(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-10-2015, SUNDAY)
సూటిగా ......సుతిమెత్తగా
చూస్తోంది ఇంతే! చూడాల్సింది ఇంకెంతో!
‘చెప్పేవాడు లేక చెడిపోయాడ’ని సామెత. నవజాత ఆంద్ర
ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల వరస చూస్తుంటే ఈ నానుడి గుర్తొస్తోంది.
సమస్యల అమావాస్యల్లో ఆవిర్భవించిన ఈ కొత్త రాష్ట్రంలో
ప్రతి రోజూ ఒక సమస్యే. ఆ సమస్య కూడా పాలక ప్రతిపక్షాల నడుమ సమస్య. ప్రజల సమస్య
యెంత మాత్రం కాదు. వారి సమస్యలు వారికి వున్నాయి. ఆకాశానికి ఎగబాకుతున్న ఒక్క
పప్పుల ధరలు చాలు వారి కష్టాలు, సమస్యలు ఏ తీరున వున్నాయో చెప్పడానికి. కానీ
అవేవీ ఏలినవారికీ కనపడ్డం లేదు, వారిని నిలదీయాల్సిన ప్రతిపక్షానికీ పట్టడం లేదు.
వారి వారి రాజకీయ అంశాలే ఆయా పార్టీల
ప్రాధాన్యతాక్రమంలో మొదటి వరుసలో వున్నాయి.
పాలక పక్షం టీడీపీ, రాజధాని
నిర్మాణ శంకుస్థాపన పనుల్లో ప్రస్తుతం మునిగితేలుతోంది. ఏకైక ప్రతిపక్షం
వై.ఎస్.ఆర్.సి.పీ. మరో కార్యక్రమం లేనట్టు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని
వేళ్ళాడుతోంది. నిజానికి ఈ రెండూ చాలా ముఖ్యమైన అంశాలే. కానీ ప్రాధాన్యత కలిగిన
అంశాల జాబితా ఆ కొత్త రాష్ట్రానికి చిన్నదేమీ కాదు. చాంతాడంత వుంది.
సరే! ఎన్నాళ్ళు గానో జనాలు ఎదురుచూస్తున్న
రాజధాని శంకుస్థాపన మహోత్సవం ఘడియ దగ్గరపడుతోంది. ప్రభుత్వానికి ఇది అత్యంత
ప్రతిష్టాత్మకం. సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే అన్నారు,
తన కళ్ళముందు కనిపిస్తున్నవి రెండే రెండు. అవి రాజధాని, పోలవరం
అని. నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవి రెండూ రెండు కళ్ళు అని కూడా చెప్పారు.
ఇది కూడా వాస్తవం. ఈ రెండూ రాష్ట్రానికే కాదు దాన్ని పాలిస్తున్నటీడీపీ రాజకీయ
భవిష్యత్తుకు కూడా అత్యంత ఆవశ్యకం. నిజం
చెప్పాలంటే మరో మూడున్నర ఏళ్ళ తరువాత
జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండూ ఆ
పార్టీకి ‘ట్రంపు కార్డులు’. తన పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్ళే
యవనాశ్వాలు.
పాలనాపరంగా చూసినా, రాజకీయ
ఎత్తుగడల కోణం నుంచి చూసినా చంద్రబాబునాయుడు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అతి
సమర్ధుడు. సీనియర్ కూడా. అంచేత ఎన్నికల సమయంలో బ్రహ్మాస్త్రాల మాదిరిగా ఉపయోగపడే ఈ
ఆయుధాల విలువ బాగా ఎరిగిన నాయకుడాయన.
