23, ఏప్రిల్ 2015, గురువారం

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు


'యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే - 'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేద'ని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.
అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'పొగ తాగరాదు' అంటూ ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప.  'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి  పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యెక సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమా షెడ్ల  కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు.
జనంలో వున్న ఈ సుగుణాన్ని జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు  ఈ సూత్రాన్నే అమలు చేస్తే  అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రికలో  పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు. 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ని  చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని-  రాని ప్రశ్న.  

 
ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా  మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.

రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య  ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి.
       
అలాగే, ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

ఇలాటి  ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక  రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం  కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు. ఇలాటి వారి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు. 


(చేతిలో జెండా పట్టుకుని అమెరికాలోని సియాటిల్ లో రోడ్డు దాటుతున్న దృశ్యం) 


బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో  రోడ్డుదాటడానికి  పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో  కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని చేతిలో పట్టుకుని  ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డుదాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.

పొతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది. 

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా   పార్కింగ్ కి  అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ  అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను  ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.      

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగులు  జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లె ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
అలాగే,  రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో   'వీ..పీ. ' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో  మార్పులు  చేయాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్య జపం చేసే నాయకులు ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.   

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు  పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. (22-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈ మయిల్:  bhandarusr@gmail.com

NOTE: Courtesy Image Owner

22, ఏప్రిల్ 2015, బుధవారం

ఆడ లవణం


కూరలో ఉప్పు తగినంత పడ్డప్పుడు దాన్ని ఎవ్వరూ తలుచుకోరు.అదే,  ఉప్పులేని కూర వడ్డించారు అనుకోండి. నోట్లో పెట్టుకోగానే తెలిసిపోతుంది, అందులో ఉప్పు లేదని.
అలాగే ఆడవాళ్ళు. ఎదురుగా వున్నప్పుడు ఇంట్లో వాళ్ళెవ్వరు వాళ్ళు ఉన్నట్టే  గమనించరు, వాళ్ళ వూసే ఎత్తరు. అదే వాళ్ళు పుట్టింటికి వెళ్ళారనుకోండి, అప్పుడు తెలిసివస్తుంది వాళ్ళు లేని సంగతి.



NOTE: Courtesy Image Owner

20, ఏప్రిల్ 2015, సోమవారం

విపరీతార్ధాలు


మన ఐడియాలను మరొకరి బుర్రలో నాటడం కష్టం
అలాగే వేరొకరి జేబులో డబ్బుని మన జేబులోకి తెచ్చుకోవడం కూడా ఇబ్బందే.
మొదటిది విజయవంతంగా చేయగలినవాడిని టీచరు అంటారు. రెండో వాడిని వ్యాపారవేత్త అంటారు.
అయితే ఈ రెండింటినీ బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు కూడా మన చుట్టూ వున్నారు. వాళ్ళని 'భార్యలు' అంటారట.
పొతే ఈ రెండు పనుల్లో ఘోరంగా వైఫల్యం చెందేవాళ్లకు కూడా కొదవ లేదు. వారిని సింపిల్ గా 'మొగుళ్ళు' అని గిట్టని వాళ్ళు అంటారట.  


(Cartoon Courtesy : Fun 2 Video.com)
         

మరో సారి 'శుభం కార్డు'

నలభయ్ మూడేళ్ళ కధకు మరో సారి 'శుభం' కార్డు పడింది


(సూపర్ స్టార్ కృష్ణ దంపతులతో మా మేనల్లుడు శ్రవణ్ కుటుంబం)


