7, అక్టోబర్ 2015, బుధవారం

ఓటు, హక్కా? బాధ్యతా ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 08-10-2015, THURSDAY)

‘హక్కు ఒకరు ఇస్తే తీసుకునేది కాదు,  జన్మతో వచ్చేదే  హక్కు’ అనే డైలాగులు అప్పుడప్పుడూ వినబడుతుంటాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కూడా పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతివారికీ ఓటు హక్కు లభిస్తుందని అంటున్నారు. నిజంగా అలా ప్రతిఒక్క పౌరుడికీ ఓటు హక్కు లభిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఓటు ప్రతి ఒక్క పౌరుడి  హక్కు అంటారే కాని, ఆ హక్కును హక్కుభుక్తం చేసుకోవాలంటే ఎన్నెన్ని చిక్కుముళ్ళు ఎదుర్కోవాలన్నది ఆ హక్కు సంపాదించుకున్న ఎవరినడిగినా సరిపోతుంది. రాజ్యాంగంలోని 326 అధికరణం ప్రకారం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం  19 వ సెక్షన్ కింద  18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక వెసులుబాట్లు కల్పించారు. ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం ఇంటింటికీ సిబ్బందిని పంపి ఓటర్లను చేర్పించే కార్యక్రమం నిర్వహిస్తుంది.  లేదా ఏటా జనవరి నెలలో నిర్వహించే  ఓటర్ల జాబితా సవరణ  ప్రక్రియను కూడా  ఇందుకోసం ఉపయోగించు కోవచ్చు. నిర్దేశిత ధరఖాస్తు పత్రంలో వివరాలను పొందుపరచడం ద్వారా ఓటు హక్కు పొందే వీలుంది. సంబంధిత అధికారి, మీరు అందచేసిన వివరాలతో సంతృప్తి చెందితే మీ పేరును,   మీ నివాసం వున్న   ఓటర్ల జాబితాలో చేరుస్తారు. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం వుంది. ఒక నియోజక వర్గంలో నివాసం వుండే వ్యక్తి ఆ నియోజకవర్గంలోనే మాత్రమే  ఓటరుగా ఉండగలుగుతాడు. ఒకే వ్యక్తి పేరు పలు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో ఉండేందుకు చట్టం అనుమతించదు.


