27, మే 2015, బుధవారం
మంచివాళ్ల మౌనం
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 28-05-2015, THURSDAY)
ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి
మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ
మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని
ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి
దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో
పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి
పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం
వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా
ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ
అవినీతులు, అధికార దుర్వినియోగాల
విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు
తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా
అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే
రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి
కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి
ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం
దొరికితే అందరూ అందరే ' అన్న
భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే
గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
ఇది జరిగి చాలా
ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి
ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు
సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని
రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్
కూడా వున్నారు.
ఆరోజుల్లో నేను హైదరాబాదు
ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు
ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో
ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు
దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న
పేరు ఆయనకు ఇంటాబయటా బాగా
పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ
మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో
మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా
ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన
ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ
ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస
యాత్రలు చేయడం ఏం సబబు' అనేది
ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో ప్రభుత్వం సమకూర్చిన
ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న
చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు,
వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్
మాదిరిగా సాగిపోతూ ఉండగానే,
ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి
స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి,
సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే
ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ
డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా
ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది
ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను
సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను.
ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు
చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ
చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా
మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.
'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని
ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే
మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ.
పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని
హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే
చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు
కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ పిల్లాడికి
చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి
నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు
మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు
చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. 'రాజకీయ
నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే మాత్రం వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ
నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా
వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి జాబితాలో నా పేరు కూడా
కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి
సమర్ధకుడినే కాని అవినీతిపరుడిని
అనలేదు కదా' అని నన్ను నేనే
సముదాయించుకున్నాను.
నీతికీ, అవినీతికీ
నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి
దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ
ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ అధికారుల
ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా
అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్
ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని
ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన
నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా
గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా
కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు
కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి
చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో
వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు
ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి ఓ మేరకు
అయినా అది అద్దం పడుతోంది.
ఇప్పుడు చెప్పండి నీతులు
వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం
కోసమేనా!
Note: Courtesy Image Owner
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
26, మే 2015, మంగళవారం
తుళ్ళూరు కనబడుటలేదు
అది వార్త - ఇది వ్యాఖ్య
ఇది ఈ రోజు ఆంద్ర జ్యోతిలో
పడ్డ వార్త:
మోదీ కోసం మూడు విమానాల
దారి మళ్లింపు
ప్రధానమంత్రి మోదీ మధుర
ర్యాలీలో పాల్గొని తిరిగి ఢిల్లీ వచ్చే సమయంలో ప్రధాని ప్రయాణం కోసం అధికారులు
మూడు విమానాలను దారి మళ్ళించారని ఆ వార్త సారాంశం. మరి మనది ఇండియా కదా! ఇది చదివినప్పుడు
ఓ పాత సంగతి గుర్తొచ్చింది. అదే వ్యాఖ్య
"ఇది జరిగి కొన్నేళ్ళు
అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని
సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో
కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి
ఎక్కువే. ఒకరోజు పర్యటనపై ఆ నగరానికి వచ్చివెడుతున్న అమెరికా
ప్రెసిడెంట్ - ‘ఎయిర్
ఫోర్స్ వన్’ విమానానికి
అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు
వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం
మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్
దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక వార్త
సారాంశం.
అది అమెరికా మరి. (26-05-2015)
(Photo
Courtesy Andhra Jyothy)
లేబుళ్లు:
మోదీ కోసం మూడు విమానాల దారి మళ్లింపు
దేవుడు నిర్దయుడు
శనివారం ఉదయం పదిన్నరకు ఫోను మోగిందంటే అది
ఖచ్చితంగా టీవీ 5 నిస్సార్ నుంచే.
(నిస్సార్)
'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి' వద్దువద్దన్నా
ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం చెప్పేవాడు.
కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.
ఎన్నో ఏళ్ళుగా ప్రతి శనివారం తప్పనిసరిగా
నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదు. ఫోన్ కాదు ఎప్పుడూ నవ్వుతూ వుండే
అతడి మొహాన్ని కూడా నేను జీవితంలో చూడలేను. ఎందుకంటె అతడిక లేడు.
పొద్దున్న మహా టీవీకి వెడుతుంటే టీవీ 5 విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కన్ను
మూసాడని. సొంతూరు కర్నూలు జిల్లా కొడుమూరుకు తీసికెళ్ళారని.
మూడు పదులు దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు
నిండిపోయాయి. యెంత కష్టమో అతడి కుటుంబానికి.
దేవుడు నిర్దయుడు. ఎవరికీ ఇష్టం లేని ఇలాటి పనులు
చేస్తుంటాడు. దయామయుడు కూడా. తెలిసిన వారందరూ ఇష్టపడే నిస్సార్ ని తాను కూడా ఇష్టపడి తన దగ్గరకు రప్పించుకున్నాడు.
PHOTO COURTESY SRI NARAYANA MURTHY
లేబుళ్లు:
TV 5 Nissar is no more
23, మే 2015, శనివారం
మోడీ ఏడాది పాలన, ఒక పరిశీలన
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-05-2015, SUNDAY)
మనిషిది నూరేళ్ళ
జీవితం అంటారు. అంచేత అందులో ఓ ఏడాది కాలం
చెప్పుకోతగ్గది కాకపోవచ్చు. కానీ, ప్రజాస్వామ్య
దేశంలో ఎన్నికల్లో తీర్పు ద్వారా ఆయా
రాజకీయ పార్టీలకి ప్రజలిచ్చిన అయిదేళ్ళ అధికారంలో
ఒక సంవత్సరం గడిచిపోయిందంటే మాత్రం అది అంత చిన్నా చితకా సమయం అయితే కాదు. ఇక మిగిలింది కేవలం
నాలుగేళ్లే అన్నది ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మిగిలున్న ఈ సమయం, అధికారంలోకి
రాగానే చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినవాటిని కానీ, అధికారంలోకి రాగానే కొత్తగా
జోడించిన తాజా వాగ్దానాలను లేదా సరికొత్త పధకాలను కానీ నూటికి నూరు శాతం అమలుచేయడానికి సరిపోయేదయితే కాదు.
నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా పగ్గాలు
చేతిలోకి తీసుకుని ఈ నెల ఇరవై ఆరుకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ రెండు రోజుల్లో
కొత్తగా సాధించి చూపించే వ్యవధానం ఎటూ లేదు కాబట్టి అయన పరిపాలనను అంచనా వేసే
ప్రయత్నం కొంత ముందుగా చేస్తే తప్పేమీ కాదు. ఏడాది స్వల్ప సమయంలోనే 'ఎన్నో చేశాం' అని చెప్పుకోవడం పాలక పక్షాలకు,
ఏడాది గడుస్తున్నా 'సర్కారు ఒరగబెట్టింది ఏమీ లేదు' అని ఎద్దేవా చేయడం ప్రతిపక్షాలకూ
అనూచానంగా వస్తున్న ఆచారమే . ప్రతిపక్ష
హోదా దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిగ్గా
ఇదే వ్యాఖ్య చేసారు. అమేథీలో మాట్లాడుతూ, మోడీ ఏడాది పాలనకు తాను సున్నా మార్కులు
వేస్తున్నట్టు చెప్పారు. పైగా ఉత్త సున్నా కాదు పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా
కూడా చేసారు. కాంగ్రెస్ యువ నాయకుడి విమర్శలను బీజేపీ సీనియర్ నాయకులు
తిప్పికొట్టారు. అమేథీలో యువ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయి తరువాత మోడీ
క్యాబినెట్లో మంత్రిగా చేరిన స్మృతి ఇరానీ కాస్త పదునైన ప్రతి వ్యాఖ్యలు చేసారు.
మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఈ
ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ అన్నారు. పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్
పార్లమెంటు సభ్యత్వ కాలం పరిగణనలోకి తీసుకుంటే సున్నకు సున్నా,హళ్లికి హళ్లి అని
కొట్టిపారేశారు. మోడీ ప్రభుత్వంలో ఆర్ధిక
శాఖ వంటి ప్రధాన శాఖకు మంత్రిగా వున్న అరుణ్ జైట్లీ కూడా తన పాత్రకు తగ్గట్టే
మాట్లాడారు. అవినీతి రహిత పాలన అంటే ఎలా వుంటుందో దేశ ప్రజలకు ఈ ఏడాది కాలంలో
ప్రదర్శించి చూపామని అన్నారు. యూపీఏ పాలనలో దేశ ప్రజల్లో అలముకున్న నిరాశను
పోగొట్టామనీ, కొత్త ఉత్సాహాన్ని నింపామని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ముందే చెప్పినట్టు
ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడడం సహజం.
అందుకే, ఈ ఏడాది కాలంలో పాలకులు 'ఏం మంచి చేసారు, ఏం చేయలేదు, అలా చేసి వుండాల్సింది కాదు' అనే మూడు మూడు
అంశాలను మాత్రమే తీసుకుని మోడీ ప్రభుత్వం పనితీరును స్థాలీపులాకన్యాయంగా విశ్లేషించి
ఒక అంచనా వేయడానికే ఈ ప్రయత్నం.
మోడీ అనే ఈ రెండు అక్షరాలు భారత రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పి ఇంకా ఏడాది
కాలేదు. మోడీ మాయ అప్పట్లో దేశాన్ని కమ్మివేసింది. ఆ మాయ ఇంకా పూర్తిగా తొలగిపోయిన
దాఖలాలు కానరావడం లేదు. దేశంలోని నవ తరం
యువజనుల్లో అధిక శాతం మందిని ఆ మాయ ఇంకా
కమ్ముకునే వుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో మోడీ ప్రభలు ఇంకా విరజిమ్ముతూనే
వున్నాయి. విదేశాల్లో చెప్పనక్కరేలేదు.
ఒక్క ఏడాదిన్నర వెనక్కి వెళ్లి చూస్తె భారత
రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీ బీజేపీలో సయితం నరేంద్ర మోడీ ఒక సాధారణ నాయకుడు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక జాతీయ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో నేతృత్వం
వహించే పరిస్తితి నాడు మోడీకి వుందని వారి పార్టీ వారికే నమ్మకం లేదు. ప్రధాని
అభ్యర్ధిగా మోడీ పేరు ప్రకటించడానికి బీజేపీలో
ఎంతగా మల్లగుల్లాలు పడ్డదీ తెలుసుకోవడానికి చరిత్రను తవ్వితీయనక్కర లేదు. అయితే,
దరిమిలా సంభవించిన రాజకీయ పరిణామాలన్నీ మోడీకి కలసి వచ్చాయి. రెండో విడత పాలన
ముగియవస్తున్న సమయానికి యూపీయేకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పీకల లోతు అవినీతి
ఊబిలో కూరుకుపోయింది. జైట్లీ అన్నట్టు ప్రజలు నిరాశలో వున్నారు. నిస్పృహకు గురై
వున్నారు. కాంగ్రెస్ పట్ల అత్యధిక ప్రజానీకం పట్టరాని కోపం పెంచుకునివున్న స్తితిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వచ్చాయి. బలహీన
పడ్డ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి
నిజానికి బీజేపీ పెద్ద కష్టపడే పరిస్తితి
లేదు. మోడీ అవసరం అంతకన్నా లేదు. కానీ, ప్రధాని అభ్యర్ధిగా పార్టీలో అడ్డంకులు
తొలగిపోవడంతో ఎన్నికలకు ముందు మోడీ చెలరేగిపోయారు. తన వాగ్ధాటితో, తన ఆహార్యంతో,
తన నేపధ్యంతో దూసుకుపోయారు. మోడీ తమలో ఒక్కరు అని సామాన్యులు అనుకునేలా ప్రచారం సాగించారు.
అన్నీ కలసివచ్చిన మోడీ, ఎన్డీయే కూటమికి, అంతకు
మించి బీజేపీకి తిరుగులేని విజయం సమకూర్చి పెట్టారు. ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.
కొన్నేళ్ళ క్రితం వరకు నేపధ్యంలోనే నిశ్శబ్దంగా
వుండి, హఠాత్తుగా వెలుగులు విరజిమ్ముతూ దూసుకువచ్చి, అదే వేగంతో నేలరాలి పోతుందని ఇంటా (అంటే వారి సొంత పార్టీలో) బయటా (అంటే ఎదుటి
పక్షాల్లో) అందరూ అనుకున్న తరుణంలో
నిలదొక్కుకుని నిలబడ్డ 'నక్షత్రం' నరేంద్ర మోడీ. వ్యక్తులకంటే వ్యవస్థ ప్రధానం
అంటూ అన్ని పార్టీలు వల్లె చేస్తుంటాయి కాని వ్యక్తుల ప్రభావంతో ఆయా రాజకీయ
పార్టీల భవితవ్యాలు నిర్ధారణ అవుతూ వుండడం భారత రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ్, రాజీవ్ గాంధీ, వాజ్ పాయ్
వంటివారు జాతీయ స్థాయిలో తమదైన, బలమైన ముద్ర వేసి నాయకులు అనిపించుకున్నారు.
అలాగే, ఆయా రాష్ట్రాల్లో కూడా స్థానిక నాయకుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అంటుకున్న మరకలు, తన రాజకీయ భవిష్యత్తును అంధకారమయం
చేస్తున్నాయన్న ఆందోళన ముసురుకుంటున్న తరుణంలో
వచ్చి పడిన సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని మోడీ రాజకీయ జీవితం ఊహాతీతమైన మలుపు తిరిగింది. నిరుడు జరిగిన ఎన్నికలకు కొద్ది వారాలు ముందు నుంచీ మొదలయిన
మోడీ ప్రభావం ఇప్పటివరకు ప్రజలపై గణనీయంగానే వుందని సర్వేలు చెబుతున్నాయి. ఓ ఏన్నర్ధం క్రితం బీజేపీ అగ్రనాయకుడు అద్వానీని
సయితం తోసిరాజని మోడీ నేతృత్వంలో ఎన్నికల రణరంగంలో కాలుమోపాలని ఆ పార్టీ నాయకత్వం
నిర్ణయించినప్పుడే ఆ పార్టీ పగ్గాలను మోడీ
దొరకబుచ్చుకున్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్దిత్వానికి సొంత పార్టీలోనే మొగ్గ తొడిగిన అసమ్మతి, ముదిరి పాకాన
పడకముందే ఎన్నికలు ముంచుకు రావడం మోడీకి మంచి మేలే చేసింది. ఆ తరువాత జరిగిన
ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించి 'నభూతో నభవిష్యతి' అనే తీరులో ఓ అపూర్వ
విజయాన్ని 'బీజేపీ' ఖాతాలో జమ చేయడంతో మోడీ ప్రభలు దేశ విదేశాల్లో వెలుగులు
విరజిమ్మాయి.
'కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెత్తనం, గరిష్ట
స్థాయిలో ప్రజా పాలన' అనే కొత్త నినాదంతో అధికార పీఠం అధిరోహించిన మోడీ, తొలినాళ్ళలో మూటగట్టుకున్న ప్రజాభిమానమే దరిమిలా జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయపరంపర కొనసాగడానికి దోహదం చేసింది. నల్లధనం
వంటి ఒకటి రెండు ఎన్నికల వాగ్దానాలు మినహా ప్రజలకు మాటిచ్చి తప్పిన అపరాధభావం అంతగా
లేని పాలనావకాశం మోడీకి దొరకడం ఒక రకంగా ఆయన
అదృష్టం. 'ఒకనాటి చాయ్ వాలా ఈనాటి దేశ ప్రధాని' అనే కొత్త ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గతంలో వీసా
ఇవ్వడానికి సయితం నిరాకరించిన అమెరికా వంటి అగ్రరాజ్యంలో మోడీ భారత ప్రధాని హోదాలో
అధికార పర్యటన జరపడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని కొండంతగా పెంచింది. ప్రధాని అయిన
తదాదిగా మోడీ జరిపిన విదేశీ పర్యటనలు, ఆ సందర్భంగా ఆయన ఆహార్యం ఓమేరకు విమర్శలకు గురయినప్పటికీ, నానాటికీ పెరిగిపోతున్న మోడీ
ప్రభావం ముందు అవన్నీ వెలవెల పోయాయి. 'స్వచ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా' వంటి
నినాదాలు మోడీ ఆకర్షణను మరింత పెంచాయి.
అయితే, ఎన్ని చేసినా, ఎన్నో చేసామని బీజేపీ
నాయకులు పదే పదే తమ నాయకుడ్ని స్తోత్ర పాఠాలతో ముంచెత్తుతూ వున్నా, ఈ ఏడాది కాలంలో
మోడీ చేసిన ఒక్క మంచి పని ఏమిటంటే గట్టిగా చెప్పుకోవడానికి స్వచ్చ భారత్ కార్యక్రమం మినహా
మరొక్కటి కానరాని పరిస్తితి. ఇంకా ఏమైనా వున్నాయని చెప్పుకున్నా, అవన్నీ మోడీ ఏడాది పాలనలో సాధించినట్టు చెప్పుకునే ఘనకార్యాలను కీర్తించే ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే
పరిమితం.
ఇక మోడీ అభిమానులు సయితం బాధ పడే అంశం ఒకటుంది.
తిరుగులేని సంఖ్యాబలం అందించి జనం ఆయన్ని గద్దె ఎక్కించారు. ఆయనకు కానీ, ఆయన
నేతృత్వంలోని ఎండీఏ సర్కారుకు కానీ ముంచుకు వచ్చే ముప్పేమీ కనుచూపు మేరలో లేదు.
అయినా కానీ, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా
ఆర్డినెన్సు తరహా పాలనకు పూనుకోవడం నిజానికి మోడీ వంటి నాయకుడి నుంచి ప్రజలు
ఎన్నడూ కోరుకోరు. ఆర్డినెన్సుల పాలనకు స్వస్తి పలకాలని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు,
అధికార పీఠం ఎక్కగానే వాటితోనే పాలనకు
స్వీకారం చుట్టడం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడడం లేదు.
ఇక, చెప్పి చేయని అంశం నల్ల ధనం. ఈదిశగా ఏదయినా
చేసామని చెప్పుకున్నా అవి నేలబారు ప్రకటనలే. మునుపటి మన్మోహన్ ప్రభుత్వం ఇలా చేసి వుండాల్సిందని
నాడు ఎన్డీయే నాయకులు చెప్పిన దాంట్లో ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు.
దురదృష్టం ఏమిటంటే నల్లదనం వంటి అంశాలు వున్నవాళ్ళకే కాని సామాన్యులకు అంటని
విషయాలు. కనుక ప్రస్తుతానికి ఈ అంశం మోడీ మెడకు బిగుసుకుపోయే అవకాశాలు తక్కువ.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న
మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ
ప్రభుత్వాల ఆహ్వానాలు, దేశ విదేశాల్లో
పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల
సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే
నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్
పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం
మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన
మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు
కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ
వుంటే, జైట్లీ గారు సెలవిచ్చినట్టు ప్రజలు
విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన
మొదలు పెడతారు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు.
కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే
పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది. (23-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
లేబుళ్లు:
ఒక పరిశీలన,
మోడీ ఏడాది పాలన
22, మే 2015, శుక్రవారం
ఏ నిమిషానికి ఏమి జరుగునో .....
'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు
గడిచే పరిస్తితి కూడా లేదు'
అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ (మా
కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా
వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు. కొన్నేళ్ళ క్రితం శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం.
వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం.
ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం
అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు
వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు.
(సరయూ నదీ తీరంలో శాస్త్రి గారు, పుణ్యవతి గారు 2012 లో)
శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్
చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ.
శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా
పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు. అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ 'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు.
ప్రాణం ఉన్నంతసేపే మనిషి. ఆ కాస్తా
తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో 'కట్టె'. అంతే.
శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో
చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు
పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో కనిపించని వేదాంతం వుంది.
"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం
నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది
ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా
తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు.
ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్
అంటించడం కూడా రాదు. లక్షలు బిల్లు తీసుకుని
ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా చేతిలో
పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా
చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన. ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ
కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే
అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర
దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు
చెప్పడం లేదు'
శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్
అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ,
ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను
రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి
వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!'
అంటున్నారు శాస్త్రి గారు
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
(22-05-2015)
లేబుళ్లు:
ఏ నిమిషానికి ఏమి జరుగునో .....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





