1, ఆగస్టు 2015, శనివారం

రాజకీయ మాయాజాలం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 06-08-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే  పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు  పండిత, పామరులనే  తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా  అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు. రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా జరిగిపోయాయి.
విభజన అనంతరం ఏర్పడ్డ  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన  కాంగ్రెస్, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ హోదా  కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో పాత్రోచితంగా మీనమేషాలు లెక్కబెడుతోంది. పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ పార్లమెంటు సాక్షిగా ఓ పక్క చెబుతుంటే, మరో వైపు మిత్రపక్షమైన టీడీపీ నాయకులు హోదా వచ్చి తీరుతుందని చెప్పడానికి నానా ఆపసోపాలు పడుతున్నారు.  
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది.  మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.  
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే  నిబంధనలు ఏవీ లేవు. 
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు,  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి. 
ఈ హోదాతో పోల్చుకుంటే ఎలాటి ప్యాకేజీలు సాటి రావు.



అయితే ఇదంతా గతం ఇప్పుడు ఇవన్నీ అప్రస్తుతం అన్న రీతిలో పార్లమెంటులో బీజేపీ మంత్రి ప్రకటన చేసి ఆంధ్ర ప్రదేశ్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లారు.
ఈ ప్రకటన అసలే ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని  మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఆయన పాలనలో వున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.  కానీ ఫలితం పూజ్యం. స్వయంగా అధినాయకుడి ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు? మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును. కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని కక్కలేని పరిస్తితి. 
కాంగ్రెస్, బీజేపీలది మరో రకమైన పరిస్తితి. పాలన అనుభవం వున్నవారు కనుక ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న సంగతి ఆ పార్టీలకి తెలిసే వుండాలి. అందుకే కాంగ్రెస్ తెలివిగా ఈ అంశాన్ని విభజన బిల్లులో చేర్చలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనతో సరిపెట్టారు. అప్పుడు అధికారంలో లేని బీజేపీకి కూడా సాధ్యంకాదని తెలుసు. రాజకీయ లబ్ది చేజారకుండా బిల్లు ఆమోదానికి తల వూపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ ఇవ్వడం సాధ్యం కాదని ఎరిగిన వారు కనుక ఏడాదిగా ఈ విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రత్యేక హోదాపై సీమాంధ్ర ఆశలు కొడిగట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయ అనుభవం వారిచేత ఈ పిల్లి గంతులు వేయిస్తోంది. బిల్లులో పెట్టలేదన్న నెపాన్ని కాంగ్రెస్ మీద మోపి తాను తప్పుకోవాలని చూస్తోంది. మరి అంత  చిత్తశుద్ధి వున్నవాళ్ళు, చట్ట సవరణ చేసే బలం వున్నవాళ్లు ఆ పనేదో చేసి చూపించవచ్చు కదా అన్నది వారి ప్రతికక్షుల వాదన.
అందరికీ అన్నీ తెలుసు. అన్నీ తెలిసుండే ఇన్ని చేశారు. ఇప్పుడు ఏవీ తెలవదన్నట్టు రాజకీయ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
రాజకీయం అంటే ఏమిటి? సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకుండా వాగ్దానాలు చేయడమా? చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడమా? దానికి ఇతరుల మీద నెపం మోపడమా?
ఇలాటి సందర్భాల్లో మామూలు జనం 'మోసం దగా' అనే పదాలు వాడతారు.
మరి అదేపని రాజకీయ పార్టీలు చేస్తే దాన్ని రాజకీయ జాణతనం అని సరిపుచ్చుకోవాలా?
ఇలాంటి రాజకీయుల్ని యేమనుకోవాలి?  ఇలాటి రాజకీయాలను యేమని పిలవాలి?     


(NOTE: COURTESY IMAGE OWNER) 
       


       


       



కామెంట్‌లు లేవు: