23, సెప్టెంబర్ 2015, బుధవారం

చీరే మేరే సప్నే


నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొస్తున్నదని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది  సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే  అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమె కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొండలు పెట్టి,  ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను.  అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి  ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు  పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ  నన్ను మారుమాట్లాడనివ్వకుండా  మొహమాట పెట్టి  ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు  చెవిన పడ్డప్పుడు  కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.                                   

21, సెప్టెంబర్ 2015, సోమవారం

?



ఏకాంబరం  ఆఫీసు పనిలో బిజీగా వున్నప్పుడు  క్రెడిట్ కార్డు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్టు ఎలర్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే చేస్తున్న పని ఆపి భార్య సెల్ కి కాల్ చేసాడు.
‘ఏమిటి అప్పుడే తెల్లారిందా! షాపింగు కోసం ఊరిమీద పడ్డావ్. ఏం కొన్నావ్ అంత డబ్బెట్టి? పట్టు చీరెలా!’

‘కాదు. ఉల్లిపాయలు’  

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఎందరో మహానుభావులు – వారిలో ఒకరికి నా నమస్కారం


సెప్టెంబరు  ఇరవై – ఈ రోజున అనేకమంది పుట్టివుంటారు. వాళ్ళల్లో కొందరు పెట్టి పుట్టినవాళ్ళు వుంటారు. వాళ్ళని గురించి తెలిసిన విషయాలను తెలియని వారికి చెప్పే అనేక వ్యాసాలు గట్రా అనేక పత్రికల్లో వస్తుంటాయి. కొందరికి అలాటి ప్రచారం దొరకదు. ఎందుకంటె ప్రచారం కోసం వాళ్ళు ఏపనీ చేయలేదు కనుక.
ఈ రెండో బాపతు మనిషి ఒకాయన కూడా ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే రోజున పుట్టాడు. మాతామహుల గ్రామం కంభంపాడులో పుట్టినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం ఖమ్మం జిల్లా వల్లభి. పుట్టిన తరువాత అక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడో తెలవదు కానీ ఖమ్మం, హైదరాబాదు ఆపైన ఇంగ్లండు, ఇలా చదువుల నిమిత్తం, అలాగే ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు  గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలి పాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతి పాఠాన్ని ఆయన ఒంటపట్టించు కున్నాడు.  జీవితాంతం దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. ‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ  తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు  వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపే ‘శ్రీమంతుడు’  డాక్టర్ అయితరాజు పాండు రంగారావు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.  

(డాక్టర్ ఏపీ రంగారావు)
      


ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు.  ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా  అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’  ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
‘హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’             
కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్  వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో  మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’  అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప. 


(NOTE: Image Courtesy: RotteneCARDS)
   

19, సెప్టెంబర్ 2015, శనివారం

రాజకీయం ఒక రక్షరేఖ



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే అవి తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బు సంచులూ  వున్న సినీనటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే పదాలు పొసగని వాళ్లు కూడా, డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం. ఎక్కడకు వెళ్ళినా పరపతి.  ఒక్కసారి నోరారా  పలకరించినా చాలు, ఊరూరా  పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తనని కంటికి రెప్పలా కనిపెట్టుకునే  సొంత  సిబ్బంది.  ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల మంది  గూండాలు వెంటనే  వుంటారు. ఏ కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.

మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు, ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు, ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయినుంచి పై స్తాయి అధికారి వరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. తాను  వచ్చిన చెప్పి, అప్పటికప్పుడే  ఆ పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషినయితే, ‘ఒంట్లో బాగాలేదా నాయనా, బాగు చేయిస్తాం రా’ అని పోలీసు  స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడిచే  పోలీసులు, రాజకీయ  నాయకుల విషయం వచ్చేసరికి  వారి నిబంధనలూ, ఖాకీ దర్పాలూ అన్నీ  కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఉపశృతి: ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక  సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.
(19-09-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

16, సెప్టెంబర్ 2015, బుధవారం

490 490


నాలుగు లక్షల తొంభయ్ వేల నాలుగువందల తొంభయ్.

నేటితో (16-09-2015) పూర్తయిన నా బ్లాగు http://bhandarusrinivasarao.blogspot.in/  విజిటర్ల సంఖ్య

గర్వ భంగం

యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి  యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.
కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి తన కొలువులో ఎంతోమంది యమభటులు వున్నప్పటికీ యముడే  స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.
నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు  చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.
కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ  వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా  ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.
యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.
తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?
అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.
తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.
“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల  సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం  ఆ మూడు తలల విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా  నా కళ్ళకు మాత్రం  మీ ప్రయోగంలో   ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి  చేసిన మహానుభావులు మీరు.  అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు  సరిచేయలేకపోయారో నాకర్ధం కావడం లేదు..........”
........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.
ఈ లోపలే ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున  బయటకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే  అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా  చెప్పు” అన్నాడు.
యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు అంటున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు  చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో, గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే  ఇప్పుడు  నీకీ  చావు తప్పేది.”  

(Image courtesy ROBO film)