సూటిగా.... సుతిమెత్తగా...... భండారు
శ్రీనివాసరావు
(Published in 'SURYA' telugu daily on 03-01-2016, SUNDAY)
(Published in 'SURYA' telugu daily on 03-01-2016, SUNDAY)
చెన్నై నగరం జెమిని సర్కిల్ లో వైట్స్
రోడ్ అనేది ఆ నగర వాసులకంటే కూడా ఇప్పుడు
అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు
చేస్తూ రెండు చేతులా డాలర్లు గడిస్తున్న తెలుగు, తమిళ పిల్లలకు మరింత సుపరిచితం.
ఇప్పటి పరిస్తితి ఏమో కానీ ఓ పాతికేళ్ళ
క్రితం ఆ వీధినానుకుని వున్న అమెరికన్ ఎంబసీలో వీసాలకోసం తెల్లవారుఝామున మూడుగంటల
నుంచే గంటల తరబడి క్యూ ల్లో నిలబడి వేచి చూసిన దినాలను గుర్తు చేసుకోవడానికి
వారిలో ఎవరూ ఇష్టపడరు. (కోటి ఆశలు కళ్ళల్లో
పెట్టుకుని కాళ్ళు లాగేలా
నిలబడి వీసాలు పొందిన ఆ యువతీ యువకుల్లో చాలామంది ఇప్పుడు ఆ దేశపు
పౌరసత్వం పుచ్చుకుని, మళ్ళీ అదే
ఎంబసీ లోకి కాలర్ ఎగరేసుకుంటూ అనేక
సార్లు వెళ్లి వుంటారు కూడా. అది వేరే సంగతి.)
తమ కలల దేశం అమెరికా వెళ్లాలనే తమ
కోరిక తీరడం అన్నది ఎంబసీ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడివుంటుందని వారికి బాగా
తెలుసు. అమెరికన్ అధికారులను ఒప్పించడానికి, మెప్పించడానికి వీలైన అన్ని మార్గాలను అన్వేషించిన తరువాతనే ఆ
గుమ్మంలో కాలుమోపుతారు. వీసా తిరస్కృతికి గురికాకుండా చూసుకోవాలనే వారి ఆతృతను
డబ్బు చేసుకునే దళారీ సంస్థలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అవసరమైన పత్రాలు, , ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు, చెప్పాల్సిన జవాబులు ఇవన్నీ భారీ
ఫీజులు వసూలు చేసి సిద్ధంగా అందివ్వగల నైపుణ్యాలు వాటి సొంతం. ఇవన్నీ వాటి
బాగుకోసమే కానీ తమ బాగు కోసం కాదని తెలియని అమాయకులు డబ్బు పోగొట్టుకుంటూ, అమెరికా వెళ్ళాలనే కోరిక తీరకుండా సొంతగడ్డ మీదనే కాలక్షేపం
చేస్తుంటారు. మరికొందరు వీసాలు దొరికి అమెరికా వెళ్ళిన తరువాత అక్కడి అధికారుల
చేతికి చిక్కి తిరుగుముఖం
పడుతుంటారు. ఈ మధ్య అమెరికా
వెళ్ళిన కొందరు తెలుగు విద్యార్ధులకు ఈ మాదిరి చేదు అనుభవమే ఎదురయింది.
అమెరికన్ ఎంబసీ
జారీ చేసిన వీసాలతో విమానం ఎక్కిన ఆ విద్యార్ధులు, తమ కలలు నిజం
కాబోతున్నాయన్న ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరి కాబోతోందని, ఊహాతీతమైన
అనుభవం తమకి అమెరికా గడ్డపై ఎదురు కాబోతున్నదని ఏమాత్రం ఊహించలేకపోయారు. తమ
అమెరికా ప్రయాణం కాలిఫోర్నియా విమానాశ్రయం దగ్గరే ముగియబోతున్నదనీ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ కలలపై నీళ్ళు
చల్లబోతున్నారనీ వారు అనుకోలేదు. ఉన్నత చదువులకోసం దేశం విడిచి వెళ్ళిన తమ పిల్లలు
తిరుగు టపా మాదిరిగా తిరిగొస్తారని వారి తలితండ్రులూ అనుకోలేదు. ఆ విద్యార్ధుల్లో కొందరు అమెరికా దాకా వెళ్లి తిరిగొస్తే
మరికొందరు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదు. మార్గమధ్యంలో దుబాయ్ నుంచే
వారిని తిప్పి పంపేసారు.
ధర్మం కోణం నుంచి చూస్తే అయితే, అమెరికన్లకు వారి
చట్టమే ముఖ్యం. వారి రూలు పుస్తకమే వారికి బైబిల్.
చెన్నై లోని అమెరికన్ ఎంబసీలో ఏళ్ళ తరబడి పనిచేసిన
మాగంటి కోటేశ్వరరావు అభిప్రాయం కూడా అదే.
నిబంధనలు వారు ఖచ్చితంగా పాటిస్తారనీ, మన
దేశపు పౌరుల్లో నిబంధల పాటింపు పట్ల అంత పట్టింపు లేకపోవడం వల్లనే ఈ తంటాలనీ ఆయన
అభిప్రాయం. ఎంబసీ అధికారి అయిన తన విషయంలోనే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు
ఈషన్మాత్రపు కనికరం కూడా చూపించలేదని మాగంటి, అమెరికన్ వీసాల గురించి రాసిన ఒక పుస్తకంలో
పేర్కొన్నారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు
సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయినందునే వారిని తిప్పి పంపడం జరిగిందని ఒక వివరణ
ప్రచారంలో వుంది.
విద్యార్ధులను వెనక్కి పంపిన విషయమై అమరికన్ అధికారులు
పెదవి విప్పడం లేదు. వారు చేరాల్సిన అమెరికన్ యూనివర్సిటీల చరిత్ర పట్ల అనుమానాలు
కూడా విద్యార్ధులను తిప్పి పంపడానికి కారణంగా పేర్కొంటున్నారు. అదే నిజమనుకున్నా,
వారి యూనివర్సిటీలు గురించి వారికే బాగా తెలిసి వుండాలి. మరి అటువంటి యూనివర్సిటీల్లో
చేరడం కోసం వీసాకు ధరఖాస్తు పెట్టుకుంటే, తెలిసి తెలిసి అధికారులు వీసాలు ఎలా మంజూరు చేసారు, తొలి
దశలోనే తిరస్కరించి వుంటే ఇన్ని ఇబ్బందులు, మనో వేదన ఉండేవి కావన్నది బాధితుల రోదన.
నిబంధనలు ఏర్పరచుకుని, వాటిని ఖచ్చితంగా
పాటించడానికి అలవాటు పడిన ఆ దేశస్తులకు ఈ రోదనలు వినబడే అవకాశం లేదు.
“అమెరికా ఒక కోటలాంటిది కాదు, కోటలా
వుండాలని కూడా మేము కోరుకోవడం లేదు. అరమరికలు లేని స్వేచ్చా సమాజం మాది. అయితే
ఇక్కడ చట్టానికి గల హక్కులను మేము పరిరక్షించాల్సివుంది. ఇక్కడ పనిచేయడానికి, చదువుకోవడానికి, మా
దేశం చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి
వచ్చే చట్టబద్ధ పౌరుల హక్కులను కూడా మేము కాపాడాలి. అది మా కర్తవ్యం” – 2002
మే ఒకటో తేదీన సరిహద్దు భద్రతా, వీసా ఎంట్రీ కొత్త చట్టంపై సంతకం చేస్తూ ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్
చెప్పిన మాటలివి.
సెప్టెంబర్ పదకొండు దుర్దినంగా ఆ దేశం పేర్కొనే
దురదృష్టకర విధ్వంస సంఘటనల అనంతరం, అమెరికా ఈ చట్టాన్ని మరింత కఠిన తరం చేసింది.
అయినా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువతరంలో
అమెరికాపై ఆశలు అడుగంట లేదు. పైపెచ్చు ఆ దేశం వెళ్లి తీరాలన్న పట్టుదల నానాటికీ
పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం,
ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వారి వారి ప్రతిభనుబట్టి అవకాశాలు లభిస్తూ వుండడం.
నిరుడు ఒక్క ఏడాదిలోనే మన దేశం నుంచి వేలాదిమంది విద్యార్ధులు,
ఉద్యోగార్ధులు చట్ట బద్ధమైన వీసాలతో అమెరికాలో అడుగు పెట్టారు. తమ కలలను నిజం
చేసుకునే పనిలో పడ్డారు.
ఐటీ విప్లవం అందించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇటీవలి
సంవత్సరాలలో లక్షలాదిమంది యువతీయువకులు
అమెరికా బాట పట్టారు. తమ జీవితాలను, తమ కుటుంబాల ఆర్ధిక పరిస్తితులను మెరుగుపరచుకుంటున్నారు.
విద్యాగంధానికి నోచుకోని వారి తలితండ్రులు సయితం అమెరికా వైభోగాలను
అనుభవిస్తున్నారు. చిన్నకారు రైతులు, పల్లెటూరి
బడుల్లో పాఠాలు చెప్పే మాస్టార్లు, చిన్న
వ్యాపారులు,
చిరుద్యోగులు, ఇలా
ఒక తరగతి అని కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు వీరిలో కానవస్తారు.
ఒకరిని చూసి మరొకరు పెంచుకున్న అమెరికా ఆకర్షణ ఒక బలమైన
అయస్కాంతంలా అందర్నీ ఆకర్షిస్తోంది. అమెరికా కల సాకారం చేసుకోవడం అన్ని తరగతులకు
చెందిన కుటుంబాలు కఠోర శ్రమకు పూనుకుంటున్నాయి. వీరి ఆకాంక్షకు తగ్గట్టుగా
ఏజెన్సీలు వెలిసాయి. వీసాలు ఎలా పొందాలి, అమెరికా విద్యాసంస్థల్లో ఎలా ప్రవేశం సంపాదించాలి, ఇక్కడ
ఉద్యోగం చేస్తుంటే ఆ దేశంలో ఉద్యోగం ఎలా దొరకబుచ్చుకోవాలి? ఇలాటి
ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం మొదలయిన ఈ సంస్థలు, ఇందులో వున్న డబ్బు
రుచి మరిగి,
అడ్డమైన డబ్బు సంపాదించడంకోసం అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టాయి. ఇక్కడి చట్టాలకు,
అక్కడి అధికారులకు దొరక్కుండా పని జరిపించడం వీటి పని. అధికారులకి పట్టుబడని
వాళ్ళు ఆ దేశం చేరుకొని తాము తొక్కిన పెడ
మార్గాలు గురించి ఇతరులకి బోధిస్తున్నారు. ఎలాగైనా సరే అమెరికా వెళ్లి తీరాలి అని
అనుకునే వాళ్ళు అటువంటి సంస్తలనే ఆశ్రయిస్తున్నారు. వున్నవిషయం ఒప్పుకోకతప్పదు.
ఇటువంటి విషయాల్లో అగ్రస్థానంలో వున్నది మన తెలుగువాళ్ళే అన్నది బహిరంగంగా
చెప్పుకునే మాట.
ఇప్పటికే అమెరికా చేరి విద్యాభ్యాసం
పూర్తిచేసుకున్నవారిని కొన్ని అమెరికన్ విద్యాసంస్థలు ప్రలోభపెట్టి వారిని తమ
ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆరోపణ కూడా వినబడుతోంది. కొత్త విద్యార్ధులను చేర్పించడానికి పాత విద్యార్ధులకు
ఎర వేస్తున్నారనీ, అంచేతే నాణ్యత లేని విద్యాలయాలకు కూడా విద్యార్ధులు
వెళ్లి చేరుతున్నారని అంటున్నారు. ఆ దేశంలోని కొన్ని యూనివర్సిటీలు కేవలం
విదేశీ విద్యార్దులపైనే ఆధారపడి మనుగడ
సాగిస్తున్నాయని కూడా చెప్పుకుంటారు. చట్టబద్ధ పాలనకు కట్టుబడి వున్నామని
చెప్పుకునే అమెరికాలో ఈ విడ్డూరం ఏమిటో అర్ధం కాదు. వారి అవసరాలు, మనవారి
ఆత్యాశలు వెరసి ఈ దుస్తితి దాపురించి వుంటుంది. సరిదిద్దుకునే ప్రయత్నం ఇరువైపులా
మొదలు కావాలి.
అంతవరకూ కలల్నే
కాదు, పీడ
కలల్ని కూడా భరించక తప్పదు. (02-01-2016)