళీయం కావచ్చుకాని, ప్రధానమంత్రి మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇది మొదటి అడుగని అందరూ అంటున్నారు. అదొక విషయం. పొతే, ఈ యాగం కేసీఆర్ కి వ్యక్తిగతంగా బాగా కలిసివచ్చిందని, హైదరాబాదులో స్థిరపడ్డ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి గృహిణుల్లో మునుపు ఆయనపట్ల వున్న ఒకింత వైమనస్య  వైఖరి ఇప్పుడు  సానుకూలంగా మారిపోయిందని, జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్న ఒక పెద్దమనిషి తన సొంత అనుభవం చెప్పుకొచ్చారు. యాగం జరిగినన్ని రోజులూ ఇళ్ళల్లో ఆడంగులు  టీవీలకి అతుక్కుపోయి చూస్తూ, ప్రతి  అంశాన్ని పరిశీలనగా గమనిస్తూ,   యాగదీక్షలో వున్న కేసీఆర్, అత్యంత  నిష్టగా, త్రికరణశుద్ధిగా క్రతువును నిర్వహించిన తీరును వేనోళ్ళ మెచ్చుకున్న వైనాన్ని  ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రతి పనికీ ఒక ఫలితం ఉన్నట్టే, ప్రతి యాగానికీ ఒక ప్రతిఫలం ఉంటుందేమో! (31-12-2015)

రచయిత ఈమెయిల్ : bhandarusr@gmail.com  మొబైల్:  98491 30595
NOTE: Courtesy Image Owner