భన్వర్  లాల్ చెప్పినట్టు చట్టం ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించింది. ఆ హక్కు ఎలా పొందాలో కూడా నిర్దేశించింది. అయితే చట్టంలో పేర్కొన్నంత సులభంగా లేదు ఆచరణలో పరిస్తితి అన్నది  చాలామందికి అనుభవైకవేద్యం.
నిరుడు సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. అనంతరం రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాదు రాజధాని కావడం మూలాన రాష్ట్రంలోని మిగిలిన ఇరవై రెండు జిల్లాలనుంచి గత అనేక సంవత్సరాలలో పెద్ద ఎత్తున వలసలు సాగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధులకోసం, ఉన్నత విద్యల కోసం, వ్యాపారాల నిమిత్తం,  వైద్య అవసరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాదుకు తరలివచ్చారు. రాజకీయుల మాట చెప్పేపనేలేదు. ఇలా వచ్చిన వారిలో కొందరు  పూర్తిగా స్థిరపడి పోయారు. కొందరు రెండు పడవలమీదా కాళ్ళుoచి కాలం గడుపుతూ వచ్చారు. అలాటివారిలో చాలామందికి హైదరాబాదు నగరంలో సొంత నివాసాలు వున్నాయి. వాటిని కూడా తమ స్తోమతకు తగ్గట్టుగా వివిధ ప్రాంతాలకు  మారుస్తూ పోయారు. దానితో పాటు వారి చిరునామాలు కూడా మారిపోయాయి. నగరం చాలా విశాలమైంది కాబట్టి అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. నివాసం మారినప్పుడల్లా చిరునామాలు మారాయి కాని ఓటర్ల జాబితాలో ఆ మార్పులు చోటు చేసుకోలేదు. ఎక్కడయితేనేం ఓటు వేయడానికి అనుకుని చాలామంది జాబితాలో మార్పులు చేసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించి ఉండక పోవచ్చు. దానితో ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని వారి ఓటు హక్కును నిర్ధారించడానికి వెళ్ళిన సిబ్బందికి అలాటి ఓటర్లు కనిపించకపోయే అవకాశాలు మెండు. అపార్ట్ మెంటు సంస్కృతి జీర్ణించుకుపోయిన ఈనాటి జనాల్లో పక్కవారిని గురించి పట్టించుకునే తీరిక తక్కువ. గతంలో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి వుండడానికి ఇదొక కారణం కావచ్చు. వెనుకటి నివాసంలో నివసిస్తూ ఉండని ఒకే ఒక కారణంతో అలాటి వారిని జాబితా నుంచి తొలగించడం అంటే వారి హక్కును కాలరాసినట్టే. 
ఇక ఓటర్లలో మరో తరగతి వారున్నారు.  నిజానికి ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుతూ పోతున్నది ఈ తరగతి వాళ్ళే. వాళ్ళు పొట్టపోసుకోవడం కోసం పొట్టపట్టుకుని బస్తీలకు వస్తారు. కూలీనాలీచేస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుతూ, రోడ్డుపక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వాచ్ మన్లు గా, పనిమనుషులుగా, వంట మనుషులుగా ఇలా నానా రకాల వృత్తులు చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. కిందా మీదా పడితే కాని బతుకుగడవని ఈ బాపతు వాళ్లకు చెప్పుకోవడానికి ఓ చిరునామా అంటూ పక్కాగా వుండదు. ఎక్కడ పనిదొరికితే అదే వారి నివాస ప్రాంతం. అదే వారి అసెంబ్లీ నియోజక వర్గం. ఇలాటి వారికి బస్తీ రాజకీయ నాయకులు సహకరించి వారిని ఆ ప్రాంతంలో ఓటర్లుగా చేర్పిస్తారు. ఇది బహిరంగ రహస్యమే. వారికి వారి వారి ఊళ్ళల్లో కూడా ఓటు హక్కు వుంటుంది. అక్కడి స్థానిక రాజకీయ నాయకులే కనిపెట్టుకుని ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు వుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదీ నలుగురికీ తెలిసిన రహస్యమే. నిజానికి ఇటువంటి రాజకీయ ఏర్పాటు లేకుండా వుండి వుంటే దేశంలో ఓటర్ల సంఖ్య ఇంత  గణనీయంగా పెరిగిపోయే అవకాశాలు తక్కువ  అనేవాళ్ళు లేకపోలేదు. ఇటువంటి ద్వంద్వ ఓటు హక్కు కలిగిన వారిని ఏరివేయడం అంత అసాధ్యమేమీ కాదు. ఒకే పేరుతొ వంట గ్యాస్ కనెక్షన్లు అనేకం కలిగివున్నవారిని గ్యాస్ కంపెనీలు కంప్యూటర్ పరిజ్ఞానం వాడి ఒక్క మీట వేటుతో తొలగించిన సంగతి తెలిసిందే.  
