24, అక్టోబర్ 2015, శనివారం

వెలుగు నీడల అమరావతి వేడుక

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 25-10-2015, SUNDAY)

“సూటిగా.....సుతిమెత్తగా.........”

ఒక పెద్ద సినిమా విడుదల అయినప్పుడు దానిపై ప్రేక్షకులు అమితంగా అంచనాలు పెంచుకుంటారు. కధానాయకుడి అభిమానుల సంగతి చెప్పనక్కరే  లేదు. చిత్రం మంచి చెడులతో నిమిత్తం లేకుండా ఆకాశానికి ఎత్తుతారు. ప్రత్యర్ధి హీరో అభిమానులు కూడా తమ పాత్రకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ, ఆ సినిమాలో  ప్రతి అంశాన్నీ భూతద్దంతో గాలించి లేనిపోని తప్పులను ఎత్తి చూపే పనిలో పడతారు. ఒకరి దృష్టిలో అది నిర్మాతకు కాసులు కురిపించే విజయవంతమైన చిత్రం. మరొకరి దృష్టిలో అదే చిత్రం ఎందుకూ కొరగాని సినిమా.  సాధారణంగా చిత్ర రంగంలో కానవచ్చే ఈ రకమైన విపరీత పోకడలు ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి తమ  వికృత రూపాలను వేయిన్నొక్క చందాలుగా విశ్వరూప ప్రదర్సన చేస్తున్నాయి. గత గురువారం నాడు జరిగిన ‘ఆంద్ర రాజధాని – అమరావతి -  శంకుస్థాపన అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలో సాగిన వ్యాఖ్యానాల పరంపర ఇలాగే తొలిరోజు కొనసాగింది. విజయదశమి పర్వదినం కారణంగా  పలు తెలుగు దిన పత్రికలకు మరునాడు  సెలవు దినం కావడం వల్ల ఈ ఖండన ముండన కార్యక్రమం యావత్తూ ఒక రోజల్లా  కేవలం ఎలెక్ట్రానిక్  మాధ్యమాల పరిధుల్లో పరిమితంగా  సాగిందనే  చెప్పాలి.
కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు అమరావతిలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృత మవుతున్న భావన కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచం నలుమూలల్లో నివసిస్తున్న ఆంద్రప్రదేశ్ వారందరూ అమరావతి శంకుస్థాపన ఘడియకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసారనడంలో అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టే, అమరావతి వేడుకను, కన్నుల పండువగా, అంగరంగ వైభోగంగా, అత్యంత ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మాసాలుగా పడుతున్న శ్రమ ఫలితం అక్కడ స్పుటంగా కానవచ్చింది. ఇంతటి స్థాయిలో భారీ ఉత్సవ ఏర్పాట్లు చేసే సమయంలో యేవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. వాటిని  పెద్దగా చేసి విమర్శలు చేయడం సబబు కాదు.     
కార్యక్రమం యెంత బాగా జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరునాడు విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. విభజిత  ఆంద్ర ప్రదేశ్ జనాభాలో మొత్తం మీద 78 శాతం మంది ప్రత్యక్షంగానో, టీవీల ద్వారా పరోక్షంగానో అమరావతి వేడుకలను  ఆసక్తిగా వీక్షించారని ఆయన గణాంకాలతో సహా చెప్పారు. ఆయన చెప్పారని కాదుకాని, అదే రోజు అతి కీలకమైన భారత- దక్షిణాఫ్రికా వన్  డే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఒదులుకుని చాలామంది అమరావతిలో జరుగుతున్న సంబరాలను చూడడానికి టీవీలకు అతుక్కుపోయిన మాట కూడా వాస్తవం. అయితే వాళ్ళ ఉత్సుకతకు వేరే కారణం వుంది. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిగారు స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు అనే వార్తకు వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా, బీ.జే.పీ., టీడీపీ నాయకులు ఇచ్చిన ప్రచారం జనాల్లో ఈ రకమైన ఆసక్తిని రగిలించింది అనడంలో సందేహం లేదు. జగన్ దీక్ష సమయంలో, ఇరవై రెండో తేదీ  దాకా వేచి చూసి వుంటే బాగుండేదని ఈ ఉభయ  పార్టీల నాయకులు పదేపదే  ఉద్ఘాటించిన  విషయం గుర్తున్న వారికి ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. ఇలాటి మాటల వల్ల జనంలో మోడీ పట్ల నమ్మకాలు పెరిగిపోయాయి. ఆయన చేయబోయే ప్రసంగంలో, కొత్త రాష్ట్రం మీద వరాల వర్షం కురిపించబోతున్నారనే ఆశలు ఆకాశాన్ని తాకాయి.
అమరావతి వేడుకను సమీక్షించే సమయంలో రెండు అంశాలను గమనంలో పెట్టుకోవాలి. ఒకటి అమరావతి శంకుస్థాపన, రెండోది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండు. నిజానికి ఈ రెంటికీ నడుమ ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు. మొదటిది రాజధాని నిర్మాణం, రెండోది ఆ రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా. వాస్తవానికి కొత్త రాష్ట్రానికి ఈ రెండూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే.
బీ.జే.పీ, టీడీపీ నాయకులు తొందరపడి, ఇరవై రెండో తేదీన ప్రధాని మోడీ గారు వచ్చి పునాది రాయి వేసి  వెళ్ళిన దాకా వేచి చూడండి, దీక్షలతో తొందరపడవద్దు  అనే తరహాలో చేసిన ప్రకటనలు ఈ రెండు అంశాలను కలగాపులగం చేసి అనవసర గందరగోళం సృష్టించాయి. అలా కాకుండా బీహారు ఎన్నికల దృష్ట్యా, ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసే  అవకాశం లేకపోవచ్చని ఈ రెండు పార్టీల నాయకులు ముందుగానే  జనాల్లోకి సంకేతాలు పంపివున్నట్టయితే  పరిస్తితి ఇలా వుండేది కాదు. ఒక విధంగా  ఇది సెల్ఫ్ గోల్. అంతేకాదు, మరో రకంగా  మోడీ గారిని కూడా ఇరకాటంలోకి నెట్టినట్టయింది.
అందుకే ‘ఆరంభం అదిరిపోయింది. క్లైమాక్సే దెబ్బ కొట్టింది’ అన్న చందంగా వేడుక అట్టహాసంగా మొదలై నీరసంగా  ముగిసింది. సభ అయ్యేంతవరకు వేచి చూస్తున్న ప్రతిపక్షాలకు చేజేతులా ఒక ఆయుధం అందించినట్టయింది. ఎన్నోరకాలుగా ఆలోచించి, ఎంతగానో  శ్రమించి నిర్వహించిన ఈ  వేడుకపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో పాలక పక్షానికి చెందిన నాయకులకే ఉసూరుమనిపించేలా ప్రధాని ప్రసంగం ముగిసింది. మోడీ ప్రసంగం ప్రారంభించిన తీరు చూసిన వారికి ఎంతో  కొంత సంతోషించే అంశాలు  ఆయన ఉపన్యాసంలో వుండితీరుతాయన్న  ఆశాభావం కలిగింది.  దేశ రాజధానినే అమరావతికి తీసుకువచ్చానంటూ  పార్లమెంటు ఆవరణ నుంచి తవ్వి తీసిన మట్టి, యమునా నది పవిత్ర జలంతో కూడిన మృణ్మయ పాత్రలను ముఖ్యమంత్రికి అందచేసిన వైనం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తెలుగు ప్రజల ఆత్మ ఒకటే అంటూ, భుజం భుజం రాసుకుంటూ పనిచేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు అడ్డే వుండదని అంటూ నుడివిన పలుకులు సభికులనందరినీ అలరించాయి. బాబు, మోడీ జోడీకి తిరుగుండదు అనే రీతిలో చేసిన చమత్కారాలు హాజరయిన వారికి పులకింతలు కలిగించాయి. తన సహజ అద్భుత ప్రసంగ నైపుణ్యంతో మోడీ మహాశయులు చేసిన ఉపన్యాసం ముగియవస్తున్నా అందులో ప్రత్యేక హోదా ఊసు లేకపోవడంతో జనాలకు ఉసూరుమనిపించింది. అందుకే కాబోలు మోడీ ప్రసంగం మొదట్లో సభికుల్లో కానవచ్చిన ఉత్సాహం, చివర చివర్లో నీరుకారిపోయింది. ప్రత్యేక హోదాపై  విస్పష్ట  ప్రకటన బహిరంగంగా చేయకపోవడానికి ప్రధానమంత్రికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఆ విషయాలను పరోక్షంగా అయినా ప్రస్తావించి వుంటే వినే జనాల్లో సందిగ్దత కొంత తగ్గిపోయేది. దీనికి తోడు,  మంచిగా మాట్లాడారు అని ఆ మంచి మార్కులు కొట్టేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్ద  తన కోర్కెల జాబితా పొందుపరిచారు. ఆయనకు అర్ధం కావడానికి వీలుగా ఆ ప్రసంగ భాగం ఇంగ్లీష్ లో ఉండేట్టు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కాకపొతే  ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగానయినా ఆయన  పేర్కొనక పోవడం, కేవలం ప్యాకేజీ గురించే ప్రస్తావించడం  జనం విశేషంగా చెప్పుకునే పరిస్తితికి తెర తీసింది. మరునాడు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు కానీ, ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. విమర్శలు స్థాయి పెరిగి, ‘మోడీతో  బాబు లాలూచీ’ అనే ఆరోపణల స్థాయికి చేరింది. సరే. రాజకీయం అలాగే ఉంటుందని ఒక రాజకీయ పార్టీ అధినేతకు తెలవని సంగతి కాదు.      
పొతే, అంగరంగ వైభోగంగా, అట్టహాసంగా, అత్యంత ఆడంబరంగా, ముఖ్యమంత్రే స్వయంగా పేర్కొన్నట్టు ‘నభూతో నభవిష్యతి’ అన్నట్టుగా జరిగిన ఈ వేడుకలపై సినిమా భాషలో చెప్పాలంటే మిశ్రమ స్పందన రావడానికి ముగ్గురు వ్యక్తులు కారణం. ఆ మువ్వురి పాత్రల్లోని మంచిచెడులను విశ్లేషించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

 
మొదటి  వ్యక్తి చంద్రబాబు. ఆయనే ఈ మొత్తం వేడుకకూ కర్తా కర్మా క్రియా. దీనికి విశ్వవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి  ఆయన తన శక్తియుక్తులన్నీ ధారపోశారనే చెప్పాలి. అది అంత అవసరమా అనే ప్రశ్న వెంటనే ఉద్భవిస్తుంది. కానీ ఇదంతా చేసేది వేరే ఎవ్వరో అయితే అది వేరేసంగతి. కానీ  అయన ‘ఆ’ వేరెవ్వరో కాదు కదా!  చంద్రబాబునాయుడికి ఓ  నిర్దిష్టమైన వ్యవహార శైలి వుంది. దానికి తగ్గట్టుగా చేయకపోతే అయన చంద్రబాబే కాదు. గోదావరి పుష్కరాల సంరంభం  గమనించిన వారికి  ఈ విషయం తేలిగ్గా అర్ధం అవుతుంది. పది పైసల వస్తువుకు ప్రచారం ఖర్చు పావలా అనే మాట  అయన గురించి చెప్పుకుంటూ వుండడం రహస్యమేమీ కాదు.  అందుకే శంకుస్థాపనకు పెట్టిన ఖర్చు గురించి అంచనాలు అంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రచారార్భాటమే. నిజానికి ప్రతిపక్షాలు చెబుతున్నంత భారీగా ప్రజాధనం ఖర్చు చేసి వుండక పోవచ్చు. ప్రచారం సాగిన తీరు వేరే అభిప్రాయాలకు తావిచ్చేలా వుంది.
కానీ, కార్పొరేట్ ప్రపంచం పోకడలు తెలిసిన వాడు కనుక,  ఆరుపదులు దాటిన  వయస్సులో కూడా ఆయన తన తీరును  ఏమాత్రం మార్చుకోలేదు. దానికి తోడు అధికారం చేతిలో వుంటే ఇక  ఆకాశమే హద్దు అన్నట్టు వుంటుంది ఆయన వ్యవహారం. యెంత చేసినా తనకు తృప్తిగా ఉండదని, ఇంకా ఇంకా మెరుగు పరుచుకోవడం కోసమే తాను అహరహం తాపత్రయ పడుతుంటాననీ చంద్రబాబే చెప్పుకొచ్చారు. కనుక ఇక ఈ విషయంలో ఎవరూ ఏమీ చెప్పుకునేది  వుండదు. వర్తమానలోకం వ్యవహార శైలి ప్రకారం చంద్రబాబు చేస్తున్నది సబబే అనే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు.  చంద్రబాబు మాత్రమే ఇలా చేయగలడు అని నమ్మకాలు పెంచుకున్నవాళ్ళు లెక్కకు మిక్కిలిగా వున్నారన్నది సాంఘిక మాధ్యమాలతో పరిచయం ఉన్నవారికి తెలుస్తుంది. ఆ నమ్మకాలతో, ఆ అభిప్రాయాలతో ఏకీవభించినా, లేకపోయినా ఆయన సమర్ధతను మాత్రం శంకి౦చే అవసరం లేదు.  కానీ మనం ప్రజాస్వామ్య యుగంలో కదా ఉంటున్నది. రాజులు, మహారాజుల కాలంలో కాదు కదా! అయినా అయన తన పద్ధతిలోనే, తానూ అనుకున్న విధంగానే ఈ క్రతువు పూర్తిచేసారు.  అమరావతి శంకుస్థాపన పేరుతొ ఇప్పటికే మారుమోగిపోతున్న అయన పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు ప్రపంచమంతటికీ పాకిపోతున్నాయి. ఈ వేడుక చంద్రబాబు తలపాగాలో మరో కలికి తురాయి. ఏమీ సాధించలేకపోయినా  ఎంతో బాగా చేయగలిగాను అన్న తృప్తే ఆయనకు మిగిలింది. కానీ మనసు మూలల్లో ఏదో తెలియని అసంతృప్తి. కొందరు తెలుగు దేశం నాయకులయితే ఈ విషయంలో తమ అసహనాన్ని బాహాటంగానే బయట పెట్టుకున్నారు.
రెండో వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ‘నేను సైతం’ అనే  మహాకవి శ్రీశ్రీ గేయపాదాన్ని  తాను  ఢిల్లీ నుంచి భద్రంగా పట్టుకొచ్చిన మట్టి, నీటితో అనుసంధించి సభికులను బాగా ఆకట్టుకున్నారు.  మోడీ గారి హిందీ ప్రసంగానికి ప్రాసాలంకార శోభితంగా వెంకయ్య నాయుడుగారి చమత్కార పూరిత అనువాద నైపుణ్యం తోడుపడింది. పనిలో పనిగా వేదికపై కేసీఆర్ కూడా వున్న సందర్భాన్ని ఉపయోగించుకుని, ‘తెలుగు ప్రజలు, ఒకే ఆత్మ’ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు  భవిష్యత్ కార్య నిర్దేశనం కూడా చేసారు. కాకపొతే మొత్తం ఈ వేడుక మంచి చెడులన్నీ తన ప్రసంగ సారాంశం పై ఆధారపడి వున్న సంగతి మరచిపోయారేమో తెలియదు. అయిదు కోట్ల ఆంధ్రులు ఆశ పెట్టుకున్న హామీలు, వాగ్దానాలు పక్కనబెట్టి, కేవలం మెచ్చులోలు మాటలతోనే సరిపెట్టారు. ‘ఆరంభం అదిరింది, క్లైమాక్సే కుదరలేద’న్న వ్యాఖ్యలు వెలువడడానికి ఇదే కారణం.
ఇక, అతిధి పాత్రలో ప్రవేశించిన తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మొత్తం కార్యక్రమానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హుందాగా, క్లుప్తంగా ఈ సభలో మాట్లాడి,  కేసీఆర్ అంటే  పుల్లవిరుపు మాటలకు మారుపేరని ఆంద్ర ప్రజల్లో తనపై వున్న చెడు పేరును   పూర్తిగా చెరిపేసుకోగలిగారు. ఆయన్నీ,  ఆయన విధానాలనూ  నరనరాన వ్యతిరేకించేవాళ్ళ మార్కుల్ని కూడా ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్  కొత్త రాజధాని నిర్మాణానికి సాయం చేస్తానని కేసీఆర్ లాగా మోడీ కూడా అనలేదన్న స్థాయిలో అక్కడివాళ్లు కేసీఆర్ పై ప్రసంశలు కురిపించారు. చివరకు అమరావతి వేడుక మొత్తంలో భళా అనిపించుకున్న ప్రసంగం టీఆర్ ఎస్ అధినాయకుడిదే. తనకు ఎంతమాత్రం రుచించని రీతిలో రాష్ట్ర విభజన అంశాన్ని వేదికపై ప్రసంగించిన నాయకులు ప్రస్తావించినప్పుడు కూడా ఆయన సంయమనం కోల్పోకుండా నిగ్రహం ప్రదర్శించి హుందాగా వ్యవహరించారు.
శంకుస్థాపన కార్యక్రమం దృశ్యాలను టీవీ తెరలపై వీక్షించిన ఒక తెలుగు పౌరుడు అమెరికా నుంచి ఫేస్ బుక్ లో ఇలా రాశాడు.
‘మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు వెంటనే ఏడవక పోవడంతో అందరం కంగారు పడ్డాం. ఓ లేడీ  డాక్టర్ తన చేత్తో అప్పుడే పుట్టిన ఆ పసికందు వీపు మీద గట్టిగా తట్టింది. పాపాయి గుక్కపట్టి ఏడవడం మొదలెట్టింది. దాంతో అంతవరకు పడ్డ ఆందోళన ఆవిరైపోయింది. రెండేళ్ళ తరువాత ఇప్పుడు మా అమ్మాయి ఇంట్లో బుడిబుడి నడకలతో తిరుగాడుతుంటే చూస్తున్న మాకు ఆనాటి కష్టం గుర్తుకే రావడం లేదు. ఇది ఎందుకు రాస్తున్నాను అంటే, మొదట అమరావతి శంకుస్థాపన కోసం అక్కడి పచ్చటి అరటి తోటల్ని నేలమట్టం చేస్తుంటే టీవీల్లో చూసి  చాలా బాధ పడ్డ మాట వాస్తవం. కానీ రేపు అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం జరిగిన నాడు, అక్కడివాళ్లు  ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ, మా అమ్మాయి పుటకల్లో మేము పడ్డ బాధ మాదిరిగా  మటుమాయం అయిపోతాయి’
అది ఆ అమెరికా ముఖ పుస్తక మిత్రుడి ఆశాభావం. చంద్రబాబుకు ఇది చక్కని కితాబు.
ఫేస్ బుక్ లోనే  కానవచ్చిన మరో వ్యాఖ్య.
కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది సందేహం లేదు. అయితే, ఇది ప్రభుత్వ కార్యక్రమం అన్న ఎరుక వున్నట్టు లేదు. చంద్రబాబు మంత్రిమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో, గోదావరి పుష్కరాల్లో, అమరావతి భూమిపూజలో అంతా తానై బాధ్యత వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏ పాత్రా ఎందుకు లేదు? అతిధులకు, ఆహ్వానితులకు స్వాగతం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి కాదా? ఒక గొప్ప సభ జరిగినప్పుడు అధ్యక్షస్థానంలో ఒకరు ఉండాలన్న కనీస మర్యాదను పాటించినట్టు లేదు. ఉభయ రాష్ట్రాలకు కేంద్రం తరఫున రాష్ట్రపతి ప్రతినిధిగా వ్యవహరించే  గవర్నరుకు సముచిత గౌరవం లభించలేదు. దేశ, విదేశీ ప్రముఖులు హాజరైన ప్రభుత్వ కార్యక్రమానికి గవర్నరును అధ్యక్ష స్థానలో కూర్చోబెట్టాలన్న ఆలోచన రాకపోవడం విచారకరం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అతిథులను వేదికపైకి ఆహ్వానించి, గవర్నరు ఆ సభకు అధ్యక్షత వహించివున్నట్లయితే ఆ సభకు విలువ పెరిగి వుండేది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నరు చేత ప్రసంగం ఇప్పించాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం.” కొంచెం కటువుగా అనిపించినప్పటికీ  చంద్రబాబు గారు గమనంలో ఉంచుకోవాల్సిన అంశాలే ఇవి. హిత వాక్యం ఎప్పుడూ పదునుగానే ఉంటుందని పాలకులు గుర్తు పెట్టుకోవాలి.
ముందే పేర్కొన్నట్టు, శంకుస్థాపన తరువాత సాంఘిక మాధ్యమాల్లో ఆయా పార్టీల  అభిమానుల వ్యాఖ్యల ఘాటు  బాగా పెరిగింది.  ఆవేశంలో రాసిన, చేసిన  వ్యాఖ్యలు కూడా  అందుకు  తగ్గట్టుగానే వున్నాయి. అంచేత వాటిని అలా ఒదిలెయ్యడమే మంచిది.
ఇక రాజకీయ దుమారం, ప్రధాని తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్ ఎక్కకముందే మొదలయింది. ఇది సహజం.
ప్రధాని ప్రసంగంపై ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు తమ పార్టీ వైఖరికి తగ్గ భాష్యాలు చెప్పారు. చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పట్టుదలతో వున్న వై.ఎస్.ఆర్.సీ.పీ.,  ఏపీ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు, లోక్ సత్తా నాయకులు తన నిరసన గళాన్ని మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. మామూలుగా ఈ ప్రత్యేక హోదా అంశం లేకుండా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగి వుంటే, మోడీ గారు ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన మట్టీ నీళ్ళూ, చూడవచ్చిన జనంలో చక్కటి భావోద్వేగాన్ని రగిలించి వుండేవి. కానీ, ‘అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ’ అన్న చందంగా ఇప్పుడా మట్టీ,నీళ్ళే ప్రతిపక్షాలకు పదునయిన ఆయుధాలుగా మారాయి.
ఇదంతా చిలికి చిలికి గాలివాన కాకుండా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోని పాలక పక్షాలు ఏవైనా నష్ట నివారణ చర్యలు తీసుకుంటాయేమో చూడాలి. ఓ పది పదిహేను రోజుల్లో ఢిల్లీ నుంచి తీపే కబురు వచ్చి తీరుతుందనీ, మోడీ గారి మీద తమకానమ్మకం పుష్కలంగా వుందనీ స్థానిక టీడీపీ, బీజేపీ నాయకులు మళ్ళీ పాత పల్లవే ఎత్తుకుంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి, ‘నమ్మకం’ అంటే ఏమిటో చంద్రబాబు అభిమాని ఒకరు ఫేస్ బుక్ లోఇచ్చిన నిర్వచనంతో దీన్ని ముగిస్తాను.   
‘మీరు అతడిపై చాలా  నమ్మకం పెట్టుకున్నట్టున్నారు. ఎపుడయినా ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేస్తే మీరు ఎలా అనుకుంటారు?’ ‘ఇందులో అనుకోవడానికి ఏముంది? అతడ్ని నమ్మాలన్నది నా నిర్ణయం. అది తప్పుడు నిర్ణయం కాదని రుజువు చేసే  విజ్ఞత, వివేకం   అతడికే వుండాలి. నాదేముంది?’
ఆంద్ర ప్రదేశ్ లో రాబోయే రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు, పునరేకీకరణలకు ఇదొక సూచిక అనడం తొందరపాటే అవుతుందేమో! (24-10-2015)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595   

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

మోడీ ఒక రాజకీయనాయకుడు. ఆయన అవసరార్థం కొన్ని వాగ్దానాలు ఆంద్రప్రజలకు ఎరగా వేసి ఫలితం రాబట్టుకున్నాడు. అంతే. ఆయనేదో ఒరగబెడతాడని అమాయకత్వం.

కేసీయార్ కూడా ఒక రాజకీయనాయకుడు. పక్కరాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రాముఖ్యమంత్రి ఆహ్వానాన్ని తిరస్కరించనూలేడు కార్యక్రమానికి ముఖంచాటువేసి నిందను ఆహ్వానించనూలేడు. కాబట్టే ఆయన రాక. ఆయన కొన్ని ముఖప్రీతిమాటలు చెప్పినందువలన శాపానార్థాలు కట్టిపెట్టి ఆంధ్రులతో అనురాగంతో మెలగుతాడన్న ఆలోచనలూ విశ్లేషణలూ చేయటం వఠ్ఠి అమాయకత్వం.

ప్రతిపక్షాలూ రాజకీయనాయకుల గుంపులే కాబట్టి వారి అవసరం మేరకు వారు రంధ్రాన్వేషణలూ చేయటం మాములే. అంతమాత్రాన ములిగేదీ తేలీదీ ఏమీ ఉండద్ని వారికీ తెలుసును. వాట్ గురించి ప్రస్తావించుకోవటమూ దండగే.

ఆంధ్రరాష్ట్రం స్వశక్తితోనే అభివృధ్ధి చెందవలసి ఉంది. ఆతరువాత అభివృధ్ధిఫలాల్లో వాటాలకోసం వచ్చే రకరకాల వాళ్ళలో నిత్యం ఆంధ్రామీద నిందలతో కాలక్షేపం చేసే రాష్ట్రం వారూ ఉంటారు, మాటలసాయంతో కాలక్షేపం చేసి నిస్సిగ్గుగా సింహభాగం కోసం డిమాండులతో వచ్చే కేంద్రం దొరతనమూ ఉంటుంది. కాలంలో చాలా తమాషాలు జరగబోతున్నాయి - వేచి చూడండి.