అంచేతే ఆయన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా
తీసుకుని పనిచేస్తున్నారు. ఎన్నికల నాటికన్నా ఈ స్వప్న నగరాన్ని ఓ మేరకు అయినా
పూర్తి చేసి, అది పూర్తిగా పూర్తి చేయాలంటే తనలాటి సమర్దుడయిన నాయకుడు తప్పనిసరి అనే భావన
ప్రజల్లోకి పంపించగలగాలి. అలాగే పోలవరం. ఎన్నికల కోయిల కూసేలోగా దాన్ని పూర్తి
చేయడం కష్టమే అయినా పట్టుదల వుంటే అసాధ్యం
కాదని నిరూపించడం ఆయన వ్యూహంలో భాగం కావచ్చు. తన సమర్ధతత పైన నమ్మకంతోనే గత
ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని
నిలబెట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాలు. ఆ నమ్మకమే తన విజయానికి అసలు
సిసలు పునాది. అది జనాల్లో నాటుకుపోయేలా చేయగలిగితే మిగిలిన విషయాలు
పట్టించుకోనవసరం లేదు. అందుకోసమే ఆయన మరో పని లేదన్నట్టు రాజధాని నిర్మాణం పట్లే
తన శక్తియుక్తులన్నీ వాడుతున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన రాజధాని
నగరాన్ని ఆయన మూడేళ్ళలో నిర్మించడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. దశలవారీగానే
జరుగుతుందనీ తెలుసు. కానీ అది పూర్తి
కావాలంటే మాత్రం అందులో తన పాత్ర వుండి తీరాలన్న విశ్వాసం కలిగించడం ఒక రాజకీయ
పార్టీ నాయకుడిగా ఆయన ముందున్న మొదటి సవాలు. అందుకే ఎన్ని విమర్శలు ఎదురయినా,
ఎన్ని ఆటంకాలు ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నా అయన అలుపు ఎరగకుండా
ముందుకే సాగుతున్నారు.
ఈ క్రమంలో ఆహ్వానాల గురించి ప్రతిపక్షం
లేవనెత్తిన అంశం టీకప్పులో తుపాను. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అదీ
యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఓ శుభ
సందర్భం దగ్గర పడుతున్నప్పుడు ప్రతిపక్షనేత తన సహజ శైలిలో ఓ సంచలన ప్రకటన
చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోడం లేదని చెప్పడం ఒక ఎత్తు. కానీ జగన్ మోహన్
రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, తనకు పిలుపు అందినా వెళ్ళేది లేదని ముక్తాయింపు
కూడా ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు అంటున్నట్టు అది జగన్ మోహన రెడ్డి రాజకీయ
అపరిపక్వతకు నిదర్శనం కాకపోయినా, తొందరపాటు చర్య అన్నది సుష్పష్టం. రాజధాని
నిర్మాణంలో పాలక పక్షం ఒంటెత్తు పోకడలకు పోతున్నదని ఆయన పార్టీ మొదట నుంచీ
వాదిస్తోంది. అటువంటి అంశాలను, అందులో బహిర్గతం కాని అంశాలు ఏవైనా వుంటే వాటిని
సాక్ష్యాధారాలతో బయట పెట్టడానికి బదులు ఆయన ఎంచుకున్న ఈ ‘బహిష్కరణ’ బాట జనామోదం
పొందడం కష్టం. కాకపొతే, ఆయన
పనిలో పనిగా ఈ నిర్ణయానికి పురికొల్పిన ఎనిమిది అంశాలను తన
ప్రకటనకు జత చేసి రాజకీయ చర్చలకు తెరతీసారు.
వీటిలో చాలావరకు ఆ పార్టీ ప్రస్తావిస్తూ వచ్చిన
విషయాలే. చేస్తూ వచ్చిన ఆరోపణలే. శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లాది రూపాయల
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది జగన్ మోహన్ రెడ్డి, ఆయన
పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ‘నాలుగయిదు వందల కోట్లు తగలేస్తున్నామన్నది
నిరాధారమైన ఆరోపణ. అందులో ఏమాత్రం నిజం లేద’ని తెలుగు దేశం మంత్రులు మూకుమ్మడిగా
విరుచుకు పడ్డారు. మంత్రులు చెప్పేది వాస్తవం కావచ్చు. కానీ జరుగుతున్న
ప్రచారార్భాటం తీరుతెన్నులు చూస్తుంటే,
‘ఏమో! నిజమేనేమో!’ అనే శంకలు కలిగే అవకాశం లేకపోలేదు. ఏలికలు ఈ విషయం
గమనంలో పెట్టుకోవాలి.
‘శంకుస్థాపన కార్యక్రమానికి రాను’ అని ముందుగానే
ప్రకటన చేయడం జగన్ మోహన రెడ్డి పొరబాటే. అలాగే రాష్ట్రంలో ఏకైక
ప్రతిపక్షాన్ని ‘రాష్ట్ర రాజధాని
వంటి అత్యంత ప్రాముఖ్యత’ కలిగిన విషయంలో
విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరించడం పాలక పక్షం చేసిన పొరబాటు.