ప్రతి ఎన్నికలో, అది ఓ క్లబ్ ఎలెక్షన్ కావచ్చు. సొసైటీ ఎన్నిక కావచ్చు, వార్డు మెంబరు ఎన్నిక కావచ్చు ఓటర్లను సకాలంలో జాబితాలో  చేర్పించుకుంటేనే అభ్యర్ధులు ఒడ్డున పడతారు. ఈ మధ్య ఓ కొత్త సంస్కృతి మొలకెత్తుతోంది. సరయిన ఓటర్లను దగ్గరుండి చేర్పించుకోవడం ఒక పద్దదయితే, తమకు ఓటు వెయ్యరు అని నమ్మకం వున్న  సిసలయిన ఓటర్లను కూడా జాబితానుంచి తొలగించే విధానం మరోటి.  హైదరాబాదులో పేరొందిన ఒక క్లబ్ ఎన్నికల్లో, ఓటర్లను పెద్దఎత్తున జాబితానుంచి తొలగించారని ఆరోపిస్తూ కొందరు ఈ మధ్య  కోర్టు గడప ఎక్కారు. అంటే ఎన్నికల్లో గెలుపు కోసం పట్టే అడ్డదార్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే వుందన్న మాట.                    
 త్వరలో హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు కాబట్టి నగరంలో రాజకీయ సందడి మొదలయింది. పాలక పక్షం కావాలని లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాల ఆరోపణ. ఇప్పుడు పాలిస్తున్న పార్టీ కూడా గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇదేమాదిరి ఆరోపణలు చేసివుండవచ్చు. అది రాజకీయాల్లో సహజాతిసహజం. కానీ చట్టం ప్రసాదించిన ఓటు హక్కు సంగతి ఏమిటి?  నివాసం మారినప్పుడల్లా  ఓటర్ల జాబితాలో పేరు మారిపోతుంటే అటువంటి అసలు సిసలు ఓటర్లకు ఉపశమనం ఎలా? ఓటు హక్కు కూడా ఇటువంటి సాంకేతిక కారణాలతో చేజారిపోతుంటే దానికి పరిష్కారం లేదా? పద్దెనిమిదేళ్ళు నిండిన వెంటనే ఒక హక్కు మాదిరిగా లభించాల్సిన ఓటు,  ఇలా ప్రతి రెండుమూడేళ్ళకు అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిందేనా? ఇప్పుడు అందుబాటులో వున్న  అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు ఓ మార్గం చూపలేదా?
నిజమే! ఓటు ప్రతి పౌరుడి హక్కు. పద్దెనిమిదేళ్ళు నిండగానే లభించే ఆ హక్కు చనిపోయేవరకు ఎందుకు వుండదు? నివాసం మారిన ప్రతిసారీ ఎందుకు పునరుద్దరించుకోవాలి? ఇటువంటి మార్పులను అతి తక్కువ శ్రమతో చేసుకునే వీలు లేదా?   ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఊదరగొడుతుండే రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు చొరవ చూపరు?
వంట గ్యాస్ బుక్ చేసి,  సిలిండర్ వచ్చే సమయంలో ఇంట్లో ఉండని వినియోగదారుడికి ఓ ఎస్.ఎం.ఎస్. వస్తుంది, ‘పలానా సమయంలో ఇంటికి తాళం వేసి వుంది’ అని. ఇలాగే ఓటరు తనిఖీకి ఒక  కాల్ సెంటర్ పెట్టి వాస్తవాలను నిర్ధారించుకునే వీలు లేదా?
కాలక్రమంలో మనిషి రూపురేఖలు మారిపోవచ్చు. చేతి రాతతో పాటు సంతకం చేసే పద్దతిలో మార్పు రావచ్చు. కానీ లావాదేవీ పత్రాలపై నిరక్షరాస్యులు వేసే బొటనవేలి ముద్రలు మాత్రం దశాబ్దాల తరువాత కూడా మారిపోని విషయం గమనంలో పెట్టుకుంటే మనుషులను గుర్తించడానికి మరింత మేలైన విధానాలు స్పురించే అవకాశం తప్పకుండా వుంటుంది. నివాసాలు మారినప్పుడల్లా ఓటర్ల జాబితాలో ఆ మేరకు సవరణలు చేసుకునే అవకాశం లేకపోలేదు. కానీ అందుకు అనుసరించాల్సిన  ప్రక్రియ,  నిరక్షరాస్యులు ఎక్కువగా వున్న మన దేశానికి పెద్దగా ఉపయుక్తం కాదు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కాకపోయినా కొన్ని అందుబాటులో వుండే ప్రభుత్వ ఆఫీసుల్లో అయినా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి తగు సిబ్బందిని నియమించడం ప్రయోజనకరంగా  వుంటుంది.
పొతే ఎన్నికల క్రతువు నిర్వహించే ఎన్నికల సంఘం విషయంలో ఒక మాట. అయిదేళ్ళకోమారు మాత్రమే పని ఉంటుందనే ఉద్దేశ్యంతో కాబోలు, ఎన్నికల సంఘానికి శాస్విత యంత్రాంగం లేదు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే సిబ్బందితోనే పని గడుపుకోవాలి. చెప్పుకోవడానికి విశేషాధికారాలు ఉన్నప్పటికీ  సంఘం చెప్పుచేతల్లో పనిచేసే సొంత సిబ్బంది ఉండకపోవడం శోచనీయం. గతంలో ఎన్నికలు సకృత్తుగా వచ్చేవి. ఇప్పుడలా కాదు. ప్రతి ఆరు నెలలకూ, ఏడాదికీ దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలే. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘానికి శాస్విత ప్రాతిపదికమీద స్వతంత్రంగా వ్యవహరించగల సిబ్బంది అవసరం ఎంతైనా వుంది.
బోగస్ ఓట్లను ఏరివేయకపోవడం తప్పే. అయితే,  అర్హత ఉన్నవారి ఓట్లను ఏదో ఒక నెపంతో తొలగించడం కూడా అంతే  తప్పు.                    
అర్హులయిన వారికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ హక్కు వారు పక్కాగా  అనుభవించేలా చేయడం కూడా వాటి బాధ్యతే. (07-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner 

అభినవ కార్తవీర్యార్జునులు


వెనుకటి రోజుల్లో సినిమాల్లో అత్తగారి పాత్రలు వేసే సూర్యాకాంతం వంటి నటీమణులు రొండిన తాళం చేతుల గుత్తి దోపుకుని కనిపించేవాళ్ళు. ఆ గుత్తి ఇంటిపై అధికారానికి గుర్తు. దాన్ని కోడలి చేతిలో పెట్టడం అంటే అప్పటినుంచి ఇంటి పెత్తనం అంతా కోడలికి దఖలు చేసినట్టే అనుకోవాలి. ఇంటి తాళం చెవులు, ఇనప్పెట్టె తాళం చెవులు ఆ గుత్తిలో వుంటాయి కాబట్టి దానికా విలువ. ఇప్పటి అపార్ట్ మెంటు సంస్కృతిలో ఇంటికి ఒక తాళం చెవే. బ్యాంకు లాకర్ల ధర్మమా  అని ఇళ్ళల్లో ఇనప్పెట్టెలు ఎలాగూ లేవు. కాకపోతే కంప్యూటర్ల పుణ్యమా అని కొత్త తాళం చెవులు వచ్చిపడ్డాయి. వీటిని గుత్తికి తగిలించి రొంటిన దోపుకునే వీలులేదు. కంప్యూటర్ కు ఒక పాస్ వర్డు. ఏటీఎం కార్డు కార్డుకో పాస్ వర్డు. ఆన్ లైన్ డబ్బు లావాదేవీలకి ఒకటి,  మెయిల్ ఐడీ కొకటి, ఫేస్ బుక్కుకొకటి. లింక్ డిన్ కు మరోటి. ట్విట్టర్ కు ఇంకోటి. పైగా అప్పుడప్పుడూ వీటిని మార్చుకుంటే మంచిదంటూ సలహాలు. వెనకటి తాళం చెవుల గుత్తిలా వీటిని మనసుకు తగిలించుకుంటేనే కానీ రోజుగడవని పరిస్తితి.


కార్తవీర్యార్జునిడికి వేయి చేతులే! కానీ ఈ యుగపు మనుషులకి ఈ నెట్ తాళం చేతులు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయి.    
NOTE: Courtesy Image Owner

4, అక్టోబర్ 2015, ఆదివారం

తండ్రికి తనయ నివాళి


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, ఆ రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి, కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. ఈ విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. ‘మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ’  చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
“ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. ఆ నాన్న ‘దశావతారాలు’ పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.”




ఈ చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది ‘రాంపా’         

తెగుతున్న తీగెలు


‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను  ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు  అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు  తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం  అయినా ఎక్కడో సుతారంగా తాకుతాయి అతడి మాటలు.  మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న  మాల్ కే వెళ్లాలి. అంతా కలయ  తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. కానీ ఎక్కడో ఏదో తెగిపోతోంది. అతకడం తెలియడం లేదు.

(అచ్చంగా ఇలాగే కాకపోయినా ఈ మోస్తరు అభిప్రాయాలు వున్న ఇంగ్లీష్ పోస్ట్ పెట్టిన మా కోడలు హేమలీలకు కృతజ్ఞతలు)    
NOTE: Courtesy Image Owner

3, అక్టోబర్ 2015, శనివారం

బీహారు ఎన్నికల్లో హామీల తిరునాళ్ళు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 04-10-2015, SUNDAY)    

కాకతాళీయం కావచ్చు కానీ బీహారు ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఎన్నికల వాగ్దానాల విషయంలో ఒక వింతైన తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో ఓటర్లకు గాలం  వేయడానికి వారికి ఉచితంగా కలర్ టెలివిజన్లు, ల్యాప్ టాప్ లు వగయిరా ఇస్తామని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 123  కిందకు రావని, ఆ హామీలు అవినీతి చర్యలు కావని పేర్కొన్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి  వచ్చిన తరువాత వాటిని నెరవేర్చలేని పార్టీలపై చీటింగు కేసులు పెట్టాలని కోరుతూ దాఖలయిన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఇది కూడా కాకతాళీయం కావచ్చు కాని, ఈ తీర్పు వెలువడిన కొద్ది రోజులు కూడా గడవక ముందే బీహారు అసెంబ్లీ ఎన్నికల కోసం  భారతీయ జనతా పార్టీ ఒక విజన్ డాక్యుమెంటు విడుదల చేసింది. ఆకాశమే హద్దుగా ఈ పత్రంలో అనేక హామీలను గుప్పించారు. ప్రతి దళిత కుటుంబానికి కలర్ టీవీ, భూమిలేని వారికి అయిదు గుంటల పొలం, ప్రతి పేదమనిషికి  చీరె, ధోవతి, బాగా చదువుకునే యాభయ్ వేల మంది విద్యార్ధులకు ల్యాప్ టాపులు, విద్యార్ధినులకు  స్కూటీలు, ఇలా సాగిపోయిందా హామీల జాబితా.
నిజానికి రాజకీయాల్లో ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి ఇలాటి పిల్లి గంతులు అనేకానేకంగా వేసిన సందర్భాలు అనేకం వున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో మన పొరుగున వున్న తమిళనాడులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కురిపించిన వాగ్దాన వర్షంలో ఈ ఉచిత జాబితా చాంతాడంత పొడుగయింది. మిక్సీలు, గ్రైండర్లు, ఆవులు, మేకలు ఇలాటివన్నీ పప్పులూబెల్లాల మాదిరిగా  ఉదారంగా ఉచితంగా పంచిపెడతామని ఊదరగొట్టారు. ఇక దరిద్రాన్ని కలికానికి కూడా కనబడకుండా తరిమికొడతా మనీ, ఏకంగా పదికోట్ల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులకు ఇస్తామనీ ఇలాటి భారీ హామీలు కూడా అన్నాడీ ఎంకే ఎన్నికల ప్రణాళికలో పొందు పరిచారు.
పొతే, విభజిత తెలుగు రాష్ట్రాల్లో నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికల రూపురేఖల్నే సమూలంగా మార్చివేశాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ, అంచేత రుణ బకాయిలు చెల్లించకుండా వేచి చూడమనీ ప్రలోభ పెట్టాయి. ఒక దశలో ఎన్నికల కమీషన్ కల్పించుకుని ఈ హామీలు ఎలా అమలు చేస్తారని కూడా ప్రశ్నించింది. చిత్తశుద్ధి వుంటే సాధ్యమని ఆ రోజుల్లో ఆ పార్టీలు సంజాయిషీ ఇచ్చాయి. అధికారం పీఠం ఎక్కిన తరువాత కానీ ఈ హామీల అమలు యెంత దుస్సాధ్యం అన్నది ఎరుక కాలేదు. ఎన్నో మల్లగుల్లాలు పడితే కానీ ఈ ఒక్క హామీ అమలు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే పదిహేను మాసాలు గడిచిపోయాయి. రుణ మాఫీ చేయగలిగారా అంటే గట్టిగా జవాబు చెప్పలేని పరిస్తితి. ఒకవేళ చేశామని చెప్పుకున్నా ఎన్నో మినహాయింపులు, మరెన్నో కత్తిరింపులు. చివరికి షరతులు లేకుండా ఇచ్చిన హామీని షరతులతో నెరవేర్చుకోవాల్సిన దుస్తితి.
వాస్తవ పరిస్తితులు ఇలా వున్న  నేపధ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల వాగ్దానాలకు అడ్డుకట్ట లేకుండా చేస్తోంది. ఎన్ని మాటలు చెప్పయినా సరే అధికారంలోకి రావాలనే రాజకీయ పక్షాలకు ఈ తీర్పు మంచి ఊరట ఇచ్చేదిగా వుంది. ఎందుకంటె -
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా సరిగ్గా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్నది జవాబులేని  భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది.

(కార్టూనిష్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు)
      
ఉపశృతి: ఒక రాజకీయ నాయకుడు చనిపోయిన తరువాత యమ భటులు వచ్చి పట్టుకు పోయారు. తాను ప్రముఖుల జాబితాలో వున్న  వ్యక్తిని కాబట్టి తనను స్వర్గంలోకి అనుమతించాలని పట్టుబడతాడు. అయితే తమ నిబంధనల ప్రకారం ముందు ఒక రోజు నరకంలో గడపాలని, తరువాత ఏది కోరుకుంటే అక్కడికే పంపుతామని అక్కడి దేవదూత చెబుతాడు. సరే అని, ఒక యమభటుడ్ని  వెంట బెట్టుకుని ముందు నరకానికే వెడతాడానాయకుడు. నరకాన్ని చూసి అతడికి మూర్చ వచ్చినంత పనవుతుంది. నిజానికి అది తాను  ఊహించుకున్న స్వర్గం కన్నా మిన్నగా వుంది. సుందరమైన భవంతులు, పచ్చని మైదానాలు. అప్సరసలను తలదన్నే సుందరీమణులు అక్కడి నరకలోకవాసులకు తలలో నాలుకలా మెసలుతూ సకల పరిచర్యలూ చేస్తున్నారు. అవన్నీ  చూసిన మన రాజకీయ నాయకుడికి నరకంలోనే వుండిపోవాలన్న కోరిక కలుగుతుంది. తిరిగి వెళ్ళిన తరువాత తన మనసులోని మాట దేవదూతతో చెబుతాడు. అతడి అభీష్టం ప్రకారం మళ్ళీ అతగాడిని నరకానికే తీసుకువెడతారు. అయితే ఇరవై నాలుగ్గంటల్లో దృశ్యం  మొత్తం మారిపోతుంది. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పూరిళ్ళు. పచ్చిక మైదానాలు, సెలయేళ్ల స్థానంలో ఎండిన పొలాలు. నీటి చుక్క జాడలేని వాగులువంకలు. అప్సరల స్థానంలో వికృత రూపాలతో, ఒళ్ళు జలదరించే చేష్టలతో రాక్షస స్త్రీలు. అది చూసి, ‘అన్యాయం, నిన్న నాకు చూపించిన నరకం ఇది కాదంటూ’ వాదనకు దిగిన నాయకుడితో దేవదూత అంటాడిలా.  ‘నిజమే! నిన్న చూసింది ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటల్లాంటి దృశ్యాలు. ఇప్పుడు చూస్తున్నది గెలిచి వచ్చిన తరువాత పరిస్తితి. రాజకీయ నాయకులకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను’  (03-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
      




30, సెప్టెంబర్ 2015, బుధవారం

ఫలప్రదమైన ప్రధాని మోడీ అమెరికా పర్యటన

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-10-2015, THURSDAY)

ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిల్లోని ప్రముఖులు జరిపే విదేశీ పర్యటనలు ఫలప్రదం కాకపోవడం అంటూ వుండదు. అయితే గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపిన అమెరికా పర్యటన అనేక విధాలుగా ప్రత్యేకతలను, విశిష్టితలను కలిగివుందని గట్టిగా చెప్పవచ్చు. మోడీ పర్యటనకు మీడియాలో వచ్చిన ప్రచార ఉధృతి ఇందుకు నిదర్శనం. ఇది చివరకు ఏ స్థాయికి పోయిందంటే అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన ఒక అపూర్వ ప్రయోగం కూడా మోడీ పర్యటన ప్రచార ప్రభంజనంలో మరుగున పడిపోయింది. ‘భవిష్యత్ మొత్తం మా దేశానిదే. భారత దేశానికి రండి, మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి’  అని అమెరికాలో భారత ప్రధానమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలను అర్ధిస్తున్న సమయంలోనే, ఇక్కడ స్వదేశంలో అదే అమెరికాకు చెందిన కొన్ని ఉపగ్రహాలను, మన రోదసీ శాస్త్రవేత్తలు, పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌకలో నిర్దేశిత కక్ష్యకు జయప్రదంగా చేర్చి, ప్రపంచంలో ఈ పాటవం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత దేశాన్ని చేర్చి మన దేశానికి అఖండ ఖ్యాతిని కట్టబెట్టారు.