ఈ నెల 13 వ తేదీన రాసిన ఈ దిగువ పోస్టింగుకు సరయిన ముగింపు ఈ ఫోటో. నాలుగు దశాబ్దాల విరామం  తరువాత  మా మేనల్లుడు  శ్రవణ్ సూపర్ స్టార్  కృష్ణ ను తన కుటుంబంతో సహా కలుసుకోగలిగాడు. అదే ఈ ఫోటో. కింద రాసింది జరిగిన కధ:    
దారి చూపిన దేవుడి కధలో 'ఆంద్ర జ్యోతి పాత్ర'
మొన్న ఆదివారం (12-04-2015) ఆంద్రజ్యోతి, దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ (30 వ పేజీ) సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ (అచ్చులో శ్రావణ్ అని పడింది) రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి (మానుకోట - మానుకొండ అని అచ్చయింది) పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం, తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో 'ఆంధ్ర జ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. అది తెలియచెప్పాలనే ఈ లేఖ. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము.( దాని కాపీ కూడా కింద వుంది) ఆంద్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము. (కింది ఫోటో అప్పటిదే) మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు ఆంద్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. అందరం గర్వ పడేలా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. ఈ నేపధ్యంలో - కృష్ణగారి గురించి ఆంద్రజ్యోతిలో అంతకు ముందు వారం వేసిన ప్రత్యెక సంచిక చదివి మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి.
-భండారు శ్రీనివాసరావు
హైదరాబాదు - సెల్ : 98491 30595

18, ఏప్రిల్ 2015, శనివారం

చీలి కలిసే 'ఐక్యతాప్రయోగం' ఫలిస్తుందా?


(Published in 'SURYA' telugu daily in it's edit page on 19-04-2015, SUNDAY)

'జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంద'న్న తెలుగు సామెతను పోలే ఓ పద ప్రయోగం ఒకటి  బీజేపీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా నోట వినబడింది. పూర్వపు జనతా దళ్ లో భాగస్వాములుగా వుండి తదనంతరం చీలిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్న ఆరు ప్రాంతీయ పార్టీలు  'జనతా పరివార్'  అనే పేరుతొ ఒక్కటయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ఆ కలయికకు ఓ కొత్త పోలిక చెప్పారు.  'సున్నాతో మరో సున్నా కలిస్తే గుండు సున్నా అవుతుంద'ని చమత్కరించారు.  

  
అమిత్ షా అభిప్రాయంతో ఏకీభవించాల్సిన పరిస్తితి లేకపోయినా అసలీ విలీనీకరణ నేపధ్యాన్ని తడిమి చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ ఆరు పార్టీలకు వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ, వాటికి నాయకులుగా వున్న నేతల పేర్లను జోడించి  చెబితేనేకాని  ఆ పార్టీలకు ఓ గుర్తింపు లభించని ఓ వింత పరిస్తితి వుంది. ప్రాంతీయ పార్టీల మనుగడ వాటి నాయకత్వ దక్షత మీదనే ఆధారపడి ఉంటుందన్నది అనుభవం నేర్పే పాఠం. తమిళనాట ఈ సంస్కృతి మరింత వూడలు దిగి విస్తరించింది. పార్టీలు, సిద్ధాంతాలు ఏమైనప్పటికీ,  వాటి కంటే కూడా ఆయా పార్టీల నాయకుల పేరు, ప్రఖ్యాతులు చెప్పే  అవి కాయలు అమ్ముకోవాల్సిన దుస్తితి ఉందన్నది  బహిరంగ రహస్యమే. ఈ ఆరు ప్రాంతీయ  పార్టీల పరిస్తితి ఇందుకు భిన్నం ఏమీ కాదు. ఉదాహరణకు భారత జాతీయ లోక్ దళ్. దీనికి ఇంటి పేరు మాదిరిగా ముందు 'చౌతాలా' అని తగిలిస్తేనే కాని అ పార్టీ గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే, 'ములాయం' సమాజ్ వాది  పార్టీ, 'లాలూ' రాష్ట్రీయ జనతా దళ్, 'నితీష్' జనతా దళ్(యు), 'దేవెగౌడ' జనతా దళ్ (ఎస్), 'కమల్ మొరార్క' సమాజ్ వాదీ జనతా పార్టీ. ఇలా ఆయా నాయకుల పేర్లతో చెలామణీ అవుతున్న ఈ పార్టీలన్నీ 'జనతా పరివార్' అనే పేరుతొ ఏకం కావాలని సంకల్పించాయి. ఈ ప్రయోగ సాఫల్య, వైఫల్యాలను నిర్ణయించే తరుణం కూడా అయిదారునెలల్లోనే రాబోతోంది. ఈ పార్టీల విలీనంపై ప్రజామోదం ఏ తీరులో వుండబోయేది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది.           
గతంలో కూడా భారత రాజకీయాల్లో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 'జనత' ప్రయోగమే విజయవంతం అయింది. కాంగ్రెస్ పార్టీని కలలో, ఇలలో వ్యతిరేకించే అనేక పార్టీలు ఒకే పార్టీగా రంగూ రూపూ మార్చుకుని ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఒకే పేరు, ఒకే గుర్తు, ఒకే జెండా, ఒకే ఎజెండా' తో కాంగ్రెస్  తో తలపడి, ఆ పార్టీని మట్టి కరిపించాయి.
అంతకు ముందు వరకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు. వామ పక్షాలను మినహాయిస్తే ఆ రోజుల్లో వున్నవి నాలుగే జాతీయ ప్రతిపక్షాలు. కాంగ్రెస్ (ఓ), భారతీయ జన సంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిష్ట్ పార్టీ. ఈ పార్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకత అన్న ఉమ్మడి అంశం తప్పిస్తే సిద్ధాంతాలు సూత్రాల విషయంలో ఒకటికొకటి పొసగని పరిస్తితే. దండలో దారంలా ఆ పార్టీలను ఆ ఒక్క అంశమే దగ్గరకు తీసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలు వాటి ఐక్యతకు ప్రజామోదాన్ని అందించింది. కీర్తి శేషులు లోక్ నాయక్  జయప్రకాష నారాయణ్ నాయకత్వం ఈ పార్టీల కలయికకు ఒక నిబద్ధతను కల్పించింది. ఫలితం ప్రప్రధమ విలీన ప్రయోగం సాధించిన అద్భుత విజయం.          
తదనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ జనతాపార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు కలిసి   వూడలు దిగిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెళ్లగించి వేసాయి. మొత్తం 542 లోక్ సభ స్థానాల్లో 345 స్థానాలను  కైవసం చేసుకున్నాయి. స్వాతంత్రానంతరం  దేశంలో, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా  మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది. కాంగ్రెస్ కు దాని మిత్ర పక్షాలకు కేవలం 189 సీట్లు మాత్రమె దక్కాయి. అవీ ఎక్కువగా దక్షిణ భారతంలో. ఉత్తర భారతంలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీతో సహా ఆ పార్టీ అతిరధ మహారధులందరూ పరాజయం పాలయ్యారు. యావత్తు ఉత్తర భారత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ  కేవలం రెండే రెండు సీట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయం ఇందిరాగాంధీ కళ్ళు తెరిపించింది. ఎమర్జెన్సీ లో జరిగిన ఆకృత్యాలకు ఆమె స్వయంగా జాతికి క్షమాపణ చెప్పారు.
అలా మొదలయిన ఓ అద్భుత రాజకీయ ప్రయోగం కొందరు స్వార్ధపరులయిన రాజకీయ నేతల పుణ్యమా అని కొద్ది కాలంలోనే విఫలం అయింది. ఇందిర, సంజయ్ లను అరెస్టు చేసి జైల్లో పెట్టడం, ఎమర్జెన్సీ ఆకృత్యాలను విచారించడానికి షా కమీషన్ ఏర్పాటుచేసి ఆ పేరుతొ ఇందిర కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం, వారి వ్యక్తిగతజీవితాలపై బురద చల్లే ప్రయత్నాలు సాగించడం మొదలయిన చర్యలు  ప్రజల్లో తిరిగి ఇందిరా గాంధీ పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేశాయి.  ప్రజలు తమకు  కట్టబెట్టిన అధికారాన్ని వారి బాగోగులకోసం వాడుకోవడానికి బదులు రాజకీయ ప్రతీకారాలకు వినియోగించే విధానం జనాలకు నచ్చలేదు. పైపెచ్చు ఇందిరను అధికారం నుంచి తొలగించడం కోసమే ఆ పార్టీలన్నీ ఏకమయ్యాయి తప్ప వారికి మరో ధ్యాస లేదన్నట్టుగా అంతర్గత కుమ్ములాటలకు జనతా పార్టీని ఒక వేదికగా మార్చారు. ఫలితం అంత మెజారిటీతో ఏర్పడ్డ జనత ప్రభుత్వం పూర్తి అయిదేళ్ళ కాలంకూడా  అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోయింది. ఈ ప్రయోగ వైఫల్యం కాంగ్రెస్ పార్టీకి ఎంతగా కలిసొచ్చిందంటే తదుపరి  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరస్కరించిన ప్రజలే తిరిగి ఆ పార్టీకి పట్టం కట్టారు. బ్రహ్మ రధం పట్టి అధికార పీఠం ఎక్కించారు.
ఇదంతా ఎందుకు పునశ్చరణ చేసుకోవాల్సివచ్చిందంటే - రాజకీయ పార్టీల విలీనాలు సిద్ధాంత ప్రాతిపదిక  మీద కాకుండా యేవో పైకి కనిపించని ఎజెండా ఆధారంగా జరిగితే వొనగూడే ప్రయోజనాలు కూడా తాత్కాలికమే. ప్రజలకు పనికి వచ్చేలా నాలుగు కాలాలపాటు మనగలగడం కష్టం.  
ప్రస్తుతానికి వస్తే, జనతా పరివార్ అనేది  కూడా తాత్కాలికంగా మీడియాలో వినవస్తున్న కొత్త పార్టీ పేరు. విలీనం కావాలన్న నిర్ణయం అయితే జరిగింది కానీ, కొత్త పార్టీకి ఇంకా పేరు, జెండా, ఎజెండా, గుర్తు ఖరారు కావాల్సివుంది. ఎన్నికల్లో పార్టీ గుర్తు ఏమిటన్నది ఎన్నికల కమీషన్ చేతుల్లో వున్న విషయం. అయినా ములాయం సైకిల్, లాలూ లాంతరు గుర్తుల విషయంలో కొంత చర్చ జరుగుతున్నట్టు వినికిడి. ఉమ్మడి ఎన్నికల గుర్తు కొన్ని చిక్కులను తెచ్చిపెట్టే ప్రమాదం వుంది. ఈ ఆరు ప్రాంతీయ పార్టీలకు వారి వారి రాష్ట్రాల్లో వారి సొంత బలం వున్నట్టుగానే ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కూడా కొంత ప్రాచుర్యం పొందిన మాట కూడా కాదనలేనిది. అంచేత ఉమ్మడి గుర్తు ఎన్నికల ఫలితాలపై కొంత పరోక్ష ప్రభావం చూపే అవకాశం వుంటుంది. అంచేతే కాబోలు, విలీన నిర్ణయం ఆర్భాటంగా  ప్రకటించిన నేతలు విధివిధానాల ఖరారు అంశంపై కాలయాపన చేస్తున్నారు.
ఈ కొత్త ప్రయోగ విజయావకాశాలపై కొన్ని సందేహ మేఘాలు కమ్ముకోవడానికి కూడా ఆధారాలు వున్నాయి. ఒక వేదికపైకి వచ్చి చేతులు అయితే కలిపారు కాని వారి మనసులు కలిసాయి అనడానికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటె పరస్పరం కత్తులు దూసుకునే విషయంలో ఈ పార్టీల నాయకుల గతం అలాటిది. ఒకరికొకరు చుక్కెదురు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. ఆధిపత్య స్వభావం విషయంలో మాత్రం అందరిదీ ఒకే బాట. తమ మాటే నెగ్గాలనే తత్వం అందరిలో వుంది. ఒక్క నితీష్ కుమార్ ని మినహాయిస్తే అవినీతి విషయంలో మినహాయింపు ఇవ్వగల నాయకులు ఆ పార్టీల్లో  లేరు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేకత మాదిరిగా బీజేపీ వ్యతిరేకత ఒక్కటే వారినిప్పుడు విలీనం దిశగా అడుగులు వేయించింది.
ఈ విలీనం అనుకున్న ఫలితాలను ఇవ్వదని ఖరాఖండిగా చెప్పడం కూడా కష్టమే. కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. బహుశా ఇదే వారిని దగ్గరకు తీసిన అంశం అయివుంటుంది. అంతే కాకుండా ఇలా కుమ్ములాడుకుంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూ పొతే చాప కింద నీరులా పాకుతూ వస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కష్టం అన్న ఎరుక కూడా.            
ఐకమత్యం మహా బలం కావచ్చు. ఐక్యతారాగం అందుకుంటే ఆశించిన ఫలితాలు అందుకోనూ వచ్చు. అయితే చీలి కలిసే నాయకుల్లో చిత్తశుద్ధి లోపిస్తే మాత్రం భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాల పట్ల ప్రజల్లో  నమ్మకం పూర్తిగా  సడలిపోతుంది. అటువంటి నమ్మకం ఇప్పటికే బీటలు వారి ఉందన్న వాస్తవాన్ని గమనంలో పెట్టుకోవాలి.
అయితే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కూడా ఒక  విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో గొప్ప వాగ్దానాలు ఏమీ చెయ్యకపోయినా ప్రజలు వారిని గద్దె ఎక్కించడానికి కారణం కేవలం ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల  పెంచుకున్న నమ్మకం ఒక్కటే కాదు, అంతకు పూర్వం  కాంగ్రెస్ పాలనపై  వారు పెంచుకున్న వ్యతిరేకత కూడా. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షాల ఐక్యత  ఓటమికి తోడవుతుంది అన్న వాస్తవాన్ని మరచిపోకూడదు.
ఏ పాలకపక్షానికయినా అన్వయించే సూక్తి ఇదొక్కటే! (18-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Photo Courtesy Image Owner 

