14, నవంబర్ 2015, శనివారం

సభ్యసమాజాన్ని ఒణికిస్తున్నఉగ్రవాద భూతం

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 15-11-2015, SUNDAY)
సూటిగా ....సుతిమెత్తగా ..... 
నిన్న శనివారం, తెల్లవారుతూనే పారిస్ లో జరిగిన ఘోరకలి గురించిన సమాచారాన్ని మోసుకుంటూ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరం పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో అనేకమంది అమాయకులు నేలకొరిగారు. ప్రాధమిక సమాచారం ప్రకారం చనిపోయిన వారి సంఖ్య నూటపాతిక దాకా వుంది. అయితే పూర్తి సమాచారం వెల్లడయ్యే సరికి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.
పారిస్ అంటేనే అందాల నగరం. ఆ అందాల నగర వాసులకి శుక్రవారం సాయంత్రం ఓ ఆటవిడుపు. అర్ధరాత్రి బాగా పొద్దుపోయేవరకు సరదాలు తీర్చుకోవడానికి వారాంతపు సెలవు దినాల తొలిరేయి. అటువంటి రాత్రివేళ  తెగబడిన ఉగ్రవాదులు వరుసగా నగరంలోని అనేక ప్రాంతాలపై విరుచుకుపడి జరిపిన పేలుళ్లు, కాల్పులు- పౌరులకు, పోలీసులకు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసాయి.


