24, అక్టోబర్ 2015, శనివారం

వెలుగు నీడల అమరావతి వేడుక

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 25-10-2015, SUNDAY)

“సూటిగా.....సుతిమెత్తగా.........”

ఒక పెద్ద సినిమా విడుదల అయినప్పుడు దానిపై ప్రేక్షకులు అమితంగా అంచనాలు పెంచుకుంటారు. కధానాయకుడి అభిమానుల సంగతి చెప్పనక్కరే  లేదు. చిత్రం మంచి చెడులతో నిమిత్తం లేకుండా ఆకాశానికి ఎత్తుతారు. ప్రత్యర్ధి హీరో అభిమానులు కూడా తమ పాత్రకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ, ఆ సినిమాలో  ప్రతి అంశాన్నీ భూతద్దంతో గాలించి లేనిపోని తప్పులను ఎత్తి చూపే పనిలో పడతారు. ఒకరి దృష్టిలో అది నిర్మాతకు కాసులు కురిపించే విజయవంతమైన చిత్రం. మరొకరి దృష్టిలో అదే చిత్రం ఎందుకూ కొరగాని సినిమా.  సాధారణంగా చిత్ర రంగంలో కానవచ్చే ఈ రకమైన విపరీత పోకడలు ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి తమ  వికృత రూపాలను వేయిన్నొక్క చందాలుగా విశ్వరూప ప్రదర్సన చేస్తున్నాయి. గత గురువారం నాడు జరిగిన ‘ఆంద్ర రాజధాని – అమరావతి -  శంకుస్థాపన అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలో సాగిన వ్యాఖ్యానాల పరంపర ఇలాగే తొలిరోజు కొనసాగింది. విజయదశమి పర్వదినం కారణంగా  పలు తెలుగు దిన పత్రికలకు మరునాడు  సెలవు దినం కావడం వల్ల ఈ ఖండన ముండన కార్యక్రమం యావత్తూ ఒక రోజల్లా  కేవలం ఎలెక్ట్రానిక్  మాధ్యమాల పరిధుల్లో పరిమితంగా  సాగిందనే  చెప్పాలి.
కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు అమరావతిలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృత మవుతున్న భావన కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచం నలుమూలల్లో నివసిస్తున్న ఆంద్రప్రదేశ్ వారందరూ అమరావతి శంకుస్థాపన ఘడియకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసారనడంలో అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టే, అమరావతి వేడుకను, కన్నుల పండువగా, అంగరంగ వైభోగంగా, అత్యంత ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మాసాలుగా పడుతున్న శ్రమ ఫలితం అక్కడ స్పుటంగా కానవచ్చింది. ఇంతటి స్థాయిలో భారీ ఉత్సవ ఏర్పాట్లు చేసే సమయంలో యేవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. వాటిని  పెద్దగా చేసి విమర్శలు చేయడం సబబు కాదు.     
కార్యక్రమం యెంత బాగా జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరునాడు విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. విభజిత  ఆంద్ర ప్రదేశ్ జనాభాలో మొత్తం మీద 78 శాతం మంది ప్రత్యక్షంగానో, టీవీల ద్వారా పరోక్షంగానో అమరావతి వేడుకలను  ఆసక్తిగా వీక్షించారని ఆయన గణాంకాలతో సహా చెప్పారు. ఆయన చెప్పారని కాదుకాని, అదే రోజు అతి కీలకమైన భారత- దక్షిణాఫ్రికా వన్  డే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఒదులుకుని చాలామంది అమరావతిలో జరుగుతున్న సంబరాలను చూడడానికి టీవీలకు అతుక్కుపోయిన మాట కూడా వాస్తవం. అయితే వాళ్ళ ఉత్సుకతకు వేరే కారణం వుంది. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిగారు స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు అనే వార్తకు వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా, బీ.జే.పీ., టీడీపీ నాయకులు ఇచ్చిన ప్రచారం జనాల్లో ఈ రకమైన ఆసక్తిని రగిలించింది అనడంలో సందేహం లేదు. జగన్ దీక్ష సమయంలో, ఇరవై రెండో తేదీ  దాకా వేచి చూసి వుంటే బాగుండేదని ఈ ఉభయ  పార్టీల నాయకులు పదేపదే  ఉద్ఘాటించిన  విషయం గుర్తున్న వారికి ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. ఇలాటి మాటల వల్ల జనంలో మోడీ పట్ల నమ్మకాలు పెరిగిపోయాయి. ఆయన చేయబోయే ప్రసంగంలో, కొత్త రాష్ట్రం మీద వరాల వర్షం కురిపించబోతున్నారనే ఆశలు ఆకాశాన్ని తాకాయి.
అమరావతి వేడుకను సమీక్షించే సమయంలో రెండు అంశాలను గమనంలో పెట్టుకోవాలి. ఒకటి అమరావతి శంకుస్థాపన, రెండోది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండు. నిజానికి ఈ రెంటికీ నడుమ ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు. మొదటిది రాజధాని నిర్మాణం, రెండోది ఆ రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా. వాస్తవానికి కొత్త రాష్ట్రానికి ఈ రెండూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే.
బీ.జే.పీ, టీడీపీ నాయకులు తొందరపడి, ఇరవై రెండో తేదీన ప్రధాని మోడీ గారు వచ్చి పునాది రాయి వేసి  వెళ్ళిన దాకా వేచి చూడండి, దీక్షలతో తొందరపడవద్దు  అనే తరహాలో చేసిన ప్రకటనలు ఈ రెండు అంశాలను కలగాపులగం చేసి అనవసర గందరగోళం సృష్టించాయి. అలా కాకుండా బీహారు ఎన్నికల దృష్ట్యా, ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసే  అవకాశం లేకపోవచ్చని ఈ రెండు పార్టీల నాయకులు ముందుగానే  జనాల్లోకి సంకేతాలు పంపివున్నట్టయితే  పరిస్తితి ఇలా వుండేది కాదు. ఒక విధంగా  ఇది సెల్ఫ్ గోల్. అంతేకాదు, మరో రకంగా  మోడీ గారిని కూడా ఇరకాటంలోకి నెట్టినట్టయింది.
అందుకే ‘ఆరంభం అదిరిపోయింది. క్లైమాక్సే దెబ్బ కొట్టింది’ అన్న చందంగా వేడుక అట్టహాసంగా మొదలై నీరసంగా  ముగిసింది. సభ అయ్యేంతవరకు వేచి చూస్తున్న ప్రతిపక్షాలకు చేజేతులా ఒక ఆయుధం అందించినట్టయింది. ఎన్నోరకాలుగా ఆలోచించి, ఎంతగానో  శ్రమించి నిర్వహించిన ఈ  వేడుకపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో పాలక పక్షానికి చెందిన నాయకులకే ఉసూరుమనిపించేలా ప్రధాని ప్రసంగం ముగిసింది. మోడీ ప్రసంగం ప్రారంభించిన తీరు చూసిన వారికి ఎంతో  కొంత సంతోషించే అంశాలు  ఆయన ఉపన్యాసంలో వుండితీరుతాయన్న  ఆశాభావం కలిగింది.  దేశ రాజధానినే అమరావతికి తీసుకువచ్చానంటూ  పార్లమెంటు ఆవరణ నుంచి తవ్వి తీసిన మట్టి, యమునా నది పవిత్ర జలంతో కూడిన మృణ్మయ పాత్రలను ముఖ్యమంత్రికి అందచేసిన వైనం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తెలుగు ప్రజల ఆత్మ ఒకటే అంటూ, భుజం భుజం రాసుకుంటూ పనిచేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు అడ్డే వుండదని అంటూ నుడివిన పలుకులు సభికులనందరినీ అలరించాయి. బాబు, మోడీ జోడీకి తిరుగుండదు అనే రీతిలో చేసిన చమత్కారాలు హాజరయిన వారికి పులకింతలు కలిగించాయి. తన సహజ అద్భుత ప్రసంగ నైపుణ్యంతో మోడీ మహాశయులు చేసిన ఉపన్యాసం ముగియవస్తున్నా అందులో ప్రత్యేక హోదా ఊసు లేకపోవడంతో జనాలకు ఉసూరుమనిపించింది. అందుకే కాబోలు మోడీ ప్రసంగం మొదట్లో సభికుల్లో కానవచ్చిన ఉత్సాహం, చివర చివర్లో నీరుకారిపోయింది. ప్రత్యేక హోదాపై  విస్పష్ట  ప్రకటన బహిరంగంగా చేయకపోవడానికి ప్రధానమంత్రికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఆ విషయాలను పరోక్షంగా అయినా ప్రస్తావించి వుంటే వినే జనాల్లో సందిగ్దత కొంత తగ్గిపోయేది. దీనికి తోడు,  మంచిగా మాట్లాడారు అని ఆ మంచి మార్కులు కొట్టేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్ద  తన కోర్కెల జాబితా పొందుపరిచారు. ఆయనకు అర్ధం కావడానికి వీలుగా ఆ ప్రసంగ భాగం ఇంగ్లీష్ లో ఉండేట్టు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కాకపొతే  ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగానయినా ఆయన  పేర్కొనక పోవడం, కేవలం ప్యాకేజీ గురించే ప్రస్తావించడం  జనం విశేషంగా చెప్పుకునే పరిస్తితికి తెర తీసింది. మరునాడు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు కానీ, ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. విమర్శలు స్థాయి పెరిగి, ‘మోడీతో  బాబు లాలూచీ’ అనే ఆరోపణల స్థాయికి చేరింది. సరే. రాజకీయం అలాగే ఉంటుందని ఒక రాజకీయ పార్టీ అధినేతకు తెలవని సంగతి కాదు.      
పొతే, అంగరంగ వైభోగంగా, అట్టహాసంగా, అత్యంత ఆడంబరంగా, ముఖ్యమంత్రే స్వయంగా పేర్కొన్నట్టు ‘నభూతో నభవిష్యతి’ అన్నట్టుగా జరిగిన ఈ వేడుకలపై సినిమా భాషలో చెప్పాలంటే మిశ్రమ స్పందన రావడానికి ముగ్గురు వ్యక్తులు కారణం. ఆ మువ్వురి పాత్రల్లోని మంచిచెడులను విశ్లేషించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

 
మొదటి  వ్యక్తి చంద్రబాబు. ఆయనే ఈ మొత్తం వేడుకకూ కర్తా కర్మా క్రియా. దీనికి విశ్వవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి  ఆయన తన శక్తియుక్తులన్నీ ధారపోశారనే చెప్పాలి. అది అంత అవసరమా అనే ప్రశ్న వెంటనే ఉద్భవిస్తుంది. కానీ ఇదంతా చేసేది వేరే ఎవ్వరో అయితే అది వేరేసంగతి. కానీ  అయన ‘ఆ’ వేరెవ్వరో కాదు కదా!  చంద్రబాబునాయుడికి ఓ  నిర్దిష్టమైన వ్యవహార శైలి వుంది. దానికి తగ్గట్టుగా చేయకపోతే అయన చంద్రబాబే కాదు. గోదావరి పుష్కరాల సంరంభం  గమనించిన వారికి  ఈ విషయం తేలిగ్గా అర్ధం అవుతుంది. పది పైసల వస్తువుకు ప్రచారం ఖర్చు పావలా అనే మాట  అయన గురించి చెప్పుకుంటూ వుండడం రహస్యమేమీ కాదు.  అందుకే శంకుస్థాపనకు పెట్టిన ఖర్చు గురించి అంచనాలు అంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రచారార్భాటమే. నిజానికి ప్రతిపక్షాలు చెబుతున్నంత భారీగా ప్రజాధనం ఖర్చు చేసి వుండక పోవచ్చు. ప్రచారం సాగిన తీరు వేరే అభిప్రాయాలకు తావిచ్చేలా వుంది.
కానీ, కార్పొరేట్ ప్రపంచం పోకడలు తెలిసిన వాడు కనుక,  ఆరుపదులు దాటిన  వయస్సులో కూడా ఆయన తన తీరును  ఏమాత్రం మార్చుకోలేదు. దానికి తోడు అధికారం చేతిలో వుంటే ఇక  ఆకాశమే హద్దు అన్నట్టు వుంటుంది ఆయన వ్యవహారం. యెంత చేసినా తనకు తృప్తిగా ఉండదని, ఇంకా ఇంకా మెరుగు పరుచుకోవడం కోసమే తాను అహరహం తాపత్రయ పడుతుంటాననీ చంద్రబాబే చెప్పుకొచ్చారు. కనుక ఇక ఈ విషయంలో ఎవరూ ఏమీ చెప్పుకునేది  వుండదు. వర్తమానలోకం వ్యవహార శైలి ప్రకారం చంద్రబాబు చేస్తున్నది సబబే అనే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు.  చంద్రబాబు మాత్రమే ఇలా చేయగలడు అని నమ్మకాలు పెంచుకున్నవాళ్ళు లెక్కకు మిక్కిలిగా వున్నారన్నది సాంఘిక మాధ్యమాలతో పరిచయం ఉన్నవారికి తెలుస్తుంది. ఆ నమ్మకాలతో, ఆ అభిప్రాయాలతో ఏకీవభించినా, లేకపోయినా ఆయన సమర్ధతను మాత్రం శంకి౦చే అవసరం లేదు.  కానీ మనం ప్రజాస్వామ్య యుగంలో కదా ఉంటున్నది. రాజులు, మహారాజుల కాలంలో కాదు కదా! అయినా అయన తన పద్ధతిలోనే, తానూ అనుకున్న విధంగానే ఈ క్రతువు పూర్తిచేసారు.  అమరావతి శంకుస్థాపన పేరుతొ ఇప్పటికే మారుమోగిపోతున్న అయన పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు ప్రపంచమంతటికీ పాకిపోతున్నాయి. ఈ వేడుక చంద్రబాబు తలపాగాలో మరో కలికి తురాయి. ఏమీ సాధించలేకపోయినా  ఎంతో బాగా చేయగలిగాను అన్న తృప్తే ఆయనకు మిగిలింది. కానీ మనసు మూలల్లో ఏదో తెలియని అసంతృప్తి. కొందరు తెలుగు దేశం నాయకులయితే ఈ విషయంలో తమ అసహనాన్ని బాహాటంగానే బయట పెట్టుకున్నారు.
రెండో వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ‘నేను సైతం’ అనే  మహాకవి శ్రీశ్రీ గేయపాదాన్ని  తాను  ఢిల్లీ నుంచి భద్రంగా పట్టుకొచ్చిన మట్టి, నీటితో అనుసంధించి సభికులను బాగా ఆకట్టుకున్నారు.  మోడీ గారి హిందీ ప్రసంగానికి ప్రాసాలంకార శోభితంగా వెంకయ్య నాయుడుగారి చమత్కార పూరిత అనువాద నైపుణ్యం తోడుపడింది. పనిలో పనిగా వేదికపై కేసీఆర్ కూడా వున్న సందర్భాన్ని ఉపయోగించుకుని, ‘తెలుగు ప్రజలు, ఒకే ఆత్మ’ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు  భవిష్యత్ కార్య నిర్దేశనం కూడా చేసారు. కాకపొతే మొత్తం ఈ వేడుక మంచి చెడులన్నీ తన ప్రసంగ సారాంశం పై ఆధారపడి వున్న సంగతి మరచిపోయారేమో తెలియదు. అయిదు కోట్ల ఆంధ్రులు ఆశ పెట్టుకున్న హామీలు, వాగ్దానాలు పక్కనబెట్టి, కేవలం మెచ్చులోలు మాటలతోనే సరిపెట్టారు. ‘ఆరంభం అదిరింది, క్లైమాక్సే కుదరలేద’న్న వ్యాఖ్యలు వెలువడడానికి ఇదే కారణం.
ఇక, అతిధి పాత్రలో ప్రవేశించిన తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మొత్తం కార్యక్రమానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హుందాగా, క్లుప్తంగా ఈ సభలో మాట్లాడి,  కేసీఆర్ అంటే  పుల్లవిరుపు మాటలకు మారుపేరని ఆంద్ర ప్రజల్లో తనపై వున్న చెడు పేరును   పూర్తిగా చెరిపేసుకోగలిగారు. ఆయన్నీ,  ఆయన విధానాలనూ  నరనరాన వ్యతిరేకించేవాళ్ళ మార్కుల్ని కూడా ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్  కొత్త రాజధాని నిర్మాణానికి సాయం చేస్తానని కేసీఆర్ లాగా మోడీ కూడా అనలేదన్న స్థాయిలో అక్కడివాళ్లు కేసీఆర్ పై ప్రసంశలు కురిపించారు. చివరకు అమరావతి వేడుక మొత్తంలో భళా అనిపించుకున్న ప్రసంగం టీఆర్ ఎస్ అధినాయకుడిదే. తనకు ఎంతమాత్రం రుచించని రీతిలో రాష్ట్ర విభజన అంశాన్ని వేదికపై ప్రసంగించిన నాయకులు ప్రస్తావించినప్పుడు కూడా ఆయన సంయమనం కోల్పోకుండా నిగ్రహం ప్రదర్శించి హుందాగా వ్యవహరించారు.
శంకుస్థాపన కార్యక్రమం దృశ్యాలను టీవీ తెరలపై వీక్షించిన ఒక తెలుగు పౌరుడు అమెరికా నుంచి ఫేస్ బుక్ లో ఇలా రాశాడు.
‘మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు వెంటనే ఏడవక పోవడంతో అందరం కంగారు పడ్డాం. ఓ లేడీ  డాక్టర్ తన చేత్తో అప్పుడే పుట్టిన ఆ పసికందు వీపు మీద గట్టిగా తట్టింది. పాపాయి గుక్కపట్టి ఏడవడం మొదలెట్టింది. దాంతో అంతవరకు పడ్డ ఆందోళన ఆవిరైపోయింది. రెండేళ్ళ తరువాత ఇప్పుడు మా అమ్మాయి ఇంట్లో బుడిబుడి నడకలతో తిరుగాడుతుంటే చూస్తున్న మాకు ఆనాటి కష్టం గుర్తుకే రావడం లేదు. ఇది ఎందుకు రాస్తున్నాను అంటే, మొదట అమరావతి శంకుస్థాపన కోసం అక్కడి పచ్చటి అరటి తోటల్ని నేలమట్టం చేస్తుంటే టీవీల్లో చూసి  చాలా బాధ పడ్డ మాట వాస్తవం. కానీ రేపు అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం జరిగిన నాడు, అక్కడివాళ్లు  ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ, మా అమ్మాయి పుటకల్లో మేము పడ్డ బాధ మాదిరిగా  మటుమాయం అయిపోతాయి’
అది ఆ అమెరికా ముఖ పుస్తక మిత్రుడి ఆశాభావం. చంద్రబాబుకు ఇది చక్కని కితాబు.
ఫేస్ బుక్ లోనే  కానవచ్చిన మరో వ్యాఖ్య.
కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది సందేహం లేదు. అయితే, ఇది ప్రభుత్వ కార్యక్రమం అన్న ఎరుక వున్నట్టు లేదు. చంద్రబాబు మంత్రిమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో, గోదావరి పుష్కరాల్లో, అమరావతి భూమిపూజలో అంతా తానై బాధ్యత వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏ పాత్రా ఎందుకు లేదు? అతిధులకు, ఆహ్వానితులకు స్వాగతం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి కాదా? ఒక గొప్ప సభ జరిగినప్పుడు అధ్యక్షస్థానంలో ఒకరు ఉండాలన్న కనీస మర్యాదను పాటించినట్టు లేదు. ఉభయ రాష్ట్రాలకు కేంద్రం తరఫున రాష్ట్రపతి ప్రతినిధిగా వ్యవహరించే  గవర్నరుకు సముచిత గౌరవం లభించలేదు. దేశ, విదేశీ ప్రముఖులు హాజరైన ప్రభుత్వ కార్యక్రమానికి గవర్నరును అధ్యక్ష స్థానలో కూర్చోబెట్టాలన్న ఆలోచన రాకపోవడం విచారకరం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అతిథులను వేదికపైకి ఆహ్వానించి, గవర్నరు ఆ సభకు అధ్యక్షత వహించివున్నట్లయితే ఆ సభకు విలువ పెరిగి వుండేది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నరు చేత ప్రసంగం ఇప్పించాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం.” కొంచెం కటువుగా అనిపించినప్పటికీ  చంద్రబాబు గారు గమనంలో ఉంచుకోవాల్సిన అంశాలే ఇవి. హిత వాక్యం ఎప్పుడూ పదునుగానే ఉంటుందని పాలకులు గుర్తు పెట్టుకోవాలి.
ముందే పేర్కొన్నట్టు, శంకుస్థాపన తరువాత సాంఘిక మాధ్యమాల్లో ఆయా పార్టీల  అభిమానుల వ్యాఖ్యల ఘాటు  బాగా పెరిగింది.  ఆవేశంలో రాసిన, చేసిన  వ్యాఖ్యలు కూడా  అందుకు  తగ్గట్టుగానే వున్నాయి. అంచేత వాటిని అలా ఒదిలెయ్యడమే మంచిది.
ఇక రాజకీయ దుమారం, ప్రధాని తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్ ఎక్కకముందే మొదలయింది. ఇది సహజం.
ప్రధాని ప్రసంగంపై ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు తమ పార్టీ వైఖరికి తగ్గ భాష్యాలు చెప్పారు. చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పట్టుదలతో వున్న వై.ఎస్.ఆర్.సీ.పీ.,  ఏపీ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు, లోక్ సత్తా నాయకులు తన నిరసన గళాన్ని మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. మామూలుగా ఈ ప్రత్యేక హోదా అంశం లేకుండా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగి వుంటే, మోడీ గారు ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన మట్టీ నీళ్ళూ, చూడవచ్చిన జనంలో చక్కటి భావోద్వేగాన్ని రగిలించి వుండేవి. కానీ, ‘అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ’ అన్న చందంగా ఇప్పుడా మట్టీ,నీళ్ళే ప్రతిపక్షాలకు పదునయిన ఆయుధాలుగా మారాయి.
ఇదంతా చిలికి చిలికి గాలివాన కాకుండా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోని పాలక పక్షాలు ఏవైనా నష్ట నివారణ చర్యలు తీసుకుంటాయేమో చూడాలి. ఓ పది పదిహేను రోజుల్లో ఢిల్లీ నుంచి తీపే కబురు వచ్చి తీరుతుందనీ, మోడీ గారి మీద తమకానమ్మకం పుష్కలంగా వుందనీ స్థానిక టీడీపీ, బీజేపీ నాయకులు మళ్ళీ పాత పల్లవే ఎత్తుకుంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి, ‘నమ్మకం’ అంటే ఏమిటో చంద్రబాబు అభిమాని ఒకరు ఫేస్ బుక్ లోఇచ్చిన నిర్వచనంతో దీన్ని ముగిస్తాను.   
‘మీరు అతడిపై చాలా  నమ్మకం పెట్టుకున్నట్టున్నారు. ఎపుడయినా ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేస్తే మీరు ఎలా అనుకుంటారు?’ ‘ఇందులో అనుకోవడానికి ఏముంది? అతడ్ని నమ్మాలన్నది నా నిర్ణయం. అది తప్పుడు నిర్ణయం కాదని రుజువు చేసే  విజ్ఞత, వివేకం   అతడికే వుండాలి. నాదేముంది?’
ఆంద్ర ప్రదేశ్ లో రాబోయే రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు, పునరేకీకరణలకు ఇదొక సూచిక అనడం తొందరపాటే అవుతుందేమో! (24-10-2015)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595   

23, అక్టోబర్ 2015, శుక్రవారం

నివ్వెరపోయిన నెహ్రూ


‘నిశ్శబ్దం చాలా భయంకరంగా వుంటుంది’ అనే డైలాగు వుంది ఓ సినిమాలో.
ఒక్కోసారి నిశ్శబ్దం దిమ్మ అదరగొడుతుంది.
లెఫ్ట్ నెంట్ జనరల్ నిరంజన్ మాలిక్ అనే రిటైర్డ్ సైనికాధికారి చెప్పిన విషయం ఇది.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో జవహర్  లాల్   నెహ్రూ భారత సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే విషయంలో సీనియర్ సైనికాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో  నెహ్రూ చేసిన ప్రతిపాదన అధికారులను నివ్వెర పరచింది. ‘ఈ పదవికి భారత సైన్యంలో తగినవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కొంతకాలం పాటు ఎవరయినా  అనుభవం కలిగిన బ్రిటిష్ అధికారితోనే వ్యవహారాలు నడిపించాలనేది నెహ్రూ ఉద్దేశ్యం. ఆ పదవికి తగిన అనుభవం, సమర్ధత వున్న భారతీయులు లేరని తాను అనుకుంటున్నానని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు. సాక్షాత్తు నెహ్రూనే  అలా అంటుంటే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా తల ఊపారు. ఇంతలో నాథూ సింగ్ రాథోర్ అనే సీనియర్ అధికారి లేచి నిలబడి మాట్లాడడానికి అనుమతి కోరాడు. అలా ధైర్యంగా ఒక ఆధికారి చొరవ  తీసుకుని అడగడంతో నివ్వెర పోవడం నెహ్రూ వంతయింది. అయినా తేరుకుని, చెప్పదలచుకున్నది సూటిగా, భయపడకుండా చెప్పమని ప్రోత్సహించాడు. అప్పుడు రాథోర్ ఇలా అన్నాడు.
‘సర్! దేశాన్ని పాలించే సమర్ధత కలిగిన నాయకుడు కూడా మనకు లేడనుకుందాం. అలా అని,  బ్రిటన్  నుంచి మంచి అనుభవశాలిని మన ప్రధానమంత్రిగా తెచ్చుకోవడం సబబుగా ఉంటుందా?’
రాథోర్ అలా అడగడంతో అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. నెహ్రూకు కూడా అతడు అడిగిన దాంట్లో విషయం బోధ పడింది. అయన వెంటనే  రాథోర్ వైపు తిరిగి ‘ఈ పదవి నీకే ఇస్తాను, నువ్వు నిభాయించుకునిరాగలవా?’ అని అడిగారు.
రాథోర్ తొట్రు పడకుండా సమాధానం చెప్పాడు.  ‘సర్! మన సైన్యంలో అత్యంత సమర్థుడు అయిన ఓ అధికారి వున్నారు.ఆయన  నా సీనియర్. జనరల్ కరియప్ప. మా అందరిలోకి చాలా చేవకలిగినవాడు’
ఆ విధంగా జనరల్ కరియప్ప భారత దేశపు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు కాగలిగారని నిరంజన్ మాలిక్ కధనం.


(ఫోటో: 1949 లో ఢిల్లీ పాలం విమానాశ్రయంలో నాటి ప్రధాని జవహర్  లాల్  నెహ్రూతో జనరల్ కరియప్ప)  



22, అక్టోబర్ 2015, గురువారం

అమరావతి రివ్యూ

ఆరంభం అదిరింది.
ఒక కార్యక్రమాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడం ఎట్లాగో విదేశీయులకి కూడా తెలిసివచ్చేలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా  జరిగాయి.
ఏదీ తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు. అంతా నెంబర్ వన్. సందేహం లేదు.

కాకపోతే, క్లైమాక్సే  నిరాశ పరిచింది.
నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై వంద రోజుల బొమ్మ. 

....డు వాన విదిచ

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్ టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం. కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.


తాజాతోక
చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ, ఆ పదాలపై అన్ని స్వామ్యములు, ఈప్రజాస్వామ్యదేశంలో, ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. – రాయని రచయిత

NOTE: Cartoon Courtesy : www.shutterstock.com

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......1


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?


ఫీల్డ్  మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణ పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష  నేర్చుకున్నాను. అలాగే  మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష  నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’

అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’         

21, అక్టోబర్ 2015, బుధవారం

అంత సీను లేదు.....