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

నిష్టూర నిజాలు


"అంటే ఏమిటన్న మాట"
మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు ఏకాంబరం.
 "ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నవాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్ధం కావని. ఈ మధ్య అలాటివి రెండు నా దృష్టికి వచ్చాయి" వక్కపొడి నములుతూ సంభాషణ పొడిగించాడు.
నిజానికి ఏకాంబరంతో సంభాషించడం కుదరని పని. మన మాటలు కూడా అతడే మాట్లాడుతూ మాటలు కొనసాగిస్తాడు. ఒకరకంగా  ఏకాంబరంతో వున్న సులువు కూడా అదే. వింటున్నట్టు ఓ చెవి పారేసి మన మానాన మనం రాసుకుంటూ,  చదువుకుంటూ ఎంచక్కా అతడితో ముచ్చట్ల కార్యక్రమం కొనసాగించవచ్చు.


"హైకోర్టు ఆగ్రహం"
మళ్ళీ  ఏకాంబరమే మొదలెట్టాడు.
"ఇదొక అర్ధం కాని మీడియా భాష. కోర్టుకు ఆగ్రహానుగ్రహలతో నిమిత్తం వుండకూడదు. ఏదయినా కేసు విచారించేటప్పుడు ఇటువంటి భావోద్రేకాలకి న్యాయమూర్తులు లోనుకాకూడదు. నిజంగా జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలవదు. టీవీ స్క్రోలింగుల్లో మాత్రం ఈ పదం తరచూ దర్శనం ఇస్తుంటుంది. నాకు అర్ధం కాని విషయాల్లో ఇదొకటి" అన్నాడు ఏకాంబరం.
"మరి రెండో సంగతి"
ఎవరూ అడక్కుండానే  ఆయనే అందుకున్నాడు.
"అలసటా, ఆయాసం లేకుండా హాయిగా బంధు మిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొచ్చిన ప్రముఖులు, మహాద్వారం  దగ్గర్లో మీడియాతో మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు. 'దేశం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలందరికీ మంచి జరగాలనీ  అ బ్రహ్మాండనాయకుడ్ని  ప్రార్ధించి వచ్చినట్టు ఎలాటి భేషజం లేకుండా బ్రహ్మాండమైన అబద్ధాలు  ఆశువుగా చెప్పేస్తారు.  ఈ మాటలు నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా?"


"అల్లాగే ఇంకో అర్ధం కాని  విషయం. అందరు భక్తుల్లాగే వాళ్ళూ తిరుపతి వస్తారు. ఎలాటి లాయలాస లేకుండా దేవుడి దర్శనం తేలిగ్గా చేసుకుంటారు. కావాల్సిన కోరికలు ఎవరూ లేకుండా చూసి కోరుకుంటారు. బయటకు రాగానే మాత్రం  అదేదో 'సబ్బు వాడండి' అని సినిమాతారలు ప్రకటనలకు ఫోజు ఇచ్చినట్టుగా గుడి బయట వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు చెప్పండి. ఏడుకొండలవాడికి వీళ్ళ మెచ్చుకోళ్ళు అవసరమా? టీవీలవాళ్లు  ఈ పద్ధతికి స్వస్తి చెబితే బాగుంటుంది"
"చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపించినట్టు  ఏకాంబరం గారు  చెప్పేవి పోచికోలు కబుర్లే  అప్పుడప్పుడూ ఇలాటి మంచి మాటలు కొన్ని చెబుతుంటారు.  అందుకే పొద్దున్నే వచ్చి విసిగించినా, విసుక్కోకుండా కాఫీ ఇచ్చేది" అన్నది మా ఆవిడ ఏకాంబరం వెళ్ళిపోయిన తరువాత తాపీగా. (17-04-2015)

NOTE: Courtesy Image Owners 

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఫ్లెక్సీల బెడదకు పరిష్కారం ఒక్కటే!

(Published by 'SURYA' telugu daily in it's edit page on 16-04-2015)

http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
పుట్టిన ప్రతిమనిషికీ ఒక పుట్టిన రోజు వుంటుంది. కొందరి పుట్టిన రోజులకు వారి వారి హోదాలనుబట్టి గుర్తింపు లభిస్తుంది.  రాజకీయ రంగంలో ఉన్నవారికీ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికీ పుట్టిన రోజులు గుర్తుపెట్టుకుని జరిపేవారు అప్పటికప్పుడు పుట్టుకొస్తుంటారు కూడా.  
ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో టంగుటూరి అంజయ్య ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుమారు పదహారు మాసాలపాటు పనిచేశారు. ఆయన 1929 లో పుట్టారని తెలుసుకానీ, ఏరోజున పుట్టారో అయన పేషీలో ఎవరికీ తెలవదు. ముఖ్యమంత్రి అన్నాక ఇష్టం వున్నా లేకపోయినా  పుట్టిన రోజంటూ జరుపుకోవాలి. అధికారులూ, అనధికారులూ, అభిమానులూ వరుసలు కట్టి వచ్చి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలపడం ముఖ్యమంత్రుల దర్బారుల్లో ఓ  ఆనవాయితీ. దానికి భంగం వాటిల్లరాదని భావించిన ఆయన పేషీలోని ఓ అధికారి,  కృష్ణుడు పుట్టిన జన్మాష్టమి నాడే  అంజయ్య గారు పుట్టారనీ, అదే అయన జన్మదినమనీ నిర్ణయించడం,  తగు విధంగా ఆ ఏడాది కృష్ణ జన్మాష్టమి నాడు ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు  అభినందనలు తెలిపే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిపోయాయి. రాజీవ్ గాంధీ పుణ్యమా అని ఆయన్ని అర్ధాంతరంగా పదవినుంచి తొలగించడం వల్ల అంజయ్య గారు  రెండో ఏడాది కూడా వరసగా తన పుట్టిన రోజును ముఖ్యమంత్రి హోదాలో జరుపుకునే అవకాశం లేకుండా పోయింది.  సరే అదొక కధ.
అధికారంలో వున్నవాళ్ళు పుట్టిన రోజులు జరుపుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ క్రమంలో అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కటే ప్రశ్నార్ధకమవుతోంది. హైకోర్టు ధర్మాసనం కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీ నాయకుడి పుట్టిన రోజు అయినా సరే, చనిపోయిన నాయకుల జయంతులు, వర్ధంతులు అయినా సరే,  నగరంలో కూడళ్ళు, వీధులు అన్నీ రంగు రంగుల ప్లాస్టిక్ బ్యానర్లతో, ఫ్లేక్సీలతో, హోర్దింగులతో నిండిపోతాయి. ఏ నాయకుడి గౌరవార్ధం వాటిని కడుతున్నారో ఆ నాయకుడి పట్ల వారికెలాంటి మర్యాదా మన్ననా లేదన్న విషయం ఉరితాళ్ళతో గొంతుకు ఉరి బిగించినట్టు కానవచ్చే రంగురంగుల ప్లాష్టిక్  తోరణాలు చూసిన వారికి  ఇట్టే తెలిసిపోతుంది. వాటిని కట్టేటప్పుడు ప్రదర్శించే ఉత్సాహం తొలగించేటప్పుడు జావకారిపోతుంది. ఇదే హైకోర్టు ఆగ్రహానికి కారణం.
ఈ అంశం హైకోర్టు గడప దాకా రావడానికి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దోహదపడింది.  2008 లో మురళీ కృష్ణ అనే వ్యక్తి, ప్రకాశం జిల్లాలో ముక్తి నూతల పాడు, గుడిమిల్ల పాడు నడుమ రోడ్డును ఆక్రమిస్తూ ఓ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రయత్నం జరుగుతోందని ఓ 'పిల్' దాఖలు చేసారు. గతంలో దాన్ని విచారించిన ధర్మాసనం, పనిలో పనిగా,  పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఫ్లేక్సీలను తొలగించాలని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులను  ఆదేశించింది. రెండు ప్రభుత్వాలనుంచి వివరణలు అందుకున్న హైకోర్టు ధర్మాసనం వాటిని పరిశీలించింది.
రాజకీయ నాయకుల జన్మదినోత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసే ఫ్లేక్సీలు, కటౌట్ల తొలగింపు కష్ట సాధ్యం అవుతోందన్న తెలంగాణా ప్రభుత్వ వాదనతో ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వెలసిన కటౌట్లు, ఫ్లేక్సీలు, బ్యానర్లు, హోర్దింగులను తొలగించాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలను అమలు చేయలేకపోతే ఆ విషయం తమకు చెప్పాలని, తామే వాటిని తొలగించి చూపుతామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫ్లేక్సీలు, కటౌట్లను తొలగిస్తున్నట్టు అధికారులు పైకి చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో తమ అనుభవం భిన్నంగా వుందని వారన్నారు. తమ ఆదేశాల అమలుకు ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని మరోమారు ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 17  కు వాయిదా వేసింది.  
వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే హోర్డింగులు, ఫ్లెక్సీలు మొదలయినవి మునిసిపల్ వ్యవస్థలకు అదనపు ఆదాయ వనరు. అయితే, రాజకీయ నాయకుల పుట్టిన రోజులు పురస్కరించుకుని ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వాటికి అదనపు ఖర్చు. వీటివల్ల పైసా ఆదాయం లేకపోగా వాటిని తొలగించడానికి అదనపు శ్రమతో పాటు అదనపు వ్యయం తోడవుతుంది.  ఖర్చంటే ఏదో తంటాలు పడతారు కానీ ఇందులో పైకి చెప్పుకోలేని మరో మతలబు వుంది. అధికారంలో వున్న వ్యక్తుల కటౌట్లు, బ్యానర్లు తొలగించి చెత్తకుప్పల్లో వేయాలంటే  లేని తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే అవుతుంది. ఇవన్నీ హైకోర్టుకు తెలియనివి కావు. కాకపోతే ఈ విషయంలో ధర్మాసనం ఓ వైఖరి తీసుకుంది. దాన్నే మరోమారు స్పష్టం చేసింది. పైగా, 'మీకు  చేతకాకపోతే చెప్పండి, అదేదో మేము చేసి చూపిస్తాం' అని కూడా అంటోంది. డబ్బూ, సిబ్బందీ వున్న కార్పోరేషన్ వాళ్ళే ఆ పని  చేయలేకపోతే ఆ రెండూ లేకుండా హైకోర్టు వారు  ఎలా చేస్తారని అనుమానం రావచ్చు. అయితే అలా ఖరాఖండిగా  చెప్పడం అంటే తాము ఈ విషయంలో యెంత పట్టుదలగా ఉన్నదీ అధికారులకి అర్ధం అయ్యేలా చెప్పేందుకే ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసిందని  కొందరు అన్వయం చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో నాయకుల పుట్టిన రోజుల సందర్భంలో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కటౌట్లు, బ్యానర్ల వల్ల పర్యావరణ కాలుష్యం సంగతి అటుంచి కొన్ని సందర్భాలలో అవి ప్రమాదహేతువులుగా  తయారవుతున్నాయి. పైపెచ్చు నగర సౌందర్యాన్ని ఓ మేరకు చెడగొడుతున్నాయి. అందుకే ఈ అంశంపై హైకోర్టు గతంలో స్పందించినప్పుడు పౌరులనుంచి సానుకూల ప్రతిస్పందనలు వెలువడ్డాయి.