సంగీత కచ్చేరీలు జరిగే బటాక్లాన్ హాలులో ఉగ్రవాద దాడికి ఎక్కువమంది చనిపోయారు. కచ్చేరీ వినడానికి వచ్చిన ప్రేక్షకులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎనభయ్ మందిని పొట్టనబెట్టుకున్నారని తొలివార్తలు తెలిపాయి.
పారిస్ నగరంలోని మరో అయిదు ప్రదేశాల్లో కూడా ఉగ్రవాదులు తమ తుపాకులకు పనిచెప్పారు. బార్లు, రెస్టారెంట్లలో కాలక్షేపం చేస్తున్న పౌరులు ఈ దాడులలో ప్రాణాలు కోల్పోయారు. మారణహోమానికి కారణ మయిన ఉగ్రవాదులనందరినీ తాము మట్టుబెట్టామని పోలీసులు నమ్ముతున్నారు. అయితే వారిలో ఇంకా ఎవరయినా తప్పించుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.
ఉగ్రవాద దాడితో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆంతరంగిక అత్యవసర పరిస్తితి విధించింది. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో సుశిక్షితులైన సాయుధ భటులను రంగంలోకి దింపింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇళ్ళు ఒదిలి వీధుల్లోకి రావద్దని నగర పౌరులను హెచ్చరించారు.     
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్  కీ  మూన్, రష్యా అధ్యక్షుడు  పుతిన్  ఇతర అగ్రరాజ్యాల నాయకులు, పారిస్ లో జరిగిన  మానవ హననం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నాగరిక ప్రపంచం  సంఘటిత కృషి జరపాలని ఉద్బోధించారు.
బ్రిటన్ పర్యటనలో వున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ‘ఉగ్రవాదానికి సూఫీ సంప్రదాయమే విరుగుడు’ అని ఉద్బోధ చేసిన రోజునే పారిస్ లో ఈ ఘటన జరగడం  కాకతాళీయం కావచ్చు.
పొతే, పారిస్ పేలుళ్ళపై  అనేకమంది ప్రత్యక్ష సాక్షుల కధనాలతో విదేశీ మీడియా అట్టుడికి పోతోంది.   
బెన్ గ్రాంట్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ మద్యశాలలో కూర్చుని వున్నప్పుడు ఉగ్రవాదులు బయట కార్లనుంచి కాల్పులు జరిపారు.
‘మేము వెనుక వైపు వుండడం కలిసి వచ్చింది. కాల్పుల శబ్దం వినబడగానే మేము ఓ బల్ల కింద దాక్కున్నాము. మాకేమీ కనబడలేదు. కాసేపటి తరువాత చూస్తే ఎటు చూసినా శవాలే. అప్పుడు తెలిసింది జరిగిన ఘోరం ఎంతటిదన్నది.’ బెన్ గ్రాంట్ చెప్పాడు. అతడి గొంతులో భయంతో కూడిన దైన్యం.
‘మేము చాలాసేపటి వరకు బయటకు రాలేకపోయాము. ఎందుకంటె మా కళ్ళ ముందు ఎన్నో శరీరాలు అచేతనంగా గుట్టలుగా పడివున్నాయి’ గ్రాంట్ చెప్పాడు విషాద వదనంతో.
అదే రోజు పారిస్ లోని  నేషనల్  స్టేడియంలో ఫ్రాన్స్, జర్మనీ జట్ల నడుమ కీలకమైన ఫుట్  బాల్ మ్యాచ్ జరుగుతోంది. ‘ఆట సగంలో ఉండగానే బయట నుంచి రెండు సార్లు పెద్దగా పేలుడు శబ్దాలు వినవచ్చాయి.’ అని స్థానిక దినపత్రిక విలేకరి చెప్పాడు.
‘ప్రెసిడెంట్  హోలాండ్ కూడా ఆట చూడడానికి వచ్చారు. మ్యాచ్ మామూలుగా సాగిపోతోంది. పైకి చూస్తే ఆకాశంలో ఓ హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. ఆట జరుగుతుండగానే ఎవరికీ తెలియకుండా భద్రతా దళాలు ప్రెసిడెంటుని అక్కడ నుంచి తప్పించి తీసుకువెళ్లినట్టు ట్విట్టర్  చూస్తే తెలిసింద’ని విన్సెంట్ అనే ఆ విలేకరి వెల్లడించాడు.
‘వున్నట్టుండి ఆటను  మధ్యలో నిలిపేశారు. ప్రేక్షకులందరూ వెంటనే స్టేడియం ఒదిలి వెళ్ళిపోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. జనం కంగారుగా బయట పడడానికి హడావిడి పడ్డారు.’ అని ఆ విలేకరి తెలిపాడు. 
కాల్పులు జరిగిన అయిదు ప్రదేశాల్లో ఒకటయిన పారిస్ లోని కంబోడియా రెస్టారెంటులో భోజనం చేస్తున్న పిర్రే ఫార్ట్ కధనం ప్రకారం కాల్పుల శబ్దం అరనిమిషం పాటు వినపడింది.
‘బయట ఎవరో టపాసులు కాలుస్తున్నారని అనుకున్నా. తీరా చూస్తే అవి ఉగ్రవాద చర్య అని అర్ధం అయింది. రెస్టారెంటులో తుపాకీ తూటా తగిలి ఒక వ్యక్తి పడి వున్నాడు. అతడి చేతిలో ఓ మృత శిశువు. ఆ దృశ్యం కనబడగానే కడుపులో దేవినట్టయింది’ అని అతగాడు చెప్పాడు.
కష్టకాలంలో వున్న ఫ్రాన్స్ దేశానికి అనేక దేశాలు నైతిక మద్దతు ప్రకటించాయి. తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చాయి.
అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేకదేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. చంపు, లేదా చచ్చిపో అనే రెండే రెండు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.
ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం.సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తులకు ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక సంఖ్యలో వున్న మంచి వారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు ఇలా తోకలు ఝాడిస్తూనే వుంటారు.
అదే జరుగుతోంది. అందులో మరో అంకమే పారిస్ ఘటనలు.
(14-11-2015)

రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్:  98491 30595  
NOTE: Courtesy Image Owner        

12, నవంబర్ 2015, గురువారం

అది ప్రశ్న! ఏది జవాబు ?


“అసహనం అంటే ఏమిటి?
‘సహనం కానిది’
‘అలా కాదు. ఇప్పుడు దేశంలో సహనం, అసహనం అనే అంశాల మీద విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది, దానిపై చెప్పండి’
‘వేదం ఏం చెబుతోంది, సహనావతు అంటోంది. బైబిల్ ఏం చెబుతోంది, ఆ మాటకు వస్తే ఖురాన్ ఏం బోధిస్తోంది? అంటే ఏమిటన్న మాట...’
‘అదికాదు, ఇప్పటి పరిస్తితుల్లో ఎవరు సహనం కోల్పోతున్నారు, ఎందుకు అలా జరుగుతోంది?’
‘ఎవరంటే, నాకు తెలిసి సహనం లేనివాళ్ళు అసహనంగా వ్యవహరిస్తున్నారు. అసహనంగా వుండేవాళ్ళు సహనంగా వుండేవారిపై దండెత్తుతున్నారు’
‘అది సరే! నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి? సహనం వుంది ఎవరికి? లేనిది ఎవరికి?’
‘సహనం అనేది జన్మతో వచ్చేది. అది జన్మ ఉన్నంత వరకు అంటిపెట్టుకునే వుంటుంది. అసహనం కూడా అంతే”

‘మీకూ మీతో ఇంటర్వ్యూకు ఓ దణ్ణం. బతికుంటే పాత పేపర్లు తినయినా బతుకుతాను’ 

(12-11-2015)  
NOTE: Courtesy Image Owner 

?

?
“లోపల ఇంతసేపూ ఏం మాట్లాడుకున్నారు?’
‘బయట మీడియాతో ఏం చెప్పాలో.. దాన్ని గురించి’

?  

11, నవంబర్ 2015, బుధవారం

మతాన్ని కులం జయించిందా!


అపజయం అనాధ శిశువు వంటిది, తమదని చెప్పుకోవడానికి కానీ, బాధ్యత పంచుకోవడానికి కానీ  ఎవ్వరూ ముందుకు రారు.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురయిన  ఓటమి ఇటువంటిదే. మొన్నమొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ద్వయం సాధించిన ఘన విజయాలు, ఈ బీహారు పరాజయం మాటున మసకలు బారాయి. రాజకీయాల్లోనే కాదు ఈనాడు  ఏ రంగంలో అయినా సమర్ధతకు గీటురాయి విజయమే, కేవలం విజయమే అనే పరిస్తితుల్లో మనం జీవిస్తున్నాం.
పద్దెనిమిది మాసాల క్రితం అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా కలిసి పార్టీని విజయపధంలో నడిపించి మొత్తం నలభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా ముప్పయి రెండు ఎగరేసుకుపోతే, అలనాటి వారి శేముషీ వైభవాన్ని పొగడడానికి ఆదిశేషుడికి కూడా  సాధ్యం కాదన్న రీతిలో భజన బృందాలు పోటీ పడి కీర్తనలు పాడాయి. ఇప్పుడు మళ్ళీ అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడితే, ఇంతటితో వారి పని అయిపోయిందంటూ అదే నోటితో విమర్శల జడివాన మొదలయింది.
ఈ పరిస్తితికి కారణం ఎవ్వరు?
నిజం చెప్పుకోవాలంటే నిజానికి వాళ్లిద్దరే కారణం. అలనాటి ఘన విజయానికి వీళ్ళిద్దరే కారణం అని భజన బృందాలు సంకీర్తనలు అందుకున్నప్పుడు, ‘అలా కాదు, ఇది సమష్టి విజయం’ అని వారిద్దరూ నోరు విప్పి చెప్పలేకపోయారు. స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని ఘన విజయానికి వాస్తవంగా వారిద్దరి కృషే ప్రధాన కారణం అయినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలకు తగినట్టుగా పార్టీ విజయంగా అభివర్ణించి వున్నట్టయితే, ఇప్పుడీ అపజయం మూటని సొంత భుజాల మీద మోయాల్సిన దుస్తితి వచ్చేది కాదు. సమర్ధతతకు వన్నె తెచ్చేది వినయం ఒక్కటే. అది మరపున పడితే ఇటువంటి సంకట స్తితి ఎటువంటి సమర్ధుడికయినా తప్పదు.


గతాన్ని గమనంలోకి తీసుకుని అంచనా వేస్తే, బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎండీయే కూటమి గెలుపు నల్లేరు మీది నడకే కావాలి. ఎందుకంటే, ఆయన ప్రత్యర్ధి నితీశ్ కుమార్ అప్పటికే పదేళ్లుగా బీహారును ముఖ్యమంత్రిగా పాలిస్తూ వస్తున్నారు. ఎంతటి సమర్ధుడికయినా, నిష్కళంక నాయకుడికయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది పూర్వజన్మ సంచితంలా వెంటే వెన్నాడి వస్తుంటుంది. దీన్ని తట్టుకుని మూడో పర్యాయం ప్రజల మెప్పును పొందడం కాకలు తీరిన వారికి సయితం కత్తి మీది సామే. పైగా ప్రత్యర్ధి ఎవ్వరు? తన కీర్తి కిరీటపు ధగధగలు ప్రపంచం నలుదిక్కులా పరచుకుపోతుంటే, శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రాజకీయాకాశంలో  వెలిగిపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ని ఒంటరిగా నిలువరించడం అసాధ్యం అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే, బీహారులోని మోడీ ప్రత్యర్ధులందరూ ఏకమై మహా కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన వేళా విశేషం ఏమిటో కాని, మొదటి ముద్దలోనే ఈగ పడిన చందంగా నెలలు నిండకమునుపే ఆ కూటమికి బీటలు పడ్డాయి. ఇక నిజాయితీకి నిలువుటద్దం, పుటం వేసి గాలించినా ఎలాటి అవినీతి మరకలు కానరాని నితీశ్ కుమార్ జత కట్టింది ఎవరితో. రాజకీయాల్లో ఉచితానుచితాలు పాటించని లాలూ ప్రసాద్ యాదవ్ తో. ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిద్దరి కలయికతో ఏర్పడ్డ మహా కూటమి పోటీ పడింది ఎవరితో, మన దేశంలోనే కాక దేశదేశాల్లో తన కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో.
ఇన్ని వ్యతిరేక పవనాల నడుమ నితీశ్ కుమార్ సాగించిన ఈ ఎన్నికల పోరాటంలో మామూలుగా అయితే మోడీ పక్షానిది ఏక పక్షపు విజయం కావాలి. మరి జరిగిందేమిటి? సరే ఈ ప్రశ్నకు బీహారు ప్రజలు తమ తీర్పుతో జవాబు చెప్పేశారు. అయితే, ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకాల్సి వుంది. ఈ క్రమంలో అనేకానేక విశ్లేషణలు జనం ముందుకు వస్తున్నాయి.
కొందరిది మతం మీద కులం సాధించిన విజయం అంటుంటే, మరికొందరు అదేమీ కాదు, అసహనం మీద సహనం సాధించిన గెలుపని అభివర్ణిస్తున్నారు. మోడీ అమిత్ షా జోడీ అహంభావపు మొండి వైఖరి పార్టీ కొంప ముంచిందని కొందరు గగ్గోలు పెడుతుంటే, బీహారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మునిగిపోయే కొంపలు ఏవీ లేవని ఇంకొందరు కొట్టి పారేస్తున్నారు.
ఎన్నికల్లో ఇది సహజాతి సహజం. అందరి అభిప్రాయాలు సరయినవి కాకపోయినా ప్రతి దాంట్లోనుంచి ఏరుకుంటే ఎంతోకొంత మంచి దొరుకుతుంది. సూక్ష్మం గ్రహిస్తే వర్తమానం నుంచి భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి మార్గం సులువవుతుంది.
విజయం లభించినప్పుడు సంయమనం అవసరం. అపజయం సిద్ధించినప్పుడు రాగద్వేషాలకు అతీతమైన ఆత్మావలోకనం అంతే అవసరం.
విజయంతో విర్రవీగినా చతికిల పడక తప్పదు. అపజయంతో నిస్పృహ చెంది చతికిల పడ్డా రానున్న విజయాలకు దూరం కాక తప్పదు.
ప్రజలిచ్చిన అధికారం శాస్వితం కాదు. అలాగే, ఏదో చెప్పి, ఏదో చేసి అధికారం దొరకబుచ్చుకుందామని ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే అవుతుంది.
ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం వున్న రాజకీయ నాయకులు, తమ పార్టీల మంచి చెడులు గురించి కాకుండా  ప్రజల గురించి ముందు పట్టించుకోవాలి. అప్పుడు ప్రజలే ఆ పార్టీలను గురించి పట్టించుకుంటారు.
ప్రస్తుతం మెజారిటీ పార్టీలు తద్విరుద్ధంగా ఆలోచిస్తున్నాయని అనిపిస్తోంది.

బీహారు ఎన్నికల ఫలితాలు చెబుతోంది కూడా ఇదే! (11-11-2015)
NOTE: Courtesy Image Owner 

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ఈ శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది, లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో  తెలివినపడిన వాడినై,  అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి?  అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకా,  లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూ,  ఇత్యాది బలమైన అనేక  కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో  చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో (వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి. ‘ఆయనకూ   మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి   అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడం, కాదు కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా’ అనుకున్నాను.
ఏవిటో  అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“నరేంద్ర మోడీ గారి లాగే  నేను మొండివాడ్ని(ట). కాదు, నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా ఆయన్ది, మీలానే” అని లా పాయింటు తీసింది.
“హౌరా!” అనుకున్నాను నాలో నేనే.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని  మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముంది? నిజమే కదా!
ఇంతవరకు బాగానే వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   

ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (11-11-2015)

7, నవంబర్ 2015, శనివారం

ఓడిన వారిది నైతిక విజయం – గెలిచిన వారిది గౌరవ ఓటమి

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-2015, SUNDAY)

సూటిగా .....సుతిమెత్తగా........ 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన ఎగ్జిట్ పోల్ వివరాలపై వాదోపవాదాలకు తెర పడబోతోంది. వాస్తవ ఫలితాలు  ఆదివారం తొలి ఝాముకల్లా తెలియబోతున్నాయి.
ఈసారి బీహారు అసెంబ్లీ ఎన్నికలకు జాతివ్యాప్త ప్రాచుర్యం లభించింది. ఈ ఎన్నికల ఫలితాలపట్ల అదే స్థాయిలో ఆసక్తి పెరిగింది. ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలే కాకుండా వాటికి వత్తాసుగా నిలిచే మీడియా సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం.
అటు ఆఖరి ఐదో దశ పోలింగు ముగిసిందో లేదో ఇటు దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను  అనేక వార్తా ఛానళ్ళు పోటీపడి ప్రసారం చేయడం మొదలెట్టాయి. వాటి ఆధారంగా  జాతీయ చానళ్ళే కాకుండా పలు ప్రాంతీయ టీవీ ఛానల్లు సయితం చర్చాగోష్టులు నిర్వహించాయి. కొందరు ఇవన్నీ చూసి ఇవే నిజమైన ఫలితాలని సంబరపడితే, మరికొందరు నిరుత్సాహపడ్డారు కూడా.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల సంఖ్యతో పోటీపడ్డాయా అన్నట్టుగా అనేక సర్వే సంస్థలు ఈసారి రంగంలో దిగినట్టుగా కానవచ్చింది. వీటిల్లో మెజారిటీ సర్వేలు, ‘హోరాహోరీ’ అని తేల్చాయి. ఈ పోటాపోటీలో కూడా పలు సర్వేలు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ‘మహాకూటమి’ పట్లనే ప్రజలు కొద్దిగా మొగ్గుచూపే వీలుందని  చెప్పాయి. ఒకటి రెండు సర్వేలు మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి విజయావకాశాలు వుంటాయని పేర్కొన్నాయి. ఒక సర్వేలో ఎన్డీయే కూటమికి ఘన విజయం దక్కవచ్చని తేలింది. ఏదిఏమైనా వాస్తవ  ఫలితాలు వెలువడనున్న తరుణంలో సర్వేల మంచి చెడులు గురించిన తర్కం అనవసరం. కాకపొతే ఈ సర్వేల  అంచనాలను బట్టి ఒక విషయం స్థూలంగా అర్ధం అవుతోంది,  రెండు కూటముల నడుమ పోటీ తీవ్రంగా వున్నదని. ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయం బయట పడింది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత వుండకపోవచ్చు.


మొత్తం మీద ఉభయ రాజకీయ కూటములు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తేటతెల్లం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలుపెపెరగని ప్రచారం చేసి లెక్కకు మిక్కిలి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇదంతా బయట నుంచి గమనించేవారికి, జరిగిన పోటీ మోడీ, నితీష్ నడుమనా అన్న సందేహం కలిగినా ఆశ్చర్యం లేదు. బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపు అనేది  ప్రధాని మోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి కావచ్చేమో కానీ ఓటమి సంభవిస్తే అందువల్ల ఆయన ప్రతిష్టకు వాటిల్లే నష్టం ఏమీ లేదు. దిగంతాలకు పాకుతున్న ఆయన వ్యక్తిగత ప్రభలకు కొంత ఛాయ తగ్గవచ్చేమో కానీ అంతకు మించి ఏమీ జరగదు. బ్రహ్మాండమయిన మెజారిటీతో కేంద్రంలో అధికార చక్రం తిప్పుతున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఇప్పట్లో ముప్పేమీ వుండదు. ఆయనకు కానీ, ఆయన కూటమికి కానీ రాజకీయంగా తూట్లు పడే వ్యవహారం కాదు. కాకపొతే, మోడీ కీర్తికిరీటపు ధగధగలు  ఒకింత మసకబారవచ్చు.  అంతకు మించి ఇప్పట్లో వాటిల్లే ముప్పేమీ వుండదు.  2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ వ్యవధానం వుంది. ఆ నాటికి  నాటికి కాలు కూడతీసుకునే వీలున్నది. పొతే, మరోవైపు నితీష్ విషయం కూడా అంతే. పదేళ్ళ పాలన అనంతరం ప్రభుత్వ వ్యతిరేకత కానరాకుండా చేసుకోవడం ఎంతటి కాకలు తిరిగిన నాయకుడికి కూడా సాధ్యం కాదు. ఆయనకు వ్యక్తిగతంగా సచ్చీలుడనే మంచి పేరు యెంత వున్నప్పటికీ ఆయన కూటమిలోని కొన్ని మిత్రపక్షాల నాయకులకు అంతటి మంచి పేరు లేదు సరికదా, చెడ్డ పేరు వాళ్ళ ఖాతాలో బాగా పేరుకుపోయి వుంది. అలాటివారి నీడన వుండడం నితీష్ వంటి మచ్చలేని నాయకుడికి అంత శోభ ఇవ్వదు. అయితే కుల రాజకీయం అనేది మారుపేరుగా మారిన బీహార్ వంటి రాష్ట్రంలో ఇటువంటి విభిన్న, వైరుధ్య కలయికలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయన్నది ముందుగా చెప్పడం కష్టం. అది పడగనీడా కావచ్చు, కొండొకచో పందిరి నీడా కావచ్చు.
పదేళ్ళ పాలనాకాలంలో పేరుకు పోయిన ప్రభుత్వ వ్యతిరేకత, లాలూ వంటి వారితో పొత్తు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని తన భుజానికి ఎత్తుకోవడం - ఇలాటి అంశాలన్నీ నితీష్ నాయకత్వంలోని మహా కూటమికి ప్రతికూలమైనవే. అంచేత ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ లో వెల్లడయిన విధంగా ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలగడం అంటే అది  నిజంగా గొప్ప విషయమే. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు, ఒకవేళ ఆయన పరాజయం పాలయినా ఒకరకంగా ఆయనకది నైతిక విజయం కిందే లెక్క.
ఇక మోడీ. బీహార్ ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఎన్నికల గోదాలోకి దిగడానికి పూర్వం నుంచే ఆయన బీహారు ఎన్నికల్లో గెలిచి తీరాలనే వ్యూహంపై కన్నేసి వుంచారని చెప్పడానికి ప్రధాని ఆ రాష్ట్రం పై కురిపించిన వరాల జల్లులను గుర్తుచేసుకోవచ్చు. ఒక రకంగా మోడీ, అమిత్ షా జోడీ , బీహార్ అసెంబ్లీ ఎన్నికలను త్వరలో రాబోయే ఇతర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఒక పరీక్షా వేదికగా భావించారేమో తెలియదు. బీహార్ వ్యూహం ఫలిస్తే ముందు ముందు యావత్ భారతంలో తమ పార్టీని పటిష్ట పరచి, దక్షిణ భారతంలో కూడా బీజేపీ విజయ పతకం ఎగిరేలా చేయడానికి ఉద్దేశించిన భవిష్యత్ ప్రణాళిక అమలుకు బీహారును ఒక ప్రయోగశాలగా ఎంచుకుని ఉండవచ్చు. అవసరమైన పక్షంలో ఓటమికి కూడా సిద్ధపడి, సొంతంగా పార్టీ ఉనికిని సుస్థిర పరచుకునేందుకు మునుముందు సాధించబోయే విజయలక్ష్యాల సాధనకు బీహారు అసెంబ్లీ  ఎన్నికలను కేంద్ర బిందువుగా చేసుకుని ఉండవచ్చు. బీహారులో అనుసరించిన ఎన్నికల వ్యూహం ఒకరకంగా కొన్ని వర్గాలనుంచి వ్యతిరేకతను కట్టబెట్టినా, రానున్న కాలంలో తమ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకునే వ్యూహంలో భాగంగా దాన్ని  భావించవచ్చు.
ఏదిఏమైనా బీహారులో నితీష్ కూటమి, ఎగ్జిట్ పోల్స్ లో తేలిన విధంగా రవంత తేడాతో గెలుపొందినా అది మోడీ కూటమికి తలవంపులు తెచ్చే పరాజయం కాబోదు. ఒకరకంగా గౌరవప్రదమైన ఓటమే అవుతుంది. అలాగే , కొన్ని సర్వేలు చెప్పిన విధంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించినా, అంతటి ప్రతికూల పరిస్తితుల్లో కూడా ఆ విధమైన గట్టి  పోటీ ఇవ్వగలిగిన నితీష్ కుమార్ కు అది నైతిక విజయమే అని చెప్పవచ్చు.   
ఇక చివరగా చెప్పేది ఏమిటంటే అటు మోడీకి, ఇటు నితీష్ కు సామాన్య జనంలో ఒక వ్యక్తిగతమైన గౌరవం  వుంది. ఈ ఇద్దరు నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేస్తారనేది చదువుకున్న యువతీ యువకుల్లో ప్రచారంలో వుంది.
మరి, ఎగ్జిట్ పోల్స్ సంకేతాలకు తగ్గట్టుగా ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవసరమయ్యే సంఖ్యాబలాన్ని   బొటాబొటిగా తమకిస్తే, అప్పుడు  వీళ్ళు ఏం చేస్తారనే దానిపై  ఒక చర్చ సాగుతోంది. సాధారణ రాజకీయ పార్టీల  మాదిరిగా ఏదో విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతారా, లేక ప్రజాస్వామ్య ప్రియులుగా అధికారానికి దూరం జరిగి కొత్త బాట పడతారా? వేచి చూడాలి.
పీఎస్: పొతే ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఓ మాట. వీటికి శాస్త్రీయమైన ప్రాతిపదిక వుందని నిర్వాహకులు చెప్పే మాటల్ని అత్యధిక జనం నమ్మడం లేదు. ఈ సర్వేల విశ్వసనీయతపై ఈ సర్వే సంస్థలే స్వయంగా ఒక సర్వే నిర్వహిస్తే బాగుంటుందని సూచన. రానున్న రోజుల్లో ఇటువంటి ఎన్నికల సర్వేలు, క్రికెట్  బెట్టింగుల మాదిరిగా వికృత పోకడలకు దారితీయకుండా ముందు జాగ్రత్తగా ఒక చట్టం తీసుకువస్తే మరింత బాగుంటుంది. (07-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: COURTESY IMAGE OWNER                                   


5, నవంబర్ 2015, గురువారం

ఏమీ సేతురా లింగా!


ఉదయం గడ్డం చేసుకుంటూ వుంటే సెల్లు మోగింది.
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ ఏకాంబరాన్నే! చెప్పండి ఎవరు మీరు?’
‘రచయిత ఏకాంబరం గారేనా ‘
‘అవునండీ ఆయన్నే విషయం చెప్పండి’
‘పొద్దున్న పేపర్లో సహనం ఎలా అలవరచుకోవాలో చాలా విశదంగా రాసారు. మొత్తం విడవకుండా చదివాను. బాగా రాశారండీ!’
‘చాలా  థాంక్స్ అండీ’
స్నానానికి పోతుంటే మళ్ళీ ఫోను.
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ!’
‘రచయిత ఏకాంబరం గారేనా’
‘అవునండీ ఆయన్నే నేను. ఏమిటి సంగతి?’
‘సహనం, దాని ఆవశ్యకత గురించి మీరు రాసిన వ్యాసం చదివానండీ! భలేగా  నచ్చింది నాకు’
‘అలాగా చాలా సంతోషం అండీ’
భోజనం ముందు మళ్ళీ ఫోను
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ!’
‘సహనం గురించి యెంత బాగా రాసారండీ. నిజానికి ఇలాటి వ్యాసాలు ఇంకా ఇంకా రావాలండీ’
‘మరేనండీ రాయాలనే వుంది, కానీ ఓపిక చచ్చి పోతోంది’
‘మీరే అల్లా అంటే ఎల్లా, ఎల్లాగో అల్లా  ఓపిక తెచ్చుకుని రాయాలి, అంతే కాని  అలా కలం పారేస్తే ఎలా చెప్పండి’
ఆ కాల్ కట్ చేయగానే మరో ఫోను, మీ సహనం ఆర్టికిల్ చాలా  బాగుందంటూ.
ఏకాంబరానికి సహనం చచ్చిపోయింది.

సెల్లు ఆఫ్ చేసి తల పట్టుకున్నాడు. 


(COURTESY IMAGE OWNER)