'ఏరా అబ్బాయ్. నువ్వుజగన్నాధం కొడుకువి కదా! నెలకు లక్షా యాభయ్ వేలు జీతమటగా! మీ  నాన్న చెప్పాడు. మరి, (పెళ్లి చేసుకుని) మాకు 'పప్పన్నం' ఎప్పుడు పెడతావ్!"
"అంతమాట అనకండి అంకుల్! పప్పన్నం పెట్టగలిగే స్తోమత లేదు. ఏదో, చారూ మజ్జిగా అంటే పరవాలేదు"


సూటిగా....సుతిమెత్తగా..... అక్షర సత్యాల్లో అర్ధ సత్యాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 22-10-2015, THURSDAY)

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984,  అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో  కనబడిన ఓ  అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని,  అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ  మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె  ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా  ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి  శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి  ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక  గాంధి  వయస్సు  కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)


“వీపీ సింగ్ ప్రభుత్వ పతనానంతరం రాజీవ్ గాంధీని ఆనాడే ప్రధానమంత్రిని చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ సుముఖత చూపని కారణంగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. పైగా రాజీవ్ బదులు ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని వెంకట్రామన్ కోరుకున్నారు.”
ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రేమతి గాంధి అంతరంగికుడు ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన  ఒక పుస్తకంలో  అక్షరబద్ధం అయ్యాయి.
శ్రీమతి గాంధీ దుర్నిరీక్షంగా దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇద్దరు అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తూ వుండేవారు. శ్రీమతి గాంధీ ఆంతరంగిక వర్గంలోని వారు కాబట్టి వారిరువురి మాటా మంత్రులకే కాదు, సీనియర్ అధికారులకు కూడా శిరోధార్యం. వారు ఏదైనా చెప్పారంటే ఇక అది శిలాశాసనం.  ఆర్.కే. ధావన్, ఎం.ఎల్. ఫోతెదార్  అనే ఈ ఇరువురూ, ఇందిర పుణ్యమా అని  రాజకీయంగా కూడా ఎన్నో   ఎత్తులకు ఎదిగారు.
ఫోతెదార్ రాసిన ఈ ఆత్మకధ పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది.
పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణ కర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని అంశాలకు ముందుగానే మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది.
ప్రముఖులు జీవించివున్నకాలంలో,  వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల  జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకదల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు. ఇది ఏదో మన దేశానికి సంబంధించింది మాత్రమె కాదు. నిజం చెప్పాలంటే ఇలా పుస్తకాలను మార్కెట్ చేసే సంస్కృతి విదేశాలనుంచే దిగుమతి అయింది.
వాస్తవానికి,  సాహిత్య ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్ర పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్న వాస్తవ చిత్రం  కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా పర దూషణ ఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేరుఘనగధీరుడయినప్పటికీ  ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసే  తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ఆత్మ స్తుతి-పరనింద తొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. మహాత్మా గాంధీ రాసుకున్న మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి, బయట పెట్టుకోవడానికి  ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.
చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే ఛాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకున్నా, రాయించుకున్నా అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. అందుకే, తృణమో ఫణమో చదివించుకుని  ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత చరిత్రలు రాయించుకునే రచనలకు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా ముచ్చటపడి చదువుకునే  రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టీ , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ,  పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు వ్యవహారం కాదు కాబట్టీ అటువంటి  వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే,  అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో కొన్ని  రసరమ్య ఘట్టాలు’ వుండేవుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి, పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి. అందుకో చక్కని ఉదాహరణ, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో రాసిన  “ప్రయాణం” అనే పుస్తకం. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహం నుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

సన్’ పత్రిక లో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది. టోనీ పుస్తకాలూ వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయాయి.

ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా ఎగరేసుకుపోయారు. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం  కాబట్టి పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం ప్రచురించారు.

పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్ అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.
ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా,  యిరవై నాలుగు (బ్రిటిష్) పౌండ్లు మీవి కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది.
పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ లాగే ఈయనా ఒక  సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని(ఆంద్ర ప్రదేశ్) ముఖ్యమంత్రిని చేసాను. కానీ ఆయన  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు.
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేసుకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ.ఆర్.వొ. గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధపెట్టేవిగా  వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను గ్రంధ ప్రచురణకు  ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు. అలాగే పర్వతాలరావు గారి పేరు అందులో ఎక్కడాలేదు.
ఈ కోవలోకి వచ్చేదే  మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత  ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు సినీ ప్రముఖులను కించబరిచే వ్యాఖ్యానాలు అందులో  వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. (21-1-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595