ఒకటి మాత్రం వాస్తవం. పెట్టిన ఫ్లెక్సీలు తొలగించడం ఒక పరిష్కారం కావచ్చు కానీ అది శాశ్విత పరిష్కారం కాబోదు. నాయకుల దృష్టిలో పడడంకోసం కొందరు చోటా నాయకులు చేసే  ప్రచారంకోసం ఇలా ఒక పద్దతి అంటూ లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూస్తే కొంత ప్రయోజనం వుంటుంది. ఇటువంటి నిషేధపు ఉత్తర్వులు సరిగా అమలు కావాలంటే నాయకమ్మన్యులు సయితం కాసింత త్యాగనిరతి చూపాలి. ఎటువంటి పరిస్తితుల్లో కూడా తమకు ఇలాటి ఆర్భాటాలు సమ్మతం కావని  స్పష్టం చేయాలి. అప్పుడే ఈ కాలుష్య సంస్కృతికి అడ్డుకట్ట పడుతుంది. ఇది ఎలా సాధ్యమో అర్ధం కావాలంటే గతానికి సంబంధించిన రెండు ఉదంతాలను గుర్తు చేసుకోవాలి.
టీ.ఎన్. శేషన్ గుర్తున్నారా! ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ గా పనిచేసి అన్ని రాజకీయ పార్టీలకు గుండెల్లో దడ పుట్ట్టించిన అధికారి. ఆయనకు పూర్వం, ఎక్కడ  ఏ ఎన్నికలు జరిగినా వూళ్ళల్లోని గోడలన్నీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రచార నినాదాలతో నిండిపోయేవి. ఈనాడు దేశంలో ఎక్కడన్నా అలాటి గోడ రాతలు కనబడుతున్నాయా? అంటే ఏమిటన్న మాట. చిత్తశుద్ధి ఉండాలే కానీ  సాధించలేనిది ఏమీ వుండదు.
రెండో ఉదాహరణ రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంబంధించింది. అంజయ్య గారితో మొదలయింది కాబట్టి ఆయనతోనే ఈ వ్యాసానికి ముగింపు పలకడం  సముచితంగా వుంటుంది.
అంజయ్య గారు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ హైదరాబాదు వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు బేగంపేట విమానాశ్రయం  నుంచి నగరంలో దారి పొడవునా భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసారు. ఇప్పట్లా వీటిని తయారు చేయడం, వాటిని వీధుల్లో అమర్చడం అంత సులభం అయిన సంగతి కాదు. అయినా వచ్చేది సాక్షాత్తు ప్రధానమంత్రి కొమరుడు కాబట్టి ఎంతో కష్టపడి విమానాశ్రయం నుంచి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు వాటిని ఏర్పాటు చేసారు.   హైదరాబాదులో జరుగుతున్న హడావిడిని అంజయ్య గారి ప్రత్యర్ధులు ఢిల్లీకి మోశారు. అప్పటికే ముఖ్యమంత్రి మార్పు విషయం పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ కబురు కలిసివచ్చింది. యువకుడయిన రాజీవ్ కు ఇటువంటి హంగులూ, ఆర్భాటాలు అసలు గిట్టవనీ, హోర్దింగులూ, బ్యానర్లూ ఖుద్దున తొలగించాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దాంతో యుద్ధప్రాతిపదిక మీద ఏర్పాటయిన  వాటన్నిటినీ మెరుపు వేగంతో  తొలగించారు. దరిమిలా సంభవించిన రాజకీయ పెనుమార్పుల్లో భాగంగా అంజయ్య గారిని పదవి నుంచి కూడా తొలగించారు.  అదో కధ. నిజానికి ఆ కధే రాష్ట్ర రాజకీయాలను ఓ పెద్ద మలుపు తిప్పింది. తెలుగు దేశం అనే పేరుతొ కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి బీజం వేసింది.    
సరే!  విషయానికి వస్తే, ఇప్పుడు నడుస్తున్న 'ఫ్లెక్సీల కధ'కి సరయిన ముగింపు దొరక్కపోదు. కాకపొతే ఆ  శక్తి  ఒక్క రాజకీయ నాయకుల చేతుల్లోనే వుంది. ఉచితంగా లభిస్తున్న ప్రచారాలను స్వచ్చందంగా ఒదులుకోగల వారి ధీమంతంలో వుంది.  (15-04-2015)

రచయిత మొబైల్: 98491 30595 -  ఈమయిల్: bhandarusr@gmail.com