7, ఆగస్టు 2015, శుక్రవారం

బాబు బలి



నిజానికి ఇది నా కామెంటు కాదు. ఈరోజు ఉదయం ఓ టీవీ ఛానల్ చర్చకు వెళ్ళినప్పుడు, విరామ సమయంలో  బాహుబలి ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా కలెక్షన్లు గురించి చెబుతూ, వాళ్ల వూళ్ళో వాళ్లు ఏకంగా ఒక బస్సు మాట్లాడుకుని వెళ్ళి ఆ సినిమా చూసి వచ్చారని ఒకరంటే, ఆ సినిమా చూడని జన్మ వ్యర్ధం అన్న రీతిలో ప్రచారం సాగడం కూడా ఒక కారణమని మరొకరన్నారు.  సినిమా రంగంలో ఒకప్పుడు మేటి నిర్మాత అనిపించుకున్న ఒక పెద్ద మనిషి కల్పించుకుని బాహుబలి సినిమాను చంద్రబాబుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన ఏమన్నారంటే - 'విడిగా ఎవర్ని కదిలించినా అదో సినిమానా అన్నట్టు పెదవి విరుస్తున్నారని, అదే నలుగురిలో వున్నప్పుడు వాళ్ళే మళ్ళీ గొప్ప సినిమా అని పొగుడుతున్నారని అన్నారు. నిరుడు ఎన్నికల ముందు ఎవర్ని కదిలించినా విడిగా చంద్రబాబును విమర్శించేవారనీ, కలసికట్టుగా మాత్రం గెలిపించారనీ ఓ పోలిక చెప్పారు.
నాకు ముందు అర్ధం కాలేదు. తరువాత అర్ధం అయ్యీ కానట్టు అనిపించింది. బహుశా సినిమా పరిజ్ఞానం ఆట్టే లేకపోవడం ఓ కారణం కావచ్చు.

NOTE: Courtesy Image owner 

6, ఆగస్టు 2015, గురువారం

అణుబాంబు - భగవద్గీత


(ఆగస్టు ఆరోతేదీ - మొదటి అణుబాంబు ప్రయోగం)
FIRST POSTING LINK
http://bhandarusrinivasarao.blogspot.in/2014/11/blog-post_13.html
ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి కాస్త అటూ ఇటూగా డెబ్బయ్ ఏళ్ళు. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ట్రినిటీ అనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ట్రినిటీ అయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్ మ్యాన్
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షించకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  ముందుగా పరీక్షించి చూసే  వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు. 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్కృతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందోవంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానమైన ఎనర్జీ విడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య  భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోతు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశనానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ఛీ! జరగరానిది జరిగి పోయింది ‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) వేయి సూర్యుల కాంతి  అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)

అంటే-
నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని


పాత కధ - కొత్త మలుపు

అనగనగా ఓ రాజుగారు. ఓ రోజు వేటకు వెడదామని అనుకుని ఆస్థానంలోని అధికారులని ఏర్పాట్లు చేయమని కోరాడు. అడవిలో వేటాడే సమయంలో వాన పడే అవకాశం వుందా అని ఆరా తీసాడు. సంబంధిత అధికారులు అన్ని లెక్కలు వేసి అలా జరగదని, వర్షం పడే వీలు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. సరే అని రాజుగారు మందీ మార్బలం వెంట తీసుకుని వేటకు బయలు దేరారు. బట్టల మూటలు గాడిదపై పెట్టుకుని వెడుతున్న ఓ  చాకలి దారిలో తారసపడ్డాడు. రాజు గారిని, ఆయన పరివారాన్నీ చూసి, వారి హడావిడి గమనించి రాజుతో మనవి చేసుకున్నాడు. 'అయ్యా! మీరు బయలుదేరిన ముహూర్తం బాగా లేదు. వర్షం పడేట్టు వుంది కనుక మీరు వేటకు మరో రోజు వెళ్ళండి' అని సలహా చెప్పాడు. కానీ రాజు అతడి మాట చెవిన పెట్టకుండా ముందుకు సాగాడు. కొద్ది దూరం పోగానే హఠాత్తుగా మబ్బులు కమ్మి భోరున వర్షం కురిసి అందరూ తడిసి ముద్దయ్యారు. వర్షం రాదని  చెప్పిన అధికారిపై రాజుగారికి వొళ్ళు మండింది. వర్షం పడుతుందని హెచ్చరించిన చాకలికి ఆ ఉద్యోగం ఇస్తున్నట్టు ఆ మంటలో ఓ  ప్రకటన చేసాడు. అయితే, వర్షం జోస్యం తన ప్రతిభకాదనీ, వర్షం పడే ముందు తన గాడిద చెవులు టపటపా కొట్టుకుంటూ సంకేతం ఇస్తుందని, అది చూసిన తరువాతే తాను వర్షం పడుతుందని ముందుగా చెప్పగలిగాననీ  వివరణ ఇచ్చుకున్నాడు. దానితో రాజుగారు ఇంకెంతమాత్రం ఆలోచించకుండా వర్షం పడదని చెప్పిన అధికారి  కుర్చీలో ఆ గాడిదనే కూర్చోబెట్టాలని మరో ఆర్డరు వేసాడు.
నిజమే!  ఇదంతా పరమ పాతకదే. కొత్త మలుపు  ఏమిటంటే:


అప్పటినుంచి గాడిదలు అధికారులుగా పనిచేసే కొత్త సంప్రదాయం మొదలయింది.



NOTE: Courtesy Image Owner

5, ఆగస్టు 2015, బుధవారం

బ్రేకింగ్ న్యూస్!


గమనిక: "వంశీ వంశీ పోస్ట్ చేసిన ఆంగ్లగల్పిక ఆధారంగా"


రిపోర్టర్: "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. మీరు ఏ పండుని ఇష్టపడతారు?"
నరేంద్ర మోడీ : "ఆపిల్ పండు"
రిపోర్టర్: ఇప్పుడే అందిన వార్త! "ఆపిల్ పండు మినహా ప్రధాని మోడీగారికి మామిడిపళ్ళు ఇష్టం లేదు. అరటి పండును  అస్సలు ఇష్టపడరు. మోడీ అభిప్రాయం గురించి వివిధ పార్టీల నాయకులను కదిలించినప్పుడు వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం :
మనీష్ తివారి: "ఆపిల్ పండు మోడీ గారు ఇష్టపడడంలో విచిత్రం లేదు. ఆపిల్ పండు రంగు ఎరుపు. ఆయనకి  ఎర్రటి రక్తపుటేర్లు పారించడం కూడా ఇష్టమే"
అహమ్మద్ పటేల్ : "ఆశ్చర్యం ఏముంది. పచ్చటి పండు ఇష్టం లేదు అంటే అర్ధం ఏమిటి? ఆయనకు ముస్లిం లు అంటే పడదు. అందుకే ఎర్రటి ఆపిల్ ఇష్టం అంటున్నారు"
ఆర్నాబ్ గోస్వామి: "మోడీ గారికి ఆపిల్ పండు ఇష్టం అయితే కావచ్చు. కానీ మిగిలిన పండ్లకంటే ఆయనకు ఆపిల్ యెందుకు ఇష్టమో జాతికి సమాధానం చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది. ఈ విషయంలో ఆయన తన బాధ్యత నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరు"
సోనియా గాంధి : 'ఓ పక్క తాను పేద ప్రజల పక్షపాతినని చెప్పుకుంటూ, మరో పక్క అత్యంత ఖరీదైన ఆపిల్ పండ్లని యెలా కొనగలుగుతున్నారో, ఆ డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో మోడీజీ బయట పెట్టాలి"
ఏచూరి: "ఆపిల్ ఇష్టం అని అంటున్నారంటే మోడీ ఖచ్చితంగా ఆపిల్ వంటి బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలం. పేద ప్రజలకు పచ్చి వ్యతిరేకం"
కేజ్రీవాల్: "సాధారణంగా మామూలు మనుషులు మామిడి పండ్లను ఇష్టపడతారు. సాంప్రదాయ విరుద్ధంగా ఆపిల్ పండు ఇష్టపడే మోడీ, ఆమ్ ఆద్మీకి పూర్తిగా వ్యతిరేకం అని వేరే చెప్పాలా?"
సగటు పౌరుడు: "ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి"

NOTE: Courtesy Image Owner


3, ఆగస్టు 2015, సోమవారం

ప్రత్యేక హోదా - అసలు విషయం



ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా వున్న కొన్ని మాటల్ని మళ్ళీ ఓసారి విందాం.మరోసారి మననం చేసుకుందాం.
'విడిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
'అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలి'
'ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీకి కట్టుబడి వున్నాం'
'ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు, ప్రతిపక్షాలు కావాలనే మా మీద బురద చల్లుతున్నాయి'
'ప్రత్యేక హోదా సాధించేవరకు మేము నిద్రపోము'
'ప్రత్యేక హోదా  కోసం మా నాయకుడు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మహాజర్లు ఇచ్చివచ్చిన సంగతి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి'
'మేము అధికారంలోకి రాలేక పోవడం వల్ల గత పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి మా మాట నెరవేర్చుకుంటామని మరో హామీ ఇస్తున్నాము'
'ఇచ్చిన హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిలబెట్టుకోలేదు, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది'
'పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్తితిలేదు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పొందుపరచి వున్నట్టయితే ఇప్పుడీ పరిస్తితి వచ్చేదే కాదు'
'మేము ఇవ్వలేదు సరే. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేయగల మెజారిటీ వుంది. ప్రత్యేక హోదాకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయవచ్చు కదా'
'ప్రత్యేక హోదా కుదరదు అన్న కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ కు వర్తించదు'
'ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'
'రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే అందుకు మేము సిద్ధం'
ఇవన్నీ ఏడాది కాలంగా వినీ వినీ ప్రజల చెవులకు తుప్పు పట్టింది. అవే మాటలు పదేపదే  వింటూ రావడం వల్ల పట్టిన చెవుల తుప్పు ఒదిలిపోయింది కూడా. అందుకే ప్రజలకు ఇప్పుడు సర్వం అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీల అసలు  తత్వం బోధపడుతోంది.
నిజానికి ఈ మాటలు అన్నీ పైకి చెప్పేవి. మనసులోని మాటలు వేరే.
'ఇవ్వచ్చు. కానీ దగ్గర్లో ఎన్నికలు లేవు.  ఇప్పుడు ఇస్తే ఏమిటి లాభం?'
'ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇస్తే మాకేమిటి లాభం'
'ఇవ్వడం వల్ల మా పార్టీకి ప్రస్తుతం ఎలాటి లాభం లేదు. పైగా నష్టం కూడా. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం పోరాడక తప్పదు. రోడ్డెక్కక తప్పదు'

మనసులో మాట అనండి, మన్ కీ బాత్ అనండి. అసలు విషయం ఇది.    

1, ఆగస్టు 2015, శనివారం

రాజకీయ మాయాజాలం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 06-08-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే  పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు  పండిత, పామరులనే  తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా  అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు. రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా జరిగిపోయాయి.
విభజన అనంతరం ఏర్పడ్డ  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన  కాంగ్రెస్, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ హోదా  కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో పాత్రోచితంగా మీనమేషాలు లెక్కబెడుతోంది. పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ పార్లమెంటు సాక్షిగా ఓ పక్క చెబుతుంటే, మరో వైపు మిత్రపక్షమైన టీడీపీ నాయకులు హోదా వచ్చి తీరుతుందని చెప్పడానికి నానా ఆపసోపాలు పడుతున్నారు.  
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది.  మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.  
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే  నిబంధనలు ఏవీ లేవు. 
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు,  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి. 
ఈ హోదాతో పోల్చుకుంటే ఎలాటి ప్యాకేజీలు సాటి రావు.



అయితే ఇదంతా గతం ఇప్పుడు ఇవన్నీ అప్రస్తుతం అన్న రీతిలో పార్లమెంటులో బీజేపీ మంత్రి ప్రకటన చేసి ఆంధ్ర ప్రదేశ్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లారు.
ఈ ప్రకటన అసలే ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని  మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఆయన పాలనలో వున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.  కానీ ఫలితం పూజ్యం. స్వయంగా అధినాయకుడి ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు? మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును. కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని కక్కలేని పరిస్తితి. 
కాంగ్రెస్, బీజేపీలది మరో రకమైన పరిస్తితి. పాలన అనుభవం వున్నవారు కనుక ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న సంగతి ఆ పార్టీలకి తెలిసే వుండాలి. అందుకే కాంగ్రెస్ తెలివిగా ఈ అంశాన్ని విభజన బిల్లులో చేర్చలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనతో సరిపెట్టారు. అప్పుడు అధికారంలో లేని బీజేపీకి కూడా సాధ్యంకాదని తెలుసు. రాజకీయ లబ్ది చేజారకుండా బిల్లు ఆమోదానికి తల వూపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ ఇవ్వడం సాధ్యం కాదని ఎరిగిన వారు కనుక ఏడాదిగా ఈ విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రత్యేక హోదాపై సీమాంధ్ర ఆశలు కొడిగట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయ అనుభవం వారిచేత ఈ పిల్లి గంతులు వేయిస్తోంది. బిల్లులో పెట్టలేదన్న నెపాన్ని కాంగ్రెస్ మీద మోపి తాను తప్పుకోవాలని చూస్తోంది. మరి అంత  చిత్తశుద్ధి వున్నవాళ్ళు, చట్ట సవరణ చేసే బలం వున్నవాళ్లు ఆ పనేదో చేసి చూపించవచ్చు కదా అన్నది వారి ప్రతికక్షుల వాదన.
అందరికీ అన్నీ తెలుసు. అన్నీ తెలిసుండే ఇన్ని చేశారు. ఇప్పుడు ఏవీ తెలవదన్నట్టు రాజకీయ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
రాజకీయం అంటే ఏమిటి? సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకుండా వాగ్దానాలు చేయడమా? చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడమా? దానికి ఇతరుల మీద నెపం మోపడమా?
ఇలాటి సందర్భాల్లో మామూలు జనం 'మోసం దగా' అనే పదాలు వాడతారు.
మరి అదేపని రాజకీయ పార్టీలు చేస్తే దాన్ని రాజకీయ జాణతనం అని సరిపుచ్చుకోవాలా?
ఇలాంటి రాజకీయుల్ని యేమనుకోవాలి?  ఇలాటి రాజకీయాలను యేమని పిలవాలి?     


(NOTE: COURTESY IMAGE OWNER) 
       


       


       



31, జులై 2015, శుక్రవారం

'ఊ' అంటే వస్తుందా?




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎక్స్ ప్రెస్ టీవీలో గురువారం  సాయంత్రం  చర్చ జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రతినిధి చెబుతున్నారు. 'పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదన్నది ఆయన ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ పడుతున్నారనీ, ఆయనా, కొందరు  మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద  చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఈ చర్చ తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు సాయంత్రం  కాగానే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,  ఆ కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
'బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి వుంటే వస్తుందా?'
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'


(30-07-2015)