20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు.  ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా  అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’  ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
‘హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’             
కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్  వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో  మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’  అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప. 


(NOTE: Image Courtesy: RotteneCARDS)
   

19, సెప్టెంబర్ 2015, శనివారం

రాజకీయం ఒక రక్షరేఖ



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే అవి తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బు సంచులూ  వున్న సినీనటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే పదాలు పొసగని వాళ్లు కూడా, డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం. ఎక్కడకు వెళ్ళినా పరపతి.  ఒక్కసారి నోరారా  పలకరించినా చాలు, ఊరూరా  పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తనని కంటికి రెప్పలా కనిపెట్టుకునే  సొంత  సిబ్బంది.  ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల మంది  గూండాలు వెంటనే  వుంటారు. ఏ కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.

మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు, ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు, ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయినుంచి పై స్తాయి అధికారి వరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. తాను  వచ్చిన చెప్పి, అప్పటికప్పుడే  ఆ పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషినయితే, ‘ఒంట్లో బాగాలేదా నాయనా, బాగు చేయిస్తాం రా’ అని పోలీసు  స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడిచే  పోలీసులు, రాజకీయ  నాయకుల విషయం వచ్చేసరికి  వారి నిబంధనలూ, ఖాకీ దర్పాలూ అన్నీ  కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఉపశృతి: ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక  సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.
(19-09-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

16, సెప్టెంబర్ 2015, బుధవారం

490 490


నాలుగు లక్షల తొంభయ్ వేల నాలుగువందల తొంభయ్.

నేటితో (16-09-2015) పూర్తయిన నా బ్లాగు http://bhandarusrinivasarao.blogspot.in/  విజిటర్ల సంఖ్య

గర్వ భంగం

యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి  యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.
కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి తన కొలువులో ఎంతోమంది యమభటులు వున్నప్పటికీ యముడే  స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.
నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు  చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.
కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ  వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా  ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.
యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.
తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?
అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.
తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.
“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల  సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం  ఆ మూడు తలల విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా  నా కళ్ళకు మాత్రం  మీ ప్రయోగంలో   ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి  చేసిన మహానుభావులు మీరు.  అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు  సరిచేయలేకపోయారో నాకర్ధం కావడం లేదు..........”
........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.
ఈ లోపలే ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున  బయటకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే  అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా  చెప్పు” అన్నాడు.
యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు అంటున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు  చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో, గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే  ఇప్పుడు  నీకీ  చావు తప్పేది.”  

(Image courtesy ROBO film)



  

ఇప్పుడే అందిన వార్త..........

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు. "గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు ఆవార్త చదివిన వ్యక్తి, ఆరోజుల్లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ గారపాటి నరసింహారావు. తాత్కాలిక ప్రాతిపదికన ఆరోజు న్యూస్ రీడర్ గా ఆవార్తను ప్రజలకు అందించే అదృష్టం తనకు కలిగిందని శ్రీ నరసింహారావు తరచూ గుర్తుచేసుకుంటూ వుండేవారు. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.
ఆ గారపాటి నరసింహారావు, నాకంటే చిన్నవయస్సువాడు, 'లేడ'న్న కబురు వింటున్నాను. అతడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

14, సెప్టెంబర్ 2015, సోమవారం

బాబోయ్ !

ఏకాంబరానికి పెద్ద చిక్కొచ్చి  పడింది. 'స్నేహితుడు'  మీద వ్యాసం రాయడానికి పూర్తిగా సిద్ధం అయి వస్తే పరీక్షాపత్రంలో 'తండ్రి' మీద రాయమని వుంది. ఇక చేసేది ఏమీ లేక తాను సిద్ధం చేసుకున్న జవాబులో ‘స్నేహితుడు’ అన్న పదం వున్నచోటల్లా ఆ పదాన్ని  మార్చి ‘తండ్రి’ అని రాసుకుంటూ పోయాడు. అదిలా తయారయింది:
“నాకు చాలామంది తండ్రులు వున్నారు. వారిలో కొందరు ఆడవాళ్ళు. మరికొందరు మగవాళ్ళు. నాకు నిజమయిన తండ్రి మాత్రం మా పొరుగింట్లో ఉంటాడు” 

NOTE: Courtesy Image Owner 

బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది

 (అను సుదీర్ఘ సొంత సుత్తి) 

వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఇదిగో ఈ ఇంటర్వ్యూ.
ప్రసిద్ధ రచయిత శ్రీ  మల్లాది వెంకట కృష్ణమూర్తి సంపాదకత్వంలో తొమ్మిదేళ్ళ  క్రితం  (19-02-2006) ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com) అనే వెబ్ పత్రికలో శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన  ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నాకు మాత్రం అదే తొలిసారి. బహుశా  ఆఖరుసారి కూడా. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్  లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్  శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. ఇన్నేళ్ళ తరువాత దేనికోసమో వెతుకుతుంటే అదిప్పుడు నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా ఈ బ్లాగులో వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు 


ఇంటర్వ్యూ కు ముందు శర్మ గారి  ఉపోద్ఘాతం :
తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 డిసెంబర్ లో    కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర  దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు – రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.
సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవాలుగా – మదర్  థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొంటారు. మదర్  థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా భద్రాచలం అడవుల్లో రాజీవ్ గాంధీతో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది.ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971  లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా చేరి  1975  దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987   దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు.సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా  2004 దాకా కొనసాగారు. అప్పటినుంచి దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా  దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.
పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు  1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్ర జ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి  పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో కిందటేడాది ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి – సంపాదకుడు.
హైదరాబాదులోని  ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్  వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను. ‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు – ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.
ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?
జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.
ప్ర) దాన్ని భయమంటారా?
జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.
ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?
జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.
ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?                   
జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం  మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు  మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా  వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఆ తరువాత పదేళ్లకు సెక్స్ అవసరం వుండదు.’  దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?
జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై  నుంచి  యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.
ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది?  
జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు  కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు.  విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం  ప్రధానం.
ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?
జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.
ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?
జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్స పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు.  చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.
ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి? 
జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్తానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే.
ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?   
జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు.
ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?
జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను.  నాకు ఏడుగురు అక్కయ్యలు.  వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ  గమనించాను.  నాకు ఇరవై  ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి  ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.
ప్ర) వివాహ వేడుక లోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా? 
జ) బాపు తీసిన ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది.  నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి  లోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.
ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?
జ) మేం వద్దనుకున్నది ఆ ఆచారాలు, వ్యవహారాలనే కాని మొత్తంగా పెళ్లాన్నే కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు – ఉపాధి కావాలి’ అనీ అన్నాను. అప్పట్లో మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో  ఇలాటి భావాలు రావడానికి అదే కారణం. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు.  నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.
ప్ర) ప్రేమ ప్రణయం – వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?    
జ) వృత్తి రీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ.

“రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.
తెల్లారి చూస్తే అది నువ్వే”

“ఊహల్లో నేనూ
వూహించుకుంటూ నువ్వూ
వర్తమానాన్ని నష్ట పోతున్నాం”

వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.
ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి?  
జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడాలేదు. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి. మార్పు సహజమే. ఒప్పుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడ ధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది  అంటే –  పెండ్యులం  అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”
అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. 

NOTE: Courtesy Cartoonist