ఒకప్పుడు మోడీని తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వమని భీష్మించిన  అమెరికా ప్రభుత్వం  అదే మోడీ మహాశయులను సాదరంగానే కాదు సగౌరవంగా యెర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. పైగా ఇది మొదటిసారి కూడా కాదు. ప్రధాని కాగానే మోడీ మొదటి సారి వెళ్ళినప్పుడు కూడా ఆ అగ్రదేశం ఇదే రీతిలో వ్యవహరించింది. ఆ దేశపు ఆర్ధిక రంగం అభ్యున్నతిలో భారత దేశం నుంచి వెళ్ళిన యువ మేధావుల, సాంకేతిక నిపుణుల పాత్ర ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకున్న పాలకులు కాబట్టి భారత ప్రధానికి ఆ గౌరవం ఇవ్వక తప్పని పరిస్తితి. ఏడాది కాలంలోనే మోడీ ఆ అగ్రరాజ్యం అధినేత ఒబామాతో మూడు పర్యాయాలు భేటీ కావడం ఈ వాస్తవానికి అద్దం పడుతోంది.
విదేశీ పర్యటనలలో వేషభాషలకు మోడీ ఇస్తున్న ప్రాధాన్యం ఇటు స్వదేశంలో విమర్శలకు దారి తీయడంతో ఈసారి అమెరికా పర్యటనలో రూటు  మార్చి ‘తన చాయ్ వాలా గతాన్ని’ అక్కడి జనాలకు గుర్తుచేసే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు కానవస్తోంది. ఎక్కడ ఏ పదాన్ని విరిచి చెప్పాలో, ఎక్కడ ఏ భావాన్ని అందరికీ అర్ధం అయ్యేలా పలికించాలో, స్వరాన్ని ఎక్కడ పెంచాలో, గొంతును ఎక్కడ తగ్గించాలో పూర్తిగా ఆపోసన పట్టిన రాజకీయ వేత్త కావడం వల్ల, అమెరికాలో మోడీ చేసిన ప్రసంగాలకు అపూర్వ ప్రతిస్పందన అమోఘంగా లభించింది. అయితే, సభికుల నుంచి హర్ష ధ్వానాల రూపంలో లభిస్తున్న ఆదరణ మైకంలో పడిన మోడీ, కొన్ని దేశ ప్రతిష్టకు పొసగని కొన్ని అంశాలను తన ప్రసంగాలలో ప్రస్తావించి, స్వదేశంలో కొన్ని రాజకీయ విమర్శలను మూటగట్టుకున్నారు. గత విదేశీ పర్యటనలలో సయితం ఇదే రకం  విమర్శలను మోడీ ఎదుర్కున్నారు. విదేశీ సభలు, సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు చేయడం అన్నది భారత ప్రధానులకు నియమం కాకపోయినా ఒక ఆనవాయితీ. స్వదేశంలో రాజకీయాలు ఎలా వున్నా, అక్కడ  ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ, విదేశీ గడ్డపై ఒకింత సంయమనం పాటించడం అనేది  ఆ ఆనవాయితీ. మోడీ ఈ రివాజును కావాలనే ఉల్లంఘించి గత ప్రభుత్వాల వైఫల్యాలను విదేశీ ప్రసంగాలలో జొప్పిస్తున్నారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్దుల అభియోగం. నిజానికి ఇలా ప్రసంగాలు చేయడం మంచి సంప్రదాయం కాదు.  విదేశాలకు అధికార పర్యటనపై వెళ్ళినప్పుడు భారత ప్రధాని అనే వ్యక్తి యావత్ దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాని,  ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిగా కాదు. ఆయన చేసే ప్రతి ప్రసంగం భారత ప్రతినిధిగానే సాగడం మర్యాదగా వుంటుంది. అందుకే కాబోలు ఆ స్థాయి నాయకులు, ముందుగా తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న ప్రసంగపాఠం చదవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.   అయితే ప్రసంగాలలో ఘనాపాటి అనిపించుకుంటున్న నరేంద్ర మోడీకి పాఠం ఒప్పచెప్పినట్టు, ఇలా రాసుకున్న ప్రతిని చదవడం రుచించక పోవచ్చు. అలా అని గత పాలకులను, వారి పరిపాలనను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే చెప్పాలి. సరే! ఇదేమంత పెద్ద విషయం కాదు. సరిచేసుకోదగ్గ సంగతే.