వాస్తవంగా చూస్తే వడ్ల గింజలో బియ్యపు గింజ సామెత
బాపతు. ఆధిక్యతా భావాన్ని అదుపులో వుంచుకోలేక పోవడం కలిగే పరిణామాలు ఇలానే
వుంటాయి. నిజమే రెండు రాజకీయ పార్టీల నడుమ సయోధ్య అంత సులభం కాదు. అందులోనూ రెండు
ప్రాంతీయ పార్టీల మధ్య మరింత దుస్తరం. అంత మాత్రాన ప్రతిదీ రాజకీయం చేస్తూ పొతే
ప్రయోజనం ఏముంటుంది? రాజధాని నిర్మాణం వంటి ముఖ్యమైన వేడుక
జరుగుతున్నప్పుడు ఇష్టం వున్నా లేకపోయినా దాన్ని మనసులో ఉంచుకుని అందులో పాలుపంచుకోవడం ప్రతిపక్షం
బాధ్యత. అల్లాగే ప్రతిపక్ష నాయకుడితో పాలక పక్షానికి ఎన్నెన్ని ఇబ్బందికర
అంశాలు అడ్డం వున్నా, ఆయన హోదాకు తగినట్టుగా ఆహ్వానం గురించిన సమాచారం ముందస్తుగానే
అందించి వుంటే బాగుండేది. పెళ్ళి కార్డు పోస్టులో పంపించే గృహస్తులు కూడా, యెంత
పని ఒత్తిళ్ళ నడుమ కూడా తీరిక చేసుకుని చుట్టపక్కాలను, బంధు
మిత్రులను ఫోను చేసి ఆహ్వానించడం పరిపాటి. మర్యాద కూడా. ఎందుకో కారణం తెలవదు కానీ అదిక్కడ
లోపించింది. ఈ రగడ జరక్కముందే ముఖ్యమంత్రే
ఫోను చేసి ఆహ్వానించి వుంటే చంద్రబాబు ఔన్నత్యాన్ని గురించి జనం చెప్పుకునే వారు. 1995
లో ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకు
వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి గుర్తున్న వాళ్లకి నేటి ఆయన వ్యవహారశైలి మింగుడు పడుతుండక పోవచ్చు. ఔదార్యం వల్ల ఒనగూడే
ప్రయోజనాలను రాజకీయ నాయకులు కావాలనే కోల్పోతున్నారేమో అనే భావన కలుగుతోంది.
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధానం వుంది.
వాటిల్లో విజయావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడంలో అభ్యంతర
పెట్టాల్సింది ఏమీ వుండదు. అయితే ఈ క్రమంలో, ఆంద్రప్రదేశ్
లోని పాలక ప్రతి పక్షాలు రెండూ ప్రజలు
తమపై పెట్టిన బాధ్యతకు దూరంగా
జరుగుతున్నాయేమో అని, ఎన్నోఏళ్ళుగా
రాజకీయాల క్రమం పరిశీలిస్తున్న వారికి అనిపిస్తోంది. ఇది యెంత త్వరగా
వాళ్ళు సరిదిద్దుకుంటే రాష్ట్రానికి అంత మంచిది.
కొంచెం సర్దుబాటు, కొంచెం
అవగాహన చాలు ఇటువంటి అనవసర అంశాలు వివాదాస్పదం కాకుండా చూడడానికి.
ముందు చెప్పుకున్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు.
చెప్పినా వినేవాళ్ళు అంతకంటే లేరు.
(17-10-2015)
2 కామెంట్‌లు:
జగన్ ఆహ్వానాన్ని రెండు షరతులతో స్వీకరిస్తే ఆయనకే బాగుండేది. మొదటిది తన హోదాకు తగిన గౌరవం, రెండవది మాట్లాడే అవకాశం. ఉపన్యాసంలో తాను కోరుకున్న విషయాలను సున్నితంగా హుందాగా (రాజకీయ నిందలకు పోకుండా) ఆంద్ర ప్రజల ముందు ఉంచే అవకాశం కోల్పోయారు.
@Jai Gottimukkala - బాగా చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి