11, నవంబర్ 2015, బుధవారం

మతాన్ని కులం జయించిందా!


అపజయం అనాధ శిశువు వంటిది, తమదని చెప్పుకోవడానికి కానీ, బాధ్యత పంచుకోవడానికి కానీ  ఎవ్వరూ ముందుకు రారు.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురయిన  ఓటమి ఇటువంటిదే. మొన్నమొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ద్వయం సాధించిన ఘన విజయాలు, ఈ బీహారు పరాజయం మాటున మసకలు బారాయి. రాజకీయాల్లోనే కాదు ఈనాడు  ఏ రంగంలో అయినా సమర్ధతకు గీటురాయి విజయమే, కేవలం విజయమే అనే పరిస్తితుల్లో మనం జీవిస్తున్నాం.
పద్దెనిమిది మాసాల క్రితం అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా కలిసి పార్టీని విజయపధంలో నడిపించి మొత్తం నలభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా ముప్పయి రెండు ఎగరేసుకుపోతే, అలనాటి వారి శేముషీ వైభవాన్ని పొగడడానికి ఆదిశేషుడికి కూడా  సాధ్యం కాదన్న రీతిలో భజన బృందాలు పోటీ పడి కీర్తనలు పాడాయి. ఇప్పుడు మళ్ళీ అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడితే, ఇంతటితో వారి పని అయిపోయిందంటూ అదే నోటితో విమర్శల జడివాన మొదలయింది.
ఈ పరిస్తితికి కారణం ఎవ్వరు?
నిజం చెప్పుకోవాలంటే నిజానికి వాళ్లిద్దరే కారణం. అలనాటి ఘన విజయానికి వీళ్ళిద్దరే కారణం అని భజన బృందాలు సంకీర్తనలు అందుకున్నప్పుడు, ‘అలా కాదు, ఇది సమష్టి విజయం’ అని వారిద్దరూ నోరు విప్పి చెప్పలేకపోయారు. స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని ఘన విజయానికి వాస్తవంగా వారిద్దరి కృషే ప్రధాన కారణం అయినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలకు తగినట్టుగా పార్టీ విజయంగా అభివర్ణించి వున్నట్టయితే, ఇప్పుడీ అపజయం మూటని సొంత భుజాల మీద మోయాల్సిన దుస్తితి వచ్చేది కాదు. సమర్ధతతకు వన్నె తెచ్చేది వినయం ఒక్కటే. అది మరపున పడితే ఇటువంటి సంకట స్తితి ఎటువంటి సమర్ధుడికయినా తప్పదు.


గతాన్ని గమనంలోకి తీసుకుని అంచనా వేస్తే, బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎండీయే కూటమి గెలుపు నల్లేరు మీది నడకే కావాలి. ఎందుకంటే, ఆయన ప్రత్యర్ధి నితీశ్ కుమార్ అప్పటికే పదేళ్లుగా బీహారును ముఖ్యమంత్రిగా పాలిస్తూ వస్తున్నారు. ఎంతటి సమర్ధుడికయినా, నిష్కళంక నాయకుడికయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది పూర్వజన్మ సంచితంలా వెంటే వెన్నాడి వస్తుంటుంది. దీన్ని తట్టుకుని మూడో పర్యాయం ప్రజల మెప్పును పొందడం కాకలు తీరిన వారికి సయితం కత్తి మీది సామే. పైగా ప్రత్యర్ధి ఎవ్వరు? తన కీర్తి కిరీటపు ధగధగలు ప్రపంచం నలుదిక్కులా పరచుకుపోతుంటే, శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రాజకీయాకాశంలో  వెలిగిపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ని ఒంటరిగా నిలువరించడం అసాధ్యం అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే, బీహారులోని మోడీ ప్రత్యర్ధులందరూ ఏకమై మహా కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన వేళా విశేషం ఏమిటో కాని, మొదటి ముద్దలోనే ఈగ పడిన చందంగా నెలలు నిండకమునుపే ఆ కూటమికి బీటలు పడ్డాయి. ఇక నిజాయితీకి నిలువుటద్దం, పుటం వేసి గాలించినా ఎలాటి అవినీతి మరకలు కానరాని నితీశ్ కుమార్ జత కట్టింది ఎవరితో. రాజకీయాల్లో ఉచితానుచితాలు పాటించని లాలూ ప్రసాద్ యాదవ్ తో. ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిద్దరి కలయికతో ఏర్పడ్డ మహా కూటమి పోటీ పడింది ఎవరితో, మన దేశంలోనే కాక దేశదేశాల్లో తన కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో.
ఇన్ని వ్యతిరేక పవనాల నడుమ నితీశ్ కుమార్ సాగించిన ఈ ఎన్నికల పోరాటంలో మామూలుగా అయితే మోడీ పక్షానిది ఏక పక్షపు విజయం కావాలి. మరి జరిగిందేమిటి? సరే ఈ ప్రశ్నకు బీహారు ప్రజలు తమ తీర్పుతో జవాబు చెప్పేశారు. అయితే, ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకాల్సి వుంది. ఈ క్రమంలో అనేకానేక విశ్లేషణలు జనం ముందుకు వస్తున్నాయి.
కొందరిది మతం మీద కులం సాధించిన విజయం అంటుంటే, మరికొందరు అదేమీ కాదు, అసహనం మీద సహనం సాధించిన గెలుపని అభివర్ణిస్తున్నారు. మోడీ అమిత్ షా జోడీ అహంభావపు మొండి వైఖరి పార్టీ కొంప ముంచిందని కొందరు గగ్గోలు పెడుతుంటే, బీహారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మునిగిపోయే కొంపలు ఏవీ లేవని ఇంకొందరు కొట్టి పారేస్తున్నారు.
ఎన్నికల్లో ఇది సహజాతి సహజం. అందరి అభిప్రాయాలు సరయినవి కాకపోయినా ప్రతి దాంట్లోనుంచి ఏరుకుంటే ఎంతోకొంత మంచి దొరుకుతుంది. సూక్ష్మం గ్రహిస్తే వర్తమానం నుంచి భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి మార్గం సులువవుతుంది.
విజయం లభించినప్పుడు సంయమనం అవసరం. అపజయం సిద్ధించినప్పుడు రాగద్వేషాలకు అతీతమైన ఆత్మావలోకనం అంతే అవసరం.
విజయంతో విర్రవీగినా చతికిల పడక తప్పదు. అపజయంతో నిస్పృహ చెంది చతికిల పడ్డా రానున్న విజయాలకు దూరం కాక తప్పదు.
ప్రజలిచ్చిన అధికారం శాస్వితం కాదు. అలాగే, ఏదో చెప్పి, ఏదో చేసి అధికారం దొరకబుచ్చుకుందామని ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే అవుతుంది.
ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం వున్న రాజకీయ నాయకులు, తమ పార్టీల మంచి చెడులు గురించి కాకుండా  ప్రజల గురించి ముందు పట్టించుకోవాలి. అప్పుడు ప్రజలే ఆ పార్టీలను గురించి పట్టించుకుంటారు.
ప్రస్తుతం మెజారిటీ పార్టీలు తద్విరుద్ధంగా ఆలోచిస్తున్నాయని అనిపిస్తోంది.

బీహారు ఎన్నికల ఫలితాలు చెబుతోంది కూడా ఇదే! (11-11-2015)
NOTE: Courtesy Image Owner 

3 కామెంట్‌లు:

UG SriRam చెప్పారు...

అలనాటి వారి శేముషీ వైభవాన్ని పొగడడానికి ఆదిశేషుడికి కూడా  సాధ్యం కాదన్న రీతిలో భజన బృందాలు పోటీ పడి కీర్తనలు పాడాయి. 

కీర్తనలు పాడితే తప్పేమిటి? అంతక ముమ్నుపు ఎవరైనా అంతటి విజయం బిజెపి బీహార్ లో సాధించారా? ఇప్పుడు గెలిచిన వారికి కూడ కీర్తనలు పాడవచ్చు, తప్పేమిలేదు. పోటా పోటిగా , ఉత్కంటభరితంగా జరిగే ఎన్నికలలో గెలిచిన వారిని పొగడటం తప్పేలా అవుతుంది? టెనిస్ లో గెలిచినందుకు సానియా మిర్జా ను, క్రికెట్ లో ధోని, సచ్చిన్ ను పొగడటం లేదా? గెలిచిన వారిని పొగడటం రాజకీయాలలో మాత్రం భజన బృందాలు కీర్తనలు పాడాయి అంటె ఎలా?

అజ్ఞాత చెప్పారు...

మతం, కులం గెలవలేదండి. గణితం గెలిచింది.
2014 లో NDA గెలవడానికి వైరి పక్షాల అనైక్యతే ముఖ్య కారణం. పైగా అవి లోక్‌సభ ఎన్నికలు. దిల్లీలో లాగే బీహార్‌లో కూడ ప్రజలు మోది ప్రధానమంత్రి కావాలనుకున్నారు. దిల్లీలో కేజ్రీవాల్, బీహార్‌లో నితీష్ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు.
అయితే గణితసూత్రాల ప్రకారం, మహాకూటమికి 145 సీట్లే రావాలి. అంతకు మించి వచ్చినవన్నీ NDA పక్ష నేతల నోటిదురుసు వల్ల వచ్చినవే.

Jai Gottimukkala చెప్పారు...

"మొన్నమొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ద్వయం సాధించిన ఘన విజయాలు"

మహారాష్ట్రలో భాజపా ఘన విజయం సాదించిందనడం వాస్తవం కాదు. ఇంకో మూడు చిన్న పార్టీలతో కలిసి ఎన్డీయే కేవలం 29% వోట్లతో 122/288 సీట్లు గెలిచింది. చివరికి తాను జత కట్టకుండా వదిలేసినా శివసేన మద్దతుతోనే ప్రభుత్వం చేపట్టాల్సింది.

35% వోట్లు గెలుచుకున్న కాంగెస్ & ఎన్సీపీలు విడిగా పోటీ చేయకపోయి ఉంటె ఈ "ఘనవిజయం" సాధ్యం అయ్యేనా?