పొతే, నరేంద్ర మోడీ ఈ సారి జరిపిన అమెరికా పర్యటన కాలాన్ని సాధ్యమైనంత సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించారు. భద్రతా మండలిలో భారత సభ్యత్వం అంశాన్ని సభ్యదేశాలకు మరోమారు గట్టిగా నొక్కి  చెప్పారు. అమెరికాకు చెందిన కార్పోరేట్ దిగ్గజాలతో, గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్, ఆపిల్  మొదలయిన సిలికాన్ వ్యాలీ  అధినేతలతో సమావేశాలు జరిపారు. గత ముప్పయి ఏళ్లలో  అనేకమంది భారత ప్రధానులు అమెరికాలో అధికార పర్యటనలు జరిపారు. కానీ, సిలికాన్ వ్యాలీ సందర్శించి, భారత్ లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి అక్కడివారికి తెలియచేయడానికి ప్రయత్నించిన మొదటి ప్రధాని మోడీనే కావడం విశేషం. అంతే కాదు ‘ఫార్ట్యూన్ – 500’ జాబితాలో వున్న నలభయ్ రెండు కంపెనీల సీ.ఈ.ఓ. ల సమావేశంలో మోడీ ప్రసంగించారు. ‘భారత దేశం అంటే రెడ్ టేపిజం కాదనీ, రెడ్ కార్పెట్’ అనీ తనదయిన శైలిలో మోడీ చేసిన చమత్కార ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుందని మీడియా అభివర్ణించింది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ తో ప్రధానమంత్రి మోడీ జరిపిన సమావేశం ప్రపంచవ్యాప్త ప్రచారానికి నోచుకుంది. సాంకేతిక విద్యార్హతలు ఏవీ లేకపోయినా, నూతన సాంకేతిక అంశాల పట్ల ఆ వయస్సులో నరేంద్ర మోడీ  కనబరుస్తున్న ఆసక్తి బహుశా వారిని బాగా ఆకట్టుకుని వుంటుంది.
భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ గత కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసారు. ఆయన చేసిన పర్యటనల ఫలితాలకంటే, ఆ పర్యటనల తీరు తెన్నులపై మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన వ్యాఖ్యలు, కార్టూన్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. గతంలో  మోడీ విదేశ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి వస్తున్నప్పుడు, ‘ప్రధాని మోడీ స్వల్ప కాలిక పర్యటనపై రేపు భారతదేశం వస్తున్నారని’ సోషల్ మీడియాలో  ఒక వ్యాఖ్య వచ్చింది. ఇటువంటివి ప్రచారంలో వుండడం  ఆ ఆస్థాయిలో వున్న  వ్యక్తులకు శోభస్కరం కాదు.
ఏది ఏమైనా అమెరికాలో నివసిస్తున్న అశేష భారతీయులు, వారి వారి రాష్ట్రాలతో, భాషలతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా మోడీ అమెరికాలో జరిపిన పర్యటనని చక్కగా  స్వాగతించారు. అయన చేసిన ప్రతి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ విధంగా మోడీ అక్కడి భారతీయుల మనస్సులను ఆకట్టుకోగలిగారు. ఈ కోణం నుంచి మోడీ పర్యటన అనుకున్న దానికన్నా విజయవంతం అయిందనే చెప్పుకోవాలి. (30-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: Courtesy Image Owner                                                  

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సాయంత్రం ఖాళీయేనా?


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
“బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది”
“లోపల ఏం జరిగిందేవిటి?”
“ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు”
“నువ్వేమన్నావు”
“ఖాళీ గానే వుంటాను అని చెప్పాను”
“అతనేమన్నాడు?”
“ఏవన్నాడు? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికి ఇచ్చి టైప్ చేయమన్నాడు”


NOTE: Courtesy Image Owner